Sunday, 19 November 2023

శ్రీ గరుడ పురాణము (9)

 


ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో నున్న పృథ్వినుండి దుగ్ధమునువలె అన్నాదికములనూ ఔషధరాశులను పిండి, పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమయింది.


భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినపుడు విష్ణువొక బ్రహ్మండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిథ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు.


కూర్మావతారం మహావిష్ణువుయొక్క పదకొండవ అవతారం. క్షీరసాగర మథనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి, మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది.


పదునాల్గవదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారినుండి ప్రహ్లాదునీ, సకల లోకాలనూ రక్షించాడు. పదిహేనవదైన వామనావతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవఱకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలనూ దేవేంద్రుని న్యాయ, సక్రమ, వైదిక పాలనలోనికి తెచ్చాడు.


(*అవతరణమనగా దిగుట. కాబట్టి 'వామనావతరణ' పద ప్రయోగం దోషం కాదు.)


పదహారవదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి, పరిష్కరించి, బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీమహావిష్ణువు దానవసంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క పందొమ్మిదవ, ఇరువదవ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారిచేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూ భారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా 'బుద్ధ' నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం. ఇరవైరెండవ అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినపుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణునింట 'కల్కి' అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు.


No comments:

Post a Comment