సృష్టి - వర్ణనం
'హే జనార్దనా! సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి' అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. (* సర్గయనగా సృష్టిలో నొక దశ. ఒక మెట్టు.
ఖగవాహనుడు కాలకంఠాదుల కిలా చెప్పసాగాడు :
'పరమేశ్వరా! *సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి.
నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న, పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే.
జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ(తరువాత ఆయన నుండియే) ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వి పుట్టాయి.
పరమేశ్వరా! దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వ ప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు.
No comments:
Post a Comment