రుద్రదేవా, బ్రహ్మాది దేవతలారా! నేనే అందరు దేవతలకు ఆరాధ్యదైవాన్ని, సర్వలోకాలకీ స్వామిని నేనే. దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్నీ, స్తుతియోగ్యుడనూ నేనే. రుద్రదేవా! మనుష్యులచేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేదీ, వ్రత నియమ, సదాచార, సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేదీ నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్నీ పాలిస్తుంటాను. మంత్రాన్నీ నేనే, దాని అర్థాన్నీ నేనే. పూజవల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్త్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే ఆ స్వర్గాదులూ నేనే. యోగినీ యోగాన్నీ అధ్యయోగాన్నీ - పురాణాన్నీ నేనే. జ్ఞాతను, శ్రోతనూ, మనన కర్తనూ కూడా నేనే. సంభాషింపబడు విషయాన్నీ, సంభాషించే వ్యక్తినీ నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలూ నా స్వరూపాలే. భోగ, మోక్షప్రదాయకమైన పరమ దైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా! నేనే వేదాన్ని. ఇతిహాసస్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మ స్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్నీ, ధర్మాన్నీ, వైష్ణవాన్నీ, వర్ణాశ్రమాన్ని వాటి వెనుక నున్న సనాతన ధర్మాన్నీ నేనే. యమ నియమాలూ, వ్రతాలూ, సూర్య చంద్ర మంగళాది గ్రహాలూ నేనే
ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్పతపస్సు ద్వారా నన్నారాధించాడు. అతని తపస్సువల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో" అన్నాను.
'దేవదేవా! నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వగ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే వుంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికీ మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన' అని వరంకోరుకున్నాడు గరుత్మంతుడు.
No comments:
Post a Comment