Tuesday, 28 November 2023

శ్రీ గరుడ పురాణము (18)

 


తరువాత బ్రహ్మయొక్క సత్త్వగుణ మాత్రవల్ల ఆయన ముఖంనుండి దేవతలుద్భవించారు. తరువాత ఆయన సత్త్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దానినుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం. తరువాత బ్రహ్మయొక్క సాత్త్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్త్విక శరీరాన్ని వదలిపోయినపుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికీ రాత్రికీ మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినపుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు.


తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనులునగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరినుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్షశబ్దానికి తినుటయని అర్ధము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసనపాములకూ తగిలింది. అందుకే వాటికి క్రోధ మెక్కువ. తరువాత బ్రహ్మనుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడే వారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు.


తరువాత ప్రజాపతియైన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము (మేక), ఉదరమునుండి గోవు, పార్శ్వాలనుండి ఏనుగు, గుఱ్ఱము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింసకాలు, పశువులు (ఇది ఒకదశ), రెండు గోళ్ళ (గిట్టల) జంతువులు, నీటిక్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు.


బ్రహ్మయొక్క పూర్వాది నాల్గు ముఖాలనుండి క్రమంగా ఋగ్యజుస్సామాథర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్నీ, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్నీ శూద్రులకు గంధర్వలోకాన్నీ నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్నీ, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్నీ, సన్యాసులకూ పరమతపో నిధులకూ అక్షయలోకాన్నీ ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు.


(అధ్యాయం - 4)


No comments:

Post a Comment