స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై వుండి యుద్ధాగ్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి (విష్ణుసహస్రంతోసహా) సర్వ ధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి, పితృతర్పణలిచ్చి, శ్రీకృష్ణభగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది.
తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడాసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతియైన ధృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనలమధ్య భయంకరమైన యుద్ధం అయిదురోజులపాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న వందల కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. (ఆయనను ధృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు)
తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా రెండురోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు కానీ అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేలకొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహానికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె కాల సర్పంవలె క్రోధంతోబుసలుకొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన, దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తననోడించగా నేలకొరిగాడు. 'యతో ధర్మస్తతో జయః' అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణగా భారతయుద్ధం చరిత్రలో నిలచి వుంది.
యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడిచేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో ధృష్టద్యుమ్నుడూ, ద్రౌపది పుత్రులైన పంచపాండవులూ ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరు గల అస్త్రంతో అతని సర్వశక్తులకూ, అహంకారానికీ కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురు పుత్రుడనీ బ్రాహ్మణుడనీ అశ్వత్థామను అర్జునుడు చంపలేదు.
ధర్మరాజు అత్యంత శోక సంతప్తలైన స్త్రీల నందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకూ పితృజనులకూ తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధయాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపఱచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యు పుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు.
No comments:
Post a Comment