Friday, 8 May 2015

స్వామి చిన్మయానంద వారి జయంతి

8 మే (ఈ రోజు) చిన్మయా మిషన్ స్థాపకులు స్వామి చిన్మయానంద వారి జయంతి. చిన్మయామిషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాల్లో ధార్మిక కార్యక్రమాలు జరిపారు. చిన్న వయసులో నాస్తికుడైనా, ఆ తర్వాత గురువుల అనుగ్రహంతో భగవదనుభూతి పొంది, సన్యాసం స్వీకరించారు. ఉపనిషత్తుల సారాన్ని అతి సామాన్యులకు అర్దమయ్యే రీతిలో బోధించారు. హిందువుల్లో ఐక్యత కోసం అంతర్జాతీయ వేదిక ఒకటి కావాలన్న సంకల్పం చేసినవారిలో వీరు కూడా ఉన్నారు. అట్లా ప్రారంభమైందే 'విశ్వ హిందూ పరిషద్'.
శ్రీ గురుభ్యో నమః

మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచండి - స్వామి చిన్మయానంద


Thursday, 7 May 2015

సద్గురు శివాయ సుబ్రముణియ స్వామి సూక్తి

పాశ్చాత్య ప్రభావం వలన అనేకమంది హిందువులు గణపతి నిజమైన దైవంగా భావించడంలేదు. వారికి ఆయన ఒక చిహ్నం, ఒక మూఢనమ్మకం, నిరక్షరాస్యులకు, పిల్లలకు తత్వశాస్త్రం వివరించే ఒక విధానం. కానీ కరుణామయుడైన గణపతి గురించి నా స్వానుభవం భిన్నంగా ఉంది. గణపతిని నేను అనేకమార్లు నా సొంత కళ్ళతో చూశాను. అనేకమార్లు ఆయన నాకు దర్శనమిచ్చి, తన ఉనికి గురించి నా అల్పస్థాయి మనసుని ఒప్పించాడు. గణపతి నిజంగా ఉన్నాడు. నన్ను నమ్మండి. గణపతి ఆరాధన శీఘ్ర ఫలాలను ఇస్తుంది.

సద్గురు శివాయ సుబ్రముణియ స్వామి (కుఐ హిందూ ఆధీనం, హవాయి, అమెరికా)  


Wednesday, 6 May 2015

పరమాచార్య వాణి

ఈ రోజు నడిచే దేవుడి, అపర ఆదిశంకరులు, కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి 122 వ జయంతి.
ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే దలైలామా వేనోళ్ల పొగిడారు.

పరమాచార్య వాణి -
కృషి లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇష్టంతో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దాంతో పాటు వచ్చే కష్టనష్టాలను భరించడానికి సిద్ధపడతారు. కానీ ధర్మాన్ని ఆచరించే విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని ఎందుకంటున్నారు? అవరోధాలు ఏర్పడతాయి. ఏ పనైతే వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా చేయబడుతుందో, అది గొప్ప ఫలాలను ఇస్తుంది, సాధించామనే గొప్ప భావననూ ఇస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని విడువరాదు.

కంచి పరమాచార్య స్వామి  


Monday, 4 May 2015

బుద్ధుని సూక్తి

ఎవరైతే వేదాల ద్వారా ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటారో, వారు ఉన్నతమైన, స్థిరమైన స్థానాన్ని పొందుతారు. ఎప్పుడు  సందిగ్ధతకు లోనవ్వరు - గౌతమబుద్ధుడు (సుత్త నిపాఠ 292)
బుద్ధుని మాటలను ఆచరణలో పెట్టి అభివృద్ధిలోకి వద్దాం.
బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు



Sunday, 3 May 2015

హిందూ ధర్మం - 157 (అధర్వణవేదం)

Adharvana veda

4. అధర్వణవేదం - అధర్వ, అంగీరసులు దర్శించి అందించిన వేదం కనుక దీనికి అధర్వణ వేదమని, అధర్వాంగీరసమని పేర్లు. పరబ్రహ్మం గురించి చెప్తుంది కనుక దీనికి బ్రహ్మవేదమని, ఆనందాన్నిస్తుంది కనుక ఛందోవేదమని దీనికి పేర్లు. నిరుక్తం 11.18 ప్రకారం ఏ వేదం వలన అన్ని రకాల సందేహాలు, లోపాలు తొలగిపోతాయో దాన్నే అధర్వణవేదం అంటారు. ఇందులో చెప్పబడ్డ జ్ఞానం, కర్మాచరణ, సాధన వివిధ రకాల శాస్త్రాలకు పరిపూర్ణతను ఇస్తుంది. అది సామాజిక శాస్త్రమైనా, భౌతిక శాస్త్రమైనా. అధర్వణవేదం విజ్ఞానము (Science), సాంకేతిక పరిజ్ఞానం (technology), ఆచరణాత్మకమైన సామాజిక శాస్త్రం (applied social sciences) మానవప్రవర్తన గురించి వివరిస్తుంది. అందువల్ల ఈ వేదంలో గణిత (mathematics), భౌతిక (physics), రసాయన (chemistry), జ్యోతిష్య (Astrology), విశ్వోద్భవ (Cosmology), వైద్య (Medicine) , వ్యవసాయ (Agriculture), వాస్తు (Engineering), రక్షణ (Military), వైమానికి (Aeronautics), సృష్టి ఆవిర్భావ, రాజకీయ (Politics), సామాజిక (Social sciences), మనస్తత్త్వ (Psychology), ఆర్ధిక (Economics) శాస్త్రాలు ఇందులో చర్చింబడిన ముఖ్యమైన అంశాలు. ఒకరకంగా చెప్పాలంటే అనేక శాస్త్రాల యొక్క ఎన్సైక్లోపీడియా (encyclopedia) అధర్వణవేదం. వైద్య, రసాయనశాస్త్రాలు ఇందులో ముఖ్యాంశాలు.

కానీ అధర్వణవేదమే అత్యధికంగా తప్పుగా అర్దం చేసుకోబడిన వేదం. 

ఈ వేదానికి 9 శాఖలుండేవి. కానీ ఇప్పుడు శౌనక, పిప్పలాద అనే 2 శాఖలు మాత్రమే మిగిలాయి. అందులో పిప్పలాద సంహితకు చెందిన ఒకే ఒక ప్రతి కాశ్మీరంలో దొరికింది. కానీ అది అసమగ్రంగా ఉంది. పిప్పలాదుని ప్రశంస ప్రశ్నోపనిషత్తులో కనిపిస్తుంది. ఈ శాఖకు 21 కాండలు ఉన్నాయని, దీని బ్రాహ్మణం  8 అధ్యాయాల గ్రంధమని తెలుస్తోంది. కానీ అది కూడా అసంపూర్తిగా దొరికింది.

ప్రస్తుతం అధర్వణ వేదానికి సంబంధించి శౌనకశాఖ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర బ్రాహ్మణులు దీని అధ్యయనం చేస్తున్నారు. మొత్తం అధర్వణ వేదానికి సంబంధించి గోపధ బ్రాహ్మణం ఒక్కటే లభిస్తోంది. ఇది పూర్వ, ఉత్తర భాగములుగా లభిస్తోంది. గోపధ బ్రాహ్మణం కూడా శౌనకశాఖకు చెందినదే. మొత్తం ఈ శౌనకశాఖలో 20 కాండలు, 732 సూక్తములు, 5897 మంత్రాలు ఉన్నాయి. ఈ వేదానికి సంబంధించి ఆరణ్యకాలేవీ అందుబాటులో లేవు.

అధర్వణవేదానికి సంబంధించి ప్రస్తుతం కఠోపనిషత్తు, ప్రశ్న, ముండక, మాండూక్య, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు లభ్యమవుతున్నాయి. మాండూక్యోపనిషత్తుకు గౌడపాదాచార్యులవారు కారిక రాశారు. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి ఈ ఉపనిషత్తే మూలమని ప్రసిద్ధి.

అధర్వణవేదంలో నిష్ణాతుడై యజ్ఞంలో పాల్గొనే అధర్వణవేద పండితుడిని బ్రహ్మ అంటారు. యజ్ఞసమయంలో లోపములు తలెత్తకుండా చూసుకోవడం, జరిగిన లోపాలను సవరించడం, యాగం సంపూర్ణంగా, శాస్త్రబద్ధంగా జరిగేలా చూడటం ఇతని కర్తవ్యం.

To be continued .....................

Saturday, 2 May 2015

నృసింహ జయంతి శుభాకాంక్షలు

ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మరణం తర్వాత మరో శరీరం కొరకు జీవుడు ఒంటరి ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన గాఢాంధకారం నెలకొని ఉంటుంది, గమ్యం తెలియదు, దారి తెలియదు, నా అనుకున్నవాళ్ళెవరు ఉండరు, కళ్ళు పొడుచుకుని చూసిన చీకటి తప్ప వెరొకటి కనిపించదు. ఆ సమయంలో జీవుడు భీతిల్లుకుండా, భయపడకురా, నీకు తోడుగా నేను ఉన్నానని, ఆత్మకు తోడుగా యాత్ర చేస్తూ, ధైర్యాన్నిస్తూ అనుగ్రహించే దయాసముద్రా! కారుణ్యధామ! నా తండ్రి! లక్ష్మీ నరసింహ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఆదిశంకరాచార్య కృత లక్ష్మీనరసింహ కరవాలంబస్తోత్రం