Friday, 28 November 2014

29-11-2014, శనివారం, శ్రీ కాలభైరవ అష్టమి

29-11-2014, శనివారం, మార్గశిరశుద్ధ అష్టమి, శ్రీ కాలభైరవ అష్టమి. పిలిచిన పలికే దైవం, భక్తుల భాధాలను, గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం శ్రీకాలభైరువుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన, విశేషమైన రోజు కాలభైరవాష్టమి. ఆ విశేషాలు తెలుసుకుందాం.  


మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి’’. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడు
గా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి’’ పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.

కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి - ‘‘నేనే సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు.

ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -
‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.

దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ... కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.

ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించవలెను. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే!

Source: ఆంధ్రభూమి http://archives.andhrabhoomi.net/archana/k-184

Thursday, 27 November 2014

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తత్త్వం

అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.

చైతన్యం ఒక్క లక్షణం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.

ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.

అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.

- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

Wednesday, 26 November 2014

సుబ్రహ్మణ్య షష్ఠి

మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.

శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రం తెరవగనే మన్మథుడు భస్మమైయినాడు. శివుని జ్ఞాన నేత్రంనుండి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా, వాయువు సంగ్రహించి, మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా, అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా, ఆ తేజస్సును భరించలేని గంగా, రెల్లుగడ్డి పొదనందు పడవేయగా ‘కుమారస్వామి’ ఆవిర్భవించాడు.

శ్రీ సుబ్రహ్మణుని రెల్లు గడ్డినందు జన్మించిన పిదప ఆరుగురు కృత్తికలు పెంచారని అందుకే ఆయనకు షట్ ముఖులు వచ్చి ‘షణ్ముఖుడు’ అనే పేరువచ్చింది. కృత్రికలచే పెరిగినవాడుకనుక ‘కార్తికేయుడు’ అయ్యాడు. ‘‘కృత్తికానామ్ అపత్యం పుమాన్ కార్తికేయం’. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతాన పుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తిక కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన వస్తువు ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలో కనిపించే సప్త చక్రాలు. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు.

శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమ పురుషుడు, మహాలక్ష్మీ లేక ఉమాదేవి అవ్యక్తశక్తి. వీరిరువురి సమైక్య, సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం తెల్పుతోంది. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖ తత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్థ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ రెండు త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు.

మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి, అమావాస్య వెళ్లిన ఆరవ రోజును సుబ్రహ్మణ్యషష్ఠి అని, ‘సుబ్బరాయ్ షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే ‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడని అర్థం.

సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్ర్తి, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, వెండి పడగలను పుట్టలో వేసినట్లైతే సత్‌సంతాన యోగ భాగ్యం కల్గుతుందనే విశ్వాసం. మంత్రగాళ్ళు ఈ రోజున స్కందుని ఆరాధించి మంత్రాన్ని వశ్యం చేసుకునే శక్తిని పొందుతారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.

ఈ స్వామి అర్చనవల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి.

Source: http://archives.andhrabhoomi.net/serial-special/manchi-maata-281 

Tuesday, 25 November 2014

మార్గశిర లక్ష్మీవారం (గురువారం)

ఓం నమో లక్ష్మీనారాయణాయ

మార్గశిర లక్ష్మీవారం (గురువారం) కధ

ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ) తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు.

గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అన్నారు పరాశర మహర్షి.

నారదుడు "మహనీయ,ఈ పూజను ఇంతక ముందు ఎవరినా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి " అనగా,పరాశరుడు ఈ విధంగా చెప్పాడు.

ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో "స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను " అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి.

ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి "అవ్వా! ఈ రోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ చేసే రోజు. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ "అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను" అని పలుకగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.

"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానిని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రనుంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క (వక్క) ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా,నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి.ఇది ఒక విధానం".

లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం ఈ విధంగా చెప్పింది. "రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతమునే (గత భాగంలో చెప్పుకున్నది)  చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి ఈ వ్రతం చేసి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన (మనమైతే గ్యాస్ స్టవ్ కడగకపోతే), ఇల్లు వాకిలి తుడవకున్నా ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా, మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి ఊడవదొ (చిమ్మదొ), అంట్లు (ఆహారం తీసుకున్న గిన్నెలు) కడగదో, ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాల వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను ధూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు.

ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా, సంక్రాంతి (ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది) తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి (నరకానికి)  పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిధులలో నిషిద్ధపదార్ధములను తినకుండా, నక్తం (ఒంటిపూట, ఒకపొద్దు)  ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి (బ్రష్ చేసుకోవాలి). అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని (ముఖం పెట్టి)  భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరికి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు, బ్రాహ్మాణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది" అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.

ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి, ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీ దేవి పాదముద్రలను వేసి, లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవెధ్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహా లక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా! నీ భక్తి మెచ్చాను. వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాన్నిచేరుతావు" అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహా లక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగబాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది"  అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు.

శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది.ఈ కధను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.

ఓం నమో లక్ష్మీనారాయణాయ
శ్రీ మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః  

Saturday, 15 November 2014

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా?

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.  

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.    

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు విళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. అందుకే శ్రుతి అంటుంది

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

సేకరణ : బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం

Friday, 14 November 2014

ఉపవాసం

కార్తీకామాసంలో ఉపవాసాల మాసం. ఉపవాసం అంటే దగ్గర ఉండడం అని అర్ధం. భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. మనం నిత్య జీవితంలో అనేక పనుల వల్ల భగవంతుని మీద ఎక్కువ సమయం మనసు నిలుపలేము. అందుకే ఏ ఏ తిధులలోనైతే భగవంతుడి అనుగ్రహాన్ని మనిషి గ్రహించగలడో, అంతరిక్షశాస్త్రాన్ని, ఖగోళశాస్త్రాన్ని అనుసరించి, ఏ రోజులలో ఆహారం లోపలికి తీసుకోవడం తగ్గిస్తే, ఆరోగ్యం రక్షింపబడుతుందో, ఆ రోజులలో ఉపవాసం చేయమని మన పెద్దలు సూచించారు. ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం మనం, మన మనసు భగవంతుని వైపు తిరగడం.

మనం ఆహారం తీసుకున్నాకా, అది అరగాలంటేశక్తి కావాలి, మనసు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహారం అరిగేవరకు మనసు జీర్ణక్రియ మీద కేంద్రీకృతమవుతుంది, మీరు గమనంచండి, ఆహారం అరగకపోతే, మనసు ఏదోలా ఉంటుంది.

ఉపవాసం ఉన్న రోజున ఆహారం మానేయడం వలన, ముందు వంట పని తప్పుతుంది, వంట ఒక్కటి ఆగిపోతే, మళ్ళీ తరువాత గిన్నెలు శుభ్రపరుచుకోవడం, సర్దుకోవడం లాంటి పనులు ఉండవు కనుక సమయం మిగిలిపోతుంది. ఆహారం మానేస్తాం కనుక, మనసును దైవం వైపు తిప్పే శక్తి వస్తుంది. మనసు దైవం వైపు తిరిగితే, మనం చేసే ఆలోచనలు మంచి మార్గాన్ని సూచిస్తాయి, కష్టాలను ఎదుర్కునే మానసిక శక్తిని ఇస్తాయి. అన్నిటికంటే ముందు మనం ఆధ్యాత్మికంగా పురోగతిని సాధిస్తాం.

ఉపవాసానికి కొన్ని నియమాలు ఉంటాయి. కానీ ఉపవాసం పూర్తిగా ఉండలేనివారు బాధపడనవసరం లేదు. అమ్మో! ఆహారం తీసుకోకుండా ఉండలేమండీ అని భయపడనవసరం లేదు. కొందరైతే, అసలు ఉపవాసం చేయడం కూడా మానేస్తారు. అదేం అవసరం లేదు. రోజు తినే ఆహారం కాకుండా పళ్ళు, పాలు వంటివి ఉపవాసం రోజు తినవచ్చు అంటుంది శాస్త్రం. గోధుమ రవ్వ ఉప్మా తినచ్చని కొందరు పెద్దలు చెప్తారు.

నియమాలు పాటించడం ముఖ్యమే అయినా, అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేము కదా, పుట్టగానే పరిగెత్తలేం కదా. అలాగే, ఒక్కసారిగా ఆహారం మానేయడం వలన కొందరు ఇబ్బందిపడతారు. కాబట్టి రోజు తినే ఆహారం కాకుండా, గోధుమ రవ్వ ఉప్మా తినండి, పచ్చి కూరలు తినండి, పళ్ళరసాలు త్రాగండి. మరీ కడుపు నిండుగా కాదు కానీ, మీ ఆకలిని తట్టుకోవడానికి తీసుకోండి. కానీ మీరు ఉపవాసం చేస్తున్నారన్న సంగతి మాత్రం గుర్తుంటే చాలు. మీ మనసులో దైవం మెదులుతుంటే చాలు. మీరు లోకాన్ని కాదు దైవాన్ని మెప్పించాలి, దైవానికి భక్తి కావాలి. ఇలా, ఏదో ఒక రకంగా ఉపవాసం ఉండడం ప్రారంభించండి. మనం ప్రయత్న పూర్వకంగా, మన మనసును దైవం వైపు తిప్పాలి. అలా తిప్పడమే ఉపవాసంలోని ఆంతర్యం.

మీరు ఒక్కసారి మీ ప్రయత్నంతో ఆయన వైపుకు తిరగడం ప్రారభిస్తే, ఇక మిమ్మల్ని ఆయన పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటాడు, నియమబద్ధంగా ఉపవాసం చేసే శక్తిని ప్రసాదిస్తాడు, జీవితాన్ని మార్చేస్తాడు. కొన్నాళ్ళకి మీరే శాస్త్రం చెప్పినట్టుగా ఉపవాసం చేయడం ప్రారంభిస్తారు.

కనుక ఏదో ఒక విధంగా ఉపవాసం ఉండడం మొదలుపెట్టండి.

Thursday, 13 November 2014

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం