Tuesday, 8 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 1

ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ.

భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.

సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వాన్య్. శివుడు ఎప్పుడు తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ స్మయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం 'నారయణ సమారంభాం' అంటూ ప్రారభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.

To be continued ..............

2 comments:

  1. ee post chala manchiga unnadi vedavyas!

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete