Monday 28 July 2014

హిందూ ధర్మం - 108 (భారత -మూడు అక్షరాల తత్వం)

భారత్ లేక భారత అనే పదం మూడు అక్షరాల నుంచి ఏర్పడింది. భా - భావానికి, ర- రాగానికి, తా- తాళానికి సంకేతం. భారత్ అంటే భగవంతుని వైభవాన్ని భావంతో, రాగంతో, తాళంతో కీర్తించే భూమి అని అర్దం అని చెప్పారు సత్యసాయిబాబా. భగవంతుని కీర్తించడం ఒక్క భారతీయులే (హిందువులే) చేస్తారా? ప్రపంచమంతా ఏదో ఒక విధంగా భగవంతుని కీర్తిస్తూనే ఉంది కదా అని అడుగుతారేమో!

నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిశ్చల, నిత్య, సత్, చిత్, ఆనంద స్వరూపుడు భగవంతుడు. అందరికి దగ్గరగా ఉన్నవాడు ఆయనే, దూరంగా ఉన్నవాడు ఆయనే, అందరికంటే చిన్నవాడు ఆయనే, పెద్ద కూడా ఆయనే. స్త్రీ, పురుష, నపుంసక అనే మూడు లింగాలకు అతీతుడైనా, కొన్ని సార్లు స్త్రీగా, కొన్ని సార్లు పురుషుడిగా, ఇలా అనేక విధాలుగా వ్యక్తమవుతున్నాడు. ఎన్నో వ్యక్తరూపాలు ఉన్న అవ్యక్తుడు పరమేశ్వరుడు. ప్రేమస్వరుపుడు, కరుణాసముద్రుడు, దయాసింధువు అయినా శిక్షించడంలో చాలా భయానకంగా ఉంటాడు. జన్మము ఆయనే, మరణము ఆయనే, జననమరణాల మధ్యనున్న జీవము ఆయనే. ఎప్పుడు అణురూపంలో కదిలేవాడు ఆయనే, అసలే కదలని స్థాణువు ఆయనే. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు, సోదరుడు అన్నీ ఆయనే. ఒక వ్యక్తిలో ఒకే గుణం ఉంటుంది, కానీ పరమాత్మలో పరస్పర విరుద్ధ గుణాలు ఉంటాయి. అలా చెప్పుకున్నా, గుణగణాలకు అతీతుడు ఆయనే. అందుకే అన్నమాచార్యులవారు తన సంకీర్తనల్లో 'గోవిందా! గుణగణ రహిత, కోటి సూర్యతేజ' అంటారు.

అటువంటి భగవత్ తత్వాన్ని కీర్తించడం మాములు విషయం కాదు. ఆయన్ని కీర్తించాలంటే, అనుభూతి పొంది ఉండాలి. ఆ భగవద్ అపరోక్షానుభూతిని ఇవ్వగలిగిన భూమి కనుక దీనికి భారతభూమి అని, అనంతుడైన భగవంతుని అనుభవించి, తద్వారా కీర్తించగలవారికి మాత్రమే భారతీయులని పేరు. వారు ప్రపంచంలో ఏ మూలనున్న సరే, కానీ ఈ భూమి అందుకు తగిన వాతవరణాన్ని కలిపిస్తుంది. అందుకే మన ధర్మానికి శ్మృతులు మొదలైనవి భారతీయ ధర్మం అని, భూమికి భారతంభూమి అని పేరునిచ్చాయి.

To be continued ............

No comments:

Post a Comment