Saturday, 26 July 2014

హిందూ ధర్మం - 106 (భారత)

భారత అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది. భాః అంటే వెలుగు, జ్ఞానం, భగవంతుడు అని అర్దం. రతః అంటే రమించేవాడు అని అర్దం. భారతః అంటే సదా భగవంతుని యందు రమించేవాడు అని అర్దం. ఈ భూమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. ప్రపంచంలో మిగితా భూభాగంలో పుట్టినవారికి భౌతిక దృష్టి ఎక్కువగా ఉంటుంది. వారు భౌతిక ప్రపంచాన్ని, ప్రాపంచిక సుఖాలకు, విషయవాసనల్లో జీవనం గడిపేస్తే, ఈ దేశంలో పుట్టినవారు అంతర్దృష్టి కలిగి ఉంటారు, భగవంతుని త్వరగా చేరుకుంటారు అంటారు రమణ మహర్షి. అంతర్దృష్టి, అంతర్ముఖఃత చెందడం భారతదేశంలో పుట్టినవారి సహజ లక్షణం. అది ఈ భారతభూమికే ఉంది.

ఉన్న శరీరం వయసుతో పాటు పెరుగుతుంది, ముసలితనం రాగానే ముడుచుపోతుంది, రోగగ్రస్థం అవుతుంది. సంపదలు బ్రతికున్నంతవరకే వెంట ఉంటాయి. మరణసమయంలో ఎంత సంపద ఉన్నా వ్యర్ధం, మరణాన్ని ఆపలేవు, తర్వాత వెంటరావు. మరణం తర్వాత తోడువచ్చేది చేసుకున్న పాపపుణ్య కర్మలు మాత్రమే. నా అనుకున్నవాళ్ళు మహా అయితే స్మశానం వరకు వస్తారు. ఆ తర్వాత మనది ఒంటరి ప్రయాణం. ఇదే సత్యం. ఇది అర్దంకాక అనేకమంది జీవితం ఉన్నది అనుభవించటానికి, ఇప్పుడే అన్నీ అనుభవించాలి అంటూ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ, విషయవాసనలను ఎక్కువ చేసుకుంటారు. ఈ జీవితం ఉన్నది అనుభవించటానికే అనే మాట వాస్తవం. కానీ ఈ జీవిత లక్ష్యం ప్రారబ్ధకర్మ ఫలాన్ని అనుభవించటం. ప్రారబ్దం అనుభవించగానే, ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అది తెలియక అనేకులు అజ్ఞానంతో ఇంకొన్ని లక్షల జన్మలకు సరిపడా కర్మ చేస్తారు. ఎక్కువగా వస్తువులను అనుభవిస్తే, కోరికలను తీర్చుకుంటే, మనిషిలో ఉన్న కోరికలు తీరకపోగా, అవి మరింత పెరుగుతాయి. ఒక వయసు వచ్చేసరికి, వాటికి దూరమై, బాధపడతారు. ఇది అంతా ఈ దేశంలో పుట్టినవారికి త్వరగా గమనించగలుగుతారు. ఉన్న జీవితాన్ని సక్రమంగా వాడుకోవాలన్న తపనతో బ్రతుకుతారు. అది భక్తికి, తద్వారా ముక్తికి దోహదపడుతుంది. అందుకే మనకు భారతీయులని పేరు.

To be continued .............

No comments:

Post a Comment