ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృకసూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే (అగ్న్యాభావం) నిపుహస్తంలో హోమం చెయ్యవచ్చు. అత్యంత ద్రవ్యశూన్యుడైతే (అన్నం కూడా వండలేనంత) ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. అది కూడా చెయ్యలేని మహాదరిద్రుడే అయితే నిర్జనారణ్యంలోకి పోయి దరిద్రుణ్ని నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఏడవాలి.
తిథి అయిన మర్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చెయ్యాలి. చెయ్యకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుట్టుంది. వంశ నాశనమవుతుంది.
శ్రద్ధతో ఇలా పితృదేవతలనూ విశ్వేదేవతలనూ తిధినాడు అర్చించేవారికి వంశ విచ్ఛేదం ఉండదు. తామరతంపరగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతలని పూజించటం అంటే విష్ణుమూర్తిని పూజించటమే. జగన్నాధుడు సంతుష్టుడయితే సర్వదేవతలూ సంతుష్టులయినట్లే ఈ స్థావరజంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏదీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు అనౌపమ్య స్వభావుడు హవ్యభుక్కు పరబ్రహ్మాభిధేయుడు- ఆ జనార్ధనుడు. కనుక భోక్త విష్ణువు. కర్త విష్ణువు. కారయిత విష్ణువు.
శౌనకాది మహామునులారా! సాక్షాత్తూ దత్తాత్రేయుడు ధర్మకీర్తికి భోదించిన ఈ ఉత్తమ శ్రాద్ధవిధిని ఆచరించటమే కాదు. స్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి సంతానాభివృద్ధి జరుగుతుంది- అని సూతమహర్షి ఫలశ్రుతి పలికాడు.
సనత్కుమారా! వింటున్నావుగా, దత్తాత్రేయుడు శ్రాద్ధయోగ్య పదార్థాలేమిటి వర్ణించవలసినవి ఏమిటి తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పంమీద ఉండి ధర్మరాజుకి చెప్పిన అత్రి - నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందనీ, ఆ దుఃఖాన్ని తీర్చుకోడానికి ముమ్మొదటగా ఈ విధిని రూపొందించాడనీ, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేసాడని శ్రాద్ధవిధిలో విశ్వదేవతలకూ పితృదేవతలకూ అగ్నికీ సోముడికీ ఇంకా సంబంధిత దేవతలకూ భాగాలు కల్పించాడనీ వర్ణనీయాలను నిర్దారించాడని వివరించాడు.
No comments:
Post a Comment