Saturday, 18 April 2015

జలదానం ప్రాముఖ్యత

సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఉగాది నుంచి వర్షఋతువు వచ్చేవరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం. అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అసలు జలదానానికున్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తోంది. (గత 2 ఏళ్ళుగా పోస్టు చేస్తున్నదే అయినా, అందరికి తెలియడం కోసం మళ్ళీ పోస్ట్ చేస్తున్నా) జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది.

హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అన్ని ఉన్నాయో, సాగరంలో నీటిబిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావల్సినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇళ్ళు విపరీతంగా దానం చేశాడు.



ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకోక దోషం కూడా ఉంది. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికీ జల దానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చినవారికి, ఎండలో వచ్చినవారికి, దాహార్తులైనవారికి నీరు దానం చేయలేదు.

నీరు దానంగా ఇచ్చేదేమిటి? నీరు ఎవరైనా ఇస్తారు. ఎక్కడైనా దోరుకుతుంది. నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ, శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన 'జాతక పక్షి' జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం.

దానం ఇచ్చేసమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా అంటే పాత్రులా, అపాత్రులా అన్నది పట్టించుకునేవాడు కాదు (అందరికి అన్ని దానం చేయకూడదు. ఎవరికి ఏది, ఎంత అవసరమో, అది అంత మాత్రంలోనే దానం చేయాలి). పండితులకు, మూర్ఖులకు, పేదవారికి, వికలాంగులకు అందరికి సమాన సత్కారం. మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు. నిజమైన పాండిత్యం లేనివారికి, డాంబికాలు, దర్పాలు, దుష్టమైన బ్రాహ్మణులని కూడా విచారించకుండా దానం చేసేవాడు. 
మహారాజు చేసే ప్రతిపని ప్రజలు గమనిస్తారు, అనుసరిస్తారు. అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు. అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది. దుర్మార్గులకు తెలిసి దానం చేసినా, తెలియకచేసినా అది మహాపాపం.

ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క, గాడిద, పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు వచ్చి, తరువాత బల్లి జన్మ వస్తుంది. చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవత్భక్తి, మహాత్ములకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగిన శ్రుతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు. ఒకసారి శ్రుతికీర్తి ఇంటికి మహాజ్ఞాని, మంచి సాధకుడైన 'శత్రుదేవ' అనే బ్రాహ్మణుడు వస్తాడు.

సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిసపర్యలు చేసి, శ్రుతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్దగా కడిగి, పాదపూజ చేస్తారు. దక్షిణతాంబూలాలు ఇస్తారు. ఆ బ్రాహ్మణుని పాదాలను కడిగి, జ్ఞాన పాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడమీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లకి పూర్వజన్మ స్మృతి వస్తుంది.

తాను హేమాంగ రాజునన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవను " నేను చేసిన తప్పేమిటి? అంత దానధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేంటి? కారణం చెప్పమని అడుగుతాడు.

దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు. అన్ని దానాలు చేసినా జల దానం చేయలేదని......తెలియక కాదు, శాస్త్రం తెలిసినా, నీరు దానం చేయడమేంటన్న భావంతో అవసరమున్నవారికి కూడా జలదానం చేయకపోవడం దోషమని, పాపమని చెప్తాడు.

యోగ్యతను విచారించకుండా, దుష్టులకు, దుర్మార్గులకు దానాలు చేయడం వల్ల పుణ్యం రాకపోగా, పాపం వస్తుందని అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు. 


అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపపడి "మరి నాకు ఉద్దారమయ్యే మార్గం, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి?" అని శత్రుదేవను అడుగుతాడు.

కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒక రోజు వేంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వరహాస్వామి దర్శనం, శ్రీ శ్రీనివాస దర్శనఫలం హేమంగుడికి దానం చేయగా దానితో అతని పాపప్రక్షాళన జరిగి అతనికి బల్లిశరీరం నుండి విముక్తి లభించి, సాధానశరీరం పొంది ఉద్దరింపబడ్డాడు. (ఈ కధ పి.వి.ఆర్.కే. ప్రసాదుగారి తిరుమల లీలామృతం నుంచి సేకరించడమైనది. )

మనుష్యులే కాదు, మన చుట్టూ జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక్క వేసవి లోనే కాదు నిత్యం నీటి అవసరముంటుంది. కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చినవారికి కాసిన్ని నీరైనా తప్పక ఇవ్వాలి. మన చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, మొక్కలకు నీరు పెట్టాలి. కధలో సారాంశం అర్దం చేసుకోండి. జలదానం చేయండి, అభివృద్ధికి నోచుకోండి.              

Originally published: 26 May 2013
1st Edit: 13 April 2014
2nd Edit: 18 April 2015

రామకృష్ణపరమహంస సూక్తి

పరులకు భోధించడానికి మారుగా సదా భగవంతుడిని ఉపాసిస్తూ ఉంటే, అదే కావలసినంత భోధ, ప్రచారము. స్వయంగా ముక్తుడు కావడానికి ప్రయత్నించేవాడే నిజమైన ప్రచారకుడు - శ్రీ రామకృష్ణపరమహంస

Friday, 17 April 2015

స్వామి సచ్చిదానంద సూక్తి

దేనికి భయపడకండి

భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. భయం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. గుర్తుంచుకోండి. 'ఏదైనా జరగవలసినదుంటే అది జరిగే తీరుతుంది. మంచిది, ఏదైనా జరగనీ, నేను ధైర్యంగా ఉంటాను. జరగబోయే దాన్ని నేనెలాగూ ఆపలేను మరి నేను భయపడి ఉపయోగమేమిటి?' అని భావన చేయండి.

నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన పనిలేదు. అలా అని అజాగ్రత్తగా ఉండమని చెప్పడంలేదు. జాగ్రత్తగా ఉండండి, కానీ దేనికి భయపడకండి.

- స్వామి సచ్చిదానంద


Sunday, 12 April 2015

హిందూ ధర్మం - 154 (ఋగ్ వేదం)

వేదామంతా ఒక్కటే అయినా మంత్రపద్దతిని అనుసరించి వేదాలను నాలుగుగా చెప్తారు. అందులో మొదటిది ఋగ్ వేదం. 'ఋచ్యతే స్తూయతే యయాసాఋక్' - దేవతలను ఉద్దేశించి చేసే స్తుతులను ఋక్కులు అంటారు. దేవతలు అనగానే అనేకమంది అనుకోకూడదు. ఈశ్వరుడికి అనేక గుణములు, శక్తులు ఉంటాయి. ఆయా గుణాలను అనుసరించి చెప్పినప్పుడు, ఒకే ఈశ్వరుడిని వేర్వేరు దేవతలుగా అభివర్ణిస్తారు. ఈ వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్క గుణాలు, లక్షణాలు వివరిస్తుంది. అదికాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన (chemistry), భౌతిక (physics), గణిత (Mathematics), ఖగోళ (Astronomy), విశ్వోద్భవ (Cosmology) శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలో అనుసరించవలసిన ధర్మాల గురించి, అనుగమించవలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. సాయానచార్యుడి మాటల్లో చెప్పాలంటే సమస్త భౌతిక (Physics), అధిభౌతిక (Meta Physics), ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది. వేదాలన్నిటిలో ఋగ్వేదమే పెద్దది. అందులో 10 మండలాలు, 1025 సూక్తాలు, 10581 ఋక్కులు ఉన్నాయి.

ఒకప్పుడు వేదంలో ఉండే ప్రతి శాఖకు బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఉండేవి. కానీ భారతదేశం మీద జరిగిన దండయాత్రల్లో అనేకమంది వేదపండితులు చంపబడ్డారు, గ్రంధాలయాలు, వైదిక గ్రంధాలు కాల్చబడ్డాయి. ఆ కారణం చేత ఇప్పుడు మనకు పూర్తి వేదభాగము లభ్యమవ్వడం లేదు. ఋగ్వేదంలో అన్ని మండలాలకు ఇప్పుడు బ్రాహ్మణాలు లభించడం లేదు. ఋగ్వేదానికి సంబంధించి ప్రస్తుతం ఐతరేయ, శాంఖ్యాయన, కౌస్తికీ బ్రాహ్మణాలు మాత్రమే లభిస్తున్నాయి.

1008 ఉపనిషత్తులను ఋషులు మనకు అందించగా, ఇప్పుడు కేవలం 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. వాటిలో కేవలం 11 మాత్రమే అందరికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఋగ్వేదానికి సంబంధించి ఐతరేయ ఉపనిషద్ ఒక్కటే లభిస్తోంది. వైదిక ధర్మంలో యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది.  యజ్ఞయాగాదుల్లో నాలుగువేదాలు తెలిసిన నలుగురు పండితులు పాల్గొంటారు. అందులో ఎవరికి వారికే ప్రత్యేక స్థానం, మర్యాద, గౌరవం ఉన్నాయి. ఋగ్వేదం అధ్యయనం చేసి, యజ్ఞంలో పాల్గొనే ఋగ్వేద పండితుడిని 'ఋత్విక్కు' అంటారు.

To be continued ...................

Saturday, 11 April 2015

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు.

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?
"నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో నేనొక గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామంలో హిందూ-ముస్లిం సమస్య ఉండేది కాదు. మా మొహర్రం ఉత్సవంలో హిందువులు పాల్గోనేవాళ్ళు. హోలీ, దీపావళి పండగలలో మేమూ పాల్గోనేవాళ్ళం. కాలేజీ చదువు కోసం నేను పట్నం వచ్చేను. పేదవాణ్ణి కాబట్టి ఒక మురికివాడలో ఉండేవాణ్ణి. అక్కడ కూడా నాకు హిందూ-ముస్లిం సమస్య కనబడలేదు.

"స్వరాజ్యం వచ్చిన తరువాతే హిందూ-ముస్లింల సమస్య ఇంతగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి? ముస్లింల వద్దకి వివిధ రకాల హిందూ రాజకీయ నేతలు వచ్చి ఏం చెబుతున్నారు? ముస్లింల అస్తిత్వం నేడు ప్రమాదంలో పడిందనీ, మెజారిటీ సమాజం వారిని కబలించి వేస్తుందనీ, తమ పార్టీలు మాత్రేమే వారిని కాపాడగలదనీ, కనుక తమకే వోటు వేయందనీ చెబుతున్నారు.

"ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ముస్లింల 30 శాతం ప్రత్యేక అధికారం కల్పిస్తామంటే, వేరొకరు 50 శాతం ప్రత్యేక అధికారాలు కల్పిస్తామంటారు. అధికార దాహంతో అన్ని పార్టీల హిందూ నేతలూ ముస్లిం వోట్ల కోసం, ముస్లింలకు తమ పార్టీనే ఎక్కువ సదుపాయాలూ కలగజేస్తుందని పోటీపడి మా ముందు జుట్లు పట్టుకుంటూ ఉంటే, మేము (ముస్లింలు) అమాయకంగా మాకు ప్రత్యక అధికారాలు వద్దు మేము జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతాం అని చెప్పమంటారా? ఎందుకు కలిసిపోవాలి? ముస్లిమ్లకేమన్నా పిచ్చా?

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవాలంటే ముందు అధికార దాహం కల రాజకీయ నాయకులను సరిచేయండి. వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకురండి. ఈ రాజకీయ నేతలే నేడు ప్రధాన జీవన స్రవంతిలో లేరు. వారిలో అధికార దాహం మాత్రమే ఉంది. అధికారం కోసం వాళ్ళు దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులు సరైన రీతిలో మారితే ఒక్క సంవత్సరంలోనే ముస్లింలంతా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కాగలరు అని నేను వాగ్దానం చేస్తున్నాను."

ఇవి జస్టిస్ ముర్తాజా గారు చెప్పిన మాటలు. ఇవి నూటికి నోరు పాళ్ళూ నిజం కూడా.

అయితే నాకొక సందేహం. పార్శీలు బయటి నుంచి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన పాలకులు ముస్లింలు, క్రైస్తవుల లాగే పార్శీలకు కూడా మైనారిటీలుగా హోదా ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇస్తామంటే దానిని పార్శీలు తిరస్కరించేరు. ఈ దేశంలో ఆశ్రయం పొందిన తాము ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపునూ పొందాలనుకోవటంలేదనీ, ఈ జాతి ప్రధాన జీవన స్రవంతిలో తామూ భాగస్వాములుగా కొనసాగుతామనీ అన్నారు. జంషెడ్ జీ టాటా, రతన్ టాటా వంటి వారు ఎందరో పారశీకులే. వారు పారిశ్రామికంగా దేశాభివృద్ధికి అందించిన సేవలు ఎవరూ మరచిపోలేనివి. మరి ముస్లింలు పార్శీల వలె ఎందుకు మైనారిటీ సౌకర్యాలను తిరస్కరించరు? జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు? దీనికి బాధ్యులు ఒక్క హిందూ రాజకీయ నాయకులేనా? ముస్లిం నాయకులు, మత పెద్దలు ఇందుకు బాధ్యులు కారా? వారు తమ స్వార్థం కోసం సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలో కలవకుండా వేరు చేయటం లేదా? దేశంలోని మతపరమైన కల్లోలాలకు వారు కూడా కారణం కాదా?

Source: రాజసులోచనం 

Sunday, 5 April 2015

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట)

వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు. వేదం కోటి భాగాలనుకుంటే అందులో కేవలం 1 వంతు మాత్రమే వ్యాసుడు గ్రంధస్థం చేశారు.

అలా వ్యాసుడు తిరిగి వేదవిభాగం చేసి, నాలుగు వేదాలను గ్రంధస్థం చేశారు. అవే ఋగ్ వేదం, యజుర్ వేదం, సామవేదం, అధర్వణ వేదం. వాటికి అశ్వలాయనుడు మొదలైన మహర్షులు రాసిన వ్యాఖ్యానాలను చేర్చారు (వేదాలకు ఋషులు రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు). అవేగాక ఆరణ్యకాలు, ఉపనిషత్తులను కూడా వాటికి జోడించి వేదానికి సమగ్రమైన రూపాన్నిచ్చారు. అనంతమైన వేదాన్ని విభాగం చేశారు కనుక ఆయనకు వేదవ్యాసుడనే పేరు వచ్చింది. అప్పటివరకు వారి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. వ్యాసుడు వేదాన్ని గ్రంధస్థం చేశారు, అనగా వేదాన్ని ఒక పుస్తక రూపంగా అందించారు, కానీ ఆయన వేదాలను రచించలేదు. వేదం అపౌరుషేయం (మానవుల చేత రచించబడినది కాదు), వేదములు ఈశ్వరీయములు (ఈశ్వర ప్రసాదితములు).

వ్యాసుడే లేకుంటే ఇంత జ్ఞానం మానవజాతికి అందేది కాదు. అందువలననే 'వ్యాసోఛిష్టం జగత్సర్వం' అంటారు, వ్యాసుడు ఉఛ్చిష్టమే (వదిలివేసిన భాగం / ఎంగిలి) ఈ జగత్తంతా అని. మానవజాతికి ఇంత మేలు చేసిన వ్యాసుడిని స్మరించుకుని, పూజించి, కృతజ్ఞతలు తెలుపడం కోసం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. నిజానికి గురుపూర్ణిమ రోజున మాములు గురువులను కాదు, వ్యాసుడినే పూజించాలి. తమతమ గురువులలో వ్యాసుడిని చూసుకోవాలి. వ్యాసుడు చేసిన మేలుకి ఇప్పటికి మానవజాతి ఋణపడి ఉంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

వేదాలను గ్రంధస్థం చేసిన తర్వాత తన 4 శిష్యులకు ఒక్కో వేదాలను నేర్పి, వాటిని అప్పగించి వేదప్రచారం చేయించారు. వైదికపరంపరను నిలిపారు. పైలుడికి ఋగ్ వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని అప్పగించారు. ఇంత చేసిన వ్యాసుడు ఒక మత్స్యకన్యకు జన్మించారు. వ్యాసుడికి కులం అంటగట్టడం సరికాదు కాని కొందరికి అర్దమయ్యేలా చేప్పాలంటే మానవజాతి చేతులెత్తి మొక్కే వ్యాసుడు ఎస్.సి. వర్గానికి చెందినవాడవుతాడు. హిందూధర్మం బ్రాహ్మణుల కుట్ర, వేదం బ్రాహ్మణులు తమ స్వార్ధానికి రాసి, ఇతరులపై రుద్దారని ప్రచారం చేసే మూర్ఖశిఖామణులు ఈ విషయాన్ని విస్మరించడం గమనార్హం.  

To be continued ......................

Saturday, 4 April 2015

స్వామి వివేకానందా సూక్తులు

కోరికలు తేనె పూసిన కత్తివంటివని తెలుసుకోవడమే వైరాగ్యం.

మనల్ని బలహీనుల్ని చేసే వాటిని గత వేయి సంవత్సరాలుగా కూడగట్టుకున్నాం. ఇప్పుడు మనకు కావలసింది బలం. బలహీనతలకు బానిసలం కాకుండా ఉండడమే స్వాతంత్ర్యం.

మహా వీరుడైన హనుమంతుణ్ణి మీ ఆదర్శంగా చేసుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈయన తన ఇంద్రియాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవడమేకాక అద్భుతమైన సూక్ష్మబుద్ధి కలవాడు. గురువుకు ఏ మాత్రం ఎదురు చెప్పని విధేయత, కఠోరమైన బ్రహ్మచర్యం - ఇవే విజయరహస్యాలు.

Everyone on the spiritual path must worship Hanuman first. He is a perfect sannyasi [monk, swami, holy man], a perfect brahmachari [mind constantly on God and a celibate], a perfect bhakta [devote]. He is perfect in every way - Swami Vivekananda

జపం అంటే దివ్యనామోచ్చరణ. భక్తుడు జపం ద్వారా అనంతత్త్వానికి చేరుకుంటాడు.

కర్మాచరణ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. విద్య (ఆధ్యాత్మిక జ్ఞానం) ప్రాప్తింపజేస్తుంది.

మనలో లేనిదాన్ని మన వెలుపల చూడలేం.

నరకం ద్వారానైనా సత్యాన్ని చేరడానికి సాహసించు.

పరనిందా అంతా మనలను నిజానికి నిందితులను చేస్తుంది.

శ్రద్దాభావంతో ఏమి చేసినా మేలే చేకూరుతుంది. ఎంత చిన్న పనినైనా, సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎంత చిన్న కార్యాన్నైనా శ్రద్ధతో నిర్వహించాలి.

మానవుడు ముక్తిని పొందగలిగేది ఈ లోకంలో మాత్రమే.

మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకొని, ఆ ప్రకారం నీ జీవితాన్ని మలుచుకో.

'నువ్వు దుష్టుడివి' అనవద్దు. 'నువ్వు మంచివాడివి', కానీ 'మరింత మెరుగవ్వాలి' అని మాత్రం అనండి.

హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం పిరికితనాలు మటుమాయమవుతాయి.

- స్వామి వివేకానందా