Thursday, 21 August 2014

భారతం వ్రాసిన గణపతి

ఓం గం గణపతయే నమః

మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుండగా వ్రాయడానికి ఒక లేఖకుడు (వ్రాసేవాడు) కావాలని భావించిన వ్యాసుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు. మహాభారత గ్రంధాన్ని వ్రాయగల సమర్ధుడు సిద్ధిబుద్ధి ప్రదాతయైన గణపతి ఒక్కడేనని, గణపతిని శరణువేడమని చెప్పారు బ్రహ్మ. వ్యాసుడు గణపతిని గురించి తపస్సు చేసి, గణపతిని ప్రసన్నం చేసుకుని విషయం చెప్పారు. మామూలుగా రాస్తే అందులో గొప్పతనం ఏముంటుంది? అందుకే గణపతి 'నేను వేగంగా భారతం వ్రాసే సమయంలో నా ఘంటం(కలం) ఎక్కడా ఆగకూడదు. నేను ఎక్కడ ఆగకుండా రాస్తాను, నీవు ఆగకుండా చెప్పాలి, మధ్యలో ఎక్కడైనా నీవు చెప్పడం ఆపేస్తే, ఇక నేను వ్రాయను, నువ్వు తడబడకుండా చెప్పాలి' అంటూ నియమం విధించాడు. సరేనన్న వ్యాసుడు, ' నేను చెప్పిన వాక్యాన్ని నీవు సంపూర్తిగా అర్దం చేసుకున్న తరువాతనే వ్రాయాలి' అంటూ మరొక నియమం విధించాడు.


ఇద్దరూ కలిసి బధ్రీనాథ్ ప్రాంతంలో కూర్చున్నారు. మహాభారతం ఇతిహాసం, పంచమ వేదం. శ్రీ మద్భగవద్గీత కూడా మహాభారతంలోనే ఉంటుంది. భారతంలో లేనిదేది లోకంలో ఉండదు. అటువంటి భారతాన్ని మామూలు ఘంటంతో వ్రాయడం గణపతికి నచ్చలేదు. గొప్పపనులు జరగాలంటే త్యాగాలు చేయాలని లోకానికి సందేశం ఇవ్వాలనుకున్నాడు వినాయకుడు. ఏనుగుకు అందాన్ని పెంచేవి దంతాలు. అందం పోతేపోయింది, లోకానికి గొప్పసందేశం ఒకటి అందుతుందని, నిరామయుడైన గణపతి తన దంతాన్ని విరిచి, ఘంటంగా ఉపయోగించాడు. ఆ విధంగా గణపతి ఏకదంతుడు అయ్యాడని ఒక కధ. దించిన తల ఎత్తకుండా, ఘంటం ఆపకుండా, ప్రతి పదాన్ని అర్ధం చేసుకుంటూ, ప్రతి అక్షరాన్ని మనం చేసుకుంటూ మహాభారతాన్ని పూర్తి చేసిన గణపతి, మనకు కూడా అంత బుద్ధిని ప్రసాదించాలని, సూక్షగ్రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.  

ఏకదంతం నమామ్యహం
ఓం గం గణపతయే నమః           

No comments:

Post a Comment