Sunday, 24 August 2014

గణపతి చంద్రుడిని శపించుట

వినాయకచవితి రోజు చంద్రుని శాపవృత్తాంతం గురించి చదివే ఉంటాం. అందులో గణపతి బొజ్జ పూర్తిగా నిండిపోవడంతో, శివపార్వతులకు నమస్కరించలేకపోవడం, అది చూసి చంద్రుడు నవ్వడం, దాంతో గణపతి బొజ్జ పగిలి మరణించడం జరిగిందని, తర్వాత పార్వతీదేవీ శపించిందని కధ సాగుతుంది. నిజానికి ఈ కధ ప్రామాణికమైనది కాదు, దీనికి పురాణ ప్రాశస్త్యం లేదు. అసలు కధ వేరే ఉంది. అది చదవండి.

గణపతి చంద్రుడిని శపించుట

గణపతికి లంబోదరుడని పేరు. లంబోదరం అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని అర్దం. సమస్త బ్రహ్మాండాలను తన బొజ్జలో దాచుకున్నాడు కనుక గణపతి లంబోదరుడయ్యాడు. ఒకానొక వినాయకచవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్దబోజ్జ పూర్తిగా నిండడంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. వినాయకుడి కడుపు నైవేధ్యాల వలన నిండిందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందరి ఆకలిని తీర్చే పరబ్రహ్మం యొక్క కడుపు ఎవరుమాత్రం నింపగలరు. భక్తులు తనకు భక్తితో చేసిన పూజ వలన కలిగిన ఆనందం జీర్ణం కాక, ఇబ్బంది పడ్డాడు వినాయకుడు.

చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు. అది బాహ్యసౌందర్యం. 27 నక్షత్రాలు చంద్రుని భార్యలు. వారందరు అక్కచెళ్ళెలు, దక్షప్రజాపతి కూమార్తెలు. కానీ ఆయన అందరికి సమానమైన ప్రేమ పంచక, ఒక్క రోహిణితో ఉండడానికి మాత్రమే ఇష్టపడేవాడు.దాంతో బాధపడిన మిగితావారు తన తండ్రి అయిన దక్షునకు విషయం చెప్పగా, దక్షుడు కోపంతో కళావీహినుడిగా మారిపో అని శపించాడు. తనను శాపం బారి నుంచి రక్షించగలవారు పరమశివుడు ఒక్కడేనని ఎన్నోవృధా ప్రయాసల తర్వాత గ్రహించిన చంద్రుడు, తనకు శాపవిమోచనం కలిగించగలడని గ్రహించి ఆయన్ను శరణువేడగా, దయతలచి తన తలపై ధరించాడు శివుడు.

కేవలం వ్యక్తి ఒక్క బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించడం, మోహించడం జ్ఞానుల లక్షణం కాదు. కవులందరూ చంద్రుడు గొప్పవాడని,చల్లనివాడని,అందమైన ముఖమున్నవారిని చంద్రబింబంతో పొల్చడం వంటివి చేయడం చేత చంద్రునకు "అహంకారం" పెరిగింది. తానే అందగాడినని భావించడం మొదలుపెట్టాడు. ఒక విషయం గమనించాలి. శారీరిక అందం ఆశాశ్వతమైనది. అది ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. రోజులు గడిచే కొద్ది, యవ్వనం తరిగిపోతుంది. ఎన్నో లేపనాలు పూసి కాపాడుకున్న శరీరం ముసలివయసురాగానే ముడతలు పడిపోతుంది. ఆఖరికి నిప్పులో కాలిపోతుంది. అటువంటి శరీరాల పట్ల మొహం పెంచుకున్నాడు కనుక చంద్రుడు ఆంతరింగికంగా సౌందర్యవంతుడు కాడని అర్దం చేసుకోవాలి.


వినాయకుడు బయటకు పెద్ద బొజ్జతో పొట్టిగా, చిన్నపిల్లవాడిలా, ఏనుగు ముఖంతో ఉన్నా ఆయన మానసికంగా మహా సౌందర్యవంతుడు. ఆత్మ సౌందర్యం శాశ్వతమైనది. అసలు వినాయకుడు మరగుజ్జు వాడని చెప్పుకున్నా, బ్రహ్మవైవర్తపురాణం గణపతి రూపాన్ని గురించి చెప్తూ, శ్రీ కృష్ణుడు ఎంతో మోహనాకారుడో, గణపతి కూడా అంతే సమ్మోహనాకారుడని, అది గ్రహించలేని తులసి, గణపతిని వీష్ణువుగా భావించి, పెళ్ళాడమని వెంటపడింది. అది గణపతి సౌందర్యం అంటే. అటువంటి గణపతిని చూసి చంద్రుడు నవ్వడంతో గణపతికి కోపం వచ్చింది. కోపం వచ్చింది తనను చూసి చంద్రుడు నవ్వినందుకు కాదు, ఇంతకముందు చంద్రుడికి దక్షుడి శాపం ఇస్తే, శివుడు వలన ఉపశమనం పొందాడు. అయినా చంద్రుడికి ఇంకా బుద్ధి రాలేదు. కనీసం పశ్చాత్తాపమైనా లేదు. సృష్టిలో రకరకాల వ్యక్తిత్వాలను, వ్యక్తులను సృష్టించాడు భగవంతుడు. అది అర్దమైనవాడు ఎవరిని విమర్శించడు, వెక్కిరించాడు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని గేలి చేసినా, అపహాస్యం చేసినా, అది భగవంతుని విమర్శించినట్టు అవుతుంది. వైవిధ్యం సృష్టి లక్షణం. దాన్ని అలాగే అంగీకరించాలి. చంద్రుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచి, కోపం తెచ్చుకుని చంద్రుడిని చూసిన వారు నిలాపనిందలు పొందుతారంటూ శపించాడు.  
 
చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని ఛీ కొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డుపెట్టుకుని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువు అయ్యారు. ఔషధమూలికలు చంద్రకాంతిలోనే ఔషధులను తయారుచేసుకుంటాయని పురాణలవచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఋషులు, దేవతలు, మునులు........ అందరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ దేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చుపుతాడని బ్రహ్మదేవుడనగా, అందరు కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. ఒకసారి శపించిన తరువాత వెనక్కి తీసుకోవడం కుదరదు కనుక, చంద్రునికిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాధుడు. అందరు వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి, చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. చంద్రుడు చేసిన తప్పును ఒప్పుకొని, క్షమించమని వేడుకున్నాడు. పశ్చాతాపపడ్డాడు. 'సర్వవిఘ్నపాలాయ గణేశాయ పరాత్మనే| బ్రహ్మశాయ స్వభక్తేభ్యో బ్రహ్మభూయ ప్రదాయతే|' అంటూ స్థుతించాడు.

సూర్యుడి వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి, నన్నే అంటావా ? ఇప్పటికైన బుద్ధి వచ్చిందా?  అని స్వామి అనలేదు.తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తలమీద పెట్టుకొని, చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది "నాట్య గణపతి"అవతారం. చంద్రుడిని తలపై ధరించాడు కనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. ఓం ఫాలచంద్రాయ నమః

శాపం నుంచి బయట పడినందుకు నిజానికి చంద్రుడు నాట్యం చేయాలి. కానీ నాట్యం చేసినవాడు వినాయకుడు. భారీశరీరం కలవాడు. మనం చేసిన తప్పును తెలుసుకుని, పూర్తి పశ్చాత్తాపంతో పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకంటే ఎక్కువగా పరవశించిపోయేది ఆయనే అని చెప్తుంది ఈ ఘట్టం. ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ, ఏ రోజునైతే నీవు నన్నుచూసి పరిహసించావో, ఆ రోజున (వినాయక చవితి రోజునే) ఎవరు నిన్ను చూస్తారో, వారికి చేయని తప్పుకు నీలాపనిందలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి.


దీంతో చంద్రుడు తృప్తి పొందాడు కానీ గణపతి మాత్రం తృప్తి పొందలేదు. అయ్యో! ఆ ఒక్కరోజు కూడా వీడిని జనం చూడనందుకు బాధపడతాడేమో అని గణపతి భావించి, కృష్ణచతుర్థి (సంకష్టహర చవితి) యందు నా కొరుకు ఉపవాసం ఉన్నవారు, నీవు ఉదయించే వేళ నన్ను పూజించి, నిన్ను ధూపదీపనైవేధ్యాలతో అర్చించి, నీకు ఎవరు అర్ఘ్యం ఇస్తారో, వారే నా అనుగ్రహానికి పాత్రులు కాగలరు అంటూ గణపతి చంద్రుడికి మరొక వరం ప్రసాదించాడు. అయినా గణపతికి ఇంకేదో గొప్పది ఇవ్వాలనిపించింది.

విదియ తిధి యందు సాయంకాలము నేను నిన్ను స్వీకరించాను. నిన్ను నా ఫాలభాగాన ధరించాను కనుక శుక్ల విదియనాడు మానవులు నీకు నమస్కారం చేస్తారు. ఏ మానవుడైతే శుక్లవిదియ నాడు చంద్రుడిని చూసి నమస్కరిస్తారో, అతడికి ఆ మాసం మొత్తం ఉండే దోషాలు దరిచేరవు అంటూ పలికాడు గణపతి. అంతటి కరుణామూర్తి మన గణపతి.

ఇది అసలు కధ. మనం సంపూర్తిగా మారి ఒక్క అడుగు పరమాత్మ వైపునకు వేస్తే, భగవంతుడు మనవైపుకు మరిన్ని అడుగులు వేస్తాడని చెప్తుందీ వృత్తాంతం.  వినాయకచవితి పూజలో ఈ కధనే చదివి అక్షతలు తలపై ధరించాలి.

ఓం గం గణపతయే నమః 

No comments:

Post a Comment