Wednesday, 27 August 2014

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

గణేశ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది ఆయుర్వేదం. అంటే కేవలం నెయ్యితోనే ఆహారపదార్ధాలు తయారుచేయాలి. ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్ధాలు పెరిగిపోతే, అది ఆమం (విషం /Toxin) గా మారి రోగాలకు కారణమవుతుంది. ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వలన, నెయ్యి మలద్వారానికి వెళ్ళే పేగుల గోడలకు ఒక పొరగా/పూతగా ఏర్పడి, మల విసర్జన సాఫిగా జరగడానికి కారణమవుతుంది. పుష్టికరమైన శుచికరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను, అక్కర్లేని చెత్తను బయటకు పంపించడం అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నవారి మనసు చురజక్గా పని చేస్తుంది. అటువనటి మనసే మంచి ఆలోచనలు చేయగలదు. మంచి ఆలోచనలే, సత్ సంకల్పాలై, సత్కర్మలకు దారి తీస్తాయి. సత్కర్మలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. శుద్ధిపొందిన చిత్తము ఆత్మాజ్ఞానానికి పాత్రతను పొందుతుంది. అటువంటి వారి తపస్సే ఫలిస్తుంది. కనుక ఆహారం తీసుకోవడం అంత ప్రధానామో, శరీరంలో ఉన్న చెత్తను వివిధ రకాలుగా తొలగించుకోవడం కూడా అంతే ప్రధానం. అందుకే గణేశ చతుర్థీ రోజున ప్రత్యేకించి నెయ్యితో చేసిన పదార్ధాలనే భుజించమన్నారు. ఒక్క వినాయక చవితికే కాదు, నిత్యం కూడా నెయ్యి కలిపిన ఆహారాన్నే స్వీకరించాలి. నెయ్యి లేని తిండి నీతిమాలిన తిండి అన్నారు మన శతకకర్తలు.

గణపతి ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు. గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

అందుకే మన వినాయక చవితి రోజు స్వామికి నేతితో చేసిన వంటకాలు, కుడుములు సమర్పిస్తాం. గణపతి 21 సంఖ్య ఇష్టం కనుక వీలైతే 21 సంఖ్యలో కుడుములు / ఉండ్రాళ్ళు సమర్పించండి.

ఓం గం గణపతయే నమః 

No comments:

Post a Comment