Tuesday, 26 August 2014

శమంతకోపాఖ్యానం - 2

విషయం తెలుసుకున్న కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు. ఆ మణి ఎక్కడ ఉంటే వ్యాధులు, కరువుకాటకాలు, రోగాలు రావు. మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు. మీ వద్ద ఉంటే మీకు మాత్రమే ప్రయోజనం. అది నాకు ఇస్తే నేను ఉగ్రసేన మహా రాజుగారికి ఇస్తాను. రాజు దగ్గర ఉంటే రాజ్యం అంతా బాగుంటుంది అన్నాడు. ప్రజల మేలు కోసమని అడిగాడు. సత్రాజిత్తు తిరస్కరించగా, కృష్ణుడు వెళ్ళిపొయాడు.

కృష్ణుడు ఇంతకముందు చాలా మంది రాక్షసులను చంపాడు, ఇప్పుడీ మణి కోసం తనను కూడా చంపుతాడని అనుమానించాడు సత్రాజిత్తు. నిజానికి కృష్ణుడు కంస సంహారం చేశాక ద్వారక నగరాన్ని కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజుకు ఇచ్చాడు కాని తాను పరిపాలించలేదు. ద్వారకను సముద్రం మధ్యలో నిర్మించుకున్నా తనకంటే పెద్దవాడు బలరాముడని, బలరాముడికి పట్టం కట్టాడు. ఇక కృష్ణుడి దగ్గర కౌస్తుభ మణి ఉంది. అది శమంతకమణికంటే కోటి రెట్లు విలువైనది. కౌస్తుభం ఉండగా శమంతకమణి అవసరమేంటి. ఇవి ఆలోచించకుండా కృష్ణపరమాత్మ గురించి ఇలాంటి నీచపు అలోచనలు చేశాడు సత్రాజిత్తు.  

ఈ విధమైన ఆలోచనల వల్ల మనసు అపవిత్రమైంది. ఆ సమయంలో మెడలో శమంతకమణి ఉంది. తన దగ్గర ఉంటే కృష్ణుడు చంపుతాడని భయపడి, తమ్ముడు ప్రసేనుడిని పిలిచి ఆ మణిని ఇచ్చాడు. అది తీసుకునే సమయానికి ప్రసేనుడు బాహ్యాంతర (శారీరిక,మానసిక) శౌచం ఉంది. దాన్ని ప్రసేనుడు తీసుకుని మెడలో వేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణుడు, ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళారు. ప్రసేనుడి గుర్రం దారి తప్పింది. ప్రసేనుడికి ఆ సమయంలోనే మూత్రవిసర్జన చేయవలసిన అవసరం ఏర్పడింది. మెడలో ఉన్న మణి తీసి ప్రక్కన పెడితే, ఎవరైనా తీసుకుపొతారని దాన్ని మెడలోనే వేసుకొని మూత్రవిసర్జన చేశాడు. అదే దోషం. అందునా అక్కడ నీరు ఉండదు కనుక కాళ్ళు, చేతులు కడుక్కొని, ఆచమనం చేయడానికి కుదరలేదు. మెడలో మణి అపవిత్రం అయ్యింది. ఇది ఇంకా పెద్ద దోషం. అపవిత్రమయితే ప్రాణాలు తీస్తుంది. గుర్రం ఎక్కి వెళుతున్నాడు. దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. మృత్యువు సింహం రూపంలో వచ్చింది. గుర్రాన్ని, ప్రసేనున్ని చంపి, మాంసం తినింది. అక్కడ ఎముకలతో పాటు ఈ శమంతక మణి దేదీప్యమానంగా వెలిగిపొతోంది. అది తినే వస్తువు కాకపొయిన చూడడానికి బాగుంది కదా అని నోటికి కరుచుకొని వెళ్ళింది.

సింహం హత్యచేసింది. అది గుర్రాన్ని, ప్రసేనుడిని చంపింది, మాంసం తిన్నది, కనుక అపవిత్రం అయ్యింది, శౌచం పోయింది. అది ఏ ప్రాణి అయినాసరే నియమం మారదు. మణి మళ్ళీ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. సింహానికి మృత్యువు ఎలుగుబంటి రూపంలో వచ్చింది. వచ్చి ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుపోయింది ఎలుగుబంటి.  

అక్కడ కృష్ణుడు ప్రసేనుడి కొరకు అన్వేషిస్తున్నాడు. అది భాద్రపద మాసం. వర్ష ఋతువు కారణంగా త్వరగా చీకటి పడుతుంది. ప్రసేనుడికి ఏదైనా ప్రమాదం జరిగితే తానే మణి కోసం చంపాను అనుకుంటారని కృష్ణుడు ఆందోళన పడ్డాడు. ప్రసేనుడి కోసం వెతికినా జాడ తెలియలేదు. "ప్రసేనా! ఎక్కడ ఉన్నావు" అని తల పైకి ఎత్తి గట్టిగా అరిచాడు. ఆ రోజు వినాయక చవితి. చంద్రబింబం శుద్ధ చవితినాడు 30డీగ్రీలు కిందకి వచ్చి ఉంటుంది. తల కొంచం పైకి ఎత్తగానే చంద్ర దర్శనం అయ్యింది. చంద్రున్ని చూసిన కృష్ణుడు, రాత్రి అయిపొయిందని తలచాడు (కాని అది చవితి చంద్రుడన్న విషయం గుర్తుకురాలేదు), ఇప్పుడు వెతకడం కష్టమని తలచి, సైన్యాన్ని తీసుకొని తిరిగు బాట పట్టాడు.

చవితి చంద్రుని దర్శనం నీలాపనిందలు తెచ్చిపెడుతుంది కదా. రాత్రికి రాత్రి ద్వారకలో కృష్ణుడే ప్రసేనుడిని చంపాడని పుకారు వచ్చింది. మొదటి నీలాపనింద. ద్వారకలో ఉంటున్న ప్రజలంతా ఇదే నమ్మారు. అప్పటివరకు కృష్ణుని చేత రక్షింపబడినవారు, ఆయన్ను పొగిడిన వాళ్ళంతా ఇప్పుడు "నిజమే, చిన్నతనంలో కృష్ణుడు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత మందిని చంపలేదు. ఇప్పుడు శమంతకమణి కోసమని ప్రసేనుడిని కూడా కృష్ణుడే చంపి, ఏమి ఎరగనట్టు అసత్యాలు పలుకుతున్నాడు" అని అనడం మొదలుపెట్టారు. మళ్ళీ నీలాపనిందలు. తన మీద వచ్చిన అపనిందలను తొలగించుకోదలచిన కృష్ణపరమాత్మ ప్రజలతో 'నాతో పాటు మీరు కూడా అడవికి వస్తే వెళ్ళి వెతుకుదాము' అన్నాడు. 'ఇంతకముందు నువ్వు చాలా మందిని చంపావు. ఇప్పుడు మమ్మల్ని చంపుతావు. నీ మీద మాకు నమ్మకంలేదు, నీవెంట వచ్చెది లేదు' అన్నారు ప్రజలు.

To be continued ...............    

15 comments:

  1. మీ వ్రాతలకు మూలం ఏమిటో తెలియదు. అదికూడా జతపరచగలరు. కొంచెం గందరగోళంగా ఉంది. శ్రీకృష్ణుడూ ప్రసేనుడూ‌ కలిసి వేటకు పోవటమేమిటి? ఇదెక్కడి కథ? మీ స్వకపోలకల్పితం కాదు కదా?

    ReplyDelete
    Replies
    1. దీనికి మూలం విష్ణు, స్కాందపురాణాల్లో ఉందండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ వృత్తాంతాన్ని ప్రవచనం కూడా చెప్పారు. దీని మూలం విష్ణు, స్కాందపురాణాల్లో ఉందని నిన్నటి టపాలోనే చెప్పానండి. ఈ కధయే ప్రామాణికం

      Delete
    2. సందేహం నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. మీకు వీలైతే ఈ ప్రవచనం లింకు ఇవ్వగలరా?

      Delete
    3. https://www.youtube.com/watch?v=FWqwGLPESJk#t=519 లింక్ చూడండి

      Delete
  2. ఇవన్నీ అసంబద్ధంగా ఉన్నాయి. ఇంతకుముందు చాలా రాక్షసులను చంపాడు. ఇప్పుడు మణికోసం నన్ను చంపుతాడనడం ఏమిటి? మిగతా రాక్షసులనీ ఇలా మణులకోసమో మరి దేన్నయినా పొందడానికో చంపాడంటున్నారా? పైగా కృష్ణుడు, ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళడం ఏమిటి? చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్పనేలేదే?

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీదేవిగారూ,

      కం. వా రేమని చెప్పారో
      వీ రే కళనుండి దాన్ని విన్నారో ఆ
      ధారలను పరికిస్తే
      వీ రంటున్నట్లు సత్యవిషయం బెంతో

      నా కైతే ఇదంతా నమ్మశక్యంగా లేదండీ.

      Delete
    2. https://www.youtube.com/watch?v=FWqwGLPESJk#t=519 లింక్ చూడండి,
      అది కాక ఇతర్ లింక్‌లు కూడా అందిస్తాను.

      Delete
  3. మీరు పెట్టిన వీడియో పూర్తిగా విన్నా. కృష్ణుడు చిన్ననాటి వెన్నలు దొంగిలించినవాడు కాబట్టి మణి దొంగిలించాడేమో అనుకున్నాడు సత్రాజిత్తు అని చెప్పినారు, కానీ ఎందరో రాక్షసులను చంపినాడు మణికోసం నన్ను చంపుతాడేమో అని సత్రాజిత్తు అనుకున్నాడని చెప్పలేదు. జాగ్రత్తగా విని పోస్ట్ సరి చేయగలరు. తప్పు అర్థాలు వస్తాయి కదా!
    ఇంక విష్ణుపురాణంలో శ్రీకృష్ణుడు,ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళారని ఉందని వీడియో లో చెప్పినారు. విష్ణుపురాణం నేను చదవలేదు కాబట్టి ఏమో ఉండవచ్చు. ఈ విషయంలో తెలియకుండా వ్యాఖ్య పెట్టినందుకు మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. నమస్కారమండి! ఈ ప్రవచనానికి ముందు 2-3 ఏళ్ళ క్రితం వేరొక ప్రవచనంలో నేను రాసినది చెప్పియున్నారు. వారి ప్రవచనం రికార్డు చేసుకుని, విన్నాకే రాశాను. ఇందులో నేను ఏ మాత్రం కల్పించి రాయలేదు. నాకు పాత ప్రవచనం లింక్ దొరకలేదు. అందుకే ఈ లింక్ ఉంచాను.

      Delete
  4. నమస్కారమండి. scribd లో విష్ణుపురాణం ఆంగ్లానువాదం గూగుల్ సెర్చ్ లో కనిపిస్తుంది. అందులో చివరన కర్ణాకర్ణ్యకథ్యయత్ అనే శ్లోకభాగాన్ని కూడా ఉంచినారు. దీని అర్థం తెలుగులో చెప్పుకుంటే శ్రీకృఃష్ణుడు ఆనోటా ఆనోటా తన పై నింద విన్నాడనిపిస్తుంది ఆంగ్లానువాదంలో కూడా ఇద్దరూ కలిసి వేటకు వెళ్ళారని లేదు.
    కానీ నా గూగుల్ సెర్చ్ కన్నా చాగంటి వారు స్వయంగా విష్ణుపురాణం చదివి చెప్పినదే సరి అయి ఉండవచ్చు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఈ విషయంలో విష్ణుపురాణంలో ఏమి వ్రాయబడి ఉందో నాకు స్వయంగా తెలియదు. ఇప్పుడు సంపాదించి పరిశీలీంచే పరిస్థితి లేదు. శ్రీచాగంటివారు తమకు లభించిన ప్రతిప్రకారం వ్యాఖ్యానించి ఉంటారనుకుంటాను. ఐటే ఒకటి రెండు విషయాల్లో మీరు సరిగా అనుసరించలేదు కాబట్టి చిన్న ఇబ్బంది వచ్చింది దానిని లక్ష్మీదేవిగారు ప్రస్తావించారు కాబట్టి దానిపై నేను పునర్విచారణకు దిగను.

    ఈ పురాణాలమధ్యన కథల విషయంలో పరస్పరం చిన్న చిన్న తేడాలనుండి కథాసంవిధానాలూ బందుత్వాదులూ కూడా మారిపోవటం వంటి పెద్ద తేడాలూ కనిపిస్తుంటాయి. ఏవి అసలు విషయాలో‌ ఏవి ప్రక్షిప్తాలో తెలుసుకోవటం నిజంగా బ్రహ్మప్రళయమే ఒక్కొక్కసారి.

    చాగంటివారు ఒక ముక్క అన్నారు. ప్రచారంలో ఉన్న కథలో జాంబవంతుడు ఉయ్యాలలో ఉన్న పిల్లకి ఆ మణిని ఇచ్చాడనీ, కృష్ణుడికి మణిసహితంగా ఆ బాలికనూ ఇచ్చాడనీ ఉంది కదా, పసిపిల్లని శ్రీకృష్ణుడు పెండ్లిచేసుకోవటం ఏమిటీ అసందర్బంగా అన్న శంకవస్తుంది కదా అని. చాగంటి వారి (విష్ణుపురాణం) వెర్షన్ ప్రకారం, ఉయ్యాలలో ఉన్న బిడ్డ ఒక మగపిల్లవాడు, జాంబవంతుడి కూతురు జాంబవతి అనే యువతికి తమ్ముడు. ఆమె శ్రీకృష్ణుడిని చూడగానే మోహించి ఆతనికి తన తండ్రి చేతిలో కీడు శంకించి ఇలా ఒక శ్లోకం చెప్పిందట:
    సింహప్రసేన మవధీః సింహో జాంబవతాహతః
    సుకుమారక మారోధీః తవస్యేషా శ్యమంతకః
    అని.
    ఈ వెర్షన్‌లో కూడా అస్సలు పొసగని సంగతులు కొన్ని ఉన్నాయి గమనించారా? సింహాన్ని జాంబవంతుడు చంపి మణి తెచ్చినట్లు ఆమెకి తెలియవచ్చును. తండ్రి చెప్పి ఉంటాడనుకోవచ్చు కాబట్టి. మరి సింహం ప్రసేనుడిని చంపి మణిని నోటకరచుకుందని ఎలా తెలుసు ఆమెకి? ( సింహం ప్రసేనుడి ఎముకలను తప్ప మిగల్చలేదని చెప్పారు కద చాగంటి వారు?) అంత పెద్దాయన జాంబవంతుడికి ఇంత ఉయ్యాలలో పిల్లవాడు కొడుకు ఎలా? ఆమాటకు వస్తే నవయౌవనవతి జాంబవతి మాత్రం కూతురు ఎలా (ఏ కథా సంవిధానం ప్రకారం చూసినా)? ఈ‌ మణి పేరు శ్యమంతకం అని జాంబవతికి ఎలా తెలుసు?

    విష్ణుపురాణం ప్రకారం ప్రసేనుడితో కలిసి శ్రీకృష్ణుడు వేటకు వెళ్ళటం నమ్మదగ్గదిగా లేదు. వారిద్దరూ స్నేహితులన్నది అప్రసిధ్ధం.

    శ్యమంతకం ధరించి బాహ్యశౌచం తప్పటం వల్ల ప్రసేనుడికి దాదాపు తక్షణం మరణం సంభవించింది. సరే, ఒప్పుకుందాం. సర్వేంద్రియాలకు రాజు ఐన మనస్సు యొక్క శౌచం తప్పిన సత్రాజిత్తుకు మరణం సత్యభామా పరిణయం తరువాత కొన్నాళ్ళదాకా ఆగి రావటం ఏమిటీ‌ అలాగైతే? ఇది పొసగటం‌ లేదు కదా? సత్రాజిత్తు వధలో కుట్రదారులతో చేతులు కలిపిన అక్రూరుడు కూడా అంతశ్శౌచం తప్పిన వాడే కాని అతడికి మాత్రం శ్యమంతకం రోజూ ఎనిమిది బారువల బంగారమూ క్రమం తప్పకుండా ఇసూ పోయింది కదా? అతడు పశ్చాత్తాపపడ్డాడని చాగంటి వారు అన్నారు కాని, అలాగైతే శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి తప్పు ఒప్పుకోవాలి కదా? అలా చేయకుండా ఆ బంగారం గ్రహించి దానధర్మాలు చేస్తూపోయాడు. ఇంకా అనేక రకాలుగా ఈ‌ విష్ణుపురాణంలో ఉన్నట్లు చెబుతున్న కథకూడా అతుకుల బొంత లాగే ఉంది కాని పొసగటం లేదు. ఇదంతా చూస్తే ఈ శ్యమంతకోపాఖ్యానం ఒక పెద్ద మిష్టరీ. ఈ విషయంలో బాగా పరిశోధన ఆవశ్యకం అనుకుంటున్నాను.

    ReplyDelete
  6. ఒక్క విషయం కొంచెం సూటిగా చెప్పవలసి ఉన్నా పరాకు పడ్డాను. సింహం చేతులో చచ్చినది మనిషి అనే సంగతీ, ఇంకా ముఖ్యంగా ఆ చచ్చినవాడి పేరు ప్రసేనుడు అన్న సంగతీ గుహలోని జాంబవతికి ఎలా తెలిసిందీ అని? అలాగే ఆ చచ్చినవాడి తాలూకు మణి పేరు శ్యమంతకం అని కూడా ఆ అమ్మాయికి ఎలా తెలుసు?

    ReplyDelete
  7. రాముని కాలంలో నుంచీ ఉన్న జాంబవంతునికి వాళ్ళు కొడుకు కూతురు కాక పెంచుకున్నవాళ్ళు అయిఉంటారనుకుంటాను.
    సత్రాజిత్తు , ప్రసేన జిత్తు శౌచం మరణాల గురించిన మీ ప్రశ్న పరిశోధించదగ్గది. విష్ణు పురాణం పరిశీలించాల. అయినా అందరికీ తెలిసిన భారత భాగవతాదులే అనునిత్యం వేలాది కవుల చేతుల్లో ప్రక్షిప్తం ఐతుంటే ఇంక ఈ విష్ణుపురాణం మొదలైనవి ఎక్కువమందికి తెలియనివి. అవి ప్రక్షిప్తం అయ్యే అవకాశాలు మెండు.

    ReplyDelete
    Replies
    1. ఈ జాంబవంతుడు అర‌ణ్యమధ్యంలో రహస్యజీవితం గదపుతూ ఉండిన ఒక పరమవృధ్ధజీవి. అతడు నాగరికుల బిడ్డలను తెచ్చి పెంచుకున్నాడని చెప్పటం పొసగదు. ఎవరిస్తారు పిల్లానో పిల్లాడినో తీసుకొనిపోయి పెంచుకోవయ్యా అని? అలాగని దొంగతనంగా ఎత్తుకొని వచ్చి పెంచుకుంటున్నాడనుకుంటే అది జాంబవంతుదనే జ్ఞానవృధ్ధమూర్తికి ఉచితమైన వ్యవహారంగా చెప్పలేము కాబట్టి అదీ పొసగదు. అందుచేత మరింత పరిశోధన జరుపకుండా ఈ కథ(ల)ను విశ్వసించటం అసాధ్యం. ప్రచారంలో ఉన్న కథను అయినా లేదా ఈ విష్ణుపురాణాంతర్గతమని చెప్పబడుతున్న క్రొత్త కథను అయినా సరే యధాతధంగా అమోదించలేమన్నది విస్పష్టం.

      Delete
  8. ఇంకొకటి అనిపిస్తున్నది. కృష్ణుడు మణి తీసుకొని వచ్చి చూపగా సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది, మణినీ కన్యకామణిని సమర్పించినందువల్ల పాపపరిహారం అయి ఉండవచ్చు.

    ReplyDelete