Saturday 30 August 2014

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము. గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు, జీవులు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం, Group, Category అని అర్దం. ఈ సమస్త సృష్టిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణమ, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక గణం. మళ్ళి ప్రతి గణాన్ని ఇంకా విభజించవచ్చు. ఉదాహరణకు చెట్లను తీసుకుంటే పుష్పించే చెట్లు ఒక గణం, పెద్ద పెద్ద వృక్షాలు ఒక గణం, పండ్లు అందించే మొక్కలు ఇంకో గణం, లతలు, తీగలు, కందలు, కూరగాయలు వేర్వేరు గణాలు. మళ్ళీ వీటిలో ఇంకా గణాలు ఉన్నాయి. ఎర్రని పూలు పూసే మొక్కలు ఒక గణం, తెల్లనివి ఇంకో గణం, పసుపుపచ్చనివి వెరొక్ గణం. మనుష్యుల్లో కూడా మంచివాళ్ళు ఒక గణం, చెడు వాళ్ళు ఇంకో గణం, తెలివైనవారు ఒక గణం. ఇలా ఎన్నో విధాలుగా విభజించబడిన ఈ సృష్టి మొత్తం, వివిధ గణాల మధ్య సయోధ్య కారణంగా సక్రమంగా సాగుతోంది. ఒక పదిమంది కలిస్తేనే, అందులో ఎన్నో అపోహలు, అపనమ్మకాలు, విమర్శలు, గొడవలు వస్తాయి. ఇంత పెద్ద సృష్టి, ఎన్నో నక్షత్రాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, అనేక కోటి బ్రహ్మాండాలలో ఇన్నిన్ని సమూహలను ఏక తాటిపైకి తీసుకురావడం ఎంతో కష్టతరం. అసలు వీటి మధ్య కనుక బేధాభిప్రాయం ఏర్పడితే, ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఇలా గందరగోళం ఏర్పడకుండా, చిన్న అణువు (Atom), కణం (cell) నుంచి బ్రహాండాల వరకు సమస్త గణాలకు నాయకులు ఉన్నారు. అలా ప్రతి గణానికి, పరబ్రహ్మ నాయకత్వం వహించి, వాటిని నిర్ణీత మార్గంలో నడిపిస్తున్నారు. ప్రతి గణానికి ఉన్న నాయకునికి గణపతి అని పేరు. తంత్రశాస్త్రం ప్రకారం సృష్టిలో అనేకమంది గణపతులు ఉన్నారు.

గణపతి ఆరాధన యొక్క తత్వం కూడా ఇక్కడే దాగి ఉంది. గ్రహాలు అనుకూలించకుంటే వాటిని శాంతపరచాలి. ప్రకృతి సహకరించకుంటే, ప్రకృతికి సంబంధించిన దేవతను మెప్పించాలి. దేవతలు ఆగ్రహంతో ఉంటే, వారిని పూజించాలి. మన జీవితంలో నిత్యం ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిన్నిటిని దాటాలంటే ఎంత మందిని మచ్చిక చేసుకోవాలి? అంత మందిని ఒప్పించేలోపు జీవితం కాస్త ముగిసిపోతుంది. అందుకే పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ప్రతి గణానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన గణపతి. గణం గణం కలిస్తే, మహాగణం. దానికి నాయకుడు మహాగణపతి. అంటే గణపతులకు గణపతి మహాగణపతి.

ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే, దానికి ఎంతో మంది సహాయసహాకారాలు కావాలి. సాయం మానవుల నుంచే కాదు, అణువుల దగ్గరి నుంచి దేవతల వరకు, అందరు మనకు సానుకూలంగా మారాలి, సహాకారం అందించాలి. ఇంత వైవిధ్యమైన సృష్టిలో, ఇంతమంది సహాయాన్ని అర్ధించడం చాలా కష్టం. అందరిని సంప్రదించడం కష్టం, అయినా అంతమందిని ఏక తాటిపకి తీసుకురావడం, ఏకాభిప్రాయం ఏర్పరచడం ఇంకా కష్టం.  సృష్టిలో ఇన్ని గణాలు ఉన్నా, అన్నిటికి ఒకడే నాయకుడై ఉన్నాడు. ఆయనే వినాయకుడు. వినాయకుడంటే విశిష్టవంతమైన నాయకుడని, నాయకుడే లేనివాడని అర్ధాలున్నాయి. మొత్తం సృష్టి ఆయన చేతిలో ఉన్నది కనుక, ఆయన చెప్పినట్టే వింటుంది. అందుకే ఏదైన పని ప్రారంభించే ముందు మహాగణపతిని స్మరిస్తే, సమస్త జగత్తు ఒక్కసారిగా ‘అలర్ట్’ (Alert) అవుతుంది, అన్నీ పనులు పక్కనబెట్టెసి, విశ్వనాయకుడైన వినాయకుడి మాట వింటుంది. దాంతో ప్రారంభించే పనిలో ఏ ఆటంకాలు రావు. అందుకే గణపతికి ప్రధమ పూజ. ఇక గణపతి విశ్వగణాలకు నాయకుడు కనుక గణపతిని స్మరిస్తే, సమస్త బ్రహ్మాండాలను స్మరించినట్టే, గణపతిని తెలుసుకోవడమంటే సమస్త బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే. అందుకే ప్రతి కార్యానికి ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని వినాయకుడిని స్మరిస్తాం. స్మరించాలి. అప్పుడే నిర్విఘ్నంగా సకలకార్య సిద్ధి చేకూరుతుంది.

ఇదే వ్యాసాన్ని అంతర్జాల మాస పత్రికైన అచ్చంగా తెలుగులో కూడా మనం ప్రచురించాం.
http://acchamgatelugu.com/?p=7096

No comments:

Post a Comment