Sunday, 1 May 2016

హిందూ ధర్మం - 207 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 3)

ఇంతకముందు చెప్పుకున్నట్టుగానే అశ్వమేధాన్ని కూడా అగ్ని లేకుండా జ్ఞానకాండలో భాగంగా నిర్వహించవచ్చు. దీన్ని నిర్వహించడానికి వర్ణాశ్రమ బేధం ఉండదు. దేశరక్షణ, సంగ్రత, సమైఖ్యత కొరకు చేసే కర్మలన్నీ అశ్వమేధానికి సమానమైన ఫలితానిస్తాయి. దేశంలో విఛ్ఛినకరశక్తులు, దేశద్రోహులు తమ విషపడగలను విప్పి, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తరుణంలో, దేశప్రజలలో బుద్దిపరమైన జాగృతిని కలిగించి, ప్రజలను ఆలోచింపజేసి, వారిని సంఘటితం చేయడం, దేశద్రోహుల మనసులు మార్చే ప్రయత్నం చేయడం, అది కుదరని పక్షంలో వారిని దేశం నుంచి తరిమికొట్టడం అశ్వమేధం. ఒక దేశానికి రెండు రకాల శతృవులుంటారు. ఒకరు అంతర్గత శతృవులు, రెండవవారు శతృదేశాల వారు. శతృదేశాలవారి ఎత్తులను చిత్తు చేయడం, యుద్ధం చేయడం అంత కఠినం కాకపోవచ్చు కానీ, అంతర్గత శతృవులను పట్టుకుని, వారిని మట్టుబెట్టడం చాలా కష్టం. వీళ్ళు ఇంటిదొంగలు. ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ మాతృభూమినే ముక్కలు చేయాలని చూసే పరమకౄరులు. వీరు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అట్లాగే దేశప్రజలలో శక్తి క్షీణించి, దేశం పతనం దిశగా వెళుతున్న క్రమంలో, వారిలో పునరుజ్జీవాన్ని నింపి, నూతున శక్తులను సృష్టించి, దేశపతనాన్ని ఆపటం అశ్వమేధం. ఇవి అగ్ని లేకుండా చేసే అశ్వమేధ యాగాలు. నిరంతరం ఇవి జరుగుతూనే ఉండాలి.

అశ్వం అంటే విశ్వాత్మ అయిన సూర్యుడని, సర్వజీవుల యందు అంతర్గతమైన ఆత్మ అని, ప్రాణశక్తులు ఆత్మతో సంయోగం చెందేలా జీవించడమే అశ్వమేధమని దయానంద సరస్వతీ వివరించారు.  ప్రాణం ఇక్కడ దేహంలోని ప్రాణశక్తులను సూచిస్తోంది, ఆత్మను కాదు. భోజనం చేయనప్పుడు నీరసంగా అనిపిస్తుంది, ఆ నీరసానికి కారణం ప్రాణం. నచ్చిన, ఆసక్తికరమైన విషయం విన్నప్పుడు తెలియని ఉత్తేజం కలుగుతుంది, అది ఉత్తేజితమైన ప్రాణం యొక్క బహిర్ రూపం. అలా దేహంలో నిత్యం ప్రాణశక్తి సంచారం చేస్తూ ఉంటుంది. జీవి యొక్క ప్రతి కదలిక వలన అది దేహం నుంచి బయటకు వెళుతూ ఉంటుంది. ఉద్రేకాలు, అధికమైన ఆలోచనలు, భావాల మీద నియంత్రణ లేకపోవడం, మితిమీరిన శృంగారం, వీర్యనష్టం లాంటి వాటి వలన అది శరీరం నుంచి అధికంగా బయటకు వెళ్ళిపోతుంది. దాని వలన నాడీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోవడాన్ని యోగులు తమ సూక్ష్మ దృష్టితో దర్శించగలుగుతారు. అందుకే గురువులు ఉపదేశం చేస్తూ 'ఏ పనిని ఇష్టం లేకుండా చేయకండి. ఇష్టపడి పనిచేయండి. కష్టంగా భావించకండి' అంటారు. ఎందుకంటే భారమనుకుని చేసే కర్మ ప్రాణశక్తిని అధికంగా బయటకు లాగేస్తుంది. ఈ ప్రాణశక్తిని ప్రాణాయామం మొదలైన సాధనాలతో, ధ్యానంతో, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహాలతో, యోగంతో ఆత్మవైపు మళ్ళించడం అశ్వమేధం.

ఆ సందర్భంలో మేధం ఇక్కడ చక్కని బుద్ధిని తెలియజేస్తుంది. బుద్ధి ఎలా వికసిస్తుందంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా. మంచి ఆహారం, శుద్ధమైన, ఔషధ మొక్కల నుంచి వీచే గాలి, అన్నీ అవసరమే అయినా, బుద్ధి ధర్మ శాస్త్రాన్ని తెలుసుకోవడం వలననే వికసిస్తుంది. అట్లా బుద్ధిని, మేధస్సును వృద్ధి చేసుకుని, గురువు చెప్పిన విషయాన్ని మననం చేసుకుని, దానిపై ధ్యానించి, ప్రాణశక్తిని ఆత్మవైపు మళ్ళించటమే అశ్వమేధం.

కర్మసాక్షి సూర్యనారాయణ మూర్తి. ఆయనతో జీవనాన్ని ముడి వేసింది సనాతనధర్మ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం. సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఒక రోజులో ఏ సమయంలో ఏది తినాలో, ఎప్పుడు ఏ పనికి అనుకూలంగా ఉంటుందో ఋషులు పరిశోధించి ఆయుర్వేద గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు. ఆ సమయపట్టీని పాటించడం వలన వ్యక్తి ఆరోగ్యవంతుడై సూర్యునితో దృఢమైన సంబంధం ఏర్పరుచుకుంటాడు. అతడు చేసే జపధ్యానాదులు కొన్ని వేల జన్మల పరిణామ దశలను దాటిస్తాయి. అటువంటి జీవితాన్ని గడపడం అశ్వమేధం.

To be continued ...........

No comments:

Post a Comment