Sunday, 29 May 2016

హిందూ ధర్మం - 211 (కల్పం - 1)

కల్పం - ఇది వేదంగాల్లో ఒకటి. దీన్ని వేదానికి చేతులుగా వర్ణించారు. చేతులు క్రియకు సంబంధించినవి. అలాగే కల్పం అనే వేదాంగం వేదంలో చెప్పబడ్డ కర్మల గురించి, వాటిని నిర్వహించే పద్ధతుల గురించి వివరంగా చెప్తున్నా, ఈ కల్పంలోనే గణితశాస్త్రం దాగి ఉంది. అంకగణితం (Arithmetic), రేఖాగణితం (Geometry), బీజగణితం (Algebra), త్రికోణమితి (Trigonometry) మొదలైన అనేక శాస్త్రాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.


శ్రీ రాయల విశ్వనాధ గారు కల్పం గురించి చెప్తూ, 'కకారం ప్రధమ స్పర్శగల అక్షరమవటం వలన అది క్రియాసంధి. రకారం జీవుడు. లకారం ఆ జీవుడు దేహభావంలో ఉన్న స్థితి (అంటే తాను ఆత్మ కాదు, దేహం అనుకునే భ్రాంతి). పకారం మూడుదేహాలకు సంబంధించినది (స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు). మకారం మనసకు సంబంధించినది. కల్పమంటే మనసుతో, మూడు దేహాలను, దేవభావమునకు ఉన్ముఖం చేయడం. ప్రాణము, అపానము, వ్యానము, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, ఆత్మ, యజ్ఞము - ఇప్పుడు చేయబడుతున్న యజ్ఞం వలన దైవీ భావాల దిశగా ఉన్ముఖులువుగాక! అంటే మనం కూడా దేవతల వంటి మంచి ఆలోచనలు కలిగినవారం కావాలని అర్దం. యజ్ఞం అందుకోసమే. మనలో ఉన్న దైవభావలను, శక్తులను పెంపొందిచుకోవటం కోసమే.

వేదశబ్దాలకు లోకంలో కనిపించే సామాన్యమైన అర్దాలు చెప్పకూడదని నిరుక్తకారులు చెప్పి, వేదశబ్దాలను అనేక కోణాల నుంచి దర్శించి, కొత్త అర్దాలు వ్రాసారు. ఒకే శబ్దానికి అనేక అర్దాలు వ్రాసారు. వేదం కేవలం పైకి, కళ్ళకు కనిపించే లోకాల గురించే కాక, కనబడని, అంతర్లీనంగా ఉండే అనేక లోకాల గురించి చెప్తుందని తెలియని విదేశీయులు (వక్రీకరణకారులు, వీరి మతంలో అన్ని లోకాల గురించి వివరణ లేదు. అంత స్థాయికి అవి ఎదగలేదు. వాటిని అవి దర్శించలేదు, లేవు కూడా. అందువలన వారికి మన వాళ్ళు చెప్పినవి అర్దం చేసుకునే స్థాయి లేదు) వేదశబ్దాలకు సంస్కృత శబ్దాలతో తమకు తోచిన అర్దాలు చెప్పి, వేదం మానవులే వ్రాసారని, అది సామన్య గ్రంధమని ప్రకటించారు.

యాస్కుడు వేదంలో ఉన్న 'భారతి' అనే శబ్దానికి 'సూర్యుడు' అనే అర్దం సాధించారు. లౌకిక దృష్టితో చూస్తే, సంస్కృత భాషా సంప్రదాయంలో భారతికి, సూర్యునికి సంబంధంలేదు. సాయణాచార్యులు ఋగ్వేద భాష్యారంభంలో అగ్ని అనే శబ్దానికి 5 అర్దాలను చెప్పారు. కాబట్టి వేదంలో శబ్దాలకు ఇది మాత్రమే అర్దమని చెప్పలేము. 'ఇది మాత్రమే' అందులో చెప్పబడిందని కూడా చెప్పరాదు. (వేదంలో చెప్పబడినవి ఒక్కో వ్యక్తికి, అతని తపశ్శక్తిని బట్టి ఒక్కో స్థాయిలో అర్దమవుతాయి. ఒక కాలంలో, ఒక వ్యక్తి ఇచ్చిన అర్దం మాత్రమే సరైనది అని చెప్పకూడదు. కాలప్రవాహంలో అంతకంటే ఉన్నతమైన భావాలను అందులో దర్శించే అవకాశం ఉంది. అంతమాత్రాన పాతభావాలు పనికిరావని, వాటిని కాల్చివేయడం, నాశనం చేయడం ధర్మంలో లేదు - రాజీవ్ మల్‌హోత్ర)

వేదానికి అర్దం చెప్పడానికి ప్రయత్నించే శాస్త్రాలన్నీ ఒక ఎత్తు. కల్పశాస్త్రం ఒక ఎత్తు. మిగితా శాస్త్రాలు అర్దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, కల్పం అర్దాన్ని చేతల్లో చూపించటానికి ప్రయత్నించింది, క్రియాపరంగా. మంత్రంలోని భావానికి అనుగుణమైన కర్మను కల్పించి, ఆ మంత్రాన్ని క్రియా సమయంలో (కర్మ చేస్తూ) పఠింపజేసేది కల్పము. వేదంలో చెప్పబడిన కర్మ చేస్తున్నాము, చేయడం చూస్తున్నాము, మంత్రాన్ని పఠిస్తున్నాము. అప్పుడు ఆ మంత్రం యొక్క భావం సులభంగా తెలుస్తుంది'.

To be continued .............

No comments:

Post a Comment