హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి గురించి వినాలి, లేదా చదవాలి. ఎవరికి హనుమంతుడి అనుగ్రహం కలగాలని స్వామి హనుమ భావిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ పని చేస్తారట. జీవన్ముక్తులు స్వామి శివానందగారు హనుమంతుడి గురించి చెప్పిన ఈ విషయాలను చదివి, స్వామి అనుగ్రహాన్ని పాత్రులుకండి.
ఓం శ్రీ హనుమతే నమః
----------------------------
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
శ్రీ హనుమంతులవారిని భారతదేశమంతా, రామ సహితంగా, లేక మాములుగానైన పూజిస్తారు. శ్రీ రాముడున్న ప్రతి ఆలయంలో హనుమంతుడుంటాడు. ఆంజనేయస్వామి శివుడి అవతారం. వాయుదేవుడికి, అంజనాదేవికి జన్మించారు. పవనసుతుడు, మరుతసుతుడు, పవనకుమారుడు, భజరంగబలి, మహావీరుడు అంటూ ఆయనకు అనేక నామాలున్నాయి.
శ్రీ రామనామం మూర్తీభవించిన స్వరూపం హనుమంతుడు. ఆయన ఆదర్శవంతమైన నిస్వార్ధ సేవకుడు, నిజమైన కర్మయోగి, నిష్కామంగా, వేగంగా కార్యాలు నిర్వర్తించాడు. ఆయన గొప్ప భక్తుడు, గొప్ప బ్రహ్మచారి. శ్రీ రాముడి నుంచి ఏమీ ఆశించకుండా, శుద్ధమైన ప్రేమతో, భక్తితో సేవించాడు. ఆయన జీవించిందే రాముడిని సేవించడం కోసం. ఆయన వినయవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి. దైవలక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతరలకు అసాధ్యమైనవన్నీ ఆయన చేసి చూపించాడు - రామనామం మహిమతో సముద్రాన్ని దాటాడు, లంకాదహనం చేశాడు, సంజీవిని మూలికను తెచ్చి, లక్ష్మణుని ప్రాణాన్ని నిలబెట్టాడు. పాతాళలోకంలో అహిరావణుడి చెరనుంచి రామ, లక్ష్మణులను తీసుకువచ్చాడు.
ఆయనకు భక్తి, జ్ఞానం, నిస్వాధ సేవాతత్పరత, బ్రహంచర్య బలం, నిష్కామం ఉన్నాయి. ఆయన తన బుద్ధి, వీరత్వం గురించి ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు.
'నేను వినయం కలిగిన రామదూతను. నేను ఇక్కడకు వచ్చింది రాముడిని సేవించడానికి, ఆయన కార్యం నెరవేర్చడానికి. రాముని ఆదేశం మేరకే నేను ఇక్కడకు వచ్చాను. రామానుగ్రహం వలన నాకు ఏ భయంలేదు. నేను చావుకు భయపడను. ఒకవేళ రాముని సేవలో మరణం వస్తే, దాన్ని స్వాగతిస్తాను' అని స్వామి హనుమ రావణునితో అన్నారు.
ఇక్కడ గమనించండి, హనుమంతుడు ఎంత వినయసంపన్నుడో! రాముని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో! 'నేను వీరుడైన హనుమంతుడను. నేను ఏదైనా చేయగలను' అని ఆయన ఏనాడు అనలేదు.
'నేను నీకు చాలా ఋణపడి ఉన్నాను ఓ వీరుడా! నీవు అద్భుతమైన, మానవాతీత కృత్యాలు చేశావు. నీవు ప్రతిఫలం కూడా ఏదీ ఆశించలేదు. సూగ్రీవునకు, అతని రాజ్యం అతనికి వచ్చింది. అంగదునకు పట్టాభిషేకం జరిగింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఏదీ అడగలేదు. సీతాదేవి నీకు ఇచ్చిన అమూల్యమైన హారాన్ని విసిరేశావు. నీ పట్ల నా ఋణాన్ని, కృతజ్ఞతను ఎలా తీర్చుకోను? నేను నీకెప్పుడు ఎంతో ఋణపడి ఉంటాను. నీవు చిరంజీవిగా ఉండే వరాన్ని ఇస్తున్నాను. అందరూ నిన్ను నాతో సమానంగా పూజించి, గౌరవిస్తారు. నీ మూర్తి నా ఆలయద్వారం వద్ది ఉండి తొలి పూజ అందుకుంటుంది. ఎప్పుడాఇనా సరే, నా కధలు, మహిమలు గానం చేసే ముందు నీ కధలు, మహిమలు గానం చేయబడతాయి. నేను చేయలేని పనులు కూడా నువ్వు చేయగలవుతావు' అని శ్రీ రాముడు ఆంజనేయస్వామితో అన్నారు.
ఆ విధంగా రాముడు సీతాదేవి జాడ కనుక్కుని లంక నుంచి వచ్చిన హనుమంతుడిని పొగిడినా, ఆయన కొంచం కూడా గర్వించలేదు. రాముడి కాళ్ళ మీద సాష్టాంగ పడ్డాడు.
ఓ వీరుడా! సముద్రాన్ని ఎలా దాటావు అని రాముడు అడిగాడు.
నీ నామం యొక్క శక్తి, వైభవం వల్లనే స్వామి అని హనుమ వినయపూర్వకంగా సమాధానమిచ్చారు.
మళ్ళీ రాముడు 'నువ్వు లంకను ఎలా కాల్చగలిగావు' అని అడిగారు.
నీ అనుగ్రహం వలననే స్వామి అని హనుమ సమాధానమిచ్చారు.
నమ్రత/ వినయం హనుమంతుని యందు మూర్తీభవిస్తున్నాయి.
ఎంతో మంది తాము చేసిన సేవకు ప్రతిఫలంగా సంపదను ఆశిస్తారు. కొందరికి సంపద అవసరంలేదు, కీర్తి, పేరు కావాలి. కొందరికి ఇవి కూడా అవసరంలేదు, కానీ పొగడ్తలు కావాలి. ఇంకొందరికి ఇవి అక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన పనులను ప్రచారం చేసుకుంటారు. హనుమంతుడు వీటికి అతీతుడు. అందుకే ఆయన్ను ఆదర్శవనతమైన కర్మయోగి అని, భక్తికి పరాకాష్టగా గుర్తించబడ్డాడు. ఆయన జీవితమంతా ఎన్నో సందేశాల సమాహారం. ప్రతి ఒక్కరు ఆంజనేయస్వామి వారిని ఉత్తమమైన ఆదర్శంగా తీసుకుని, అనుసరించేందుకు పూర్తి ప్రయత్నం చేయాలి.
ఆయన జయంతి చైత్రశుక్ల పూర్ణిమ నాడు వస్తుంది. ఆ రోజు స్వామిని పూజించడం, ఉపవాసం ఉండడం, హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం, రోజంతా రామ నామాన్ని జపించడం వలన హనుమంతుడు ఎంతో సంతృప్తి చెంది, మీరు చేపట్టిన కార్యాలన్నిటిలో విజయం ప్రసాదిస్తాడు.
హనుమంతులవారికి జయము జయము! ఆయన ప్రభువు, శ్రీ రామచంద్రులకు జయము జయము!!
- స్వామి శివానంద సరస్వతీ
(డివైన్ లైఫ్ సొసైటీ, ఋషికేశ్)
*భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు.
No comments:
Post a Comment