కృష్ణుని నిరాసక్తత
కృష్ణుడు పరమ జ్ఞాని కదా! అతనికి అహిక విషయాలపై మక్కువ ఉంటుందా? వెన్న దొంగలించడం మొదలైనవి అతని లీలలు మాత్రమే. అట్లాగే రాసలీల, గృహస్థ జీవనం, 16 వేల స్త్రీలతో కాపురం మొదలైనవన్నీ నాటకంలోని భాగాలు. కంసుని చంపిన తరువాత ఇతడు అభిషేకానికి అర్హుడే కదా! అతడే రాజు కావాలని ప్రజలందరూ ఉవ్విళ్లూరేరు. అతడు ఇష్టపడ్డాడా? ఉగ్రసేనుణ్ణి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఉగ్రసేనుడు అతని తాత. కంసుణ్ణి చంపి మధురను విడిచి కృష్ణుడు ద్వారకలో ఉండిపోయాడు. అప్పటి నుంచి అతడు ద్వారకాధీశుడు. అయినా రాజ్యాన్ని ఏలాలనే ఉబలాటం లేదు. తాను రెండవ స్థానంలో ఉండి బలరామునకు ఉన్నత స్థానమిచ్చాడు. అతడు పూర్ణావతారుడైనా వినయంతో నిస్పృహుడై ధనవాంఛ లేక కాలం గడిపాడు.
భాగవతం కూడా, క్షీరసాగర మథనంలో లక్ష్మి అవతరించినపుడు విష్ణువును పతిగా పొందటం, నిరాడంబరంగానే వర్ణించింది. డబ్బు, బంగారం పట్ల ఎట్లా మోజులేదో స్త్రీల పట్ల కూడా లేదు. లక్ష్మి అవతరించినపుడు దేవతలందరూ దండలు వేయబోతూ ఉంటే ఒకమూల ఏమీ పట్టించు కోకుండా ఉన్నాడు విష్ణువు. ఇట్టి మానసిక బలం ఉన్న విష్ణువునే వివాహమాడాలని భావించింది లక్ష్మి. అతని ప్రేమను చూరగొనాలని అతని మెడలో దండ వేసింది. అంగీకరించి తన వక్షః స్థలంపై ఉంచుకున్నాడు.
No comments:
Post a Comment