Saturday, 17 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (57)


నా తండ్రి స్వభావం నాకు తెలుసు. తనంతట తానియ్యడు. ముసలి తనంలో కలిగిన శిశువు కోసం దీనిని వేలాడదీసాడు. కనుక అడిగి నిరాశ చెందకు, యుద్ధానికే సిద్ధపడమని జాంబవతి హితోపదేశం చేసింది. అతనిపట్ల ప్రేమ చివురించి మ్రొగ్గ తొడిగింది. అతని గౌరవాగౌరవాలకు తానూ పాత్రురాలేనని సూచించింది.


ఇక శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. 


జాంబవంతునికి కృష్ణ స్పర్శ సుఖం 


జాంబవంతుడు మేల్కొన్నాడు. నేనేమో ముసలివాణ్ణని సులభంగా ఓడించవచ్చని భావించావా? అని జబ్బలు చరిచాడు. 


భగవంతునితో కయ్యానికి కాలు దువ్వాడు. జాంబవంతుని పరాక్రమాన్ని లోకానికి చాటాలని కృష్ణుడు, తన శక్తి నంతటినీ వినియోగించలేదు. సరిసమానంగానే యుద్ధం సాగింది.


యుద్ధం చేసేవాడు అనాటి రామచంద్రుడే అని గ్రహించలేకపోయాడు జాంబవంతుడు. భగవత్ శక్తిని ప్రకటించకుండా యుద్ధం కొనసాగిస్తున్నాడు కృష్ణుడు. వినోదంగా భావించాడు.


ముష్టియుద్ధాలు, సిగపట్లు మామూలే. తన దివ్య శరీర స్పర్శ సుఖాన్ని భక్తునకు కలిగించాలనే భావనతో యుద్ధాన్ని కావాలని పొడిగించాడు. రామావతార సమయంలో రాముణ్ణి కౌగిలించుకోవాలని జాంబవంతుడు అనుకున్నాడు. కాని ఆ కోరిక నెరవేరలేదు. పైకి ఆ కోరికను తాను చెప్పలేదు. రాముని శరీరం ఎట్లా ఉంటుంది? పట్టుకుచ్చులా ఉంటుందా? ఆ మెత్తని, ఉదారమైన మనస్సే నీలమేఘశ్యాముడై ఉంది. ఇక జాంబవంతుని శరీరం గరుకు గరుకుగా ఉంటుంది కదా. కనుక కోరికను వెల్లడించలేదు. ఒకవేళ అడిగినా రాముడంగీకరించడు. తన శరీర స్పర్శ సీతమ్మకే దక్కాలి. అతడేక పతివ్రతుడు కదా. అన్నీ విడిచి దండకారణ్య ఋషులే కౌగలింతనడుగగా ఈ అవతారంలో ఈ శరీరం సీతకే అంకితమని, కృష్ణావతరంలో మీ కోరిక తీరుస్తానని అన్నాడు. ఆ ఋషులే గోపికలుగా పుట్టారని ఉంది కదా. 


అట్లా అడగడం ఋషులకు చెల్లింది. జాంబవంతుడు అడగగలడా? ఋషుల మాదిరిగా ఇంకొక జన్మ నెత్తాలని కోరుకోలేదు. అందుకే జాంబవంతుణ్ణి చిరంజీవిని చేసాడు రామయ్య.

No comments:

Post a Comment