Wednesday, 21 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (61)

ఇక వీరిద్దరూ కూడబలుక్కున్నారు. తమ కిష్టమైన సత్యభామ, ఎట్లాగూ దక్కలేదు. ఇక మణిని అపహరించాలని పన్నాగం పన్నారు. దుర్మార్గుడైన శతధన్వునితో చేతులు కలిపారు.


అందరికీ సామాన్య శత్రువు సత్రాజిత్తే. ఇప్పుడు కృష్ణుడు లేడు, మనం వెళ్ళి సత్రాజిత్తును చంపి మణిని దొంగిలిద్దాం అనే నిశ్చయానికి వచ్చారు.


ఎదురుపడి యుద్ధం చేయడం కాదు. దొంగచాటుగా శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసాడు. మణిని దొంగిలించాడు.


ఇక సత్యభామ, తన భర్త హస్తినాపురం నుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు తెన్నులు చూసింది. తండ్రి మరణానికి రోదించింది. ఎప్పుడు శతధన్వుణ్ణి తన భర్త చంపుతాడా అని తహతహలాడింది.


రోగాలను పోగొట్టేది, భాగ్యాన్ని కల్గించే మణి, ఎన్ని కష్టాలను తీసుకొని వచ్చిందో గమనించారా? కష్టం వెంట సుఖం కష్టం తరుముకు వచ్చిందే! మణిని రక్షించాలంటే పరమ పవిత్రంగా ఉండాలి కదా! అందుకే సూర్యుడీ నియమాన్ని పెట్టాడు. దుష్టమైన ఆలోచనలు రాకూడదు. అందునా కృష్ణుని పట్ల అపచారమా? ప్రసేనుడు, శారీరకమైన అశుచివల్ల పోగొట్టుకున్నాడు. మానసికమైన అశుచివల్ల సత్రాజిత్తు పోగొట్టుకున్నాడు. చిరంజీవియైన జాంబవతుని దగ్గరే మణి కలకాలం ఉండలేదు. అతడేమో సింహాన్ని చంపాడు కదా! ఇట్టి చరిత్రను చూపించే మణి శతధన్వుడి దగ్గర కలకాలం ఉంటుందా? అతడు యజమానినే క్రూరంగా చంపి గ్రహించాడు కదా!

No comments:

Post a Comment