Sunday, 11 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (51)

జాంబవంతుడు


అక్కడొక గుహలో జాంబవంతుడున్నాడు. అతడు ఎవరనుకున్నారు? వానరులతో కలిసి రామునికి సాయంగా ఉన్నవాడే. ఆనాటివాడు ద్వాపరయుగం దాకా ఉన్నాడు.


రాముడు అవతార సమాప్తిలో ఆయోధ్యాపుర వాసులందరూ అతనితో వైకుంఠానికి వెళ్ళారు. హనుమ, జాంబవంతుడు తప్ప. వాళ్ళు ఎందుకాగిపోయారు? ఈ పాప పంకిలమైన భూలోకాన్ని రామనామ సంకీర్తనంతో వైకుంఠంగా మార్చడానికే హనుమ ఉండిపోయాడు. ఇది ప్రపంచానికి తెలియజెప్పడం కోసం చిరంజీవిగా రాముడుంచాడేమో! అట్లాగే లంకలో విభీషణుడు చిరంజీవిగా ఉంచాడు.


మనమేదో మానవజాతి గొప్పదని మురిసిపోతాం. మానవులు నిరంతరం తనను స్మరించలేరని భావించి వీరికి చిరంజీవిత్వం ప్రసాదించలేదు రాముడు. ఒక రాక్షసునకు, ఒక కోతికి, ఒక ఎలుగుబంటి ఇచ్చాడీ వరాన్ని.


అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ: 

కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః 


ఈ శ్లోకంలో జాంబవంతుడు లేడు. అయినా అతను చిరంజీవి. ఏదైనా చిరకాలం ఒక రంగంలో నిష్ణాతుడైతే అతణ్ణి జాంబవంతుడని అంటాం. 


అగస్త్యుడు, నిరంతరము 16 సంవత్సరాల ప్రాయంలో ఉండే మార్కండేయుడూ చిరంజీవులే. అయిన వీరీ శ్లోకంలో లేరు. 

No comments:

Post a Comment