Thursday, 1 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (41)

ఈ సందర్భంలో కామేశ్వరుణ్ణి ఒక్కణ్ణే రంగంలోకి దింపడం ఎందుకని తన కొడుకు గణపతి మహత్వాన్ని లోకానికి చాటడం కోసం కొడుకునూ రంగంలోకి దింపింది. తాను లలితాంబగానే ఉంటూ అమ్మవారు, కామేశ్వరుని ప్రీతిపూర్వకమైన చూపుతో చూసింది. ఆయన చిరునవ్వు చిందించాడు. ప్రేమ పూర్వకమైన చిరునవ్వుల కలయికచే మహాగణపతి ఆవిర్భవించాడు. అందమైన ఆనందప్రదమైన ముఖంతో మహాగణపతి సాక్షాత్కరించాడు. 


ఇట్లా వినాయకుడి అవతరణలు చాలా ఉన్నాయి. అందొకటి ఇది. లలితోపాఖ్యానం, బ్రహ్మాండ పురాణం లోనిది.


ఇక్కడ అమ్మవారు, ఈశ్వరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వడం వల్లనే ఇతడవతరించాడని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరః - లలితా సహస్రనామం


ఆవిడ ఏ దేవత శక్తినైనా ఒక్క నిమేషకాలంలో తగ్గించగలదు, విఘ్న యంత్రాన్ని నిర్వీర్యం చేయగలదు. కాని విఘ్నాలను నివారించడానికి విఘ్నేశ్వరుడు నియోగింపబడ్డాడు కనుక అతనికి అవకాశం ఇచ్చింది.


ధర్మానికి ఆమె ఎట్లా కట్టుబడిందో అట్లాగే ఆమెచే సృష్టింపబడిన విఘ్నేశ్వరుడు కూడా అహంకారం లేకుండా ఆమెకు సాష్టాంగ పడ్డాడు. అంతేనే గాని ఆమెకు చేతకాకపోవడం వల్ల తానీ పని చేసానని విర్రవీగలేడు. ఆమె ఆశీస్సులనందుకొని విఘ్న యంత్రాన్ని ఛేదించడానికి పూనుకొన్నాడు. 


అగ్ని ప్రాకారంలో ఒక మూలయంత్రం పూడ్చి పెట్టబడింది. స్వామి దానిని గుర్తించి తన దంతంతో ఛేదించాడు. వెంటనే శక్తి గణాలు మేల్కొన్నాయి. మరల వారి మనస్సులు కుదుటబడ్డాయి. భక్తితో ఆజ్ఞాపాలనతో ఉత్సాహంతో భండాసురుణ్ణి ఎదుర్కొని ఓడించారు. 

No comments:

Post a Comment