ప్రశ్న-సమాధానం; కథలో కథ
ఎవరో ఒకరు ప్రశ్న వేయడం, మరొకరు సమాధానం చెప్పడం అనే పద్ధతి పురాణాలలో ఉంటుంది. సాధారణంగా నైమిశారణ్యంలో సూతుణ్ణి మిగిలిన ఋషులు ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లాగే పరీక్షిత్తుకు శుకమహర్షి చెప్పడం భాగవతంలో ఉంటుంది. ఇక ఇతిహాసాలు చూస్తే మహోత్సవ గుణ సంపన్నుడెవరని వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు ముందుగా రామచరితాన్ని గానం చేసాడు. దానినే వాల్మీకి విస్తారంగా వ్రాసి లవకుశులకు చెప్పగా అశ్వమేధ మహామంటపంలో కూర్చొని యున్న రామునికి ఎదురుగా వారు గానం చేసారు. ఇక నైమిశంలో సూతునిచే మహాభారతం చెప్పబడింది. ఆదికావ్యంగా పరిగణింపబడిన రామాయణానికి, నైమిశం లో ఋషులు సంబంధం లేదు. భారత కథ వైశంపాయునుడు జనమేజయునకు చెప్పబడినట్లు గా ఉంది. జనమేజయుడు పాండవుల మనుమడు. దానిని ఇతిహాసంగా వ్యాసుడు మలచగా విఘ్నేశ్వరుడు వ్రాయసకాడయ్యాడు.
ఆ పెద్ద ఇతిహాసంలో భిన్న భిన్న వ్యక్తులు ప్రశ్నించగా నారదుడు, అగస్త్యుడు, మార్కండేయుడు, మొదలైనవారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలు చెప్పారు. రామాయణంలో ఉత్తరకాండను చూస్తే రావణ వంశానికి చెందిన అన్ని కథలు అగస్త్యుడు రామునకు చెప్పినట్లుంటుంది.
అగస్త్యుని ప్రశ్నకు హయగ్రీవుడిచ్చిన సమాధానమే లలితోపాభ్యాసం. అది బ్రహ్మాండ పురాణంలో ఉంది. భారతంలో చాలా ఉపాఖ్యానాలున్నాయి. పాండవులు వివిధ ఋషులు ప్రశ్నించడం, వారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలియ్యడం ప్రధానంగా అరణ్యపర్వంలో ఉంటుంది. చవితినాడు చంద్రుని చూస్తే దోషమేమిటని కృష్ణుడు వేసిన ప్రశ్న స్కాందంలో ఉంది. ఈ కృష్ణ నారద సంవాదానికి సమగ్ర సమాధానం నందికేశ్వర సనత్కుమార సంవాదంలో ఉంది.
No comments:
Post a Comment