భగవానుడు శతధన్వుని జుట్టు పట్టుకున్నాడు. కొంతసేపు ముష్టియుద్ధం జరిగింది. భగవానుని ముందు అతడు నిలబడగలడా? ఇతని చేతిలో చంపబడడం అతను చేసుకున్న అదృష్టం అనాలి. అట్లా పద్ధతి కల్గించాడు కృష్ణుడు.
ఇట్లా జాంబవంతుణ్ణి ఓడించడం, ఇతణ్ణి చంపడం జరిగినా నీలాప నిందలు మళ్ళీ మొదలు. మణికోసం అతని శరీరాన్ని తడిమితే దొరకలేదు. ఎందుకంటే అది అక్రూరుని దగ్గర ఉంచాడు కాబట్టి గీతలో భగవానుడేమన్నాడు?
వేదాహం సమతీతాని వర్తమానాని దార్జున
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన (7-28)
అనగా “ఓ అర్జునా! గతంలో ఏం జరిగిందో, వర్తమానంలో ఏం జరుగుతుందో, భావికాలంలో ఏం జరగబోతుందో అన్నీ నాకు తెలుసు. కాని నన్ను తెలుసుకొన్న వాడెవ్వడూ లేడు". ఇట్లా అన్నవాడే ఏమీ తెలియనట్లు నటించి శతధన్వుని దగ్గర మణి యుందని భావించాడు. మరొక అవతారమైన అన్నగారు దొరకలేదని నివేదించాడు.
ఇట్లా మానవులు వేసే నిందలను భరించాడు. అంతేకాదు అన్నగారి కోపాన్ని భరించాడు. అతని చంపాను, అతని దగ్గర మణి లేదన్న మాటలు అన్నగారు నమ్మారా? కారాలూ, మిరియాలు నూరాడు.
"నేనేదో మణిని అడుగుతాను నా దగ్గర బుకాయిస్తున్నావు ఎక్కడో దాచి వుంటావులే. ఋజుమార్గంలో వెళ్ళేవారు నీతో సఖ్యంగా ఉండలేరని" అన్నాడు.
"ఇట్లా నన్ను సందేహించకు, నువ్వే నన్ను శంకిస్తే ఎలా? నేను చెప్పింది నిజం. నన్ను వెదికి చూడు, నీకే తెలుస్తుంది” అన్నాడు కృష్ణుడు.
No comments:
Post a Comment