Friday, 14 February 2025

శ్రీ గరుడ పురాణము (347)

 


కఫ దోషం వుంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే.


ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాశ్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాతష్టిల, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేళ్ళు గల రోగాలుకూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే.


(అధ్యాయం 158)


ప్రమేహ రోగ నిదానం


ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబిటిస్ అనే అర్థం ఈయబడింది. ఈ గ్రంథంలో చక్కెరవ్యాధి అని కూడ వాడడం జరిగింది.


ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి. వీటిలో పది కఫ దోషం వల్ల, ఆరు పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలౌతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది.


* మలం వేడిగావుండి మూత్రం చింతపండు రంగులో యేలాం చేప వాసన వేస్తుంది - హరిద్రమేహ


* ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం - మంజిష్ఠమేహ


* మాంసం వాసనతో ఎఱ్ఱటి లవణాలతో ఎఱ్ఱటి రంగులోనే మూత్రం - రక్తమేహ


* తఱచుగా పడుతూ కొవ్వుతో కలసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం - వసామేహ


* మూలగతో కలిసి పడుతూ అదే రంగులో వుండే మూత్రం - మజ్ఞమేహ


* ధారాపాతంగా పడుతూ జిగటగా వుండే చీముతో కలిసిజారే మూత్రం - హస్తిమేహ


మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో వుంటుంది. ఈ మేహం రెండు రకాలు.


ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు (వాత)దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగలక్షణాలు కొన్నాళ్ళు పుష్కలంగా కనిపించడం కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్ళకు కనిపించడం అనగా బయటపడడం జరుగు తుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కానీ రోగం మాత్రం ప్రమాదకరస్థాయిని చేరుకొంటుంది.


ప్రమేహ వ్యాధులన్నీ, నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు.


కఫ దోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా వుండడం, దగ్గు, పడిశం బయట పడతాయి. అదే పిత్త జన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైనా పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండు తున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి.


వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం (గుద స్థానభ్రంశం) కంపము, గుండెనొప్పి ఘాటైన రుచులకోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిశం, దగ్గు


బయటికి తేలకుండా వుండే పుండ్ల ద్వారా పదిరకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్ఛపిక, జ్వాలిని, వినత, అలజి, మసూరిక, సర్షపిక, పుత్రిణి, విదారిక, విద్రధి.

Thursday, 13 February 2025

శ్రీ గరుడ పురాణము (346)

 


స్థూలంగా అతిసారం రెండు విధాలు. అవి సామ(చీముగలవి) నిరామ (చీము లేనివి) మొదటిరకంలో కంపు దారుణంగా వుంటుంది. మలంద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంటుంది. చొంగ కారుతుంటుంది. (నోరు) నిరామ రకంలో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి.


అతిసారను సకాలంలో నిరోధించకుంటే అది ప్రమాదించి, ముదిరి గ్రహణి అవుతుంది. వాతజగ్రహణి వచ్చినవారికి గుండెదడ, ప్లీహవాపు, మొలలు, కామెర్లు, మతిపోవుట, శబ్దంతో నిర్గమించే ఆవిరుల జిగట, గట్టి, పొడి మలం, వెక్కిళ్ళు, ఊపిరందక పోవుట, తఱచు విరేచనమగుట అను లక్షణాలు కనిపిస్తాయి.


పిత్తజ గ్రహణిలో విరేచనం పసుపు పచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో, పలచగా వుంటుంది. ఆమ్లపు పొక్కులు, గుండె, గొంతుల్లో మంటలు, అన్నద్వేషం, బాగా దప్పిక వుంటాయి.


కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్యా, మలం పోయినపుడు నొప్పి, వాంతులు, అన్నంగాని మరే ఆహారం గాని సహించకపోవడం, నోటిమంట మాటిమాటికి ఉమ్ముఊరడం, దగ్గు, చిరాకు, పడిశం, గుండె బరువు, కడుపుబ్బు, తీపిత్రేన్పు, బద్ధకం, రోమాంచము అనే లక్షణాలుంటాయి. ఇంకా, సన్నిపాత గ్రహణిలో, మలం చిక్కగా, ముక్కలుగా పడుట, మనిషి దుక్కగా వున్నా బలహీనంగానే కనబడుట కూడా జరుగుతాయి.


గ్రహణిని కుదుర్చుట అసాధ్యము తచ్ఛాంతిని చేయవచ్చు.


(అధ్యాయం -157)



మూత్ర ఘాత నిదానం


సుశ్రూతా! వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము ఈ ఆరు శరీరభాగాలూ ఒకదానికొకటి సంబంధితములై, ముడివడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి వున్నా ఎపుడూ నిండుగానే వుంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం ఒంపుతునే వుంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే ఇరవై రకాల రోగాలొస్తాయి.


మూత్రఘాతం (మూత్రం తొక్కిపట్టబడుట) మధుమేహం పైన చెప్ప ఆరు విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది గాని పోస్తున్నంతసేపూ లింగభాగం నొప్పెడుతునే వుంటుంది. పిత్త దోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపూ మంటగానే వుంటుంది. కఫప్రకోపంలో మూత్రం ఎఱ్ఱగా వుంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు వుంటుంది.


త్రిదోషాలూ కలిపి వుంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలూ, వీర్యమూ మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగ ఏర్పడతాయి. ఇది గోరోచనంలా వుంటుంది.


అశ్శరీ లేదా గోరోజనమను పేరు గల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధానపాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేనినొప్పి.


మూత్రం దానికోశంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపూ మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినపుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే వుంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది. ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం వుంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకీ లోనౌతాడు. మూత్రం తఱచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా వుంటుంది.

Wednesday, 12 February 2025

శ్రీ గరుడ పురాణము (345)

 


అతిసార గ్రహణి రోగాలు


శుశ్రుతా! నిజానికి అతిసార, గ్రహణిరోగాలు రెండూ నీళ్ళ విరేచనాలకి పెట్టబడిన పేర్లే. ఇవి ఆరు రకాలుగా వుంటాయి. త్రిదోషాలూ ఒక్కొక్కటిగానూ అంటే విడివిడిగానూ కలివిడిగాను నాలుగు రకాలౌతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు రెండు.


నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా తాగెయ్యడం ఈ జబ్బులకి సాధారణ కారణం. వాతం విచక్షణ రహితంగా తినే తిండి వల్లా, కొవ్వు వల్లా, వేపుడు వల్లా, పులుపు (మసాలా) ఘాటువల్లా, కొన్ని మొక్కల రెమ్మలు, గింజలవల్లా, సారా వల్లా, పగటి నిద్రవల్లా, మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్లా ప్రకోపించి వీటిని తెస్తుంది. వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని క్రింది భాగాలకు అతిగా ప్రసరణంగావించి జఠరాగ్నిని ఆర్పేస్తుంది. తరువాత జీర్ణవ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని మలాన్నీ కూడా పలచగా, ద్రవంలాగ చేసి పారేస్తుంది. ఛాతీనొప్పి, మలద్వారంలో బాధ, శరీరంలోపలి నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరం పై దాడిచేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు.


కడుపును నొక్కితే కొన్నిచోట్ల గట్టిగానూ, కొన్నిచోట్ల లోతుగా, మెత్తగానూ తగులుట, అజీర్ణము ఈ రోగలక్షణాలు. జ్వరం వుండదు. మలం చాలతక్కువగా పడుతుంది. అది కూడా ఎన్నో అవరోధాలను దాటుకొని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది. ధ్వని వుండదు. వాత ప్రకోప లక్షణాలివి. ఇంకా మలం గట్టిగా జిగటగా బుడగలతో నుండుట, మలద్వారా నికి కొంచెం పైన వుండే మాంసల ప్రదేశంలో మంట, కోసినట్లుండి నీళ్ళు తగిలితే మంట, ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తెఱచుకొనుట, ఒళ్ళు తఱచు గగుర్పాటుకు లోనగుట కూడా వాత దోష ప్రకోపజన్య అతిసార, గ్రహణి లక్షణాలే.


పిత్తజమైన అతిసారంలో మలం పచ్చగా, నల్లగా, చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై వుంటుంది. కంపు ఎక్కువగా వుంటుంది. రోగి అతి దాహంతో మందాగ్ని పీడతో, తల తిరుగుడు, మూర్ఛలతో బాధ పడుతుంటాడు. కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది.


కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి, మంట పెద్దగానే వుంటాయి. మలం దళసరిగా అంటే చిక్కగా, తక్కువగా, ఆగకుంగా కొంచెంగానే పడి ఆగిపోతుంది.


మూడుదోషాలూ కలిపివుండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశలవారీగా బయట పడుతుంటాయి. గగుర్పాటు, భరింపలేనంత నొప్పి, మూత్రాశయం, కడుపు గుహ్యం బరువెక్కిపోతుండుట, తెలివి తప్పదు కానీ చేసిన పని చేయలేదనుకొనేటంత మఱపు కమ్ముకొనుట కూడా జరుగుతాయి.


భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకొని వుండగానే విరేచనమైపోతుంది. వాయవు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది. దుఃఖం వల్ల వచ్చే ఈ రోగంలో వాత, పిత్త ప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి.

Tuesday, 11 February 2025

శ్రీ గరుడ పురాణము (344)

 



మూత్ర విసర్జన కష్టతరమౌతుంది. ఆలోచించడానికి కూడా బద్దకమేర్పడి తలదిమ్మెక్కి పోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యమూ కొరవడుతుంది. ఏం తిన్నా ఒకంతట అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకు పెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది. 


మూడుదోషాలూ కలిసిన మొలల లక్షణాలు ఇలా వుంటాయి. రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మట్టి లేదా గంజాయి చిగురుల్లా వుంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై వుంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తంపోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది.


రోగి శరీర వర్ణాన్నీ, బలాన్నీ, బుద్ధి నిలకడనీ కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురౌతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకు పోవడం జరుగుతాయి.


వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ళ విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి. దాహం, తలనొప్పి, పడిశం, ప్లీహవ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాతమొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు.


రెండు ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజన ముంటుంది గాని ఒకయేడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలయిన మొలలు ఏదో ఒక దోషం వల్ల యేర్పడితే, వెంటనే అయితే, సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు.


జననేంద్రియం పైగాని, బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా వుంటాయి. అలాగే వ్యానమను పేరు గల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి.


మొలలలో గరుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం, రంగులు, నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు. (అధ్యాయం-156)

Wednesday, 5 February 2025

శ్రీ గరుడ పురాణము (343)

 


ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలివుంటాయి. అయితే మల ద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రతా పెరుగుతుంటుంది. అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్ళి పోయి అన్ని జ్ఞానేంద్రియాలనూ, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడది వాత, పిత్తాలలో పగుళ్ళను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి.


రోగి బక్కచిక్కిపోతాడు, మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి, విరక్తుడై పోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది.


యక్ష్మవిషయంలో ఇదివఱకు చెప్పబడిన బాధలన్నీ ఈ రోగిని తాకుతాయి. సంధులన్నిటిలో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం, నోరు తడారిపోవుట, శ్వాసకృచ్ఛము, పడిశం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళునొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి నీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది.


తడిమొలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో వుండి వాచుట, పగులుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా వుంటాయి. ఎఱ్ఱగా గాని జేగురు రంగులో గాని వుంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా వుండవచ్చు. పగుళ్ళు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడ ఉంటాయి. కదంబ పుష్ప వర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా వుండవచ్చు.


ఈ రోగం పెరుగుతున్నకొద్దీ శరీరం, గోళ్ళు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ వుంటాయి. వాపు, గుండ్రంగా వుండి, జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. (ఈ పొక్కులను అస్త్రీలలంటారు)


పిత్త దోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో వుంటాయి. పోను పోను ఎఱ్ఱగా, నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటినుండి అరుణవర్ణంలో పలచగా వున్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా వుంటాయి. విరేచనం అజీర్ణంగా, పలచగా, ద్రవరూపంలో, ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దళసరిగా వుంటాయి. చర్మం, గోళ్ళు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి.


కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్ళూనుకొని వుంటాయి. దళసరిగా వుంటాయి. నొప్పి మిగతా రకాల కన్న తక్కువ పెడతాయి. తెల్లగా వుండి, కుళ్ళినట్లు కనిపిస్తూ, గుండ్రంగా, నున్నగా, నిటారుగా వుంటాయి. ఆవుపొదుగులా, వెదురు కొమ్మలా, జీడిపిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా వుంటుంది. తొడల సంధుల్లో నొప్పి, గుదంలో, మూత్ర కోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవుతుంది. శ్వాసలో ఇబ్బంది, పడిశం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి.

Tuesday, 4 February 2025

శ్రీ గరుడ పురాణము (342)

 


గుహ్యనాళం అయిదున్నర అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్ళవలె ఉండే మొలలు మూడున్నర అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆదారంట వెళ్ళే రక్తనాళాలీ మొలలకు తగిలి పగులుతాయి. తద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి.


సహజంగా, అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది వుండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలివైపు మొనదేలి, పాలిపోయిన పసుపురంగులో వుంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా వుంటాయి. 


ఈ మొలలు ఆరు విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలూ కలిసి కాని రెండేసి కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడిమొలలు వాత, కఫదోషాల వల్లా, తడిమొలలు పిత్త దోషం వల్లా ఏర్పడతాయి.


జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన - అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికీ నిమురు కోవడం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారి చేయడం, సహజమైన కోరికలను అణచుకోవడం, విరేచనాలు, మలబద్ధకం ఇలాటివన్నీ దోహకాలౌతాయి, కారణాలూ అవుతాయి.


అపానవాయువు కలత చెందినపుడు మలం పైకి పోయే దారిలో ములుకు ల్లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగుతుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నపుడు ఇబ్బంది కలిగి, మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం, అన్నద్వేషం, తల, తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ, పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్ళపై చిరాకు కలుగుతాయి.