Sunday, 30 August 2015

హిందూ ధర్మం - 173 (చంధస్సు)

చంధస్సు శాస్త్రం - ఇది వేదానికి కాళ్ళు వంటిది. వేదం చంధస్సు ద్వారానే నడుస్తుంది. వేదమంత్రాలను రక్షించడానికి, వాటిలో కొత్త పదాలను, అక్షరాలను చేర్చకుండా ఉండాటానికి, వేదం యొక్క యదార్ధస్వరూపాన్ని కాపాడటానికి, స్వరబద్ధంగా వేదాన్ని చదవటంలో దోషాలు దొర్లకుండా ఉండటానికి ఈ శాస్త్రం వచ్చింది. వేదమంత్రాల గతి తప్పకుండా ఉండటానికి, వాటిని సులువుగా జ్ఞాపకం ఉంచుకునేందుకు ఛంధస్సు ఉపయోగపడుతుంది. చంధస్సు అన్నప్పుడు ఇది వేదమంత్రాలను చదివే పద్ధతిని తెలిపేదిగా అర్దం చేసుకోవాలి. ఈ శాస్త్రం చాలా పెద్దది, సముద్రమంత విశాలమైనది. ఇందులోకి దిగడమే తప్ప, తేలడం ఎప్పటికో జరుగుతుంది, అది కూడ అతికొద్దిమంది పండితులకు మాత్రమే.

ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో, ఆ మంత్రాన్ని ఎంత సమయం చదవాలో, దానికున్న నియమాలేమిటో ఇది వివరిస్తుంది. వేదం మొత్తం చంధోబద్దంగానే ఉంటుంది. అందుకే అసలు వేదానికే చందస్సు అనే పేరు కూడా ఉంది. వైదికమైన ఛంధస్సుల గురించి వివరణ మొట్టమొదటగా సాంఖ్యాయన శ్రౌత సూత్రాల్లో కనిపిస్తుంది. కానీ దీనిమీద పూర్తి వివరణ ఇచ్చింది మాత్రం పింగళ మహర్షి. ఛంధః సూత్ర అనే తన గ్రంధం 8 వ అధ్యాయంలో మహర్షి పింగళుడు వీటిని ప్రస్తావించారు.

వేదపారాయణం వినడం వలన ప్రశాంతత లభించడం, దివ్యానుభూతులు కలగడం సంగీతం రోగాలను నయం చేయడం మొదలైన అనేక విషయాలను ప్రస్తావించినప్పుడు, ఛంధస్సు గురించి చెప్తారు. మొత్తం 7 రకాల ఛంధస్సులు వేదంలో ఉన్నాయి. అవి గాయత్రి, ఉష్ఠిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి ఛంధస్సులు. వాటికి వరుసగా షడ్జ, వృషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద అనే స్వరాలున్నాయి. వీటి నుంచే స, రి, గ, మ, ప, ద, ని అనే సప్తస్వర సంగీతం ఊపిరి పోసుకుంది.

వేదం అనగానే గుర్తుకు వచ్చేది యజ్ఞం. యజ్ఞంలో ఛంధస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేదమంత్రాలన్నీ ఛందోబద్ధాలు. ఏ ఫలితాన్ని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తున్నారు, ఏ కాలంలో, వాతవరణ పరిస్థితుల్లో చేస్తున్నరనే విషయాన్ని అనూరించి ఛంధస్సులను వాడతారు. ఛంధస్సు, వేదసంగీత ధ్వని స్వరాలకుండే ప్రభావశక్తిని ఋషులు పరిశీలించి అనేక పరిధులుగా విభజించారు. ఒక్కో పరిధిలో ఒక్కో ఛంధస్సు పని చేస్తుంది.  

To be continued ................ 

Saturday, 29 August 2015

కంచి పరమాచార్య సూక్తి


వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక, ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోకపరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్చగా అడుగుతారు. నాన్న వస్తువు కొన్నివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా, అమ్మ అడగగానే కొనిస్తుంది. అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు, ఆయన భార్య, తన భర్తకు చెడ్డపేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే, తానూ చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్నీ పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటవెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ అని పేరు.

వరలక్ష్మీ వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్థంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మీపూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు పూజలో పాల్గోనాలి. కధలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అర్ధం. ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు.

చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తిచేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి, సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో, నేర్పుతో మెలుగుతూ, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలాని శ్రీ మహాలక్ష్మీ భావించి, కలలో కనిపించింది. కధలో ఆమె పాత్రను గమనిస్తే, మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్నా, భక్తి, సదాచారం, ధర్మనిష్ఠ లేకపోతే, అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యుల మాట. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోకూడాదు. ధర్మం ఎప్పుడూ పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగ్యం చేస్తుంటే, కార్యాలయానికి వేళకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయతీగా శ్రద్ధతో, లోపరహితంగా చేయడం కూడా ధర్మపరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయక్కర్లేదు. నిర్ణీత పనివేళలో సరిగ్గా పని చేస్తే చాలు. అది కూడా ధర్మచారణయే అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు, అక్కడ చేయవలసిన పనే మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే, విద్య మీద దృష్టి ఉంచడం, ఋషుల సందేశలను తెలుసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, కోపతాపాలకు దూరంగా ఉండడం వారి స్వధర్మం. ఇవేమి చేయకుండా, కేవలం లక్ష్మీపూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము  అనుకునేవాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కధ ద్వారా గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వల్లనే.

అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రతవిధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగుపొరుగు వారందరికి తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్ధం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకునే ఆచారం లేనివారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్ళకు ఆహ్వానించి, వారొతో కలిసి వ్రతం ఆచరిస్తే, లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు, ఇరిగుపొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే, వారు ఏ కులం వారైనా సరే, వారిని మీ ఇంటికి పిలిచి, వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకధలో చారుమతి కూడా చేసింది.

అమ్మవారు కలలో కనిపిస్తే, దాన్ని కొట్టిపారేయలేదు చారుమతి. స్వప్నంలో చెప్పినట్టుగా ఆచరించింది. దీనిబట్టి అర్దం చేసుకోవలసిందేమిటంటే ఆమెకు శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధావిశ్వాసములు ఉంటాయో, వరు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారనేది ఈ వృత్తాంతంలోని గూఢార్ధం.

లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు స్వార్ధం త్యజించాలన్నది వరలక్ష్మీ కధ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు. పదిమందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడం నేర్పింది.

అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి. నిత్యం 'లోకాసమస్తాః సుఖినోభవంతుః' (సమస్త లోకాలు బాగుండలి) అని ప్రార్ధించాలి.

ఓం నమో లక్ష్మీనారాయణాయ        

Originally published: 07-August-2014
1st Edit; 29-August-2015

స్వామి వివేకానంద సూక్తి


Friday, 28 August 2015

వరలక్ష్మీదేవి వ్రత కథ

27-08-2015, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీవ్రతం సందర్భంగా వరలక్ష్మీ వ్రత కధ తెలుసుకుందాం.

వరలక్ష్మీదేవి వ్రత కథ:

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’.
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’.

పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.

‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.

చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా

అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు. 

తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి.వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.

Sunday, 23 August 2015

హిందూ ధర్మం - 172 (శిక్షా - 6)

ఇది కేవలం వేదాన్ని రక్షించడానికే కాదు, వేదపఠనం ద్వారా వచ్చే ఫలితాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.
సంహితాపాఠమాత్రేన యత్ఫలం ప్రోచ్యతే బుదైః
పదాతు ద్విగుణం విద్యాత్ క్రమేతుచ చతుర్గుణం
వర్ణక్రమే శతగుణం జఠాయంతు సహస్రకం

అంటూ సంహితాపాఠంలో చదివితే వచ్చే ఫలితానికి రెండు రెట్ల ఫలితం పదపాఠం వలన, క్రమపాఠం వలన నాలుగు రెట్ల ఫలితం, వర్ణక్రమం వలన వందరెట్ల ఫలితం, జఠాపాఠం వలన సహస్రరెట్ల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తున్నది.

ఒక్కసారి చేసిన ఘనాపాఠం, 13 సార్లు చేసే వేద పారాయణకు సమానం. మరియు అత్యంత ఫలప్రదం. ఘణాపాఠంలో మొదటి పదం, ఆఖరి పదం తప్పించి అన్ని పదాలు 13 సార్లు వస్తాయి.

ఈ విధంగా మొత్తం 153,826 పదాలున్న ఋగ్వేదాన్ని, 109287 పదాలున్న యజుర్వేదాన్ని అనేక కలియికలు, పాఠక్రమాలతో జత చేసి, వాటి మధ్య మంత్రాలను బిగించి, కొత్త పదాలు చేరకుండా, ఉన్నవి కోల్పోకుండా, భగవద్వాణి అయిన వేదాన్ని అట్లాగే రక్షిస్తూ, తరతరాలుగా వస్తోంది సనాతనసంస్కృతి. ఇదే ఈ సంస్కృతి గొప్పతనం, శిక్షాశాస్త్రం గొప్పతనం.

సనాతనధర్మానికి మూలస్థంభం వేదం. అది స్వచ్ఛంగా ఉంటేనే, ధర్మం స్థిరంగా ఉంటుంది. వేదం అనేది గ్రంధం కాదు, వేదమంత్రాలను గ్రంధాల్లో నిక్షిప్తం చేయడం గత 5,000 ఏళ్ళ క్రితమే మొదలైంది. వేదాన్ని పుస్తకాల్లో ముద్రించినా, అది పెద్దగా ప్రయోజనకారికాదు. వేదానికి స్వరం ప్రధానం. చదివే వ్యక్తి యొక్క సంస్కారం, మానసికస్థితి, శౌచం ప్రధానం.

ప్రపంచంలో వేదం, కొన్ని హిందూ ధార్మిక గ్రంధాలు తప్ప మిగిలిన అన్ని మతగ్రంధాలు మార్పులకు, చేర్పులకు లోనయ్యాయి. ఆయా సంస్కృతులే స్వార్ధప్రయోజనాల కోసం ధార్మికగ్రంధాల్లో అనేక విషయాలు చొప్పించారు. బైబిల్ అయితే ప్రతి ఏటా ఏదో ఒక మార్పుకు నోచుకుంటుంది. బైబిల్ అనేది దైవగ్రంధం, క్రైస్తవులకు పవిత్రగ్రంధమని ఆ మతస్థుల నమ్మకం. కానీ చరిత్ర గమనిస్తే, ప్రతి శతాబ్దంలో బైబిల్‌లో ఎన్నో కొత్తవిషయాలు ముద్రితమవుతున్నాయి, వారికి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్న విషయాలు, ఆధునిక పరిశోధనల్లో అబద్దమని తేలిన అనేక విషయాలు తీసివేయబడుతున్నాయి. అదేమీ ప్రపంచనాగరికతతో కలిసి పయనించేందుకు జరిగే మార్పులు చేర్పులు కావు. తమ గ్రంధం ఇంత అసంబద్ధంగా ఉందని ప్రపంచానికి తెలిస్తే, ఇక ఆ మాతంలోకి మార్పిడులు చేయడం కష్టమని, ఉన్నవాళ్ళు కూడా మతాన్ని విడిచిపెడతారని భయం. మాకు తెల్సిన ఒక వ్యక్తి దగ్గర గత 50 ఏళ్ళ ప్రతి ఏటా ముద్రితమవుతున్న బైబిల్ గ్రంధాలు ఉన్నాయి. వాటిని చూస్తే అర్దమవుతుంది, ప్రతి ఏటా దాన్లో ఎన్ని మార్పులు చేస్తున్నారో.

వేదం శాశ్వతమైనది, సత్యాలతో కూడుకున్నది. అటువంటి వేదం కాలానికనుగుణంగా మార్చవలసిన పనిలేదని గర్వంగా చెప్పుకోగలిగినవారు హిందువులు మాత్రమే. తమ ధర్మానికి పునాది అయిన వేదంలో మార్పులు చేయటం సాధ్యపడదని గర్వంగా ప్రపంచం ముందు చెప్పగలిగినవాడు ఒక్క హిందువు మాత్రమే.

To be continued ..............

బొడ్డుతాడును భద్రపరచడం - హిందూ సంప్రదాయం

గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. బొడ్డుతాడులో స్టెంసెల్స్ ఉంటాయని, దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ, స్టెం సెల్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనాదికాలం నుంచి ఉంది. దీనికి సనాతనహిందూ ధర్మమే మూలమైంది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, మంత్రించి, రాగి  తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఈ బొడ్డుతాడును భద్రపరిచే ప్రక్రియను హిందువులు కోల్పోయి ఉండవచ్చు. తద్ఫలితంగా ఇప్పుడు దాన్ని వెండిలో చుట్టించి భద్రపరచడం వరకు మాత్రమే మిగిలింది.ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఆంగ్లేయులు దేశం మీదకు దండెత్తేనాటికే మన దేశంలో అన్ని శాస్త్రాల్లో విశేషమైన పరిశోధన జరిగింది. దీనికి చిన్న ఉదాహరణ, రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసంలో చెప్పినది.

1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలో అమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు.
1. భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.
2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది.
మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి.

అయితే ఇప్పుడు మనం బొడ్డుతాడును వెండి తాయత్తులో చుట్టించి, మొలకు కట్టడం వెనుక కూడా విజ్ఞానం ఉంది. మొలతాడు వెండిది కట్టేవారు. ఇప్పుడు అది అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయమిది. లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించినవారు పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. దీనికి పెద్ద వివరణ ఇవ్వచ్చు. విషయంలోకి వస్తే, స్త్రీపురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి.  వాటి ఉష్ణోగ్రత సాధరణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. ఈ వృషణాలు, ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద, వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం, వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది.

బొడ్డుతాడులో ఉన్న స్టెం సెల్స్ ను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపరమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం స్టెం సెల్ బ్యాంకులు తెరవడం నిజంగా బాధాకరం. ధర్మం మీద, ఆయుర్వేదం మీద నమ్మకముండి, దేశభక్తి కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి, ఆయుర్వేదశాస్త్రంలో సనాతనధర్మం కోల్పోయిన ఈ స్టెం సెల్స్ వైద్యాన్ని తిరిగి పునరుద్ధిరించాలి.

స్వామి శివానంద సూక్తి


Thursday, 20 August 2015

సద్గురు శివానంద మూర్తి సూక్తి

కర్తవ్యం అంటే duty. ఇతరులకు మంచిమాటలు చెప్పాలి, చెప్పడం మన కర్తవ్యం, అంతవరకే. వాళ్ళు వింటారా లేదా అనేది వాళ్ళ ప్రారబ్దాన్ని అనుసరించి ఉంటుంది. వాళ్ళు ఆచరించలేదని బాధపడకూడదు. వాళ్ళను మనం ఉద్దరించలేము.
బాధ్యత అంటే responsibility. మంచిమాటలు వినడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టి, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎవరి విషయంలో వారు అలసత్వం వహించకూడదు.


Wednesday, 19 August 2015

రోజువారీ ప్రవర్తన - నాగదోషం

నాగపంచమి సందర్భంగా అందరూ నాగదేవతలకు పూజలు చేసి ఉంటారు. సర్పదోష నివారణ జరగాలని కోరుకుని ఉంటారు. నిజానికి సర్పదోషం కేవలం పామును చంపడం చేత మాత్రమే సంక్రమిస్తుందని శాస్త్రం చెప్పలేదు. సర్పదోషానికి పాములను చంపడం ఒక కారణమైతే, నిత్య జీవితంలో చేసే తప్పులు కూడా కొన్ని కారణాలు. అక్రమసంబంధాలు కలిగి ఉండడం, బహుభార్యత్వం, మద్యం సేవించడం, సిగిరెట్ త్రాగడం, మాదకద్రవ్యాలకు బానిసలవ్వడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారి బాగోగులు చూడకపోవడం, స్త్రీలను హింసించడం/ అవమానించడం, నిషిద్ధ, విరుద్ధ ఆహారాలు భుజించడం, గృహస్థులు శాస్త్రం చెప్పిన సమయంలో బ్రహంచర్యం పాటించకపోవడం, అవివాహితులు బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలిపెట్టడం వలన కూడా నాగదోషాలు సంక్రమిస్తాయి. అది ఆ వ్యక్తులనే కాదు, వారి వంశాన్ని సైతం బాధిస్తాయి. కనుక అటువంటి అలవాట్లకు దూరంగా ఉన్నవారు ధన్యులు. పైన చెప్పిన వాటిలో ఏవైనా దురలవాట్లు ఉంటే, వాటిని వదిలిచుకుంటాం అని సంకల్పం చేసినవారు మరింత ధన్యులు. అసలు అటువంటి ప్రవర్తన మా జీవితంలోకి రానివ్వమని సంకల్పం చేసినవారి మరీ మరీ ధన్యులు. అందరిపై నాగదేవత అనుగ్రహం కలగి సన్మార్గంలో పయనించుగాక.

Tuesday, 18 August 2015

త్రైలింగస్వామి సూక్తి


పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?

19 ఆగష్టు 2015, బుధవారం, శ్రవణ శుద్ధపంచమి, నాగపంచమి

నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.

ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో వాసుకిని.

• సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.

అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.
• ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.

ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి.  నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.

నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.

పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.

ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.

ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. నాగపంచమి, నాగులచవితికి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.

ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.

సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.

ఇటువంటి మరికొన్ని విషయాలను 2014  నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.  
నాగుల చవితి సందర్భంగా నాగదేవతలకు నివేదించవలసిన నైవేధ్యం గురించి, ఇతర వివరాల గురించి ఈ క్రింద లింక్‌లో చెప్పటం జరిగింది. నాగులచవితి అయినా, నాగపంచమి అయినా, నివేదన, నియమాలు ఒకటే. వాటిలో మార్పు ఉండదు.
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_26.html

Sunday, 16 August 2015

హిందూ ధర్మం - 171 (శిక్షా - 5)


సహజక్రమాన్ని అనుసరించని 8 రకాల కలయికలను కూడా అందించారు మహర్షులు. వీటిని వికృతి అన్నారు.
జటామాలా శిఖా రేఖా ధ్వజో దణ్డొ రథోఘనః |
ఇత్యాష్టా వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః||

జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజా, దండ, రథ, ఘనా అనేవి అష్ట వికృతులు. వీటిన్నటిలో జటా, ఘనాలు మాత్రమే దక్షిణ భారతదేశంలో కృష్ణయజుర్వేద శాఖలో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరభారతదేశం, ముఖ్యంగా బెనారస్‌లో శుక్ల యజుర్వేద శాఖలకు చెందిన అష్టవికృతులు ఉన్నాయని చెప్తారు. కానీ చరిత్ర గమనిస్తే, దుష్ట జీహాదీల దండయాత్రల్లో వైదికసంప్రదాయం ఎన్నో కష్టాలు పడింది. తరతరాలుగా వస్తున్న వైదిక గురుకులాలను ధ్వంసం చేసి, అందులో విద్యార్ధులను, గురువులను క్రూరంగా చంపారు అప్పటి ఇస్లాం విద్వంసకారులు. ఈ దాడులతో ఉత్తరభారతదేశంలో వేదానికి చెందిన అనేక విద్యలు చాలావరకు సమూలంగా నాశనం చేశారు. దక్షిణభారతదేశంలోని అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైదిక పరంపర కొనసాగుతూ వచ్చింది. అది కూడా పైన చెప్పిన పద్ధతుల్లో ఒకటి, లేదా రెండు పద్ధతులు మాత్రమే మిగిలాయి. ఆంగ్లేయులైతే మరీ దారుణం. క్రైస్తవవ్యాప్తి కోసం స్వరంతో వేదం పలికే పండితుల స్వరపేటికల్లోకి మండుతున్న ఇనుపచువ్వలు గుచ్చి, ధర్మంపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. జీహాదీల దాడులను సైతం తట్టుకుని నిలబడ్డ అనేక వైదిక గురుకులాలను సమూలంగా తుడిచివేశారు. దాని కోసం చట్టాలు కూడా చేసి, తమ అక్రమాలను, దారుణాలను చట్టబద్ధంగా చేసే యత్నం చేశారు.

జటా పాఠం

ఒకే వరుస క్రమంలో 6 పదాలుంటే జటా పాఠంలో a-b-b-a-a-b;  b-c-c-b-b-c; c-d-d-c-c-d; d-e-e-d-d-e; e-e-f-f-e; ................. ఇలా చదువుతారు. ఆ పాఠాన్ని గమనిస్తే, ముందుకు-వెనక్కు-ముందుకు పదాల క్రమం ఉంటుంది. స్త్రీలు తమ జడను అల్లుకున్న విధంగా ఉంటుంది కనుక ఈ పాఠాన్ని జటాపాఠం అన్నారు.

ఇది జటాపాఠం :
ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం |
సం వదంతే వదంతే సం సం వదంతే |    
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన |
సోమేన సహ సహ సోమేన సోమేన సహ |
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

మాలా పాఠాలు రెండు రకాలు 1) క్రమ మాల, 2)పుష్పమాల. ఇవి క్రమపాఠాన్ని పోలి రెండు పదాలను కలుపుతూ ఉంటాయి. శిఖా పద్ధతి జటా పద్ధతికి దగ్గరగా ఉన్నా, శిఖలో రెండు పదాలకు బదులు మూడు పదాలను కలిపి, ముందుకి-వెనక్కి చదువుతారు. రేఖా, ధ్వజ, దండ, రథ పాఠాలా పారాయణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రథాలో కూడా ద్విపాద, త్రిపాద, చతుష్పాద అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ద్విపాద, చతుష్పాద పద్ధతులు ఈ రోజు విరివిగా ఉపయోగిస్తున్నారు.

అన్నిటిలోకి ప్రముఖమైనది, అత్యంత కష్టమైంది, మంచి ప్రాముఖ్యం సంతరించుకున్న పద్ధతి ఘనాపాఠం.ఈ విద్యలో ప్రావీణ్యం పొందినవారిని ఘనాపాఠీ అంటారు. ఇక్కడ పదక్రమం గంట ఆకారాన్ని సంతరించుకుంటుంది.

ఉదాహరణకు, a-b-c-d-e-f అనేవి పదసమూహం అనుకుంటే ఘనాపాఠంలో a-b-b-a-a-b-c-c-b-a-a-b-c; b-c-c-b-b-c-d-d-c-b-b-d అని చదువుతారు.

ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం వదంతే
వదంతే సం ఓషధయః ఓషధయః సం వదంతే |
సం వదంతే వదంతే సం సం వదంతే సోమేన
సోమేన వదంతే సం సం వదంతే సోమేన |
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సహ
సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ|
సోమేన సహ సహ సోమేన సోమేన సహ రాజ్ఞా
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||

పైన గమనిస్తే, సంహితలో 6 పదాలుంటే, ఘనాపాఠంలో అవి 60 పదాలుగా మారాయి. అనగా పదిరెట్లు పెరిగాయి. దీని బట్టే అర్దం చేసుకోవచ్చు, పెద్దపెద్ద మత్రాలను ఉచ్చరించడం ఎంత కష్టమో!! దీని ఆధారంగా ఘనాపాఠికి వేదం యందు ఎంత ప్రేమ ఉందో, దాన్ని కాపాడాలన్న పట్టుదల ఎంతగా ఉందో, ఆయన ఏదో మౌఖికంగా కాకుండా హృదయంతో నేర్చుకుని, ఘనక్రమం తప్పకుండా చదువుతున్నారో అర్దం చేసుకోవచ్చు.

ఘనాపాఠం గురించి అవగాహన కోసం శృంగేరి పీఠంలో రుద్రాభిషేక సమయంలో ఘనాపాఠీలు చదివిన రుద్రఘనాపాఠం ఈ లింక్‌లో వినవచ్చు. ఘనాపాఠం వినడం కూడా ఎంతో శాంతిని ఇస్తుంది.

https://www.youtube.com/watch?v=XiB3-uIkuPwTo be continued ................

Saturday, 15 August 2015

అరబిందో సూక్తి


భారతదేశ సేవ గురించి స్వామి వివేకానంద సూక్తి


స్వాతంత్ర దినోత్సవం - సద్గురు శివానందమూర్తి సందేశం

ఈ సంస్కృతి మనకు ఏం చెప్తోంది, అది చెప్పినట్టు మనము జీవిస్తున్నామా? ఈ సంస్కృతి మనలని ఎలాగ జీవించమని అభిలషిస్తున్నదో, మనమట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం భారతదేశ చరిత్రలో పూర్వం కంటే ఎక్కువగా నేడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన తప్పు ఎమైనా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి.......... చాలా పాతది కాబట్టి సనాతనధర్మం, రాముడు ఆయన వంశంలో 62వ తరం వాడు, ఆయన వంశకర్త కూడా ఈశ్వరుడిని ఆరాధించాడు, ధర్మాన్ని పాటించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని ఈ విధంగా జీవించమని నిరూపించి చూపింది మహర్షులు కాబట్టి ఆర్షధర్మం. భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మం............ ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒక్కటే. దాంట్లో అది మనల్ని ఏమని అంటోంది, మనమట్లా జీవిస్తున్నామా అని తలుచుకుంటే అసలు ఏదో ఒక విషయంలో మనం మరిచాం, మరిచిపోయామ అనే సందేహం కలుగుతుంది. భారతదేశాన్ని ఒక మారు మనం చిన్నచూపు చూసినట్లైతే 1,000 సంవత్సరాల నుంచి ఆపదలకు గురైంది. వేయి సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేకమంది దండయాత్రలు చేశారు, ధ్వంసం చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసిన దండయాత్రలవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైన వేరే దేశం మీద దండయాత్ర చేస్తే, ఆక్రమిస్తాడు, ధనం కొల్లగొడతాడేమో కానీ ధర్మం మీద ద్వేషంతో రాడు. కానీ అలా జరిగిందిక్కడ. దాని తర్వాత అనేక విషయాలతో ప్రభావితమైనాం. మెల్లమెల్లగా అనేక నాగరికతలు, సిద్ధాంతాలు లోపల, బయట ఉత్పన్నమైనాయి. బాహ్యం నుంచి కూడా అనేక సిద్ధాంతాలు మన మీద దాడి చేశాయి. లోపల కూడా విపరీతార్ధాలు కలిపించుకుంటూ, నేను కొత్త మార్గాన్ని కనిపెట్టాను, నేను కర్తని, కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతనధర్మ మార్గానికి కూడా కొత్త లయలు సృష్టించి చెప్పారు కొందరు భౌద్ధం, జైనం మొదలైనవి ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతనధర్మం దానిలో ఒక చేర్పు గానీ, మార్పు గానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, దానికి ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంసకు ఒక  కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో జరిగిన/గడిచిన చెడ్డకాలం మళ్ళీ రాదు, అత్యుత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాల్లో ఈ దేశం అనుభవించిన ఘోరమైన విపత్తులున్నాయే ........... అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి, అంతటా వ్యాపించిన ఈశ్వర సంకల్పం చేత ప్రకృతైనా వైపరీత్య ధోరణి తీసుకుంటుంది, మరో శత్రువైనా వచ్చి మనలని శిక్షిస్తాడు. ఏదో జరుగుతుంది, మనం కష్టాలు పడక తప్పదు. ఏం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం సులభం కాదు, 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై, అవమానాలకు గురై, స్త్రీలు అక్షేమంతో కష్టపడి, దోపిడీలకు గురై......... ఏం అపరాధం చేసింది భారతదేశం? అది పెద్ద ప్రశ్న. పుస్తకాలు, చరిత్ర చదివితే సరిపోదు, ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశానికి ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో లోపం జరిగింది, పెద్ద తప్పులు చేశాం .............................

ఏదో పరాయిపాలన నుంచి స్వాతంత్రం వచ్చిదనుకున్నాం. అధికారమార్పిడి జరిగింది కానీ ధర్మం జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అనేది ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి దోహదక్రియగా ఉన్న దానిపేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటాననుకున్న వాడికి అవమానం జరగకూడదు, క్షేమం జరగాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం. అట్లా రావలంటే ఎంతో సార్వజనీనమైన అంతఃకరణశుద్ధితో కూడుకున్న స్వాతంత్ర్యం రావాలి, అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు భారతదేశం స్వాతంత్రం పొందుతుంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉన్న భారతభూమి మూడు ముక్కలైంది. అయినా పండుగ చేసుకుంటున్నాం మనం!? 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహాదుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా, జెండావందనం చేసి పండగ చేసుకుంటున్నామంటే ........ ఈ పండగ నిజమే, వారిని విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది ఏ మాత్రం క్షంతవ్యం కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి.

సద్గురు శివానందమూర్తి


Friday, 14 August 2015

స్వాతంత్ర దినోత్సవం - సద్గురు మలయాళ స్వామి వారి సందేశం

సద్గురు మలయాళ స్వామి వారి స్వాతంత్ర సందేశం

1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం లభించింది. సెప్టెంబరులో ఒక సందేశం ఇస్తూ స్వామి వారు ఇలా అన్నారు ..............

"గతమాసము 15 వ తేదీన స్వరాజ్యము వచ్చినందుకు దేశమంతటా ఆబాలవృద్ధము మహానందముగా ఉత్సవాలు, ఉపన్యాసాలు, దానధర్మాలు జరిపారు. ఇవన్నీ శుభసూచనలే. రోగ పీడితుడు రోగ విముక్తి కలిగినప్పుడు ఎలా ఆనందం పొందుతాడో, అలా మాత్రమే జరిగినది. కానీ దేనివలన రోగము కలిగినదో, ఆ కీలకము (కారణము) తెలుసుకుని మెలిగినపుడే మరల ఆరోగ్యహాని కలగదు. దీనిలో రహస్యమిదే......... ప్రజలలోనూ, పాలకులలోనూ ఐకమత్యము లేనందువల్లనే పతనము సభవించినదని కొందరు తెలియజేసినా అది చాలదు. ఇంకోక ముఖ్యకారణం కూడా ఉంది. అదే వర్ణాశ్రమ ధర్మాలను ఆధారంగా చేసుకుని కొన్ని జాతులకు మాత్రమే శాస్త్రపఠనమునకు, అస్త్ర శస్త్రములు ధరించి యుద్ధం చేయుటకు అధికారము కలిపించుట. శారీరిక, మానసిక ప్రజ్ఞలను అనుసరించి సర్వజనులకు, వారికి అనుగుణమైన కార్యములలో ప్రవేశం ఏర్పడాలి. అప్పుడే భారతమాతను బంధించిన పిశాచము వదిలిపోతుంది".  - సద్గురు మలయాళ స్వామి

--------------------------------------------
నిజానికి అప్పటితో మన నాయకులు కులవ్యవస్థను అంతం చేయాల్సింది. కానీ దాన్ని చట్టబద్ధం చేశారు, ఇప్పుడు మతం మారే అవకాశం ఉంది కానీ, కులం మార్చుకునే అవకాశం లేదు. ఒకప్పుడు ఏ కారణం చేతనో వచ్చిన ఈ జన్మ ఆధారిత వర్ణవ్యవస్థ సమాజంలో స్వాతంత్రం తర్వాత బలంగా పాతుకుపోయి, హిందువుల్లో అనైక్యతకు కారణమవుతోంది. అలా కాక వేదం చెప్పిన గుణకర్మల ఆధారిత వర్ణవ్యవస్థ మాత్రమే దేశాన్ని తిరిగి పరిపుష్టం చేయగలదు.

శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన

శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది.

పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేధ్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేధ్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన. ఈ పూజ చేయడం వల్ల ఎంతోమందికి కోరిన కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నేరవేరాయి.

ఓం నమో వేంకటేశాయ
-------------------------------------------------------------------------------------
సాధారణంగా మామూలు రోజుల్లో దీపారాధన ఎలా చేయాలో, దాని నియమాలేంటో ఈ లింక్ లో చెప్పడం జరిగింది.
http://ecoganesha.blogspot.in/2014/01/blog-post.html

Wednesday, 12 August 2015

భారత్ గురించి సదాశివ గోల్వాల్కర్


స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యర్ధన

దేశహితం కోసం జపనీయులు పెద్దగా ఉండే మన బాస్మతి బియ్యాని విడిచిపెట్టి, చిన్నగా వివిధ రకాల్లో ఉండే తమ బియ్యాన్ని తింటున్నప్పుడు, మన దేశం కోసం మనం ఫిలా, రిబాక్, ఎడిడాస్, నైక్, ప్యూమ, లీ, లెవిస్ మొదలైన విదేశి కంపెనీల సామాన్లు, ఫోర్డ్, హుండాయ్, షెవర్లె, యమహా, హోండా, సుజుకి, వోక్స్ వేగన్, ఫియట్ వాహనాలు, ఎల్జీ, సోని, సాంసంగ్, ఫిలిప్స్, నోకియా ఉపకరణాలు, కాల్గేట్, క్లోజ్అప్, పెప్సోడెంట్ టూత్‌పేస్ట్ లు వదలిపెట్టలేమా? ఇదేనా మన దేశభక్తి, దేశం పట్ల ప్రేమ? ఇప్పుడు లక్షల మంది దేశం కోసం ఇలా చేస్తున్నారు, కానీ మీ దేశభక్తి 15 ఆగష్టు, 26 జనవరి కే పరిమితమైందా? కాస్త ఆలోచించండి. మీ కోసం, మీ దేశహితం కోసం మారండి. స్వదేశి వస్తువులే వాడండి, దేశాన్ని కాపాడండి.   జై హింద్, వందేమాతరం   స్వదేశీ జాగరణ్ మంచ్

Tuesday, 11 August 2015

భారత్ గురించి రోమైన్ రోలాండ్


దేశరక్షణ కోసం సుబ్రమణ్యారాధాన

గత కొన్నెళ్ళుగా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ మధ్య అయితే మరీ తెగించింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు గ్రామాల్లో ఉండే పౌరుల మీద, సైనికుల మీద కాలుపు జరుపుతూ దాడులు చేస్తున్నారు. గత పదేళ్ళలో ఎప్పుడు పాక్ కాల్పులు విరమణ ఉల్లగించినా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ విధానాల వలన భారత సైన్యం తిరిగి స్పందించేది కాదు. స్పందించవద్దని, మౌనంగా ఉండమని అప్పటి ప్రభుత్వ ఆదేశం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్చేచ్చనిచ్చింది. ఫలితంగా భారత సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది. అయితే తిప్పికొడితే సరిపోదు. తగిన సమాధానమివ్వాలి. అది వేరే సంగతి. కానీ ఇప్పుడు పాక్ చేస్తున్నదేమిటంటే ఒక పక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అటువైపు సైన్యం దృష్టి మరల్చి, ఇంకో పక్క అక్రమంగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతోంది. భారతదేశానికి పాకిస్థాన్‌తోనే కాక, అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అనేకశక్తులు భారతదేశాన్ని విఛ్ఛినం చేయాలని చూస్తున్నాయి. అందుకు పధకాలు వేసి అమలు చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ పధకరచన చేసిన శక్తులు విదేశివైతే, వాటిని అమలు పరుస్తున్నది మాత్రం భావదాస్యంలో కూరుకుపోయిన భారతీయులే. కొందరు సంఘసంస్కర్తలు గా, కొందరు దేశభక్తులుగా, కొందరు సేవాభావం ఉన్నవారిగా, రాజకీయనాయకులుగా, మతపెద్దలుగా ముసుగు వేసుకుని చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇంటలిజెన్స్ విభాగం సైతం పసిగట్టలేని విధంగా చాపకింద నీరులా దేశ విద్రోహ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మనవాళ్ళే మనకు శత్రువులుగా పని చేస్తున్నారు. కొందరు తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక చేస్తున్నారు.

మరి ఇటువంటి సమయంలో దేశభక్తి కలిగిన పౌరులుగా దేశానికి మనమేం చేయగలం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందు పౌరుల మనసు సంఘవిద్రోహ శక్తులకు లోబడకుండా ఉండాలి. అలా జరగాలంటే దైవబలాన్ని పెంచాలి.
అప్పుడు దైవీశక్తులు జనం యొక్క మనసును మంచిమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తాయి. దుష్టభావాలను తగ్గిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి దేవసేనలకు అధిపతి. ఆయనే దేవతాసైన్యానికి నాయకుడు. ప్రతి రోజు ప్రతి పౌరుడు కనీసం 108 సార్లు శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని జపించి ఆ శక్తిని దేశానికి ధారపోస్తే, భారతసైన్యానికి అంతులేని దైవబలం పెరుగుతుంది. సైన్యానికేకాదు ఇంటలిజెన్స్ విభాగం వారికి ఆ శక్తి సహాయపడి కుట్రలను భగ్నం చేసే శక్తిని, మేధస్సును ఇస్తుంది. దాంతోపాటు శత్రువుల మనసులో దైవీశక్తులు భయాన్ని కలిగిస్తాయి, ఫలితంగా శతృసేనల బలహీనపడతాయి. దైవీశక్తుల బలం పెరిగిందంటే దుష్టశక్తుల బలం క్షీణిస్తుంది.కనుక దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు కనీసం 108 మార్లైన జపం చేయండి. అంతకంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. యుద్ధం వస్తే, చేయాల్సిందే. కానీ యుద్ధం చేసేది సైన్యం కదా, మరి మనమేం చేయాలంటే, దానికి సమాధానమే ఈ మంత్రజపం. ఇది చేయడం వలన దేశనికి రక్షణ కలగడమే కాక, మనం సంఘవిద్రోహశక్తులకు పావులుగా మారకుండా ఉంటాము. మనకూ రక్షణ కలుగుతుంది. ఇన్ని కోట్లమంది కోసం చేస్తున్నారు కనుక త్వరగా కర్మ తీరిపోతుంది.

ఇదే సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే
మహాసేనాయ ధీమహి
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్

Sunday, 9 August 2015

హిందూ ధర్మం - 170 (శిక్షా - 4)

సరైన రీతిలో ఉఛ్ఛరించే క్రమం కూడా వేదాంగం తెలిపింది.

శిక్షాం వ్యాఖ్యాస్యామః| వర్ణస్వరః| మాత్రాబలం|
సామ సంతానః| ఇత్యుక్త శిక్షాధ్యాయః||

అనగా శిక్షా శాస్త్రము వర్ణముల (అక్షరములు) గురించి, స్వరం గురించి (ప్రధానంగా మూడు స్వరాలు ఉన్నాయి. అనుదాత్తము - తక్కువ స్వరంలో చదవడం, ఉదాత్తము - గట్టిస్వరంలో చదవడం, స్వరితము (క్రమానికి అనుగుణంగా పెంచి, తగ్గించి చదవడం), మాత్రా (పాఠక్రమాన్ని అనుసరించి సమయానుకూల శృతితో చదవడం, ఒక అక్షరాన్ని ఎంత సమయం పలకాలో అంత సమయం మాత్రమే పలకడం) (prosodial unit of time), బలం (స్వర ఉఛ్ఛారణలో ఉపయోగించాల్సిన బలం), సామ (క్రమపద్ధతి పాటించడం) (uniformity), సంతానః (పాఠనా క్రమంలో కొనసాగింపు) (continuity) గురించి వివరిస్తుంది.

ఉదాత్తము, అనుదాత్తము, స్వరితములే కాక వేదపఠనం నేర్పే క్రమంలో చేతులను, తలను పైకి, క్రిందకు కదిలిస్తూ కూడా నేర్పిస్తారు. వీటివలన వేదపారాయణలో ఎక్కడా అపస్వరం దొర్లకుండా ఉంటుంది. ఒకవేళ అటువంటిది జరిగినా, చేతి కదలికలను అనుసరించి దాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు.

వేదం ఈశ్వరీయం, కాలాతీతం, పరమప్రామాణికం, పవిత్రం. అటువంటి వేదమంత్రాలను భగవానుడు ఎలా అందించాడో, అలాగే వాటిని కాపాడేలా అనేక పద్ధతులను ఉపయోగించారు. ఈశ్వరప్రసాదిత వేదంలో ఒక్క అక్షరం ముక్క కూడా మారకుండా, కొత్తది చేర్చబడకుండా తరం నుంచి తరానికి పరంపరగా వచ్చేందుకు వీలుగా అనేక క్రమాలను, combinations ను ప్రవేశపెట్టారు.

ప్రధానమైన మంత్రాన్ని వ్యాక్యం అని, లేదా సంహితాపాఠం అని అన్నారు. ఇందులో అనేక పదములతో కూడిన మంత్రం ఉంటుంది.దాని ప్రతి పదాన్ని విడగొట్టి 'పద పాఠం' అన్నారు. ఇది విద్యార్ధికి ప్రతి పదానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత వచ్చేది క్రమపాఠం, ఇందులో మంత్రంలోని మొదటి పదాన్ని, రెండవపదానికి, రెండవపదాన్ని మూడవపదానికి, మూడిని నాలుగుకు, ఇలా జోడిస్తారు. ఈ పద్ధతి వలన విద్యార్ధికి విడివిడిగా ఒక్కో పదం యొక్క అర్దం తెలియడమే కాక, పారాయణ క్రమంలో పదాలను ఎలా జోడించాలి, దాని ఫలితంగా స్వరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి అనేవి బోధపడతాయి. పదపాఠం, క్రమపాఠాల్లో పారాయణ చేయడం వలన సంహితా పాఠంలో చెప్పబడిన పదాల యొక్క సహజక్రమం కాపాడబడుతుంది. అందుకే వీటిని ప్రకృతి అన్నారు. అనగా వేదం యొక్క సహజత్వాన్ని కాపాడేవి అని.

ఉదాహరణకు a-b-c-d-e-f అనే పదాలు సంహితపాఠంలో ఉంటే, పదపాఠంలో వాటిని విడివిడిగా ఏ పదానికి, ఆ పదంగా a, b, c, d,e, f అని చదువుతారు. క్రమపాఠంలో a-b, b-c, c-d, d-e, e-f  అని చదువుతారు. క్రమపాఠ పారాయణంలో ప్రావీణ్యం పొందిన పండితుడిని 'క్రమవిత్' అంటారు.

ఒక్కో పాఠంలో మంత్రాలు ఎలా ఉంటాయో, చిన్న ఉదాహరణలో చూడండి.

సంహితా పాఠం
ఓషధయః సం వదంతే సోమేన సహరాజ్ఞా ||

పదపాఠం
ఓషధయః| సం| వదంతే| సోమేన| సహ| రాజ్ఞా||

క్రమపాఠం
ఓషధయః సం| సం వదంతే| వదంతే సోమేన|
సోమెన సహ| సహ రాజ్ఞా| రాజ్ఞేతి రాజ్ఞా||

To be continued ......................

ఈ రచనకు సహకరించిన పుస్తకం.
శృంగేరీ పీఠం వారి Vedic Chanting 

Saturday, 8 August 2015

భారతదేశం గురించి మార్క్ ట్వైన్


భారతీయ చేనేత, హస్తకళా నైపుణ్యం - రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసంనిన్ననే తొలి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచంలో ఎక్కడాలేని అద్భుత కళానైపుణ్యం మన చేనేత పరిశ్రమకే లభ్యం. అసలు భారతీయ చేనేత, హస్తకళా నైపుణ్యం గురించి మీకు తెలుసా? చేనేత మగ్గం గురించి చరిత్రలో బ్రిటన్ అధికారులు ఏమన్నారో తెలుసా?

రాజీవ్ దీక్షిత్ గారు తమ ప్రసంగాలలో చెప్పిన అద్భుతవిషయాలు.

టవర్నీ
ఫ్రాన్స్ చరిత్ర కారుడు 1750
1. భారతీయ వస్త్రాలు చాలా మృదువుగా వుండేవి. చేతితో పట్టుకుంటే బరువు తెలిసేది కాదు.
2. కుట్టిన జాడలు కూడా కనిపించేవి కావు. ఢాకా, మాల్వా, సూరత్ లలో తయారయ్యే బట్టలు ధరిస్తే ధరించిన వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు కనిపిచే వాళ్ళు. ఇంత సున్నితమైన పల్చటి బట్ట, దారం, భారత్ లోని నేత గాళ్ళు చేత్తో తయారు చేసేవారు.
విలియం వార్డ్
ఆంగ్లేయ అధికారి
1. భారత్ లో తయారయ్యే మఖమల్ గుడ్డను గడ్డిమీద పరిస్తే దానిమీద మంచు కురిస్తే అదికూడా కనిపించేంత సున్నింతంగా ఉన్నాయి. సహజసిద్దమైన రంగులు ఎలా ఉంటాయో వాటికి వేసిన రంగులు కూడా అంత సహజంగా ఉండేవి.
2. 13 గజాల తాను 100 గ్రాముల కంటే తక్కువ బరువు తూగేది. కొన్ని తానులు 40-50 గ్రాములు కూడా ఉండేవి.
3. 13 గజాల గుడ్డ ఉంగరంలోనుండి బయటకు వస్తుంది. 13 గజాల చీర అగ్గిపెట్టెలో పడుతుంది.
విలియం వార్డ్ చెప్పిన 3 వ విషయాన్ని నేను స్వయంగా కాశీలో చూచూను. -

అమరులు, స్వదేశీ ఉద్యమకారుడు,స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసం

తెనుగుసేత మదన్ గుప్త 

Friday, 7 August 2015

స్వామి వివేకానంద సూక్తి


మగ్గం మురిసేలా.. చేనేతకు దక్కిన గౌరవం

ఈరోజు అనగా 7, ఆగస్ట్  జాతీయ చేనేత దినం

మగ్గం మురిసేలా.. చేనేతకు దక్కిన గౌరవం

అగ్గిపెట్టెలో అమరిన ఆరు గజాల చీరలు నేసిన మగ్గం. ఆ మగ్గంపై విరిసిన పూల తరంగాలు. పురివిప్పి ఆడిన నెమళ్లు, విరగాసిన మామిడి పిందెలు. ఈ ఫ్యాషన్ ఏళ్లుగా కొనసాగుతోంది. నూలు బట్టల మెతకతనం, పట్టువస్ర్తాల మేళవం.. జలతారు చీరల సోయగం, దోతుల ఆర్భాటం.. ఆ సొగబు, సోయగం, సౌందర్యం.. అన్నింటినీ కలనేసిన హస్తకళా వైభవం వర్ణనాతీతం. చేనేతలోనే ఇమిడిన వారసత్వమిది.
మగువల అందానికి మరింత శోభనిచ్చే సంప్రదాయ పట్టు, నూలు వస్ర్తాలు భారత సంస్కృతికి చిహ్నాలు. సంప్రదాయ డిజైన్లను అద్భుతంగా తీర్చిదిద్దిన కళా వైభవం చేనేత కళాకారులదే, కార్మికులదే! ఆ కార్మికులూ వేడుక చేసుకునేందుకు జాతీయ చేనేత దినోత్సవం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు ఏడోతేదీన దేశ వ్యాప్తంగా చేనేత రంగ నిపుణులు, కళాకారులు, కార్మికులంతా వేడుకలు జరుపుకుంటున్నారు. శుక్రవారం చెన్నైలో జరిగే ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో వేడుకలను నిర్వహిస్తోంది. కానీ ఈ వేడుకల వెనుక 9 వసంతాల పోరాటం ఇమిడి ఉన్నది. ఒకరి ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచిన ఈ రోజుకు మన తెలుగు నేలైన తెలంగాణ నుంచే ప్రస్థానం మొదలైంది. ఇక్కడ మొదలైన పోరాటం, వేడుకల స్ఫూర్తితోనే జాతీయస్థాయికి ఎదిగింది.

నాటి పోరాట ఘట్టం నుంచి ఆలోచన..
బ్రిటిష్ సామ్రాజ్యపు దురహంకారాన్ని ఎదిరించినందుకు చేతివేళ్లను నరికించుకోగలిగిన త్యాగనిరతి భారతీయులది. స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ వస్తు వినియోగం ఓ ఆయుధంగా మారింది. అందులో భాగంగానే మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1905 ఆగస్టు ఏడోతేదీన అప్పటి కలకత్తాలో విదేశీ వస్ర్తాలను పెద్దఎత్తున దహనం చేశారు. నాటి స్ఫూర్తి దినాన్ని చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని చేనేత ప్రోత్సాహక మండలి చైర్మన్ యర్రమాద వెంకన్ననేతకు వచ్చిన ఆలోచన 2006లో పురుడు పోసుకుంది. నాటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. 2012లో విదేశీ వస్త్ర దహనానికి సంబంధించిన చారిత్రక ఘట్టాన్ని స్వదేశీయం పేరుతో రూపొందించి రవీంద్రభారతిలో ప్రదర్శించారు.

నాటి ప్రదర్శన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. నాటి నుంచి అధికారికంగా నిర్వహించాలన్న పోరాటం ఉధృతమైంది. వెంకన్న నేతతో పాటు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తదితరుల ప్రయత్నాలు ఫలించాయి. ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆలోచనకు రూపాన్నిచ్చిన వెంకన్ననేతను కేంద్ర ప్రభుత్వం చెన్నైకి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అక్కడ సన్మానిస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఇవ్వనున్న సంత్ కబీర్, నేషనల్ అవార్డులను కూడా అందించనున్నారు.

అంతులేని వ్యధ నుంచి..
ముంబయిలో లక్మే ఫ్యాషన్ వీక్.. అందాలొలికే ముద్దుగుమ్మలు నయనతారకంగా క్యాట్ వాక్. మేనికి తగ్గట్లుగా రంగురంగుల వస్ర్తాలు కనువిందు చేస్తాయి. అవార్డుల పంపిణీ.. అందరి నోటా ఒక్కటేమాట.. అదే హ్యాండ్లూం ఫ్యాబ్రిక్ మంత్రమిది! ఫ్యాషన్ డిజైనర్లందరిదీ ఒక్కటే అభిప్రాయం. దాంతో లక్షలు, కోట్ల టర్నోవర్ వ్యాపారం వారి సొంతం. కానీ వారి ఆర్భాటం వెనుక, వ్యాపార సూత్రం ఎవరూ గుర్తించని కళాకారుల, కార్మికుల శ్రమ దాగి ఉన్నది. ఇక్కడ విజేతలు ఫ్యాషన్ డిజైనర్లు.

*రూ.వేలు.. రూ.లక్షలు విలువజేసే చీరలు, వస్ర్తాలు కొలువుదీరే కార్పొరేట్ షోరూములు ఉన్నాయి. దేశ విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వారి రూ. వేల కోట్ల టర్నోవర్ వెనుక చేనేత కార్మికుల శ్రమ అనిర్వచనీయమైనది.

రోజంతా మగ్గం నేసినా రెండు పూటలా వేళ్లు నోట్లోకి వెళ్లని దుస్థితితో ఉన్న కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవంతోనైనా ప్రయోజనం కలుగుతుందని నిపుణులు, మాస్టర్ వీవర్లు, ప్రజాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

సేకరణ: http://namasthetelangaana.com/telangana-news/recognition-and-honor-given-to-the-handloom-1-1-447707.html

బొడ్డు తాయత్తు

తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు.దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే.  ఈ బొడ్డుతాడు ను పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపాత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.

ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది. అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమనప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం" ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం".

సేకరణ: Via కొండూరు వాసుదేవరావు గారు, గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు 

Sunday, 2 August 2015

హిందూ ధర్మం - 169 (శిక్షా - 3)

శబ్దాల యొక్క శక్తిని, అక్షరముల వైభవాన్ని చూశాం. మరి వేదమంత్రాల యొక్క పరిపూర్ణశక్తిని మానవుడు పొందాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నా గురువులలో ఒకరికి వారి గురువుగారు వేదంలోని ఒక అతి రహస్య విద్యను నేర్పిస్తూ మంత్రపఠనం గురించి ఇలా హెచ్చరించారు. 'నేను నీకు నేర్పే విద్య అత్యంత కఠినమైనది, అది సక్రమంగా జరిగితే శుభఫలితాలు కలుగుతాయి. మంత్రపఠనంలో కానీ, కర్మలో కానీ చిన్న పొరపాటు దొరిలినా, చాలా దుష్పరిణామాలు చవి చూడవలసి వస్తుంది. జాగ్రత్తగా చదివితే ప్రపంచానికి మేలు జరుగుతుంది, కాస్త పొరపాటు జరిగినా అది ఉపద్రవానికి దారి తీస్తుంది. అందువల నీకు చేసే విద్యాబోధన కూడా చాలా కఠినంగానే ఉంటుంది. దానికి తట్టుకుని నిలబడగలవు అనుకుంటేనే నా దగ్గర ఉండు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో' అన్నారు. అన్నిటికి తట్టుకుని నిలబడ్డారు కనుక ఈ రోజు వారు అనేక యజ్ఞాలు చేస్తూ దేవతావహన చేస్తున్నారు, దేవతలను యజ్ఞవేదికకు రప్పించగలుగుతున్నారు. వేదగానం చేస్తున్నారు. ఆ సంప్రదాయ విద్య తెలిసి, ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్న ఏకైక వ్యక్తి వారే. వేదం నేర్చుకోవడం అంత కఠినం. ఏదో క్లాసులో కూర్చుని బట్టి కొట్టే విద్య కాదిది. గురువుకు ఎంత శ్రద్ధ ఉంటుందో, శిష్యునికి అంతే ఉండాలి. అన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి, సహనం ఉండాలి. అటువంటి ఎంతోమంది వేదపండితులు, ఘణాపాఠీలు ఎందరో ఉన్నారు.  

అటువంటి వేదమంత్రోఛ్ఛారణ గురించి శిక్షా శాస్త్రం వివరిస్తుంది.
1. అక్షరశుద్ధిః - అనగా అక్షరములను సరిగ్గా పలకాలి.
2. మాత్రశుద్ధిః - ధీర్ఘాలు మొదలైనవి ఎంత సమయం పలికితే సరైన అర్దం వస్తుందో అంతే సమయం పలకాలి. ఒక్ అక్షరాన్ని ఎంత సమయం పలకాలో, అంతే సమయం పలకాలి. అంతేకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ పలకకూడదు.
3. స్వరశుద్ధిః - అక్షరములను సరైన స్వరంలోనే పలకాలి

అయితే వేదమంత్ర పఠనం సరిగ్గా జరుగుతోందా లేదా అనేది నిర్ధారించుకొనుటకు ఋషులు అనేక పద్ధతులను వివరించారు. 6 రకాల దోషాలు పారాయణలొ దొర్లే అవకాశం ఉందని చెప్పారు.

గీతి శ్రీధ్రీ శిరఃకంపి తధా లిఖితపాఠకః |
అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ్య షఢైతే పాఠకాధమః ||

పాట వలే పాడేవారు, వేగంగా చదువేవారు, స్వరం పెంచకుండా, తగ్గించకుండా కేవలం తలను పైకి క్రిందకు తిప్పుతూ ఉండేవారు, పుస్తకం చూసి చదివేవారు, అర్దం తెలుసుకోకుండా పారాయణ చేసేవారు, బలహీనమైన గొంతుతో చదివేవారు వేదపారాయణంలో అధములు అంటున్నది శాస్త్రం.

అక్షరములు, వాటి సమయానుకూల ఉఛ్ఛారణ మారకుండా స్వరం మార్చడం కూడా వ్యతిరేకఫలితాలను ఇస్తుందని చరిత్ర చెప్తోంది.

పూర్వం వృత్తాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఇంద్రునిపై యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు, కుమారుడి విజయం కోసం వాడి తండ్రి త్వష్ట వైదిక మంత్రాలతో యాగం చేశాడు. అందులో శృతి లోపించింది, దాని ఫలితంగా అర్దం మారిపోయింది. 'ఇంద్రశ్శత్రో వర్ధయేత్' అనే వ్యాక్యాన్ని శృతి తప్పి చదివాడు. దాంతో ఇంద్రుడి శత్రువైన వృత్తుడు వర్ధిల్లాలి అనబోయి, శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్దం వచ్చింది. అది చిన్నలోపంగా అనిపించినా, అదే వృత్తాసురిడి మరణానికి కారణమయ్యింది. వాడు సర్వనాశనమయ్యాడు.

ఈ కధ ద్వారా రెండు విషయాలు అర్దం చెసుకోవాలి. ఒకటి, ఎవరు పడితే వారు వేదం చదువరాదు, వాళ్ళు బ్రాహ్మణులైనా సరే, గురువు దగ్గర కూర్చుని నేర్చుకున్న వారు మాత్రమే పారాయణ చేయాలి. లేదంటే అందులో దొర్లే తప్పులకు కలిగే వ్యతిరేక ఫలితాలు తట్టుకోలేరు. దానికి బదులుగా అందరూ స్తోత్రాలు, శ్లోకాలు చదవవచ్చు, నామజపం చేయచ్చు. వీటికి ఇలాంటి నియమం లేదు. వేదపారాయణ వినవచ్చు కానీ గురువు దగ్గర నేర్వకుండా పఠనం చేయరాదు. రెండవది, ఎప్పటికైన ధర్మమే గెలుస్తుంది. భగవంతుని ఇచ్ఛకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించాలని చూసినా, వారు నాశనమవుతారు. అక్షరాలకు అధిదేవతలు ఉంటారు. వారు వాటిని, వేదాన్ని రక్షిస్తూ ఉంటారు, ఎవరైనా వేదాలను తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే, ఇక వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్లే, వాడి చితికి వాడి నిప్పు అంటించుకున్నట్లే. దేవతలే వాడిని పక్కదారి పట్టిస్తారు.

ఇటువంటి దుష్ప్రభావాలు మానవాళి ఎదురుకొనకూడదనే ఋషులు శిక్షా శాస్త్రాన్ని అందించారు.  

To be continued ......................

అచ్చమైన మన తెలంగాణ వేడుక

బోనాల పండుగ
దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల.

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.పిల్లల సంరక్షణలో అమ్మవారు
జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాలు జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-

ఘటోత్సవం:
అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట.
ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు.

సాక సమర్పణ:
సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.

ఫలహారపు బండ్లు:
బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.

పోతురాజుల వీరంగం:
బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.

రంగం వేడుకలు:
రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.

గావు పట్టడం:
వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.

సాగనంపు:
గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.
By వనిత విజయకుమర్ ద్యాప

నమస్తే తెలంగాణ - ఆదివారం సంచిక - బతుకమ్మ

Source: http://goo.gl/tvk3CY

Saturday, 1 August 2015

ఇది ధర్మవైభవం

ఇది ధర్మవైభవం

కుంబమేళా లో అశేష జన వాహిని చూసిన ఒ ఆంగ్లేయుడు మన హిందూ సన్యాసిని ఇలా ప్రశ్నించాడు. కుంభమేళాలో ఇన్ని లక్షల జనం ఓ క్రమపద్ధతిలో తమ పని తాము చేసుకోవడమే కాక ఎంతో సౌభ్రాతృత్వం తో వున్నారు. వీరు మరి ఒక ప్రాంతం వారు కారు, ఒక భాషా కలిగిన వారు కాదు, ఒకే ఆచారాలు ,ఆహారము కలిగినవారు కాదు, అయినా వీరిలో ఇంత సోదర భావమా? ఇదే మా దేశములో అయితే ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత గొడవలు వస్తాయి. చాలా ఆశ్చర్యం అయినా ఇంత మంది ఇక్కడా రావడానికి చాలా ప్రకటనలు, చాలా ఖర్చుతో కుడివుంటింది, కాదా? .............అంటే దానికి ఆ హిందు సన్యాసి ఇలా జవాబు ఇచ్చాడు. ఒక పైసా కుడా ఖర్చు కాలేదు. అవ్వదు కూడా. మన పంచాంగం, (జ్యోతిషం) ఆధారముగా, మీ ప్రకారం చెప్పాలంటే కాలేండర్ లో విశేష దినముగా మనవాళ్ళు ముందే రాసిపెట్టి వుండం........ ఒక చిన్న లైను చూసి ఇన్ని లక్షల మంది ఇక్కడకు రావడం జరిగింది. హిందూ ధర్మం పాటించే వారు శాంతితో ప్రతి ఒక్కరిలో దేవుని చుసే గుణం కలిగి ఉంటారు. అలా చూడగలిగినది, వుండగలినది నా హిందు ‪‎ధర్మము‬ మాత్రమే అని చెప్పడం తో ఆ విదేశీయుడు మన హిందు ధర్మానికి ధన్యవాదాలు తెలిపాడు.

చెప్పిన ఆ హిందూ సన్యాసి ఎవరో కాదు అపర ఆదిశంకరులు, కంచికామకోటి పీఠాధిపతి, శ్రీ శ్రీ శ్రీ చందశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.

జయ జయ శంకర హర హర శంకర

ఋణ తీర్మానం - సద్గురు శివానంద మూర్తి