Showing posts with label గణపతి. Show all posts
Showing posts with label గణపతి. Show all posts

Tuesday, 6 June 2023

7 జూన్ 2023, బుధవారం, జ్యేష్ఠ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

 


7 జూన్ 2023, బుధవారం, జ్యేష్ఠ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.


ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి బుధవారం వచ్చింది. )


7 జూన్ 2023, బుధవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 10.20 నిమి||


గమనించగలరు.


జ్యేష్ఠ మాసంలో వచ్చింది కనుక దీనికి కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి అని పేరు.


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది.

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


Monday, 22 November 2021

23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.

 


23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.


ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.)


23 నవంబరు 2021 మంగళవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.49 నిమి||

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/sankashti/ganadhipa/ganadhipa-sankashti-date-time.html?year=2021


కార్తిక మాసంలో వచ్చిన దీనికి గణాధిప సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణాధిపాయ నమః

ఓం గం గణపతయే నమః

Sunday, 19 September 2021

గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటి?



మన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలు కొందరు దేవతలను ఒప్పుకోవు. పేర్లు చెప్పవలసిన పనిలేదు గానీ శివుడు, గౌరీ, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతల ఆరాధన అక్కర్లేదని చెప్పే సంప్రదాయాలు కూడా మన ధర్మంలో కనిపిస్తాయి. అదేగాక ప్రతి మతము (సనాతన ధర్మలోని మతాలు - శైవ, శాక్తేయ, వైష్ణవ మొదలైనవి) తాము పూజించే దేవతయే పూర్ణమని, మిగితా దేవతలు కామ్యసిద్ధిని ఇస్తారే గానీ, మోక్షం ఇవ్వరని ప్రతిపాదన చేస్తాయి. కానీ గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటంటే అది సకల దేవతలనూ సమానంగా చూస్తుంది. గణపతిని పూర్ణబ్రహ్మంగా ప్రతిపాదించినా; శివుడు, అంబిక, సూర్యుడు, విష్ణువు పరబ్రహ్మస్వరూపాలేనని ప్రతిపాదిస్తుంది. అన్యదేవతలను సైతం ప్రార్ధించాలని చెబుతుంది. ఈ రోజు ఏదైతే మన ధర్మానికి కావాలో అదే అందులో చెప్పబడింది. తాను పూజించే దేవతా మూర్తిని కీర్తిస్తూ, అన్యదేవతలను గౌరవించడం, తక్కువ చేయకపోవడం. 


ముద్గల పురాణంలో కూడా ఇదే విషయం విశేషంగా ప్రస్తావించబడింది. ఉన్నది ఒకటే బ్రహ్మము. అది సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని నీవు ఏ రూపంతో ఉపాసిస్తే ఆ రూపంతోనే కోరికలు తీరుస్తుంది. అది నారాయణ, శివ, శక్తి, సూర్య, సుబ్రహ్మణ్య, చివరకు గణేశుడైనా సరే, మనస్సుకు, మాటలకు అతీతుడైన ఆ పరబ్రహ్మమే. సర్వదేవతలకు, సర్వ సృష్టికి మూలం అదే అని ముద్గల మహర్షి స్పష్టంగా చెప్తారు.


మనమంతా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన మార్గంలో నడుస్తున్నాము. మనకు శంకరులు చెప్పింది కూడా ఇదే. ఇష్టదేవతను ప్రధాన దేవతగా పూజిస్తూ, ఇతరదేవతలను ఆవరణ దేవతలుగా అర్చించడం. అదే పంచాయతనంలోనూ కనిపిస్తుంది.

Saturday, 18 September 2021

సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు?



సనకాది మునిచతుష్టయం గణక ఋషిని ఇలా అడిగారు - సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు? 

 

దానికి గణక ఋషి ఇలా సమాధానమిచ్చారు - దీపంలో వత్తి వంటి వారు బుద్ధి మాత, దీపానికి పోసే తైలం వంటిది సిద్ధిమాత. ఈ దీపపు జ్యోతి సాక్షాత్తు గణపతియే. అగ్నితత్త్వం విశ్వమంతా వ్యాపించి ఉన్నా, అగ్నిని వెలిగించుటకు నూనెతో తడిచిన వత్తి కలిగిన ప్రమిద అవసరము.


బుద్ధి దేవి అనేది శుద్ధమైన జ్ఞానం కాగా, సిద్ధి దేవి మాయ. ప్రమిదలో ఉన్న వత్తి పూర్తిగా తైలాన్ని పీల్చుకుని కాలిపోయేవరకు అగ్ని జ్వలిస్తుంది. ఆ తర్వాత ఆ జ్వాల అగ్నితత్త్వంలో కలిసిపోతుంది. (దీపం కొండెక్కడం/ ఆరిపోవడమంటే అగ్ని అక్కడికి అంతమవ్వడం కాదు. సర్వకాల సర్వావస్థల్లోనూ విశ్వమంతా అగ్ని వ్యాపించి ఉంది. దీపప్రజ్వలనతో అది ఆ ప్రదేశంలో వ్యక్తమవుతోంది).


అలాగే మయామయమైన ఈ ప్రపంచంలో ఉంటూ, సత్యజ్ఞానంతో బ్రహ్మపథంలో ప్రయాణిస్తే, జీవాత్మ పూర్ణబ్రహ్మమైన గణపతిలో ఐక్యమవుతుంది. ఈ గణపతి ఈ సృష్టికి ముందూ ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. కానీ ఈ మాయ మరియు జ్ఞానం కలిసినప్పుడే గణపతి వ్యక్తమవుతున్నాడు. జ్ఞానం ద్వారా మాయ తొలగినప్పుడు ఉండేది గణపతి (బ్రహ్మం) మాత్రమే. ఆ స్థితిలో మాయా ఉండదు, జ్ఞానమూ ఉండదు, కానీ సచ్చిదానందుడైన గణపతి మాత్రమే ఉంటాడు. సిద్ధి (మాయ) మరియు బుద్ధి (జ్ఞానం) ద్వారా మాత్రమే గణపతి వ్యక్తమవుతున్నాడు. జీవ భావంతో  చూసినప్పుడు, గణపతికి  ఇద్దరు భార్యలు ఉంటారు. ఆత్మజ్ఞానం ద్వారా జీవునకు మాయ తొలగి జ్ఞానోదయమైనప్పుడు, గణపతిని సర్వవ్యాపిగా, పరతత్త్వంగా గుర్తిస్తాడు. అప్పుడు గణపతిని బ్రహ్మచారిగా భావిస్తారు.


వినాయక రహస్యం పూర్వభాగం 6 వ అధ్యాయం.

గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైన మూడు పువ్వులు



గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైనది, గణపతి త్వరగా సంతుష్టుడయ్యేది మూడింటితో. అవి గరిక, మందార పుష్పం మరియు శమీ పుష్పాలు.


దుర్వా గంధ మాత్రేణ సంతుష్ఠోసి గణాధిపః ||


గరిక పోచల వాసన తగలడంతోనే గణపతి సంతుష్ఠుడవుతాడు.


అయితే గరిక వాసన ఆయనకు ఎప్పుడు తగులుతుంది ? ముక్కుకు దగ్గరగా పెట్టుకున్నప్పుడు. అంటే గణేశుడి తొండానికి దగ్గరగా దుర్వా ఉంచినప్పుడు ఆయన సంతుష్ఠుడవుతాడు. అందుకే యోగిన్ద్ర మఠం (గాణాపత్య మఠం) పరంపరలో అర్చనా క్రమాన్ని ఈ విధంగా చెప్పారు.


ముందు అన్ని రకాల సుగంధ పుష్పాలతో అర్చన ప్రారంభించాలి. వాటి తరవాత ఎఱ్ఱని పుష్పాలు. తర్వాత బిల్వ పత్రాలు, బిల్వం మీద శమీ పుష్పాలు, వాటి మీద అర్క పుష్పాలు. జిల్లేడు పువ్వుల్లో నీలి రంగువి కనిష్టం, ఎరుపు మధ్యమం, తెలుపు శ్రేష్ఠం. కనుక నీలి అర్కపుష్పాల, వాటి మీద ఎఱుపు, ఆ తర్వాత తెల్లజిల్లేడు పూలు అర్పించాలి. వాటి మీద గరిక సమర్పించాలి. అందులోను పచ్చని దుర్వాలు, వాటి తరువాత శ్వేత దుర్వాలు అర్పించాలి.  


ఒకసారి దుర్వాలు అర్పించిన తర్వాత ఇక గణేశుడికి ఏదీ అర్పించకూడదు. దుర్వాల తర్వాత ఇక ఉత్తరపూజ అనగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.   

Friday, 17 September 2021

గాణాపత్యం - గురుమండలం



గాణాపత్యం కూడా ఒక విస్తారమైన మతము. మహారాష్ట్రలో ఇప్పటికీ గాణాపత్యులు ఉన్నారు. గాణాపత్యంలో మొత్తం 64 మంది గురువులతో గురుమండలం ఉంది. గణపతి మంత్ర ద్రష్ట గణక ఋషి. దత్తాత్రేయుడు, గౌడపాదాచార్యులు మొదలైన వారు ఈ పరంపరలో కనిపిస్తారు.  


వినాయక రహస్యం అనే ఒక గొప్ప గాణాపత్య గ్రంథం ఉంది. అందులో భవిష్యవాణి ఈ విధంగా చెప్పబడింది. "కలియుగంలో ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, గాణాపత్యంలోని పరమగురువైన గణక ఋషి ప్రయాగ వద్ద గౌడపాదులుగా అవతరిస్తారు. ఆయన తన శిష్యులకు జ్ఞానబోధ చేసి మోక్షమార్గం చూపుతారు. ఆయనకు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి గొప్ప శిష్యునిగా మారుతారు. అద్వైతవేదాంతాన్ని, వేదసారాన్ని వ్యాప్తి చేయడంలో ఈయన కీలకుడవుతాడు. 10 ఉపనిషత్తులకు వ్యాఖ్య రాసి మహావాక్యాల యొక్క సారన్ని బోధ చేస్తారు."  


గౌడపాదుల బోధలకు సమానమైనవి మనకు ముద్గల పురాణంలో సైతం కనిపిస్తాయి. ఇలా గణేశ భక్తులకు అద్వైత సంప్రదాయ రక్షణ మరియు వ్యాప్తి అనేది ముఖ్యమైన కర్తవ్యం. 


అయితే గాణాపత్యంలో బుద్ధుడిని కూడా గురుమండలంలో ఒక ఆచార్యునిగా గౌరవిస్తారు. గణపతి సహస్రనామంలో కూడా జైన, బౌద్ధ మతాల రూపంలో కూడా గణపతి ఉన్నాడని ప్రస్తావన కన్పిస్తుంది.  


ఓం శ్రీ గణేశాయ నమః 

Thursday, 16 September 2021

సర్వలోక గణపతి నామాలు



స్వానందలోకం అనేది కళ్ళకు కనిపించే పాంచభౌతికమైన లోకం కాదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితి అయినప్పటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వలోకమహేశ్వరుడైన గణేశుడు అనేక లోకాల్లో అనేక రూపాల్లో కొలువై ఉన్నాడు.


గణపతి ఏర్పాటు చేసుకున్న మొదటిలోకం చింతామణి. అది దేవతల ఊహకు సైతం అందని ప్రదేశంలో ఉంది. 

కైలాసానికి తూర్పు దిక్కున మలజాత అనే పేరుతో గణేశుడు ఉంటాడు, దాన్ని స్వర్గస్వానందం అంటారు.

భూలోకంలో మోర్గావ్ క్షేత్రంలో బ్రహ్మకమండలు నదీ తీరంలో మయూరేశ్వరుడనే పేరుతో నివసిస్తున్నాడు.

మణిమయమైన నాగలోకంలో శేషాత్మజుడుగా, విష్ణులోకమైన వైకుంఠంలో పుష్టిపతిగా, మణిద్వీపంలో ద్వారాపాలకుడు మహాగణపతిగా, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవునకు గురువుగా శారదేశుడనే పేరుతో గణపతి ఉన్నాడు.

ఇంద్రలోకంలో గణపతి కునితాక్షునిగా, అగ్నిలోకంలో రూపవినాయకునిగా, యమలోకంలో కాలునిగా, నైఋతి లోకంలో చండోద్ధండునిగా పూజలందుకుంటున్నాడు.

వరుణలోకంలో పాశపాణి, వాయులోకంలో ధూమ్రుడు, కుబేరునిలోకమైన అలకాపురిలో స్వర్ణాకర్షణ గణేశునిగా, కైలాసంలో శివగణాలకు అధిపతియై హేరంబగణపతిగా పిలువబడుతున్నాడు. 

దైత్యలోకంలో ద్విముఖునిగా, గంధర్వలోకంలో చందనునిగా, భూతలోకంలో ఘుర్ణితాక్షునిగా, సూర్యలోకంలో గణసూర్యునిగా గణపతి వసిస్తున్నాడు. స్కందలోకంలో షణ్ముఖునిగా కొలువై ఉన్నాడు. 

ఆయన ఎక్కడ ఉంటే అది స్వానందలోకం. తమను నరకంలో అగ్నికీలల యందు పడవేసినా, డండనాథుని రూపంలో గణేశుడినే దర్శిస్తామని గాణాపత్యులు అంటారు. గణపతియే సర్వమూ, సర్వమూ గణపతియే. ఇది పరమసత్యాన్ని ఋజువు చేయుటకే ఆయన అన్ని లోకాల్లో, అంతటా ఉంటాడు. గాణాపత్యుడు ఏనాడు కూడా స్వానందలోకం నుంచి క్రిందకు జారడు.


ఓం శ్రీ గణేశాయ నమః 

Wednesday, 15 September 2021

గణపతిని ప్రసన్నం చేసికొనుటకు 3 మర్గాలు


గణేశునికి గరిక అత్యంత ఇష్టం అని తెలుసు కదా. ఒకసారి గరికను సమర్పించిన తర్వాత ఇక ఏమీ సమర్పించకూడదని చెప్పుకున్నాము. అంటే గరిక అనేది గణపతి ఆగమాల్లో ఉత్కరిష్టమైనది. భక్తుని దగ్గర ఏమీ లేకున్నా కేవలం గరికను సమర్పించి వేసుకుంటే చాలు, కార్యం సిద్ధిస్తుంది. అయితే విష్ణు ఆరాధనలో తులసిని ఏ విధంగానైతే ప్రసాదాల మీద, తీర్థం యందు వేస్తారో, అలాగే గాణాపత్యంలో గణపతికి నివేదించే పదార్ధాల మీద గరిక పోచలు వేయాలి. 


శివునకు బిల్వం సమర్పించిన విధంగానే గణపతికి రెండు దుర్వాలు చొప్పున సమర్పించాలి. ఒక దుర్వాన్ని ఎప్పుడూ అర్పించకూడదు. 


గాణాపాత్యులు తమ దేవతార్చనలో తులసిని ఎన్నడూ వాడరు. కారణం గణపతి పూజలో తులసి పనికిరాదన్న గణేశుడి శాపం. కేవలం వినాయక చవితి రోజున మాత్రమే తులసిని గణపతికి అర్పించాలి. అది కూడా మిగిలిన 20 రకాల పత్రాలు లభ్యమైనప్పుడు మత్రమే, 21 వ పత్రిగా తులసిని అర్పించవచ్చు.


ఇక గణపతిని ప్రసన్నం చేసుకోనుటకు మరొక మార్గం కొబ్బరికాయ కొట్టడం. త్రిపురాసుర సంహారం ముందు విఘ్నం తొలగుటకు సాక్షాత్తు శివుడే కొబ్బరి కాయ కొట్టాడు గణపతి ముందు. 


దీని గురించి కంచి పరమాచార్య వారు విపులంగా చెప్పాలి. ఆర్థిక స్తోమత కలిగిన వారందరూ కనీసం ప్రతి శుక్రవారం గణపతికి కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి పేదలకు, చిన్న పిల్లలకు పంచాలి. ఇది అన్ని రకాల అభివృద్ధిని ఇస్తుంది. ఇంకొక ఉపచారం - ప్రదక్షిణలు చేయుట. మనం ఒక పని జరగాలని గణపతిని కోరుకొని ప్రదక్షిణలు నిత్యం చేస్తూ ఉంటే కార్య సిద్ది కలుగుతుంది. ఒకవేళ ఈ రెండు విషయాలు లోకులు అర్ధమయ్యి అందరూ ఆ ఫలితాలను పొందడం మొదలుపెడితే, ఇప్పుడున్న గణపతి ఆలయాలు సరిపోవని, ఇంకా కొత్తవి చాలా కట్టవలసి వస్తుందని పరమాచార్యుల వారు చెప్పి ఉన్నారు.


కాబట్టి గణపతిని ప్రసన్నం చేసికొనుటకు మనం ఈ మర్గాలను పాటించవచ్చు.


ఓం శ్రీ గణేశాయ నమః   

Monday, 13 September 2021

స్వానందలోకం - ఇతరలోకాలు



బహుదేవతారాధనయే సనాతనధర్మం యొక్క ప్రాణం, సౌందర్యం. ఇష్టదేవతనే పరబ్రహ్మంగా, మిగిలిన దేవతలను అంశలుగా ఉపాసించి, మోక్షం పొందే మార్గాన్ని సనాతన ధర్మం చూపింది. శైవులకు కైలాసం ఉత్కృష్ట లోకం కాగా, వైష్ణవులకు వైకుంఠం, శాక్తేయులకు మణిద్వీపం చేరుట లక్ష్యాలు. అలాగే గణేశోపాసకులకు స్వానందలోకం చేరుట పరమలక్ష్యం. 


గాణాపత్యాన్ని అనుసరించి స్వానందలోకం మధ్యలో ఉంటుంది. అందులో సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి ఉంటాడు. స్వానందలోకానికి తూర్పున వైకుంఠం, దక్షిణాన కైలాసం, పశ్చిమాన మణిద్వీపం, ఉత్తారాన జ్ఞానమార్గం ఉంటాయి. అందుకే గణపతి ఉపాసనలో గణపతికి తూర్పున లక్ష్మీనారాయణులను, దక్షిణాన శివపార్వతులను, పశ్చిమాన రతీమన్మధులను, ఉత్తరాన భూదేవి వరహాస్వామి వారిని ప్రతిష్టించి ఉపాసిస్తారు. గణేశుడు మధ్యలోనున్న పూర్ణబ్రహ్మం, ఆదిమూలం. ఇంకా గణపతికి అంగదేవతలు, అనేకమంది పరివార దేవతలు చుట్టూతా ఉంటారు. లక్ష్మీనారాయణులు ధర్మానికి, శివపార్వతులు అర్ధానికి, రతీమన్మధులు కామానికి, వరహాస్వామిభూదేవులు మోక్షానికి సంకేతాలు. అనగా గణాపతి ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే నాలుగు పురుషార్ధాలు వస్తాయి. భౌతికమైన సుఖాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక గమ్యం నెరవేరుతుంది. అంటే ఆదిశంకరులు ప్రతిపాదించిన పంచాయాతనం అన్నమాట.


భూస్వానందంలో అనగా మోర్గావ్ క్షేత్రంలో సైతం గణపతికి నాలుగు దిక్కులా పైన చెప్పుకున్న నలుగురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీనారాయణులు వైష్ణవానికి, శివపార్వతులు శైవానికి, రతీమన్మధులు శక్తేయానికి సంకేతాలు కాగా భూదేవి-వరహా స్వామి వారు సౌరానికి; యోగ, జ్ఞాన మార్గాలకు సంకేతాలు. అంటే అన్ని మతాల పరమలక్ష్యం గణేశుడే అని సారం. మీరు ఏ మార్గంలో వెళ్ళినా, చివరకు గణపతినే చేరతారు. ఇక్కడొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే బౌద్ధం, జైనం వంటి అవైదిక, నాస్తిక మతాలు కూడా ఉత్తరభాగంలోనే ఉంటాయని గాణాపత్య ఆగమాలు చెబుతున్నాయి. అందుకే గణేశోపాసన అవైదిక, నాస్తిక మతాల్లో సైతం ఉన్నది. బౌద్ధులు, జైనులు కూడా గణాపతిని పూజిస్తారు. ఇలా గాణాపత్యం ఏ ఒక్క మతాన్ని తిరస్కరించక, అందరూ దేవతలను, అన్ని మార్గాలను సత్యమని అంగీకరిస్తూ పూర్ణబ్రహ్మమైన గణేశుడిని చేరే మార్గం చూపెడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః 

Sunday, 12 September 2021

గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం



గణేశోత్సవాలు అనాగానే గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. తరతరాలుగా గాణాపత్యం వర్ధిల్లింది ఇక్కడే. అందులోనూ గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం. ఇది అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ గణపతి పేరు మయూరేశ్వరుడు. వైష్ణవులకు శ్రీ రంగం, శైవులకు కాశీ ఎంత పవిత్రమో, గాణాపత్యులకు ఈ మోర్గావ్ క్షేత్రం అంత విశేషం. ఇది స్వర్గలోకం కంటే ఉన్నతమైనదని, ఈ మోర్గావ్ క్షేత్రంలో స్వామిని దర్శిస్తే, బ్రహ్మ పదివి అడిగినా వరిస్తుందని పురాణవచనం. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే ఎన్నో వేల జన్మల పాపాలు దగ్ధమవుతాయని పురాణంలో చెప్పబడింది. ఆ స్వయంభూః స్వామి విగ్రహాన్ని చూడగానే భక్తులకు ప్రశాంతత ఆవరిస్తుంది. ఈ మోర్గావ్ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఇక్కడ గణపతి చుట్టు, గ్రామం చుట్టూ కూడా అనేక దేవతలు ప్రతిష్టితమై ఉన్నారు.


శివునకు కైలాసం, విష్ణవులు వైకుంఠం, లలితాపరమేశ్వరికి మణిద్వీపం ఎలాగో, అలాగే గణపతి ఉండే లోకం పేరు స్వానంద లోకం. గణాపతిని స్వానందేశుడు అంటారు. స్వా అంటే ఆత్మ. ఆత్మానందాన్ని ఇచ్చే లోకం స్వానందలోకం, ఆత్మానందాన్ని ఇచ్చే స్వామి స్వానందేశుడు, ఆయనే మన గణనాథుడు. ఆనందానికి అధిదేవత గణేశుడు. అందుకే ఆయన రూపాన్ని చూసినా, స్మరించినా తెలియని ఆనందం కలుగుతుంది.


మోర్గావ్ క్షేత్రాన్ని భూస్వానందం అంటారు, అనగా ఈ భూమి మీదనున్న స్వానందలోకం. మయూరేశ్వరుడిని భూస్వానందేశ్వరుడు అంటారు. గణపతి భక్తులు తమ జీవితంలో ఒక్కసారైన దర్శించాల్సిన క్షేత్రం మోర్గావ్. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. 


భూస్వానందేశో విజయతే 

ఓం శ్రీ గణేశాయ నమః 

Saturday, 11 September 2021

గాణాపత్యం



శివుడిని  పరబ్రహ్మంగా ఆరాధించేవారిని శైవులనీ, విష్ణువును పరబ్రహ్మంగా ఆరాధించేవారిని వైష్ణువులనీ, శక్తిని ప్రత్యేకంగా ఉపాసించేవారిని శాక్తేయులు, సూర్యారాధకులను సౌరులను, సుబ్రహ్మణ్యారాధకులను స్కాందులని అన్నట్లుగానే గణపతిని పరబ్రహ్మంగా పూజించేవారిని గాణాపత్యులు అంటారు. గాణాపత్యం కూడా సనాతనధర్మంలో అనాదిగా ఉన్న మతమే. గాణాపత్యానికి కూడా శైవ, వైష్ణవ, శాక్తేయాలకు ఉన్నన్ని ఆగమాలు, తంత్రశాస్త్రాం, పురాణకథలు, స్మృతిప్రమాణాలు, ఆరాధాన పద్ధతులు, విస్తారమైన వివరణలు, ఆచార్య పరంపర ఉన్నాయి. అనేకమైన ఋషులు, ద్రష్టలు సైతం మనకు గాణాపత్యంలో కనిపిస్తారు. గణపతికి ఏ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమేమి సమర్పించాలి, ఎలా సమర్పించాలి వంటి అనేక విషయాలు గాణాపత్యం విస్తారంగా చెబుతుంది.  


శైవులకు ప్రదోషం, మాసశివరాత్రి, మహాశివరాత్రి ఇత్యాదులు, వైష్ణవులకు ఏకాదశులు, శాక్తేయులకు అష్టమి, పూర్ణిమాది తిథులు ఎలా విశేషామో అలాగే గణేశ భక్తులకు చవితి తిథి అంత పవిత్రం. ప్రతి ఏకాదశికి ఒక పేరు, ఒక పురాణ కథ ఉన్నట్లుగానే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష, కృష్ణ పక్ష చవితులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. గాణాపత్య ఆగమాల్లో వాటికి ప్రత్యేక కథలు ఉన్నాయి. ఆరాధన విధులు చెప్పబడ్డాయి. అవేగాక ఇతర పర్వదినాలకు గణపతికి ఉన్న సంబంధం, ఆయా తిథుల్లో గణపతిని పూజించాల్సిన విధులు వాటిల్లో చెప్పబడ్డాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది వినాయక నవరాత్రులు, సంకటహర చవితులు మాత్రమే. కానీ అవి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.  


శైవం, శాక్తేయం, స్కాందం (కౌమారం), సౌరం, వైష్ణవం లో గణపతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. (రామానుజుల శ్రీవైష్ణవం గురించి కాక ఇక్కడ ప్రస్తావించేది ఆదిశంకరుల వైష్ణవం గురించి). గణపతి ఉపాసన లేకుండా మిగితా 5 మతాల్లో ఉపాసన పూర్ణత్వానికి వెళ్ళదు. గణపతికి చెందిన శాస్త్రాలు తెలుసుకోవడం గణపతి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలగజేయడమే కాదు, గాణాపత్యం రక్షించబడుటకు సహాయపడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః  

Friday, 23 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (241)



తమ తమ మనఃప్రవృత్తులకు, ప్రీతికి అనుగుణంగా ఒక్కొక్క దేవతా మూర్తిని ఇష్టపడుతూ ఉంటారు. ఒక పిల్లవాడు, తల్లిని సమీపించినట్లుగా ఒక భక్తుడు అమ్మవారిగా చింతిస్తాడు. పరమశాంతి కావాలని కోరుకొనేవాడు దక్షిణామూర్తిని ధ్యానిస్తాడు. నృత్యగీతాలతో దేవుడిని సంతృప్తి పరచాలని ఒకడు భావిస్తే అతడిని కృష్ణునిగా కొలుస్తాడు. కనుక తమ ఇష్టాన్ని అనుసరించి ఒక మహాశక్తిని ఒక్కొక్కమూర్తిలో భావిస్తాడు. ఆ మూర్తి జీవంతో, దయతో తొడికిసలాడుతున్నట్లుగా భావిస్తాం. శుష్కమైన రూపంతో ఉన్నాడని భావించం. ఇట్లా మన మనఃప్రీతిని బట్టి ఆరాధన సాగుతోంది. అందరినీ ఒక దేవతనే పూజించండని మన మతం చెప్పదు. అందొక స్వేచ్ఛ దాగియుంది. మొదట మన ఇష్టదేవతను భజించినా మనకీ ప్రత్యేక మనఃప్రవృత్తి ఉందేమిటని ప్రశ్నించుకొని అన్నిటిని పరమాత్మగా భావించే మనఃప్రవృత్తిని ఆ మూర్తియే మనలో కల్గిస్తాడు.


మనమొక దేవతను ఇష్టపడి ఎట్లా ఆరాధిస్తున్నామో, ఇతరులు కూడా వారి వారి ఇష్టాలననుసరించి పూజిస్తున్నారు. కనుక ఇతర దేవతలు తక్కువ వారని, మన దేవతయే ఎక్కువని భావించకూడదు. మనకెట్లా మన మూర్తి కోరికలను తీరుస్తున్నాడో వారికీ వారి మూర్తులు అనుగ్రహం చూపిస్తున్నారని భావించాలి. అయితే ఒక సందేహాన్ని కొందరు వెలిబుచ్చుతూ ఉంటారు. ఏమిటనగా పురాణాలలో ఫలానా దేవత ముఖ్యుడని, ఇతర దేవతలు తక్కువ వారనీ ఉంది. ఈ దేవత చేతిలో మిగతా దేవతలు ఓడింపబడినట్లుంది కదా అని ప్రశ్నిస్తారు. దీని నెట్లా అర్థం చేసికోవాలి? సంస్కృతంలో నహినిందా న్యాయమని ఒకటుంది. 


పురాణకర్తల తాత్పర్యం, ఇతర దేవతలను నిందించడం కాదు, తానిష్టపడిన దేవతను ప్రశంసించడమే. ఎందుకిట్లా ఉంది? తానిష్టపడే మూర్తీ పట్ల అచంచల విశ్వాసం కలగడం కోసం, ఏకాగ్రత సిద్ధింప చేయడం కోసం, నిందా వాక్యాలున్నట్లు కన్పిస్తాయి. అభీష్టపడే మూర్తి శక్తిమంతుడని, అట్టి శక్తి ఇతరదేవతలకు లేదని చెప్పడం అందుకే.


పూర్వకాలంలో ప్రసిద్ధులైన వ్యక్తులు సమస్త దేవతలను ఒకే విధంగా భావించారు! కాళిదాసు, బాణుడు వంటి కవులు ఒకే మూర్తి భిన్న భిన్నంగా అవతరించిందనే వ్రాసారు.

భక్తుల మనఃప్రవృత్తులను అనుగుణంగా భిన్న భిన్న ఆకారాలలో కనపడడమే కాదు, ఆ దేవతలు చేసే పనులూ ఒక్కొక్క గుణాన్ని ఆధారంగా చేసికొని యుంటాయి. సృష్టించేటపుడు బ్రహ్మ రజోగుణాన్ని ఆధారంగా చేసికొన్నాడు. సత్త్వ గుణంతో ఉన్నపుడు విష్ణువుగా కన్పిస్తాడు. సంహరించే సమయంలో తమో గుణాన్ని శివుడు స్వీకరిస్తాడు. లేదా ఆశ్రయిస్తాడు. ఒకే ఒక శక్తి, త్రిమూర్తులుగా కన్పిస్తోందని కాళిదాస కవి అన్నాడు. ఈ ముగ్గురికీ ఏది నప్పుతుందో మిగతా దేవతామూర్తులకూ ఇదే అనువర్తిస్తుంది.


కనుక ఒక దేవత గొప్ప, ఒక దేవత తక్కువ అని కీచులాడడం తగదు. అయినా మానవ మనఃప్రవృత్తుల వికారాల వల్ల వీరశైవులూ, వీరవైష్ణవులు గత కాలంలో పోట్లాడుకొన్నారు. ఆ మహావిష్ణువు, ఆ మహాదేవుడైన శివుడు ఒక్కరే కదా.

Thursday, 22 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (240)



ఇష్టదేవత


ప్రజలు భిన్నభిన్న మనః ప్రవృత్తులు కలిగియుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత, ఇష్టంగా ఉంటుంది. అందరిలోను భక్తిని, చిత్తశుద్ధిని కల్గించడం కోసం, ఏకాగ్రతను సిద్ధింపచేయడం కోసం, పరమాత్మయే భిన్న దేవతా మూర్తులను ధరించి అవతరించాడు.


ఈ హిందువులకు కోట్ల మంది దేవతలున్నారేమిటని పాశ్చాత్యులు వేళాకోళం చేస్తారు. కాని ఉన్నది ఒక్క స్వామియే అని సగటు హిందువు భావిస్తాడు. పెక్కు మంది దేవతలున్నారని భావించడు. ఉన్నది ఒక్క దేవతయే యని వైదిక మతం చెప్పడమే కాదు, జీవుడే పరమాత్మయని చెబుతుంది. ఇట్టి సిద్ధాంతాన్ని ఇతర మతాలు చెప్పవు. ఒక స్వామి, సర్వ నియామకుడని భావించని హిందువంటూ లేదు. ఆ ఒక్కడే అనేక రూపాలను ధరిస్తాడని, అతడు దయామూర్తియేయని భావిస్తాడు.


ఆ స్వామియే ఈ భరత భూమిలో భిన్న ఆకారాలలో మహాత్ములకు కన్పిస్తాడు. వారే మంత్రాలనందించారు. ప్రతి దేవతామూర్తికి ప్రత్యేక పూజా విధానాన్ని అందించారు. వారు నిర్దేశించిన మార్గంలో పయనిస్తే తమ ఇష్టదేవత యొక్క కృపకు భక్తులు నోచుకుంటారు. ఏ దేవత, ఏ ఆకారంలో ఉన్నా అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకోవడమే. అందువల్ల సందేహం లేకుండా భక్తిని అంకిత భావంతో అభ్యసిస్తూ ఉంటాం. అతడే సంసారవిముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతాం. బంధవిముక్తికి అర్హత సంపాదించేటంత వరకు మన కోరికలను స్వామి తీరుస్తాడు.


Wednesday, 21 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (239)



ఊడుగు చెట్టని ఒక చెట్టుంది. పక్వంకాని పండు నేల మీద పడితే అది బ్రద్దలౌతుంది. వెంటనే అందలి గింజలు ఏదో శక్తి తీసికొని, వెళ్లినట్లుగా చెట్టు మొదట్లో చేరుతాయి. చెట్టును పట్టుకొని గింజ మాయమవుతుందట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకు చేరుతుందట. అంటే చెట్టులోనే ప్రవేశిస్తుంది. అట్లాగే భగవానుని నుండి వచ్చిన మనము అతని వైపు పయనించి అతట్టి పట్టుకొని అతనిలో ప్రవేశించాలి, ఏకం కావాలి. రెండవ ఉదాహరణ - సూది, సూదంటు ఱాయికి ఆకర్షింపబడడమే కాకుండా, చివరకు అట్టి సూదికీ ఆకర్షించే లక్షణం వస్తుంది. ఆ సూది కూడా ఇతర ఇనుప పదార్థాలను ఆకర్షించగలదు. అనగా భక్తునకు భగవల్లక్షణాలు సంక్రమిస్తాయి. శక్తి వస్తుంది. మూడవది, పతివ్రత - భర్త గురించి, పతివ్రత యొక్క సంభాషణ, పనులు, తలపులు అన్నీ భర్తను గురించే. అట్లాగే భక్తుడు తన మనస్సును, వాక్కును క్రియను భగవంతుని గురించే యుండాలని సూచిస్తున్నాడు. మూల శ్లోకంలో పతి' అని లేదు. విభుడని ఉంది. అనగా భగవంతుణ్ణి ఒక్కచోటనే ఉన్నాడని భావించకుండా అన్ని చోట్ల ఉన్నాడని (విభువని) భావించాలని సూచించారు. తరువాత లతలు. చెట్టు నుండి విడదీసినా కొంత సేపటికి లత, ఆ చెట్టును చుట్టుకొంటుంది. అట్లాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సు భావాలూ అతనివైపే ప్రసరించాలని సూచించారు. ఈశ్వరుడే లక్ష్యమన్న మాట. చివరగా నదులు - సముద్రము. ఇదే అద్వైత భావన, సముద్రం నుండే వర్షం వస్తోంది. (సూర్య కిరణాలు - ఆవిరి - మేఘంగా మారుట - వర్షం) అది నది అవుతోంది. కనుక సముద్రానికి, నదికి భేదం లేదు. నది కొండకొమ్ముపై పుట్టి సంతత గమనంతో చివరకు సముద్రాన్ని చేరుతోంది. తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. అనగా దాని ఊరు, పేరు పోగొట్టుకుంటోంది. సముద్రం ఎదురేగి స్వాగతం పల్కుతోంది. అందువల్లనే నదులు, సముద్రంలో కలిసే చోటునకు ముందుగా నది నీరు కూడా ఉప్పగా ఉంటోంది. అట్లాగే నిజమైన భక్తిని చూపిస్తే భగవానుడు దయతో చేతులు చాస్తాడు. కౌగలించుకొంటాడని సూచన.


మొట్టమొదట భక్తి, వ్యాపారధోరణిలో సాగినా, డబ్బు కీర్తి రావాలని భక్తుడు తహతహలాడినా, భగవానుని కల్యాణ గుణాలను చింతించిన కొలదీ ఏ కోరిక లేక అతణ్ణి కోరుతాం. చివరకు నిర్గుణ బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది. అతనిలో లీనమైపోతాము. అతడేయైపోతాం.


ప్రపంచ జీవితాన్ని సరిగా నడపాలన్నా, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతానుభవం రావాలన్నా భక్తి, తప్పనిసరి. మోక్ష సాధన సామగ్రిలో భక్తి శ్రేష్టమైనదని శంకరులన్నారు. అట్లా అంటూ తనను తానగుట (స్వ స్వరూపానుసంధానం) భక్తియని సెలవిచ్చారు కూడా.


మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ 

స్వ స్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే


Tuesday, 20 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (238)



శంకరుల అభిప్రాయం - భక్తి లక్షణాలు


ఈశ్వరుణ్ణి భక్తితో సేవించి, ఇద్దరూ ఒక్కటే అని చింతిస్తూ, అభిన్నులని గాఢంగా భావిస్తూ ఉండే అద్వైత జ్ఞానులెందరో ఉన్నారు. మధుసూదన సరస్వతి, అప్పయ్య దీక్షితులు, సదాశివ బ్రహ్మేంద్రులు, భగవన్నామ బోధేంద్రులు మొదలైనవారు జ్ఞానులై యుండి భక్తి సామ్రాజ్యంలో ఓలలాడేవారు. నిర్గుణ బ్రహ్మమునకు, కల్యాణ గుణాలతో ఉన్న సగుణ బ్రహ్మకు భేదాన్ని చూడలేదు. మధుసూదన సరస్వతి ఇట్లా అంటారు: ఏది నిర్గుణము, ఏది నిష్కలమో దోషరహితమో దానిని యోగులు ధ్యానించనీయండి కాని నేను నీలమేఘశ్యాముడైన, యమునా నదీ సైకతాలలో విహరించే గోపాలకృష్ణుని ధ్యానిస్తాను. అన్ని రూపాలూ పరమేశ్వరుని రూపాలే, అంతా ఒక్కటే అని జ్ఞానులు భావిస్తారు. వారు జ్ఞాన నిష్ఠులైనా ఏదో ఒక మూర్తిపై మక్కువ కలిగియుంటారు. అనగా భక్తి తాత్పర్యంతో కూడి యుంటారు. చిన్నతనంలోనే వారి కట్టి ప్రీతి ఉదయించి యుండవచ్చు.


శంకరులే దేవతను నుతించినా అందరినీ బ్రహ్మముగానే భావించి స్తోత్రాలు చేసారు. శివానందలహరిలో చాలా అందంగా భక్తిని నిర్వచించారు.


అంకోలం నిజబీజసంతతి రయస్కాతోపలం సూచికా


సాధ్వీనైజవిభుం లతాక్షితిరుహం సింధుస్సంద్వల్లభం


ప్రాప్నోతీహ యథాతథా పశుపతేః పాదారవిందద్వయం


చేతో వృత్తి రు పేత్య తిష్ఠతి సదా సాభక్తి రిత్యుచ్యతే


అనగా ఊడుగు గింజలు, వాని యంతట అవే ఆ చెట్టు మొదలునెట్లు పట్టుకొంటాయో, సూదంటు ఱాయిని సూది ఎంత గట్టిగా పట్టుకొనియుంటుందో, పతివ్రత తన విభుణ్ణి ఎడబాయకుండా అనుసరిస్తూ ఉంటుందో, తీగ తనంతట తానే చెట్టును పెనవేసికొని యుంటుందో, నదులు తమంతట తామే సముద్రంలో ఎట్లా కలుస్తున్నాయో అట్లాగే మనస్సు అన్నివేళలా పరమేశ్వరుని పాదారవిందాలను పట్టుకొని అక్కడినుండి తొలగకుండా ఉండదమే భక్తియని పెద్దలంటారు.


Monday, 19 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (237)



మనమేం చేస్తున్నాం? నిజరూపాన్ని విస్మరించాం. ముసుగుతో కూడియున్నాం. మనకు దగ్గరవారిని విడిచినపుడు ఎంతో బాధపడతాం. కాని స్వరూపాన్నే మనం విస్మరించడం వల్ల ఎంత బాధపడాలో ఆలోచించండి. మన నిజమైన ఆనందంలో ఎప్పుడు లీనమౌతామని తహతహలాడగలగాలి. పరమాత్మతో కూడాలనే ఆందోళన ఉన్నపుడే నిజమైన ప్రేమ పెల్లుబుకుతుంది. అట్టి ప్రేమనే భక్తియని యంటారు. 


దీనికై పూజ, ఆలయాల సందర్శనం మొదలు మొట్టమొదట సాగాలి. ప్రపంచ వ్యవహారాలలో మునిగి తేలేవారికి పరమాత్మను చింతించడానికై తప్పక ఉపకరిస్తాయి. ఇట్టి స్థితిలో స్వామి ఆలయంలోనే ఉండడు, అంతటా ఉంటాడనే భావన గాని యుండకపోవచ్చు. అతడు మూల విగ్రహంలో ఉన్నాడని ఇట్టి దశలో భావించినా తప్పులేదు. ప్రసాదం తినివేసి ఏ స్తంభాలకో చేతులను పులుముతూ ఉంటారు. అరెరె! స్వామి లోపల ఉన్నాడు, మనమీ పనిని చేస్తున్నామేమిటని భయం పుడుతుంది. కనుక దేవుడు లేదని అనడం కంటే ఆ మాత్రం భయమున్నా చాలు. అట్టి భయభక్తులే మనలను క్రమక్రమంగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. రానురాను అంతటా స్వామి ఉన్నాడనే భావన కల్గుతుంది. రానురాను అనుభవం పాకాన పడిన కొద్దీ నాది నాకిమ్ము అని అడుగుతాం. అనగా స్వస్వరూపాన్ని గుర్తించేటట్లు అనుగ్రహించుమని ప్రార్థిస్తాం. జ్ఞానాంబిక అట్టి అనుగ్రహాన్ని భక్తులపై ప్రసరించుగాక!


Sunday, 18 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (236)



నాది నాకిమ్ము


ఒక భక్తుడు పూజ చేద్దామని కూర్చున్నాడు. అతనికొక సందేహం వచ్చింది. ఈశ్వరుణ్ణి ఇట్లా అడగడం మొదలు పెట్టాడు. స్వామీ! నేనేమో పూజ చేద్దామని కూర్చున్నా. అయినా ఏదో తప్పు చేస్తున్నట్లనిపించిందయ్యా! నేను నీకు ఉద్ధరణి నీళ్లతో అర్హమియ్యడమా? ముల్లోకాలను ఆక్రమించిన పాదాలకా? నేనీ వస్త్రాన్ని అర్పించడమా? దిగంబరునకు, అనగా అన్ని దిక్కులా వ్యాపించిన నిన్ను వస్త్రంతో కప్పడమా? పోనీ, నీకు సాష్టాంగ నమస్కారం చేద్దామంటే అక్కడా లోపం కన్పిస్తోందయ్యా. ఒక వైపు తిరిగి నమస్కరిస్తే మరొక వైపున కాళ్లను చూపించినట్లోతుంది. ఏ దిక్కున నీవు లేవు? ఏవో పువ్వులతో పూజ చేద్దామంటే సర్వాంతర్యామినెట్లా పూజించేది? ఎక్కడో ఒక్క చోటే ఉండవు. ఏదైనా ఫలానాది అడుగుదామంటే నేను అడుగబోయేది ఇంతకు ముందు నీకు తెలియదని అనడం వంటిదే. నా ప్రార్ధన, నీ అనంత శక్తిని శంకించినట్లే. నీవే నేనయ్యానని తెలియక, పొగడడం వల్ల నిన్ను తక్కువ చేసినటౌతుంది కదా! అంతటా ఉన్నవానిని, అన్నీ తెలిసినవానిని ఏమని, ఎంతని అడగడం ఏమిటి? నీవు సచ్చిదానందరూపుడవు. నీకంటే వేరైనది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. అయినా ఏవో లోపాలతో ఉంటున్నా. నీవూ, నేనూ ఒకటని వేదాలు చెప్పినా ఏవో లోపాలు తరుముతున్నాయి నన్ను. నేను నీవంటే భిన్నుడనే భావననను తొలగించు. తొలగించగలిగితే నీవు అన్నీయని, నీవే నేననే భావన కల్గుతుంది నాలో. అనగా అన్నీ నేననే భావన రానీ! ఏవో అవి కావాలని, ఇవి కావాలని నిన్ను అడగడం లేదు. నాది నాకిమ్ము, (స్వ స్వరూపాన్ని ప్రసాదించు) అని ప్రార్థించాలి. అందుకే సదాశివ బ్రహ్మేంద్రులు శివమానసిక పూజా స్తోత్రంలో


మహ్యందేహిచ భగవాన్


మదీయమేవ స్వరూపమానందం


అనగా సహజ రూపమైన ఆనందాన్ని ప్రసాదించుమని అన్నారు.


Saturday, 17 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (235)



"సంధ్యావందన భద్రమస్తు భవతే..." అని కీర్తించాడు.


లీలాశుకుణ్ణి కృష్ణ భక్తి ఆవరించి సంధ్యావందనం, పితృతర్పణం వంటి చేయవలసిన కర్మల నుండి దూరం చేసింది. వాటికి మంగలం పలుకుతున్నాడు.


ముందుగా వైదిక కర్మలను చేసేటప్పుడు వీటికి ఫలం ఉంటుందా? ఉండదా? అనే భావం లేకుండా చేసి తీరాలి. ఇట్లా చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మురికి ఎప్పుడైతే పోయిందో భగవానుని వైపు మనస్సు మళ్లుతుంది. ఇట్టి భక్తి రెండవ మెట్టు, భక్తి పరిపక్వమైతే జ్ఞానం లభిస్తుంది. ఇది చివరి మెట్టు.


కాని మనంతటమనం కర్మ, భక్తులను విడిచి పెట్టకూడదు. పండిన పండు తొడిమ నుండి రాలేటంత వరకూ అనగా జ్ఞానోదయ పర్యంతమూ వీటిని మానరాదు. ఆ భక్తి, కర్మలు వాటంతట అవే మనలను విడిచిపెట్టేయాలి.


భక్తిని విడిచి ముక్తికై సాధన చేయకూడదు కూడా. భక్తిని అనుసరిస్తే అదే మార్గాన్ని చూపిస్తుంది. ముక్తికి బాటలు వేస్తుంది. కనుక ముక్తికి ఆరాటపడడానికి ముందు భక్తినే ఆశ్రయించాలి. భక్తినిమ్మని ప్రార్ధించాలి కూడా, భక్తి మార్గంలో పయనిస్తున్న కొద్దీ ముక్తి అదే వస్తుందనే పై గోపాలకృష్ణ భాగవతార్ గారి మాటలు శిరోధార్యం.