Wednesday, 30 December 2015

రమణీయం... స్మరణీయం .....రమణమహర్షి

30 డిసెంబరు 1879 లో జన్మించారు భగవాన్ రమణమహర్షి. 20 వ శతాబ్దపు మహర్షి అని అనేకులచే కీర్తించబడిన భగవాన్ రమణులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అనేక మంది ఉపాసకులు అనుభవాల ద్వారా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి విచారమార్గాన్ని చూపిన గురువులు రమణులు. నేడు భగవాన్ రమణుల జయంతి.

--------------------------
రమణీయం... స్మరణీయం - డి.వి.ఆర్. భాస్కర్ - సాక్షి దినపత్రిక 25 డిసెంబరు 2014

భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో  1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.
 అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా  మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.

 రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు.  ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.

 ‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమందిపై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!

రమణ వాణి

మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం.  భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు.  సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం.  నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం.  భగంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన.  మన జీవితంలో అనివార్యమైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణతో మెలగడం అందరికీ అత్యవసరం.  జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి.  మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు.  సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది. మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది.  నీ విశ్వాసమే నీ ఆయుధం.

http://www.sakshi.com/news/family/the-simplest-way-to-spiritual-198369

Sunday, 27 December 2015

హిందూ ధర్మం - 189 (గోవు ప్రాముఖ్యత)

నిరుక్తం గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే వేదాలకు ప్రామాణికమైన అర్దాలు కాక తమకు తోచిన అర్దాలను చెప్పి, ధర్మాన్ని నాశనం చేయాలని, మతమార్పిడి చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పే ఏ విషయాలకు శాస్త్రప్రమాణం ఉండదు. వేదాలకు తప్పుడు అర్దాలు తీసి అందులో లేనివి ఉన్నాయని ప్రచారం చేయడంలో అనేకులు తలమునకలై ఉన్నారు. అందులో వాళ్ళు ప్రధానంగా చేసే కొన్ని ఆరోపణల వెనుకనున్న సత్యాలను తెలుసుకుందాం.

వేదాల్లో గోవధ ఉందనే ప్రధానమైన ఆరోపణ. వేదమే ధర్మానికి మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది, వైదిక సంస్కృతి వచ్చింది. అగ్ని ఆరాధన ప్రతి మానవుడు చేయాలని వేదంలో ఈశ్వరశాసనం. అగ్ని ఆరాధాన చేయడమంటే అగ్నిహోత్రంలో హవిస్సును, ఘృతాన్ని (ఆవునెయ్యి) సమర్పించడం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అగ్ని ఆరాధాన జరగాలంటే ఆవు ఉండాలి. ఆవు నుంచి వచ్చే పిడకలతోనే ప్రతి దినం రెండు సంధ్యాసమయాల్లోనూ నిత్యాగ్నిహోత్రం చేయాలి. అగ్ని ప్రజ్వరిల్లాలంటే అందులో ఆవునెయ్యి పడాలి. ఏం గేదే నెయ్యి వెయవచ్చు కదా? అని సందేహం వస్తుంది. లేదా మరింకేమైనా మండే పదార్ధం వేయవచ్చు కద, పెట్రోల్, కిరసనాయిల్, డీజీల్ లాంటివి. ఆవునెయ్యే ఎందుకు వేయాలి? అయినా, పది మందికి పెట్టక వాటిని తీసుకెళ్ళి నిప్పులో పోయడం మూర్ఖత్వం కాదా? ఆవుకే ఆ ప్రత్యేకత ఎందుకు? ఇలా అడుగుతారు హైందవ ద్వేషులు.

ముందు గోవు విశిష్టత తెలుసుకుందాం. ఆ తర్వాత వేదాల్లో గోవధ ఖండన చూద్దాం. ఆగ్నికి ఏ పదార్ధాన్ని ఆహుతిచ్చినా అది కార్బన్-డై-ఆక్సయిడ్ ని, ఇతర హానికార, కాలుష్యకారక పదార్ధాలను విడుదల చేస్తుంది. కానీ ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతిస్తే, 10 గ్రాముల ఆయినెయ్యి 1 టన్ను ఆకిజెన్ (ప్రాణవాయువు) ను ఉత్పత్తి చేస్తుంది. ఆవు అన్నప్పుడు అది దేశవాళీ ఆవు/ నాటు ఆవు/ భారతీయ ఆవు గానే గ్రహించాలి. జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదు. యజ్ఞం అనేది అగ్నిలో ఏవో వస్తువులు వేసి వృధా చేయడం, ప్రకృతిని నాశనం చేసే ప్రక్రియ కాదు. అది ప్రకృతికి నూతన ఉత్తేజాన్ని, శక్తిని, పుష్టినిచ్చే ప్రక్రియ అని వేదం చెప్పింది. దీనిపై కుతూహలంతో పరిశోధించిన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అదే గాకా, హవిస్సుగా వేయబడిన ఆవునెయ్యి వాసన ఎక్కడ వరకు వ్యాపించబడుతుందో, అంతవరకు గాలిలో సూక్ష్మక్రిములు నశిస్తాయని ధర్మం చెప్పింది, ఆధునిక పరిశోధనలు కూడా ముమ్మాటికి నిజమని నిరూపించాయి. అంతేగాకా హవిస్సులో గేదేనెయ్యి వేస్తే, అది భూమి నుంచి 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల పై వరకు మాత్రమే వెళ్ళగలదు. కానీ ఆవునెయ్యి అణువుల రూపంలో మారి భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పైకి వెళ్ళి, 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపిస్తుంది. అక్కడ ఏవైనా నీటి అణువులు ఉంటే, వాటిని దగ్గరకు చేర్చి, వర్షం కురిపించగల శక్తి ఆవునెయ్యి అణువులు కలిగి ఉన్నాయి. అంతేకాక ఇవి తాము పైకి చేరే క్రమంలో తమ చుట్టు ఉన్న కాలుష్యాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాయి. అనగా యజ్ఞం వలన కురిసే వర్షం స్వఛ్ఛమైన నీటిని ఇస్తుంది. అసహజ పద్ధతుల్లో రసాయనాలు చల్లి మేఘాలను వర్షింపజేయడం వలన కురిసిన వాన నీటి బిందువుల్లో హానికారక రసాయనాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిబట్టి ఆవునెయ్యి ఉపయోగం ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే పెట్రోల్, డీజీల్, లేక చెత్త మొదలైనవి కాల్చినప్పుడు వెలువడే వాయువులు విషాలుగా మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, భూతాపాన్ని పెంచుతాయి. అదే ఆవుపిడకలను, ఆయుర్వేద మూలికలను ఆవినెయ్యితో కాల్చినప్పుడు వెలువడే వాయువులు కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ ఋషులు వేల ఏళ్ళ క్రితమే చెప్పారు. అది నమ్మనివారు, వైదిక ధర్మంపై నమ్మకం ఉండి, కుతూహలంతో పరిశోధించిన అనేకులు ఈ విషయాలను సత్యమని రూఢీ చేసుకున్నారు. ఇంకా ఆవునెయ్యిని యజ్ఞంలో వేయడమెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారు ఎంత వెనుకబడి ఉన్నారో, మార్పును అంగీకరించని మూఢులుగా మిగిలిపోతున్నారో, సత్యం తెలుస్తున్నా, అంగీకరించడానికి అహం అడ్డువచ్చి, దురహంకారులుగా బ్రతుకీడుస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.

To be continued ...................

Friday, 25 December 2015

తేనేటీగా నా గురువు - దత్తుడు

తేనెటీగ నా గురువు. తేనెటీగ తాను ప్రపంచమంతా తిరుగుతూ మకరందాన్ని సేకరిస్తుంది. తాను ఏ పువ్వు మీద వాలినా, ఆ పువ్వుకు ఎటువంటి హాని చేయకుండా, తన పని ఎంటో అదే తాను చేసుకుంటుంది. అలాగే ముక్తిని కోరే సాధకుడు కూడా అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదివినా, తన సాధనకు ఏది అవసరమో, ఎంత వరకు అవసరమో అంతవరకే గ్రహించాలని, అనవసరమైనవి, ఆధ్యాత్మిక సాధనను భంగం చేసే వాటిని విసర్జించాలని నేను తేనెటీగ ద్వారా గ్రహించాను.

తేనెటీగ ఆ పువ్వు, ఈ పువ్వు అని చూడదు. మకరందం ఎక్కడ దొరుకుతుందా అని మాత్రమే చూస్తుంది. అలాగే సాధకుడు కూడా మొహమాటానికి వెళ్ళకుండా, ఎక్కడ జ్ఞానం ఉన్నా, దాన్ని గ్రహించడానికి సదా సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను.

శ్రీ గురు దత్తాత్రేయ


Thursday, 24 December 2015

గొంగళిపురుగు నా గురువు - దత్తుడు

నా గురువులలో గొంగళిపురుగు ఒకటి. కందీరిగ తన గొంగళి పురుగును తీసుకెళ్ళి తన గూట్లో పెట్టి, జుంకారం చేస్తూ దాని చుట్టు తిరుగుతుంది. అది చూసిన గొంగళిపురుగు, భయంతో మరే ఇతర ఆలోచన లేక తదేకంగా తన తల్లైన కందిరీగనే గమనిస్తుంది. మనసులో కందిరీగ తప్ప మరే ఇతర ఆలోచనా ఉండదు. దాన్నే తీక్షణంగా గమనిస్తుంది. ఆ కందిరీగ మీద తదేక ధ్యానం చేత, గొంగళిపురుగు క్రమంగా రెక్కలు వచ్చి, రూపాంతరం చెంది కందిరీగగా మారి, ఎగిరిపోతుంది. అదే విధంగా సాధకుడు కూడా తన మనసును తదేకంగా దేని యందు లగ్నం చేస్తాడో, అతడు ఆ స్వరూపాన్నే పొందుతాడని దాని ద్వారా నేను తెలుసుకున్నాను.

నిరంతరం మనసు దేనిని మననం చేస్తుందో, అది స్వరూపాన్నే సంతరించుకుంటుంది. కనుక ముక్తిని కోరే వ్యక్తి సదా ఆత్మ యందు ధ్యానం నిలిపితే, అతడు ఆత్మ స్థితి యందే స్థిరపడిపోతాడు.

శ్రీ గురు దత్తాత్రేయ స్వామి 

Sunday, 20 December 2015

హిందూ ధర్మం - 188 (నిరుక్తము - 6)

వైదిక వాజ్ఞ్మయంలో ఇంద్రుడిని ఏడు ప్రవాహాలకు మూలమైన ఆత్మగా చెప్పారు. ఋగ్వేదం 4.28.1 స్పష్టంగా చెప్తున్నదేమిటంటే ఇంద్రుడు, అనగా ఆత్మ, ఈ 7 ప్రవాహాల చలనంలో పెడుతుంది, మూసుకుపోయిన ఇంద్రియాలను తెరిపిస్తుంది. వేదంలో నదుల పేర్లు చారిత్రిక, భౌగోళిక, లేక నశించిపోయే వస్తువులను సూచించవు. వాటికి ఆధ్యాత్మిక అర్దాలున్నాయి. సరస్వతీ అనగా వాక్కు. వాసన గ్రహించటానికి కారణమవుతూ నాసికల ద్వారా బయటకు ప్రవహించే ప్రవాహం గంగ. చెవి ద్వారా ప్రవహించే శక్తి యమున. స్పర్శ ప్రవాహం శతదృ. శిరస్సువైపుగా ప్రవహించేది విపస. అరవిందులవారు కూడా వేదంలో సప్తనదుల ప్రస్తావన భౌగోళిక, తాత్కాలిక పదార్ధాలను సూచిస్తుందని అంగీకరించలేదు.

ఇమంమే గంగేయమునే అంటూ ఋగ్వేదం 10 వ మండలం, 75 సూక్తం, 5 వ మంత్రంలో 10 నదుల ప్రస్తావన ఉంది. నిజానికి అవి నదుల పేర్లు కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో అవి శరీరంలోని నాడుల పేర్లు. నాదం (శబ్దం) చేస్తాయి కనుక వాటిని నదులు అన్నారు. చెవులు మూసుకున్నప్పటికి వాటి ప్రవాహ శబ్దాన్ని వినవచ్చు. (ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇప్పుడే ధృవపరుచుకోవచ్చు. నిశబ్దంగా కూర్చుకుని, చెవులు మూసుకున్నా, లోపల వేగంగా ఏదో ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే నాడీ ప్రవాహం).

పైన చెప్పుకున్న మంత్రానికి విదేశీయులు భౌగోళికమైన అర్దం చెప్పగా, దాని అసలు అర్దం ఇలా ఉంది. ఓ గంగా, ఇడా నాడి, ఓ యమునా, పింగళ నాడీ, శతధృ, పరూషిని, సరస్వతీ - సుషుమ్నా నాడీ, నా స్తోత్రాన్ని వినండి. ఓ మరుద్వృధా - సుషుమ్నా, వితస్తతో కూడిన ఆర్జికియా - సుషుమ్నా, నా స్తోత్రాన్ని వినండి. (ఇడా, పింగళా, సుషుమ్నా మొదలైన నాడుల ప్రస్తావన యోగశాస్త్రంలో ఉంటుంది. యోగం పరిచయం ఉన్నవారికి ఇది తేలికగా అర్దమవుతుంది.)

యోగశాస్త్రంలో ఇవే నామాలను తన మీద ధ్యానం చేత జనుల కష్టాలను దూరం చేసి, మోక్షాన్ని ప్రసాదించగల భగవంతునికి కూడా అన్వయం చేశారు.

ఈ నామాలనే ధమనులకు కూడా వాడారు. పండిత పాళి రత్న గారు చెప్పేదేమిటంటే గంగ, దేహంలో రక్త ప్రసరణ సక్రమంగా సాగడానికి కీలకమైన నాడి. అన్ని శరీర భాగాల కదలికలను నియంత్రించేది యమున. ఈ నాడి బలహీనపడితే, పక్షవాతం వస్తుంది. జ్ఞానాన్ని కలిగించే నాడిని సరస్వతీ అన్నారు. అదే సుషుమ్నా కూడా. శతధృ అనేది సుషుమ్నా నాడిలో ముఖ్యమైన భాగం. అది వేగంగా జ్ఞానం కలిగిస్తుంది. దేహమంతా ఉష్ణతను కలిగిస్తూ, అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే నాడి పరూషిని. వాహికలు లేని గ్రంధులను అసిక్ని అన్నారు. దేహానికి పుష్టినిచ్చే ప్రాణాన్ని మరుద్వృధా అన్నారు. మాంసం అంతటా వ్యాపించి ఉన్న నాడిని వితస్తా అన్నారు. ఎటువంటి నియంత్రణలు, అదుపులేకుండా పని చేసే నాడి ఆర్జికియా, లేదా విపుషా. ఎప్పుడు తడిగా ఉండే నాడి సుషుమ్నా. (యోగంలో త్రివేణీ సంగమం అనగా ఇడా, పింగళా, సుషుమ్నా నాడుల సంగమం. ఇది భృకుటి (రెండు కనుబొమ్మల మధ్యనున్న) వద్ద ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. ధ్యానంలో అక్కడ దృష్టి నిలిపితే, క్రమంగా సాధకుడు ఉన్నతమైన అనుభూతులకు లోనై, జ్ఞానం పొంది, పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఆ త్రివేణీ సంగమమే బొట్టుపెట్టుకునే స్థానం.)

(*కొంత వరకు ఇతర విషయాలను ప్రస్తావించడం మినాహా మిగిలినదంతా యజుర్వేదానికి దేవీచంద్ గారు రాసిన భాష్యం నుంచి తెలుగు అనువాదం చేయడమైనది. వారికి పాదాభివందనాలు.)

To be continued ......................  

Thursday, 17 December 2015

సుబ్రహ్మణ్యుడి గురించి స్వామి శివానందసుబ్రహ్మణ్యుడి ఆరు ముఖాలు 6 కిరాణాలను, జ్ఞానం, వైరాగ్యం, బలం, కీర్తి, శ్రీః, ఐశ్వర్యం అనే 6 తత్త్వాలను సూచిస్తాయి. చతుర్వేదాలకు, 6 వేదాంగాలకు, షట్ దర్శన శాస్త్రాలకు ఆయనే మూలం అని చెప్తున్నాయి. ఆయన తన పంచేంద్రియాలను, మనసును వశం చేసుకున్నాడని సూచిస్తున్నాయి. షణ్ముఖుడే అనంతమైన శిరస్సులు కల విరాట్ పురుషుడు. విశ్వమంతా ఆయన దృష్టి ప్రసరించగలడని విశ్వతోముఖ తత్త్వాన్ని బోధిస్తున్నాయి. కార్తికేయుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సంకల్ప మాత్రం చేత అనేక రూపాలను పొందగలవాడు.  

స్వామి శివానంద

Sunday, 13 December 2015

హిందూ ధర్మం - 187 (నిరుక్తము - 5)

14. వేదంలో భృగు అనేది నిర్దిష్ట నామవాచకం కాదు, మహర్షి నామధేయం కాదు. భృ అనగా స్వీయ నిర్వహణ. తమ సంపాదన / శక్తి మీద బ్రతకడం. గు అనేది తీవ్రమైన శ్రమను సూచిస్తోంది. తమ స్వశక్తి మీద జీవించటానికి తీవ్రమైన కృషి చేసేవారు భృగువులు.

*వేదం అన్నప్పుడు ఈ సందర్భంలో మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులో ఋషుల పేర్లు ఉంటాయి. కాని సంహిత వరకు మాత్రం అది కాలానికి, చరిత్రకు అతీతం, సనాతనం కనుక అందులో వ్యక్తులు, నదులు, చారిత్రిక ప్రదేశాల పేర్లు ఉండవు. అలాగే ఋషుల పేర్లకు వేరే అర్దాలున్నాయని, అందువల్ల అసలు ఋషులే లేరని చెప్పకూడదు. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు 'వేద' అని ఒక వ్యక్తి పేరు ఉన్నంతమాత్రాన, వేదం అతని జీవితం గురించి చెప్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ............ అలా కాదు వేదం అనేది ఒక గ్రంధం అని, దాని గురించి ఎవరైనా వివరిస్తే, అసలు 'వేద' అనేది గ్రంధం పేరు కాబట్టి ఆ పేరుతో వ్యక్తి అనేవాడు లేడని చెప్పడం అంతే మూర్ఖంగా ఉంటుంది. వేదం (మంత్రసంహిత) లో ఉన్న అనేక పేర్లను వ్యక్తులు పెట్టుకున్నారు. యుక్తిని ఉపయోగించి అర్దం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రెండిటిని కలిపేసి విపరీతాలకు తావు ఇవ్వకూడదు.

15. వేదంలో భరతుడనగా మృదు స్వభావం కలవాడు, అభివృద్ధి, పురోగతి కోరుకునేవాడిని అర్దం. అంతేకానీ శ్రీ రామచంద్రుని తమ్ముడిగా అర్దం స్వీకరించకూడదు.

16. తన వాళ్ళు / ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో నిష్ణాతుడిని వేదంలో వశిష్ఠుడిగా చెప్పారు. వసు బ్రహ్మచారుల మధ్య ఉంటూ, ఉన్నతమైన స్థానాన్ని పొందిన గురువును కూడ ఇది సూచిస్తుంది.

17. వేదంలో సరస్వతీ అనేది నది యొక్క నామం కాదు. బ్రాహ్మణాల్లో సరస్వతీ అనే పదానికి 13 అర్దాలున్నాయి. నిఘంటులో 57 పర్యాయపదాలున్నాయి. దయానంద సరస్వతీ గారు సరస్వతీ అనేది భగవంతునికున్న నామాల్లో ఒకటని సత్యార్ధ ప్రకాశ్ లో చెప్పారు. ఆయనే వివాహ సందర్భంలో సరస్వతీ అనే పదం కనిపించినప్పుడు భార్యగా అర్దం చెప్పాల్సి ఉంటుందని వివరించారు. ఋగ్వేదం 7 వ మండలం 9 వ సూత్రం 5 వ మంత్రంలో సరస్వతీ అంటే వివరణాత్మకమైన ప్రసంగం అని చెప్పారు.

సాయనుడి ప్రకారం ఋగ్వేదంలో 15 చోట్ల సప్తనదుల ప్రస్తావన ఉంది. ఆయన వాటిని గంగా, యమునా నదులుగా అనువదించారు. కానీ దయానందులు, నిరుక్తం ఇత్యాదుల ప్రకారంగా ఆత్మ కేంద్ర స్థానం, అదే ముఖ్యశక్తి కేంద్రం. దాని నుంచి 7 నదులు ప్రవహిస్తాయి (అవి శక్తి ప్రవహాలు). 1. అహంకారం, 2. మనసు, 3. శబ్ద, 4. స్పర్శ, 5. రస (రుచి), 6. రూప, 7. గంధం (వాసన). చివిరి ఐదింటిని పంచతన్మాత్రలు అంటారు. అహంకారం అనే ప్రవాహం అహం అనే క్షేత్రం/ మార్గంద్వారా పయనిస్తుంది. (అహం నశిస్తే అన్నీ నశిస్తాయి, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రమణమహర్షి ఉపదేశం. అహం కారణంగానే కర్తృత్వం ఏర్పడుతుంది. అహం అనగా 'నేను' అనే భావన. అహం నుంచే క్రమంగా 'నేను ఇంత వాడిన్నన్న అహంకారం బయలుదేరుతుంది.) ధ్యానం అనే మార్గం ద్వార మనసు ప్రవహిస్తుంది. (ఒక వస్తువు మీద దృష్టి నిలపడమే ధ్యానం. ఆత్మ శక్తే మనసు ద్వారా భావనల రూపంలో వ్యక్తమవుతోంది.) పదాలు (శబ్దాలు) ఎటు నుంచి వినిపిస్తాయో, ఆ దిశగా చెవుల ద్వారా శబ్ద ప్రవాహం ఉంటుంది. స్పర్శ ప్రవాహాం చర్మం ద్వారా స్పర్శ క్షేత్రానికి ప్రవహిస్తుంది. రస ప్రవాహం నాలుకను క్షేత్రంగా చేసుకుని రుచి కలిగించే దిశ యందు ప్రవహిస్తుంది. అదే విధంగా రూప ప్రవహాం కంటిని ఆధారంగా చేసుకుని దృశ్యం (చూడబడుతున్న వస్తువు) దిశగా ప్రవహిస్తుంది. గంధ ప్రవాహం ముక్కును ఆధారంగా చేసుకుని శ్వాస ద్వారా ప్రవహిస్తుంది. ఆత్మ నుంచి వచ్చే ఈ 7 ప్రవాహాలు నిత్యం బయటకు ప్రవహించి, కర్మలు చేయగా, సుషుప్తి అవస్థలో (గాఢనిద్రలో) లోపలికి ప్రవహించి ఆత్మ యందు ఐక్యమవుతాయి. ఈ సప్త ప్రవాహాలే సప్త ఋషులు, సప్త కిరణాలు, ఆత్మ యొక్క సప్త హస్తాలు. (ఈ ఏడింటికి ఆత్మయే కీలకం. ఆత్మ లేకపోతే వీటికి అస్థిత్వం లేదు.)  

To be continued ................. 

Saturday, 12 December 2015

స్వామి శివానంద సూక్తిThrough the play of the mind or thought upon objects, proximity appears to be a great distance and vice versa. All objects in this world are unconnected; they are connected and associated ogether only by thought, by the imagination of your mind. It is the mind that gives colour, shape, qualities to the objects. Mind assumes the shape of any object it intensely thinks upon. - Swami Sivananda

Tuesday, 8 December 2015

వనరుల కొరతే సంఘర్షణలకు కారణం - వందనా శివమానవాళి ప్రస్తుతం అవరోహణ పథంలో పయనిస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా విచ్చలవిడి శిలాజ ఇంధన వినియోగం ప్రకృతిలోని విభిన్న జీవరాశులను, జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. నేలలో సారాన్ని దెబ్బతీసింది, నీటిని కాలుష్యమయం చేయడమే కాదు, నీటి పరిమాణం కూడా దారుణంగా పడిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసింది. ఐదు వందల ఏళ్లపాటు నిర్విరామంగా సాగిన వలసవాదం వివిధ సంస్కృతులను, భాషలను, ప్రజలను పూర్తిగా కనుమరుగు చేయడమే కాదు ఉత్పత్తి, పరిపాలన సజావుగా సాగడానికి హింసను ఆశ్రయించే సంప్రదాయాన్ని మిగిల్చింది.
ఒక సంఘర్షణను ఏవిధంగా ఎదుర్కొనాలన్న అంశంపై మన చర్చలు, ఆలోచనా పథంలో, నవంబర్ 13 నాటి ప్యారిస్ దాడు లు హింస చెలరేగడం అనేది చొచ్చుకువచ్చింది. ఈ భూమిపై పర్యావరణ సంక్షోభానికి, ప్రపంచ సాంస్కృతిక సంక్షోభానికి ప్యారిస్ కేంద్రస్థానంగా నిలిచింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు ప్యారిస్‌లో పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కింద సదస్సు-సీఓపి21- జరుగుతోంది. ఈ సీఓపీ21 కేవలం వాతావరణ మార్పుపై మాత్రమే కాదు. ఈ ధరిత్రిపై జీవరాశి మనుగడకు ఆధారభూతమైన జీవావరణ వ్యవస్థను మన ఉత్పత్తులు, వినిమయాలు ఏవిధంగా ధ్వంసం చేస్తున్నాయనే అంశంపై కూడా చర్చించడానికి ఏర్పాటైన సదస్సు.
నవంబర్ 13 నాటి సంఘటనలకు, మానవ చరిత్రలో శిలాజ ఇంధన యుగం పర్యావరణానికి చేసిన భయంకరమైన హానికి మధ్య లోతైన అవినాభావ సంబం ధం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న విధానమే పర్యావరణ మార్పునకు, ప్రజల్లో పెరిగే హింసాప్రవృత్తికి కారణభూతమవుతోంది. ఈ రెండూ కూడా ఈ ధరిత్రికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాట ఫలితాలే. పారిశ్రామిక వ్యవసాయం అనేది పెద్ద ఎత్తున శిలాజ ఇంధన వాడకంతో కూడి ఉన్నటువంటిది. దాదాపు 40 శాతం గ్రీన్‌హౌజ్ వాయువులు (కార్బన్ డైయాక్సైడ్) విడుదల కావడానికి ఇది దోహదం చేస్తోంది. ఫలితం పర్యావరణ మార్పు. ప్రపంచీకరించిన ఆహార వ్యవస్థతోపాటు, భూతాపం పెరుగుదలలో కనీసం 50 శాతం వాటా కేవలం పారిశ్రామిక వ్యవసాయానిదే నంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

సింథటిక్ నైట్రోజన్ ఎరువులు కేవలం శిలాజ ఇంధనాలపై ఆధారపడి తయారుచేసినటువంటివి. అదేవిధంగా పేలుడు పదార్ధాలు, మందుగుండు సామగ్రి తయారీలో కూడా సింథటిక్ ఎరువుల తయారీలో అనుసరించిన రసాయనిక విధానాలనే అమలుపరుస్తారు. ఒక కిలో నత్రజని ఎరువును తయారు చేయడానికి రెండు లీటర్ల డీజిల్ మండిస్తే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో అంత శక్తి అవసరం. రసాయన ఎరువుల తయారీలో 2000 సంవత్సరంలో 191 బిలియన్ లీటర్ల డీజిల్ ఉపయోగించగా, 2030 నాటికి ఇది 277 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. సింథటిక్ ఎరువులు పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇదే వాతావరణ మార్పుకు ప్రధాన దోహదకారి అవుతోంది. క్షేత్రంలో పనిచేయడానికి ముందు ఈ ఎరువులు మన భూగ్రహానికి విపరీతమైన హాని చేస్తాయి. అయినప్పటికీ సింథటిక్ ఎరువులు మాత్రమే మనకు ఆహారం అందడానికి కారణమని, అవి లేకతోతే కరువుతో ఇబ్బందులు పడక తప్పదన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటారు. ఇక రసాయన ఎరువుల కంపెనీలైతే ‘మేం గాలి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం’ అంటూ ఘనంగా చెప్పుకుంటాయి.

నత్రజనిని భూమికి, మొక్కలకు అందించే అనేక అహింసాత్మక, ప్రభావయుత విధానాలను ప్రకృతి, మానవులు కనుగొని ఉన్నారు. ఉదాహణకు పుప్పు్ధన్యాలు, బీన్స్ మొక్కలు నత్రజనిని భూమిలో స్థాపితం చేస్తాయి. ఈ మొక్కల వేళ్లపై ఉండే బుడిపెలపై రైజోబియం బ్యాక్టీరియా ఆవాసం ఏర్పరచుకొని, వాతావరణంలోని నైట్రోజన్‌ను, అమోనియాగా ఆ తర్వాత సేంద్రీయ పదార్ధాలుగా మరుస్తాయి. ఈ పదార్ధాలను మొక్కలు తమ పెరుగుదలకోసం ఉపయోగించుకుంటాయి. కాయధాన్యాలు, తృణధాన్యాలను అంతర పంటలుగాను లేదా మార్పిడి పంటలుగాను వేయడం అనేది పురాతన కాలం నుంచి మనదేశంలో అనుసరిస్తున్న సంప్రదాయం. ఇదే సమయంలో మనం వాడే ఆకుపచ్చని ఎరువు కూడా భూమిలో నత్రజనిని స్థాపితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆవిధంగా సేంద్రీయ పదార్ధం స్థాపితం కావడం వల్ల, భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అందువల్లనే సేంద్రీయ వ్యవసాయంలో మనం సాగుచేసే పంటను బట్టి భూమిలో నత్రజని 44 నుంచి 144 శాతం వరకు వృద్ధి చెందుతుంది. పారిశ్రామిక వ్యవసాయంలో మాదిరిగా కాకుండా సేంద్రీయ వ్యవసాయం గాలిలోని కార్బన్‌ను కిరణజన్య సంయోగక్రియ ద్వారా మార్పు చేసి భమిలో దాని పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా భూసారం భాగా పెరిగి అధిక ఆహారోత్పత్తికి దోహదం చేయగలదు. అంతేకాదు ఆవిధంగా ఉత్పత్తి అయిన ఆహారం అత్యధిక పోషక విలువలతో కూడి ఉంటుంది. ఫలితంగా ఏవిధమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే సానుకూల పర్యా వరణ మార్పు సాధ్యమవుతుంది.
హరితవిప్లవం పేరుతో శిలాజ ఇంధనాలపై ఆధారపడే పర్యావరణ పరంగా అస్థిర వ్యవసాయ నమూనాలను ‘మద్దతు’ మరియు ‘అభివృద్ధి’ పేరిట మనపై ప్రభుత్వాలు రుద్దుతున్నాయి. నేల, నీరు ధ్వంసమైపోయాక, పర్యావరణ వ్యవస్థ ఉత్పత్తి చేసే ఆహారం మరియు మద్దతుగా నిలిచే జీవనోపాయాలు ఎంతోకాలం సమాజాన్ని సుస్థిరంగా ఉంచజాలవు. ఫలితంగా ఆగ్ర హం, అసమ్మతి, నిరసనలు, సంఘర్షణలు చోటు చేసుకోవడం అత్యంత సహజం. అయినప్పటికీ భూమి, నీరు, వ్యవసాయ సంబంధ సంఘర్షణలు పదేపదే ఉద్దేశపూర్వకంగా మత వివాదాలుగా మార్పు చెంది, క్రమంగా సైనికీకృత వ్యవసాయ నమూనాను పరిరక్షించే విధంగా రూపొందుతాయి. ఇది క్రమంగా భూమి, ప్రజలకు వ్యతిరేకంగా చేపట్టే ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది.

ఈ పరిస్థితిని నా పుస్తకం కోసం పరిశోధన జరుపుతుండగా పంజాబ్‌లో ప్రత్యక్షంగా చూశాను. 1984లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ పేరుతో పుస్తకాన్ని రాశాను. భూసారం క్షీణించడం, నీటి సంక్షోభం కారణంగా చోటు చేసుకుంటున్న ఘర్షణలకు మత ఘర్షణల రంగు పులుముతుండటాన్ని నేడు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అస్థిర వ్యవసాయ పద్ధతులవల్లనే ఈ ఘర్షణలు తలెత్తుతున్నాయన్న సంగతి మరువకూడదు. 2009 నుంచి మనం బోకొహరాం ఉగ్రవాద సంస్థపేరు వింటున్నాం. ఇదే సమయంలో మనకు తెలియని అంశమేమంటే ‘్ఛద్ సరస్సు’ అదృశ్యమైపోవడం. ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. అయితే 1983 నుంచి 1994 మధ్యకాలంలో ఈ దేశాల్లో పారిశ్రామిక వ్యవసాయం నాలుగురెట్లు పెరిగింది. ఆనకట్టల నిర్మాణం, తీవ్రస్థాయిలో పారిశ్రామిక వ్యవసాయం కోసం విపరీతంగా నీటివాడకం వల్ల యాభై శాతం ఛాద్ సరస్సు అదృశ్యమైపోయింది. ఎప్పుడైతే నీరు అదృశ్యమైపోయిందో ఇక తరిగిపోతున్న నీటి వనరులకోసం పశువుల కాపర్లుగా ఉన్న ముస్లింలు, సుస్థిర వ్యవసాయం చేస్తున్న క్రైస్తవ రైతుల మధ్య ఘర్షణ ఏర్పడి చివరికి అశాంతికి దారితీసింది.
ఎడారిని అరికట్టడానికి సంబంధించిన యుఎన్ కనె్వన్షన్ మాజీ ప్రధాన కార్యదర్శి ల్యూక్ నాకడ్జా నైజీరియాలో ప్రస్తుతం నెలకొన్న హింసాత్మకతకు కారణాన్ని ఈవిధంగా వివరిస్తున్నారు. ‘‘మతయుద్ధంగా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నైజీరియా సంఘర్షణలు వాస్తవానికి ముఖ్యమైన వనరులపై ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం మాత్రమే.’’
సిరియా కథ కూడా దీనికి భిన్నమేం కాదు. 2009లో దేశంలో తీవ్రస్థాయిలో కరువు సంభవించింది. దీంతో లక్షలమంది రైతులు జీవనాధారం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో జీవిక కోసం పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు విధించిన నిబంధనల చట్రంలోని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వాణిజ్య నిబంధనలు సిరియా ప్రభుత్వం తమ దేశ రైతులను ఆదుకోవడానికి వీల్లేకుండా చేశాయి. దీంతో రైతుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. 2011 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు సిరియాలోకి ప్రవేశించాయి. తమ ఆయుధాలను అమ్ముకోవడం ద్వారా సంఘర్షణకు అసలు కారణమైన భూమి, రైతులను మతం వైపునకు మరలించాయి. నేడు సిరియాలోని సగం ప్రాంతం పునరావాస శిబిరాలతోనే నిండిపోయింది. అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడమే కాదు, మతం పేరుతో హింస చాలా చరుగ్గా కొనసాగుతోంది.

జైక్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ అనే శాస్తవ్రేత్తకు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇదే వాయువును ప్రయోగించి 1915లో నాజీలు లక్షలాది యూదులను పొట్టన పెట్టుకున్నారు. అమెరికాకు చెందిన జీవశాస్తవ్రేత్త నార్మన్ బోర్లోగ్‌కు కూడా నోబెల్ బహుమతి లభించింది. ఆయన ప్రవేశపెట్టిందే రసాయన ఆధారిత హరిత విప్లవం! మరి నేడు దాని పుణ్యమాని హింసా సంప్రదాయం కొనసాగుతోంది. నావరకు నాకు సీఓపి-21 అనేది కేవలం శాంతికోసం జరిపే ‘తీర్థయాత్ర’ వంటిది. భూమి, ప్రజలకు వ్యతిరేకంగా నిర్వహించే యుద్ధం బారిన పడిన అమాయక బాధితులను గుర్తు చేసుకునేందుకు, తెగలు, మతాల పేరిట మనం విడిపోవద్దని, మనమంతా ఒక్కటేనన్న దృఢమైన భావన కలిగేందుకు, మనల్ని మింగేస్తున్న పర్యావరణ విధ్వంసం, పెరుగుతున్న హింస మరియు యుద్ధాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంనేందుకు మాత్రమే ఈ సదస్సు ఉపయోగపడుతుంది. అయితే ఒక్కటి మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. భూమితో మనం శాంతిని కుదుర్చుకొనకపోతే, ప్రజల మధ్య శాంతి సాధ్యం కాదు. (చిత్రం) ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. పారిశ్రామిక వ్యవసాయం పుణ్యమాని ఇది ఎండిపోతోంది. తరిగిపోతున్న ఈ నీటి వనరుపై ప్రారంభమైన సంఘర్షణలు క్రమంగా బొకొహరాం ఆవిర్భావానికి దారితీశాయ.

సేకరణ: ఆంధ్రభూమి 04 డిసెంబరు 2015
http://andhrabhoomi.net/content/human-kind

గోవు గురించి సుభాష్ పాలేకర్


Sunday, 6 December 2015

హిందూ ధర్మం - 186 (నిరుక్తము - 5)

7. వేదంలో దేవాపి అనగా మహాభారత ఇతిహాసంలో కనబడే ఋషి కాదు. ఏ వ్యక్తైతే విద్యావంతులను గౌరవించి, వారితో స్నేహం చేస్తాడో అతడు దేవాపి, అది ఉరుములకు గల ఒక పేరు కూడా.
8. వేదంలో శంతను మహాభారతంలో ఉన్న శంతన మహారాజు కాదు. యాస్కుడి ప్రకారం మానసిక ప్రశాంతత కలిగి ఉన్న వ్యక్తే శంతనుడు. నీటిని కూడా శంతను అంటారు ఎందుకంటే అది మానవాళికి శాంతిని, మేలును చేకురుస్తుంది.
9. వేదంలో అంగీసరుడనేది వ్యక్తి పేరు కాదు. ప్రజ్వలిస్తున్న అగ్నియే అంగీరసుడు. భగవంతుడే అంగీరసుడు, ఎందుకనగా భగవంతుడే అగ్ని. మనం ఊపిరి తీసుకునేలోపే ఈ భూమి అంతటికి వెలుగును పంచగలవాడు, కాల్చివేయగలవాడు కనుక వేదంలో అంగీరసుడనగా భగవంతుడనే అర్దం కూడా వస్తుంది. విద్యావంతుడిని అంగీరసుడంటారు. స్వామి దయానందులు రాస్తూ అంగీరః అనగా 'అంగతి  జానాతి యో విద్వాన్'. జ్ఞానం తెలిసినవాడు అంగీరసుడంటారు.
10. యజుర్వేదం 13వ కాండలో వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, విశ్వకర్మ ఇత్యాది నామాలు కనిపిస్తాయి. ఐతిహాసిక పద్ధతిలో వాటిని ఋషులుగా చెప్పగా, శతపధ బ్రాహ్మణం వాటిని ఈ విధంగా చెప్తుంది.
* ప్రాణోవై వశిష్ట ఋషిః - అన్ని వాయువులలోకి శ్రేష్టమైనది కనుక ప్రాణాన్ని వశిష్ట ఋషి అన్నారు.
* మనోవై భర్ద్వాజ ఋషిః - ఆహారం వలన బలం పొందుతుంది కనుక మనసుకు భరద్వాజ ఋషి అని పేరు.
* చక్షుర్వై జమదగ్ని ఋషిః - ప్రపంచాన్ని చూస్తుంది కళ్ళకు జమదగ్నిఋషి అని పేరు.
* శ్రోత్రంవై విశ్వామిత్ర ఋషిః - అన్ని దిశల నుంచి వచ్చే అన్ని విషయాలను వింటుంది కనుక చెవులను విశ్వామిత్ర ఋషి అన్నారు.
* వాగ్వై విశ్వకర్మ ఋషిః - విషయాలను వ్యక్తిపరిచి, విశదపరిచి, వాటికి వైభవాన్ని చేకుర్స్తున్న వాక్కు విశ్వకర్మ ఋషి.
బ్రాహ్మణాల్లో వశిష్ట, జమదగ్ని, విశ్వకర్మ పదాలను ప్రజాపతి, భగవంతుడు, రాజు, ఇంటిపెద్దకు అర్దంగా వివరించారు. విశ్వామిత్రుని వాక్కుగా చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి కుడి చెవిని గౌతముడని, ఎడమ చెవిని జమదగ్ని అని, కుడి ముక్కును వశిష్టుడని, ఎడమ నాసికను కశ్యపుడని, వాక్కును అత్రి అని అంటారు.

11. ఊర్వశి అనేది కూడా వ్యక్తి నామం కాదు. ఊరు వశే యస్యాః - ఉరుములే ఊర్వశి, అన్నిటిని నియంత్రించేది, అధికంగా భుజించేది. పిడుగును ఊర్వశి అన్నారు ఎందుకంటే పిడుగుపాటు అనేక వస్తువులను నశింపజేస్తుంది.
12. మహాభరతంలో కనిపించే చంద్రవంశానికి చెందిన పురూరవుడు వేదంలో కనిపించే పురూరవుడు ఒకరు కాదు. నిరుక్తం ఆధారంగా 5-46, వేదంలో పురూరవుడనేది బాగా గర్జించే, ఉరుమే మేఘం పేరు.
13. అప్సరసలు దేవవేశ్యలు కారు. ఉపనిషత్తుల్లో అప్సరసలు ప్రాణాలకు సంకేతం. (యోగి సాధనలో ఉన్నప్పుడు ఒక్కో ప్రాణం విజృంభించి తపోభంగం చేస్తూ ఉంటుంది. ఒక్కో ప్రాణాన్ని గురుపర్యవేక్షణలో జయించి, అదుపులో పెట్టుకుని సాధుకుడు ముందు వెళ్ళి, పరబ్రహ్మాన్ని చేరుతాడు.) శిల్పసంగీతంలో పింగాణి పాత్రలు, గిన్నెలు. జ్యోతిష్యంలో దిక్కులు, దిశలు. జీవాణు విజ్ఞాన (Bacteriology) శాస్త్రంలో రోగకారక క్రిములు. రసవిజ్ఞాన (Alchemy) శాస్త్రంలో విద్యుత్ ప్రవాహం. (చూడండి, ఒక్క అప్సరస అనే పదమే ఒక్కో శాస్త్రంలో ఒక్కో అర్దాన్ని సూచిస్తుంది. ఎక్కడ ఏ అర్దం అవసరమో అక్కడ అదే ఉపయోగించాలి. అది అర్దం చేసుకోకుండా వేదానికి వక్రభాష్యం రాయడం వల్లనే వేదంలో గోవధ, యుద్ధాలు, జంతుబలులు, ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలు కుట్రదారులకు కనిపించాయి. అయినా వారి ముఖ్య ఉద్దేశం హిందువులని తప్పుదోవ పట్టించడమే కనుక వారికి ఇవన్నీ తెలుసుకోవలసిన పనిలేదు. ఒక సామన్య అర్దాన్ని అన్ని చోట్లా అన్వయం చేసి, నానా రాద్ధాంతం చేశారు.)

To be continued ...................

ఆర్యుల దాడి’ని తిప్పికొట్టిన అంబేద్కర్ - హెబ్బార్ నాగేశ్వరరావు

‘ఆర్యుల దాడి’ని తిప్పికొట్టిన అంబేద్కర్!
http://epaper.andhrabhoomi.net/andhrabhoomi.aspx?id=TS
-హెబ్బార్ నాగేశ్వరరావు03/12/2015 - ఆంధ్రభూమి సంపాదకీయం

రాజ్యాంగం అనగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్ఫురించడం సహజం... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చలలో సమైక్య భావం వెల్లివిరిసింది. అయితే అద్వితీయ భారత జాతి ఏకాత్మకతకు భంగం కలిగించే భావాలు కూడ తొంగి చూసా యి. ఇలా తొంగి చూడడం బ్రిటిష్ దురాక్రమణ నాటి వికృత వారసత్వం! విషబీజం మొలకెత్తితే వృక్షంగా మారడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చు, దశాబ్దుల తరువాత లేదా శతాబ్దుల తరవాతనో దాని ప్రభావం కనిపించవచ్చు! అంకురించిన అమృతపు విత్తనం కూడ మహా వృక్షంగా మారడానికి కూడా అంతే సమయం పట్టవచ్చు! విషపు మొక్కలు, సుధామాధుర్య భరిత సుమవనాలు సమాంతరంగా విస్తరిస్తుండడం సమకాలీన చరిత్ర..విభజన విషం విదేశీయ దురాక్రమణ నాటిది, ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన రాజకీయ సాంస్కృతిక బీభత్సకాండ భారత జాతీయ సమైక్య వాహినిలో కలిపి వెళ్లినది! సుధాపరిమళం అనాదిగా భారత జాతీయ సమైక్య వాహినికి సహజ స్వభావం! ఈ సనాతన భూమిపై అనాదిగా ఒకే జాతి-అద్వితీయ జాతి వికసించడం సహజ స్వభావమైన వాస్తవం!

ఈ దేశంలో రెండు లేదా అనేక జాతులు వున్నాయన్నది బ్రిటిష్‌వారు కల్పించిపోయిన వక్రీకరణ...పార్లమెంటులో జరిగిన రాజ్యాంగ చర్చ సందర్భంగా వాస్తవం ప్రస్ఫుటించింది...వక్రీకరణ కూడ ధ్వనించింది! వాస్తవానికి ప్రచారం తక్కువ, వక్రీకరణకు ప్రచారం ఎక్కువ! బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవన ప్రస్థానంలో భారత జాతీయ చారిత్రక వాస్తవాలను అనేకసార్లు స్పష్టం చేసి ఉన్నాడు! ప్రచారం విశ్వవిద్యాలయ, ఉన్నత ప్రాథమిక విద్యాలయ పాఠ్యాంశాలద్వారా వ్వవస్థీకృతవౌతోంది, తద్వారా ప్రభావం విస్తరిస్తోంది! స్వతంత్ర భారతదేశంలోని ఈ పాఠ్యాంశ వ్యవస్థ బ్రిటిష్‌వారు నిర్ధారించిన పద్ధతిలోనే ఇప్పటికీ కొనసాగుతోంది. అందువల్ల జాతీయ అద్వితీయ తత్త్వానికి చెందిన వాస్తవాలకంటె, జాతీయ సమాజంలో వైరుధ్యాలను కల్పించిన వక్రీకరణలకు ప్రచారం ఎక్కువగా వుంది! బ్రిటిష్ వారు కొలంబోనుండి కైలాస పర్వతం వరకు గల, గాంధారం నుంచి బర్మావరకు విస్తరించిన భారత భూభాగంలో అనాదిగా ఒకే జాతి వికసించిందన్న వాస్తవాన్ని చెరిచిపోయారు! భారతదేశంలో ద్రావిడ, ఆర్య వంటి విభిన్న జాతులు-నేషన్స్ ఉన్నాయని ఇవి పరస్పరం కాట్లాడుకున్నాయని చరిత్రను వక్రీకరించి వెళ్లారు! ఈ వక్రీకరణను అంబేద్కర్ మహాశయుడు నిర్ద్వంద్వంగా నిరాకరించాడు...
ద్రావిడ శబ్దం మొత్తం భారత దేశంలోని కొంత ప్రాంతాన్ని నిర్దేశిస్తున్న భౌగోళిక నా మం... జాతి-నేషన్-ని సూచించలేదు. ఆర్య శబ్దం తమకంటె వయసులో పెద్దవారిని సూచించడానికి సంబోధించడానికి భారతీయులు అనాదిగా వాడిన సంబంధ వాచకం! ఇది కూడ జాతి-నేషన్-ను సూచించలేదు. పెద్దవారిని చిన్నవారు ఆర్యా అని, చిన్నవారిని పెద్దవారు వత్సా అని సంబోధించడం అనాది సంప్రదాయం! ఆర్యుడా అని అంటే సంస్కారవంతుడా అని అర్ధం! అం దువల్ల ఆర్యులు ద్రావిడులు అన్న జాతులుగా అద్వితీయ భరత జాతిని విడగొట్టడం చారిత్రక వాస్తవానికి, తార్కిక నిబద్ధతకు విరుద్ధం! ద్రావిడులు కూడా ఆర్యులే! ఆర్యులు కూడ ద్రావిడులే! ఆర్యులు, ద్రావిడులు మాత్రమేకాదు అనేకానేక వైవిధ్యమైన పేర్లున్న మతాలు, భాషలు, ప్రాంతాలు, సంప్రదాయాలు, విజ్ఞాన రీతులు శారీరక, బౌద్ధిక, మానసిక, ఆర్థిక, ధార్మిక, ఆధ్యాత్మిక విన్యాసాలు, ఇంకా ఎన్నో కూడ ఒక్కటే అయిన స్వజాతిలో విభిన్న అంశాలు అంతర్భాగాలు! వైవిధ్యాలు అసంఖ్యాకం, కానీ సంస్కృతి ఒక్కటే, జాతి ఒక్కటే! ఈ అద్వితీయ జాతీయులు అనాదిగా ఈ భారతదేశంలోనే పుట్టి పెరగడం ప్రగతి, సుగతి సాధించడం వాస్తవం! ఈ వాస్తవాన్ని బ్రిటిష్‌వారు చెరచిపోయారు! బ్రిటిష్‌వారి వక్రీకరణను అంబేద్కర్ మహాశయుడు నిర్ద్వంద్వంగా నిరాకరించడం ఎవ్వరూ నిరాకరించలేని నిజం...

తొలి మానవులు భారతదేశంలోనే పుట్టి పెరిగి ప్రపంచ దేశాలకు విస్తరించారన్న వాస్తవానికి భిన్నంగా బ్రిటిష్‌వారు తథాకథిత- సోకాల్డ్-ఆర్య జాతి విదేశాలనుండి ఇక్కడికి చొరబడినట్టు కట్టుకథలను కల్పించారు! ఈ కట్టుకథలను అంబేద్కర్ తిరస్కరించాడు! రాజ్యాంగం పవిత్ర గ్రంథం. ఈ గ్రంథానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ చెప్పిన మాటలు ఇవీ
* ‘‘ఆర్య జాతి అన్నది వేదాలలో లేదు, వేదాలకు తెలియదు..’’
* ‘‘ఆర్య జాతి అనేవారు బయటనుంచి వచ్చి ఈ దేశాన్ని దురాక్రమించినట్టు నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవీ వేదాలలో లేవు. ఆర్య జాతి ‘దాసుల’ను ‘దస్యుల’ను జయించినట్టు కూడా వేదాలలో చెప్పలేదు...’’
* ‘‘దాసులు, దస్యులు అన్నవారినుంచి ఆర్యులు జాతీయత ప్రాతిపదికగా భిన్నమైన వారన్న సాక్ష్యం ఎక్కడా కనిపించడం లేదు’’
* ‘‘దాసులు, దస్యులు అన్న వారికంటె ఆర్యుల రంగు విభిన్నమైనదన్న వాదాన్ని సమర్ధించే వేద వాక్యాలు లేవు’’

అంబేద్కర్ తన పరిశోధన ద్వారా నిగ్గుతేల్చిన ఈనిజాలు అద్వితీయ జాతీయతా సాక్ష్యా లు! ఇలా బ్రిటిష్‌వారు కల్పించిన ఆర్య ద్రావిడ విభేదాలను దాస, దస్య పదజాలాన్ని అంబేద్కర్ తిరస్కరించి ఉన్నాడు! ‘‘ఆర్యులు బయటనుంచి వచ్చి పడినారన్న మీ వాదానికి వేదాలలో ఎక్కడ ఆధారం ఉంది?’’ అని అంబేద్కర్ కంటె ముందు వివేకానంద స్వామి కూడ ప్రశ్నించి ఉన్నాడు! వీరిద్దరి కంటె ముందు, తరువాత కూడ ఆర్యులు, ద్రావిడులు వేరు వేరు జాతులన్న బ్రిటిష్‌వారి వక్రీకరణను భారత జాతీయ చరిత్రకారులు నిరాకరించి ఉన్నారు! ఇటీవల క్రీస్తుశకం 2009 సెప్టెంబర్‌లో సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ- సిసిఎమ్‌బి- శాస్తవ్రేత్తలు కూడ దక్షిణ భారత, ఉత్తర భారత దేశీయుల పూర్వు లు ఒక్క జాతి వారేనని నిర్ధారించి ఉన్నారు! తథాకథిత దళితులు కూడ అనాది భారతజాతి లేదా హైందవ జాతిలో భాగమని భిన్నం కాదని సిసిఎమ్‌బి చేసిన నిర్ధారణ కూడ అనాది వాస్తవం! ఈ చారిత్రక వాస్తవాన్ని అంబేద్కర్ క్రీస్తుశకం 1930లో జరిగిన మొదటి గుండ్రబల్ల-రౌండ్ టేబిల్-వివరించి ఉన్నాడు! దళితులు అన్న పదం సరికాదని శతాబ్దులుగా అస్పృశ్యతకు బలైన జన సముదాయాలు కూడ హిందువులేనని అంబేద్కర్ స్పష్టీకరించి ఉన్నాడు! అందువల్లనే ఇలా శతాబ్దుల పాటు వివక్షకు, అన్యాయానికి బలైన హిందువులను రాజ్యాంగంలో అనుసూచిత కులాలు-షెడ్యూ ల్డ్ కాస్ట్స్-అని పేర్కొన్నారు! అలాగే అనుసూచిత వనవాసీలు-షెడ్యూల్డ్ ట్రయిబ్స్! అనుసూచిత కులాలవారు, వనవాసీలు అనాదిగా హిం దువులన్న జాతీయ వాస్తవాన్ని అంబేద్కర్ ఇలా మరోసారి ధ్రువపరిచాడు! కానీ ఈ వాస్తవానికి భిన్నంగా, ఈ కులాల వారు హిందువులకంటె భిన్నమైన వారన్న భ్రాంతిని కల్పించడానికి లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే యత్నించడం దురదృష్టకరం! ఆర్యులు అన్నవారు ఈ దేశాన్ని దురాక్రమించారన్న బ్రిటిష్ వారి కట్టుకథ కూడ ఖర్గే ప్రసంగంలో ధ్వనించినట్టు ప్రచారవౌతోంది!

మల్లికార్జున ఖర్గే ప్రసంగంలోని వక్రీకరణలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సహసర్ కార్యవాహ-సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వ్యక్తం చేసిన ప్రతిప్రకియ అంబేద్కర్ నిగ్గుతేల్చిన నిజాలకు అనుగుణంగా ఉంది. ఆర్యులు బయటనుంచి వచ్చారని ఖర్గే అంటున్నారు. ఇది డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయానికి విరుద్ధం. ఆర్యులు అన్న జాతి లేదని, ఆర్యులు బయటివారు కాదని అంబేద్కర్ చెప్పి ఉన్నాడు...అన్నది హోసబలే వ్యక్తం చేసిన ప్రతిస్పందన!
హైదరాబాద్‌లోని సిసిఎమ్‌బి శాస్తవ్రేత్తలు, అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తదితర అంతర్జాతీయ సంస్థలతో కలిసి దేశంలోని పదమూడు ప్రాంతాలలో కొనసాగించిన పరిశోధన ఫలితాలను నేచర్-ప్రకృతి అన్న ఆంగ్లపత్రికలోను ఇతర పత్రికలలోను 2009 సెప్టెంబర్‌లో ప్రచురించారు. తథాకథిత-సోకాల్డ్-అగ్ర కులా ల వారి జీవజన్యు వారసత్వం తథాకథిత దళిత, వనవాసీ జన సముదాయాలవారి జీవజన్యు వారసత్వం కంటె భిన్నం కాదని ఈ పరిశోధనలో స్పష్టమైనట్టు సిసిఎమ్‌బి శాస్తవ్రేత్తలు అప్పుడు ప్రకటించారు! దళితులు మిగిలిన కులాలవారు ఒకటే జన్యు వారసత్వ సంతతికి చెంది ఉన్నారు! దళితులు హిందువులన్న వాస్తవం, దళితులు హిందువులకంటె భిన్న జన్యుసంతతి వారు కాదన్న అంబేద్కర్ నిర్ధారణ ఇలా మరోసారి ధ్రువపడింది! తథాకథిత దళితులు, దళితేతరులు అయిన హిందువులు ఈ దేశంలో అనాదిగా పుట్టిపెరిగిన వారు! తొలి మానవుడు ఈ దేశంలోనే పుట్టాడన్న వేద నిర్ధారణను ఆధునిక శాస్త్రం కూడ ఇలా నిర్ధారించింది! అలాగే దక్షిణ భారతదేశంలోని వారు, ఉత్తర భారతీయులు పరస్పరం భిన్నమైన జాతులు కాదని ఉభయ జన సముదాయాలు ఒకే జాతీయ జన్యు వారసత్వం కలిగి ఉన్నారన్నది కూడ సిసిఎమ్‌బి చేసిన నిర్ధారణ! సిసిఎమ్‌బి నిర్ధారణలు బ్రిటిష్‌వారు ఈ దేశంలోని అనాది జాతిని భిన్నజాతులుగా విడగొట్టడానికి జరిపిన కుట్రను బద్దలు చేసాయి! అందువల్ల ఆర్య, ద్రావిడ జాతులు లేవని అనాదిగా ఈ దేశంలో ఒకే భరత జాతి లేదా హిందు జాతి ఉందని చరిత్రకారులు, భాషా చరిత్రకారులు, మానవ శరీర నిర్మాణ శాస్తవ్రేత్తలు, సామాజిక శాస్తవ్రేత్తలు అంగీకరించాలి. ప్రాథమిక స్థాయినుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యాంశాలలో తగిన మార్పులు చేయాలి! తాము భిన్న జాతుల సంతతివారమని ఒకే జాతికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు భావించడం సమైక్యతకు గొడ్డలిపెట్టు! తమ పూర్వులది ఈదేశం కాదని తాము బయటనుంచి వచ్చిన వారమని అనాదిగా స్వజాతీయులైన వారు భ్రమించడం వల్ల ఈ మాతృభూమి పట్ల మమకారం నశించిపోగలదు! మాతృభూమి పట్ల మమకారం లేని జాతికి మనుగడ లేదు!
ఈ మాతృభూమి పట్ల ఈ జాతివారికి మమకారం నశింప చేయాలన్న దుర్భుద్ధితోనే బ్రిటిష్‌వారు భిన్న జాతుల కట్టుకథను కల్పించారు! అలా నశించినట్టయితే బయటనుంచి వచ్చి పడిన తమ పెత్తనం శాశ్వతం కాగలదని బ్రిటిష్ దురాక్రమణదారులు భావించారు. మేము మాత్రమే కాదు మీ పూర్వులు కూడ ఈ దేశానికి బయటనుంచి వచ్చినవారే అన్న విద్రోహ పాఠాన్ని భారతీయులకు నేర్పడానికి బ్రిటిష్ పన్నిన పన్నాగంలో భాగం ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం! అంబేద్కర్ దీన్ని తిరస్కరించాడు, అనాది జాతీయ చరిత్ర దీన్ని తిరస్కరించింది! సమకాలీన సమాజం కూడ ఈ బ్రిటిష్ కుట్రను తిరస్కరించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి. డిసెంబర్ ఆరవ తేదీన అంబేద్కర్ వర్ధంతి. ఇది అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం.

Saturday, 5 December 2015

అరోబిందో సూక్తి


ఈ రోజు (డిసెంబరు 5) నవీన భారత భవిష్య ద్రష్ట, మహాపురుషులు, ఋషి, శ్రీ అరవిందుల వారు మహాసమాధి చెందిన రోజు.

India of the ages is not dead nor has she spoken her last creative word; she lives and has still something to do for herself and the human peoples. And that which must seek now to awake is not an anglicised oriental people, docile pupil of the West and doomed to repeat the cycle of the occident's success and failure, but still the ancient immemorable Shakti recovering her deepest self, lifting her head higher towards the supreme source of light and strength and turning to discover the complete meaning and a vaster form of her Dharma. - Sri Aurobindo