Monday, 26 January 2015

హిందూ ధర్మం - 134 (వైదిక సంస్కృతి - మహాభారతం)

ద్వాపరయుగాంతం వరకు ప్రపంచమంతా సనాతనధర్మమే వర్ధిల్లింది. వేదప్రచారం నిత్యం జరిగింది. ఎక్కడ చూసిన వేదం గురించి చర్చలే, ప్రజలు కూడా వేదంలో ఉన్న విజ్ఞానం గురించే కాలక్షేపం చేసేవారు. అందరూ రోజు రెండుపుటలా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. వైదికసంస్కృతి 3 పూవులు, 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ విధినిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు. ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలైంది. సరిగ్గా ఇప్పటికి (2015 జనవరికి) 5152 సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కాలగతిలో కొన్నేళ్ళు అభివృద్ధి చెందితే, మరికొన్నేళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. జీవుల కర్మను అనుసరించి, వారి జన్మకు అనుగుణమైన పరిస్థితులు ఏర్పడవలసి వస్తుంది.

ప్రపంచమంతా వ్యాపించిన సనాతన ధర్మానికి మహాభారత యుద్ధంతో కష్టాలు మొదలయ్యాయి. మహాభారతం కావ్యం కాదు, పురాణం కాదు, మహాభారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలాగే జరిగిందని అర్దం. మహాభారతం విశేషాలను సంస్కృతంలో వ్యాసమహర్షి చెప్పగా, గణపతి రచించాడు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3139 లో జరిగింది. యుద్ధం గెలిచాకా, పాండవులు హస్తినాపురాన్ని (నేటి ఢిల్లీ) రాజధానిగా చేసుకుని 36 ఏళ్ళ 8 నెలలు పాలించారు. క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17,18 నాటికి ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలైంది. వీటిని జ్యోతిష్య శాస్త్రమూ, ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, అతన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో పొందుపరిచారు.

ఏదో పుస్తకంలో ఉన్నది మెము ఎట్లా అంగీకరించాలి అనవచ్చు. దానికి తగిన శాసనాలు ఉన్నాయి, అవే సంవత్సరాలని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యమైన ఖగోళ, అంతరిక్షానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వ్యాసమహర్షి ప్రజ్ఞ గురించి వర్ణించటం అసాధ్యం. కాలక్రమంలో పుస్తకాలు చినిగిపోతాయి, శాసనాలు కొంత రూపు పోవచ్చు, లేకపోతే విజ్ఞానశాస్త్ర గ్రంధాలు చౌర్యానికి గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ ఈ జగత్తులు ఎవరు మార్చలేనిది, ఎప్పటికి సాక్ష్యంగా నిలిచేవి అంతరిక్షంలో గ్రహాల కదలికలు, గ్రహస్థితులు (planetary positions). గ్రహాల మధ్య దూరం, కోణము, ఆ సమయంలో వాటి స్థానం, ఇవన్నీ తరుచుగా ఏర్పడే అంశాలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడే ఈ ఖగోళ శాస్త్ర అద్భుతాలను వ్యాసమహర్షి గుర్తించి, సేకరించి, మహాభారతంలో పొందుపరిచారు, అనగా record చేశారు.. ఈ ఖగోళ అంశాలను ఈ రోజు ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా astronomical dating ద్వారా పరీశీలించినప్పుడు పైన చెప్పుకున్న సంవత్సరాలే వస్తున్నాయి. వాటికి శాసనమైన ఆధారలు ఎన్ని ఉన్నాయో, ఖగోళ, జ్యోతిష్యశాస్త్ర ఆధారాలు అన్నే ఉన్నాయి. Astronomical dating అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల నుంచి వెనక్కు లెక్కించుకుంటూ వెళ్ళడం.

To be continued ........................

Sunday, 25 January 2015

రథసప్తమి - విశేషాలు

ఓం ఆదిత్యాయ నమః
మాఘశుద్ధ సప్తమి- రథసప్తమి

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.

ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||

అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.

ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.

సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.

రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.

రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

ఈ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుపందిరి క్రింద చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యభగవానుడిని పూజించి, సూర్యకిరణాల ప్రసరిస్తూ ఉండగా, ఆ చిక్కుడు పందిరిలో పాలు పొంగించి పరమాన్నం వండి, నివేదన చేయాలి.

Saturday, 24 January 2015

భారత్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు

ఏదో అద్భుతం జరగబోతున్నట్టు మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది. ఒబామ కారు ఎలా ఉంటుంది, ఆయన భార్య ఎలాంటి దుస్తులు ధరిస్తుంది, భధ్రతకు ఎంత ఖర్చవుతుందంటూ ప్రోగ్రాంలు వేస్తోంది తప్పించి, ఆ పర్యటన భారత్‌కు లాభమా? నష్టమా? అని చెప్పడంలేదు. నిజానికి ఒబామా పర్యటన వలన లాభం చేకూరేది అమెరికాకి మాత్రమే. నష్టపోయేది మాత్రం భారతే. అసలు అమెరికా ఏదైనా దేశంతో ఒప్పందం చేసుకుందంటే, అక్కడ అమెరికాకు ఏదో ప్రయోజనం ఉంటుంది. అవతలిదేశాలను బలహీనపరిచి, బ్రతికే అమెరికా భారత్ అభివృద్ధికి దోహదపడుతుందనుకోవడం కల్ల. ఒకప్పుడు ఆయుధతయారీ రంగంలో ఉండే కంపెనీలు తర్వాత వ్యవసాయరంగంలోకి ప్రవేశించాయి. బీటీ విత్తనాలు, పేటెంటులు, రసాయన ఎరువులంటూ అంటూ ఆహారభధ్రతను కాలరాస్తూ, విత్తనాలపై గుత్తాధిపత్యం సంపాదించి ఆహారాన్ని, తద్వారా ప్రపంచాన్ని అదుపు చేయాలని పన్నాగం పన్నాయి అమెరికా ప్రభుత్వం, అక్కడి బహుళజాతి సంస్థలు. దానిలో భాగంగా ఇంతకముందు భారత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నా, అవి పూర్తిగా అమెరికాకు లాభం చేకూర్చేలా లేవు. కనుక ఇప్పుడు ఆ విత్తనాల విషయంలో ఉన్న మిగిలిన అడ్డంకులు/ఆంక్షలు కూడా పూర్తిగా తొలగించుకోవాలని అమెరికా యత్నిస్తోంది. ఈ విషయంలో భారతప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది. ఒకవేళ అటువంటి ఒప్పందాలను మీద భారతప్రభుత్వం సంతకం చేస్తే, అది ప్రజల హక్కులను కాలరాసినట్లే అవుతుంది. చిన్న రైతులకు తీరని నష్టం చేస్తుంది, పర్యావరణానికి, జీవవవిధ్యానికి పెను ప్రమాదంగా మారుతుంది. ఈ విత్తనల మీద జరిగే ఒప్పందాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'మనం ఏం తినాలో కూడా ఆ కంపెని వాడే నిర్ణయిస్తాడు'. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనం, ఏం తింటున్నేమో కూడా తెలుసుకునే హక్కును కోల్పోతాం, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా అదే.

మన దేశంలో ప్రభుత్వాలు మారతాయేమో కానీ విధానాలు మాత్రం మారవు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, ఏ విధానాలను పార్టీలు వ్యతిరేకిస్తాయో, అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోతాయి. అణుఒప్పందం కూడా అలాంటిదే. 2008 లో బీజేపీ అణుఒప్పందం బిల్లును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు, కానీ ఇప్పుడే అదే బిజేపీ, అణుఒప్పందం కోసం అమెరికాకి ఎర్ర తీవాచీ పరుస్తోంది. అమెరికాకి ఒక రోగం ఉంది. వాళ్ళ దేశంలో చెడిపోయిన, మూతబడిన యంత్రాలను ఇతర దేశాల్లో ఎఫ్.డి.ఐ.ల పేరున అమ్మేసి డబ్బు చేసుకుంటుంది. ఇతర దేశాలను చెత్తకుప్పలుగా భావిస్తుంది. వాడేదో మనకు గొప్ప సహాయం చేస్తున్నట్టు మీడీయా చూపిస్తుంది. అదే తరహాలో మన దేశంలో అమెరికా అణురంగంలో పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించుకుంది. లాభాలు మాత్రం వారు తీసుకోవడానికి ఎగబడతారు కానీ ఒకవేళ ఆ అణురియాక్టర్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే, దానికి నష్టపరిహారం మాత్రం చెల్లించరట, వారిని కోర్టులో బాధ్యులను చేయకూడదట. ఇది వాళ్ళ ఆర్ధిక విధానాలకు నష్టం కలిగిస్తుందట. అందుకని అణురంగంలో రెండు దేశాలు మరింత ముందుకు వెళ్ళాలంటే, ఈ రెండు విషయాల్లోనూ మనం వారు చెప్పిన మాట వినాలని అమెరికా అంటున్నది. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఇప్పుడు ఒబామా భారత్‌కు వస్తున్నారు. అంటే వారు మన దేశంలో వ్యాపారం చేసుకుని లాభాలు గడించవచ్చు, కానీ వాళ్ళ వల్ల జరిగిన ప్రమాదాలకు మాత్రం వాళ్ళు బాధ్యులు కాదట.

అనేక రంగాల్లో ఎఫ్.డీ.ఐ.ల పేరున అమెరికా భారత్ యొక్క ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకుందని తెలిసీ మన ప్రభుత్వాలు అభివృద్ధి అనే మాయమాట చెప్పి అమెరికాను వెనకేసుకొస్తున్నాయి. పార్టీలు మారినా, విధానాలు మారవని నిరూపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఒబామ పర్యటన వలన భారత్‌కు లాభం కలుగుతుందని చెప్పలేం కానీ నష్టం మాత్రం తప్పక కలుగుతుంది. దాన్ని ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి కప్పిపుచ్చుతున్నా, మీడియా ఇంకా అమెరికాను పొగడడం ఎంతో వింతగా ఉంది. దేశభక్తి గురించి, స్వదేశీ ఆర్ధికవిధానల గురించి తరచుగా మాట్లాడే పార్టీ కూడా అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం ఏమిటో?   

Friday, 23 January 2015

సుభాష్‌చంద్ర్‌బోస్ గురించి ముఖ్యమైన విషయాలు

ఈ రోజు సుభాష్‌చంద్ర్‌బోస్ జయంతి సందర్భంగా వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

సుభాష్‌చంద్ర్‌బోస్, భారతమాత దాస్య శృంఖలాలను తెంచిన యోధుడు. 23 జనవరి 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించారు సుభాష్ చంద్ర బోస్. వారు కారణజన్ములు, సిద్ధుల సంకల్పంతో జన్మించిన మహాపురుషులు. స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో గడిపిన మహానుభావులు. నిజం మాట్లాడితే సుభాష్‌చంద్ర బోస్ గాంధీజీ కంటే గొప్పవారు. దానికి సంబంధించిన చిన్న సంఘటన చెప్తాను.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక స్వాతంత్రదినోత్సవ వేడుకలలో జెండావందన కార్యక్రమానికి బ్రిటిష్ ఇండియా వైశ్రాయి మౌంట్‌బెట్టెన్ హాజరయ్యాడు. అప్పుడు అతన్ని ఒకరు 'ఏవండి! మేము 1945 కి ముందు వరకు చాలా తీవ్రమైన పోరాటాలు చేశాము, ఎన్నో ఉద్యమాలు నడిపాము, అయినా అప్పుడు మీరు మా దేశాన్ని విడిచిపోలేదు. కానీ ఏ ఉద్యమం లేకపోయిన 1947 లో హఠాత్తుగా భారతదేశానికి ఎందుకు స్వాతంత్ర్యం ప్రకటించారు' అని అడిగారు. దానికి ఆయన సమాధానంగా మీరు అహింస పేరుతో కడుపులు మాడ్చుకుని పోరాటం చేయడం వలన మేము భారత్‌ను విడిచిపోలేదు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఉధృతికి భయపడి మాత్రమే మేము మీ దేశం విడిచి పారిపోయామని సమాధానం చెప్తారు. మరి మీ మీద మా అహింసాపోరాటం ప్రభావం చూపలేదా అంటే, మా మీద మీ అహింసాపోరాటం చూపిన ప్రభావం అత్యల్పం. బోస్ ప్రభావమే అధికం అన్నారు. అది ఆయన గొప్పతనం, వారు లేకపోతే మనకు స్వరాజ్యం వచ్చేది కాదు.

కానీ అప్పట్లో కూడా రాజకీయాలు నడిచాయి. గాంధీ సిద్ధంతాలకు అడ్డువస్తున్నాడని, గొప్ప ప్రభావం చూపిస్తున్నాడని, అది నచ్చక, బోస్‌ను అర్చాకవాది, అతివాది, హింసావాది అని ముద్రవేసి కాంగ్రెస్ నుంచి వెలివేశారు. అయితే చాలా మంది బోస్ మరణించారని చెప్తారు కానీ అందులో నిజం లేదు. నేతాజీ ఇప్పటికి బ్రతికే ఉన్నారు. హిమాలయాల్లో యోగసాధన చేస్తున్నారు. గత కొనేళ్ళ నుంచి 3 వేర్వేరు శరీరాలతో భారతదేశమంతటా పర్యటిస్తున్నారు. మహాదేవుడైన సదాశివుని ఆశీర్వాదం, సిద్ధపురుషుల ఆశీర్వద ఫలంగా బోస్ ఇప్పటికి సజీవంగా ఉన్నారు. త్వరలో ప్రజల ముందు వచ్చి, దేశాన్ని నడిపించనున్నారని 200 ఏళ్ళకు పై వయసు కలిగి ఇప్పటికి జీవిస్తున్న శ్రీ బర్ఫాని బాబావారు సందేశమిచ్చారు.

హరహర మహాదేవ
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జై హింద్

మాఘ శుక్ల పంచమి - వసంత పంచమి, శ్రీ పంచమి

మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి, శ్రీ పంచమి అని పేర్లు.

అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి.

సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. ‘యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥

మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలనీ, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు. గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి, పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

పరాపర విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహంవలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు, మాంద్యం తొలగుతాయి. మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. అందుకే ‘‘నిశే్శష జాడ్జాపహా’’ అన్నారు. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు.

- ఏ.సీతారామారావు
(Source: http://www.andhrabhoomi.net/node/202508)

ఈ రోజు సరస్వతీదేవిని తెల్లనిపూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి. ఓం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు, కలముల(పెన్నులు) యందు సరస్వతీ దేవిని ఆవాహన చేసి పూజించాలి.మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు, ఇతరుల గురించి చెడుగా మట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీమాతను పూజించాలి.

Thursday, 22 January 2015

హిందూ ధర్మం - 133 (4 వేదాలు )

వేదాలు నాలుగు. అవి ఋగ్ వేదం, యజుర్ వేదం, సామ వేదం అధర్వణ వేదం. తొలుతుగా భగవంతుడు ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం 11:4, 2.3 చెప్తోంది. మనుస్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తూ, ఈ నలుగురు ఋషులే బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలను బోధించారని, అలా నాలుగు వేదాలను ఒకేసారి నేర్చుకున్న మొదటివారు బ్రహ్మదేవుడని చెప్తోంది. (అయితే ఇక్కడ రెండు వాదాలు ఉన్నాయి. మొదటివాదం పైన చెప్పుకోగా, రెండవది ఇలా ఉంది. తొలుత వేదం నాలుగు భాగాలుగా కాక, ఒకట్టిగానే ఇవ్వబడిందని, ద్వాపారయుగాంతంలో వ్యాసమహర్షి దాన్ని నాలుగు వేదాలుగా విభాగం చేశారని చెప్తారు.) భగవంతుని ద్వారా ప్రకాశపరచబడిన వేదాలను ఈ ఋషులే మిగితా ఋషులందరికి చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న ఈ జీవ చక్రంలో, ఇప్పటికి సుమారు 197.5 కోట్ల సంవత్సరాల క్రితం వేదాన్ని స్వరయుక్తంగా ఋషులు దర్శించారు. వాటిని ధారణలో నిలుపుకున్నారు. ఎక్కడ గ్రందస్థం చేయలేదు, అనగా పుస్తకంలో రాయలేదు. గురువు నుంచి విని నేర్చుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. దానికి ఎంత జ్ఞాపకశక్తి ఉండాలి! ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఒక్క అక్షరం మార్చబడలేదు. ఎలా అందుకున్నారో, అచ్చం అలానే వేదాన్ని తరతరాలుగా వల్లెవేస్తూ వచ్చారు.

ఎవరైనా కొత్త కాపురం మొదలుపెడుతుంటే, కొత్త ఇంట్లోకి వెళ్తూ, కొన్ని సామాన్లు, అవి కూడా అతి ముఖ్యమైనవి, ఏవి అత్యవసరమో అవి మాత్రమే తీసుకుని వెళతారు. తర్వాత మెల్లిగా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు నిండిపోయి, తిరగడానికి చాలా  ఇరుకుగా అయిపోయేవరకు. అట్లానే భగవంతుడు కూడా సృష్ట్యాదిలో వేదాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు వారికి కావల్సిన జ్ఞానాన్ని అందించాడు. కానీ తర్వాత వేల మంది మహర్షులు వచ్చారు. కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. వేదంలో మంత్రసంహితలో అన్నీ బీజ రూపంలో ఉన్నా, వాటిని అర్దం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, వేద విజ్ఞానాన్ని అనేకమంది మహర్షులు విస్తరించారు. శౌర శక్తితో నడిచే విమానాలు, వాయువు ఆధారంగా నడిచేవి, రాడార్లకు అందనంత గొప్ప పరిజ్ఞానం కలిగినవి, శబ్దవేగంతో పయనించే విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష నౌకలు మొదలైన అనేక విమానాలు కనుగొన్నారు. స్థూలంగా వైమానిక శాస్త్రమే వచ్చింది. అట్లానే ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు, జీవ, భౌతిక శాస్త్రాలు, విద్యుత్ శక్తికి సంబంధిచినవి, అణ్వస్త్రాలకు చెందిన విజ్ఞానశాస్త్రం మొదలైన రకరకాలశాస్త్రాలు వివిధ ఋషుల పరిశోధన ఫలితంగా లోకం చూసింది. చిన్న విత్తనం నుంచి మఱ్ఱి చెట్టు పుట్టి, పెద్దగా ఊడలతో, కొమ్మలు, రెమ్మలు, ఆకులతో విస్తరించినట్టు వేదవిజ్ఞానం మంత్రసంహితను, బ్రాహ్మణాలను ఆధారంగా చేసుకుని, ద్వాపరయుగం నాటికి శాఖోపశాఖలుగా విస్తరించింది.

To be continued ....................

Wednesday, 21 January 2015

హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ)

వేదంలో చెప్పబడిన శాస్త్రవిహితకర్మలను నిష్కామంగా (ఎటువంటి కోరికలు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, శ్రద్ధగా) ఆచరిస్తూ, ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను ధారణలో ఉంచుకుని, సాధన చేస్తే, మనిషి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఎదుగుతాడు.

ఏదైనా ఒక ఆహార పదార్ధం వండే ముందు పాత్రను శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన పాత్ర మాత్రమే వంటకు పనికి వస్తుంది. అంటే అప్పుడు మాత్రమే దానికి పాత్రత వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానానికి కూడా. మాములువారికి వేదాంతం చెప్పగానే అర్దమయ్యే విషయం కాదు. అర్దమైనట్టుగా అనిపిస్తుందేమో కానీ, అనుభూతికి దోహదపడదు. అలా అర్దమవ్వాలంటే ధర్మాచరణ చాలా ముఖ్యం.

ఒక విత్తనాన్ని నాటే ముందు, అక్కడి భూమి పరిస్థితిని గమనిస్తారు. విత్తనం నాటిన తర్వాత, దానికి తగిన నీరు అందిస్తారు, పోషకాలు అందిస్తారు. అన్నీ సక్రమంగా బయట నుంచి అందినా, విత్తనంలో ఉన్న జీవం వీటిని గ్రహించినప్పుడే మొలకెత్తుతుంది. అదే విధంగా బ్రహ్మజ్ఞానం కూడా. గురువు చెప్పిన బ్రహ్మవిద్య ముందు వినాలి. తర్వాత సాధన ద్వారా దాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. అనుభూతి చెంది ఆ స్థితిలో ఆత్మగా నిలబడాలి. అప్పుడే జీవితం పండుతుంది. దానికి ఉపనిషత్తులు ఎంత దోహదం చేస్తాయో, కర్మకాండ కూడా అంతే దోహదపడుతుంది. వంటకు ముందు పాత్రను శుభ్రపరిచిన విధంగానే వ్యక్తి యొక్క చిత్తాన్ని (అనుభవాల సమూహాన్ని) శుద్ధం చేయాలి. అలా చిత్తాన్ని శుద్ధం చేయగల శక్తి కేవలం వేదంలో చెప్పబడిన ధర్మానికి (కర్మలకు) మాత్రమే ఉంది. శుద్ధి చేయబడిన పాత్రలో వండిన పదార్ధం ఏ విధంగా నివేదనకు ఉపయోగపడుతుందో, అదే విధంగా కర్మలను ఆచరించడం వలన శుద్ధి పొందిన మనస్సు మాత్రమే బ్రహ్మవిద్యను అర్దం చేసుకోగలుగుతుంది. బయటనుంచి లభించనవన్నీవిత్తనం సరైన సమయంలో గ్రహించి మొలకెత్తినట్టు, చిత్తశుద్ధి వలన వ్యక్తి ఉపనిషద్ రహస్యాలను గ్రహించగలుగుతాడు. కనుక వేదంలో జ్ఞానకాండ ఎంత ప్రధానమో, ఆచారకాండ కూడా అంతే ప్రధానం. ఈ రోజు చాలామంది ఆచారకాండను విడిచిపెట్టి కేవలం జ్ఞానకాండ ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. అది చాలా తప్పుడు వాదన. ధర్మాన్ని ఆచరించకుండా ఉపనిషత్తులను అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తే, అవి అర్దంకాకపోగా, విపరీత అర్ధాలు వస్తాయి. అందుకే వేదం కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా విభజించబడింది.

To be continued .................

Tuesday, 20 January 2015

హిందూ ధర్మం - 131

వేదాలను నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం. అందులో మంత్రసంహిత అన్నిటికి మూలం. ఈ మొత్తం వేదాలను మళ్ళీ రెండుగా విభాగం చేస్తారు. ఒకటి కర్మకాండ / ఆచారకాండ, రెండవది జ్ఞానకాండ. బ్రాహ్మణాలు ధర్మాలు, కర్మల గురించి వివరిస్తాయి. ఆరణ్యకాలలో తత్వచింతన, ఉపాసనలు చెప్పబడడం వలన వాటిని ఉపాసనాకాండ అని చెప్పినా, వాటిని కూడా ఆరణ్యకాలతో కలిపి కర్మకాండ అంటారు. ఉపనిషత్తులలో పూర్తిగా పారమార్ధిక (అలౌకిక/ భగవత్/ ఆత్మ) జ్ఞానం ఉంటుంది, వాటిలో కర్మల గురించి ఉండదు కనుక వాటిని జ్ఞానకాండ అంటారు. ఈ రెండిటిలో ఒకటి ముఖ్యము, వెరొకటి కాదు అని ఎక్కడ చెప్పబడలేదు. ఈ మధ్య చాలా కొత్త కొత్త వాదనలు వచ్చాయి. వేదం సత్వ, రజస్, తమో గుణాలతో ఉంటుంది. కానీ వేదాంతం దీనికి అతీతంగా ఉంటుంది. కనుక భగవద్దర్శనానికి వేదాంతమే మార్గమని కొందరు అంటున్నారు. అదీగాకా వేదంలో చెప్పబడ్డ కర్మలను వేదాంతం నిరసించిందని, రకరకాలా ఉపాసనలను ఖండించిందని అంటున్నారు. కానీ అది తప్పుడు వాదన. ఒకవేళ అదే కనుక సత్యమైతే, భగవంతుడు కర్మకాండను ఎందుకిస్తాడు? ఆయనకంటే వీళ్ళు సర్వజ్ఞులు, జ్ఞానులు కాదు. సత్వ, రజస్, తమో గుణాలకు అతీతమైనది వేదం. వేదం వేరు, వేదాంతం వేరు కాదు, మంత్రసంహిత ఆధారంగానే మిగితావన్నీ వచ్చాయి. వేదాంతం కూడా వేదంలో భాగమే. అటువంటప్పుడు వేదాంతం వేదాన్ని ఎలా ఖండిస్తుంది? అలా ఖండించడం అంటే వేదాన్ని వేదం ఖండిస్తుందని చెప్పడమే అవుతుంది.

ఆదిశంకరుల ప్రస్తావన కూడా ఇక్కడ కొందరు తెస్తారు. ఆదిశంకరులు కూడా ఎక్కడ కర్మను నిరసించలేదు. కేవలం కర్మకే అంటిపెట్టుకుని ఉండకండి, కర్మతో పాటు జ్ఞానం ప్రధానం అన్నారు. వారున్న సమయంలో సమాజంలో ప్రజలు పూర్తిగా జ్ఞానభాగాన్ని విడిచిపెట్టడం వలన కర్మకంటే జ్ఞానం ప్రధానమని వాదించారు. కానీ మళ్ళీ వారే పూజలు మొదలైనవాటి కోసం పంచాయతనం, స్తోత్రాలు ఇచ్చారు. కర్మకాండ ఆచరించకుండా జ్ఞానకాండ అర్దం కాదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానుష జన్మ వస్తుంది. పూర్వజన్మ సంస్కారాలు మనిషి మీద బలీయమైన ప్రభావన్ని చూపిస్తాయి. ఇంతకముందు జన్మలలో ఆ వ్యక్తున్న అలవాట్లు, ఇష్టాయిష్టాలు ఈ జన్మలో అతని ప్రవర్తనను, ఇష్టాయిష్టాలను నియంత్రిస్తాయి. అప్పటి సంస్కారాలు చాలా బలీయంగా సూక్ష్మశరీరం / మనసుపై ముద్ర వేస్తాయి. వాటిని వదిలించుకుని, బయట పడడం కష్టం. వ్యక్తి తాను ఎంత నియంత్రిచుకున్నా, పూర్వజన్మ వాసనలు అతనితో రకరకాల దుష్టకార్యాలను చేయటానికి ప్రేరేపిస్తాయి. ఇంత సంఘర్షణ ఉన్న మనిషికి ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మజ్ఞానం అంత త్వరగా బోధపడదు. అందుకే ధర్మం వచ్చింది, ఆచారకాండ / కర్మకాండ వచ్చింది.

To be continued ..................

Monday, 19 January 2015

హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు)


మరణం మనిషికి అంతం కాదు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం మధ్యలో వచ్చే తాత్కాలికమైన విరామం మాత్రమే అంటాయి ఉపనిషత్తులు. ఇది కూడా మనకు, పాశ్చాత్య దేశాలకు మధ్యనున్న ఒక తేడా. మరణం అనేది అంతమని, ఇక ఆ తర్వాత అస్తిత్వం ఉండదని భయపడి, దాన్ని మర్చిపోవడం కోసం పాశ్చాత్యదేశాల్లో ప్రజలు, రకరకాల భౌతిక సుఖాల వెంట పరిగెత్తి, మరణాన్ని మర్చిపోవాలని, అది స్మృతిలో లేకుండా ఉండేలా చాలా ప్రయత్నిస్తారు. కానీ ప్రాచ్య (భారతీయ) సంస్కృతిలో మాత్రం ప్రజలు మరణానికి భయపడరు. జీవితంలో ఏది అనుభవించినా, అనుభవించకున్నా, ఏది లభించినా, లభించకున్నా, పుట్టిన ప్రతివాడికి మరణం తధ్యం. అది ఎప్పుడు వస్తుందనేది తెలియదు కానీ, ఏదో ఒక రోజు అందరూ ఎదురుకోవలసిన సత్యం మరణం. దాన్ని తప్పించుకోవడం శరీరానికి అసాధ్యం. అది ఆత్మ ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కూడా. కొన్ని కోట్ల జన్మల కర్మఫలాలను మోసుకొస్తున్న ఆత్మ, మరణం తర్వాత తన కర్మఫలాల మూటను విప్పి, ఏ కర్మఫలం పక్వానికి వస్తుందో, దాని ఆధారంగా శరీరం ధరిస్తుంది. పాతబట్టలు విప్పేసి, కొత్త బట్టలు కట్టుకోవడం ఎంత సహజమో, అలాగే పాతశరీరాన్ని విడిచి ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. వాళ్ళు మరణంతో అస్తిత్వం పోతుందని భావిస్తే, మనం మాత్రం మరణంతో దేహం ఒక్కటే నశిస్తుందని చెప్తాం. మరి ఈ మరణం తర్వాత ఆత్మ ఎక్కడకు వెళుతుంది, ఎలా వెళుతుంది. అసలు మరణం అంటే ఏమిటి? ఇటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చెప్పిన తత్వశాస్త్ర నిధులే ఉపనిషత్తులు.

అట్లాగే ఉపనిషత్తులు ఈ సృష్టి పట్ల, జీవరాశిపట్ల చూపించే ధృక్పధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని మతాల వాళ్ళు సృష్టిని కాదు, సృష్టి కర్తను పూజించాలి. మీ హిందువులు సృష్టిని పూజిస్తారు కనుక నరకానికి పోతారంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. దీనికి ఉపనిషత్తులు అద్భుతమైన సమాధానం ఇస్తాయి. ఉపనిషత్తు ఉపదేశాల ప్రకారం ఈ ప్రపంచం సృష్టి కాదు, ఒక అభివ్యక్తీకరణ మాత్రమే (As per upanishads, This Universe is manifestation, not creation). అనగా సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు, భగవంతుడే ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు.' ఈశావాస్య ఇదం సర్వం' - ఈ సృష్టి అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అంటుంది ఈశావాస్య ఉపనిషద్. బ్రహ్మానుభూతిని పొందిన యోగి రాయిలో, రప్పలో, బ్రాహ్మణునిలో, ఏనుగులో, కుక్కలో, కుక్కను తినేవానిలో, మట్టిలో,.......... ఒక్కటేమిటి, అన్నిటిలో భగవంతుడినే చూస్తాడు. కాదు భగవంతుడే కనిపిస్తాడు. ఈ ధృక్పధమే హిందూ వ్యవసాయవిధానానికి, హిందూ ఆర్ధికవ్యవస్థకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బీజం వేసింది. అటువంటి దృష్టి లోపించినవాడికి రాయి రాయిగానే కనిపిస్తుంది, సృష్టి...సృష్టిగానే కనిపిస్తుంది. వాడు భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోలేదని గుర్తు. అటువంటి వారితో వాదించడం కూడా దండగే. వారికి సృష్టి కేవలం సృష్టి మాత్రమే. అంతటా దివ్యత్వాన్ని చూపే ఈ ఉపనిషద్ ధృక్పదం కూడా మనకు, అన్యమాతలకు మధ్య భేధాన్ని నిరూపిస్తుంది.

To be continued ..............

Sunday, 18 January 2015

హిందూ ధర్మం - 129 (ఉపనిషత్తులు)ఉపనిషత్తులలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. (అందులో కొన్ని విషయాలు ఒక చిన్న సంభాషణ రూపంలో చెప్పుకుందాం.)

శిష్యుడు - గురువుగారు! అయితే నా శరీరంలో కూడా ఆత్మ ఉందంటారా?
గురువు - నీ శరీరంలో ఆత్మ ఉండడం కాదు నాయన, నువ్వే ఆత్మవు, నువ్వు శరీరాన్ని ధరించావు.
శిష్యుడు - అన్ని జీవులలోనూ ఆత్మ ఉంటుందా గురువుగారు?
గురువు - అన్ని జీవులయందూ ఆత్మ ఉంటుంది. ఆకాశం కింద నీరు నింపిన అనేక కుండలు పెట్టినప్పుడు, అన్నిటిలోనూ ఆకాశం యొక్క ప్రతిబింబం వేర్వేరుగా కనిపిస్తుంది. ప్రతి కుండలో ఒక ప్రతిబింబం కనిపిస్తున్నందున, అనేక ఆకాశాలు ఉండవు కదా. అట్లాగే ఒకే ఆత్మ ఇన్ని జీవులయందూ వేర్వేరుగా వ్యక్తమవుతున్నప్పటికి, దాని తత్వం ఒక్కటే. ఆత్మ భగవత్ స్వరూపం.
శిష్యుడు - అయితే ఉన్నదంతా ఒకటే తత్వమంటారా?
గురువు - బ్రహ్మానుభూతిని పొందిన యోగులు తమ యందే సర్వలోకాలను, జీవాలను దర్శిస్తారు. వారు తమ నుంచి దేన్ని వేరుగా చూడలేరు. అందుకే తత్వం ఒక్కటే. అదే బ్రహ్మము, సత్యము కూడా.
శిష్యుడు - మరి ఈ ఆత్మను తెలుసుకోవడం ఎలా గురువుగారు?
గురువు - అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య మొదలైన ధర్మాలు పాటిస్తూ, స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ, నిత్యనైమిత్తిక కర్మలను నిష్కామంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి పాత్రతను ఇస్తుంది. అప్పుడే జ్ఞ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోగలం.

......................సర్వజీవులయందూ ఒకే ఆత్మ ఉంది అన్న సత్యాన్ని విస్మరించి, ఇతర జీవరాశిని హింసించేవారు తమను తాము హింసించుకుంటున్నవారి కింద లెక్క. వారు ఆత్మహింసకు, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టే. తనకు మాత్రమే తెలివి ఉందని భావించి, మేధావిగా భావిస్తూ, ఇతరులను మోసం చేస్తాడో, అన్యులకు ద్రోహం తలపెడతాడో, వాడు తన ఆత్మనే మోసగించుకుంటూ ఆత్మద్రోహానికి పాల్పడుతున్న తెలివితక్కువ దద్దమ్మ. అబద్ధాలు ఆడి లోకాన్ని మోసగించువచ్చు అనుకుంటాడు కానీ, ఆత్మను మోసగించలేడు. అలా అబద్దాలు ఆడేవాడు కూడా ఆత్మద్రోహం చేసుకుంటున్నవారే.శరీరం నశ్వరమని తెలిసి, రాకరాక వచ్చిన మానవజన్మలో ఆత్మజ్ఞానం పొంది, జన్మను సార్ధకం చేసుకోకుండా, భౌతిక సుఖాల కోసం వెంపర్లాడేవాడు, ఆత్మ గురించి తెలుసుకోకుండా ఉండేవాడు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియనప్పటికి, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటూ ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ చూపకుండా అలసత్వం వహించి, జీవితాన్ని వృధా చేసుకునేవారు, నిజానికి ఆత్మ యొక్క హత్యకు పాల్పడుతున్న వారె.

To be continued ................

Saturday, 17 January 2015

ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది

సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది ఆవు, ఎద్దు. పశువులు మనకు చేస్తున్న సహాయానికి నిదర్శనంగా కనుమ అనే ఒక ప్రత్యేకమైన రోజును వాటికి కెటాయించి, వాటిని పూజిస్తుంది హిందూ సంస్కృతి. ఎద్దు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఒంగులు గిత్త. అటువంటి ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది. కళ్ళు తెరవకపోతే, తర్వాతి తరాలకు పుస్తకాల్లో చూపించవలసి వస్తుందేమో.

ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 50-60 ఏళ్ళ కిందట బ్రెజిల్ వారు భారతదేశం నుంచి ఒంగోలు జాతి గిత్తలను చాలా తక్కువ ధరకు (కొన్ని వేలకు) కొని తీసుకువెళ్ళారు. తర్వాత అక్కడ వాటిని పెంచి సంతతిని వృద్ధి చేశారు. అదే సమయంలో భారతదేశంలో మేలు జాతి గిత్తలను అనవసరమైనదిగా భావించి కబేళాలకు తరలించి, మాంసం అమ్ముకున్నారు. ఈ మధ్య మన రైతు ఒకసారి బ్రెజిల్ వెళ్ళినప్పుడు, అక్కడ మేలుజాతి ఒంగోలు గిత్తలుండడం చూసి, వాటిని గురించి ఆరా తీసారు. వాటి ధర కౌక్కోగా, అక్కడ కనీసం 50 లక్షలు పెడితే కానీ, ఒంగోలు గిత్త దొరకదని తెలుసుకుని, మన దేశంలో వాటి పరిస్థితిని చూసి దుఃఖిస్తూ తిరిగి వచ్చారు. అటువంటి ఒంగోలు గిత్త గురించి ఒక ఆంధ్రప్రభలో పత్రికలో వచ్చిన వ్యాసం చదవండి.

మనం మరచినా రచ్చగెలుస్తున్న ఒంగోలు గిత్త: శారీరక బలం, సామర్థ్యాలలో దీనికి మించిన జాతి లేదు. ప ట్టుదలకు పెట్టింది పేరు. అందచందాలలో దీనికిలేదు సా టి. ఆప్యాయత, అనురాగాలు పంచటంలో దానికదే మేటి. ఉల్లాస ఉత్సాహాలు దీని సొంతం. యజమానికి సేవ చేయడమే దీని జీవన సూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రైతులకు ఇది ఆత్మబంధువు. అదే ఒంగోలుజాతి. ఒంగోలు గిత్త పేరు వినగానే మన కళ్ల మం దు ఎతైన మూపురంతో, పెద్ద గంగడోలుతో, సౌందర్యం, రాచఠీవి ముప్పిరిగొన్న ఒక నిండైన విగ్రహం మనకళ్ళ ముందు కనపడుతోంది. ఇంటి చంటి బిడ్డ తన రొమ్ము కుడిచినా, గంగడోలుతో ఆడుకొన్నా, మురిపెంతో చూసే ప్రేమ తత్వానికి ప్రతీక ఒంగోలు జాతి ఆవు అయితే, ఇంటి యజమాని కాలం చెందితే, దిగులుతో ఆహారం స్వీకరించకుండా ఆత్మత్యాగం చేసే విశ్వాసం ఒంగోలుజాతి గిత్తది. ఒంగోలు జాతి పశుసంతతి అందచందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు.

ఒంగోలు జాతి పుట్టు పూర్వోత్తరాలు :

ప్రపంచంలోని అన్ని జీవజాతుల మాదిరిగానే ఒంగోలు జాతి పశుసంతతికి వాటి స్వస్థలమే పేరుగా ఉండిపో యింది. వాటి పుట్టినిల్లు నెల్లూరు జిల్లా ఒంగోలు తాలూ కా గుండ్ల కమ్మ నది పరివాహక ప్రాంతం. ఒంగోలు జిల్లా ఏర్పడక ముందు ఒంగోలు తాలూకా నెల్లూరు జిల్లాలోనే ఉండడంతో ఈ జాతి అంతర్జాతీయంగా నెల్లూరు జాతి (నెల్లూరు బుల్స్‌ ) గానే ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం ఈ జాతి క్షీణదశలో ఉన్నప్పటికి మన రా ష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యజమానులు తమ బిడ్డల కన్నా మిన్నగా వీటి పట్ల శ్రద్ద వహించడం వలన ఈ జాతి పశువుల్లో మేలైనవి ఇంకా మిగిలి ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా పలు జిల్లాల్లో ఇప్పటికీ జరిగే బండలాగుడు పోటీలలో ఒంగోలు జాతిదే ప్రధాన స్థానం. చాలా జిల్లాల్లో రైతుల ఇంటి వాకిట్లో, చింతపట్ల సుబ్బారా వుగారి ఎడ్లు, పెనుబల్లి వారి ఎడ్లు అంటూ వారి ఎడ్ల బొమ్మలతో ఇంటి గుమ్మాలకు అలంకరించిన చిత్ర పటా లను మనం చూడ వచ్చు. ఒంగోలు జాతి పశువు రైతు లకు గొప్ప నేస్తం. యజమానులను ఎంత కాలం తర్వాత అయినా గుర్తించి ప్రేమను ఒలకబోయడం వీటి విశ్వాసతత్వానికి ప్రతీక.

ఒంగోలు జాతికి అన్నీ ప్రత్యేకతలే ..

బాస్‌ ఇండికస్‌ జాతికి చెందిన ఒంగోలు ఆవులను, గిత్తలను పోలినవి, వాటికి పోటీ రాగలవి మనదేశంలోనే కాదు, భూమండలంపైన మరెక్కడా లేవు. అందుకే అన్ని దేశాల కన్ను దీనిమీద పడింది. ఫలితంగా ఈ జాతి మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ఖండాల్ని దాటి ప్రపంచ దేశాలకు తన వారసుల్ని అందించింది. అంతర్జా తీయ పశుజాతి చరిత్రలో తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింప చేసింది. మనం నిర్లక్ష్యం వహించినా దీని విశిష్టతలను గుర్తించిన విదేశీయులు దీనిని అక్కున చర్చుకున్నారు. విదేశాలలో బ్రెజిల్‌ ఈ జాతిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఒంగోలుజాతి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడుతుండడం గమ నార్హం. ఆ దేశాలలో కేవలం మాంసం కొరకే వాటిని ఉత్పత్తి చేస్తారు. ఒంగోలు జాతి పశువులు శారీరక సా మర్థ్యం, రోగనిరోధక శక్తి, సంతాన సాఫల్యత, ప్రతికూల అంశాల్ని కూడా తట్టుకోగల చరిత్ర కారణంగా ఇవి ప్రాచుర్య పొందాయి. ఒంగోలు ఆవులకు మంచి సంతాన సాఫల్యత ఉంది. కడుపులో ఉన్నప్పుడు లేగదూడలు పెద్దగా బరువు లేకుండా ఉండడం వీటిలో సంతానోత్పత్తి అధికంగా ఉండడానికి ఒక కారణం. లేగదూడల్లోనూ చురుకుదనం అధికమే. పుట్టిన కొద్ది క్షణాలకే చెంగు చెంగున గెంతులేస్తూ ముచ్చట గొల్పుతాయి. ఒంగోలు జాతి ఆవులు సరైన పోషణ ఉంటే మూడు సంవత్సరాలకే మొదటిసారి ఈనుతాయి. ఒక ఆవు ఈతలో వెయ్యి లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కూడా మిగిలిన పశుజాతులతో పోలిస్తే రోగనిరోధక శక్తి అధికంగా ఉండడం ఈ జాతి ప్రత్యేకత. ఒకప్పుడు మన రాష్ట్రంలో పశుసంపద ఎక్కువగా ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో రైతులు పశుసంపదపై దృష్టి తగ్గించడంతో తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో ఒంగోలుజాతి పరిర క్షణ కొరకు ప్రకాశం జిల్లా చింతదీవి వద్ద ఫారం ఏర్పా టు చేసినా పాలకుల, అధికారుల అశ్రద్ద వలన అది పూర్తి స్థాయిలో పని చేయక పోవడం విచారకరం. ఉన్న కొద్దో గొప్పో ఒంగోలు జాతి పశువులు కూడా యజమానుల వ్యక్తి గత శ్రద్ద వలననే బ్రతికి బట్ట గడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు కళ్ళు తెరచి ఈ జాతి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి రక్షించక పోతే, మన ముందు తరాల వారు ఈ జాతి కోసం విదేశాలవైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదని పశుశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొసమెరుపు ..

హిందూ సాంప్రదాయంలో పశుసంతతికి పూజ్యనీయమైన స్థానం ఉంది. గోవుని మనం పూజిస్తాం. వృషభాన్ని పరమశివుని వాహనంగా సేవిస్తాం. మన దేశంలో గోవధ నిషేధచట్టం ఉన్నా, ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి లేక పోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం. మనం నిర్లక్ష్యం వహించినా విదేశాలకు వెళ్లిన ఒంగోలు జాతి, మన దేశఖ్యాతిని చాటి చెపుతున్నందుకు ఆనంద పడాలా, విదేశాలలోని వారికి, ఆ దేశాలలో ఉన్న మన వారికి కూడా ఆహారం అయిపోతుంటే బాధపడాలా తేల్చుకోవాల్సింది మనమే. ఒంగోలు జాతికి మనం రుణపడి ఉన్నాం. కానీ ఆ జాతి మనకు రుణపడి లేదు, కాబోదు. మనమే కళ్ళు తెరచి ఆ జాతిని సంరక్షించుకోవాల్సి ఉంది.

Source: http://www.prabhanews.com/prakasham/article-403494

Friday, 16 January 2015

సుభాష్ పాలేకర్ : ఓ రైతు గాథ

సంక్రాంతి రైతుల పండుగ. సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది పచ్చని పంటపొలాలు, పల్లెటూళ్ళు, కమ్మని మట్టివాసన, పాడి, పశువులు, హరిదాసులు, ఎడ్లబండ్లు, పట్టుపరికీణిలు, పిండివంటలు. ఈ పండుగ జరుపుకోవడం వెనుక వ్యవయసాయం, గోవు, ఎద్దు ముఖ్యం కీలకమైన పాత్ర పోషిస్తాయి. కానీ ఇప్పుడు వ్యవయసాయరంగం వెలవెలబోతోంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆవులు, ఎడ్లు కబేళాకు తరలిపోతున్నాయి. ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నాయి. సంప్రదాయ ఎరువుల స్థానంలో రసాయన ఎరువులు వచ్చి, జనాలను రోగిష్టులుగా తయారు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక ఆదర్శవంతమైన రైతు గురించి, కేవలం ఆవును, ఎద్దును ఉపయోగించి, రూపాయి పెట్టుబడి లేకుండా ఆయన చేస్తున్న వ్యవసాయం గురించి తెలుసుకుందాం.

సుభాష్ పాలేకర్ : ఓ రైతు గాథ

భారతదేశం సుసంపన్న వ్యవసాయ దేశం. ఇది మనమందరం గర్వపడే విషయం! రసాయనిక ఎరువుల వాడకంలోనూ అగ్రగామి మనదేశం. ఇది మనమందరం బాధపడాల్సిన విషయం! ఇంతకు ముందుతరాలలో వేల సంవత్సరాలపాటు అవసరం లేని మందుల వాడకం ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరిగింది? పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటిని రుజువు చేసిన ఓ రైతు గాథ ఇది.

సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని కరవు ప్రాంతం విదర్భకు చెందినవాడు. దాంతో సహజంగానే వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. ఫలితంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. కొంతకాలానికి సొంతపొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు పదేళ్లపాటు అంటే 1972 నుంచి 82 వరకు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలలోకి దిగాడు. నిపుణులను అడిగాడు. సర్వేనివేదికలు తెప్పించుకుని చూశాడు.దిగుబడి పెంచుకోవడానికి అప్పటికి ఆయనకు కనిపించిన ఒకటే మార్గం మరిన్ని రసాయనిక మందులు వాడటం. ‘సరే, ఇప్పుడంటే మందులు ఎక్కువ వాడతాను, మరలా కొన్నేళ్లకు దిగుబడులు పడిపోతే ఏంటి పరిస్థితి? అపుడింకా ఎక్కువ వాడాలా? మందులవాడకాన్ని ఎంతకాలమని ఇలా పెంచుకుంటూ పోతాం…’ అన్న అంతర్మథనం ఆయనలో మొదలైంది. దీనికేదో ఒక మార్గం కనిపెట్టాల్సిందే అనుకున్నాడు. రసాయనిక ఎరువుల లాభ-నష్టాలపై మూడేళ్లపాటు పరిశోధిస్తే, దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. ముందుగా భూసారంపై పరిశోధనలు చేశారు.

సేంద్రియ ఎరువుల వల్ల నేల కలుషితం కాదు, పంటల్లో రసాయనాలు ఉండవు, అంతవరకు బాగానే ఉంది కానీ అది చాలా క్లిష్టమైన పద్ధతి. ఒక రకంగా ఖరీదైనదే. ఎక్కువ శ్రమతో కూడినదీ. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పాత్ర పంట దిగుబడుల్లో ప్రధాన పోషిస్తోంది గాని మందులు కాదు అని తెలుసుకున్నాడు.

మొక్క కేవలం రెండు శాతం మాత్రమే భూమిలో పోషకాలను ఉపయోగిస్తుంది. మిగతా అంతా గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే గ్రహిస్తుందని గ్రహించాడు. ఆ రెండింటినీ సరైన మోతాదులో సరిగ్గా అందించగలిగితే చాలనుకున్నాడు. తన పరిశోధనల్లో భాగంగా మన ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించాడు.

ఆవుపేడ, గోమూత్రం … ఈ రెండింటికీ మించిన ఎరువు లేదని ఆయనకు అర్థమైంది. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు విజయం సాధించారు. కేవలం ఒక ఆవు ఎరువు 30 ఎకరాలు పండించడానికి సరిపోతుందట. పదికిలోల ఆవుపేడ, పదిలీటర్ల గోమూత్రం, రెండుకేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాడు. ఈ మందుకు ఆయన పెట్టిన పేరు ‘జీవ మూత్ర’. దాన్నే పొలంలో వాడారు. దాంతో అత్యధిక దిగుబడులు సాధించారు.

ఒక్క బెల్లం తప్ప బయటనుంచి కొనేదేమీ లేది ఇందులో. పురుగు మందులు అతిగా వాడి పాడైన పొలాలను జీవ మూత్ర మందు మళ్లీ యథాతథ స్థితికి తేగలదు. ఎందుకంటే ప్రతి గ్రాము ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులుంటాయిట. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి. అయితే, విదేశాల నుంది దిగుమతి చేసుకున్న జెర్సీ, ముర్రా జాతి ఆవుల పేడ ఇందుకు పనికిరాదట!

తన పరిశోధన ఫలాలు అందరికీ అందించడం కోసం రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాడు పాలేకర్. సుమారు ఇప్పటివరకు 2000 శిబిరాల కంటే ఎక్కువే నిర్వహించాడు. అరవైలలోనూ అలసి పోకుండా తన పయనం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం (జీరో బడ్జెట్ ఫర్ నేచురల్ ఫామింగ్) ప్రధానాంశంగా పలు పుస్తకాలు రాశారు.

తన పరిశోధన ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వాటిపై రూపాయి కూడా లాభం వేసుకోకుండా ఉత్పాదక వ్యయానికే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలిచ్చేందుకు ఇంటర్‌నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.

కుటుంబమంతా భూమిపుత్రులే!

సుభాష్ పాలేకర్ మాత్రమే ఆ కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. సుభాష్ వారసుడు అమోల్ కూడా తండ్రి మార్గంలో నడిచారు. ఇందుకోసం ఆయన తన ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తండ్రి, అన్నల బాటలో అమిత్ తన అడుగులు వేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ కటుంబం మొత్తంతో భూమిపుత్రులుగా మారి, రసాయనిక వ్యవసాయంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. సుభాష్ కోడళ్లు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు చేసే ఫోన్ కాల్స్‌కు సమాధానాలిస్తూ వీరితో పాటు ప్రకృతి వ్యవసాయంలో తమ పాత్ర పోషిస్తున్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే సుభాష్ పాలేకర్ అనుసరించే వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే
www.palekarzerobudgetnaturalfarming.org ను సంప్రదించవచ్చు. అందులో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పంటల పండగ సంక్రాంతి రోజున సుభాష్‌కు సలాం!

‘‘కేవలం ఒక ఆవు పేడ 30 ఎకరాలు పండించడానికి సరిపోతుంది. పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల గోమూత్రం, రెండు కేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాను. దాన్నే పొలంలో వాడాను. దాంతో అత్యధిక దిగుబడులు సాధించాను. మందులు అతిగా వాడి పాడైన పొలాలను ఈ జీవ మూత్ర మందు మళ్లీ యథాస్థితికి తేగలదు.’’ సేకరణ: http://goo.gl/4JAC2s

Thursday, 15 January 2015

కనుమ పండుగ.

16-01-2015 శుక్రవారం, కనుమ పండుగ.

వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.

ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.


ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.


మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి  తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది.  

గోబ్బెమ్మలు

సంక్రాంతి,ధనుర్మాసం అనగానే మనకు ముందు గుర్తుకువచ్చేది గోబ్బెమ్మలు/గోబ్బిళ్ళు.చక్కగా ఉదయమే లేచి,ముగ్గులు వేసి,వాటికి అందంగా రంగులేసి,పరికిణిలువేసుకుని పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు ఆడపిల్లలు.గోబ్బెమ్మ అంటే ఆవుపేడ ముద్ద.(మనం ఇప్పటికే పలుమార్పు చెప్పుకున్నాం భారతీయ గోపేడ విశిష్టత ఏమిటో.అందుకే మళ్ళీ ప్రస్తావించటంలేదు).ధనుర్మాసం మొదలుకొని సంక్రాంతి వరకు ప్రతిరోజు గోబ్బెమ్మలు పెడతారు."సంధిగోబ్బెమ్మ" అని ఒక తల్లిగోబ్బెమ్మను,రెండు పిల్ల గోబ్బెమ్మలను ఈ మాసంలో ఏదో ఒకరోజు పెట్టి పూజిస్తారు.


సుబ్బిగోబ్బెమ్మ సుబ్బినీయవే
తుమ్మిపూవంటి తమ్ముడినీయవే
చామంతి పూవంటి చెల్లినీయవే
మొగలిపూవంటి మొగుడినీయవే..............అంటూ కుటుంబసభ్యులను ప్రకృతిలో పూసే రకరకాల పువ్వులలో అందంలో వర్ణిస్తూ పాటలు పాడతారు.
"ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చెనే
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
కడవలోన పాలు పెరుగు తాగిపోయనే......" అంటూ శ్రీ కృష్ణపరమాత్మకు సంబంధించిన పాటలు పాడుతూ గోబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు.
పానకం,వడపప్పు(నానబెట్టిన పెసరపప్పు),పళ్ళు(ముఖ్యంగా ఈ ఋతువులో వచ్చేవి),గారెలు నైవేధ్యంగా సమర్పిస్తారు.స్త్రీలు పసుపుకుంకుమలు,తాంబులం,పండ్లు,పూవులు పంచిపెట్టుకుంటారు.ఈ విధంగా చాలా విధాలుగా పాటలుపాడుతారు.కులాలకు అతీతంగా స్త్రీలందరిని ఒక ప్రదేశంలో చేర్చడంలోనూ,వారి మధ్య ఐక్యతను పెంచడంలో ఇది సహాయపడుతుంది.

బతుకమ్మలాగానే గోబ్బెమ్మ కూడా గౌరిదేవి(పార్వతి దేవి)స్వరూపం.ధనుర్మాసం నెలంతా ఏ రోజుకారోజు ముగ్గుల మధ్యలో పెట్టిన గోబ్బెమ్మలను సాయంత్రం సమయానికి పిడకలుగా గోడకు కొడతారు.ఈ పిడకలమంటతో భోగిమంటలకు,రధసప్తమీ రోజున పాలుపోంగించడానికి,మాఘమాసం ఆదివారాలు శ్రీ సూర్యనారాయణ మూర్తికి పరమాన్నం వండడానికి ఉపయోగిస్తారు. బతుకమ్మ,గోబ్బెమ్మ సాక్షాత్ మహాగౌరి స్వరూపాలు.అందువల్ల ఎవరైన బతుకమ్మను,గోబ్బెమ్మను పూజిచవచ్చు.

సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వులు, బెల్లం తినాలి

సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వులు, బెల్లం తినాలి. దీని వెనుక ఆయుర్వేదరహస్యం ఉంది. నువ్వులు చలికాలంలో శరీరంలో ఏర్పడిన వాత దోషాన్ని తగ్గిస్తాయి. బెల్లం నువ్వుల తినడం వలన పైత్య దోషం కలగకుండా చేస్తుంది. అందుకే సంక్రాంతి నాడు తెలుగు వాళ్ళు అరిసెలు చేసుకుని తింటారు. తీపి తినండి, తియ్యగా మాట్లాడండి. 
సంక్రాంతి పండుగకు గడపకు వరి, జొన్న కంకులను కడతారు.

దీని వెనుక జీవ వైవిధ్యాన్ని రక్షించాలన్న సందేశం ఉంది. పోలాల్లో పంట కాపుకు వచ్చే సమయంలో, రకరకాల పక్షులు, పిట్టలు ఆ ఆహారం కోసం అ పంట మీద పడతాయి. అప్పుడు వాటిని రైతు వెళ్ళగొడతాడు. అవి జీవవైవిధ్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన జీవనానికి ఈ భూమి మీద ఉన్న ప్రతిజీవి ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. వాటి కృతజ్ఞతగా, ఆనాడు వాటికి ఆహారం దక్కకుండా వెళ్ళగొట్టినందుకుగాను పంట చేతికోచ్చాక ఇంటి గుమ్మాలకు వరి కంకులు కట్టి, వాటికి ఆహారం అందించేవారు మన పూర్వీకులు. అవి గుమ్మాల దగ్గరకు వచ్చి తింటే రైతు ఆనందిస్తాడు. ఏ జీవవైవిధ్య సదస్సులు జరగని రోజుల్లోనే, ప్రపంచానికి పర్యావరణాన్ని పరొరక్షించాలన్న స్పృహ లేని రోజుల్లోనే సనాతాన భారతీయులు(హిందువులు) ప్రకృతి రక్షణ కోసం తీస్కున్న చర్యలు. ఇది ఒకనాటి మాట అయిపొయింది.

ఇప్పుడు సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా పిచ్చుకల జాతి అంతరించిపోతోంది. పల్లే పట్నం బాట పట్టింది. మనకైతే ప్రకృతిని దోచుకోవడం తప్ప, కాపాడుకోవాలన్న ఆలోచన చస్తే రాదు.మహర్షుల వారసులం మనం. వాళ్ళ పేరు నిలబెట్టాలి కద. అందుకే కనీసం ఈ సంక్రాంతి నుండైనా మన ఇంటి గోడ మీద పక్షులకు చిన్న మట్టి ముంతలో నీరు పెడదాం. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. 


సంక్రాంతి శుభాకాంక్షలు.

Wednesday, 14 January 2015

సంక్రాంతి - పెరుగు దానం

సంక్రాంతి రోజు తప్పకుండ చేయవలసిన దానం ఏమిటి?

సంక్రాంతి రోజు తప్పకుండ పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చేయడం వలన సంతానసౌఖ్యం కలుగుతుంది. అధితి కశ్యపులకు శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించగానే పెరిగి 6 ఏళ్ళ బాలుడయ్యడు. వారికి సంతాన సౌఖ్యం కలుగలేదు. మరుజన్మలో శ్రీ రాముడిగా విష్ణువు, కౌసల్య, దశరధులుగా అధితికస్యపులు జన్మించారు. కాని రాముడు వనవాసానికి వెళ్ళడం, ఆ బాధతో దశరధుడు మరణించడం, కౌసల్య నువ్వు పుట్టపొయినా బాగుండును అని రాముడిని అనడం జరిగింది. వారికి అప్పుడు కూడ పుత్రసౌఖ్యం లేదు.

కృష్ణవతారంలో అధితికశ్యపులు దేవకి,వసుదేవులుగా జన్మించగా, పుట్టగానే వారికి దూరమైనాదు కృష్ణుడు. వారికి సంతానసౌఖ్యం లభించలేదు. కృష్ణుడికి కూడా సంతానం కలిగినా వారి వల్ల ఆయనకు సంతాన సౌఖ్యం కలుగలేదు, వారికి గొప్ప పేరు కూడా రాలేదు. యశోద పెరుగు దానం చెసింది. అందుకే శ్రీకృష్ణపరమాత్మ వలన సంతానసౌఖ్యం పొందింది. ఇందులో నందుడు పాలుపంచుకోలేదు కనుక ఆయన కృష్ణతత్వాన్ని అనుభవించలేకపోయాడు. అందువల్ల సంక్రాంతి రోజు పెరుగు దానం చేయడం వలన సంతానం వల్ల సుఖం, ఆనందం కలుగుతుంది. సంతానం కలిగినవారు పెరుగు దానం చేయడం వలన పుట్టిన సంతానానికి సద్బుద్ధి కలుగుతుందని డా.సి.వి.బి.సుబ్రహ్మణ్యం గారు చెప్పారు.

అలాగే సంక్రాంతి రోజున కూష్మాండం(గుమ్మడి కాయ) దానం చేయాలి.  ఏది దానం చేస్తున్న మన గుర్తుపెట్టుకోవలసినవి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటలు. శ్రీ కృష్ణపరమాత్మ అంటారు " ప్రత్యుపకారము (ఇచ్చినదానికి ఫలితం, ఇవ్వడం వలన నాకేమి వస్తుంది) ఆశించకుండా, తగిన ప్రదేశంలో, తగిన కాలంలో, తీసుకునే వారి పాత్రతను (అవసరం ఉన్నవారికే దానం చేయాలి, రోగులకు ఔషధము, చదువుకునే ప్రజ్ఞ ఉండి ధనం లేని కారణంగా విద్యాభ్యాసం ఆపేసినవారికి విద్యాదానం, బీదవారికి ధనం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇలా....) అనుసరించి ఆ దానాన్ని సాత్విక దానం అంటారు. నేను ఇస్తున్నాను అన్న గర్వం ఉండకూడదు. గొప్పతనం చూపించడానికి చేయకూడదు." ఇటువంటి దానం గొప్ప ఫలితానిస్తుంది.

మకర సంక్రాంతి

సం అంటే మంచి, క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్దం. అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలో నెలరోజులా పాటు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. నిజానికి సూర్యుడు ఎప్పుడు తన స్థానంలోనే ఉంటాడు. ఈ విషయం ఆధునికసైన్సు చెప్పక కొన్ని వేల ఏళ్ళ పూర్వమే హిందువులకు తెలుసు. శథపధ బ్రాహ్మణం 'నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి' అంటూ చాలా స్పష్టంగా చెప్పింది.

ఏడాదిలో 12 సంక్రాంతులు ముఖ్యమే అయినా, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం ప్రధానమైనవి. మకరసంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణంలో భూమికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు. ఈ కాలంలోనే ఎన్నో శుభకార్యాలు చేస్తారు. ఈ ఉత్తరాయణం ఈ మకరసంక్రమణంతోనే మొదలవడంతో ఇది పెద్ద పండుగ, ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన పండుగ. సంక్రాంతులలో పితృదేవతలను పూజించాలి, వారికి తర్పణాలు వదలాలి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి. గంగా, యమున, గోదావరి, సరస్వతీ నదులను స్మరించి పుణ్యస్నానం చేయాలి. ఇష్టదేవతలకు, కులదేవతలకు, ఇలవేల్పులకు, గ్రామదేవతలను స్మరించాలి, పూజించాలి. పండుగ రోజునే కాదు ప్రతి రోజు గోమాతను దర్శిస్తే సకలశుభాలు కలుగుతాయి. అలా కుదరని పక్షంలో కనీసం సంక్రాంతులలోనైనా ఆవును (గోమాతను) దర్శించి, గ్రాసం తినిపించడం వలన మంచిఫలితాలు వస్తాయి. అట్లాగే సంక్రాతులలో శ్రీ విష్ణు, లలితా సహస్రానామపారాయణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఇదండీ మకర సంక్రాంతి విశేషం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. 

Tuesday, 13 January 2015

భోగి పండ్లు విశేషాలు

14-01-2015, బుధవారం, భోగి

సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి రోజు తప్పకుండా తెల్లవారుఝామున అభ్యంగనస్నానం చేయాలి. ఎన్ని ముఖ్యమైనా పనులున్నా సరే, అన్నిటిని పక్కన పెట్టి తలకి (మాడుపై) నువ్వుల నునె పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. భోగి పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి?

భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతనామం. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి/దిష్టి తొలగిపొతుంది. ఇది వారి ఎదుగుదలకు తొడ్పడుతుంది.

మన బాహ్య నేత్రాలకు కనిపించదు కానీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులవుతారు.

ఈ సంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది. భోగిపండ్లు, చెరుకు ముక్కలు, రూపాయి బిళ్ళలు, పువ్వులు మొదలైనవి కలిపి పోస్తారు. చెరుకు, పూలు, పండులు ఇవన్నీ ప్రకృతికి సంకేతం. వీటిని తలమీద పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి, రక్షించండి, వృద్ధి చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని అర్ధం. ఈ పూలు, పండ్ల మిశ్రమాన్ని తలమీద పోయడం వలన పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది, చెడు ప్రభావం తొలగిపొతుంది, అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రకృతిని, భూగోళాన్ని రక్షించడం వల్లనే మనకు రక్షణ ఉంటుంది, అభివృద్ధి జరుగుతుందని అనేది అంతరార్ధం.

పాశ్చాత్య మతాలు కేవలం శరీరాన్ని గురించే వివరించాయి. కాని సనాతన హిందూ ధర్మం, శరీరంతో పాటు శరీరంలో ఉన్న ఆత్మను గురించి వివరించింది. మనం ఆత్మ, కాని మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం. చెరుకు, డబ్బు, పూలు, రేగిపండ్లు మనసు, బుద్ధి, అహంకార చిత్తాలకు సంకేతాలు. వీటి మాయలో పడ్డ పడి మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం కోసం తపన పడుతుంటాం. మనం పోసిన పండ్లు క్రిందకు జారిపోయినట్టుగా, మనలో ఆత్మగా ఉన్న "నేను"  మీద మనోబుద్ధ్యహంకారచిత్తాల వలన కమ్మిన మాయ కూడా అలా సులువుగా క్రిందకు జారిపోయి మన నిజస్వరూపమైన ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలన్న ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విశేషం  తెలియపరుస్తుంది మన సంప్రదాయం.

చిన్న పిల్లలకే భోగి పండ్లు పోయాలని ఏమి లేదు. పిల్లలు ఎంత పెద్దవారైన, ముసలిదైన "అమ్మ"కు వాళ్ళు ఎప్పుడూ పసివాళ్ళతో సమానం. అందుకే ప్రతి తల్లి తన పిల్లలకు, తన పిల్లల తోటివారికి భోగిపళ్ళను పోసి మనసార ఆశీర్వదించండి. తల్లి దీవనలుంటే సకల దేవతల దీవేనలున్నట్టే అంటున్నాయి మన శాస్త్రాలు. ప్రేమతో తల్లి దీవించే ప్రతి దీవెన సత్యమవుతుందని కూడా మన సనాతన ధర్మం చెప్తోంది.    

మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సంప్రదాయాలను మూఢనమ్మకాలు అనడం మూర్ఖత్వం.                

భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వండుకుని తినాలి.

అందరికి భోగి శుభాకంక్షలు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

Monday, 12 January 2015

14-01-2015, బుధవారం, భోగి - భోగి మంటలు, విశేషాలు

14-01-2015, బుధవారం, భోగి

భుజ్ అనే సంస్కృత ధాతువు నుండి భోగి అనే పదం వచ్చిందని చెప్తారు. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాధస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. భోగి అనగానే మనకు గుర్తుకువచ్చేది భోగిమంటలు. భోగి పండుగ నాటి తెల్లవారుఝామునే భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అసలెందుకు వేయాలి?

సాధారణంగా అందరూ చెప్పేది, ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం వేస్తారని. కానీ నిజానికి భోగిమంటలు వెచ్చదనం కోసమే కాదు ఆరోగ్యం కోసమూ వేస్తారు. ధనుర్మాసం నెలంతా ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగిమంటల్లో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది.

మనం పెద్ద మంటరావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తాము. అవి కాలడానికి ఆవునేయిని వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశవాళీ ఆవునేయి నుంచి 1టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునేయి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలోని  72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవచ్చు. అదే లోకంలో అందరికి వస్తే అందరికి ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు పేదలు కూడా ఉండచ్చు. వారికి వైద్యం చేయుంచుకునే శక్తి లేకపొవచ్చు. ఇదంతా ఆలోచించిన మన ప్రాచీనులు అందరు కలిసి భోగిమంటల్లో పాల్గోనే సంప్రదాయం తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది, ఐక్యతను పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్నిదేవుని ఆరాధన. మరొక విధంగా గాలిని శుద్ధిచేస్తూ వాయుదేవునికిచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫ్యాషన్, సృజనాత్మకత పేరున రబ్బరు టైర్లను పెట్రొల్ పోసి తగలబెట్టి, దాని ద్వారా విషవాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చెస్తున్నాం. ఉన్న రోగాలే కాక క్రొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం.ఇక భోగిమంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులను వేస్తే కూడా ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయి. పైగా అడ్డమైనవి, ప్లాస్టిక్ కవర్లు, చెత్త సామాన్లు తగలబెట్టడం వాయుదేవుడికి చేసే అపచారమవుతుంది.

ఇప్పుడు మనం చరిత్రలో ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. హిందువుల దగ్గర ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తేకానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిష్ దుండగులు, భోగిమంటల్లో పాతసామానులు తగలబెట్టాలన్న నెపంతో అమాయకప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతిప్రాచీన తాళపత్ర గ్రంధాలను భోగిమంటల్లో వేసి కాల్పించేశారు.
   
భోగిమంటల్లో కాల్చవలసినది పనికిరాని వస్తువులు కాదు, మనలో ఉన్న పనిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.

స్వామి వివేకానంద

ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిభోద్యత - లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అంటూ ఉపనిషత్ వ్యాక్యాలను అందరికి అర్దమయ్యే రీతిలో చెప్పి, భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు స్వామి వివేకానంద. భారతమాత కన్న మహామననీయుల్లో ఒకరు స్వామి వివేకానంద. 80 పైగా మతాలు, జైన, భౌద్ధాలు హిందూధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, 2000 ఏళ్ళకు పూర్వం హిందూజాతి చూసిన మహాపురుషుడు ఆదిశంకరాచార్యులవారు. ఆదిశంకరులే లేకపోతే అసలు హిందూ సంస్కృతి, భారతదేశం ఈనాటికి మిగిలి ఉండేవికావు. తన జీవతం మొత్తాన్ని ధర్మరక్షణకు అంకితం చేసి, భౌద్ధ, జైన మతాల్లోకి మారిన అనేక వేలమంది హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చారు శంకరాచార్యులు. సరిగ్గా అలాంటివారే స్వామి వివేకానంద.

1863 జనవరి 12న జన్మించారు స్వామి వివేకానంద. వివేకనందుడికి పూర్వాశ్రమ నామం నరేంద్రనాధ్ దత్తు. హిందూ ధర్మంలో ఏముందిలే? అసలు మన సంస్కృతిలో గొప్పతనేమేమి లేదు అని భావిస్తూ, అంధకారంలో మగ్గుతున్న హిందువుల ముందు ఉదయించిన సూర్యుడు స్వామి వివేకానంద. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శిష్య గణం, పేరు ప్రఖ్యాతులతో తాను ఒక కొత్త మతం స్థాపించి, కొత్త ప్రవక్తగా గొప్పగా స్థిరపడచ్చని తెలిసి కూడా, తన జీవితాన్ని హిందూ ధర్మ పునరుద్ధరణకు, ధర్మ సంస్కరణకు అంకితం చేశారు స్వామి. విదేశి కుట్రలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన హిందువుల్లో ఆత్మ విశ్వాశాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. అప్పటివరకు భారతదేశానికే పరిమితమైన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి వ్యక్తి వివేకానందుడే. సాధువైనా అపారమైన దేశభక్తి కలిగి, ఎందరో దేశభక్తులకు స్పూర్తినిచ్చారు స్వామి వివేకానంద.

నా దేశంలో కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడం నేను సహించలేను అన్నారు. మీకు భారతదేశం కోసం ఏదైనా చేయలనిపిస్తే, హిందూ ధర్మ పునఃస్థాపనకు, ధర్మ జాగరణకు కృషి చేయండి. ఈ దేశమూ, ధర్మమూ రెండూ ఒక్కటే, రెండిటి మధ్య ఉన్న సంబంధం శరీరము ఆత్మ సంబంధం వంటిది, హిందూత్వమే భారతీయ ఆత్మ అన్నారు. మీరు నా పిల్లలు, నేను మీకు అండగా ఉంటాను, మీరు దేనికి భయపడకండి అంటూ యువతలో ధైర్యం నింపినా, అది వివేకానందుడికే చెల్లింది. ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ముక్తి పొందెవారకు నేను నా ముక్తిని వాయిదా వేసుకుని, మళ్ళీ మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ చెప్పిన వివేకానందుడి మాటలు చిరస్మరణీయాలు. వివేకానందుడి రచనలు చదవని వారి జీవితం వ్యర్ధమనే చెప్పాలి.

నా రచనలు చదివేవారికి పక్కన నేనుండి చెప్పినట్టే ఉంటాయి అన్న స్వామిజీ మాటలు అక్షరసత్యాలు. స్వామిజీ రచనలు చదివినా చాలామందిలో భావావేశంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి.

ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిభోద్యత - లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి 

Sunday, 11 January 2015

ముగ్గులు - భూతయజ్ఞం

ప్రతి హిందువు రోజు తప్పకుండా 5 యజ్ఞాలు చేయాలి. అందులో ఆఖరిది భూతయజ్ఞం, భూతములు అంటే జీవులు, ప్రాణులని అర్ధం. ప్రకృతిలో మనతో కలిసి జీవనం సాగిస్తూ, మనకు ఎంతగానో సహాయపడుతున్న జీవరాశికి ఆహారం వేయడం మన ధర్మమని భగవతాజ్ఞ. సద్గురువు శ్రీ సాయినాధుడు కూడా అన్ని జీవుల ఆకలిని తీర్చమన్నాడు.

అంతేకాదు మనిషి జీవితంలో కలగలిసిపోయిన అనేక జీవరాశులను మన నుంచి పూర్తిగా వేరు చేయలేము. ఈ జీవవైవిధ్య సూత్రం మనం ఇష్టపడే పిల్లి, కుక్క, మేక, ఆవు కే కాదు .. మనం విసుక్కునే చీమ, బల్లి, ఎలుక, బొద్దింకలకూ వర్తిస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వాటిని మనం నియంత్రించాలిగాని .. నాశనం చేయకూడదు. ఎంతోకొంత జీవకారుణ్యం చూపితే ఇంకా మేలు! మనం సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనుకా జీవకారుణ్య కోణం ఉంది. ఒకప్పుడు బియ్యంపొడినే ముగ్గుపిండిగా వాడేవారు. ఇది ........ ఇంటి ముంగిలికి అందాన్నే కాదు చీమలకు ఆహారంగా కూడా ఉండేది. చీమలు ఆహారం కోసం ఇంట్లోకి బారులు తీరకుండా ఒకే చోట వాటికి ఆహారం అందించే ఉపాయం ఇది. అంత ఆహారం దొరికితే ఇక చీమలు వంటగదులపై ఎందుకు దాడి చేస్తాయి? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ ఎందుకు గారాలు పోతాయ్? అంతేకాదు, పొయ్యి దగ్గర కూడా ఆవుపేడతో అలికి ముగులు పెట్టే సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. చీమలే కాదు...... పిచ్చుకలకూ ఈ ముగ్గుపిండి (బియ్యపు పిండి) ఆహారంగా ఉండేది. మన నగరాల్లో సింధటిక్ ముగ్గులు, సున్నం ముగ్గులు పెరగడం కూడా పిచ్చుకల సంఖ్య తగ్గడానికి ఓ కారణం.

Saturday, 10 January 2015

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?

మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.  ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు  వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

Friday, 9 January 2015

ముగ్గులు - ఆరోగ్య కారణం

మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి  ఆరోగ్య కారణాలున్నాయి.


శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి
తీస్తుంది.  రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం.

ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు. అట్లాగే వంగినప్పుడల్లా శ్వాసను నిదానంగా పీలుస్తూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అవుతుంది.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు  కూడా ఉపాసకులే వేస్తారు.

స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ. వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు. 

Thursday, 8 January 2015

కళ్ళాపి, ఇల్లు అలకడం వెనుకున్న వైజ్ఞానిక అంశం

చిన్నప్పుడు అమ్మమలు, బామ్మలు ఉదయం లేవగానే ఆవుపేడ కలిపిన నీటితో కళ్ళాపి చల్లేవారు. పండుగలు, పూజలకు ముందు ఇంటిని ఆవుపేడతో అలికేవారు. కొందరైతే గోడలను కూడా గోమయంతో అలికేవారు. అసలు అలా ఆవుపేడను ఉపయోగించడం వెనుకున్న కారణం ఏమిటి?  ఆవు పేడ నీటినే చల్లడం ఎందుకు ?

కళ్ళాపి చల్లడం వలన గాలికి దుమ్ము లేచి, ఇంట్లోకి రాకుండ ఉంటుందని సాధారణంగా చెప్తారు. కానీ దానిలో వైజ్ఞానిక అంశాలున్నాయి.

"దేశవాళీ/నాటు ఆవుపేడ" (భారతీయ గోవు పేడ ని మాత్రమే) కలిపిన నీటినే కళ్ళాపిగా చల్లుతారు. నిజానికి భారతీయ గోవుకు (ఆవుకు) చాలా విశిష్టత ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని గోజాతులలోకి భారతీయ గోవుకున్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమిసంహారిణి. క్రిములను దరిచేరనీయదు, హాని కలిగించే కీటకాలను దూరంగా పంపేస్తుంది.

అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి, కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.

ఈ కాలంలో మనం రెడియేషన్ లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. ఆవుపేడ రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి, ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు.

ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు. ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాలు పగుళ్ళకు కూడా ఇవే ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఒక్క పేడలోనే ఇన్ని విశిష్టతలుంటే ఇక ఆవుపాలలో ఎన్ని విశేషాలు ఉంటాయి. అందుకే భారతీయులు ఆవును అమ్మగా, గోమాతగా పూజిస్తారు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది . ఇదండీ మనం కళ్ళాపి చల్లడం వెనుక ఉన్న కారణం. కాని మనం పాశ్చత్య మోజులో పడి మనవన్ని మూఢాచారాలంటున్నాం. అమెరికా వాడు మాత్రం భారతీయ గోవు మీద పెటెంట్ హక్కులు పొందే ప్రయత్నంలో ఉన్నాడు.

Tuesday, 6 January 2015

హిందూ ధర్మం - 128 (ఉపనిషత్తులు)

ఉపనిషత్తులు ప్రధానంగా ఆత్మ గురించి, మరణం గురించి, సృష్టి పట్ల. సర్వజీవుల పట్ల మనిషికి ఉండాల్సిన ధృక్పధం గురించి వివరిస్తాయి. భగవంతుడు శాశ్వతమైనవాడు, ఎప్పటికి ఉండేవాడు, పరిమితులు లేనివాడు, మాటలకు, వర్ణనలకు అతీతమైనవాడు. అటువంటి పరమేశ్వరుడిని చర్మ చక్షువులతో (బాహ్య నేత్రాలతో) చూడటం దాదాపు కష్టం. ఎందుకంటే శరీరం నశ్వరమైనది, ఈ రోజు ఉంటుంది, రేపు నశించిపోతుంది. అలా అని మనసుతో కూడా చూడలేము, ఎందుకంటే మనసుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటి మనసుపోలేదు. కానీ భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోవాలన్నా, భగవంతుని చూడాలన్నా, అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. దానికి కారణం ఆత్మ కూడా పరమాత్మ వలె శాశ్వతమైనది, మార్పు చెందనిది. నిత్యం సుఖాన్ని కోరుకోవడం మనిషి యొక్క లక్షణం. కానీ ఈ ప్రపంచంలో ఒక వింత ఉంది. సుఖదుఃఖాలు ద్వందాలు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. రెండిటిలో దేన్నీ కోరుకున్నా రెండవది వెనుకే వస్తుంది. మనిషి ఈ రోజు కోట్ల ఐశ్వర్యంతో సుఖంగా ఉన్నాడని అనుకోవచ్చు, కానీ ముసలి వయసు రాగానే ఆ ఆస్థుల యందు, ధనం యందు పెరిగిపోయిన బంధమే దుఃఖానికి కారణమవుతుంది. ఈ రోజు నీకు ఏది సుఖం ఇచ్చిందో, రేపు అదే నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వయసులో ఉన్నప్పుడు నోటికి తాళం వేయరు. ఉదాహరణకు ఒక సమయం ఉండదు, నచ్చినవన్నీ ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఆహారనియమాల పాటించని కారణంగా కాస్త పెద్దవయసు రాగానే ఏదో ఒక రోగం వస్తుంది. డాక్టర్ కొన్ని తినవద్దు అని చెప్తాడు. అప్పటివరకు నోటికి అలవాటైన రుచులు ఒక్కసారిగా అందకపోయేసరికి ముద్దు నోట్లోకి దిగదు, దాంతో మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. వచ్చిన రోగం కంటే ఈ మానసిక క్షోభయే అధికంగా ఉంటుంది. అందుచేత మనిషి సుఖదుఃఖాలకు అతీతంగా అదగాలి. అంటే సుఖదుఃఖాలను పట్టించుకోకపోవడం కాదు, పారిపోవడం కూడా కాదు. సుఖదుఃఖాలు రెండూ, మనసుకు కలిగే భావనలు. ఈ మనసుకు అతీతంగా ఎదిగినప్పుడు మనిషి అన్ని రకాల బాధలు, కష్టాల నుంచి విడువడుతున్నాడు. ఆ ఎదుగుదల గురించి ఉపనిషత్తులు వివరిస్తాయి. ఉపనిషత్తులు గురుశిష్య సంవాద రూపంలో ఉంటాయి. శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు సమాధానం చెప్తాడు.

ఆత్మ అంటే ఏంటి? ఆత్మ కళ్ళకు కన్ను వంటిది, చెవులకు చెవి వంటిది, నోరుకి నోరు వంటిది. ఒక దీపం వెలిగించి దాని మీద అనేక చిల్లులు కలిగిన కుండను బోర్లించి పెడితే, ఆ చిల్లుల ద్వారా కాంతిపుంజాలు ఏ విధంగా బయటకు పరసరిస్తాయో, అదే విధంగా ఆత్మ యొక్క చైతన్యం వల్లనే శరీరంలో కదలికలు, ప్రాణం ఉంటాయి. నిత్యం జీవితంలో గమనిస్తే చాలా మంది మరణించినప్పుడు చూడటానికి వెళుతుంటాం.  అక్కడున్న అందరూ ఏడుస్తుంటారు, కొందరేమో అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు, పిల్లలేమో 'నాన్నగారు నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నారండి. కానీ ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిపోయింది. మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారండి' అంటూ దుఃఖిస్తారు. వెళ్ళిపోవడమేమిటి? ఇంకా శరీరం వాళ్ళ కళ్ళముందే ఉంది. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఒక పేరుకో, బంధుత్వానికో పలికిన ఆ దేహం ఇప్పుడు ఎన్ని విధాలుగా పిలిచినా స్పందించడం లేదు. మరి ఎక్కడికో వెళ్ళిపొవడమేమిటి? ఇంతకీ అక్కడి నుంచి పోయింది ఎవరు? కదలకుండా పడి ఉన్న దేహం ఎవరు? అతనే కనుక దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిన చైతన్యానికే ఆత్మ అని పేరు.    

To be continued .......................

Monday, 5 January 2015

హిందూ ధర్మం - 127 (ఉపనిషత్తులు)

వేదం ఉపనిషత్తులతో ముగుస్తుంది. వీటికే వేదాంతం అని పేరు. వేదం పూర్తిగా అర్దమవ్వలాంటే ఉపనిషత్తులను అర్దం చేసుకోవాలి. వేదం యొక్క అంత్యభాగంలో ఉండడమే కాక, వేదవిద్య మొత్తం అభ్యసించిన తర్వాత, విద్యాభ్యాసం చివరలో భోధించబడేవి కనుక వీటికి వేదాంతం అని పేరు. ఇవి సమస్త ప్రపంచానికి ఏకైక తత్వశాస్త్ర నిధులు. ఉపనిషత్తు అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. ఉప అనే ధాతువుకి దగ్గరగా అని  అర్దం, ని అనగా తపనతో, నిశ్చయాత్మక బుద్ధితో, కుతూహలంతో అని అర్దం. రకరకాల శాస్త్రాలు మనిషి జీవనానికి తోడ్పడుతాయి, అతని అభివృద్ధికి దోహదపడచ్చు కానీ అవే జీవితం కాదు. జీవితపరమార్ధాన్ని తెలుసుకోపోతే జన్మ వ్యర్ధం. అందుకే గురువు మొత్తం వేదవిద్యను శిష్యునికి ఉపదేశించిన తర్వాత, అతనిని తన దగ్గర కూర్చుబెట్టుకుని జీవిత సత్యాలను భోధిస్తాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, యుద్ధవిద్య, వృత్తులు వంటివి నీ జీవనాన్నిసుగమం చేస్తాయెమో కానీ, నీకు ఎందుకు జీవించాలో స్పష్టంగా చెప్పలేవు, మరణసమయంలో పనికి రావు, మరణభయాన్ని తొలగించలేవు. భూమి ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, పర్వతాలు, సముద్రాలు, పీఠభూములు ఏలా ఏర్పడ్డాయి, భూకంపాలు ఎలా సంభవిస్తాయో శాస్త్రాలు నిర్వచనం మాత్రమే చేయగలవు, అవి కేవలం సృష్టిని విశ్లేషించగలవు. కానీ కొత్తగా సృష్టి చేయలేవు. శాస్త్రవేత్త కూడా అంతే. అన్ని చదువుకున్నాకా భౌతికవాదం ప్రభలుతుంది. అన్నీ తనకు తెలుసని అనుకుంటాడు అని చెప్తూ, గురువంటాడు 'నాయనా! నీవు కేవలం సృష్టి క్రమాన్ని మాత్రమే చదువుకున్నావు. కానీ ఈ సృష్టిని సృష్టించిన ఒక కర్త ఉన్నాడు. వాడిని భౌతిక దృష్టితో చూడటం అసాధ్యం. వాడు బాహ్యనేత్రానికి కనిపించడు. విశ్వంలో ఎన్ని పాలపుంతలు దాటి ప్రయాణించినా, సృష్టికర్తను పట్టుకోలేవు. ఆ మాటకు వస్తే, సృష్టికర్త అయిన భగవంతుడు ధృక్ గోచరమైన వస్తువు/విషయం కాదు, కనుక ఆయన్ను బాహ్యంలో వెతకడం కుదరని పని. అలా అని ఏదో తెలియని శక్తి ఉంది, దాన్ని నువ్వు నమ్మవలసిందే అని నేను చెప్పను. ఆ భగవంతుడిని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలో, నీకు మార్గం వివరిస్తాను. భగవంతుడనేది ఒక నమ్మకం కాకూడదు, ఉన్నాడని రూఢీ చేసుకోవాలి, నేను చూసిన విధంగానే నువ్వూ భగవంతుడిని చూడాలి, నీ తర్వాతి తరంవాళ్ళకి చూపించాలి. అందుకు నీకు ఇప్పుడు మార్గం వివరిస్తాను' అంటాడు శిష్యునితో.

శిష్యుడు కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళి, కూర్చుని, శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. గురువు కేవలం గ్రంధంలో చెప్పబడిన విద్యనే కాకుండా, తాను జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అనేక రహస్య సత్యాలను శిష్యునికి ఉపదేశిస్తాడు. అలా గురువుకు దగ్గరగా ఆసనం వేసుకుని కూర్చుని, విని, నేర్చుకునే విద్య కనుక వీటికి ఉపనిషత్తులు అని పేరు.

To be continued ......................

Sunday, 4 January 2015

హిందూ ధర్మం - 126 (ఉపనిషత్తులు)

4. ఉపనిషత్తులు: వేదాల్లో విజ్ఞానశాస్త్రం, అనేకానేక శాస్త్రాలతో పాటు ఆత్మజ్ఞానం కూడా ప్రధానంగా చెప్పబడింది. ఈ జ్ఞానం సర్వాతీతమైనది. పూర్వజన్మ సుకృతం చేత, తపస్సు చేత ఋషులు ఆ జ్ఞానాన్ని పొందారు. ఈ జ్ఞానాన్ని పొందడం అనడాన్ని మాములుగా అర్దం చేసుకోకూడదు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనే రెండూ ఈ స్థితిలో ఉండవు. తెలుసుకునేవాడు తెలుసుకోబడేదిగా మారుతాడు, పాలలో కలిసిన నీరు తన స్వరూపాన్ని కోల్పోయి, పాలుగా మారిపోయినట్టు. పాలలో నీరు కలవడం వలన, పాలు పలుచన అవుతాయేమో కానీ, జ్ఞానం విషయంలో అలా జరుగదు. ఇది పరిపూర్ణస్థితి. ఇక్కడ బేధబుద్ధి (State of differentiation) ఉండదు, అబేధస్థితిలో ఉంటారు. ఇటువంటి స్థితిని పొందిన ఋషులు మంత్రసంహితకు అర్ధాలుగా బ్రాహ్మణాలను, వాటికి కొనసాగింపుగా ఆరణ్యకాలను రచించినా, తాము అనుభూతిని చెందిన స్థితిని, ఆ రహస్యాలను మానవుల కోసం చెప్పాలనుకున్నారు. నిజానికి ఆ స్థితి/జ్ఞానం/తత్వం మాటలకు అతీతమైనది, పరిమితులతో కూడిన మనసు అపరిమితమైన ఆ తత్వాన్ని అందుకోలేదు, కనీసం ఊహించలేదు, అది వర్ణనాతీతం. అది కేవలం అనుభవించవలసినది మాత్రమే. ఉదాహరణకు మీకు బెల్లం ఇష్టం అనుకోండి. బెల్లం తియ్యగా ఉంటుందని చెప్పడం వేరు, దాని రుచిని ఆస్వాదించడం వేరు, ఆ తియ్యదనాన్ని ఆస్వాదించిన తర్వాత, అది ఎలా ఉందంటే తియ్యగా ఉందని మాత్రమే చెప్పగలమే కానీ, దాన్ని మరింత వర్ణించలేము. బెల్లం అనేది ఒక తినే వస్తువు మాత్రమే. ఒక తాత్కాలిక వస్తువు విషయంలోనే ఇలా ఉంటే, ఇక సర్వాతీతమైన జ్ఞానం విషయంలో ఎలా ఉంటుంది. అందునా ఈ జ్ఞానం కాలాతీతం. భూమి, సూర్యుడు, విశ్వం కొంత వరకే ఉంటాయి, కానీ ఈ జ్ఞానానికి నాశనం లేదు.

తాము వేదంలో చెప్పబడిన సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఋషులు మిగితావారికి కూడా ఆ జ్ఞానం అందాలని ఆకాంక్షించారు. వర్ణనాతీతమైన ఆ జ్ఞానాన్ని తాము పొందిన ఉత్కృష్టమైన ఆ స్థాయిని నుంచి దిగివచ్చిసామాన్యమానవుడికి అర్దమయ్యేలా అందించారు. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వేదాల చివరిభాగంలో ఉంచారు. అటువంటి వేదాల యొక్క చివరి భాగాలే ఉపనిషత్తులు.

To be continued ...............

Saturday, 3 January 2015

హిందూ ధర్మం - 125 (ఆరణ్యకం)

3. ఆరణ్యకం : ఆర్యణాకాలు బ్రాహ్మణాల యొక్క అంత్యభాగమని చెప్తారు. బ్రాహ్మణాలు కర్మకు ప్రాధాన్యత ఇస్తే, తత్త్వచింతనకు, ధ్యనానికి ప్రాధాన్యత ఇస్తాయి ఆరణ్యకాలు. ఇవి వానప్రస్థాశ్రమంలో (జీవితపు మూడవ భాగం) ఉన్నవారికి దోహదపడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల వెనుక ఉన్న తాత్త్వికమైన అంశాలను వెల్లడిస్తాయి. అసలు ఒక కర్మ ఎందుకు చేయాలి? అది మనిషిని ఎలా ఉద్ధరిస్తుంది? దాని వలన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ కర్మ చేయడం వెనుకున్న సందేశం ఏమిటి? కర్మలు, యజ్ఞయాగాదులు, ధర్మాల ద్వారా మనిషి చిత్తశుద్ధిని ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి వివరిస్తాయి. తత్త్వచింతన ప్రధానంగా సగం జీవితం దాటినివారికి అవసరం. గృహస్థాశ్రమం నుంచి పిల్లలను, వృత్తిని, ఆస్థులను వదిలేసి, అడవులకు వెళ్ళి ధ్యానానికి, వేదాంతజ్ఞాన సముపార్జనకు సిద్ధపడిన వానప్రస్థుల కోసం వీటిని రచించారు కనుక వీటిని ఆరణ్యకాలంటారు. అనగా అడవులలో అధ్యయనం చేసేవని. ఇవి యజ్ఞం అనే ఒక ప్రక్రియను బ్రాహ్మణాలకంటే వేరు విధంగా వివరిస్తూ కర్మయోగానికి బీజం వేస్తాయి. నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి.

స్థూలంగా చెప్పాలంటే జీవితం మొత్తం వైదిక కర్మలు చేస్తూ కూర్చోవడం కాదు, వైదిక కర్మల వెనుకనున్న ఆంతర్యం గ్రహించాలి. వేదం ఏం చెప్పినా, దాని వెనుక ఆంతర్యం ఉంటుంది. అది మనిషి భౌతిక, మానసిక జీవనానికే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన జ్ఞానం అందిస్తాయి ఆరణ్యకాలు. ఆరణ్యకాలు ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడానికి తగిన సామర్ధ్యాన్నిస్తాయి.

To be continued .............

Friday, 2 January 2015

హిందూ ధర్మం - 124 (‪‎బ్రాహ్మణాలు‬)

కధలనగానే ఒట్టి కల్పితాలని భావన చేయకూడదు. అవి కర్మలు, ధర్మాలతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఉదాహరణకు ఐతరేయ బ్రాహ్మణం లో భూ భ్రమణం గురించి, భూగోళ ఆకృతి గురించి ఈ విధంగా చెప్పబడింది. "అందరు భావిస్తారు కానీ నిజానికి సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, అస్తమించడు భూభ్రమణం కారణంగా రెండు వ్యతిరేక ప్రభావాలు వస్తాయి. ఒక వైపు పగలు ఉంటే, ఇంకొక వైపు రాత్రి ఉంటుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న దిశలో పగలు ఉంటే, దానికి వెనుక భాగంలో రాత్రి ఉంటుంది. కానీ సూర్యుడు ఎన్నడు అస్తమించడు ............" - ఐతరేయ బ్రాహ్మణం 3.44

The Sun does never set nor rise. When people think the Sun is setting (it is not so). For after having arrived at the end of the day it makes itself produce two opposite effects, making night to what is below and day to what is on the other side…Having reached the end of the night, it makes itself produce two opposite effects, making day to what is below and night to what is on the other side. In fact, the Sun never sets….” - Aitareya Brahmana (3.44)

అట్లాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు బ్రాహ్మణాలలో ఉన్నాయి. అర్దవాదంలో ఉన్న బంధూత పద్ధతి అనుసరించి పదాల వ్యుత్పత్తుల నుంచే వ్యాకరణం (grammer) , భాషాశాస్త్రం ఉద్భవించాయి. యజ్ఞయాగాది క్రతువుల ఆచరించాల్సిన నిర్దేశిత సమయాన్ని లెక్కించేందుకు గ్రహాల కదలికలు అవసరం. దానికి మూలమైన ఖగోళశాస్త్రానికి  (Astronomy) బ్రాహ్మణాల నుంచే అభివృద్ధి చెందింది. అదే గాకా, వీటి నుంచే రేఖాగణితం (Geometry) , సాంఘిక శాస్త్రం (Social), అర్ధశాస్త్రం (Economics), రాజనీతి శాస్త్రం (political) ఉద్భవించాయి.

కాగా ఈ బ్రాహ్మణాలను వేదానికి చెందిన భాగాలే కానీ, సనాతనమైన వేదం కాదు. ఎందుకంటే బ్రాహ్మణలలో రాజులు, ఋషుల పేరు
లు, కొన్ని చారిత్రిక సంఘటనలు, కొందరి జీవితచరిత్రలు ఉన్నాయి. అనంతమైన కాలగతిలో ఎంతో మంది తమ కర్మలను అనుసరించి జన్మిస్తారు, మరణిస్తారు. వ్యక్తులు శాశ్వతం కాదు, అలాగే వ్యక్తి పేర్లు కూడా. పేరు దేహానికే గానీ, ఆత్మకు కాదు. దేహం ఆశాశ్వతమైనది. అటువంటి వాటి గురించి వేదాలు చెప్తే, అవి సనాతనమైనవి ఎలా అవుతాయి. పైగా వేదాలు ఈ యొక్క బ్రహ్మాండానికో, మనం ఇప్పుడున్న ఈ యొక్క విశ్వానికో చెందినవి కావు. వేదం ఎప్పటికి ఉంది. అనంతమైన భగవత్ సృష్టిలో ఉన్న అన్నిటికి అది వర్తిస్తుంది. కనుక అది ఒక వ్యక్తి గురించి, ప్రవక్తల గురించి చెప్పనే చెప్పదు. ఎప్పుడైన వేదం అని చెప్పవలసివస్తే, అది మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు వేదాలకు శుద్ధమైన అర్ధాలు వ్యాఖ్యానం మాత్రమే. ఇక్కడో విషయం హిందువులు గుర్తుంచుకోవాలి. వేదాల్లో ప్రవక్త, మహమ్మదు, ఏసు అంటూ ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి గురించే చెప్పలేదు, అసలు వేదాల్లో వ్యక్తుల పేర్లు, భగవదవతారాలు లేవు, అలా ఉన్నాయని మనమే అంగీకరించడం లేదు, ఇక వారి ప్రవక్తల పేర్లు ఎక్కడ ఉంటాయి. అటువంటి విషయాలు ఎవరైనా చెప్తే, తక్షణమే ఖండించండి.

To be continued ...................

Thursday, 1 January 2015

హిందూ ధర్మం - 123 (బ్రాహ్మణాలు)

బ్రాహ్మణాలలో ఉన్న విషయాల గురించి శబరభాష్యంలో ఈ విధంగా చెప్పబడింది.

हेतुर्निर्वचनं निन्दा प्रशंसा संशयो विधि:।
परक्रिया पुराकल्पो व्यवधारणकल्पना।।
उपमानं दशैते तु विधयो ब्राह्मणस्य तु।

హేతుర్నిర్వచనం నిందా ప్రశంసా సంశయోవిధిః |
పరక్రియ పురాకల్పో వ్య్వధారణకల్పనా ||
ఉపమానం దశౌతెతు విధయో బ్రాహ్మణస్య తు |

హేతువు/కారణం, పదాల యొక్క నిర్వచనం, నిషిద్ధకర్మ పట్ల నింద, శాస్త్రవిహితకర్మల యొక్క ప్రశంస, సంశయాలు, ఆజ్ఞలు, ఇతరులచే చేయబడిన కర్మలు, పురాతన కధలు, ఉపమానాలు, నిర్ణయాలు మొదలైన పది లక్షణాలు కలిగినవి బ్రాహ్మణాలు.

ప్రతి సంహితకు కనీసం ఒక బ్రాహ్మణమైనా ఉంటుంది. వేదగణితానికి మూలమైన సూత్రాలు ప్రధానంగా 23 బ్రాహ్మణాల నుంచి స్వీకరించబడ్డాయి. కానీ ఇప్పుడా బ్రాహ్మణాలు అందుబాటులో లేకుండా పోయాయి. వాటిలో జాబాలి, శ్వేతాస్వతర, మైత్రాయణీయ మొదలైనవి కొన్ని ఉదాహరణలు.

బ్రాహ్మణాలలో కధలు వైదిక సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక కర్మను/ యజ్ఞాన్ని/ విధిని ఎలా ఆచరించాలో, కధా రూపంలో వివరంగా వర్ణిస్తాయి బ్రాహ్మణాలు. అందుకే వీటిలో చెప్పబడ్డ కధలు బ్రహ్మణాలకు ఊపిరి వంటివి. ఈ కధలు కూడా ప్రధానంగా 6 రకాలు.

1. దైవం - వివిధ దేవీదేవతల గురించి, వారు ఎలా ఉద్భవించారు, వారి లక్షణాలు, వారి అధికారాలు మొదలైనవాటి గురించి చెప్పే కధలు
2. ప్రార్ధనలు/ యజ్ఞాలు - వివిధ రకాల క్రతువులు, వాటిని ఆచరించాల్సిన సమయం, విధానం, స్థలం, దిశ, పరిమాణం, సంఖ్య గురించి చెప్పే కధలు
3. సామాజిక మరియ ధార్మిక కధలు - సమాజంలో ఉన్న వివిధ ధర్మాలు, ఆచారాలు, సంప్రదాయల గురించి
4. విశ్వ ఆవిర్భావం గురించి, అభివృద్ధి పరిణామాల గురించి వివరించే కధలు
5. ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలు, ప్రకృతి మూలధర్మాల గురించి వివరించే కధలు
6. ఆదిభౌతిక కధలు - మనిషికి, బ్రహ్మాండానికి మధ్యనున్న అసలైన సంబంధం గురించి, మనిషి యొక్క నిజతత్త్వం గురించి వివరించే కధలు.

To be continued ...........