Showing posts with label గురు పూర్ణిమ. Show all posts
Showing posts with label గురు పూర్ణిమ. Show all posts

Friday, 31 July 2015

గురు పూర్ణిమ సందేశం

అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు.

ఈశ్వరుడు ఒక్కో యుగంలో ఒక్కో మహాగురువుగా అవతరించాడు కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా.......... కానీ రాబోయే కలియుగాన్ని, అందులో మానవుల కష్టనష్టాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భగవానుడే ద్వాపరయుగాంతంలో వేదవ్యాస మహర్షిగా అవతరించారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. వేదాలను గ్రంధస్థం చేయుటయే కాక, అనేక మన్వంతరాలు, కల్పాలు, ఇతర సృష్టిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్న ధర్మసూక్ష్మాలను మానవాళికి అందించి, వారి ఉద్ధతి కోసం 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించారు. బ్రహ్మసూత్రాలను అందించారు. తాను బ్రహ్మనిష్ఠుడై ఉండీ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పటికి, మానవాళి మీద ప్రేమతో క్రిందకు దిగి వచ్చి ఈ రచనలు చేశారు. అంతమేలు చేసిన వ్యాసునికి కృతజ్ఞత ఆవిషకరించడం కోసమే వ్యాసజయంతిని వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటాం.

గురుపూర్ణిమ రోజున చేసే పూజ చేతనే వ్యాసుడు సంతృప్తి చెందుతాడా అంటే కాదనే చెప్పాలి. ఆయన అంత శ్రమపడి ఇచ్చిన వాటిని పాటించకుండా ఉంటే ఆయనకు ఎంత బాధ కలుగుతుంది? వ్యాసుడు ఇచ్చిన పురాణలను ఆకళింపు చేసుకుని నిత్య జీవితంలో అనుష్ఠించాలి. ధర్మాన్నే పాటించాలి. వేదాలను, పురాణేతిహాసాలను రక్షించుకోవాలి. అదే వ్యాసుడికి చేసే నిజమైన గురుపూజ. గురువు చెప్పినదాన్ని పాటించడం చేతనే గురువు సంతోషిస్తాడు. గురుపూర్ణిమ మనలో అలాంటి మార్పును తీసుకురావాలి. నేను ధర్మాన్నే పాటిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సంకల్పించుకుని దాన్ని అమలుపరచాలి. అప్పుడే మనపై వేదవ్యాసమహర్షి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.  

సద్గురు శివానందమూర్తి గారు మొదలగు అనేకమంది సిద్ధపుర్షులు, యోగుల యొక్క అమృతవాక్కుల సమాహారం ఇది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ శుభాకాంక్షలు 

గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!



గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరంలాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.

మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే, ఆయన తాండవ నృత్యం చేసారు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయనను చూచినవారందరూ అర్ధం చేసుకున్నారు. జనాలు వచ్చి, ఆయన వారితో సంభాషిస్తాడేమో అని ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేకపోవడం వలన వచ్చినవారందరూ కొంతకాలం ఎదురు చూసి వెళ్ళిపోయారు.

ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోలేదు. “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు.

అందుకని వారు తయారవటం ప్రారంభించారు- దిన దినం, ప్రతిరోజూ అలా నెలలు, సంవత్సరాలు తరబడి వారు సంసిద్ధమవుతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకో కూడదనుకున్నాడు. 84 సంవత్సరాల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో –ఆదియోగి ఈ ఏడుగురిని చూసారు. వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్నిఅందుకోవటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.

ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. ఆయన వారిని ఇక పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వారు ఆయన దృష్టిని ఆకట్టుకున్నారు. తరువాతి 28 రోజులు ఆయన వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి దక్షిణ దిశవైపుకి తిరిగి, 'యోగ శాస్త్ర' ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.

మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది. మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది.

గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అసలు మీరు గురువుని కోరరు. మీ మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు – అప్పుడు మీకు గురువు లభిస్తారు. మీరు ఉత్తమమైన గురువుని ఎంచుకుంటూ, వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మీలో తీవ్రమైన తపన పెంచుకోండి మీకు గురువు సంభవిస్తాడు, గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అది కేవలం మీకు సంభవించగలదు. అదేదో మీరు కలిసేది కాదు. అదేదో మీరు కరాచలనం చేసేది కాదు. మీరు వంగి నమస్కరించ గలిగేది కాదు. మీరు దగ్గరకు వెళ్లి ఇది కావాలి అది కావాలి అని యాచించ గలిగేది కాదు. మీరు గురువు అనుకునే ఆ స్థితి, ఆ శక్తి మీకు ప్రాప్తిస్తుంది. అది మిమ్ముల్ని ముంచివేస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని నాశనం చేసి, మీరు ఏ బంధనాలు లేకుండా, సృష్టికర్త మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండేలా చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు జగ్గీ వాసుదేవ్

సేకరణ: http://blog.ishafoundation.org/te/2014/07/08/guru-pournami-aadi-guruvu-udayinchina-roju/

గురుతత్వం పై శ్రీ ఆదిశంకరచార్యులు



ఈశ్వరుడే అందరికి ఆదిగురువు. మన అందరిపై ఆ గురుకటాక్షం ఉన్నది. గురువు అనుగ్రహంతో, సాధన ద్వారా ప్రతి ఒక్కరు మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ అందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

గురువు పరుసవేది కంటే గొప్పవాడు. పరుసవేది తన దగ్గరకు తెచ్చిన ఇనుప ముక్కను బంగారం ముక్కగా మార్చగలుగుతుందే కానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు. కానీ గురువు ఎంతటి కరుణాసిధువు, కారుణ్యమూర్తి అంటే తనను ఆశ్రయించిన శిష్యుని తనంతటి వాడిని చేస్తాడు.  

పంచపాదికలో శ్రీ ఆదిశంకరచార్యులు 

Thursday, 30 July 2015

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

31 జూలై 2015, శుక్రవారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......



అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకి నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తారు.  

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణినికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు. నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని మహాత్మాతమను ఏయే రోజుల్లో ఏ విధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ గురించి మరిన్ని విశేషాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి ' గురుపూర్ణిమ ' అనే లెబుల్ క్రింద చూడగలరు.

Originally published -11-July-2014
1st Edit: 30-July-2015

Sunday, 5 April 2015

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట)

వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు. వేదం కోటి భాగాలనుకుంటే అందులో కేవలం 1 వంతు మాత్రమే వ్యాసుడు గ్రంధస్థం చేశారు.

అలా వ్యాసుడు తిరిగి వేదవిభాగం చేసి, నాలుగు వేదాలను గ్రంధస్థం చేశారు. అవే ఋగ్ వేదం, యజుర్ వేదం, సామవేదం, అధర్వణ వేదం. వాటికి అశ్వలాయనుడు మొదలైన మహర్షులు రాసిన వ్యాఖ్యానాలను చేర్చారు (వేదాలకు ఋషులు రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు). అవేగాక ఆరణ్యకాలు, ఉపనిషత్తులను కూడా వాటికి జోడించి వేదానికి సమగ్రమైన రూపాన్నిచ్చారు. అనంతమైన వేదాన్ని విభాగం చేశారు కనుక ఆయనకు వేదవ్యాసుడనే పేరు వచ్చింది. అప్పటివరకు వారి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. వ్యాసుడు వేదాన్ని గ్రంధస్థం చేశారు, అనగా వేదాన్ని ఒక పుస్తక రూపంగా అందించారు, కానీ ఆయన వేదాలను రచించలేదు. వేదం అపౌరుషేయం (మానవుల చేత రచించబడినది కాదు), వేదములు ఈశ్వరీయములు (ఈశ్వర ప్రసాదితములు).

వ్యాసుడే లేకుంటే ఇంత జ్ఞానం మానవజాతికి అందేది కాదు. అందువలననే 'వ్యాసోఛిష్టం జగత్సర్వం' అంటారు, వ్యాసుడు ఉఛ్చిష్టమే (వదిలివేసిన భాగం / ఎంగిలి) ఈ జగత్తంతా అని. మానవజాతికి ఇంత మేలు చేసిన వ్యాసుడిని స్మరించుకుని, పూజించి, కృతజ్ఞతలు తెలుపడం కోసం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. నిజానికి గురుపూర్ణిమ రోజున మాములు గురువులను కాదు, వ్యాసుడినే పూజించాలి. తమతమ గురువులలో వ్యాసుడిని చూసుకోవాలి. వ్యాసుడు చేసిన మేలుకి ఇప్పటికి మానవజాతి ఋణపడి ఉంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

వేదాలను గ్రంధస్థం చేసిన తర్వాత తన 4 శిష్యులకు ఒక్కో వేదాలను నేర్పి, వాటిని అప్పగించి వేదప్రచారం చేయించారు. వైదికపరంపరను నిలిపారు. పైలుడికి ఋగ్ వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని అప్పగించారు. ఇంత చేసిన వ్యాసుడు ఒక మత్స్యకన్యకు జన్మించారు. వ్యాసుడికి కులం అంటగట్టడం సరికాదు కాని కొందరికి అర్దమయ్యేలా చేప్పాలంటే మానవజాతి చేతులెత్తి మొక్కే వ్యాసుడు ఎస్.సి. వర్గానికి చెందినవాడవుతాడు. హిందూధర్మం బ్రాహ్మణుల కుట్ర, వేదం బ్రాహ్మణులు తమ స్వార్ధానికి రాసి, ఇతరులపై రుద్దారని ప్రచారం చేసే మూర్ఖశిఖామణులు ఈ విషయాన్ని విస్మరించడం గమనార్హం.  

To be continued ......................

Sunday, 29 March 2015

హిందూ ధర్మం - 152 (వేదాలు, వ్యాసమహర్షి)

వేదమనగా జ్ఞానం. జ్ఞానానికి పరిధి ఉండదు. అందునా వేదములు ఈశ్వరీయములు. అంటే భగవంతునిచే ఇవ్వబడినవి. మానవులు రాసిన విషయాలు కొంత పరిధి ఉంటుంది, కానీ అనంతుడైన భగవంతునిచే చెప్పబడిన విషయాలకు పరిధులను ఎవరు నిర్ణయించగలరు. ఇంతకముందు చెప్పుకున్నట్టుగా వేదం అనగా జ్ఞానం అని అర్దం. విశ్వానికి, విశ్వకర్తకు సంబంధించిన అపర, పర జ్ఞాన భాగమే వేదం.
-------------------------------------------------------------------------

వేదం యొక్క విస్తృతి తెలియపరచే ఒక సంఘటన ఉంది. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి, బ్రహ్మచర్యం  అవలంబించి, బ్రహ్మదేవునితో మూడుసార్లు ధీర్ఘాయువు పొందారు. నాలుగు యుగాలు (43,20,000 సంవత్సరాలు) వేయి సార్లు పునారవృతమైతే బ్రహ్మకు ఒక పగలు, ఇంకో వేయి మహాయుగాలు (అంటే 1,000*43,20,000 = 4,32,00,00,000 సంవత్సరాలు) బ్రహ్మకు ఒక రాత్రి. 8,64,00,00,000 సంవత్సరములు బ్రహ్మ దేవుడికి ఒక రోజు. అటువంటి మూడు బ్రహ్మదివసాలను (25,92,00,00,000 సంవస్తరములు) గురువు వద్ద వేదం నేర్వడానికి సరిపోక తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. నీకు వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్య్ల కాంతితో వెలిగిపోతున్న మేరుపర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడిది చూసి భయపడి, 'అయ్యో! నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా?' అని తలిచి, 'నాకవసరమైనది మీరే నిర్ణయించండి' అని బ్రహ్మదేవునితో అంటాడు. అప్పిడి బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశిని మూడు పుడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, 'ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!' అని వరమిచ్చాడు. కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదాధ్యయనమే ఇంతవరకు పూర్తికాలేదు అంటూ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గురుచరిత్రలో శిష్యులకు వివరిస్తారు.
---------------------------------------------------------------------------

ఇంత విస్తారమైన వేదాన్ని గ్రంధస్థం చేయడం పెద్ద సాహసోపేతమైన చర్య. అటువంటిది ఇంత విస్తారమైన వేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఔపోసన పట్టినవాడు మాత్రమే వాటిని గ్రంధస్థం చేయగలడు. అతడు మేధావి, అపర ప్రజ్ఞావంతుడై ఉండాలి, వేదం మొత్తం అర్ధం చేసుకున్నవాడై ఉండాలి. అటువంటి వాడు, వేదాలను గ్రంధస్థం చేయుట కొరకు జన్మించిన కారణజన్ముడు వ్యాసమహర్షేనని ఋషిమండలి గుర్తించి, వేదాలను గ్రంధస్థం చేసే కర్తవ్యాన్ని వ్యాసమహర్షికి అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

To be continued .................

Sunday, 22 March 2015

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం)

మహాభారత యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశంలో రోడ్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదంతా చూసిన ఋషులు, మునులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. 'ఋషిః ఆ క్రాంతి దర్శనః' - భవిష్యత్తును దర్శించగలవారిని ఋషులు అంటారు. మానవజాతి మూలపురుషులైన ఋషులు ప్రపంచ భవిష్యత్తును గమనించారు.

అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులందరూ భరతభూమికి తరలివచ్చారు. తొలిసారిగా 88,000 మంది మహర్షులతో భారతదేశంలో ఒక పెద్దసమావేశం జరిగింది. అది ఒకరకంగా అత్యవసరసమావేశం లాంటిదే. ప్రపంచభవిష్యత్తుపై మేధోమధనం జరిగింది. అది ఒక యజ్ఞం లాంటిది, అనేకులు దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. యుద్ధం ద్వాపరయుగాంతం యొక్క ప్రభావ ఫలితమే. అందుకే అంతపెద్ద జనవినాశనం సంభవించింది. శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణంతో ద్వాపరయుగాంతం అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఒక మహాజలప్రళయం ముంచెత్తుంతుంది. ప్రపంచనాగరికతలన్నీ నాశనమవుతాయి. అసలే వేదంలో ఉద్దండులైన వారందరూ యుద్ధం కారణంగా మరణించారు, వేదం నశించకపోయినా, వేదం తెలిసినవారందరూ నశించారు. వేదం నిరంతరం అధ్యయనం చేయాలి, అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది, ప్రపంచం శాంతి మార్గంలో ప్రకృతి నియమాలకు లోబడి అభివృద్ధి చెందుతుంది. అందరూ రక్షించబడతారు. ................ రాబోయేది కలియుగం. ప్రజల్లో అధ్యాత్మిక భావన తగ్గిపోతుంది, నాస్తికం, దురాచారం, అధర్మం ప్రభలుతుంది. అప్పటివరకు శరీరంతో ఉన్న రాక్షసులు ఈ యుగంలో మానవ మనసుల్లో తిష్టవేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు మంటగలుస్తాయి. కొత్త మతాలు, వాదాలు పుట్టి జనాలను పక్కదారి పట్టిస్తాయి. అప్పటివరకు సమాజంలో సంచరించిన ఋషులు, మునులు ఇవి చూడలేక సమాజానికి దూరంగా తపస్సులో మునిగిపోతారు. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడికి దర్శనం ఇచ్చి, ధర్మరక్షణకు పురికొల్పుతారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే  ఈ కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా తక్కువ, కేవలం 120 సంవత్సరాలు మాత్రమే. అది కూడా సక్రమంగా వాడుకోరు. పైగా అల్పబుద్ధులు, అనంతమైన వేదాన్ని ధారణలో నిలుపుకోలేరు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని గ్రంధస్థం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.. అది మహాసాహసకృత్యం, అప్పటివరకు ఎవరు చేయడానికి పూనుకోనిది.

To be continued ................

Thursday, 10 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 3

తను విభజించిన వేదాలను తన నలుగురు శిష్యులకు అప్పగించి ప్రచారం చేయించారు. ఎంతో జటిలమైన వేదవిభజన చేయడంతో బ్రహ్మ ఆనందం పొంది మహర్షిని వేదవ్యాస అన్నారు. అందుకే వేదాన్ వ్యస్యతి ఇతి వేదవ్యాసః అంటారు. వేదవ్యాసా! నాకు పుత్రుడివై, వేదాలను విభజించి, నన్ను ఆనందపెట్టవు. ఇలాగే అన్ని మన్వంతరాలలో, ద్వాపరంలో జన్మిస్తూ, వేద విభజన చెయ్యి' అని అపాంతరముడికి విన్నవించాడు బ్రహ్మ. అప్పటి నుంచి ప్రతి మన్వంతరంలో వేదవ్యాసుడు జన్మిస్తున్నాడు. అయితే వేదవ్యాసుడనేది పదవి నామమే అని, వ్యక్తి నామం కాదని చెప్తారు పెద్దలు. మొదట స్వాయంభువ మనవు వేదవ్యాసుడు కాగా, రెండో మన్వంతరంలో ప్రజాపతి, మూడవ మన్వంతరంలో శుక్రుడు వ్యాసులయ్యారు.

వేదవ్యాసునికి బాదరాయణుడు, అపాంతరముడని వ్యవహార నామాలు. ఇప్పటి వ్యాసమహర్షికి కృష్ణద్వైపాయనుడని పేరు. నల్లని వరణం కలిగినవాడు కనుక కృష్ణ అన్నారు, యమునా నదీ ద్వీపంలో ప్రకటితమయ్యాడు కనుక ద్వైపాయనుడన్నారు.

వ్యాసమహర్షి వేద విభజన చేసి ఆపలేదు. లోకులకు వేదసారం త్వరగా అర్దమవ్వాలని పంచమవేదమైన మహాభారత ఇతిహాసాన్ని లిఖించారు. అప్పటికి అర్దం కానివారుంటారని వేదం సులువుగా అర్దమవ్వడం కోసం అనేక మన్వంతరాలలో జరిగిన ఘట్టాలను ఏర్చి, కూర్చి, 18 పురాణాలను, 32 ఉపపురణాలను రచించారు. ఇంకా లోకులకు ఉపకారం చేయాలన్న తపనతో భక్తిని ప్రసాదించే భగవద్ లీలల సమాహారమైన భాగవతాన్ని అందించారు. ఇంత మేలు చేసిన వ్యాసమహర్షికి కృతజ్ఞతగా గురుపూర్ణిమ పేరుతో ప్రజలు తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని, ఆరాధిస్తారు. వ్యాసుడి అంశలేని వారు వేదవేదాంతల బోధ చేయలేరు. ప్రతి గురువులో వ్యాసుడు ఉంటాడు. గురుపూర్ణిమ వ్యాసుని కోసం వచ్చింది. అది వ్యాసపూర్ణిమ. ఆ రోజు తమ తమ గురువులలో వేదావ్యాస మహర్షి చూసుకుని పూజించాలి.

వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికి తపస్సు చేసుకుంటూ దేహంతో ఉన్నారు. బద్రీనాధ్ దగ్గరలో కొందరికి దర్శనమిస్తారు. వేద విభజన చేసాక వ్యాసులవారు హిమాలయ పర్వత గుహలోకి వెళ్ళారు. తరువాత ఆయన సంకల్పం చేత ఒక పెద్ద మంచుచర్య విరిగిపడి, ఆ గుహ ద్వారం మూసుకుపోయింది. వ్యాస మహర్షి దర్శనం ఆదిశంకరాచార్యులవారికి కాశీలో కలిగింది. అటుతర్వాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన భాస్కరాచార్యులవారికి కలిగింది.  

To be continued .................

Wednesday, 9 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 2

12 జూలై 2014, శనివారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......

బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో నుంచి పుట్టాడు, కనుక బ్రహ్మదేవుడిని పద్మభువుడు అన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు. విష్ణువుమూర్తి తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను, వేదాన్ని బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, వశిష్టుడు తన పుర్తుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, కోట్ల సంవత్సరాలు కాలంలో వెళ్ళిపోయాయి, ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ముక్తిని పొందారు. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. వశిష్టమహర్షి 24 వ త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునికి, లక్ష్మణునికి గురువుగా యోగవిద్యను బోధించారు. ఆ మహాయుగం గడిచిపోయింది, ఇంకా 3 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం ప్రారంభమైంది. సత్యం యుగం దాటింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం ఆఖరికి చేరుకుంది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగింది. ఇంతకాలం గడిచినా వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు వచ్చింది.

ఈ వేదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరులు విన్నారు. పరమాత్మ వారికిచ్చిన వేదం ఒకటిగానే ఉండేది. అంతా కలిసిపోయి ఉండేది. దానికి తోడు, మధ్యకాలంలో అనేకమంది తమ అనుభూతులు ద్వారా, సమాధి స్థితి ద్వారా అనేకానేక విషయాలను వేదం నుంచి వెలికితీశారు. ఇదంతా పెద్ద జ్ఞానరాశి. ఒక వ్యక్తి వీటిని సక్రమంగా అర్దం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. ఈ విషయాన్ని వ్యాసమహర్షి గుర్తించారు.

రాబోయేది కలియుగం. కలియుగ జనంలో భక్తి తక్కువగా ఉంటుంది, ఆయుషు (జీవితకాలం) తక్కువ (100-120 ఏళ్ళు), అధికశాతం ప్రజలు మందబుద్ధులుగా ఉంటారు. జ్ఞాపకశక్తి గొప్పగా ఉండదు. మహాభారత యుద్ధం కారణంగా వేదపండితులనేకమంది మరణించారు. వైదిక సంస్కృతి దెబ్బతింది. ఇలా సాగితే, కలియుగజనం ఎట్లా తరిస్తారు? ఆ సందేహం వ్యాసమహర్షికి కలిగింది. ఋషి భవిష్యత్తును దర్శనం చేయగలడు. కనుక అన్ని విషయాలను గమనించి కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించారు. ప్రపంచ నలుమూలల ఉండే 88,000 మహర్షులను భారతదేశానికి ఆహ్వానించి, వేదసభ ఒకటి నిర్వహించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

To be continued ............

Tuesday, 8 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 1

ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ.

భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.

సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వాన్య్. శివుడు ఎప్పుడు తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ స్మయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం 'నారయణ సమారంభాం' అంటూ ప్రారభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.

To be continued ..............

Sunday, 29 June 2014

ఆషాఢమాసం విశిష్టత



ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

Sunday, 21 July 2013

గురుపూర్ణిమ

జూలై 22, సోమవారం ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. గురు పూర్ణిమ విశిష్టత గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జగ్గి వాసుదేవ్ గారు ఒక కధ చెప్తారు.

పూర్వం హిమాలయాల్లో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగిన ఒక యోగి కనిపించాడు. ఆత్మజ్ఞానం వలన కలిగిన ఆనందంతో ఆ యోగి అధ్భుతమైన తాండవం చేశాడు, కాసేపటికి అతని ఆనందం అవధులు దాటే సరికి మౌనంగా ధాన్యంలో కూర్చుని ఆత్మనందాన్ని పొందుతున్నాడు. అతన్ని గమనించిన జనానికి ఇతను మనకంటే గొప్పదైన దాన్ని ఎదో పొందాడు, అందువల్లే ఇతను ఇంత ఆనందంగా ఉన్నాడన్న భావన కలిగి ఆ రహస్యం తెలుసుకుందామని అతని వద్దకు చేరుకున్నారు. ఎంతమంది అతను చుట్టూ చేరినా, ఆ యోగి ఎవరిని పట్టించుకోకుండా తనలో తానూ ఆత్మనందాన్ని అనుభవిస్తున్నాడు. జనానికి విసుకువచ్చి వెళ్ళిపోయారు, ఒక్క ఏడుగురు తప్ప.

ఆ మహాపురుషుడి వద్ద నుంచి ఆ రహస్యం తెలుసుకోవాలన్న తపనతో అక్కడి నిలబడిపోయారు. కానీ ఆ యోగి వారిని పట్టికుంచుకోలేదు. కాసేపటికి వారు యోగి ఆనందానికి గల కారణం చెప్పమని ప్రాధేయపడ్డారు. "మీరు మూర్ఖులు, ఇప్పుడు మీరున్న స్థితి నుంచి మీకు ఈ అధ్బుత జ్ఞానం అందడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ జ్ఞానం పొందాలంటే చాలా సాధన కావాలి. కాలక్షేపం కాక చేసే సాధన కాదిది" అన్ని ఆ యోగి ఏదో చెప్పి, వాళ్ళని పట్టించుకోవడం మానేసి, ధాన్యంలో ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ ఏడుగురు నిత్యం విడువకుండా సాధన చేస్తూనే ఉన్నారు. 84 ఏళ్ళ తర్వాత దక్షిణాయనంలో ఒకానొక పూర్ణిమ రోజున ఆ యోగి వీళ్ళపై తన దృష్టిని ప్రసరించాడు. ఆ మహాద్భుత జ్ఞానాన్ని పొందాలన్న తపనను వాళ్ళలో గుర్తించాడు. ఇక వాళ్ళకు ఆ మహాజ్ఞానం తప్పకుండా చెప్పాలన్న నిర్ణయానికి వచ్చి, వారిని మరింత దగ్గరగా గమనించడం మొదలుపెట్టాడు. మరొక పౌర్ణమి వచ్చేసింది. ఇప్పటికి వరకు ప్రపంచంలోనే ఆదియోగి అయిన ఇతను గురువు స్థానంలో కూర్చుని వారికి ఉపదేశం చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచానికి 'ఆది గురువు' అయ్యాడు. దక్షిణ ముఖంగా కూర్చుని, కేధార్‌నాథ్‌కు దగ్గరలో ఉన్న కాంతి సరోవరం దగ్గర తన యోగవిద్యను ఉపదేశించాడు. మానవశరీరానికి సంబంధించిన సమస్తమైన రహస్యాలను, మనిషి యొక్క శరీరం, బుద్ధి, మనసు, ప్రాణశక్తులను ఏకీకృతం చేసి, సమస్త మానవజాతి శాశ్వతమైన ఎదుగుదలను, ఆనందాన్ని పొందే ఆ మహోన్నత విద్యను వాళ్ళకు కొన్ని సంవత్సరాల పాటు పంచాడు.

జ్ఞానభోధ పూర్తయ్యేసరికి ఈ ఏడుగురు మహావిజ్ఞానవంతులయ్యారు. ఈ ఏడుగురే సప్తఋషులు. భారతీయసంస్కృతికి మూలపురుషులు. వారు నేర్చుకున్న యోగ విద్యను ప్రచారం చేయమని ఈ 7మందిని ప్రపంచలో 7 దిక్కులకు పంపించాడు. మానవుడికి సాధ్యకానిది ఏది లేదని నిరూపించగల ఈ యోగవిద్యను సప్తఋషులు ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఆ ఆదియోగి ఏవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ఆయన బోధించినది మరేమిటో కాదు, ఈ రోజు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, భారతదేశ పూరాతన వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న యోగా. యోగా/యోగ విద్యను మొదట బోధించినవాడు పరమశివుడే. ఆయన దక్షిణానికి తిరిగి బోధన ప్రారంభించిన పూర్ణిమతో కూడుకున్న దినమే గురుపూర్ణిమ. 

ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ

ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ :

ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని తప్పకుండా పూజించాలి.

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడి తాండవంలోఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.

వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు. శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.

ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.