Wednesday 30 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (40)

నేటి శస్త్రాల కంటే నాటి అస్త్రాలు అధిక శక్తి సంపన్నమైనవి. ఇదంతా మంత్ర శక్తి వల్లనే. వీటి గురించి పురాణాలలో చాలా విశేషాలున్నాయి బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైనవాటి గురించి చదివేటపుడు నేటి అణ్వాయుధాలు దిగదుడుపుగా కన్పిస్తాయి. ఇవి భ్రూణాన్ని కూడా పాడు చేస్తాయి. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రం ఉత్తర గర్భానికి చేటు తీసుకొని రాలేదా? కృష్ణుడే రక్షించాడు.


సైనికుల శక్తిని గుర్తించింది అమ్మవారు. అదృష్టవశాత్తు కుట్ర మాత్రం ఈమే సైన్యం చేయలేదు. ఆమె జ్ఞాన స్వరూపురాలు కదా. అంతా ఆమెకు తెలుసు. ఇదంతా ఆమె లీలయే. 


విశుక్రుడు విజృంభించడానికి విఘ్నేశ్వరుని మహత్త్వం ప్రకటింప బడడానికీ ఆమెయే కారకురాలు. 


శివశక్తులనుండి శక్తి, జ్ఞానాగ్ని కుండం నుండి బయల్వెడలింది. లలితాంబికగా అవతరించింది. అదే సందర్భంలో శివుడు కామేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడాడు, ఎందుకంటే యుద్ధానికి అవివాహితను పంపండం ఎందుకని? వీరిద్దరిని కామేశ్వర కామేశ్వరి దంపతులుగా కీర్తిస్తారు. కామేశ్వరి మన మఠంలోని కామాక్షి. కామకోటి పీఠం ఆమె నిలయం. 

Tuesday 29 September 2020

స్వామి వారి అమృత వచనాలు - గణపతి (39)


అచరూప్పాక్కం అనే నగరం చెంగల్పట్టునకు, తిండివనానికి మధ్యలో ఉంది. ఇక్కడే ఈశ్వరుని రథం విరిగిందని, కదలలేదని అంటారు. అచ్చు అంటే ఇరుసు - ఆరు అంటే విరిగింది, పొత్తం అంటే ప్రదేశం. 


ఇటీవల ఒక చిత్రమైన సంఘటన పురాణ కథను గుర్తు చేసింది. రామేశ్వరం దగ్గర మేము శంకరమఠాన్ని నిర్మించాలని అనుకున్నాం. జైపూర్ నుండి చలువరాయిని తెప్పించాం. కాంచీపురంలో శంకరుల విగ్రహం, నల్గురు శిష్యుల విగ్రహాలను చెక్కారు. ఒక వాహనం పై వీటిని రామేశ్వరం తీసుకొని వెళ్ళాలి. దారిలో సరిగ్గా అచరూప్పాక్కం దగ్గర వాహనం అగిపోయింది. కదలడం లేదు. 108 కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని బాగుచేయగా బండి బాగుపడింది. ఇక ఆటంకాలు లేకుండా తిన్నగా రామేశ్వరం వచ్చింది. ఆ శంకరుని రథం అప్పుడు కదలలేదు. శంకర భగవత్పాదులను తీసుకొని వెళ్ళే ఈ ఆధునిక వాహనానికీ ఆటంకం ఏర్పడింది. ఈయనా ఆగిపోయారు. చిత్రంగా ఉంది కదూ!

Monday 28 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (38)


కొడుకే - తండ్రి నుండి పూజలందుకొనుట 


ఈశ్వరుడు, త్రిపురాసురులను జయించే సందర్భంలో అతని కొడుకును ధ్యానించలేదట. కొడుకు యొక్క గొప్పదనాన్ని గుర్తించలేదట. 


తనకు రావలసిన బాకీని గణపతి వదులుకుంటాడా? అందరు దేవతలు, ముందుగా గణపతిని పూజించాలన్నారు. శివుడు, దానిని దాటడానికి వీలు లేదు. పూజించకుండా ఈశ్వరుని రథం బయలుదేరబోతోంది. ఇరుసు విరిగి పోవుగాక అని గణపతి యనగా విరిగింది. ఇక రథమెట్లా కదులుతుంది?


అరెరె! నియమాన్ని అతిక్రమించాను, నేనేమో అందరికంటే పెద్దయని భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం పోకూడదని శివుడు గణపతిని పూజించాడట. (మరొక సందర్భంలో కనిష్ఠ పుత్రుడైన కుమారస్వామికే నమస్కరించి శివుడు ప్రణవోపదేశాన్ని పొందినట్లుంది కూడా).


వెంటనే ఆటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథం కదిలింది త్రిపురాసురులను జయించాడు, శంకరుడు. త్రిపురాంతకుడనే బిరుదు వహించాడు.


Sunday 27 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (37)



ముఖ్యమైన దేవతగా


ఇతణ్ణి సంతోష పెడితే అయ్యవారు, అమ్మవారు సంతోష పడతారు లోగడచెప్పాను. ఇక ఆశీర్వదించే శక్తి తల్లిదండ్రులకే ఉందని, ఇతనికి లేదని భావించవద్దు. తల్లిదండ్రుల మాదిరిగానే అతడు భక్తులపై వరాల జల్లు చల్లగలడు.


ఇతణ్ణి ఈశ్వర తనయునిగా కాక ఇతనినే ముఖ్య దేవతగా కొలిచే గాణాపత్యులు ఏమంటారంటే శివ, పార్వతి, కుమారస్వామి, విష్ణు దేవతలను తమ తమ ఇష్టదైవంగా కొలిచేవారు, ముందుగా గణపతి పూజ చేసి కొలుస్తారు కదా, ముందుగా పసుపు విఘ్నేశ్వరుడందరికి ఉన్నాడని. కాని మేము మాత్రం గణపతిని పూజించేటపుడు శివాది ఇతర దేవతలను ముందుగా పూజించనవసరం లేదని అంటారు. ఇక వైష్ణవులు, పూజారంభంలో విష్వక్సేనుణ్ణి పూజిస్తారు. విఘ్నేశ్వరుని మరొక రూపమే అతడని అంటారు. 


వినాయకుడికి అగ్రపూజ ఉంది. ఆయనకి సంబంధించిన శ్లోకాల్లో ఈశ్వరుడు, పార్వతి, విష్ణువు, కుమారస్వామి ప్రస్తావన వచ్చినా, ఇతని గొప్పదనం వారివల్ల రాలేదని గుర్తించండని అంటారు. ఏదో ఒక సందర్భంలో మిగతా దేవతలందరూ ఇతని సాయం కోరినట్లుగానే పురాణాలు వర్ణించాయని అంటారు.


అసలు దేవతలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే విభజన ఉంటుందా? ఒకే పరమాత్మ భిన్న భిన్నంగా కనబడడం లేదా? అతని లీలలు అనంతం కదా! మానవుల మనః ప్రవృత్తుల కనుగుణంగా పురాణాలు ఆయా దేవతలను ఆయా సందర్భాలలో ఎక్కువని కీర్తిస్తూ ఉంటాయి. ఇష్ట దేవతపై భక్తుల మనస్సు కేంద్రీకరించబడాలనే ఉద్దేశ్యంతోనే అట్లా ఉంటాయి. భక్తులు తమ దేవతయే విజయం సాధించినట్లు భావిస్తారు. తద్వారా తమ భక్తిని దృఢం చేసుకొంటారు. ఒక దేవత గెలిస్తే మరొకరు ఓడినట్లే కదా! కాని వినాయకుడు ఓడినట్లుగా ఎక్కడా లేదు. మిగిలిన దేవతలు ఇతడిని కొలిచినట్లు కథలున్నాయి.

Saturday 26 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (36)


ఇట్టి పిల్లవానిని మనం సంతోషపెట్టాలి. అతనికి కోపం కలిగించకూడదు. ముల్లోకాలకు పెద్ద పిల్లవాడు. అట్టి సుగుణవంతుని, దయార్ర్థ హృదయుడు, సంతోషపెట్టే పనులను చేయాలి. అతణ్ణి సంతోషపెడితే అతని తల్లిదండ్రులు సంతోషపడి మనకన్ని శుభాలను కల్గిస్తారు. 


ఇతర దేవతలు - స్వామిని కొలుచుట 

కొందరు తమకేమీ అర్హతలక్కరలేదని, ఫలానా వారు తాము కావలసినవారని పెద్దల పేర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇట్లా నిర్లక్ష్యంగా గడుపుతూ ఉంటారు. 


కానీ మన గణపతి అట్టివాడా? శారీరక బలంలో గాని, మానసిక బలంలో గాని, ఇతరులపట్ల ప్రేమాభిమానాలను కురిపించుటలో గాని ఇతడు మేటియే కదా! తల్లిదండ్రుల గొప్పదనం వల్ల ఇతనికి గొప్పదనం రాలేదు. అతనికి ఒక ప్రత్యేక స్థానముంది. పిల్లవాడని ఏకవచనం ఉపయోగించరు. అసలీ బహువచనం పెద్దలకే కూడా.

Friday 25 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (35)



కుమారస్వామి - అన్నగారు


పైన వారే కాకుండా ఇతని తమ్ముడూ గట్టివాడే. వినాయకుడు పెద్దవాడు. వేదాలు తనిని, జ్యేష్ఠరాజం అని పేర్కొన్నాయి. అన్నగారికి పేరు వస్తే అన్నగారి పేరును తమ్ముడూ వాడుకుంటాడు. ఇక చిన్నవాడు గొప్పవాడైతే అట్టి తమ్మునికి అన్నగారని తానూ మురిసిపోయాడు. అయితే ఈశ్వరుని ఇద్దరు పిల్లలూ అన్నివిధాలా గొప్పవారే, కనుక వినాయకుని బంధుత్వం చెప్పేటప్పుడు కుమారస్వామినీ పేర్కొనాలి.


మన స్వామికి 16 నామాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అవి షోడశ నామాలు. మనం అష్టోత్తర శతంతో (108) పూజ చేయకపోయినా ఈ నామాలను చదివితే చాలంటారు. 


సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః 

ధూమ్ర కేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


దీనిలో చివరి పేరు స్కంద పూర్వజుడు. అనగా స్కందునకు ముందు పుట్టినవాడు. చిన్నవాడు పేరుతో పెద్దవాడు కీర్తింపబడ్డాడు. చిన్నవాని వల్ల పెద్దవానికి పేరు వచ్చింది. 


Thursday 24 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (34)

మొట్టమొదట పిల్లలకీ శ్లోకం చెబుతాం. ఈ శ్లోకం అంటున్నప్పుడు వినాయకుడే పిల్లలకు గుర్తుకు వస్తాడు.


ఈ శ్లోకంలోని విష్ణుపదం, ఇతనితో నున్న సంబంధాన్ని వెల్లడిస్తుందిది. వినాయకునకు మామ కదా విష్ణువు! 


ఇంతకముందే 'శ్రీకాంతో మాతులోయస్య' అని చదివాం. ఇది వింటూ ఉంటే మలయాళంలోని 'మారువాక్కతాయం' గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో మేనమామ సంపద మేనల్లునికి చెందుతుంది. ఇది వారసత్వం (ఔరసత్వం). 


ఇక తల్లిదండ్రుల గొప్పదనం: మామను ముందు పేర్కొని మామ చెల్లెలైన అనగా తల్లిని ఇట్లా పేర్కొన్నాడు: 


జననీ సర్వమంగలా - సర్వమంగలయైన పరాశక్తియే ఇతని తల్లి. ఆమె గుణాలు, క్రియలు శుభకరములే కదా! అమ్మవారిని నుతిన్చేటప్పుడీ శ్లోకాన్ని చదువుతారు.


సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే 

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి, సమోస్తుతే


ఎన్నో పేర్లు విష్ణువునకున్నా శ్రీకాంత పదం, సర్వ సంపదలు కలవాడని సూచిస్తుంది. అట్లాగే అమ్మవారికి ఎన్నో పేర్లున్నా సర్వమంగల పదం అట్టిదే. ఇక తండ్రి - జనకః శంకరో దేవః ఆనగా తండ్రి శంకర భగవానుడు.


శివునకెన్నో పదాలున్నా ఇక్కడ శంకర పదమే వాడబడింది. అంటే మంచి పనులు చేసేవాడని, లేదా ఆనందాన్నిచ్చేవాడని. ఇట్లా విఘ్నేశ్వరుడు శ్రీ మంగలం, సుఖం పదాలతో కూడి మామ, తల్లి, తండ్రులతో కూడియున్నాడు. 


శ్రీకాంతో వందే కుంజరాననం - తంకుంజరాననం వందే అట్టి గజముఖునికి నమస్కరిస్తున్నాను.

Wednesday 23 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (33)


ఇక చతుర్భజం, నాల్గు చేతులున్నవాడు. ఇంచుమించు అందరి దేవతలకు నాల్గు చేతులుంటాయి. కనుక ఈ పదమూ ప్రత్యేకంగా ఇతణ్ణి చూపించడం లేదు.


ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖం కలవాడు, ఇట్లా దీనికి విరుద్ధంగా ఏ దేవతను కీర్తిస్తామా? కాళి, నరసింహ, వీరభద్రులు మాత్రం భయంకరంగా ఉంటారు గాని అందరు దేవతలు ప్రసన్నంగానే ఉంటారు కదా. భక్తులను అనుగ్రహిస్తున్నట్లు వారి విగ్రహాలుంటాయి. ఈ విశాలమైన గజపదనం కూడా అట్లా ఉందనుకుందాం.


కనుక శ్లోకంలోని ఐదు పదాలు వినాయకుని ప్రత్యేకంగా పేర్కొనలేదు ఈ పదాల ఉచ్చరిస్తూ కణతలను భక్తులు తాకుతారు.


ధ్యాయేత్, ధ్యానం చేయవలసినది. దేనికి ధ్యానం చేయాలి? సర్వ విఘ్న ఉపశాంతయే, విఘ్నాలు తొలగడం కోసం. ఇదిగో ఇక్కడ స్వామి ప్రసక్తి వస్తుంది, ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడు పేర్కొనకపోయినా, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఈ స్వామినే, పూజించాలి. కనీసం ఈ శ్లోకాన్నైనా చదివి చేతులతో కణతల నానించాలి. 


Tuesday 22 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (32)

శుక్లాంబరధరం

అందరికీ వచ్చిన ఈ శ్లోకంలో తిన్నగా వినాయకుని పేరు లేదు. ఇతని పేరుతో గాని, ఫలానా తల్లిదండ్రుల కొడుకని గాని లేదు. అనగా శివాత్మజ, గౌరీసుత వంటి నామాలు లేవు. వాహనానికి, ఆయుధానికి చెందిన పదాలు లేవు. అంటే మూషిక వాహన, మోదక ప్రియ పాశహస్తి వంటి పదాలు లేవు. లేదా అతని లక్షణాలు చెప్పే గజముఖ, ఏకదంత, లంబోదర పంటి పదాలు లేవు.


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే


శుక్లాంబరధరం అనగా తెల్లని బట్టలు కట్టినవాడు. సరస్వతికి శంకరునకు తెల్లని బట్టలుంటాయి. ఇతర దేవతలను పీతాంబరంధర, రక్తాంబరధర అన్నట్లుగా స్వామి ప్రత్యేకంగా తెల్లబట్టలు కట్టినవాడనీ లేదు. 


ఇక శ్లోకంలోని విష్ణుపదం. విష్ణువంటే సర్వవ్యాపకుడు కదా! ఇక్కడ స్వామి కూడా సర్వవ్యాపియైన చెప్పడం వల్ల అతని మామయైన విష్ణువు గుర్తుకు వస్తాడు. అంటే మేనమామ పోలిక.


శశివర్ణం అంటే చంద్రకాంతి నున్నవాడు. ఈ విధంగా ఈశ్వరుణ్ణి సరస్వతిని స్తుతిస్తాం కూడా! 

Monday 21 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (31)

OM SARAVANA BHAVA.... VADIVELAA.... #pray #beauty #king #lord #god #temple  #devotional #ind… | Lord murugan wallpapers, Lord shiva painting, Lord  ganesha paintings

ఈ ఘట్టానికి ముందు కూడా నారాయణుడు, పరాశక్తి, అన్న చెల్లెలు గానే కీర్తింపబడ్డారు. వీరిద్దరికీ తల్లిదండ్రులు లేరు. వారు పరబ్రహ్మ స్వరూపులు. సృష్టి సంహారం జరిగి శివుడు శాంతమూర్తిగా ఉన్నపుడు వీరిద్దరు మాయాశక్తి జగత్తును పాలిస్తారు.

నిజంగా ఈ ఆకారాలు రెండు కావు, మూడు కావు, ఒక్కటే. ఒక సత్త (ఉనికి) ఆనందంతో ఉన్నపుడు, క్రియతో ఉన్నపుడు నారాయణుడని గాని అమ్మవారని గాని పిలుస్తాం. వీరిద్దరు చేసే పనులొకటి అవడం వల్ల వీరిని అన్న - చెల్లెలు అని వ్యవహరిస్తాం. ఆకారాలొకవిధంగా ఉంటాయి.

ఇక అల్లుణ్ణి గురించి చెబుతున్నాను కదా! సుబ్రహ్మణ్య స్వామి, మరుగన్ ఎట్లా అయ్యాడు? అతడమ్మవారి తనయుడే కాక, వల్లి, దేవసేనలను వివాహమాడాడు కదా. వీరిద్దరు విష్ణువు యొక్క సంతానమే. అందొకామె వేటగాని దగ్గరకు, మరొకతె దేవతల దగ్గరకు వెళ్ళింది గనుక మురుగన్ రెండు విధాల మరుగన్ (అల్లుడు) ఐనాడు. అనగా మేనల్లుడు, అల్లుడైనాడు.


Sunday 20 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (30)

ఇక సుబ్రహ్మణ్యునకు, అతని మేనమామకు దగ్గర సంబంధం ఉంది. కుమారస్వామిని తమిళంలో మురుగన్ అని అంటారు. మురుగన్ ని చెప్పినపుడు మాల్ మురుగన్ తోనే ఉంటుంది. మరుగన్ అనే పదం మరుమగన్ (అల్లుడు) నుండి వచ్చింది. మరుమగన్ అనగా మేనల్లుడు. దక్షిణ దేశంలో మేనమామ కూతుర్ని వివాహం చేసుకోవడం ఆచారం కనుక మరుమాన్ అనే పదం అల్లుణ్ణి సూచిస్తుంది.

విష్ణువు - అమ్మవారు

అమ్మవారి సోదరుడే మహావిష్ణువు. ఆమెకు నారాయణ సహోదరి అని ఒక నామం. అమ్మవారు దాక్షాయణిగా, పార్వతిగా, మీనాక్షిగా అవతరించినపుడు విష్ణువు సోదరునిగా అవతార మెత్తలేదు. ఒక్క కృష్ణావతారంలోనే అన్న చెల్లెలుగా కనబడ్డారు. స్వామి దేవకీ వసుదేవుల బిడ్డ గా నుండగా నందగోపుడు యశోద యొక్క తనయగా అమ్మవారవతరించింది. కృష్ణుడవతరించినప్పుడు జగత్తంతా అంధకారంతో ఉండగా వాసుదేవుడు కృష్ణుణ్ణి నందుని ఇంటికి తీసుకొని వెళ్ళడం, యశోద ప్రక్కలో నున్న అమ్మవారిని తీసుకొని తిరిగి రావడం తెలిసిందే కదా. 

వాసుదేవుని కూతురుగా కంసుడు ఆమెను భావించి సంహరించడానికి పూనుకొనగా ఆమె అకాశంలో ఎగిరి నిజరూపాన్ని ధరించి నిన్ను చంపబోయేవాడున్నాడని ఆంతర్జానమైంది.


Saturday 19 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (29)



ఇక మేనమామ గొప్పతనం :

మరొక శ్లోకం మేనమామ వల్ల కీర్తిని గడించాడు.

శ్రీకాంతో మాతులో యస్య, జననీ సర్వ మంగలా 

జనకః శంకరో దేవః, తం వందే కుంజరాననం

మొదటి శ్లోకం మాతా మహునితో ఆరంభమైంది. సాధారణంగా పితామహునితో అరంభం కావలసి యున్నా. దానికి సమాధానం ఉంది. తల్లిదండ్రులను పేర్కొనవలసి వచ్చినపుడు ముందు తల్లిని, తరువాత తండ్రిని పేర్కొనాలి. ముందు వేదమంత్రంలో మాతృదేవోభవ అని ఉంటుంది. తరువాత పితృదేవోభవ యని, అవ్వైయార్ కూడా మొదటి స్థానాన్ని తల్లికే ఇచ్చింది. ఇద్దరు తాతలను పేర్కొనవలసి వచ్చినపుడు తల్లి తండ్రిని పేర్కొనడం సబబు. 


కాని ఈ శ్లోకం తల్లిదండ్రుల కంటే ముందుగా మేనమామను పేర్కొంది.


లక్ష్మీ భర్తయైన మహావిష్ణువు మేనమామగా గలవాడు వినాయకుడు తేలింది. శ్లోకం, శ్రీతో మొదలు పెట్టడం సబబే కదా! శ్రీయనగా మహాలక్ష్మి జగత్తునకు శ్రీ మహావిష్ణువు, సిరిసంపదలిచ్చే మహాలక్ష్మి ఉండవలసిందే. ఇట్టి దంపతులతో మన వినాయకునకు బంధుత్వం గొప్పదే కదా.

Friday 18 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (28)


అయితే మాతామహునితో ఎందుకు మొదలైంది? పితామహుని పేర్కొనాలి కదా? మహస్తతః అపితామహం అని తరువాత ఉంది. అతడు జ్యోతి స్వరూపుడగుటచే అపితామహం =తండ్రి తరపున తాత లేని వాడయ్యాడు. అనగా శివునకు తండ్రి లేదు కదా! 

ఈ శ్లోకం తల్లి తండ్రియైన, గొప్ప పర్వతమైన హిమవంతుని గొప్పదనాన్ని పేర్కొని అట్టి వాని మనుమడు వినాయకుడిని, ఇతని తండ్రికి తండ్రి లేడని పేర్కొంది. ఇతని తండ్రి స్వయంభువు. అనగా తనంతట తాను తెలిసినవాడు.

ఇట్లా శ్లోక ప్రథమ పాదం ఉండగా రెండవ పాదంలో ఇతని గొప్పదనం వర్ణింపబడింది. అతడు నిజంగా తల్లిదండ్రులకు పుట్టినవాడని అనుకుంటారేమో. అతడే పరబ్రహ్మ స్వరూపుడని చెప్పింది. అనగా పుట్టుక లేని వాడయ్యాడు. కారణం జగతాం అనగా జగత్కారణుడు. అట్టివాడు శివశక్తి తనయునిగా ఆవిర్భవించాడు. వానికి నమస్కారం, కారణం 'జగతాం వందే'.

ఇట్లా జగత్కారణత్వం, పిల్లవానిగా కనబడుట ఉన్నా, మానవాకారం ధరించకుండా కంఠంపై నుండి గజాకారంతో, దాని దిగువనుండి మానవాకారంతో కన్పిస్తున్నాడు. 'కంఠాదుపరివారణం'.

Thursday 17 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (27)


వినాయకునికి సంబంధించిన ప్రవర చెప్పేటపుడు అతని మాతా మహునితో ఆరంభమైంది. సాధారణంగా ప్రవర, ముత్తాతతో మొదలౌతుంది. తర్పణం ఇచ్చినపుడు మాత్రమే మాతామహస్మరణ చేస్తాం. మాతామహుడు, తల్లి యొక్క తాత; తల్లి యొక్క ముత్తాతలను స్మరిస్తాం. వారికి తర్పణలిస్తాం. అయితే మన వినాయకునకు తాత లేడు. తండ్రి శివుడే ఉన్నాడు. శివుడు తండ్రి లేదు కదా! శివుడు స్వయంభువు. ఇక తల్లికీ కారణం లేదు. ఆమెయే అన్నిటికీ కారణమాయె. కాని కొన్ని సందర్భాలలో కొన్ని అవతారాలను ఎత్తవలసి వస్తుంది. అందువల్ల వినాయకుని మాతామహుని పేర్కొనవలసి వచ్చింది.

అందువల్ల మాతామహ మహాశైలం అంటే (అమ్మ వాళ్ళ నాన్న) హిమాలయమే, హిమవంతుడే.

అమ్మవారు అధికారిణి, అఖిలాండ జన్మని, ఆమె దాక్షాయణి అనగా దక్షుని కూతురు. పార్వతి హిమవంతుని కూతురు; మీనాక్షి - మలయధ్వజుని కూతురు; కాత్యాయని = కత్యాయనుని కూతురు అయింది. 

పరమేశ్వరుణ్ణి ఎప్పుడు పేర్కొన్నామో వెంటనే పార్వతిని కూడా పేర్కొన్నట్లే. ఆమె పార్వతి అవతారంలోనే హిమవంతుని కూతురై, తపస్సు చేసి కామారియైన శివుణ్ణి పెండ్లాడింది. అతణ్ణి గృహస్థును చేసింది. ఇట్లా పార్వతి యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ మాతామహ మహాశైలంతో ఆరంభించబడింది. 

Wednesday 16 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (26)


పిల్లవాని గొప్పదనాన్ని చెప్పినప్పుడు ఇతని తండ్రి, తాతలను ప్రస్తావిస్తాం. దానిని ప్రవర అని అంటారు. ప్రవరలో ముత్తాత పేరు కూడా రావాలి. కాని ఈ చెప్పబోవు శ్లోకం, తాతతోనే ముగుస్తుంది. 

శ్లో|| మాతా మహ మహశైలం మహస్తతోఽ పితామహం

 కారణం జగతాం వందే కంఠాదుపరివారణం

విష్ణు సహస్ర నామాలకు పూర్వభాగంలో వ్యాసుని ముత్తాతయైన వసిష్ఠుని దగ్గరనుండి మొదలై వ్యాసుని కొడుకైన శుకుని వరకూ ఉంటుంది. శుకుడు, బ్రహ్మచారి కనుక అతని సంతాన ప్రసక్తి ఉండదు. అక్కడినుండి శిష్యపరంపర మొదలౌతుంది. గౌడపాద - గోవింద భగవత్పాద - ఆది శంకరులని ఇట్లా గురువందనం ఉంటుంది.

విఘ్నేశ్వరుని గురించి చెబుతూ ఉండగా ఇట్టి గురుపరంపర గురించి చెప్పడమొక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విఘ్నేశ్వరుడు వ్యాసునితో సంబంధం ఉన్నవాడే. విఘ్నేశ్వరుని పెక్కు రూపాలలో వ్యాస గణపతి యొకటి. కనుక వ్యాసుని స్మరిస్తున్నాం. మనం ముందుగా గురువందనం చేయాలి కదా!

Tuesday 15 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (25)




పెద్దింటి పిల్లవాడు

భాగ్యవంతుల పిల్లలను కొందరు లాలిస్తూ ఉంటారు. అట్టివారి పట్ల ప్రేమ చూపిస్తే ఆ పిల్లవాని భాగ్యవంతులైన తల్లిదండ్రులు తమ పనులను చేసి పెడతారనే ఆశతో దగ్గరకు తీసుకొంటారు. ఎవరి పిల్లలంటే వారికి ముద్దు. కాకిపిల్ల కాకికి ముద్దనే సామెత యుంది కదా. 

ప్రపంచంలో రకరకాల భాగ్యవంతులున్నారు. అందరిలోనూ భాగ్యవంతులెవరయ్యా అంటే వినాయకుని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే. 

అమ్మవారిని, అయ్యవారిని పూజించడం అంత సులభం కాదు. అనేక నియమాలున్నాయి. కాని వారి తనయుణ్ణి పూజిస్తే వారింకా సంతోషిస్తారు. ఇక మన స్వామిని సులభంగా చేరవచ్చు. చిన్న వస్తువులిచ్చినా పిల్లలు సంతోషిస్తారు. అట్లాగే వినాయకుడికి దూర్వలర్పించినా సంతోషిస్తాడు. ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినా సంతోషిస్తాడు. లేదా ఒక కొబ్బరి కాయను కొట్టినా చాలు, ఏ క్రియ కలాపం లేకపోయినా. 

Monday 14 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (24)

ఈ గ్రామం ప్రత్యేకత ఇంకా ఉంది. శ్వేత వినాయకుని తుండం, కుడివైపునకు తిరిగినట్లుండగా కావేరీ నది కూడా ఇక్కడే కుడివైపుకి తిరిగి ప్రవహిస్తోంది.

ఈ కావేరికి, వినాయకుని దగ్గర సంబంధం ఉంది. సహ్య పర్వత కొదగులో అగస్త్యుడు కావేరీ జలాన్ని కమందులుపులో బంధించాడట. ఇక్కడి వినాయకుడు, కాకిగా మారి కమండులువును ఒరుగునట్లుగా చేసాడట. అందలి నీటిని జగత్కల్యాణం కోసం ప్రవహింప చేసాడట. అట్లా తమిళనాడుకి కావేరి జలాన్ని పంచిపెట్టిన మూర్తిని మనసార భజిద్దాం.

కావేరీ నది, కర్ణాటక దాటి తమిళనాడులో ప్రవహించింది. కుంభకోణానికి చేరి ఒక బిలంలో ఆంతర్ధానమైంది. హేరండర్ అనే ముని తనంతట తాను త్యాగం చేయగా ఆ బిలం నుండి కావేరి వచ్చి ఈ స్వామి క్షేత్రాన్ని కుడివైపుగా చుట్టి ప్రవహించింది. 

తల కావేరిలో నల్లగా కాకి రూపం ఎత్తిన వినాయకుడు ఇక్కడ తెల్లగా ఉంటాడు. ఇతణ్ణి ప్రణవ స్వరూప వక్రతుండుడని కీర్తిస్తారు. కావేరి కూడా కుడివైపు ప్రవహించడం విశేషాం. 

తుండం కుడివైపునున్న మూర్తినే ప్రణవ స్వరూపునిగా భావించడంతో బాటు ఎడమవైపు తిరిగియున్నా ప్రణవ రూపునిగానే భజిద్దాం.

Sunday 13 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (23)

దక్షిణ దేశంలో ఈ స్వామి సన్నిధి తిరువలంచుళిలోని శివాలయంలో ఉంటుంది. జ్ఞాన సంబంధులు, అప్పర్ ఇందలి ఈశ్వరుణ్ణి పాటలతో కీర్తించారు. కాని ఆ క్షేత్రం యొక్క కీర్తి వినాయకునకే చెందుతుంది. ఆ మంటపంలోని శిల్ప సంపద అత్యద్భుతంగా ఉంటుంది. పాలరాతి నగిషీలు ఇందు చెప్పుకోదగినవి.

పూర్వకాలంలో ఆలయాలను చెక్కిన శిల్పులు, ఐదింటిని మినహా ఏవైనా చెక్కగమని అనేవారట. ఈ ఐదింటిని శిల్పంలో చూపించడం తమకు అలవి కాని పని యని అనేవారట. అపుడయార్ కోవెలలోని వంపు తిరిగిన ప్రాకార శీర్ష శృంగము; గడారం కొండాన్ లోని ప్రాకారపు గోడ; తంజావూరు శిఖరం; తిరువిళిమలైలో నున్న మంటపం; అనే నాల్గింటితోబాటు తిరుపళించుని లోని పాలరాతి అల్లికల తడకలు కూడా చేర్చారు. వీటిని మరల నిర్మించడం సాధ్యం కాదని అనేవారట.

తిరువళంచులిలోని 16 రంధ్రాలు శిల్ప కళ శోభితంగా తొలచబడ్డాయి. 16 గణపతులున్నట్లే 16 రంధ్రాలుండడం విశేషం. 16 సంఖ్య, పూర్ణత్వాన్ని సూచిస్తుంది. షోడశకలాపూర్ణుడని అంటాం కదా.

దేవేంద్రుడు, ఇక్కడి వినాయకుని పూజించాడని ఐతిహ్యం. క్షీరసాగరంలోని అమృతంలా, పాలమీగడతో చేసినట్లుగా ఇక్కడ స్వామి తెల్లగా ఉంటాడు. కనుక శ్వేత వినాయకుడని పేరు. ఈశ్వరాలయంలో ఇతడు శివునితో పాటు ఒక సన్నిధిలో ఉన్నా ఇతనికే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గాని శివునకు కాదు.

Saturday 12 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (22)



మహారాష్ట్రలో గాణపత్యం ప్రబలంగా ఉండడం వల్ల ఎనిమిది ప్రముఖ గణపతులకు ఎనిమిది దివ్య క్షేత్రాలు వెలిసాయి. వీరిని అష్టవినాయకలంటారు. ఇందు మాయూరేశ్వరుడని ఒక వినాయకుని పేరు. అతని క్షేత్రం మోరేగావ్ గా ప్రసిద్ధం. మయూర గ్రామమే అట్లా మార్పు చెందింది. ఆ నగరం చుట్టూ గణపతి పరివార దేవతలుంటారు.

మయూరం, తమిళంలో మొయిల్ గా ఉత్తర దేశ భాషలలో మోర్ గా మారింది. సుబ్రహ్మణ్యుని తలచినప్పుడు అతని వాహనం నెమలి గుర్తుకు వస్తుంది. పురాణాలు, తంత్ర గ్రంథాలబట్టి వినాయకునకు మూషికం వాహనమైనా ఇక్కడ మాత్రం గణపతికి నెమలియే వాహనం. అతడు మయూరేశ్వరునిగా ప్రసిద్ధి.

మహారాష్ట్రలోని మోరేగావ్ లోని, తమిళనాడులోని తిరువలంచుళి ప్లేత్ర పురాణాలను బట్టి స్వామికి చాలా మహిమ ఉన్నట్లు స్పష్టమౌతుంది. ఆ ప్రదేశానికే దక్షిణావర్తమైన పేరు. దక్షిణ అంటే కుడి; ఆవర్తం అంటే వంపు కదా. అట్లా స్వామి రాజధాని దక్షిణావర్తం.

Friday 11 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (21)

ఈ వలంపురి క్షేత్రాలలో ప్రసిద్ధమైనది కుంభకోణం దగ్గర తిరువలం చూళిలో ఉంది. అతని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తాను. మహారాష్ట్రలోని గణపతి పూజ విస్తారంగా జరుగుతుంది. ముందుగా వినాయకుణ్ణి చివరగా ఆంజనేయుణ్ణి కొలవడం అక్కడ విస్తారంగా ఉంటుంది. ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలు తిలక్ గారు ప్రోత్సహించారు. పూజానంతరం భారీగా నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇట్లా లక్షలాదిమందిలో దైవభక్తిని పరోక్షంగా దేశభక్తిని కలిగించారు. అది మత సంబంధమైనది కనుక తెల్లదొరలు కలుగజేసుకోలేదు. ఈ ఉత్సవాలలో నాయకులు వచ్చి దేశభక్తిని నూరిపోసే వారు. ఉత్తేజితుల్ని చేసేవారు. ఈనాటికీ ముంబైలో గణపతి ఆరాధన చెప్పుకోదగినదే. చాలామంది గణపతులను వివిధ రూపాలలో అర్చిస్తూ ఉంటారు.

గాణపత్యాన్ని అవలంబించినవారు గణపతి భక్తులు. వీరికి గణపతియే ఆరాధ్య దైవం. నదిలో ఆరు స్నాన ఘట్టాలున్నట్లు మన మతంలోనూ ఆరు సంప్రదాయాలున్నాయి. గాణాపత్యం - గణపతి; కౌమారం - కుమారస్వామి; శాక్తం - శాక్తేయులకు; వైష్ణవం - వైష్ణవులకు; శైవం-శివునికి; సౌరం - సూర్యునకు సంబంధించినది. ఈ ఆరింటిని ఉద్దరించి శంకరులు షణ్మతస్థాపనాచార్యులైనారు.

Thursday 10 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (20)

వలంపురి వినాయకుడు  

చేతులను, కణతల దగ్గరకు చేర్చుట, చేతులతో చెవులను పట్టుకొనుట, దూర్వలతో పూజించుట, ఉండ్రాళ్ళను నివేదించుట, మొదలైనవి గణపతి పూజలో ముఖ్యమైనది. చుట్టూ ప్రదక్షిణమూ ముఖ్యమే. మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి. కొందరు 21 సార్లు లేదా 108 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అతడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేసి మొత్తం భూప్రదక్షిణం చేసిన ఫలాన్ని పొందినట్లే మనము కూడా అతనికి ప్రదక్షిణం చేస్తే అట్టి ఫలాన్ని పొందగలం. అతని ఉదరమే బ్రహ్మాండ గోళంలా కన్పిస్తుంది. శారీరక మానసిక బలాలను, చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల పొందవచ్చు.

వినాయకుని విగ్రహాలతో చాలా భేదాలున్నాయి. సాధారణంగా తుండం యొక్క కింది భాగాన్ని ఎడమవైపునకు త్రిప్పినట్లుంటాయి. ఎక్కడో గాని కుడివైపునకు త్రిప్పినట్లుండదు. అట్టి విశేష విగ్రహాన్ని వలంపురి వినాయకుడని తమిళులుంటారు. కుడివైపు తిరిగినట్లున్న శంఖానికి అధిక ప్రాధాన్యమిస్తాం. అదే వలంపురిశంఖం. దానినే దక్షిణావర్త శంఖమంటారు. అట్టి శంఖము, అట్టి మూర్తికి ప్రత్యేక శక్తులున్నాయని అంటారు. తుండం అట్లా ఉండి కుడివైపునకు సాచియున్న రూపం ఓంకారంలా తమిళ లిపిలో ఉంటుంది. అతని కుడివైపు నోటినుండి చెక్కిలి వరకు తలవరకు, మరల తుండము యొక్క క్రిందవరకు ఒక గీతగీస్తే ఓంకారంలా ఉంటుంది.

Wednesday 9 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (19)


దంతాన్ని విరిచి కలంగా వాడాడు గణపతి. దంతం అంటే ఏనుగునకు మోజు కదా! అందువల్లనే బ్రతికినా చచ్చినా ఏనుగు వేయి వరహాలనే మాట వచ్చింది. ధర్మ ప్రబోధకమైన భారతాన్ని వ్రాయడానికి అట్టి దంతాన్నే విరిచి అనగా త్యాగం చేసి పూనుకున్నాడు. దేవగణాలకు పతి, పార్వతీ పరమేశ్వర తనయుడు, ప్రణవ స్వరూపుడైనవాడే తనను తాను తగ్గించుకొని వ్రాయసగాడయ్యాడు. చూసారా అతని త్యాగాన్ని?

మాణిక్య వాచకులు పాడుతూ ఉంటే నటరాజే వ్రాసేడని కథ. కృష్ణుడే జయదేవుని గీతగోవిందంలో ఒక వాక్యాన్ని వ్రాసేడని కథ. గణపతి, విసుగు చెందకుండా ఏకబిగిన లక్ష శ్లోకలూ వ్రాసాడు.  

అందుకే 'మహా గణాధిపతయే నమః' అని ముందుగా వ్రాస్తాం. గబగబా రాస్తూ ఉంటే అతని వేగాన్ని తట్టుకోలేక మధ్యమధ్యలో కొన్ని వ్యాస ఘట్టాలను పెట్టాడు వ్యాసుడు. వాటిని అర్థం చేసుకుంటూ వ్రాయాలనే నియమం కూడా పెట్టాడు.

గణపతి ముందు రెండు కణతలను తాడిస్తాం. గౌరవాన్ని చూపిస్తాం. వ్యాసుడే గణపతిని అప్పుడప్పుడు తలపట్టు కొనేటట్లు చేసాడు. తమిళ భాషలో వ్యాస ఘట్టాలు భారతగుట్టు అని అంటారు. గుట్టు అనగా రహస్యం. గుట్టు వీడిందంటే రహస్యం తెలిసిపోయిందని అర్థం. 

అతడు జ్ఞాన స్వరూపుడు కనుక క్లిష్టమైన శ్లోకాలను అర్థం చేసుకొని వ్రాసేడు. అట్లాగే క్లిష్టమైన సమస్యలు వీడిపోవాలని అతడిని స్మరిస్తాం. మన వార్త కూడా నిరాటంకంగా సాగిపోవాలని ప్రదక్షిణం చేద్దాం. 

Tuesday 8 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (18)



మరొక కారణం. ఆయనే గొప్ప రాతగాడు. ఏది ప్రపంచంలో పెద్ద పుస్తకమని అడిగితే చటుక్కున, మహాభారతం అంటారు. ఎవరైనా సాగదీస్తూ మాట్లాడితే నీ చేటభారతం నా దగ్గర వినిపించకు అని అంటాం. భారతం లక్ష శ్లోకాలతో ఉంటుంది, పంచమ వేదం అని అంటారు కూడా. మిగిలిన నాలుగు వేదాలు ఒకరు చెప్పగా ఒకరు పల్కుతూ ఉంటారు. కానీ భారతం లిఖిత ప్రతియే. వ్యాసుడు చెబుతూ ఉంటే, గణపతి మేరు శిఖరంపై కూర్చొని వ్రాసాడని కథ. (ఇట్లా స్వామివారు ప్రసంగిస్తూ ఉండగా ఒకాయన లేచి వ్రాతగాడని అంటే అసలు రచయిత కదా అని ప్రశ్నించాడు). అసలు రచయిత వ్యాసుడే. విని వ్రాసిన వ్రాయసగాడు మాత్రమే గణపతి. అనగా Copyist ఆంగ్లంలో Writer అనే పదానికి రెండర్థాలూ ఉన్నాయి. రచయిత వ్రాయసగాడని, అందువల్ల వ్రాసేవాడు గణపతియంటే తప్పులేదు.   


ఇతడసలు రచయిత కాకపోయినా వ్రాయసగానికీ గౌరవం ఇచ్చి కొలుస్తున్నాం. బాగా చదువుకొన్నవాళ్ళే వ్రాయసగాండ్రు కావాలనే నియమమూ లేదు. అందంగా వ్రాయడమే వృత్తిగా కలవారుండేవారు. వారిని Calligraphist అనేవారు. ఆనాటి విద్యార్థులు ఎంత చదివి వ్రాసేవారు కాదు. విని కంఠస్థం చేసేవారు. అట్టి వ్రాయసగాండ్రూ తమ నాయకుడు గణపతియని, ఆ గణపతియే మొదటి వ్రాయసగాడని మన్నించేవారు.


Monday 7 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (17)




వ్రాతకు, వినాయకుని గల సంబంధం 

వెనుక ఇతని గుర్తును గురించి చెప్పుకున్నాం. పాత తాళపత్ర ప్రతులను చూస్తే మొట్టమొదట శ్రీ మహా గణాధిపతయే నమః అని ఉంటుంది. 

అయితే ఒక సందేహం. వాగ్దేవియైన సరస్వతిని ప్రార్థించకుండా ఈయనను ముందుగా స్తుతించడమేమిటి ? ఇక గణపతి యనే పదమే ఉంటుంది కాని, అతని పేర్లు వినాయక, విఘ్నేశ్వర, వక్రతుండ, హేరంబ అనే పదాలే లేవు. ఈ విషయమై విద్వాంసులతో చర్చించాను. గణమనే మాట, భాషకూ చెందుతుంది. వ్యాకరణ శాస్త్రంలో అన్ని అక్షరాలకు సంబంధించిన నియమాలుంటాయి. గణాధిపతి, అన్ని గణాలకు, అవి ఏ బాపతైనా అధిపతి. ఆయన పరమేశ్వరుని భూత గణాలకు అధిపతియే. అట్లాగే పదాలనే గణాలూ అతడు అధిపతియే. అందువల్లనే మిగిలిన పదాలను వాడకుండా గణాధిపతయే నమః అని గ్రంథం ప్రారంభానికి ముందుగా వ్రాస్తారు.

ప్రణవాకారంలో ఉంటాడు కదా! ప్రణవమే అన్ని నాదాలకూ మూలం కనుక, అన్ని పదాలకూ ఇతడధిపతి కనుక ఆ పదాన్నే వాడాలి.

Sunday 6 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (16)



వినాయకుని గుర్తు u-. అనగా వంకరగా ఉండి చివర తిన్ననైన గీతతో ఉంటుంది. చక్రంలా ఒకటి తిరుగుతూ ఉంటే ఒక ఇరుసుండాలి కదా! అది తిన్నగా ఉంటుంది కదా! విష్ణువు యొక్క చక్రం గీసినప్పుడు క్రింద ఒక వ్రేలుతో దానిని పట్టినట్లుంటుంది. ఆ వేలు ఇక్కడ ఇరుసు. గుండ్రంగా ఉండే ప్రపంచ భువనాలను తిప్పే ఇరుసు తిన్నగానే ఉండాలి. అది కంటికి కనబడకపోయినా ఒక తిన్ననైనది త్రిప్పుతూ ఉంటుంది. అదే శక్తి రూపంలో ఉంటుంది. దానికి గుర్తుగా వినాయకుని గుర్తు. అనగా వంకర, దాని చివర తిన్ననైన గీత.

నేను చదివినదో విన్నదో గాని శక్తి యొక్క ఆగమనం వినాయకుని గుర్తులానే ఉంటుందిట. వినాయకుని తుండం, భ్రమణానికి గుర్తు. గీత దాని నుండి ఉదయించిన శక్తికి గుర్తు. ఈ రెంటినీ నాద బిందువులుగా శివశక్తి సమ్మేళనంగా భావిద్దాం.

పూర్ణత్వాన్ని సూచించాలంటే ఒక చుక్కతో ఆరంభమై మరల చుక్క దగ్గరకు వచ్చినపుడే. అది బ్రహ్మమును సూచిస్తుంది. వినాయకుని గుర్తు సున్నాను గీయబోయి అర్ధచంద్రాకారంగా ఉంచుతూ దాని చివర తిన్ననైన గీత నుంచుతాం. ఇది ఏమని సూచిస్తుంది? బ్రహ్మమొక్కటియైనా అందులోనుండి అనేక బ్రహ్మాండాలు వచ్చాయని అవి బ్రహ్మమే అని పూర్ణములే అని సూచిస్తుంది. అనగా బ్రహ్మమూ, ప్రపంచమూ పూర్ణములే. పూర్ణమైన బ్రహ్మము నుండి పూర్ణమైన ప్రపంచం వచ్చిందని ఉపనిషత్తు చెప్పింది కదా? వినాయకుని గుర్తు వంకరగా నుండి గీతతో ఉంటుంది కనుక ఆ వంకర, బ్రహ్మ పూర్ణత్వాన్ని ఆ గీత, ప్రపంచ పూర్ణత్వాన్ని సూచిస్తుంది. 

నేను వంకర, తిన్నని గీత అని పేర్కొన్నాను. ఈ రెండూ స్వామి దంతాన్ని సూచిస్తాయి. ఆయన ఏకదంతుడు. అవ్వైయార్, ఈ పిల్లల దేవుణ్ణి పూజించి, ముసలితనాన్ని వయస్సులోనే పొంది, ఈ ఏక దంతుడు ప్రారబ్ధ కర్మను పోగొడతాడని చెప్పింది.

Saturday 5 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (15)




పూర్ణ స్వరూపుడూ ఆయనే, శూన్య స్వరూపుడూ ఆయనే. ఈ సున్న ఉన్నది, లేని దానిని పరమాత్మ స్వరూపమనే సూచిస్తుంది. వినాయకునికి తీపి పదార్థముతో ఉండే ఉండ్రం గుండ్రంగానే ఉంటుంది. దానిని పూర్ణమంటాం. అట్టి పూర్ణ స్వరూపుని అర్ధచంద్రాకారునిగా సూచిస్తాం. ఇదే అన్నిటిని పూర్ణంగా చేస్తుంది.

ఇతని గుర్తు వంకరగా ఉండి తిన్ననైన గీతతో (-) ముగుస్తుంది పూర్ణత్వమైనా శూన్యత్వమైనా వక్రంగానే ఉంటూ అతడు తిన్నగా నున్నాడని ఆ గీత సూచిస్తుంది. వక్రానికి విరుద్ధం ఆర్జవం. అనగా ఋజుత్వం. నిర్గుణం, సగుణత్వము నిర్గుణ బ్రహ్మ తత్త్వాన్నే సూచిస్తాయి.

ఇక 'ఊ అనే అక్షరం, ప్రణవంలోని మధ్యాక్షరం. అ+ఉ+మ లతో ఓంకారం. 'అ' సృష్టిని, 'ఊ - రక్షణను; 'మ' సంహారాన్ని, అంటే వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. ఈ ముగ్గురూ ఒక పరాశక్తి నుండే వచ్చినవారు. ఆమె ప్రణవ స్వరూపిణి. ప్రణవాన్ని దేవీ ప్రణవమని అనరు. ఉమయే దేవీ ప్రణవం. అ,ఉ,మ,లే ఉమ (ఉ+మ+అ). ఓంలో మొదటి అక్షరం 'అ'. అమ్మవారి ప్రణవం ఉతో ఆరంభమవడం వల్ల దయతో కూడిన పోషణత్వాన్ని సూచిస్తుంది. కనుక 'ఉమ' అనే మాటయే దేవీ ప్రణవం.


ఓంకారంలో 'ఉ' గుండె వంటిది. అదే ఉమా ప్రణవంలో మొదటి అక్షరం. అ,మ, లేకుండా 'ఊ కలిగిన వినాయకుని గుర్తు ఏమని సూచిస్తుంది? అతడు తల్లి వంటి వాడే కాదు, ఒక మెట్టు ఎక్కువని సూచిస్తుంది. ఎట్లా? సృష్టిని సూచించే 'అ', సంహారాన్ని సూచించే 'మ'తో కూడినది ఆమె. కాని వినాయకుని గుర్తు 'ఉ తోనే ఉంటుంది. అంటే ఇతని పని కేవలం రక్షణయే. కరుణామూర్తి కనుక 'ఉ'తోనే ఉంటాడు. ప్రణవంలో 'ఉ' విష్ణువును సూచిస్తోంది. ఉమ కూడా విష్ణురూపిణియే. ఆమెకు నారాయణ సహోదరి, విష్ణుమాయా విలాసిని, నారాయణి అని ఇతర నామాలు. అందరికీ వచ్చిన శుక్లాంబర ధరం విష్ణుం శ్లోకం లో ఉన్న విష్ణువు సర్వవ్యాపి. ఈ 'ఊ శివశక్తులను విష్ణువును కలిపి సూచిస్తోంది. అనగా శైవ వైష్ణవ మతాలు సంగమమిక్కడ. 


Friday 4 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (14)



వినాయకుని గుర్తు


తమిళులు వ్రాయడానికి మొదలు పెట్టినప్పుడు వినాయకుని గుర్తు ఉంచుతారు. ఏదో గ్రంథ రచనకే కాదు, చిన్న ఉత్తరం ముక్క వ్రాయాలన్నా ఈ గుర్తు నుంచుతారు (తెలుగువారు శ్రీరామ అని వ్రాసినట్లుగా) అంతేకాదు, ఏ పని మొదలు పెట్టినా వినాయకున్ని అందరూ స్మరిస్తారు. విఘ్నాలు లేకుండా ఉండడం కోసం.


ఈ పై గుర్తు ఎట్లా ఉంటుంది? అర్ధ చంద్రాకారం, అంటే దానర్థం మన వ్రాతసున్నాతో ముగియకూడదనే.


ఓంకారం వ్రాస్తే నాగరిలిపిలో 'ఓ' తరువాత అర్ధ చంద్రాకారం గుర్తు ఉంటుంది కదా. తమిళంలోనైనా గ్రంథ లిపిలో వ్రాసినా అంతే. అసలు ప్రణవమే వినాయకుని నుండి వచ్చింది కదా! 


ఓం' దేవ నాగరిలిపిలో 'ఊ వ్రాసిన తరువాత వక్రంగా ఒక గీత గీసి దానిపై అర్ధచంద్రాకారం ఉంటుంది. ఏనుగు తుండమూ వక్రంగానే ఉంటుంది అందువల్ల అతడు వక్రతుండుడు. వంకర ను సూచించడాన్ని పూర్తి చేస్తే నిండు సున్నగా కన్పిస్తుంది. అంటే ఈ ప్రపంచము, మిగతా లోకాలు నక్షత్రాలు, మొత్తం బ్రహ్మాండం అంటే గుండ్రంగానే ఉంటుంది. అండం అనగా గ్రుడ్డు, గుండ్రంగానే ఉంటుంది. అంటే బ్రహ్మాండమూ గ్రుడ్డు.

Thursday 3 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (14)



జగత్తునకంతటికీ చెందిన ఈ దేవునికి ధనవంతులు వివిధ నైవేద్యాలనర్పించి పిల్లలకు పంచి పెట్టండి. పిల్లలు పుష్టిగా, బొద్దుగా ఉండాలి కాబట్టి ప్రతి శుక్రవారం, స్వామి ముందు కొబ్బరికాయ కొట్టండి. పిల్లలు వాటిని ఏరుకుంటూ ఉంటే వారి ఆనందాన్ని గమనించండి. ఇట్లా ఉంటే అందరిపై స్వామి అనుగ్రహం చూపిస్తాడు. 

వయసు మీరిన కొద్దీ ఏవో బాధలు, సమస్యలుంటాయి. అతన్ని కొలిస్తే అన్నిటి నుండి విముక్తులమౌతాం. అతని మాదిరిగా నవ్వు ముఖంతో ఉంటాం. అతని పేర్లు సుముఖుడని, ప్రసన్న వదనుడని ఉన్నాయి కదా. మనం నిజమైన భక్తిని చూపించగలిగితే మనకూ ఆ ప్రసన్నముఖత్వం వచ్చి తీరుతుంది. 

అందరూ ఆలయాలకు వెళ్ళడం, కొబ్బరి కాయలను కొట్టడం, స్తోత్రాలు చదవటం మొదలు పెడితే ఇంకా గణేశ ఆలయాలను కట్టవలసి వస్తుంది. 

కొందరు కొత్తగా వినాయక ఆలయాలను కడుతున్నారని హడావిడి చేస్తారు. ఒక్కొక్కప్పుడు కొత్త విగ్రహాన్ని కట్టడానికి బదులు ఎక్కడిదో దొంగిలించుకొని వచ్చి కట్టారనే మాట వినిపిస్తూ ఉంటుంది. అసలు దొంగతనం కూడదు కదా! అందులో దేవతా విగ్రహాన్నా? ఆ మాట ఎందుకు వచ్చింది? దొంగిలిస్తారని, అంటే అక్కడి ప్రజలింకా అప్రమత్తులై ఉంటారు కదా. అట్టి జాగరూకత ఉండాలనే హితబోధ.

Wednesday 2 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (12)



ఒక అందమైన పెట్టి దొరికిందనుకుందాం. అందులో ఎన్నో రత్నాలున్నాయి. దానిని తెరవడానికి మనదగ్గర తాళం చెవులు లేదనుకుందాం. చెవులు లేవని పెట్టెను పారవేస్తామా? తీరా తాళం చెవులు దొరికిన తరువాత బాధపడమా? అట్లాగే ఆమె వ్రాసిన పాట అట్టిది. అందరూ తెలియకపోయినా భద్రపరుచుకోవాలి. అనగా కంఠస్థం చేయాలి. యోగ రహస్యాలున్న పాటలు అర్థం కాకపోయినా భక్తితో పాడితే ఆ స్వామియే ఏ నాటికో తెలియపరుస్తాడు.

అందరికీ ఇష్ఠుడు అన్నాను కదా, శివునికి సంబంధించిన ఈశ్వర లింగం, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, విష్ణ్వాలయంలో ఉండవు. కాని వినాయక ప్రతిమలు మాత్రం ఉంటాయి. ఆయన శివ కుటుంబానికి చెందిన వాడైనా! గమనించారా! అతన్ని తమిళంలో తుంబిక్కై ఆళ్వార్ అని అంటారు. కనుక అతని అందరూ ఆదరిస్తారని తేలింది కదా! 

అందువల్లనే జైన బౌద్ధ ఆలయాల్లోనూ అతణ్ణి కొలుస్తారు. ఈశ్వర లింగం తమిళనాడులో మాదిరిగా ఊరూర, వీథివీథినా మిగతా ప్రాంతాలలో ఎక్కువగా కనబడకపోయినా ఈ విశాల భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈయన మూర్తులుంటాయి. ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చి భక్త్యావేశంతో గణపయ్య కన్యాకుమారిలో ఉన్నాడు, హిమాలయాల్లో ఉన్నాడని అన్నాడు. 

మన దేశంలోనే కాదు, జపాన్, మెక్సికో, ఇంకా ఎన్నో దేశాలలో ప్రత్యక్షమౌతాడు. ప్రపంచంలో చాలా దేశాలు ఎక్కడో ఒకచోట సాక్షాత్కరిస్తూనే ఉంటాడు.


Tuesday 1 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (11)



యోగశాస్త్రం ఉంది కదా. అది నరాలపై ప్రభావాన్ని చూపుతుంది. నరాలను శుద్ధి చేసే ప్రక్రియ నందిస్తుంది. ప్రాణాయామం ఎట్లా చేయాలి, ఎట్లా మన శరీరాన్ని వంచి ఆసనాలెట్లా వేయాలో చెప్పి నాడీ శుద్ధిని నేర్పుతుంది. ఆ శ్రమ లేకుండా అప్రయత్నంగా స్వామికి నమస్కరించేటపుడు చేతులు ఫాలభాగాన్ని తాకుట, చేతులు చెవులను స్పృశించుట, గుంజీళ్ళు  తీయుట మొదలగు వాటివల్ల నరాలలో ఒక చైతన్యం కలిగి మనలో అనుకూల భావాలేర్పడతాయి. మనకు శ్రద్ధా విశ్వాసాలుంటే మనమీ మార్పులను గమనించవచ్చు కూడా. 

అవ్వైయార్ పిల్లలకై పాటలు వ్రాసినా కొన్ని పాటలు యోగ రహస్యాలతో ఉంటాయి. పెద్దలే అర్థం చేసుకోలేని రీతిలో గూఢార్థం ఉంటాయి. తమిళంలో వాటిని వినాయకర్ అవగల్ అంటారు. సూక్ష్మంగా అవగల్ స్తోత్రమంటారు. 

ఆమె వ్రాసిన స్తోత్రం చదివితే ఆమె, వినాయకుడు ఇద్దరూ గుర్తుకు వస్తారు. ఈ స్తోత్రాన్ని గుడికి వెళ్ళి చదవండి.

అందరూ స్వామికి చెందినవారే. అందరికీ ఆయన చెందినవాడే. శాస్త్రాలు చదువని సామాన్యునకూ అందుబాటులో ఉంటాడు. మిగతా ఆలయాలలో ప్రసాదాన్ని పంచి పెట్టేటప్పుడు ముందుగా పెద్దలకు ఇస్తూ ఉంటారు. కానీ స్వామి ముందు కొట్టిన కొబ్బరి ముక్కలు పిల్లలకూ, బీదలకే. అర్ధమయినా కాకపోయినా ఆమె స్తోత్రాలను చదవండి.

(అని తమిళనాడు భక్తులకు హితబోధ చేసారు స్వామి. తెలుగులోని పాటలు పద్యాల్ని మనం చదవవచ్చు).