Sunday 25 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 7వ భాగము



గురు పరంపర

ఆధ్యాత్మిక జ్ఞానం అనేది గురు పరంపరకు చెందిన విషయము. అది గురువు నుంచి శిష్యునకు అందుతుంది. గౌడపాదాచార్యుల వారు ఆత్మవిద్యను తన శిష్యుడైన గోవిందాచార్యులకు ఇచ్చారు. గోవిందాచార్యులు తన శిష్యుడైన శంకరాచార్యులకు అందించారు; శంకరాచార్యులు తన శిష్యుడైన సురేశ్వరాచార్యులకు అందించారు; మస్త్యేంద్రనాథుడు తన శిష్యుడైన గోరఖ్‌నాథునకు జ్ఞాన బోధ చేశారు. గోరఖ్‌నాథుని నుంచి నివృత్తినాథునకు, నివృత్తినాథుని నుంచి జ్ఞానదేవునకు వచ్చింది. శ్రీ రామకృష్ణ పరమహంసకు తోతాపురి గారు జ్ఞానం అందించారు. మరియు శ్రీ రామకృష్ణులు స్వామి వివేకానంద ఇచ్చారు. జనక మహారాజు యొక్క జీవితాన్ని మలిచిన వారు మహర్షి అష్టావక్రుడు. గోరఖ్‌నాథుడే రాజా భర్తృహరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించారు. తమ మనస్సులు చంచల స్థితిలో ఉండగా, శ్రీ కృష్ణభగవానుడు అర్జునుడు మరియు ఉద్ధవుడు ఆధ్యాత్మికపథంలో నిలదొక్కుకునేలా చేశారు.

ఉపదేశము/ దీక్ష - దాని యొక్క అర్ధము

భక్తునికి భక్తిమార్గంలో ఉన్న గురువు భక్తి యోగంలోకి దీక్ష ఇస్తారు. వేదాంతం నేర్చుకునే విద్యార్థికి మహా వాక్యాలను జ్ఞాని ఉపదేశిస్తారు. హఠయోగి లేదా రాజయోగి ఇంకొకరిని తన మార్గంలో దీక్ష ఇచ్చి తీసుకువస్తారు. కానీ నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి, పూర్ణ జ్ఞాని లేదా పూర్ణ యోగి, ఏ మార్గంలోకైనా దీక్ష ఇవ్వచ్చు. శ్రీ శంకరాచార్యులు లేదా శ్రీ మధుసూదన సరస్వతి వంటి మహా పురుషులు ఒక సాధకుడిని, తాను ఏ మార్గానికి తగినవాడో, ఆ మార్గంలోకి దీక్ష ఇచ్చి ప్రవేశపెడతారు. గురువు తన శిష్యుడు లేదా సాధకుని యొక్క అభిరుచులు, స్వభావము మరియు శక్తిసామర్ధ్యాలను దగ్గరగా పర్శీలించి, అతనికి అత్యంత తగిన మార్గం నిర్ణయిస్తారు. అతని హృదయం అపవిత్రంగా ఉంటే కొన్నేళ్లు నిస్వార్థ సేవ చేయమని అతడిని గురువు ఆదేశిస్తారు. అప్పుడు ఆ విద్యార్ధికి తగిన మార్గం గ్రహించి, అతనికి ఆ మార్గంలో దీక్ష ఇచ్చి ప్రవేశపెడతారు. 

దీక్ష ఇవ్వడం లేదా ఉపదేశించడం అంటే మంత్రాన్ని చెవిలో చదవడం కాదు. రామ అనే వాడు కృష్ణుని యొక్క ఆలోచనల వల్ల ప్రభావితమైతే, రామునకు కృష్ణడి నుంచి ఎప్పుడో దీక్ష వచ్చేసిందని అర్ధము. ఒక మహాపురుషుడు రాసిన పుస్తకాలను చదివి సత్య మార్గంలో ఒక సాధకుడు పయనిస్తూంటే, అతని యొక్క బోధనలను అనుసరిస్తుంటే, ఆ యోగి అతనికి అప్పటికే గురువు అయ్యాడు.

Monday 19 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 6వ భాగము



శిక్షా గురువులు మరియు దీక్షా గురువులు 
మానవులకు ఈ భూమి మీద రెండు రకాల కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, తన జీవితాన్ని పోషించుకొనుట/రక్షించుకొనుట. రెండవది ఆత్మను తెలుసుకొనుట. తన జీవితాన్ని కాపాడుకోనుట కోసం, ఉదరపోషణ కోసం విద్యాభ్యాసం చేయాలి. తన ఆత్మ సాక్షాత్కారం కోసం, అతను సేవ చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి మరియు ధ్యానం చేయాలి. ఏ గురువు అయితే తనకు భౌతిక ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్పిస్తాడో, ఆయన శిక్షా గురువు. ఆత్మసాక్షాత్కారానికి మార్గం చూపిన గురువు దీక్షా గురువు. అతను నేర్చుకోవడానికి ఇష్టపడినంతవరకు ఒక వ్యక్తికి ఎంతమంది అయినా శిక్షా గురువులు ఉండవచ్చు. కానీ మోక్షానికి తీసుకువెళ్లే దీక్షా గురువు కేవలం ఒక్కరే ఉంటారు. 

ఒకే గురువు కట్టుబడి ఉండుట 
ఒక వైద్యుని వద్ద నుంచి నీవు ఔషధ నిర్ణయాన్ని తెచ్చుకుంటావు. ఇంకొక డాక్టర్ లేదా ఇద్దరు డాక్టర్లును సంప్రదించి, జబ్బు గురించి వారి ఆలోచనలు తెలుసుకుంటావు, లేదా వ్యాధి యొక్క విచారణ మరియు నిర్ధారణ చేసుకుంటావు. ముగ్గురు వైద్యుల దగ్గరికి వెళ్తే నీ చావును నీవే కొని తెచ్చుకుంటావు. అలాగే నీకు అనేక మంది గురువులు ఉంటే, నీవు ఏమీ తోచక కొట్టుమిట్టాడుతావు. అసలు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురి అవుతావు. ఒక గురువు 'సోహం' మంత్ర జపం చేయమని చెబుతారు. ఇంకొకరు 'రామ' నామాన్ని జపించమంటారు. మూడవ గురువు 'అనాహత శబ్దా'న్ని వినమంటారు. నీవు సందిగ్ధానికి లోనవుతావు. ఒక గురువుకు మాత్రమే కట్టుబడి, ఆయన సూచనలను పాటించు. 

అందరు చెప్పేవి విను, కానీ ఒక్కరినే అనుసరించు. అందరినీ గౌరవించు, కానీ ఒక్కరినే ఆరాధించు/పూజించు. అందరి నుంచి జ్ఞానం పొందు, కానీ ఒకే గురువు యొక్క బోధనలను అవలంబించు. అప్పుడు మాత్రమే నీవు వేగంగా ఆధ్యాత్మిక పురోగతిని చూస్తావు.

Sunday 18 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 5వ భాగము



భగవంతుని నుంచి గుహ్యమైన సహాయము 

కొన్ని సందర్భాల్లో భక్తులకు భగవంతుడు ఏ విధంగా సహాయపడ్డాడో చూడు. ఏకనాథుడు ఆకాశవాణి విన్నాడు. అది ఏమన్నదంటే "దేవగిరిలో ఉన్న జనార్ధన పంత్‌ను దర్శించు. ఆయన నిన్ను సరైన మార్గంలో పెట్టి నడిపిస్తాడు". అతను ఆ విధంగా నడుచుకొని తన గురువును పొందాడు. తుకారాం 'రామకృష్ణ హరి' అనే మంత్రాన్ని స్వప్నంలో పొందాడు. ఆయన ఈ మంత్రాన్ని మననం చేసి కృష్ణ దర్శనం పొందాడు. శ్రీకృష్ణుడు నామదేవుడిని తన యొక్క దీక్ష కోసం మల్లికార్జున దగ్గరున్న సన్యాసిని దర్శించమని ఆదేశించాడు. రాణి చూడాలి 'కుంభ ముని' రూపాన్ని పొంది, తన భర్త అయిన సిఖద్వజుని ముందు అడవిలో కనిపించి, కైవల్యం యొక్క రహస్యాలను అతనికి ఉపదేశించింది. మధురకవి మూడు రోజులపాటు ఆకాశంలో కాంతిని చూసాడు. అది అతనికి మార్గదర్శనం చేసి, తిన్నేవెలిలో చింత చెట్టు కింద సమాధిలో కూర్చున్న తన గురువైన నమ్మాళ్వార్ వద్దకు తీసుకెళ్ళింది. బిల్వమంగళుడు నాట్యగత్తె, చితామణిని చూసి బాగా ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆమయే అతనికి గురువయ్యింది. తులసీదాసు అగోచరమైన ఒక జీవి (బ్రహ్మరాక్షసుడు) ద్వారా సూచనలు పొంది హనుమంతుని దర్శనం పొందగలిగాడు. హనుమంతుని ద్వారా, అతనికి రాముని దర్శనం.

అర్హత కలిగిన శిష్యునకు సద్గురువును అన్వేషించే పరిస్థితికి ఎన్నడూ తలెత్తదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవులు అరుదైనవారు కాదు. సామాన్యమైన అజ్ఞానంతో కూడిన మనస్సు గల వ్యక్తులు వారిని సులువుగా గుర్తించలేరు. కేవలం కొందరు వ్యక్తులు, ఎవరైతే శుద్ధమై, సర్వ సద్గుణాలను కలిగి ఉంటారో, వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిని అర్థం చేసుకుని, వారి సాన్నిధ్యం వలన లాభం పొందగలరు. 

ఆత్మసాక్షాత్కార పథంలో పోరాడుతున్న లేదా శ్రమిస్తున్న జీవులకు మార్గదర్శనం చేయుటకు ఈ ప్రపంచం ఉన్నంతవరకు గురువులు మరియు వేదాలు ఉంటాయి. సత్యయుగం తో పోల్చుకుంటే కలియుగంలో జ్ఞానోదయం పొందిన జీవుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. కానీ సాధకులకు సహాయం చేయటానికి వారు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రతి వ్యక్తి తన శక్తి సామర్ధ్యాలు, స్వభావము మరియు అవగాహన శక్తికి తగిన మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గంలో అతను తన సద్గురువు కలుస్తాడు.

Tuesday 13 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 4వ భాగము



గురువును అన్వేషించుట

ఒక మహాత్ముని సాన్నిధ్యంలో నీకు మనశ్శాంతి దొరికితే, అతని ప్రవచనాల వలన నీలో ప్రేరణ కలిగితే, అతను దురాశ, కోపం మరియు లౌల్యము నుంచి విముక్తుడై ఉంటే, అహంకారరాహిత్యం, స్వార్థంరాహిత్యం మరియు ప్రేమ కలిగి ఉంటే, అతన్ని నీవు గురువుగా స్వీకరించవచ్చు. ఎవరైతే నీకు కలిగే సందేహాలను నివృత్తి చేయగలరో, నీ సాధన పట్ల సానుభూతి చూపగలరో, నీ నమ్మకాలను భంగ పరచకుండా నీ స్థాయి నుంచే నీకు సహాయం చేయగలడో, ఎవరి యొక్క సాన్నిధ్యము చేతనే నీవు ఆధ్యాత్మికంగా ఉన్నతిని అనుభూతి చెందగలవో - అతనే నీ గురువు. ఒక్కసారి నీ గురువును ఎంచుకున్న తర్వాత, పరిపూర్ణంగా ఆయననే అనుసరించు. భగవంతుడు నిన్ను గురువుగారి ద్వారా నడిపిస్తాడు. 

గురువులు ఎంచుకోవడంలో అధికంగా నీ బుద్ధిని ఉపయోగించకు. ఒకవేళ నీవు గనక అలా చేస్తే నీవు విఫలమవుతావు. ఉన్నతమైన గురువును పొందడంలో విఫలమైతే, కొన్నేళ్లుగా సాధనాపథంలో నడుస్తూ, పరిశుద్ధత మరియు ఇతర సద్గుణాలు కలిగి, శాస్త్రాల పట్ల కొంత జ్ఞానం కలిగిన సాధువు దగ్గరికి వెళ్లి, అతని సూచనలను అనుసరించే ప్రయత్నం చెయ్యి. ఎలాగైతే ఎం.ఏ. పట్టా కలిగిన ఆచార్యుడు అందుబాటులో లేనప్పుడు, ఇంటర్మీడియట్ విద్యార్థి మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి చదువు చెప్పగలడో, ఎలాగైతే సివిల్ సర్జన్ లేని సమయంలో అతని సబ్-అసిస్టెంట్ సర్జన్ రోగి బాగోగులు చూడగలడో, అలాగే మొదటి శ్రేణి గురువు నీకు లభించనప్పుడు ఈ రెండవ శ్రేణి గురువు నీకు సహాయం చేయగలరు.

నీవు కనీసం ద్వితీయ శ్రేణి గురువులు కూడా పొందలేని పక్షంలో ఆత్మసాక్షాత్కారం పొందిన జగద్గురు ఆదిశంకరులు, దత్తాత్రేయ మరియు ఇతర మహాత్ములు రాసిన పుస్తకాలలో చెప్పిన బోధనలను అనుసరించవచ్చు. జీవన్ముక్తుడైన లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన అటువంటి గురువుల యొక్క చిత్తరువు/చిత్రపటం నీ లభ్యమైతే, నీ ముందు ఉంచుకొని దానిని భక్తివిశ్వాసాలతో పూజించు. క్రమంగా నీకు ప్రేరణ కలుగుతుంది, మరియు రైన సమయంలో గురువు స్వప్నంలో కనిపించి, దీక్ష ఇచ్చి, ప్రేరణ కలజేస్తారు. నిజాయితీగల సాధకులకు సహాయం అనేది చాలా గుహ్యమైన రీతిలో వస్తుంది.

Sunday 11 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 3వ భాగము




గురువు యొక్క అవసరము 

ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించేవాడికి గురువు అవసరము. ఎలాగైతే ఒక దీపాన్ని వెలిగించాలంటే, అంతకు ముందు నుంచే వెలుగుతున్న మరో దీపం ఎలా అవసరమో, అలాగే జీవుని జ్ఞానోదయానికి, జ్ఞానోదయం చెందిన వేరొక జీవుడు అవసరము. 

కొంతమంది స్వంతంగా ఏళ్ల తరబడి ధ్యానం చేస్తారు. ఆ తర్వాత, వాళ్లు గురువు యొక్క అవసరం ఉందని తెలుసుకుంటారు. మార్గంలో వాళ్లకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఆటంకాలు లేదా విఘ్నాలను నివారించడం లేదా దాటడం ఎలాగో వారికి తెలియదు. అప్పుడు వారు గురువు కోసం అన్వేషణ ప్రారంభిస్తారు.

బద్రీనాథ్ చూసిన వ్యక్తి మాత్రమే బద్రీనాథ్ చేరటానికి వెళ్లే మార్గం చెప్పగలరు. అలాగే ఆధ్యాత్మిక పథంలో, మార్గం తెలుసుకోవడం మరింత కష్టము. మనసు నిన్ను ఎన్నోసార్లు పక్కదారి పట్టిస్తుంది. గురువు మార్గంలో ఉన్న ఆటంకాలను, గోతులను తొలగించి సరైన మార్గంలో ముందుకు వెళ్లేలా చేయగలరు. "ఈ మార్గము మోక్షానికి చేరుస్తుంది. ఇది బంధానికి కారణం అవుతుంది" అని గురువు నీకు చెబుతారు. ఈ మార్గదర్శనం లేకుండా బద్రీనాథ్ చేరాలనుకుంటే, నీవు ఢిల్లీ చేరుకున్నట్లు తెలుసుకుంటావు.

గ్రంథములు అనేది అరణ్యం వంటివి. వాటిలో గందరగోళానికి గురి చేసే ఎన్నో భాగాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉంటాయి, మరియు కొన్నిటికి నిగూఢమైన అర్ధాలు, బహువిధములైన ప్రముఖత, మరియు బయటకు చెప్పని/ దాచబడిన వివరణలు ఉన్నాయి. ఒక గ్రంథంలో చెప్పబడిన విషయానికి వివరణ వేరొక గ్రంథంలో దొరుకుతుంది. వీటి యొక్క సరైన అర్ధాన్ని నీకు వివరించేందుకు, నీలో ఉన్న సందేహాలను, గందరగోళాన్ని తొలగించేందుకు, వాటిల్లో చెప్పబడిన విషయాలు నీ ముందు ఉంచేందుకు, నీకు గురువు అవసరము. 

గురువు అనే వాడు ఆధ్యాత్మిక పథంలో ఉన్న ప్రతి ఒక్క సాధకునికి ఖచ్చితంగా అవసరము. గురువు మాత్రమే నీలోని దోషాలను పసిగట్టగలరు. అహంకారం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే నీ లోని లోపాలను నీవు గుర్తించలేవు. ఎలాగైతే ఒక వ్యక్తి తన వెనుక భాగాన్ని అనగా వీపును చూడలేడో, అలాగే తన సొంత తప్పులను తాను తెలుసుకోళేడు. తనలో ఉన్న దుర్గుణాలను, దోషాలను తొలగించుకోవడానికి అతనికి గురువు దగ్గర ఉండటం జీవించడం అవసరము.

గురువు యొక్క నీడలో ఉన్న సాధకుడు ఏనాడు దారితప్పకుండా (పథభ్రష్టుడు కాకుండా) సురక్షితంగా ఉంటాడు. గురువుతో సత్సంగము అనేది భౌతిక ప్రపంచం యొక్క అన్ని రకాల ఆకర్షణలు మరియు ప్రకూల శక్తుల నుంచి కాపాడే కవచము మరియు కోట వంటిది.

గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండా పరిపూర్ణత పొందిన వారిని ప్రమాణంగా చూపి, గురువు అవసరం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే అలాంటి వారు సాధారణమైన వారు కాదు. ఆధ్యాత్మిక జీవితంలో వారు అసాధారణమైన వారు. గత జన్మల్లో వారు ఎంతో తీవ్రంగా చేసిన శుశ్రూష (గురుసేవ), అభ్యాసం మైర్యు ధ్యానం కారణంగా ఈ జన్మలో వారు ఆధ్యాత్మిక గురువులుగా అవతరించారు. వారంతా ఇంతకముందే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఈ జన్మ అనేది గత జన్మ నున్చి వచ్చిన అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక పరిణామం మాత్రమే. కాబట్టి గురువు యొక్క ప్రముఖతను తగ్గించకూడదు. 

కొందరు బోధకులు సాధకులను తప్పు ద్రోవ పట్టిస్తారు. "మీ గురించి ఆలోచించండి. ఏ గురువును శరణం వేడకండి" అని వారు అంటారు. ఎవరైనా గురువులను అనుసరించవద్దు అని చెబితే వాడు శ్రోతలకు చెప్పేదేంటంటే, తానే గురువని నర్మగర్భంగా చెబుతున్నారు. అలాంటి దొంగ గురువుల దగ్గరకు వెళ్ళకండి. వారి మాటలను వినకండి.
\మహాత్ములందరికీ గురువులు ఉన్నారు. ఋషులు, మునులు, దేవదూతలు, జగద్గురువులు, అవతారాలు, మహా పురుషులన్దరికీ వారెంత గొప్ప వారైనా, వారికి గురువులు ఉన్నారు. శ్వేతకేతు సత్యం యొక్క తత్వాన్ని ఉద్దాలక మహర్షి నుంచి, మైత్రేయుడు యాజ్ఞవల్కుని నుంచి, నారదుడు సనత్కుమారుని నుంచి, భృగువు వరుణుని నుంచి, నచికేతుడు యముని నుంచి, ఇంద్రుడు ప్రజాపతి నుంచి నేర్చుకున్నారు; మరియు మరింకెందరో వినయంగా జ్ఞానుల వద్దకు వెళ్లారు. కఠోర బ్రహ్మచర్యం, తీవ్రమైన క్రమశిక్షణతో కూడిన సాధన చేసి వారి నుంచి బ్రహ్మవిద్యను పొందారు. కృష్ణ భగవానుడు తన గురువు అయినా సాందీపాని మహర్షి పాదాల వద్ద కూర్చున్నారు. రామునకు ఉపదేశం చేసి వశిష్టుడు గురువు అయ్యాడు. దేవతలు కూడా బృహస్పతిని గురువుగా కలిగి ఉన్నారు. గొప్ప దివ్య జీవులు, దేవతలు సైతం గురువు దక్షిణామూర్తి పాదాల వద్ద కూర్చున్నారు. 

ఆధ్యాత్మికతను కొత్తగా ప్రారంభించిన వానికి మొట్టమొదటగా వ్యక్తిగత గురువు అవసరము. దైవాన్ని అతడు గురువుగా భావించి సాధన ప్రారంభించలేడు. అతనికి శుద్ధమైన మనస్సు ఉండాలి. నైతికమైన పరిపూర్ణత ఉండాలి. అతను ఎంతో పుణ్యశాలి అయి ఉండాలి. అతను దేహాత్మ భావనకు పై స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే అతను భగవంతుడిని గురువుగా కలిగి ఉండవచ్చు.

Saturday 10 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 2వ భాగము

మొదటి అధ్యాయము 

గురువు యొక్క పాత్ర 

అఙ్ఞానతిమిరాంధస్య ఙ్ఞానాంజనశలాకయా |చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || 

అజ్ఞానమనే అంధకారంతో మూసుకొని పోయిన కళ్ళకు, జ్ఞానమనే అంజనం పూసి, సత్యాన్ని చూపి, అజ్ఞానం నుంచి బయటకు తీసుకువచ్చే గురువునకు నమస్కారములు- గురు గీత

గురువు అనే వాడు జీవునకు దేవునికి మధ్య ఉన్న నిజమైన లంకే/సంబంధము. అతను (తత్త్వమసి - అదే నువ్వు అనే మహావాక్యంలో చెప్పిన) ఇది(జీవుడు) నుంచి అది(ఈశ్వరుడు) కి చేరిన వాడు కనుక అతనికి రెండు లోకాలతో స్వచ్ఛమైన, నిరాటంకమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అతను నిత్యమైన, అమరమైన భగవంతుని ముందు నిల్చుని ఉంటూనే, క్రిందకు వంగి, ఒక చేత్తో శ్రమపడుతున్న జీవులను పైకి ఎత్తుతారు. ఇంకో చేత్తో వారిని నిరతిశయ ఆనందానికి, సచ్చిదానంద భూమిక తీసుకువెళ్తారు.

సద్గురువు


కేవలం పుస్తక పఠనమే వ్యక్తిని గురువు స్థాయికి తీసుకువెళ్లదు. ఏ వ్యక్తి అయితే వేదాలను చదివాడో మరియు అనుభవం ద్వారా, అపరోక్షానుభూతి ద్వారా ఆత్మను తెలుసుకున్నాడో, అతను మాత్రమే గురువుగా చెప్పబడతాడు. జీవన్ముక్తుడు లేదా ముక్తుడైన మునియే నిజమైన గురువు. అతడే సద్గురువు. అతడు బ్రహ్మముతో సమానమైనవాడు, బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు.

కేవలం సిద్ధులు పొందినంత మాత్రం చేతనే ఒక యోగి గొప్పవాడని లేదా అతను ఆత్మసాక్షాత్కారం పొందాడని ప్రకటించడానికి వీలులేదు. సద్గురువులు ఎలాంటి మహిమలు గాని, సిద్ధులు గాని చూపరు. కొన్నిసార్లు అలౌకికమైన విషయాలు ఉన్నాయని సాధకుడిని ఒప్పించేందుకు, వారి మనసులో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు, వారు వాటిని ప్రదర్శించవచ్చు. సద్గురువు లెక్కలేనన్ని సిద్ధులు కలిగి ఉంటారు. ఆయన దైవికమైన సకల ఐశ్వర్యాలను, దైవీసంపదను కలిగి ఉంటారు. 


సద్గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. ఆయన ఆనంద, జ్ఞాన మరియు దయాసముద్రుడు. ఆయన జీవులకు అధిపతి, ముందుకు నడిపించువాడు, నాయకుడు, నావికుడు. ఆయన ఆనందానికి మూలం స్థానము. ఆయన మీ యొక్క సకల బాధలను, దుఃఖాలను మరియు ఆటంకాలను తొలగిస్తారు. ఆయన మీకు సరైన దైవికమైన మార్గము చూపుతారు. ఆయన మీ యొక్క అజ్ఞానమును చింపివేస్తారు. ఆయన మిమ్మలిని అమరులుగా, దైవంగా మార్చుతారు. ఆయన మీ లోని నీచమైన మరియు పాపిష్టి ప్రకృతిని మార్చివేస్తారు. ఆయన మీకు జ్ఞానమనే తాడును ఇచ్చి, సంసారమనే సముద్రంలో మునిగిపోకుండా రక్షిస్తారు. ఆయనను కేవలం ఒక మనిషిగా భావించకండి. మీరు గనక ఆయన్ను మనిషిగా భావన చేస్తే, మీరు ఒక పశువుతో సమానము. మీ గురువును పూజించి, గౌరవంతో ఆయనకు నమస్కరించండి.

గురువే దేవుడు. గురువు నుంచి వచ్చిన వాక్కు భగవంతుని వాక్కే అయివుంటుంది. ఆయన ఏమీ బోధించవలసిన పనిలేదు. కేవలం ఆయన సమక్షంలో ఉండడమో లేదా ఆయనతో సంగం కలిగి ఉండడమే వ్యక్తిని ఉద్ధరిస్తుంది, ఉన్నతమైన ఆశయ సాధన దిశగా ప్రేరేపిస్తుంది, నిద్రాణమైన శక్తులను కదిపి లేపుతుంది. గురువు సమక్షంలో ఉండటమే జ్ఞానోదయము. ఆయన సంగం/ సమక్షంలో ఉండటమే ఆధ్యాత్మిక విద్యాభ్యాసము. గురు గ్రంథ సాహిబ్ చదవండి. గురువు యొక్క గొప్పతనం మీకు తెలిసి వస్తుంది. 

మనిషి ఇంకో మనిషి నుంచి మాత్రమే నేర్చుకోగలడు. అందుకే భగవంతుడు గురువు రూపంలో బోధ చేస్తాడు. నీవు అలవర్చుకోవలసిన మానవుని యొక్క పరిపూర్ణమైన ఆదర్శమే నీ గురువు. నిన్ను నువ్వు ఏ విధంగా మలుచుకోవాలి అనేదానికి గురువు అనేవాడు ఒక నమూనా వంటివాడు. అటువంటి గొప్ప జీవాత్మను పూజించి, గౌరవించడానికి నీ మనస్సు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 


గురువే మోక్షద్వారము. సర్వోత్కృష్టమైన సచ్చిదానంద తత్వానికి ఆయనే ప్రవేశమార్గము, సింహద్వారము. కానీ సాధకుడు దాని ద్వారా లోనికి ప్రవేశించాలి. గురువు అనే వాడు సాయం అయితే, ప్రయోగాత్మకమైన సాధన అనే అసలు కార్యాన్ని ఆచరించాల్సిన బాధ్యత సాధకుని మీదే ఉంటుంది.

Friday 9 August 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 1వ భాగము

చాలామంది మంత్రం ఉపదేశించమని అడుగుతున్నారు. మంత్రాన్ని మంత్రసిద్ధి పొందిన గురువు మాత్రమే ఇవ్వగలరు. కొందరు గురువు దగ్గరకు ఎందుకు వెళ్ళాలని, గురువు ప్రాముఖ్యత ఏమిటని అడుగుతున్నారు. వాటన్నిటికి సమాధానంగా స్వామి శివానంద గారు రాసిన గురు తత్త్వ అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి పోస్ట్ చేద్దామని అనిపించింది. అందుకని విఘ్నేశ్వరుడిని తల్చుకుని, ఈ కార్యము ప్రారంభిస్తున్నాను. 

-------------------------



ముందుమాట

ఆధ్యాత్మిక గురువు గురించి ఎంతో రాసినప్పటికీ, అతి ముఖ్యమైన ఈ విషయంలో ప్రజల్లో ఇంకా గందరగోళం, అపార్థము, అనుమానము నెలకొని ఉన్నాయి.

ఒక గురువు అత్యవసరమా? ఎవరు సద్గురువు? గురువు తన శిష్యునికి ఎంత మేర సహాయం చేయగలరు? శిష్యుని యొక్క కర్తవ్యం ఏమిటి? దీక్ష/ శిష్యత్వానికి అర్థం ఏమిటి? వీటి గురించి స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం దొరకక చిత్తశుద్ధి గల సాధకుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఆగి పోతున్నది. 

ఇలాంటి పరిస్థితులలో సద్గురు శివానంద జీ మహారాజ్ గారి పుస్తకం ఎంతోమందికి వరం వంటిది. ఈ లోపలి పేజీల్లో పాఠకుడు, గురుశిష్య సంబంధం గురించి ఎన్నో ప్రామాణికమైన, సంక్షిప్తమైన మరియు సాహసోపేతమైన విశదీకరణలు చూస్తాడు. 

ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక తృష్ణ గల స్త్రీపురుషుల యొక్క మేలు కొరకు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మరియు బ్రహ్మవిద్యా గురువుయొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు వారన్దరిపై ఉండుగాక.

- ది డివైన్ లైఫ్ సొసైటీ