Showing posts with label పర్యావరణం / Ecology. Show all posts
Showing posts with label పర్యావరణం / Ecology. Show all posts

Saturday, 30 May 2020

మన వాహనాలు పార్క్ చేసుకోవడానికి చెట్ల నీడ కావాలి, కానీ ఒక్కరం కూడా చెట్టు నాటము.



మన వాహనాలు పార్క్ చేసుకోవడానికి చెట్ల నీడ కావాలి, కానీ ఒక్కరం కూడా చెట్టు నాటము. పోనీ ఎవరన్నా నాటినా వాటికి నీళ్ళు పోయము సరికదా, నరికేస్తాము. 40° ఎండ కాస్తోంది.. బయటకు వెళితే మొహం మాడిపోయేలా ఉంది.... లాక్‌డౌన్ అని ఇంట్లో ఉన్నా వేడి భరించలేకపోతున్నాము. ఇక బయట కూరగాయలు, పళ్ళు అమ్ముకునేవారి సంగతి ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా కాలనీల్లో పెద్ద పెద్ద రోడులు, అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి కానీ ఒక చెట్టు కూడా కనిపించదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సేద తీరే అవకాశం కూడా ఉండదు. కనీసం ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మనిషికి ఒక మొక్క చొప్పున నాటి, రక్షించాలని తీర్మానం చేసుకుందాము. మనం నాటిన చెట్లు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ వాటి నీడన ఎవరైనా సేద తీరితే మనకు కలిగే ఆ సంతృప్తే వేరు.

Note: నేను ఊరకే నీతులు చెప్పడంలేదు, నేను గత 6 ఏళ్ళ నుంచి ఏడాదికి కనీసం ఒక మొక్కైనా నాటి వాటి సంరక్షిస్తున్నాను. ఆ తర్వాతే మీకు చెబుతున్నాను. (బాగా ఎదిగి ఫలాలు లభించే సమయానికి వాటిని కొందరు అజ్ఞానులు కొట్టేసారు, అది వేరే విషయం). అయినా నేను మొక్కలు నాటడం ఆపను.

Friday, 29 May 2020

ఒక వేప చెట్టు పది ఏసీలకు సమానం - వేపమొక్కలు నాటుదామా ?



2007 లో వార్తపత్రికలో చదివినట్లు గుర్తు. అప్పట్లో మన దేశానికి చైనా అధ్యక్షుడు పర్యటనకు వచ్చినప్పుడు వేప చెట్ల గురించి తెలుసుకుని ఓ పది లక్షల వేప చెట్లు తమ దేశానికి ఎగుమతి చేయమన్నాడట. అవన్నీ చైనాలో నాటుకోవడంతో పాటు ఒక విప్లవంగా 2.2 కోట్ల వేప మొక్కలు నాటించారు. చైనాలో వ్యవసాయం మరియు మొక్కల పెంపకంలో వచ్చే చీడపీడల నివారణకు వీటిని ఉపయోగిస్తారట. వేప చెట్టు పుట్టిల్లు భారతదేశం, అనాదిగా మన దేశంలో ఆయుర్వేదంలో వేపను ఉపయోగిస్తున్నాము. కానీ 1995 లో అమెరికా వేప మీద పేటెంట్ హక్కులు తీసుకోగా, భారత్ పోరాడి రద్దు చేసింది. మరలా చైనా కూడా పేటెంట్ పేరుతో జీవయుద్ధం (బయోవార్) చేయడానికి పూనుకుంది.

ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొంచ్చిందంటారా ? బయట ఎండలు మండిపోతున్నాయి. అసలు ఎప్పుడూ ఇలాంటి ఎండలు చూసి ఉండలేదు మనము. డబ్బున్న వారు ఏసీలు వాడుతున్నారు, కొందరు కూలర్లు ఉపయోగిస్తున్నారు.ఏమీ లేనివారు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. మన బాధ చెప్పుకోవచ్చు కానీ జంతువులు, పక్షులు మొదలైన జీవుల సంగతి ఏంటి ? ఒక వేప చెట్టు పది ఏసీలకు సమానమని అప్పట్లో తేలింది. చైనా దీని మీద ఆశ కనబరచడానికి ఇది కూడా ఒక కారణం. కనీసం ఊరికో రావి చెట్టు, వీధికో వేప చెట్టు ఉండాలని నానుడి. అప్పుడే ఆరోగ్యం. కానీ ఇవాళ చాలా వీధుల్లో అసలు చెట్లే కానరావు. మొత్తం సిమెంట్ చేసిన వాకిళ్ళే. మట్టి కనిపిస్తే కదా. మనము సైతం వేప మొదలైన ఓషధీ వృక్షాలా ప్రముఖతను* గుర్తించి ఉంటే, ఇంత వేడి భరించే స్థితి రాకపోవును. ఓషధీ యుక్తమైన గాలి పీలిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు కూడా రావు. (*సంస్కృత వ్యాకరణ పండితులు చెప్పే విషయం - ప్రముఖత సరైన పదప్రయోగం - ప్రాముఖ్యత తప్పుడు ప్రయోగం).

ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఏడు వర్షాకాలం రాగానే కనీసం మనిషికి ఒక మొక్క నాటుదాము. కుటుంబానికి ఒక వేప మొక్క నాటి సంరక్షిద్దాము. వేప అంటే లక్ష్మీదేవి. వేప మొక్కను నాటి, నీరు పోసి సంరక్షిస్తే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏమంటారు ?

నేను ఊరికే నీతులు చెప్పడంలేదు. 2014 నుండి ప్రతి ఏడు మొక్కలు నాటుతున్నా.

Tuesday, 12 May 2020

మామిడి చెట్లు నరికితే బ్రహ్మహత్య దోషం - రావణసంహిత

ఈ వేసవిలో మనం ఎన్నో పళ్ళు తింటున్నాము. ఈ ఋతువులు మనకు మామిడి, సపోటా వంటి చాలా ఫలాలు లభిస్తున్నాయి. అవే గాక నిత్యం మనమెన్నో కాయగూరలు, పండులు తింటాము, కుంకుడుకాయలు వాడతాము. వాటి విత్తనాలను మనం జాగ్రత్తగా సేకరించవచ్చు. దీనికి శ్రమ కూడా అవసరంలేదు. వేసవి ముగుసి ఋతువుపవనాలు రాగానే ఆ విత్తనాలను ఖాళీ ప్రదేశాల్లో చల్లేస్తే, అవి మొలకెత్తుతాయి. చిన్నపాటి వనాన్ని పెంచే స్థలం లేకపోయినా, కనీసం ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటవచ్చును కదా. ఆలోచించండి...


Saturday, 9 May 2020

తీర్థ యాత్రలకు వెళ్తున్నావా ? అయితే నువ్వు గుర్తుంచుకోవలసిన విషయాలు ...



కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శనను నిషేధించారు. ఈపాటికి జనులంతా ఛార్ ధామ్ యాత్రకు సిద్ధమయ్యేవారు. నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. తిరువణ్ణామలైలో పూర్ణిమ నాడు లక్షలమంది గిరి ప్రదక్షిణం చేస్తారు, కానీ మొన్న పూర్ణిమకు అసలు ఒక్క వ్యక్తిని కూడా అనుమతించలేదు. ఇలాంటిది తామెప్పుడు చూడలేదని అక్కడి జనులు చెబుతున్నారు.

✍️ ఇలాంటి సమయంలో నిజంగా మనం అసలు తీర్థయాత్రలు సక్రమంగా చేస్తున్నామా? అసలు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి మనకు అర్హత ఉన్నదా అని ప్రశించుకోవాలి.

👉 ముందుగా మనం వెళ్ళేది విహారయాత్ర (Tourism) కు కాదని, తీర్థయాత్రకని (Pilgrimage) గుర్తుపెట్టుకోవాలి. పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు విహారస్థలాలు, పిక్నిక్ స్పాట్‌లు కావు. మీరు విహార యాత్రకు వెళ్ళాలంటే ఊటి, కొడైకెనాల్, హార్స్లీహిల్ల్స్ వెళ్ళండి. తిరుమల, అహోబిలం, అరుణాచలం, శ్రీశైలం, ఛార్ ధామ్, అమర్‌నాథ్, కైలాస మనససరోవరాలు మొదలైనవి విహరాస్థలాలు కావు. 

👉 పుణ్యక్షేత్రాలు అడవి మధ్యలో ఉండవచ్చు, అంతమాత్రాన ప్రకృతిని ఆస్వాదించడానికి అక్కడకు వెళ్ళకండి. ప్రకృతిని చూసి ఆనందించండంలో తప్పులేదు గానీ మనం ఆ పేరుతో అక్కడ చేసేదంతా కాలుష్యమే. తిరుమలకు కాలినడకన వెళ్తున్నప్పుడు పక్కన చూస్తే అంతా ప్లాస్టిక్ కవర్లు, నీటి బాటిళ్ళు, స్ట్రాలు కనిపిస్తాయి. అరుణాచలం, అహోబిలంలో కూడా అంతే. తిరుమలలో ప్రతి రాయి వేదమే, ప్రతి చెట్టు ఒక ఋషి, దేవత, సిద్ధపురుషుడే అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అసలు ఆ కొండకే శేషాచలం అని పేరు. ఆ కొండ ఎవరో కాదు ఆదిశేషుడు. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడు. అహోబిలం అంటే గరుత్మంతుడు. అయినా అలాంటి ప్రదేశాల్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము. నిజానికి మనం కలుషితం చేయట్లేదు, దైవదూషణ చేస్తున్నాము, అక్కడి దైవాన్ని అవమానిస్తున్నాము. ఇక ఆ యాత్ర చేసి ఉపయోగం ఏమిటి ? పనిగట్టుకుని వెళ్ళి పాపం మూటగట్టుకోవడం ... 

👉 దేవుడు గుడి లోపలే ఉంటాడు అనుకోవడం మన సంస్కృతి కాదు. అంతటా దైవం వ్యాపించి ఉన్నా, అది మనం తెలుసుకోలేకున్నాము గనక, మనకు ఆ అనుభూతి పొందడానికి తీర్థయాత్ర చేస్తాము. తిరుమల అంటేనే వేంకటేశ్వరుడు, అహోబిలం అంటే నరసింహుడు, అరుణాచలం అంటేనే శివుడు. అక్కడ గుడిలో ఉన్నది ఒక స్థూల రూపమైతే, ఆ క్షేత్రమంతటా ఆ దైవం అధికశక్తితో వ్యాపించి ఉంది. ఛార్ ధామ్ విషయంలోనూ అంతే. మరి మనకు అలాంటి భావన లేనప్పుడు వెళ్ళడమెందుకు ? అక్కడి పరిసరాలను పవిత్రంగా ఉంచలేనప్పుడు ఇంట్లో ఉండి ప్రార్ధించడం ఉత్తమం కాదా ?

👉 అక్కడ మనం చేసే భౌతిక కాలుష్యం ఒక్క దోషమైతే, మానసిక కాలుష్యం ఇంకా పెద్ద దోషం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు రాగద్వేషాలు, కోపతాపాలు పక్కన పెట్టి దైవస్మరణతో యాత్ర చేయాలి. కానీ మనం ఆ ప్రదేశాలకు వెళ్ళినా, అక్కడ కూడా కుళ్ళు, కుతంత్రాలు, కోపము, అహంకారం, దర్పము, అధికారము  ప్రదర్శిస్తాము. అది అక్కడి మానసిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.

👉 తీర్థయాత్రల పేరుతో వ్యాపారం తగదు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే మనం పవిత్ర ప్రదేశాలను వ్యాపారీకరణ (commercialize) చేస్తున్నాము. అది ఎక్కువైతే ఆ క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బ తింటుంది, అక్కడ జరిగే ప్రార్ధనలు ఇంతకముందు వలె శీఘ్రఫలితాలను ఇవ్వలేవు. అక్కడున్న స్థానికులకు ఆ ఆలయాలు జీవనభృతిని కల్పిస్తూ ఉండవచ్చు గానీ ఇప్పుడు వందల కొద్దీ టూరిస్ట్ ట్రావేల్స్ తిర్థయాత్రల పేరుతో చేసేది వ్యాపారమే.. 

👉 గుర్తుంచుకోండి ! ఎక్కడైతే వ్యాపారం మొదలవుతుందో అక్కడ పవిత్రత తగ్గిపోతుంది.

👉 ఛార్ ధామ్, కైలాస మనస సరోవరం, అమర్‌నాథ్ మొదలైన క్షేత్రాలు హిమాలయాల్లో ఉన్నాయి. అవి తపోభూములు. మన పూర్వీకులైన ఋషులు అక్కడ తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. స్వార్ధము, కామక్రోదాదులు వదిలిపెట్టినవారు దర్శించాల్సిన పుణ్యభూములు అవి. భౌతికమైన కోరికలు అడగడం కోసం పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలేదు. మనం కోరికలు అడగటానికి వెళ్ళాలనుకుంటే మనకు దగ్గర్లో అనేక క్షేత్రాలున్నాయి. అక్కడే అడగవచ్చు.

👉 తన యాత్రకు వచ్చే భక్తుడు అనేక కష్టనష్టాలను తట్టుకుని రావాలని, తద్వారా అతనికి మరణభయం తొలగుతుందని అమరనాథుడు చెప్పాడు. కానీ మనకు అసలు కష్టపడటం ఇష్టంలేదు. అందుకే అమర్‌నాథ్ యాత్రకు కాలినడక ఎందుకని హెలికాఫ్టర్‌లో వెళ్తున్నాము. దాని ఫలితంగా అక్కడి వాతావరణంలో వేడి పేరిగి ఆ లింగం ఇంతకముందు వలె ఎక్కువ సమయం దర్శనం ఇవ్వడంలేదు. త్వరగా కరిగిపోతోంది. అయినా మీరు ఎలా రావాలో ఆ క్షేత్ర దైవమే చెప్పినప్పుడు, నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళడమెందుకు ? దైవం ముందు అది బల ప్రదర్శన కాదా? కేదార్‌నాథ్ విషయంలోనూ అంతే. వీలుంటే నడుచుకుంటూ వెళ్ళు, లేదా అక్కడ గుఱ్ఱం ఎక్కు. నువ్వు హెలికాఫ్టర్ లో వచ్చి దణ్ణం పెట్టుకో అని నీకు కేధారనాథుడు చెప్పలేదు. శరీరం సహకరించనప్పుడు అసలు అలాంటి క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి ? అక్కడి ప్రకృతిని ఎందుకు కలిషితం చేయాలి ? 

👉 ఫలాన క్షేత్రం అడవిలో ఉందండీ, దానికి మంచి రోడ్డు లేదు, అక్కడ సెల్ టవర్ లేదు; బిర్యానీలు, కట్‌లెట్‌లు దొరకవు అంటూ నిట్టూర్పులు ఎందుకు ? సుఖం కావాలనుకుంటే ఇంట్లోనే ఉండి, టి.వి.లో చూడు. గుడికి వెళ్ళేది దైవంతో మాట్లాడటానికా? లేక అక్కడి నుంచి నీ పిల్లలతో ముచ్చట్లు పెట్టుకోవడానికా ? అన్ని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఉండచ్చు కదా ? 
 
👉 తిరుమల కొండ మీద కూడా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించి చేసే ఆహారలు అమ్ముతున్నారు. మనకు సాత్త్వికాహరం అని ఒకటుంది. తీర్థయాత్రల్లో తామసిక, రాజసిక ఆహారాలు తినకూడదు. కానీ మనకు తిరుమలలో కట్‌లెట్, ఫ్రైడ్‌రైస్ కావాలి. కేధారనాథ్‌లో అన్నం కావాలి. అంటే మనం ఎక్కడకు వెళ్ళినా, మనకు సకల సౌకర్యాలు ఉండాలి, ఆహారవిహారాల్లో నిగ్రహం పాటించము. అక్కడ దొరికిందేదో సర్దుకుని తినాలని ఉండదు. కానీ మన పూజలు ఫలితమివ్వాలి, యాత్రలు సఫలీకృతం కావాలి. ఎలా సాధ్యం ? 

👉 నదిలో స్నానం చేయాలంటే సబ్బు వాడి నదిని కలుషితం చేస్తావా ? పూజించి దీపాలు వదిలి, అదే నదిలో ఆ పూజ అయిపోగానే ప్లాస్టిక్ కవర్లు విసిరేస్తావా ? కానీ పూజకు ఫలితం వచ్చేయ్యాలా ? మరి చేసిన పాపానికి ?  

👉 ఇప్పుడు హిందూ క్షేత్రాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. పదువులు దక్కని వారందరికీ ఆలయాల్లో పదువులు ఇస్తున్నారు. అక్కడ కూడా రాజకీయాలు. అది మన ఖర్మ.

👉 ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను ప్రభుత్వాలు రక్షించాలి అను నినదించకు. నువ్వు హైందవుడివే కదా ... నీ కర్తవ్యమేంటో అది నువ్వు నిర్వర్తించు. నీ తరఫున పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాల పవిత్రతను కాపాడు. గుర్తుంచుకో ! పవిత్ర ప్రదేశాల్లో మనం చేసే ఏ పనైనా అనేక రెట్ల ఫలితం ఇస్తుంది. అది పాపం అయినా, పుణ్యం అయినా ... 

బహుసా మన పద్ధతి బాగోలేకనే కోవిడ్-19 పేరున భగవంతుడు మనకు తన దర్శనం ఇవ్వడం మానుకున్నాడేమో ?! ఆలోచించండి....

Wednesday, 22 April 2020

కరోనా ప్రకృతి వదిలిన ఒక టీజర్ మాత్రమే... ముందుంది అసలు సినిమా...



ఈ రోజు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం - భూమాత ఎదురుకుంటున్న విపత్తులపై అందరికీ అవగాహన కల్పించడానికి 1970 నుంచి దీన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది నేపథ్యం (థీం/ theme) - క్లైమెట్ యాక్షన్ - భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులపై మనం తీసుకోవాల్సిన చర్యలు, భూమికి అపాయం పొంచి ఉందని ఊరికే చెప్పుకుంటూ కూర్చోవడం కాక, దానికి తగినట్లు చర్యలు చెప్పటాలని చెప్పడమే దీని లక్ష్యం.

ఇప్పుడు మనం కరోనా అనే ఒక వైరస్ తోనే అతలాకుతలం అవుతున్నాము. కానీ ఇదే తరహాలో మనం భూమిని కాలుషితం చేస్తూ పోతే, ఇలాంటి విష వైరస్‌లు అనేకం పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితం చెప్పారు. ఆ మధ్య పుట్టిన డెంగ్యూకు కారణం భూతాపమే (గ్లోబల్ వార్మింగ్). అదేగాక భూమిపై ఇంతకముందున్న విషక్రిములు సైతం జన్యువులను మార్పు (gene mutation) చేసుకుని మరింత శక్తివంతమై ప్రబలుతాయి, ఇప్పుడున్న సూక్ష్మజీవినాశకాలు (యాంటీ-బయోటిక్లు) పని చేయవని అనేక నివేదికలు చెబుతున్నాయి. రేపు కరోనా సంగతి కూడా అంతే. దానికి వ్యాక్సిన్ కనుక్కోవచ్చు కానీ ఆ వ్యాక్సిన్ ఎల్లకాలం పని చేస్తుందని కాదు, కొంతకాలానికి ఆ వ్యాక్సిన్‌ను సైతం తట్టుకునేలా ఇది మళ్ళీ జన్యువుల మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు భూమ్మీదనున్న అనేక వ్యాధికారక క్రిముల పరిస్థితి ఇదే.  

కరోనా అనేది వాతావరణ మార్పులు మనకు చూపిన చిన్న టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.

వైరస్‌లకు ఉన్న ఒకానొక లక్షణం gene mutation. అవి వేగంగా తమ జన్యువులను మార్పు చేసుకోగలవు. మనం వాటికి ఔషధం కనుక్కుంటే, అవి ఔషధాన్ని తట్టుకుని, ఇంకా ఎలా బలపడగలవో చూసుకుంటాయి. మందులు సైతం వాటిని ఏమీ చేయలేనంతగా వాటి జన్యువులను అవి మార్చుకుంటూ ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. దాన్ని సైన్సు ఆపలేదు. ఎందుకంటే అది వాటి లక్షణం. ఇది ప్రతీ శాస్త్రవేత్తకు తెలుసు. 

కరోనా (కోవిడ్-19) సూక్ష్మక్రిమినే పరిశీలించండి. చైనాలో ప్రబలిన దాని జన్యుపటం ఒక విధంగా ఉంటే, ఐరోపాలో వ్యాపించింది ఇంకో విధంగా ఉంది. భారతదేశంలో దాని జన్యుపటం మరోలా ఉంది. అందులో కూడా తబ్లిగీ జమాత్ కు వెళ్ళివచ్చినవారి సోకిన వైరస్ మిగితావారికి సోకినదానికంటే మరింత బలంగా ఉందని వార్తాపత్రికల్లో చూశాము. 

కనుక మనం చేయగలిగినది ఏమైనా ఉంటే, ఇటువంటి వైరస్‌లు కొత్తవి పుట్టకుండా చూసుకోవాలి. అంటే వాతావరణ మార్పులకు కారణమవుతున్న మానవుల చర్యలను పునఃసమీక్షించుకోవాలి. అవసరమైతే మన అభివృద్ధి విధానాలను పూర్తిగా మార్చుకోవాలి. ఇందులో తాత్సారం చేయకూడదు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితులు మరలా మరలా ఉత్పన్నమవుతాయి. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడం జరగని పని, అతడు చేయగలిగింది ప్రకృతితో కలిసి జీవించండం, భూమాతను శరణువేడటం.

హిందువులుగా మనం కూడా ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాలి. మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః అని అధర్వవేదం చెబుతోంది. ఈ భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుడను అని అర్ధం. మన ధర్మం మనకు ఈమె కేవలం భూమి కాదు, భూమాత అని, నేలతల్లి అని చెప్పింది. మరి తల్లికి కీడు చేసేలా మనం బ్రతికితే ఆ బ్రతుక్కి ఒక అర్ధం ఉందా? మనం చేసే పూజలు ఫలిస్తాయా? ఉపాసనలు సిద్ధిస్తాయా ?  

నా అనుభవంతో నేను చెప్పేది ఒక్కటే. మనం ఏ మంత్రోపాసన చేయకున్నా, పెద్ద పెద్ద పూజలు చేయకున్నా, భూమాతకు, ప్రకృతికి హాని కలిగించకుండా జీవించగలిగితే, ముక్తికి అవసరమైన వేదాంతజ్ఞానాన్ని భూమాతయే మనకు అందిస్తుంది. చాలా సులభంగా తీసుకెళ్ళి శ్రీ మన్నారాయణుని ఒడిలో కూర్చోబెడుతుంది. చాలా గారాభంగా చూసుకుంటుంది. 

భూతాపం, వాతావరణ మార్పులు, కాలుష్యం మొదలైనవాటి మీద ఇంతకముందు అనేక విషయాలను సవివరంగా గణాంకాలతో ఫేస్‌బుక్‌తో పాటు మన బ్లాగులో 2013 నుంచి రాశాను. ఈ అంశం మీద అనేక వ్యాసాలు ఉన్నాయి.అవి చూడగలరు. 

Tuesday, 21 April 2020

ఇంతకీ రాక్షసులంటే ఎవరు ? (2)



ఒకప్పుడు రాక్షసులు పాపకర్మలు చేస్తే, ఆ పాపభారం భరించలేక దేవతలందరితో భూదేవి కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి 'స్వామి! పాపభారం మోయలేకపోతున్నాను, దయచేసి అవతరించండి' అని చెప్పినట్లు పురాణాల్లో విన్నాము.

ఇప్పుడు ఆధునిక మానవుడు అంతకు తక్కువేమీ చేయడంలేదు. కొన్ని చూడండి.

ప్రకృతి విద్వంసం కారణంగా ఈ ప్రపంచంలో ప్రతి సంవస్తరం 25,000 నుంచి 50,000 జీవజాతులు అంతరించపోతున్నాయి, అనగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి.
భూమ్మీద ఉన్న అడవులలో దాదాపు 50% పూర్తిహా నశించిపోయింది. అందులో చాలా భాగం గత మూడు దశబ్దాల్లోనే నశించింది.
ఈ భూమి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. దాన్ని 46 ఏళ్ళు అనుకుంటే, అప్పుడు ఇక్కడ మానవుడు నివసిస్తున్నది కేవలం 4 గంటల నుంచే. మన పారిశ్రామిక విప్లవం మొదలై 1 నిమిషమైంది. ఆ సమయంలోనే మనం ప్రపంచంలోని 50% అడవులను నాశనం చేశాం. అది మన అభివృద్ధి ?? 
భూమి మీద జీవమనుగడకు సరిపడా వాతవారణాన్ని కాలుష్యం చేసి, భయంకారంగా భూమి మీద వాతావరణాన్ని పెంచేశాము.దాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్/ Global Warming) అంటున్నారు. ఆ ఫలితంగా రాబోవు 50 ఏళ్ళలో ప్రపంచంలో గొప్ప గొప్ప నదులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులో మన గంగ కూడా ఉంది. అయినా మనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. 
ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, కార్బన ఉద్గారాల విషయంలో ఆలోచించకపోతే, 2100 కి అసలు మానవుడి సహా ఈ భూమ్మీద ఏ జీవి బ్రతకదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. 

రాక్షసులు పుణ్యనదులను కలుషితం చేశారు, చెరువులను నాశనం చేశారు. ఇప్పుడు మనవాళ్ళూ చెరువులను కబ్జా చేసి కనిపించకుండా చేశారు. ఈ భూతాపం గంగ రాబోయే 50 ఏళ్ళలో ఎండిపోతుందని, వాతవరణ మార్పుల పై బలమైన విధానం లేదు. 

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనిషి బయటకు రాకపోతే ప్రకృతి పులకిస్తోంది. జరిగిన లోపాలను సవరించుకుంటోంది. ప్రపంచనేతలు చాలా సదస్సులు పెట్టారు, చాలా మాట్లాడారు, కానీ ఒక్కటీ అమలు పరచలేదు. బహుసా అందుకే ప్రకృతియే రంగంలోకి దిగిందేమో. అందుకే రాక్షసునిలా ప్రవర్తిస్తున్న మానవుడిని ఒక్క క్రిమితో కట్టడి చేసి, తనను తాను శుద్ది చేసుకుంటోంది. మిగితా జీవాలకు స్వేచ్ఛనిచ్చింది. ఈ కరోనా పేరుతో లాక్‌డౌన్ మొదలైన తర్వాత 10 రోజుల్లోనే గంగా, యమునా మొదలైన నదుల్లో చక్కని మార్పు కనిపించింది, కాలుష్యం తగ్గింది. అసలు స్నానానికి కూడా పనికి రాని విధంగా మనం గంగను కలుషితం చేస్తే, కేవలం 14 రోజుల్లోనే గంగ నీరు హరిద్వార్, ఋషికేశ్ మొదలైన ప్రాంతాల్లో త్రాగడానికి పనికి వచ్చే స్థాయికి వచ్చాయి. మిగితా వాటి పరిథితి కూడా ఇలానే ఉంది.

ఎవరినో తిట్టి చేసేదేమీ లేదు. అందరూ మారాలి, ఈ ప్రకృతికి మానవుడు అధిపతి కాదు, ప్రకృతిలో ఒక భాగమని, అతడు స్వతంత్రుడు కాదని, అన్ని జీవుల మీద ఆధారపడ్డాడని తెలుసుకుని, వినయంగా మెలగాలి. ప్రకృతిని కలుషితం చేయడం రాక్షసత్వం, సహజ వనరులను విచ్చలవీడిగా వాడటం రాక్షస్త్వం, అది చేసేవారంతా రాక్షసులేనని గుర్తించాలి. రాక్షసునిగా కాక మానవునిగా బ్రతకడం నేర్చుకోవాలి.

భూగోళాన్ని  కాపాడుకోవడం అనేది పర్యావరణ పరిరక్షకుల బాధ్యత కాదు, , మనకు ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం.  

Saturday, 11 April 2020

ఇంతకి రాక్షసులంటే ఎవరు?



ఇంతకి రాక్షసులంటే ఎవరు? 

ఒకప్పుడు రాక్షసులంటే ప్రత్యేకంగా కొమ్ములు, కోరలతో భయంకరంగా ఉండేవారని మనకు తెలుసు. వాళ్ళను చూస్తేనే జనం హడలి చచ్చేవాళ్ళు. ఇప్పుడు యుగాలు మారాయి, కనుక వారు కూడా రూపాంతరం చెందారు. అసలు రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఈ కాలంలో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో పరిశీలిద్దాము. ఇవన్నీ మన శ్రీ మద్భాగవతం మొదలైన పురాణాల్లో చెప్పబడిన విషయాలు.

1) సాధారణ జనులు త్రాగే నీటి వనరులైన నదులను, చెఱువులను, కాలువలను విషతుల్యం చేసి, అవి వినియోగానికి పనిరాకుండా చేసేవారు. విషతుల్యమైన వనరులను ఉపయోగించిన అమాయకులు మరణించేవారు. ఆ విధంగా హింసించి ఆనందించేవారు. 
2) ఆహార పంటలను ధ్వంసం చేసేవారు. ఆహారన్ని విషతుల్యం చేసేవారు. భూమి వ్యవవసాయానికి పనిరాకుండా చేసేవారు.
3) గాలిలోకి విషవాయువులను పంపించి, జనుల మృతికి కారణమయ్యేవారు.
4) ప్రకృతిని కలుషితం చేసేవారు. అడవులను నరికి, ఉద్యానవనాలను నాశనం చేసి నిప్పు పెట్టేవారు. హిరణ్యకశిపుడు ఈ విధంగానే చేశాడని శ్రీ మద్భాగవతం చెబుతోంది.
5) జీవహింస చేసేవారు. లక్షల సంఖ్యలో గోవులు మరియు సకల జీవరాశి యొక్క మృతికి కారణమయ్యేవారు.
6) అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో వనరులను వినియోగించి, భూమిని పీల్చి, పిప్పి చేసి, గుల్ల చేసేవారు. హిరణ్యాక్షుడు చేసిందాంట్లో ఇది కూడా ఉంది.
7) జనులను మానసికంగా, శారీరింగా హింసించేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు. రావణుడికి ఆ పేరు రావడానికి కారణం ఇదే. అనసవరంగా జనాల్లో భయం కలిగించేవాడు.
8) యజ్ఞయాగాదులను విమర్శించేవాళ్ళు, వాటి మధ్యలోనే ఆపివేయడానికి విఘ్నాలు కలిగించేవారు, వాటిని భగ్నం చేసేవారు. సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసేవారు. మంచి పనులు చెద్దామనుకున్నవారికి ఆటంకాలు కలిగించేవారు.
9) తమ ఆలోచనతో అంగీకరించనివారిని హింసించి చంపేవారు. అందరూ తమవలె ఆలోచించాలని, తమనే దైవంగా పూజించాలని బలవంతపెట్టేవారు.   
10) కొందరు రాక్షసులు దేవుడిని నమ్మేవారు, కొందరు దేవుడిని నమ్మేవారు కాదు, కొందరేమో తామే దేవుడని ప్రచారం చేసుకునేవారు.

ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి. బాంబులు వేసి జనాల మృతికి కారణమయ్యేవాడు ఉగ్రవాది అయితే, భూసారం క్షీణించడానికి, నదులు కలుషితమై జనులు అనారోగ్యం పాలవడానికి కారకులయ్యేవారు ఉగ్రవాదులు కారా? తేడా ఒకటే, ఒకరు హింసతో అధికారం చెలాయించాలని చూస్తుంటే, వెరొకరు వ్యాపారం పేరుతో అధికారం చెలాయిస్తూ విధ్వంసం చేస్తున్నారు, మిగితావారు నిర్లక్ష్యంతో చేస్తున్నారు. ప్రపంచ జనాభాకు రెండింతల ఆహారం భూమి ద్వారా లభిస్తుంటే, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, ఆ జంతువులను తింటున్నారు మనుష్యులు, వెరొకరి ఆకలి చావుకు కారణమవుతున్నారు. భూమిని పిండి మొత్తం వనరులు ఒక తరంలోనే ఖాళీ చేసేస్తున్నారు.

ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూడండి. మానవుల కార్యకలాపాలన్నీ స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకృతి ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకృతి తిరిగి తన పూర్వస్థితికి వస్తోంది. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, కాలుష్యం తగ్గింది. మనుషులంతా ఈ విపత్తు తొలగించమని దేవుడిని వేడుకుంటుంటే, ప్రకృతి ఇదే బాగుందని ఆనందిస్తోంది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్ధన వినాలి ?  (ఈ విపత్తు తొలగిపోతుంది, అయినప్పటికీ ఒకసారి ఆలోచన చేయండి) దీనిబట్టి ఇన్నాళ్ళు ప్రకృతిని హింసించిన రాక్షసులు ఎవరో చెప్పకనే చెబుతోంది ప్రకృతి. ఆత్మవిమర్శ (Self-introspection) చేసుకుని ప్రకృతి హిత జీవనానికి బాటలు వేయడానికి ఇదే సరైన సమయం. బహుసా! మనకు భగవంతుడు చెబుతున్నది కూడా అదేనేమో ! మనం వింటున్నామా ?! మనం మారతామా ? ప్రభుత్వాలు ప్రకృతి హితమైన అభివృద్ధి దిశగా బాటలు వేస్తాయా ? ఇప్పుడున్న విధానాలు మారుతాయా ?  సామాన్యులు సైతం ఈ దిశగా తమ జీవితాలను రూపుదిద్దుకుంటారా?

మనం దైవీ లక్షణాలను ప్రదర్శించనవసరంలేదు. రాక్షసగుణాలు వదిలి, ,మనుష్యులుగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. అందుకే వేదం 'మనుర్భవ' - ముందు మనుష్యులుగా మారండి అని సందేశం ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా వింటామా ? 

Saturday, 4 April 2020

పునరాలోచన చేయాల్సిన సమయం (4వ భాగం)



ఇప్పుడు మన రోజువారీ అవసరాల్లో కొన్ని అలవాట్ల కారణంగా ఎంత నీరు వినియోగిస్తున్నామో చూడండి.

బీరు ఉత్పత్తికి (అనగా దానికి వాడే ముడిసరకు పండించడం, తరలించడ, దగ్గరి నుంచి త్రాగేవారిని చేరేవరకు), సగటున 1 లీటర్ బీరు తయారు కావలంటే 155 లీటర్ల మంచి నీరు అవసరం.

వైన్ - 750 మిల్లీలీటర్ల వైన్ తయారికీ 720 లీటర్ల మంచినీరు, 1 లీటరు వైన్ తయారికి 960 లీటర్ల మంచి నీరు అవసరం. 125 మిల్లీలీటర్ల వైన్‌లో  120 లీటర్ల మంచి నీరు ఉంటుంది.

ప్రపంచంలో చాలామంది త్రాగే పానీయం కాఫీ. ఒక్కొక్క వ్యక్తి ప్రతి రోజూ అనేక కప్పుల కాఫీ త్రాగుతుంటాడు. చాలామందికి కాఫీ అనేది ఒక వ్యసనం కూడా. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తయారికి కనీసం 133 లీటర్ల నీరు అవసరం. 454 గ్రాముల వేయించిన కాఫీ గింజలకు 9547 లీటర్ల నీరు అవసరం. అంటే 1 కాఫీ చుక్క తయారవ్వాలంటే కనీసం 1,100+ నీటి బిందువుల వినియోగమవుతాయి. (1)

వేసవి వస్తే శీతల పానీయాలు త్రాగుతారు చాలామంది. అవి ఏదో ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు. అవిగాక శుభకార్యలు, సభల్లో వచ్చిన వాళ్ళందరికీ విరివిగా వీటిని పంచుతుంటారు. మీకు తెలుసా ?! 1/2 లీటరు (అర లీటరు) కొకొ-కోలా తయారికి సరాసరి 15 లీటర్ల నీరు వినియోగిస్తారు. కేవలం కొకొ-కోలానే కాదు, మీరు త్రాగే ప్రతీ సాఫ్ట్ డ్రింక్ పరిస్థితి అంతే. ఒక పక్క జనం నీరు లేక అల్లాడుతున్నారు, వీళ్ళేమో భూగర్భ జలాలను తోడేస్తారు. దేశంలో ఇలాంటి శీతల పానీయాల తయారి ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్లాంటు సగటున రోజుకు 15 లక్షల లీటర్ల భూగర్భ జలాలను తోడేస్తుంది. ఎక్కడ ఈ ప్లాంట్లు ఉంటాయో, ఆ చుట్టు ప్రక్కల ఊర్లలో భూగర్భజలాలు అడుగంటుతాయి. ఫలితంగా పంట పండించడానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు.దీని మీద వందనాశివ గారు పోరాటం చేశారు. 

అంటే మీరు రుచి కోసమో, దాహర్తిని తీర్చుకోవడం కోసమో ఒక లీటరు సాఫ్ట్ డ్రింక్ త్రాగితే, 30 లీటర్ల నీటిని వృధా చేస్తున్నారన్నమాట. రైతుల గురించి నిజంగా ఆలోచించేవాళ్ళైతే ముందు శీతలపానీయాలను, మద్యాన్ని త్రాగకండి. (2) అప్పుడు నీటి లభ్యత అధికమవుతుంది.

Source: 
1) https://recyclenation.com/2010/10/blog-action-day-recycled-water-footprint-beverages/
2) https://mondediplo.com/2005/03/14india 

Thursday, 2 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (3వ భాగం)



ఇప్పుడు ప్రపంచమైనా ఎదురుకొంటున్న అతి పెద్ద సమస్య నీటి ఎద్దడి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకీ సమస్య తీవ్రత అర్ధమవుతుంది. నగరాల్లో ఉన్నవారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నగరాలకు నీటి సర్ఫరాలో ఆటంకం రాకుండా ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ గ్రామాల్లో ఉన్నవారికి తెలుసు ఆ కష్టం. కొన్ని గ్రామాల ప్రజలైతే ఎన్నో కిలోమీటర్లు నడిచి మరీ నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు నీటి ఎద్దడికి ఎలా కారణమవుతున్నాయో చూద్దాము.


యూ.ఎస్.జి.ఎస్. వారి లెక్కల ప్రకారం 1 పౌండ్ (453 గ్రాములు) గొడ్డు మాంసం (భీఫ్) ఉత్పత్తి చేయడానికి కనీసం 9000 లీటర్ల నీరు ఖర్చవుతాయి. అంటే నాలుగున్నర కిలోల గొడ్డు మాంసం ఉత్పత్తికి ఒక స్విమ్మింగ్ పూల్ నింపడానికి సరిపడా నీటిని ఉపయోగిస్తారు. ఇవన్నీ కాకిలెక్కలు, గాలిమాటలు కాదు. సశాస్త్రీయంగా శాస్త్రవేత్తలు లెక్కగట్టి నివేదికలు ఇచ్చినవి. మెక్ డోనాల్డ్స్ సంస్థ రోజుకు 86,183 కిలోల గొడ్డు మాంసం విక్రయిస్తుందని అంచనా. అంటే ఎంతమంది ఎన్ని నెలల పాటు త్రాగేనీటిని వారు కేవలం కొంతమంది కడుపు నింపడానికి వినియోగిస్తున్నారో చూడండి. దానికి అయ్యే నీటి ఖర్చు 1,26,18,03,928 లీటర్లు, అవును అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది లీటర్లు. ఇంత నీటితో ఎంత పంట పండిచవచ్చు, ఎంతమంది దాహర్తిని తీర్చవచ్చో మీకు అర్ధమవుతోందా ... పైగా ఇది భూమికి పెద్ద భారం. ఎన్నో వేలమంది కొన్ని సంవత్సరాల పాటు సుఖంగా జీవించడానికి తోడ్పడే అద్భుతమైన నీరు అనే వనరును కేవలం జిహ్వచాపల్యం కోసం కొందరు ఒక రోజులో వాడేస్తున్నారు.

ఇప్పుడు మిగితా వాటి సంగతి చూద్దామా? 1 కిలోగ్రాము కోడిమాంసం ఉత్పత్తికి 4,325 లీటర్లు, 1 కిలో మేకమాంసం ఉత్పత్తికి 5,520 లీటర్లు అవసరం. అదే ఒక కిలో వరి ఉత్పత్తికి 3,600 లీటర్ల నీరు మాత్రమే అవసరము. గోధుమలకు 1,375 లీటర్లు, చిరుధాన్యాల ఉత్పత్తికి 300 లీటర్లు అవసరము. ఇవన్నీ కనీసం లెక్కలు. కొన్ని సందర్భాల్లో ఈ వినియోగం ఇంకా పెరగచ్చు.


ఒక వ్యక్తి మాంసాహారన్ని వదిలి శాఖాహారం వైపు అడుగులేస్తే, ఆ వ్యక్తి ఒక ఏడాదిలో సుమారు 5,67,812 లీటర్ల నీటిని ఆదా చేసినవాడవుతాడు. మరి పునరాలోచన చేస్తారా ?

To be continued.....

Source: https://www.zmescience.com/science/domestic-science/eat-vegetarian-save-water/   

Wednesday, 1 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (2వ భాగం)



ఇప్పుడు అమెజాన్ అడువులైనా, ఆస్ట్రేలియా అడవులైనా, లేక ప్రపంచంలో ఏ అడవులైనా, ఇవాళ వాటిని తగలబెట్టి, నేలను చదును చేసి, వ్యవసాయ భూమిగా మారుస్తున్నారు. ఆయా దేశాల జనాభకు ఆహారం అందించడానికి సరిపడా భూమి లేక కాదు, దేశప్రజల దురాశను తీర్చలేక. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది.
అది ఎలా అంటారా? ప్రపంచమంతా కలిపి 150 కోట్ల గోసంతతి ఉందని అంచనా. మనుషుల తర్వాత అత్యధిక జనభా ఉన్న క్షీరదాల్లో ఆవులు ప్రధానమైనవి. అయితే వీటిలో చాలా వాటిని పెంచేది పాల కోసం కాదు, వాటిని చంపి భీఫ్ తినడానికి. కేవలం ఆవుల విషయమే కాదు, పందులు, మేకలు, గొఱ్ఱెలు, కోళ్ళు, గేదెలు మొదలైన ఇతర జంతువుల పరిస్థితి కూడా అంతే. మాంసాహర ఉతపత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో, వీటిని పెంచడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరి వీటి పెంపకానికి సరిపడా భూమి కావాలి, వాటిని పొషించడానికి తగినంత ఆహారం, నీరు కావాలి. అందుకోసమే అడువులు నరికేస్తున్నారు. అమెజాన్ లో కాల్చబడిన అడవిలో 80% కేవలం ఈ మాంసహారం కోసమే.

దీని గురించి రాజీవ్ దీక్షిత్ ఒక ప్రసంగంలో చెప్పారు. ఆయన చెప్పిన సమయంలో ప్రపంచ జనాభా 650 కోట్ల. ఆయన ఇలా అన్నారు - "ఇప్పుడు ప్రపంచ జనాభా 650 కోట్లు. కానీ ఈ ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) 1300 కోట్ల జనాభాకు సరిపడా ఆహారం పండిస్తోంది. ఒకవేల ఉన్నపళంగా ప్రపంచ జనాభా రెండితలైనా అందరికీ కడుపు నింపగలశక్తి భూమాతకు, ప్రకృతికి ఉంది. కానీ ఆ ఆహరం, నీరు అంతా ఏమవుతోంది ? ప్రపంచంలో అత్యధికంగా తినబడే జీవజాతి గోజాతి (గోజాతికి చెందిన ఆవు, ఎద్దు, దూడలు). ఆ తర్వాత పంది, గేదె, మేక, కోడి, అటుతర్వాత ఇతర పక్షులు, జంతువులు. వీటిలో చాలా జంతువులు తమ ధర్మాన్ని (లక్షణాన్ని) అనుసరించి గడ్డి తింటయి. కానీ వీటి శరీరంలో మాంసం బాగా వృద్ధి చెందడానికి వీటికి గోధుమలు, వరి, పప్పులు, సోయా గింజలు, ఇతర ఆహారాధాన్యాలన్నీ పెడుతున్నారు. ఇవన్నీ తిని వాటి కండపుష్టి ఎంత బాగా పెరిగితే, మాంసం అమ్ముకునే కంపెనీలకు అంత లాభం. భారత్, పాకిస్థాన్, ఇండొనేషియా లాంటి పేద దేశాలు తమ మానవులు తినే ఆహార ఉత్పత్తుల్లో సరాసరి 40% జంతువులకు పెడుతుండగా, అమెరికా, బ్రిటన్, జెర్మని లాంటి దేశలు 70% ఆహార ఉత్పత్తులను జంతువులకు పెడుతున్నాయి. మొత్తం కలిపి చూస్తే సగటున ప్రపంచం మానవుల ఆకలి తీర్చడానికి పండిచిన ఆహార ఉత్పత్తుల్లో 55% శాతం జంతువులకు పెట్టి, వాటిని మేపి, వాటిని తింటున్నారు. అందుకే ఈ ప్రపంచంలో అనేక కోట్ల మంది తినడానికి తిండి లేక ఆకలితో మరణిస్తున్నారు. ఆహార్న్ని పండించి, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, వాటిని చంపి తినేకంటే, జంతువధను ఆపి, శాఖాహరం తినడం ప్రారంభిస్తే, ఎంతో మందికి భోజనం దొరుకుతుంది. వనరులు వృధా కావు."

ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది, మన దురాశ మరియు జిహ్వచాపల్యం కారణంగా జంతువులు మరణించడమే కాదు, వేల ఎకరాల్లో అడవులు నాశనమవుతున్నాయి. మన ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని కోట్లమంది ఆకలితో అలమటించాలా ? మరి జరుగుతున్న వినాశనంలో మనకు వాటా లేదా ? మన అలవాట్లను మార్చుకుంటే తప్పేంటి ? 

To be continued.... 

Tuesday, 31 March 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (1 వ భాగం)



ఎక్కడో వూహాన్ నగరంలో పుట్టిన ఒక చిన్న క్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో మనుషులను బలిగొంటొండి. అది మానవుల సృష్టించిందా లేదా సహజంగా ప్రకృతిలో ఏర్పడిందా అనేది ఇంకా మనకు తెలియదు... కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మానవాళికి మృత్యువు ఎక్కడి నుంచి ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికీ ఎలా ఉందో, ఎవరిని నమ్మవచ్చో, ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి. అందరూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడిపే స్థితి. దేశాల సరిహద్దులు మూతబడ్డాయి, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది ఉంది.. ప్రకృతి ఈ విపత్తు ద్వారా మనకేమీ నేర్పిస్తోంది....
ఈ విపత్తు తొలగాలని, అందరూ బాగుండాలని ఆశిద్దాము. కానీ మన తప్పులు కూడా మనం తెలుసుకుందాము, పునరాలోచన చేద్దాము. ఈ వ్యాసాల ఉద్దేశం భయం కలిగించడం కాదు, మన పంథాను మార్చుకోవాలని గుర్తు చేయడమే....

అయితే ఒకసారి మనం వెనక్కు అనగా 2019 ఆగస్టుకు వెళదాము. అమెజాన్ అడవుల్లో నిప్పు రాజుకుంది....
ప్రపంచంలోనే అతి పెద్ద అడవులు అమెజాన్ అడవులు. అవి బ్రెజిల్, పేరు, బొలివియా మొదలైన తొమ్మిది దక్షిణ అమెరికా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. జీవరాశి మనుగడకు ఇవి విడుదల చేసే ప్రాణవాయువు (ఆక్సిఎజ్ఞ్) ను ద్ర్ష్టిలో ఉంచుకుని వీటిని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా చెబుతారు. వీటిలో ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుంది. ఇవి దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమెజాన్ అడవుల్లో నిప్పురాజుకుంది, కాదు వాటికి నిప్పు పెట్టారు మానవులు. శాస్త్రవేత్తల అనచాన ప్రకారం దాదాపు 23 లక్షల జంతువులు ఈ అగ్నిలో మరణించాయి. లక్షల ఎకరాల వృక్ష సంపద నాశనం అయింది. కేవలం ఒక్క జూలై 2019 లోనే బ్రెజిల్లో 7200 చదరపు మైళ్ళు తగలబడింది. దీనికి ఆగస్టు నెల మరియు ఇతర దక్షిణ అమెరికా దేశల్లో తగలబడిన అడవి అదనం.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో 2019 నవంబర్ లో జరిగినది ఒకసారి చూద్దామా ? ఆస్ట్రేలియాలోని అడవుల్లో కూడా అగ్గి రాజుకుంది, కాదు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే స్థానికులు అగ్గి రాజేసారని అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఇప్పటి వరకు అనగా మార్చి 2020 వరకు 4,60,50,750 ఎకరాల అటవీ సంపద ఈ అగ్నికి దగ్ధమైంది. దాదాపు ఒక బిలియన్ అనగా సుమారు వందకోట్ల జీవరాశి (పక్షులు, జంతువులు, కీటకాలు) అగ్నిలో పడి మరణించాయి.
కేవలం బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలాంటి విధ్వంసం కొనసాగింది, ఇంకా కొనసాగుతోంది. ఈరోజు మనం ఎలా అయితే బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఆమవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామో, అడవుల్లో ఉన్న జీవరాశి కూడా అలానే గడిపింది. వాటికి ఎక్కడి నుంచి మృత్యువు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తోందో తెలియదు. తప్పించుకునే మార్గం లేదు... ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని ఇంట్లో ఉండమంటున్నా, కొందరు వినక బయట తిరుగుతూ వాళ్ళు ప్రమాదంలో పడుతూ, మానవాళిని ప్రమాదంలో పడేస్తున్నారు... బహుసా ఆ రోజు కూడా ఆ అడవుల్లోని జీవరాశి అలాగే అనుకుని ఉంటాయి. మనిషేమీ ఉన్నతమైన, ప్రకృతికి అతీతమైన జీవి కాదు కద... ప్రకృతిలో భాగమైన మనిషే ప్రకృతికి నిప్పు పెట్టినప్పుడు, ప్రకృతి కూడా 'వద్దు రా నాయనా! ఇది నీకు కూడా ముప్పు తెస్తుంది, నా మాట విను!' అని మౌనంగా చెప్పే ఉంటుంది. అయిన మనం వినలేదు. అప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మనదీ అలానే ఉంది... ఇది ప్రకృతి పెట్టిన శాపమా? లేక స్వయంకృతాపరాధమా?

కానీ ఎంత ఆశ్చర్యం... ఈ కరోనా మొదలైన తర్వాత ప్రపంచంలో అడవులు నరకడం ఆగిపోయింది...


మరి ఎక్కడో అడవులను తగలబెడితే, మొత్తం ప్రపంచం దానికి మూల్యం అనుభవించాలా అని అడుగుతారేమో... దాని గురించి కూడా చెబుతాను....

Wednesday, 25 March 2020

వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ?



వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ? 

పొద్దున ఒకతను ఫోన్ చేశారు...
అతను : నమస్తే సర్! ఉగాది శుభాకాంక్షలు
నేను : ఉగాది శుభాకాంక్షలండి....
అతను: ఎలా ఉన్నారు?
నేను: బాగున్నా, మీరెలా ఉన్నారు?
అతను: బాగున్నాం సార్, కానీ ఈ సారి ఉగాదికి వేపపువ్వు దొరకలేదండి,  ఉగాది పచ్చడి చేసుకోకుండానే పండుగ జరుపుకోవలసి వస్తోంది..
నేను: పర్లేదండీ, వచ్చే ఏడాది తినచ్చు... ఈ ఏడాదికి ఇంట్లోనే ఉండండి...
అతను: తినకపోతే ఏమీ కాదా సార్ ? అది తప్పు కాదా ?
నేను : ఏమీ కాదండి... తప్పేమీ లేదు...
అతను: మరి శాస్త్రంలో చెప్పారు కదా సార్ తప్పకుండా తినాలని...
నేను: అవునండి... కానీ శాస్త్రం అంతవరకే చెప్పి ఊరుకోలేదు. మనకు ఆయుర్వేదమనే వైద్యశాస్త్రం ఉంది. అది ఉపవేదం కూడా. అది కృతజ్ఞత అని సూత్రం మీద పని చేస్తుంది. అనగా మనం ప్రకృతికి మేలు చేసే విధంగా బ్రతికినప్పుడు, ప్రకృతి మనకు మేలు చేస్తుంది... మన వంతుగా మనం ప్రకృతికి ఏ మేలూ చేయనప్పుడు, మనం ఆరోగ్యం కోసం ఎలాంటి ఔషధం పుచ్చుకున్నా పని చేయదని చెబుతుంది ఆయుర్వేదం.
అతను: అర్ధం కాలేదు సార్...
నేను : మన ఆయుర్వేద శాస్త్రాన్ని ముందు బ్రహ్మదేవుడు ప్రజాపతికి చెప్పారు. ఆయన ఆశ్వినీ దేవతలకు, వారు ఇంద్రునకు, ఆయన అత్రిపుత్రుడైన ఆత్రేయ పునర్వసు మరియు ఇతర మునులకు, వారు అగ్నివేశునకు మరియు  ఇతర ఋషులకు చెప్పారు. అలా ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరీ నారాయణ స్వామి. 
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఏదైనా ఒక మూలికను చెట్టు నుంచి గ్రహించాలంటే, దానికి ఒక ముహూర్తం చెబుతుంది. ఎప్పుడుబడితే అప్పుడు మూలికలు కోస్తే అవి పని చేయవంటుంది.... చెట్టు నుంచి ఆకులు సేకరించినా, బెరడు, వేరు లేదా ఇంకేదైనా సేకరించినా, ముందుగా ఆ చెట్టుకు నమస్కరించి, దానిని పూజించి, నాకు వచ్చిన రోగం నయమవడానికి ఈ మూలిక కోస్తున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి, నా రోగం ఉపశింపజేయండి అని మనస్సులో ఆ చెట్టుకు చెప్పుకోవాలి. ఆ తర్వాత దానికి నీళ్ళు పోసి, అప్పుడు కృతజ్ఞతా భావనతో, ప్రసాదంగా ఆ ఆకును కోయాలి. అప్పుడే అది ఔషధంగా పని చేస్తుంది. లేదంటే పని చేయదు. పని చేసినా అది తాత్కాలిక ఫలితమే ఇస్తుంది, ధీర్ఘకాలం కాదు. 

బెరడు చెట్టు కాండాన్ని చీడపీడల నుంచి కాపాడుతుంది. ఒక చెట్టు బెరడును సేకరించాల్సి వస్తే, ఆ చెట్టు బెరుడును తీసిన చోట, కొద్దిగా పసుపు, తర్వాతా ఆవుపేడ ఆ ప్రాంతంలో పూయాలి. ఎందుకంటే మనం సేకరించిన తర్వాత ఆ చెట్టుకు ఏ చీడ పట్టకూడదని... అదీగాక మనం ప్రకృతిహితకరమైన జీవనం గడుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం సేకరించే ప్రతి మూలిక ప్రకృతిలో భాగం. ఒక ప్రక్క ప్రకృతిని హింసిస్తూ, కలుషితం చేస్తూ, ఇంకో ప్రక్క ఆయుర్వేదం వాడితే ఏమీ ఉపయోగం లేదు....
ఇప్పుడు మనం ఇవేమీ చేయకుండా చెట్టు నుంచి ఆకులు, పూలు కోస్తే, దాన్ని శాస్త్రం చౌర్యం అంటుంది, దొంగతనం చేసిన పాపం పడుతుంది. మీకో చిన్న విషయం చెబుతా. మార్నింగ్ వాక్ చేసే చాలామంది ఒక చేతిలో కవరు, ఇంకో చేతిలో పాలకోసం బుట్ట పట్టుకుని దండయాత్రకు బయలుదేరతారు. వాళ్ళు పోయే దారిలో ఏ పూల చెట్టు కనిపించినా, ఒక్క పువ్వు కూడా వదలకుండా మొత్తం దులిపేస్తారు. ఆ చెట్టు ఎవరు నాటారు అనేది వీళ్ళకి అనవసరం. కనీసం వీళ్ళు ఏనాడు ఒక మొక్కకు నీళ్ళు కూడా పోసి ఉండరు... ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి పూజ చేస్తారు. మరి వీళ్ళకు పుణ్యం వస్తుందనుకుంటున్నారా? వీళ్ళందరికి చౌర్యం (దొంగతనం) చేసిన పాపం వస్తుంది. తర్వాత మేక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అదన్నమాట సంగతి. 

ఇప్పుడు వేప పువ్వు, మామిడాకుల విషయంలో కూడా అంతే. మన ఇంటి ముందు మనం కనీసం ఒక వేప చెట్టు, మామిడి చెట్టు నాటలేమా ? పోనీ ఇంటిముందు చోటు లేకపోతే మనముండే వీధిలో ? ఏదైనా చెట్టుకు నీరు పెట్టక, అది ఎండిపోయే స్థితికి వస్తే, ఎప్పుడైనా నీళ్ళు పోసే మొహమా మనది ? కనీసం దేవతార్చనకు పూల మొక్కలు కూడా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? అయినా మనకు పట్టదు. ప్రకృతికి ఏమైతే మనకేంటీ అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు కరోనా లాంటి విషవ్యాధులు ప్రబలి, ప్రకృతి మనకు సహకరించడంలేదు.

మనం ఎవరి నుంచైనా మేలు పొందితే, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం మన ధర్మం మనకు నేర్పింది. అది మనం మర్చిపోతున్నాం. ఇంటికో వేప చెట్టు, వీధికో రావి చెట్టు ఉంటే ఏ రోగాలు మన జోలికి రావు. పండుగ రాగానే ప్రకృతి మీద పడి దండయాత్ర చేసి, చెట్లన్నీ దులిపే బదులు, మన ఇంటి ముందే ఒక మొక్క నాటి పెంచుకోవచ్చు కదా... దానికి రోజూ నీళ్ళు పొస్తే, యజ్ఞం చేసిన ఫలం మనకు వస్తుంది. దాన్ని భూతయజ్ఞం అంటుంది శాస్త్రం. ఇప్పుడు పచ్చడి తిన్నా, మన జీవన విధానం మార్చుకోకపోతే, మనకు తప్పకుండా వ్యాధులు వస్తాయి. మనం చేసిన తప్పులను తెలుసుకుని ప్రకృతి మాతను క్షమాపణ వేడుకున్నప్పుడే, ప్రకృతిహితంగా జీవించినప్పుడు మనం ఆచరించేవి మనకు ఫలాన్నిస్తాయి. ఉగాది పచ్చడి గురించి చెప్పినప్పుడు కూడా వేపచెట్టును పూజించే పువ్వు సేకరించమన్నారు.కాబట్టి ఎత్తుకొచ్చి వేపపువ్వు తినేకంటే మనమే ఓ మొక్క నాటుకుంటే సరిపోదా? 

అతను: అర్ధమైంది సార్... ఈ ఏడాది నేను కూడా మా ఇంటి ముందు వేప, మామిడి వంటి కొన్ని ఔషధ మొక్కలు నాటి, జాగ్రత్తగా పెంచుతాను.... 

Saturday, 22 July 2017

పితృదేవతల కోసం మొక్కలు నాటండి



ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకోకండి. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించినవారికి అవి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. (ఒకసారి గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు ఈ విషయాన్ని చెప్పారు.)

సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. మనం వంశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ వానాకాలం వెళ్ళిపోకముందే కొన్ని మొక్కలు నాటండి. 

Tuesday, 18 July 2017

మనం తక్షణమే చేయాల్సిన రెండు పనులు

ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది, భారతదేశ జనాభా 130 కోట్లకు చేరుకుందని అంచనా. భవిష్యత్తులో ఇంకా పెరగుతుంది. అయితే ఇప్పుడు మనం అతిముఖ్యంగా ఆలోచించాల్సింది అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం కాదు, ముందు తరాలకు సరిపడా వనరులను మనం మిగల్చడం, రెండవది చక్కని పర్యావరణాన్ని అందించడం.

వనరుల కొరత ఏర్పడితే అది తీవ్ర వైషమ్యాలకు కారణమవుతుంది. కొన్ని దేశాల్లో వనరుల కొరత సంఘర్షణకు దారితీసి రెండు దేశాల మధ్య శత్రుత్వానికి, తీవ్రవాదానికి కారణమైందని ఇంతకముందు వందనా శివా గారు చెప్పింది మీరంతా చదివారు. మన దేశంలో ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగునకు చేరాయి. కొన్ని సంవత్సరాలు గడిస్తే, పరిస్థితి తీవ్రమవుతుంది. అది ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విబేధాలకు, వైషమ్యాలకు దారితీసి దేశవిభజనకు దారి తీయవచ్చు, అలా కాకూడదని దైవాన్ని వేడుకుందాం. అయితే మనం చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్రభుత్వాలుగానే కాదు, పౌరులుగా కూడా.

ఒక ఏడాది వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు, 3 సంవత్సరాల అవసరాలకు సరిపోతుందని అంచనా. ఇప్పుడు వర్షం ద్వారా భూమిని చేరే ప్రతి నీటి చుక్కను మనం భూమిలోకి ఇంకించాలి. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగం విజయవంతమైంది, భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు రైతులు, ఇతరులు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రెండవది, నీరు ఎక్కడిక్కడ ఇంకితే, సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

అలాగే #మొక్కలు నాటాలి. భవిష్యత్తు తరాలకు పుష్కలంగా ప్రాణవాయువు ఉండాలి, భూమి చల్లబడాలి, జీవవైవిధ్యం రక్షించబడాలంటే మొక్కలను నాటి, అవి వృక్షాలుగా పెరిగే వరకు సంరక్షించాలి. మొక్కలు నేలకోతకు గురికాకుండా ఆపుతాయి. లోతున ఉన్న భూగర్భ జలాలను పైకి తీసుకువస్తాయి, మేఘాలను ఆహ్వానించి, చక్కని వర్షాలకు కారణమవుతాయి. పచ్చదనం లేకపోతే మెదడు చురకగా పనిచేయదు, కళ్ళ జబ్బులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ముందు మనం మర్చిపోతున్నది, వేసవికాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు మనం పడే వేదన. అది తర్వాతి తరాలకు ఉండకూడదంటే, తప్పకుండా మొక్కలు నాటాలి. మీకో విషయం తెలుసా? మనదేశంలో చింత, సీమచింత, సీతాఫలం, రేగి, నేరేడు, నాటు ఉసిరి వంటి మనం నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో ఉత్పత్తుల పంటసాగులేదు. అవి ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పంటలు. అడవుల నుంచి నేరుగా కోసుకచ్చి మనకు అమ్ముతారు. కానీ మనకా అవగాహన, ఆలోచన ఎక్కడుంది. చింతపండు తింటాము, రేగికాయలు తింటాము, మే, జూన్, జూలై నెలల్లో నేరేడు పళ్ళు తింటాము, కానీ ఆ విత్తనాలు మాత్రం ఖాళీ ప్రదేశాల్లో చల్లము. ఆయా రకాల మొక్కలు పెంచము. ఈ రోజు సరే! మరి భవిష్యత్తు మాటేమిటి? మన జనాభా భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, వినియోగం కూడా ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ ఉతపత్తులను ఎక్కడి నుంచి తీసుకువస్తాము? ఈలోపు ఉన్న ఆ కాస్త వృక్షాలు నరికితే, అడవులను నాశానం చేస్తే, రాబోయే తరాలకు అసలీ జాతులు పుస్తకాల్లో కూడా చదివే అవకాశం దక్కదు. కాబట్టి మనమే ఆలోచించి ముందుకు కదలాలి.

ఏవైతే మనకు నిత్యావసరమో ఆయా మొక్కలను ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. వాటి పక్కనే ఇంకుడు గుంతలు నాటాలి. ఈ రెండు జరగాలి. ఎందుకంటే మనం వనరులను వాడుకుంటున్నదుకు ప్రతిఫలంగా, లేదా కనీస కృతజ్ఞతగానైనా భూమాతకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి. కృతఘ్నో నాస్తి నిష్కృతిః అని రామాయాణ వాక్కు. కృతఘ్నులకు నిష్కృతి లేదు. దేశసమగ్రతకు భంగం కలగకూడంటే కూడా వనరుల కొరత ఉండకూడదు. అందుకోసమైనా ప్రతి పౌరుడు ఇవి తక్షణమే చేపట్టాలి. ఎందుకంటే Earth is a Temple. Not a dust bin. - ఈ పృధ్వీ దేవాలయం, చెత్తకుండీ కాదు. ఈ భూమి మీదనున్న సమస్తమూ భగవంతుని ప్రతిరూపాలే. ఇది నా మాట కాదు, ఈశావాస్యోపనిషత్తులో ఋషుల వాక్కు. వేదం యొక్క ఆదేశం, ఉపదేశం.

Friday, 30 June 2017

ఈ విషయంలో వారిని ఆదర్శంగా తీసుకుంటేనే ధర్మం నిలుస్తుంది.



భారతదేశంలో 100 కు పైగా పార్శీల దేవాలయాలు ఉన్నాయి. అందులో ముంబాయిలోనే 40 ఉన్నాయి- అక్కడ అగ్ని జ్వాల ఎప్పుడూ ఆరదు. వాళ్ళు కూడా అగ్ని ఆరాధకులు. అగ్ని జ్వలించడానికి కొంత గంధవు చెక్కను వాడినా, అధికంగా బబూల్ చెట్టు చెక్కను వాడతారు. ఎందుకంటే బబూల్ చెక్క ఎక్కువసేపు మండుతుంది, మెల్లిగా కాలుతుంది, అగ్ని చాలాసేపు ఉంటుంది. ఈ కారణంగా బేకరీలు మొదలైనవి కూడా వెంట చెరుకుగా బబూల్ చెక్కనే వాడుతున్నారు. దీంతో గత దశాబ్దంలో బబూల్ చెక్క ధర 5 రెట్లు పెరిగింది. ఇలా ధర పెరగడం గురించి ఆందోళన చెందిన పారశీలు తమ స్థలాల్లో బబూల్ వృక్షాలను పెంచుతున్నారు. ఇది గుజరాత్ లో మొదలైంది, ఇప్పుడు ముంబాయిలో కూడా మొదలవుతోంది. దేశవ్యాప్తంగా దీన్ని ఆచరణలోకి తెచ్చి, తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు వార్తపత్రికల్లో వచ్చింది. వారి జనాభ దేశంలో 66,000 మాత్రమే ఉంది. అయినా వారికి ఎంత నిబద్ధత.

దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మనకు కొన్ని పవిత్ర వృక్షాలున్నాయి. కొన్ని రకాల వృక్షాల చెక్కలనే యజ్ఞంలో సమిధలుగా వినియోగిస్తారు. ఏ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ సమిధ వాడితే ఫలితం ఉంటుందో శాస్త్రం నిర్దేశించింది. కానీ చాలామటుకు అవి లభ్యమవ్వడం లేదు. దానికి ప్రధానమైన కారణం వృక్ష సంపద తగ్గిపోవడం. అడవులు కూడా వేగంగా తరిగిపోతున్నాయి, కాదు అభివృద్ధి పేరుతో అడవితల్లిని నాశనం చేస్తున్నాం. రోజుకు సగటున 108 అరుదైన ఆయుర్వేద మూలికలు, వృక్షాలు భారతదేశంలో అంతరిస్తున్నాయని ఒక అంచనా. పార్శీల జనాభా ఈ దేశంలో 0.006 % మాత్రమే ఉంది. కానీ హిందువుల జనాభా సుమారు 60%- 70% ఉండవచ్చు (మతమార్పిడి చేసుకున్నవారిని మినహాయించి). కానీ మనకు అలాంటి ప్రణాళికలేమీ లేవు, అసలలాంటి ఆలోచనే కలగదు. ధర్మాన్ని రక్షించండి, సంస్కృతిని కొనసాగించండి అంటాము, మరియు వాటికి అవసరమైన వాటిని మాత్రం నశింపజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు చక్కని వర్షాలు పడుతున్నాయి. ఇదే మంచి సమయం. మనం మొక్కలు నాటాలి, మేడి, మోదుగ, జువ్వి, తెల్ల మద్ది, నల్ల మద్ది, మఱ్ఱి, రావి మొదలైన దేవతా వృక్షాలను నాటి పెంచాలి. అవి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ముందు భూమి చల్లబడుతుంది. మొక్కలు నాటడం వలన వచ్చే పుణ్యం గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటికి తోడు మనం నాటిని మొక్కలను సమధలుగా వాడితే, ఇంకా ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది. అలా కాకుండా చాలా ఉన్నాయండి అని కబుర్లు చెబుతూ కూర్చుంటే, కొన్నాళ్ళకు చాలా కాస్త కొన్ని అవుతాయి, ఆ తర్వాత అంతరిస్తే, మనమే బాధపడాలి. అంతెందుకు మనం వృతం చేసినప్పుడు కలశం స్థాపిస్తాము. కలశంలో పంచపల్లవాలు (5 రకాల చిగుర్లు) వేయాలని శాస్త్రం చెప్పింది. మఱ్ఱి, రావి, మేడి, జువ్వి, మామిడి. అసలీ విషయం ఎంతమందికి తెలుసు? అంతెందుకు వినాయక చవితికి మనం అర్పించే పత్రిలో ఎన్ని పత్రాలు సరైనవి? అవి మన ఇంటి దగ్గర పెంచుకోలేమా? ఉగాదికి మార్కెట్ లో వేపపువ్వు దొరకడమే గగనమైపోయింది. మనమే ముందడుగు వేసి ఓ వేప చెట్టు పెంచలేమా? ఆఖరికి మామిడాకులు కూడా కొనుక్కునే దుర్భరమైన పరిస్థితి దాపురించింది. అందరికి మామిడాకులు, వేపపువ్వు కావాలి, కానీ ఎవ్వరూ వేప, మామిడి చెట్లు నాటరు. ఇలా చెప్పుకుంటే ఎన్నో.

మొక్కలు నాటి ఆయా జాతుల వృక్షాలను పెంచి, సంరక్షించడానికి ఇది అనువైన సమయం. మనమంతా ఆ దిశగా ఒక ముందడుగు వేస్తేనే భవిష్యత్తులో #ధర్మం నిలుస్తుంది, శాస్త్రీయమైన యజ్ఞ ప్రక్రియ నిలబడుతుంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అని యజుర్వేదంలో శ్రీ రుద్రం కూడా అంటున్నది. వృక్షాల రూపంలో ఉన్న రుద్రునకు నమస్సులు, పచ్చని కొమ్మలు, రెమ్మలు, ఆకులు తన కేశాలుగా కలిగిన మహాదేవునకు నమ్మస్సులు అని అర్దం.

ఇది కూడా ఒక యజ్ఞమే. దీని గురించి కూడా కాస్త ఆలోచించండి. మరి మొక్కలు నాటి పోషిస్తారా?

Saturday, 17 June 2017

పార్వతీ మాత చాటిన మొక్క వైభవం - మత్స్యపురాణం నుంచి చిన్న కథ



దశపుత్రసమో ద్రుమః  

గణపతిని తన దేహపు మట్టి నుంచి ప్రాణం పోసి, ఆయన్ను గణాలకు అధిపతిని చేసిన తర్వాత, పార్వతీ మాత మరొక పుత్రుడు కావాలని సంకల్పించుకుంది. ఎంతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ మాత, ఒక చిన్న ఆశోక చిన్న మొక్కను నాటి, దాన్ని సొంత బిడ్డవలే సుకుమారంగా పెంచసాగింది. (మానవులకు ఆదర్శంగా నిలవడం కోసం). ఆ సమయంలో ఒకానొక రోజు దేవగురువైన బృహస్పతి, ఇంద్రుడు మొదలైన ఇతర దేవీదేవతలతో పార్వతీ మాత వద్దకు వచ్చారు. దేవర్షులు అమ్మవారితో 'దేవి! దయ చేసి చెప్పండి. ఓ భవానీ, మీరు సమస్త సృష్టి యొక్క క్షేమం కోసం అవతరించారు. ప్రపంచంలో చాలామంది పుత్రులను, పౌత్రులను (మనవళ్ళను) పొందడానికి ఇష్టపడతారు. పుత్ర సంతానం లేని చాలామంది (పుత్రుల కోసం) తపస్సు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మర్యాదను (కట్టుపాటును) లోకానికి చూపారు. కాబట్టి దేవీ, చెట్టును పుత్రుడిగా భావించడం వలన వ్యక్తికి కలిగే ఫలం ఏమిటి:' అప్పుడు ఆనందంతో నిండియున్న పార్వతీమాత మంగళకరమైన ఈ పదాలను పలికింది.

నీటి లభ్యత లేని చోట కూపము (బావి) తవ్వించిన సద్భుద్దిమంతుడు, ఆ పుణ్యఫలం కారణంగా ఆ బావిలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో, అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. అలాగే వాపి (కొలను) తవ్వించడం 10 బావులు తవ్వించినదానికి సమానమైన పుణ్యం వస్తుంది. అదే చెరువు/ తటాకం తవ్వించడం వలన 10 కొలనులు తవ్వించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వస్తుంది. ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించేవాడు, పితృదేవతలకు వారి మరణానతరం తర్పణాదులు వదిలేవాడు, దేశానికి, ప్రపంచానికి, సమస్త లోకాలకు మేలు చేసే ఒక సత్పుత్రుడిని కనడం/ పెంచడం 10 చెరువులు తవ్వించినదానికి సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. అంటే కేవలం పుత్రులు ఉంటే సరిపోదు, వారు లోకానికి మేలు చేసేవారు కావాలి. అప్పుడు అతడు చేసే పుణ్యకర్మ పితృదేవతలను సైతం ఉద్ధరిస్తుంది. అదే ఒక చెట్టును నాటి, పోషించడం వలన 10 మంది ప్రయోజకులు, లోకానికి క్షేమం చేకూర్చేవారైన సత్పుత్రులను అందించిన పుణ్యఫలానికి సమానమైన పుణ్యం వస్తుంది. ఎందుకంటే చెట్టు జీవరాశికి ఎంతో మేలు చేస్తుంది. తన సమస్త జీవితాన్ని పరుల కోసమే వెచ్చిస్తుంది. తనకంటూ ఏదీ అట్టిపెట్టుకోదు. అందుకే లోకక్షేమం కోసం, ఇతరులు ఈ మార్గంలో నడవడానికి ప్రేరణగా నేనే ఈ మర్యాదను స్థాపించాను.  (In brief, 10 బావులు ఒక కొలనుకు సమానం. 10 కొలనులు 1 చెరువుకు సమానం. 10 చెరువులు 1 పుత్రునకు సమానం. 10 సత్పుత్రులు ఒక చెట్టుకు సమానం. అందుకే నేను మొక్కలు నాటి మానవుల కోసం గొప్ప మర్యాదను స్థాపించాను.)

మత్స్య పురాణం 154.506- 154.512 (దేవర్షులు - పార్వతి దేవి సంవాదం).

మాములుగా చెప్తే ఎలాగో నాటరు, కనీసం అమ్మవారు చెప్పిందనైనా మొక్కలు నాటండి. వాటిని పెంచి పోషించండి.  మగపిల్లలు లేరన్న చింతవద్దు, మొక్క నాటితే అది 10 మంది మగపిల్లలకు సమానం. ఎన్ని మొక్కలు నాటితే అంత పుణ్యం.

Monday, 12 June 2017

మొక్కలు నాటడం గురించి మత్స్య పురాణం



By Planting a single tree, (with the merit earned from it) one can reside in heaven for 30,000 years of Indra. Not only this, the planter may have the moksha, i.e., end of rebirth.

- Matsya puran

Tuesday, 6 June 2017

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం- ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం కూడా;

జూన్ 6, పంజాబ్ లోని స్వర్ణదేవాలయం వద్ద ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజు.
తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పంజాబ్ లో రాజుకున్న ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం ఏమిటి?
వ్యవసాయానికి, అందులో కలిగిన మార్పులకు, ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధం ఏమిటి?
వ్యవసాయం, పర్యావరణం నాశనమైతే దేశంలో విభజన వాదాలు, అతివాదాలు, తీవ్రవాదాలు పుట్టుకోస్తాయా? వనరుల కాలుష్యం దేశసమగ్రతకు ముప్పా?

వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి శ్రీమతి వందనా శివ గారు చెప్పిన విషయాలు చదవండి.

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం

- వందనా శివ   04/03/2014


ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి 2014కు సరీగ్గా 30ఏళ్ళు నిండుతాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు 1984, జూన్ నెలలో పంజాబ్‌లో ఈ సైనిక చర్యను చేపట్టారు. అమృత్‌సర్‌లోని హర్‌మందిర్ సాహెబ్‌లో తిష్ఠవేసిన జర్నైల్ భింద్రన్‌వాలే..అతని నేతృత్వంలోని సాయుధ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహణకు, హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి మధ్య అవినాభావ సంబంధముందన్న సం గతి బహుశా చాలామందికి తెలియని విషయం. ఒకవేళ తెలిసినా మరచిపోయి ఉండవచ్చు.



భారత్‌లో హరిత విప్లవం 1966లో ప్రారంభం కాగా, పంజాబ్‌లో 1968లో మొదలైంది. పంట సాగు, ఉత్పత్తుల విధానంలో హరిత విప్లవం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అంతకుముందు రైతులు వేర్వేరు రకాల పంటలు పండించేవారు. కానీ ఈ హరిత విప్లవం పుణ్యమాని కేవలం వరి, గోధుమ పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. వీటి దిగుబడులు పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. తొలి నాళ్ళలో రసాయన ఎరువులు, విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీని కల్పించింది. పదేళ్ళపాటు ఇదే విధానాన్ని కొనసాగించి, తర్వాత సబ్సిడీలు ఎత్తివేశారు. ఫలితంగా రైతుల ఆదాయం క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.


ఇదే సమయంలో భింద్రన్ వాలే ఒక మత ప్రచారకుడిగా, గ్రామ గ్రామానికి వెళ్ళాడు. సిక్కుమతం బోధించిన ప్రకారం జీవన విధానాలను కొనసాగించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న సిక్కు యువతను అశ్లీలత, కల్తీ, మత్తుమందులు, పొగాకు వాడకం, మద్యం వంటి వ్యసనాలనుంచి బయటపడి ఖల్సా మార్గంలోకి తిరగి రావాలంటూ ప్రోత్సహించాడు. పై వ్యసనాలకు సిక్కు యువత అలవాటు పడటానికి కేవలం ‘హరిత విప్లవమే’ కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నాటికి పంజాబ్ పూర్తిగా హింసాకాండతో అట్టుడికిపోయే స్థితికి చేరుకుంది. ఖలిస్తాన్ బోధనలు చివరకు మిలిటెన్సీకి దారితీసాయి, దీని ఫలితంగా, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సి వచ్చింది. ఈవిధంగా హరిత విప్లవానికి, పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసాకాండకు మధ్య ఉన్న తేడాను గుర్తించి...అసలు పంజాబ్‌లో ఏం జరుగుతున్నదనేదానిపై పరిశోధించి ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ అనే పుస్తకాన్ని రాయడానికి దారితీసింది. మరి ఈ హరిత విప్లవానికి పితామహుడిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న నార్మన్ బోర్‌లౌగ్‌కు నోబెల్ బహుమతి లభించింది మరి!


నిజం చెప్పాలంటే హరిత విప్లవం సుస్థిరమైనది కాదు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక పరంగా పరిశీలించినప్పుడు దీని అస్థిరత బయటపడుతుంది. పర్యావరణ పరంగా చూస్తే, రసాయన ఎరువులను విపరీతంగా వాడటం వల్ల భూసారం చచ్చిపోయింది. పంజాబ్‌లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ప్రాంతాల్లో మాత్రమే పదిశాతం సేంద్రీయ ఎరువుల వాడకం కనిపిస్తుంది. 1970-71 నుంచి 2010-11 మధ్యకాలం వరకు పరిశీలిస్తే, రసాయన ఎరువుల వాడకం 213,000 టన్నుల నుంచి ఏకంగా 1,911,000 టన్నులకు పెరిగిపోయింది. రసాయన ఎరువులను వాడటం వల్ల వ్యవసాయంలో నీటి వినియోగం బాగా పెరుగుతుంది. పంజాబ్‌లో సరీగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమికి, 27 శాతం ఉపరితల నీటి ద్వారా, 71శాతం భూగర్భ జలం ద్వారా సాగునీరు అందించారు. నీటివాడకం విపరీతం కావడం వల్ల నీటిలో ఉప్పు పరిమాణం పెరిగిపోయి, తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా పంజాబ్‌ను నీటి కరువు ఆవహించడం మొదలైంది.


ఇక 1970 చివరి నాటికి, సబ్సిడీలు ఎత్తివేయడం, పెట్టుబడులు పెరగడంతో రాష్ట్రంలో ఋణ ఆర్థిక వ్యవస్థ చోటు చేసుకోవడం ప్రారంభమైంది. 1980 నాటికి పంజాబ్ రైతులను, భారత దేశానికే అన్నదాతలుగా కీర్తించడం పరాకాష్టకు చేరుకుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. 1986, ఏప్రిల్ 13న గురుగ్రంథ్ సాహెబ్ సమక్షంలో ‘సర్బత్ ఖల్సా’ (సిక్కులు సమావేశం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ‘‘నేడు సిక్కులు బానిస సంకెళ్ళతో నానా కష్టాలు పడుతున్నారు’’ అంటూ సమావేశంలో పాల్గొన్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


1984లో పంజాబ్ రైతులు తాము అనుభవిస్తున్న బానిస బతుకులనుంచి విముక్తి కోసం ఆందోళనకు దిగారు. అదే ఏడాది జనవరి 31న ‘రాస్తారోకో’ నిర్వహించారు. మార్చి 12న వారు గవర్నర్ ఇంటి ముందు ఘెరావ్ చేశారు. తమను పీడిస్తున్న రుణ బాధలనుంచి విముక్తులను చేయాలంటూ, ‘ఖర్జా రోకో’ నిర్వహించారు. తిరిగి అదే ఏడాది మే నెలలో గవర్నర్ ఇంటి ఎదుట ఘెరావ్ చేశారు. చివరకు తాము పండించిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అమ్మకూడదని మే 23న పంజాబ్ రైతులు నిర్ణయించారు. పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసకు మూలం ‘హింసాత్మక వ్యవసాయం’లో ఉంది. ఈ హింసాత్మక వ్యవసాయానికి కారణం ‘హరిత విప్లవం’. ఈవిధంగా బీజ రూపంలో ప్రారంభమైన హింస, ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్యతో పరాకాష్టకు చేరింది. ఆ తర్వాతైనా శాంతి నెలకొన్నదా? అంటే అదీ లేదు. ఈ సైనిక చర్య చివరకు ఇందిరాగాంధీ హత్యకు, ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు దారితీసింది. పంజాబ్‌లోని సిక్కులకు మరియు రైతులకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయం సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.


రసాయన ఎరువుల వాడకం వల్ల నేటికీ పంజాబ్ రైతులు వ్యాధులకు లోను కావడం, కొందరు మరణించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భూములు కోల్పోయిన సేంద్రీయ పదార్ధాలు తిరిగి కూడే పరిస్థితి లేదు. విభిన్న పంటలు పండించే పంజాబ్ రైతులను, హరిత విప్లవం పుణ్యమాని, ఖరీఫ్‌లో వరి, రబ్బీలో గోధుమ పండించడానికి మాత్రమే హరిత విప్లవం పరిమితం చేసింది. భూసారం పూర్తిగా క్షీణించి పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఒక ఎకరానికి పంజాబ్‌లో ఉత్పత్తి అయ్యే ఆహారధాన్యంలో పోషకత, ఆరోగ్య లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇదంతా హరిత విప్లవం పుణ్యమే! హరిత విప్లవానికి ముందు పంజాబ్ రైతులు మొత్తం 41 రకాల గోధుమ పంటను, 27 రకాల వరి పంటను పండిస్తున్నారు. అదేవిధంగా నాలుగు రకాల మొక్కజొన్న, మూడు రకాల సజ్జలు, 16 రకాల చెరుకు, 19 రకాల పప్పు ధాన్యాలు, తొమ్మిది రకాల నూనె గింజల/సుగంధ ద్రవ్యాల పంటలను పండించేవారు. అప్పట్లో గోధుమకు బదులు, షర్బతీ, దర్రా, లాల్ పిస్సీ,లాల్ కనక్, బన్సీ, కథియా, మాల్వా, పక్వాన్, దావత్ ఖాన్ వంటి నాణ్యమైన రకాలు పంట నాణ్యతను, మూలాన్ని వివరించేవిగా ఉండేవి. కానీ నేడు రైతులు పండిస్తున్న రకాలపై క్రిమి కీటకాలు, వ్యాధులు తేలిగ్గా ఆవహించేవిగా ఉన్నాయి. మరి వ్యాధులు, చీడపీడల నివారణకు మరింత ఎక్కువ డోసుతో క్రిమిసంహారకాలను రైతులు వాడాల్సి వస్తోంది.

2011-12సంత్సరంలో వరి ధాన్యం ఖరీదు రూ.1700, గోధుమకు రూ. 1500 ఉండగా, కనీస మద్దతు ధర మాత్రం రూ. 1285, రూ. 1110 గా నిర్ధారించారు. అదే 1995-2001 మరియు 2001-2005 మధ్యకాలంలో పంజాబ్ రైతుల నికరాదాయం, వరికి రూ.77 నుంచి రూ.7లకు, గోధుమకు రూ. 67 నుంచి రూ. 34కు పడిపోయింది. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సగటున ఎకరానికి రూ. 41,576లు చొప్పున రైతులకు అప్పులు మిగిలాయి. విత్తనాలు, రసాయనాల వంటి ఉత్పాదకాల ఖరీదు విపరీతంగా పెరిగిపోవడంతో, రైతుల ఆర్థిక పరిస్థితి ఋణాత్మకానికి దిగజారింది. మరి ఈ పరిస్థితుల్లో పంజాబ్ రైతుల్లో ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే. దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సానుకూలంగా అర్థం చేసుకొని అందుకనుగుణంగా స్పందించాలి. ముఖ్యంగా పర్యావరణ, ఆర్థిక పరంగా రైతులకు మేలు చేసే విధానాలను రూపొందించి అమలు పరచాలి. రైతులకు హితుడిగా, మిత్రుడిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి దోహద పడాలి. 1980 ప్రాంతంలో ఈ సంక్షోభం మిలిటెన్సీకి దారితీస్తే నేడు మరో రూపంలో..అంటే ఆత్మహత్యల రూపంలో ఇది కనిపిస్తోంది. 1984 నాటి పాఠాలను దృష్టిలో ఉంచుకొని, హింసాత్మక, ప్రమాదకారి హరిత విప్లవ పథం నుంచి వీడి, రైతు మిత్ర విధానాలను అనుసరించాల్సిన పంజాబ్ ప్రభుత్వం, మోన్‌శాంటో, అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కార్పొరేషన్లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణం.


క్రిమిసంహారక మందులు విషపూరితాలు. ఇక జన్యు పరివర్తక మొక్కలు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. బిటి పంటల్లోని బిటి జన్యువులు, హెర్బిసైడ్ రెసిస్టెంట్ పంటల్లోని, హెర్బిసైడ్ రెసిస్టెంట్ జన్యువులు అత్యంత విషపూరితాలు. ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకారులు. మన ఆహారంలో, వ్యవసాయంలో విష పదార్ధాలకు, రసాయనాలకు తావులేదు. మనం మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. పర్యావరణానికి ఏవిధమైన హాని కలిగించని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అయితే విష రహిత వ్యవసాయాన్ని మరియు ఆహార వ్యవస్థను రూపొందించుకోవడంకోసం మనం కంకణం కట్టుకోవాలి. నిబద్ధతతో కృషి చేయాలి. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన లేదా తీవ్రమైన వ్యాధులకు గురైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాదు, రైతులు అధిక దిగుబడులను సాధించగలరు. ఇదే సమయంలో పర్యావరణ వ్యవస్థ కూడా దెబ్బతినబోదు. అందువల్లనే ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చల విడిగా వాడే రసాయన ఎరువులు, బయటనుంచి కొనుగోలు చేసే విత్తనాల వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోవడం తప్ప మరే ఇతర ఫలితం కనిపించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.

Monday, 5 June 2017

పర్యావరణాన్ని పరిరక్షించడం ఎలా?

ప్రకృతిలో అనేక రకాలైన జీవులున్నాయి. ఉదాహరణకు బాక్టీరియా, క్రిములు, పక్షులు, చెట్లు, జంతువులు, మానవులు. ఈ భూమిపైన ఇన్ని రకాల జీవులు వుండవలసినదే. ఎందుకంటే జీవులన్నీ పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జాతిజీవి నశిస్తే అనేక జీవులు నశించే ప్రమాద ముంది. రైతుల నిత్య జీవితానికి సంబంధించిన రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.

మినుము, పెసర, జనుము వంటి మొక్కల వేళ్ళలో బుడిపెలు వుంటాయి. అవి నత్రజని నిల్వలు. భూమికి కావలసిన నత్రజనిని ఆ వేళ్ళు అందిస్తాయి. కాని ఆ వేళ్ళలో నత్రజని బుడిపెలు తయారు కావాలంటే భూమిలో ఒక రకమైన బాక్టీరియా, ఆ వేళ్ళుద్వారా మొక్క విసర్జించే పదార్థాన్ని తిని నత్రజని బుడిపెలను తయారుచేస్తాయి. అలాగే వానపాములు భూమిని నిరంతరం గుల్లగా వుంచుతాయి. దానివలన ఆ భూమి ఎంత వాననీటినైనా పట్టి వుంచగలుగుతుంది. రైతులు చీడపీడల నివారణకు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు అవలంబించక, రసాయనిక మందులను అధిక మోతాదులో వాడితే, ఆ మందులు వానకు భూమిలోకి ఇంకి ఆ బాక్టీరియాను, వానపాములను చంపుతాయి. దానివలన ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో వుండే నత్రజని ఎరువును ఆ భూమిలో వేసినా, భూమి స్వీకరించలేని పరిస్థితి వస్తుంది. అలాగే వానపాములు చచ్చిపోతే నేల గట్టిపడి, వాననీరు భూమిలోకి ఇంకలేక వృధాగా పోతుంది. ఈ రెండింటి వలన భూమి సేద్యానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైన ఆహార కొరత సమస్య సృష్టిస్తుంది. అంటే మానవాళి మనుగడయే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో 1949-68 మధ్య రసాయనిక మందుల వినియోగం, వాటి వలన రసాయనిక నత్రజని వినియోగం 40శాతం పెరిగింది. దానిని భూమిసరిగా తీసుకోలేక పోవడం వల్ల అది నైట్రేట్‌ రూపంలో కాలువలు, చెరువుల లోకి చేరి ఆ నీరు కలుషితమయింది.

మరి రసాయనిక మందులు అతిగా వాడకుండా చీడపీడల నివారణ ఎలా? ప్రకృతిలోనే అనేక కీటకాలు చీడపురుగులను ఆహారంగా కలిగినవి వున్నాయి. వాటిని పెంచి చేలలో వదిలితే చాలు, సస్యరక్షణ అద్భుతంగా జరుగుతుంది. ఇటీవల మన పత్రికలలో చీడపురుగులను కీటకాలు ఆహారంగా స్వీకరిస్తున్న దృశ్యాలు ప్రచురించి, మనకు అవగాహన కలిగించాయి. ఈ పద్ధతిని రైతులలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలి.

కాబట్టి జీవవైవిధ్యం నాశనమయితే పర్యావరణం పెను ప్రమాదంలో పడుతుంది. అదొక్కటే కాదు. కార్బన్‌డయాక్సైడ్‌, మిథన్‌, క్లోరోఫ్లోరా కార్బన్‌ వంటి గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ కలిగించే వాయువుల వలన కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ జరిగి పర్యావరణ ప్రమాదం పెరుగుతుంది. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌కి ప్రధానంగా పరిశ్రమల నుండి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులు 23శాతం, విచక్షణా రహితంగా చేసే అడువుల నరికివేత మరో 23శాతం కారణాలవుతున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా.

కాబట్టి పర్యావరణం, తద్వారా ఈ భూమి, సంరక్షింపబడాలంటే జీవ వైవిధ్యం కాపాడబడాలి. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల తగ్గించబడాలి. కాని వాస్తవంగా ఏం జరుగుతోంది? పారిశ్రామిక అభివృద్ధి ఫలాలన్నీ అనుభవిస్తున్న అమెరికా, అభివృద్ధి కారణంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పట్టించుకోవడం లేదు. ఈ అమానుష చర్య అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ కాలం నుండి చేపట్టబడింది.

జార్జివాషింగ్టన్‌ 1779 మార్చి 31న సైనికాధికారి జనరల్‌ సల్లివాన్‌కు ఈ క్రింది విధంగా ఆదేశాలిచ్చాడు. ''మీరు శతృవులైన ఆరు స్థానిక ఇండియన్‌ జాతులను అదుపు చేయండి. దీనికి గాను వారి పంటలను పొలాల్లోనే నాశనం చేయడం అవసరం. ఇతర పంటలేవీ పండించ బడకుండా చూడాలి.'' (అయ్యో భూగోళం, పేజీ 29) అంతే! వాషింగ్టన్‌ ఆదేశాల మేరకు ఏ ఒక్క మొక్కనూ వదలకుండా వలస సైనికులు ధ్వంసం చేశారు. ఎంతగా ధ్వంసం చేశారంటే ''నయాగరా ప్రాంతంలో గతంలో ఇండియన్‌ జాతులు నివసించి వుండేవనేందుకు ఆధారాలైన వారి ఆహార పంటలు లేకుండా నాశనం చేశాము'' అని సల్లివాన్‌ తన నివేదికలో పేర్కొన్నాడు.

ఇక వియత్నాం యుద్ధంలో విజయానికి ఆమెరికా అనుసరించిన వ్యూహం పర్యావరణ యుద్ధం. అడవులను సర్వనాశనం చేయడం, విషపూరితమైన రసాయనాలను ప్రయోగించడం అనే పద్ధతులు అవలంబించబడ్డాయి. విషరసా యనాలను ప్రయోగించడంలో ముఖ్య బాధ్యతల్లో వున్న ఒక అధికారి 1984లో ఇలా రాశారు.
''అమెరికా అనుసరించిన రసాయన యుద్ధంలో కోట్లాది మొక్కలు, వృక్షాలు చనిపోవడమే కాక నేటికీ పచ్చగడ్డి మొలకెత్తని ప్రాంతాలున్నాయి. నేలలోని పోషక జీవులు అంతరించడంతో ఆ నేల నిస్సారమైంది. వన్య మృగాలు అదృశ్యమయ్యాయి. జలచరాల ఉనికి మాయమైంది. కాలక్రమంలో వింత రూపాలతో శిశువుల జననం లాంటి దీర్ఘకాల ప్రభావాలకు ఈ యుద్ధం కారణమైంది.'' విశేషమే మంటే రసాయనిక యుద్ధానికి సైన్యాధికారులు వెనుకాడినా, అధ్యక్షుడు కెనెడీ పూర్తిగా ప్రోత్సహించాడు.

నికరాగ్వాలో కూడ శాంతినిష్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రతీఘాత సైన్యాన్ని ప్రోత్సహించింది. ఈ సైన్యం పంట చేలపైన దాడికి దిగింది. 75 మందికి పైగా పర్యావరణ శాస్త్రజ్ఞులను కిడ్నాప్‌ చేయడం గాని, చంపడం గాని చేసింది. నికరాగ్వా రైతులకు విత్తనాలు సరఫరా చేసే ప్రధాన విత్తనశుద్ధి సేకరణ కేంద్రంపై దాడి చేసింది. ఇదీ ఆదేశ పర్యావరణంపై దాడి జరిగిన తీరు!

ఇక రీగన్‌ పరిపాలనా కాలంలో అమెరికా ప్రభుత్వం పథకం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పర్యావరణ ప్రమాణాలు పరిశీలించే కౌన్సిల్‌లో ఉద్యోగులందరినీ రీగన్‌ తొలగించాడు. పర్యావరణ పరిరక్షణ సంస్థ ఉద్యోగులను నాల్గవవంతుకి తగ్గించాడు. బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణకి కేటాయింపులు మూడో వంతుకీ, పరిశోధనల కోసం సగానికీ కోత విధించాడు. ఇటువంటి చర్యల కారణంగా బహుళజాతి సంస్థలు పర్యావరణాన్ని నాశనం చేసే చర్యల్లో అమితోత్సాహంగా ముందుకెళుతున్నాయి.
ఈ విషయంలో మన ప్రభుత్వాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి గుత్తసంస్థలకూ అనుకూలంగా వ్యవహరి స్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే బిటి విత్తనాలకు ఎర్రతివాచీ పరచడం వంటి పనులు చేస్తున్నాయి. బిటి విత్తనాలు, వాటితో వ్యవసాయం చేసే చేలలోనే కాకుండా, వాటి పుప్పొడి పాకినంత మేర, విత్తనాల పునరుత్పత్తి లేకుండా చేస్తుంది. దానితో మరుసటి సంవత్సరం విదేశీ కంపెనీవారి విత్తనాలను పక్కచేల రైతులు కూడా కొనకతప్పని పరిస్థితి వస్తుంది. కొంతకాలానికి దేశమంతా విదేశీ కంపెనీల విత్తనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ విత్తనాలు లేకపోతే మనకు మనుగడ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా బిటి విత్తనాలు మన స్వాతంత్య్రాన్ని హరించి, మనల్ని అమెరికాకి బానిసల్ని చేస్తాయి. ఇది నా ఊహకాదు. అమెరికా వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి ఎర్లబట్జ్‌ స్వయంగా అన్నమాట. ఆయనేమన్నాడంటే ''ఒకవేళ ఆహారాన్ని ఆయుధంగా వాడుకోదలిస్తే, సంతోషంగా దాన్ని మేం వాడుకుంటాం''. అమెరికా ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తుంటే, మన ప్రభుత్వం దానిపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇది క్రమంగా బానిసత్వానికి దారితీయదా?

మన ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై ఎంత చిన్న చూపంటే, ''ఔషధ పరిశ్రమలు ఉత్పత్తి చేసి విక్రయించే రసాయనాల మొత్తం టర్నోవర్‌పై 1శాతం పన్ను విధించి దాన్ని పర్యావరణ సంస్థల వద్ద డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల క్రితమే ఆదేశించింది. కాని ఈ ఆదేశాన్ని అమలు పరచడంలో ప్రభుత్వాలు ఇప్పటివరకూ శ్రద్ధ చూపడమే లేదు.

కాబట్టి దేశభక్తులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, పర్యావరణ విధ్వంసకారు లెవరు? వారి తైనాతీలెవరు? అనే విషయాలను ప్రజలకు వివరించి, మన భూమిని కాపాడుకొనే చర్యలను ముమ్మరం చేయాలి. భావితరాలకు పచ్చనైన భూమిని వారసత్వంగా అందజేయాలి.

కె.ఎల్‌. కాంతారావు
సెల్‌: 9490300449
సేకరణ: http://www.navatelangana.com/article/net-vyaasam/36515