Sunday, 31 May 2015

హిందూ ధర్మం - 160 (వేదంలో విజ్ఞానశాస్త్రం)వేదాల్లో టెలిగ్రాఫీ (తంతి) గురించి :

అశ్వినీ శక్తుల (రెండు వ్యతిరేక దిశల మధ్య ఉండే) సాయంతో, సైన్యం సమర్ధవంతంగా పని చేయడం కోసం  విద్యుత్ యొక్క మంచి కండక్టర్‌లైన తంతి పరికరాలను అమర్చి వాడుకోండి. కానీ జాగ్రత్తగా ఉపయోగించండి - ఋగ్వేదం 1.119.10

యజుర్వేదం 18-8, 12 మంత్రాల్లో వివిధ రకాల జంతువుల గురించి ఉంది. ఇది జంతుశాస్త్రానికి బీజం వేసింది.

అధర్వణ వేదం 10 వ కాండంలో శరీర నిర్మాణ శాస్త్రం గురించి ప్రాధమిక వర్ణన ఉంది.

రెండు మడమల మీద మానవదేహం నిలబడేలా యుక్తితో కూర్చిందెవరు? మాంసంతో మందంగా కప్పిందెవరు? చీలమండలను తయారుచేసిందెవరు?  అందమైన వేళ్ళను రూపొందించి, కీళ్ళ ద్వారా కలిపిన తత్వం ఏమిటి? మానవునికి జ్ఞానేంద్రియాలను ప్రసాదించిందెవరు? కాళ్ళకు అరికాళ్ళను అమర్చింది, నడుముకు బలాన్ని ఇచ్చిందెవరు? - అధర్వణవేదం 10-2-1 అంటూ ఈ మంత్రం భగవంతుని వైభవాన్ని ఒక వైపు కీర్తిస్తున్నా, మరొక వైపు దేహనిర్మాణం గురించి ప్రాధమిక అవగాహన కల్పిస్తోంది.

9 ద్వారములతో (9 రంధ్రాలు - 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము), దేవతలు నివసించు 8 వృత్తములతో (5 జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; మనసు, బుద్ధి, అహంకారము), బంగారు కాంతితో వెలిగిపోతున్న దివ్యతత్త్వముతో (ఆత్మతో), దాన్ని ఆవరించి ఉన్న దివతేజస్సుతో (భగవంతుని యొక్క కాంతి) అబేధ్యమైన నగరం వలే ఈ శరీరం నిర్మించబడింది - అధర్వణవేదం 10-2-31. ఇందులో కేవలం శరీరం నిర్మాణం గురించే కాక, ఆధ్యాత్మిక తత్వం గురించి కూడా వివరించబడింది. (స్వేచ్చానువాదం చేశాను కనుక తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరు).

రోగకారక క్రిములు గురించి ప్రస్తావన

అధర్వణవేదం 4-37, 19-36-6 లో అప్సరసలు, గంధర్వులు అనే పదాలు కనిపిస్తాయి. అక్కడ వాటి అర్దం వ్యాధికారక క్రిములని, అవి త్వరగా చాలా దూరం వ్యాపించే శక్తి కలవనీ చెప్పబడింది. వాటి ఆకారాలు, రూపాలు, వాటి సంవృద్ధికారక విషయాలు, వాటిని నిరోధించుటకు, వాటి వ్యాప్తిని కట్టడి చేయుటకు తీసుకోవలసిన ఆయుర్వేద నివారాణోపాయల గురించి విపులంగా ఉంది. ఇది సూక్ష్మజీవశాస్త్రానికి బీజం వేసింది.

ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీగారు వైదిక సంస్కృతికి చేసిన సేవ ఎనలేనిది. వారు వేదాలకు రాసిన అర్ధాలు అత్యధ్బుతం, సశాస్త్రీయం. దయానంద సరస్వతికి మించిన హేతువాది నాస్తికులలో కూడా ఉండరు. ఇప్పటి ఆధునిక పరిశోధనలు కనుగొంటున్న అనేక విషయాలను వారు ఆకాలంలోనే ప్రస్తావించారు. గత 2000 ఏళ్ళలో వేదాలకు అటువంటు అర్ధాలు వెలువడలేదంటే అతిశయోక్తి కాదు. వారి వేదభాష్యం సనతానధర్మానికి కొత్త ఊపిరిలూదింది. ఇప్పటికీ అనేకమంది వాటిలో తప్పులు వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, విఫలం అవుతూనే ఉన్నారు. వారు వేదాల్లో వైమానికి, నౌకా నిర్మాణ శాస్త్రాలున్నాయని మంత్రసహితంగా 1876 లో తమ వేదభాష్య పరిచయంలో వివరించారు.  వాటిని ఐఐఎస్సి వారు పరిశీలించి, దయానందులు విమాన నిర్మాణం గురించి, దాని పనితీరు గురించి చెప్పినవన్నీ ఆచరణయోగ్యాలనీ, సాధ్యమని వెళ్ళడించారు. నిజానికి వారు విమానాల గురించి ప్రస్తావించే సమయానికి ఆధునిక కాలంలో ఇంకా విమానలు కనుగొనలేదు. దయానందుని మరణం తర్వాత 20 ఏళ్ళు గడిచాకా గానీ మానవ సహిత విమానం ఎగరలేదు. వారు విమానాల పనితీరుని గురించి ఈ మంత్రాలకు అర్ధాల్లో వివరించారు. ఋగ్వేదం 1.116.3, 1.116.4, 10.62.1, 1.116.5, 1.116.6, 1.34.2, 1.34.7, 1.48.8 మొదలైనవి.

అట్లాగే దురవాణి (రేడియో) గురించి తమ ఋగ్వేదభాష్య భూమికలో వివరించారు దయానంద సరస్వతీగారు. నిజానికి అప్పటికి ఇంకా రేడియో అనే పరికరం ఒకటి ఉందని కానీ, చాలా దూరం వరకు మనిషి మాటలను ఆకాశమాధ్యమం ద్వారా ప్రసారం చేయచ్చని కానీ పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. అప్పటికింకా రేడియో కనుగొనబడలేదు. వేదాల్లో అన్ని ఉన్నాయిష అని వ్యంగ్యంగా మాట్లాడేవారు, వేదాల్లో ఒట్టి మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారికి ఈ విషయాలు చెప్పినా అర్దం కావడంలేదు. వారి లక్ష్యం విజ్ఞానాన్ని మెచ్చుకోవడం కాదు, వేదాన్ని ద్వేషించడం. అంతకుమించి ఏమీ లేదు. అసలు నిజానికి రేడియో కనుగొన్నది జగదీష్ చంద్రబోస్ గారే కానీ మార్కోని కాదు. కానీ కొన్ని కుటిల కారణల చేత మార్కోనికి పేరు వచ్చింది.

To be continued .....................

ఈ రచనకు సహాయపడినవి : http://agniveer.blogspot.in/2010/01/science-in-vedas.html
పూజ్యశ్రీ దయానంద సరస్వతీ (ఆర్యసమాజం) వారి వేద భాష్యం

Thursday, 28 May 2015

శ్రీ ఆదిశంకరాచార్య కృత గంగా స్తోత్రం

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కృత గంగా స్తోత్రందేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||

భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామఙ్ఞానమ్ || 2 ||

హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || 3 ||

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || 4 ||

పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || 5 ||

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || 6 ||

తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || 7 ||

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || 8 ||

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || 9 ||

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || 10 ||

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || 11 ||

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || 12 ||

యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || 13 ||

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || 14 ||

జై గంగామాతా! హర హర గంగే!
భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామఙ్ఞానమ్ ||

అమ్మా! భాగీరధీ! నీవు అందరికి అనందాన్నిచ్చే దానివి. నీ జలముల మహిమను వేదాలు కీర్తిస్తున్నాయి. నీ మహిమను, గొప్పతనాన్ని వర్ణించడం నాకు శక్యం కాదమ్మా! ఆ విషయంలో నేను అజ్ఞానిని. ఓ గంగాదేవీ! నా మీద కరుణ కురిపించి రక్షించు తల్లి.

గంగా స్తోత్రంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు

More posts on Ganga maa

గంగమ్మ గోడు వినండి http://ecoganesha.blogspot.in/2014/06/blog-post_8.html
పావన గంగా రహస్యాలు http://ecoganesha.blogspot.in/2013/01/secrets-of-sacred-river-ganga-1.html

Wednesday, 27 May 2015

దశపాపహర దశిమి

28 మే 2015 గురువారం, జ్యేష్ఠ శుద్ధ దశమి - దశపాపహర దశిమి

దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌’ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా ‘కాశీ’లో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

గంగావతరణ జ్యేష్ఠ శుక్ల దశమీ బుధవారం హస్తా నక్షత్రంలో అయినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది అంటున్నారు. వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణం జరిగిందని గ్రంథాంతరాల్లో ఉంది. గంగావతరణకు ఇది మరొక తిధి. ఈ రోజు గంగావతరణ అయినా కాకపోయినా ఈ పండుగ గంగానదిని ఉద్దేశించి చేయబడింది కావడం నిజం.

ఈ వ్రత విధానం (దశపాపహర దశమి) స్కంధ పురాణంలో ఉంది. గంగాదేవి కృపను సంపాదించటమే ఈ పండుగ ప్రధానోద్దేశం. దీన్ని గంగాత్మకమని అంటారు. గంగానీరు ఎంతో పవిత్రం, ఎన్నినాళ్ళు న్నా చెడిపోదు. అసలు గంగానది తీరాలు అనేకం తీర్థ స్థలాలు. కాశీ, హరిద్వార్‌, ప్రయాగ మొదలైన నదీ తీరాల్లో ఈ పండుగ బాగా చేస్తారు. అక్కడ గంగా దేవి ఆలయాలున్నాయి. గంగ పూజ కూడా అక్కడ చేస్తారు.

ఈ రోజున గంగా స్నానం చేసి పూజ చేసి గంగా స్తోత్రం పఠిస్తే దశ విధ పాపాలు తొలుగుతాయి అని వ్రతగ్రంధం.
ఈ గంగాత్మక దశమికి మరోపేరు దశపాపహార దశమి అని; దశ హర దశమి అని కూడా అంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం
శ్లోః లింగం దశాశ్వ మేధేశం
దృష్ట్యా దశహరాతి ధే
దశ జన్మార్జితైః పాపైః
త్యజ్యతే నాత్రసంశయః
దశహర తిధినాడు దశాశ్వ మేధ ఘట్టంలోని లింగము చూచినట్లయి తే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహంగా నశిస్తుందని తాత్పర్యం.

స్నాన సంకల్పంలో కూడా ఈనాడు ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర స ముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం దహ హర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే’’ జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాలైన పాపాలు పోగొట్టే స్నానమని దీని భావం. పూజ కూడ పది పూవ్వులతో, పది రకాల పళ్ళతో నైవేద్యంగా చేస్తారు అని చెబుతారు.
గంగా దేవి పూజా మంత్రం
నమో భగవతె్యై దశపాపహరాయై
గంగాయై నారాయణై్య
రేవతె్యై దక్ష్రాయై శివాయై
అమృతాయై విశ్వరూపిణై్య
నందినై్య తేనమోనమః
ఓం నమశ్శివాయై నారాయణై్య
దశహరాయై గంగాయై నమోనమః
షోడశపచార విధిచే గంగాపూజ చేస్తూ అందులో ఈ మూల మంత్రాన్ని అహోరాత్రులు అయిదు వేలసార్లు జపించి వ్రతం పూర్తి చేయాలి.
-ఇ. హరిహర్‌నందన్‌, హైదరాబాద్‌
Source : http://www.suryaa.com/features/article-3-30583

ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే విశేష పుణ్యఫలం. అది కుదరని పక్షంలో ఇంట్లో ఆయినా, మానసికంగా గంగానదిని, దశాశ్వమేధా ఘాట్‌ను భావన చేసి, గంగానదిని నీటిలో ఆవాహన చేసి స్నానం శిరఃస్నానం (తలస్నానం) చేయాలి. సూర్యోదయానికి స్నానం ముగించాలి. అటు తర్వాత గంగామాతను పూజించాలి. స్నానం చేసే సమయంలో, పూజ సమయంలో ఈ శ్లోకం పఠించాలి.

ఓం నమ శ్శివాయై నారాయణ్యై
దశహరాయై గంగాయై నమోనమః 

Sunday, 24 May 2015

హిందూ ధర్మం - 159 (వేదంలో ఖగోళశాస్త్ర విషయాలు)

వేదాల్లో ప్రస్తావించబడ్డ ఖగోళశాస్త్ర విషయాలు. ఆధునిక విజ్ఞానశాస్త్రజ్ఞులు కూడా కనుగొన్నవి. ఈ ఖగోళ విషయాలు కనుగొనడానికి, అంగీకరించడానికి పాశ్చాత్య ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.భూభ్రమణానికి చెందిన విషయాలు

భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికి అది ముందుకు కదులుతుంది. దాంతో పాటు దానిపైన ఉన్నవి కూడా కదులుతాయి. భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుంది - ఋగ్వేదం 10.22.14

ఏ విధంగానైతే ఒక శిక్షకుడు తను కొత్తగా శిక్షణ ఇచ్చే గుర్రాలను తన చుట్టు తిప్పుకుంటాడో, అట్లాగే సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను తన అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - ఋగ్ వేదం 10.149.1  

గురుత్వాకర్షణ శక్తికి చెందిన విషయాలు

ఓ ఇంద్రుడా! అయస్కాంతశక్తి, ఆకర్షణ శక్తి - ప్రకాశం, కదిలకలు వంటి గుణాలు కలిగిన నీ దివ్య కిరణాల చేత ఈ సమస్త విశ్వాన్ని నిర్ణీత పద్ధతిలో నడిపిస్తున్నావు. ఈ విశ్వమొత్తం గురుత్వాకర్షణ శక్తి చేతనే నడుస్తోంది - ఋగ్ వేదం 8.12.28

సూర్యుడు తన కక్ష్యలో తాను తిరుగుతున్నా, భూమి మొదలైన ఇతరత్రా గ్రహాలు, అన్యపదార్ధాలను కూడా ఒకదానికొకటి ఢీకొనకుండా ఆకర్షణ శక్తి ద్వారా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు - యజుర్వేదం 33.43 

సూర్యుడు తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడు అందరికంటే బరువైనవాడు, పెద్దవాడు అవ్వడం వలన తన యొక్క ఆకర్షణ శక్తి చేత భూమి మొదలైన గ్రహాలు ఆయన చుట్టు తిరుగుతాయి - ఋగ్వేదం 1.164.13 (మనమున్న విశ్వంలో సూర్యుడే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం. గ్రహాలు, శకలాలు అనేకం ఉన్నా, అన్నిటికంటే పెద్దది సూర్యగోళమే. సూర్యుడే ఈ విశ్వానికి ఆధారభూతమై ఉన్నాడని ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా తెలుసుకున్నమాట అందరికి విధితమే. ఈ విషయాన్ని ఋగ్వేదం కొన్ని కోట్ల ఏళ్ళ క్రితమే స్పష్టం చేసింది.)

సూర్యుడే భూమిని, ఇతర గ్రహాలను పట్టి ఉంచాడు - అధర్వణవేదం 4.11.1  (సూర్యుడిలో గురుత్వాకర్షణశక్తి లేకపోతే, ఈ విశ్వం సజావుగా నడవదు. అంతా గందరగోళంగా తయారవుతుంది.)

చంద్రుని కాంతి గురించి - చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యుడి మీద ఆధారపడ్డవాడన్న విషయం కూడా వేదం ప్రస్తావించింది.

భ్రమణం కలిగిన చంద్రుడు ఎప్పుడు సూర్యుడి నుంచి వెలుగును (కాంతి కిరణాలను) గ్రహిస్తాడు - ఋగ్వేదం 1.84.15

చంద్రుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాతింబవళ్ళు ఆ వివాహానికి హాజరయ్యాయి. సూర్యుడు తన కూమర్తే అయిన సూర్యకిరణాన్ని ఇచ్చి వివాహం చేశాడు - ఋగ్వేదం 1.85.9 (భార్యభర్తలు విడదీయరానివారు. ఒకరు లేకుండా ఇంకొకరిని ఊహించడం అసాధ్యం. అట్లాగే సూర్యకాంతి లేని చంద్రుడిని ఊహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు, సూర్యకాంతి మీద ఆధారపడ్డవాడు. అందుకే వేదం ఈ ఉపమానం వేసింది.)

గ్రహణం గురించి - ఈ మధ్య ఒక కొత్త ప్రచారం ఊపందుకుంది. హిందువులకు గ్రహణం గురించి తెలియదు, చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య అడ్డురావడం వలన సూర్యగ్రహణం, భూమి నీడ చంద్రుడిపై పడడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ వీళ్ళేదో పాములు వచ్చి మింగేస్తాయని చెప్తారు అంటున్నారు. అటువంటి వారికి ఇది కనువిప్పు కావాలి. రాహుకేతువులు అనగా ఛాయలు (నీడలు) మాత్రమే. రాహుకేతువులను సర్పాలుగా పురాణంలో చెప్పగా, వేదం గ్రహణం గురించి అసలు ప్రక్రియ వెల్లడించింది. పురాణంలో ఉన్న విషయాలన్నిటిని యధాతధంగా స్వీకరించకూడదు. వాటిలో అనేక రహస్యాలు, ఉపాసనా పద్ధతులు నిక్షిప్తమై ఉంటాయి. వేదం అనాది. అందులో గ్రహణం గురించి ఏమూందో చూడండి.

ఓ సూర్యుడా! నీవు ఎవరికి కాంతిని బహుమతిగా ఇస్తున్నావో, అతడే (చంద్రుడే) నీ కాంతికి అడ్డుతగలడంతో (భూమికి సూర్యుడికి మధ్య అడ్డురావడంతో) కముకున్న చీకటివలన భూమి (భూమిపై ఉన్న జీవరాశి అని అర్దం చేసుకోవాలి) భీతిల్లుతోంది - ఋగ్వేదం 5.40.5 

ఈ విషయాలు చదివి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమీ తెలియకుండా హైందవసంస్కృతిని విమర్శించకండి.

To be continued ..........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: http://agniveer.blogspot.in/2010/01/science-in-vedas.html

Sunday, 17 May 2015

హిందూ ధర్మం - 158 (భారతీయులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు)

వేదాల్లో సైన్సు ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్దం. వేదంలో సైన్సు ఉంది. ఆ మాటకు వస్తే, సూర్యుడు వెలుగునిస్తాడా అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అజ్ఞానంగా ఉంటుందో, వేదంలో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయా? అనడం కూడా అలాగే ఉంటుంది. వేదం విశ్వంలో ఉన్న అన్ని అంశాల గురించి వివరించింది. ఆయా వేదాల్లో ఏ ఏ రకాల సైన్సు విభాగాలు ఉన్నాయో, గత భాగాల్లో చెప్పుకున్నాం. అయితే, అవే కాక వేదాల్లో చెప్పబడ్డ మరికొన్ని వైజ్ఞానిక అంశాలు కూడా చెప్పుకుందాం.


-----------------------------------------------------------------------------------------------

కాకపొతే ముందుగా  Satyanarahari Mallisetty గారు అధర్వణ వేదం గురించి అందించిన  అమూల్యమైన ఈ సమాచారం అందరూ తెలుసుకోదగింది.

అధర్వణ వేదం ఐరోపా ఖండ వాసులు ఏనాడో మన దేశం నుంచి తీసుకొని పోయారు. ఈ వేదం మన దేశం అంతరించడానికి చాల కారణాలు ఉన్నా అందులో ముఖ్య కారణం మాత్రం మోక్షం లేదా ముక్తి సాధనం లేదా ఒక జీవున్ని విశ్వా సంసారం నుంచి బయట పడవేసే, ముక్తి, తాత్విక చింతన ఇందులో కొంచం తక్కువ.  ఆ కారణంగా ఇది ఒకప్పుడు మనదేశంలో భాగమైన  ఆఫ్గానిస్తాన్ (ఆఫ్ఘనిస్థాన్‌ని గాంధారదేశమని పిలిచేవారు. ఒకప్పుడు గాంధార దేశం కూడా భారతావని లో భాగమే) నుంచి  గుండా టర్కీ ద్వారా ఐరోపా ఖండంలో ప్రవేశించి అక్కడ వచ్చి రాని సంస్కృత పండితుల చేతులలో పడింది. ఆ రోజుల్లో వాళ్ళ పాలకుల దృష్టిని ఆకర్షించిన ముఖ్య అంశం "చింతామణి", వాళ్ళ భాష లో చెప్పాలంటే "ఫిలోసోఫెర్ స్టోన్". దాని ద్వారా ఏదైనా ఒక వస్తువుని బంగారంగా మార్చ వచ్చు అని పిచ్చిగా నమ్మే వాళ్ళు. దానిని తయారు చేయమని వాళ్ళ పాలకులు ఆయా దేశాల మేధావులని ఆదేశించే వాళ్ళు  అలా అధర్వణవేదాన్ని క్షుణ్ణంగా అధ్యయం చేసి ఆధునిక భౌతిక, రసాయన శాస్త్రం అభివృద్ధి చేశారు. కొన్ని కొన్ని సత్యాలు తెలుసుకొంటూ వచ్చారు. తెలుసు కొన్నసత్యాలు ఆధారం చేసుకొని ఒక్కో పరికరం, లేదా యంత్రం అభివృద్ధి చేసుకొంటూ వచ్చారు. అణువులు , ఎలేక్ట్రోన్లు, కేంద్రక వంటి సూక్ష్మ సత్యాలు అవగాహన చేసుకొనే కొలది కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సెల్ ఫోన్ వంటి పరికరాలు, యంత్ర తంత్రాలు వృద్ధి జరిగాయి. యంత్ర , తంత్ర , మంత్రాలూ కర్మ- ప్రతి కర్మలకు కారణం అవుతాయి. ఇవి జీవున్ని బానిసని చేస్తాయి. ఎన్నటికి మోక్షాన్ని ఇవ్వవు. మన భారతీయులు మోక్ష కాములు కనుక ఈ అధర్వణ శాస్త్రం జోలికి వీలైనంత తక్కువ పోయారు. ఈ నాటికి జెర్మన్లు ఎందుకు సంస్కృతం అభ్యసిస్తున్నారు అంటే అది మన సంస్కృతం మీద వాళ్లకు గౌరవం కాదు, ఆ అధర్వణ వేదంలో చెప్పబడ్డ సూక్ష్మ రహస్యాలు గ్రహించాడానికే. ఈ అధర్వణ శాస్త్రాన్ని "సాయనాచార్యుడు" అనే ఆయన ఎందుకు దీనిని మాయలు మర్మాలు చేసే శాస్త్రం అని అన్నాడు అంటే ఈ అధర్వణ శాస్త్రంలో వచ్చే యంత్ర, తంత్ర, మంత్రం, కుతంత్రాలు అన్నియును కూడా ప్రకృతి మాయ భ్రాంతిలో ఉండే వ్యక్తుల పైనే పని చేస్తుంది. ప్రకృతి మాయని దాటినా వాళ్ళు (యోగులు) పైన ఈ శాస్త్ర ఫలిత పరికరాలు ఏది పని చేయవు.

-------------------------------------------------------------------------------------------------------------------

ఈ విషయాన్ని బలపరిచేది, భారతీయులకు తెలియంది అయిన మరొక విషయాన్ని చెప్పుకోవాలి.

ఇదేకాక జీ.పుల్లారెడ్డిగారి అభినందన సంచిక 'మధుకోశం' లో ప్రచురించబడిన ఈ విషయం చూడండి.

ఇందిరాగాంధీగారు ప్రధానమంత్రిగా ఉన్నా కాలంలో భారతదేశం నుంచి పశ్చిమ జెర్మనీకి ఒకరు రాయబారిగా వెళ్ళారు. అక్కడి అధికారులు ఈ రాయబారికి తమ కార్యాలయాలను చూపుతూ, అక్కడ ఉన్న ఒక భారతీయుడి చిత్రపటం చూపించి, ఈయన ఎవరో మీకు తెలుసా? అని అడిగారు. తనకు తెలియదని భారతరాయబారి సమాధానం ఇచ్చారు. అప్పుడు జెర్మన్ అధికారులే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చెప్పి, అతనికి తమ దేశంలో అంతటి ప్రాముఖ్యం రావడానికి గల కారణం కూడా చెప్పారు. ఆ వ్యక్తి పేరు దండిబొట్ల విశ్వనాధశాస్త్రి. రాజమండ్రి వాస్తవ్యులు. సంస్కృత భాషలో మహాపండితులు. యజుర్వేదానికి కర్మకాండ పరంగా, తాంత్రిక విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, నాలుగు విధాలుగా అర్దం చెప్పగలిగిన మహామేధావి. 1938 లో జెర్మన్ గూఢాఛారులు భారత్‌కు వచ్చి, ఆయన్ను జెర్మనీ తీసుకొనిపోయారు. వేదశాస్త్రములలో ఉన్న వైజ్ఞానిక విషయాలు వీరి నుంచి జెర్మన్ శాస్త్రవేత్తలు గ్రహించి, యుద్ధకాలంలో ఆయుధ నిర్మాణానికి వాటిని వినియోగించుకున్నారు. దానికి కృతజ్ఞతగా విశ్వనాధశాస్త్రిగారి చిత్రపటాన్ని తమ విదేశాంగ కార్యాలయంలో పెట్టుకున్నారట.

-------------------------------------------------------------------------------------------------------

అందుకే ఇప్పటికి జెర్మన్లకు హిందూ విజ్ఞానశాస్తమన్నా, పురాణాలన్నా, వేదాలన్నా అమితమైన ఆసక్తి. రామసేతువు మీద అమెరికా కుటిల బుద్ధితో తప్పుడు నివేదిక ఇస్తే, రామసేతువు మీద జెర్మనీ కూడా పరీక్షలు నిర్వహించి, దాని అసలు వయసును లెక్కగట్టింది. తమ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాషను ప్రత్యేకంగా నేర్పిస్తోంది. సంస్కృతం వచ్చిన పండితులను అక్కడికి తీసుకెళ్ళి, గ్రంధాలను అనువదించే పనిలో పడింది. అలా అనువాదం చేసినందుకు వారికి అధికమొత్తంలో ధనం ఇస్తుంది. ఆంగ్లేయులు మనకు చేసిన ద్రోహాల్లో పెద్ద ద్రోహం ఇదే. 16 వ శతాబ్దంలోనే యూరోప్‌లో సంస్కృత భాషాధ్యయనం మొదలైంది. 17 వ శతాబ్దం నుంచి చాలా గ్రంధాలను ఎత్తుకెళ్ళడం మొదలుపెట్టారు. 19 వ శాతాబ్దం నాటికి ఇక్కడున్న గ్రంధాలను మొత్తం ఎత్తుకెళ్ళి, ఇక్కడ వేల ఏళ్ళ నుంచి నిర్వహింపబడుతున్న విశ్వవిద్యాలయాలను పూర్తిగా నాశనం చేశారు. కొన్ని తప్పులు ఉన్నప్పటికి, వారి వద్ద కూడా వేదానికి అనువాదాలు ఉన్నాయి. వేదాలను ఎత్తుకెళ్ళడమే కాకుండా వాటిని పరిశోధించి రాసిన గ్రంధాల మీద 'పేటెంట్' హక్కులు తీసుకున్నారు. అంతేకాదు, ఒకానొక జెర్మన్ కంపెనీ 'వేద' అనే పదం మీద, మరొక కంపెనీ 'వాస్తు' అనే పదం మీద పేటెంట్ తీసుకున్నాయి. ఇప్పటికైనా హిందువులు జాగృతమవ్వాలి. తమ ధర్మాన్ని, ధార్మిక గ్రంధాలను కాపాడుకోవాలి.

To be continued ..............................

Thursday, 14 May 2015

రామకృష్ణ పరమహంస సూక్తి

పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండవచ్చు కానీ సంసారాన్ని మనలో చేరనివ్వకూడదు.

శ్రీ రామకృష్ణ పరమహంస


Wednesday, 13 May 2015

హనుమంతునిపై స్వామి శివానంద గారి వచనం

The world has not yet seen, and will not see in the future also, a mighty hero like Sri
Hanuman. During his lifetime he worked wonders and exhibited superhuman feats of strength
and valour. He has left behind him a name which, as long as the world lasts, will continue to
wield a mighty influence over the minds of millions of people - Swami Sivananda హనుమత్ శ్లోకం

మన అందరి మీద హనుమంతుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అందరికి హనుమాన్ జయంతి‬ శుభాకాంక్షలు
ఓం శ్రీ హనుమతే నమః


Tuesday, 12 May 2015

హనుమాన్ జయంతి

ఓం శ్రీ హనుమతే నమః

వైశాఖ కృష్ణపక్ష/బహుళ దశమి(ఈ ఏడాది మే 13, బుధవారం) హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమకు జరుపుతారు. అట్లాగే చైత్రపూర్ణిమ రోజున ప్రారంభమైన హనుమాన్ మండల దీక్ష వైశాఖ బహుళ దశమితో ముగుస్తుంది.

కలియుగంలో సులువగా ప్రసన్నమయ్యే దేవాత రూపాలలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాదేవికి, కేసరికి పరమశివుడి అంశగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు. ఈనాటికి హిమాలయపర్వతాల్లో కైలాసమానససరోవరం దగ్గర రామనామ జపం చేస్తూ సశరీరంతో ఉన్నారు.

హనుమంతుడి స్మరణచేత బుద్ధి, బలం, యశస్సు(కీర్తి), దైర్యం, నిర్భయత్వం(భయం లేకపోవడం), వాక్‌పటుత్వం కలుగుతాయి. సమస్తరోగాలు తొలగిపోతాయి. జడత్వం నాశనమవుతుంది. జ్ఞానం కలుగుతుంది. భూతప్రేత పిశాచాలు హనుమన్ స్మరణతోనే పారిపోతాయి. హనుమాన్ ఉపాసనతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసానమామి.    

హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
ఓం శ్రీ హనుమతే నమః        
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Sunday, 10 May 2015

మాతృవందన ఫలం

భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేనచ
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, గంగాజలం తీసుకుని, రామేశ్వరం చేరి రామేశ్వరుడిని ఆ గంగాజలంతో అభిషేకించి, సేతువు దగ్గర స్నానం చేసి, ఇసుకు తీసుకుని తిరిగి కాశీకి చేరి గంగలో ఆ ఇసుక కలిపితే కాశీ యాత్ర పూర్ణఫలం దక్కుతుంది. అటువంటి 100 యాత్రలు చేసిన పుణ్యం, 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలం, అమ్మకు ఒక్క నమస్కారం చేయడంతోనే వస్తుంది.


Friday, 8 May 2015

స్వామి చిన్మయానంద వారి జయంతి

8 మే (ఈ రోజు) చిన్మయా మిషన్ స్థాపకులు స్వామి చిన్మయానంద వారి జయంతి. చిన్మయామిషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాల్లో ధార్మిక కార్యక్రమాలు జరిపారు. చిన్న వయసులో నాస్తికుడైనా, ఆ తర్వాత గురువుల అనుగ్రహంతో భగవదనుభూతి పొంది, సన్యాసం స్వీకరించారు. ఉపనిషత్తుల సారాన్ని అతి సామాన్యులకు అర్దమయ్యే రీతిలో బోధించారు. హిందువుల్లో ఐక్యత కోసం అంతర్జాతీయ వేదిక ఒకటి కావాలన్న సంకల్పం చేసినవారిలో వీరు కూడా ఉన్నారు. అట్లా ప్రారంభమైందే 'విశ్వ హిందూ పరిషద్'.
శ్రీ గురుభ్యో నమః

మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచండి - స్వామి చిన్మయానంద


Thursday, 7 May 2015

సద్గురు శివాయ సుబ్రముణియ స్వామి సూక్తి

పాశ్చాత్య ప్రభావం వలన అనేకమంది హిందువులు గణపతి నిజమైన దైవంగా భావించడంలేదు. వారికి ఆయన ఒక చిహ్నం, ఒక మూఢనమ్మకం, నిరక్షరాస్యులకు, పిల్లలకు తత్వశాస్త్రం వివరించే ఒక విధానం. కానీ కరుణామయుడైన గణపతి గురించి నా స్వానుభవం భిన్నంగా ఉంది. గణపతిని నేను అనేకమార్లు నా సొంత కళ్ళతో చూశాను. అనేకమార్లు ఆయన నాకు దర్శనమిచ్చి, తన ఉనికి గురించి నా అల్పస్థాయి మనసుని ఒప్పించాడు. గణపతి నిజంగా ఉన్నాడు. నన్ను నమ్మండి. గణపతి ఆరాధన శీఘ్ర ఫలాలను ఇస్తుంది.

సద్గురు శివాయ సుబ్రముణియ స్వామి (కుఐ హిందూ ఆధీనం, హవాయి, అమెరికా)  


Wednesday, 6 May 2015

పరమాచార్య వాణి

ఈ రోజు నడిచే దేవుడి, అపర ఆదిశంకరులు, కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి 122 వ జయంతి.
ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే దలైలామా వేనోళ్ల పొగిడారు.

పరమాచార్య వాణి -
కృషి లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇష్టంతో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దాంతో పాటు వచ్చే కష్టనష్టాలను భరించడానికి సిద్ధపడతారు. కానీ ధర్మాన్ని ఆచరించే విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని ఎందుకంటున్నారు? అవరోధాలు ఏర్పడతాయి. ఏ పనైతే వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా చేయబడుతుందో, అది గొప్ప ఫలాలను ఇస్తుంది, సాధించామనే గొప్ప భావననూ ఇస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని విడువరాదు.

కంచి పరమాచార్య స్వామి  


Monday, 4 May 2015

బుద్ధుని సూక్తి

ఎవరైతే వేదాల ద్వారా ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటారో, వారు ఉన్నతమైన, స్థిరమైన స్థానాన్ని పొందుతారు. ఎప్పుడు  సందిగ్ధతకు లోనవ్వరు - గౌతమబుద్ధుడు (సుత్త నిపాఠ 292)
బుద్ధుని మాటలను ఆచరణలో పెట్టి అభివృద్ధిలోకి వద్దాం.
బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలుSunday, 3 May 2015

హిందూ ధర్మం - 157 (అధర్వణవేదం)

Adharvana veda

4. అధర్వణవేదం - అధర్వ, అంగీరసులు దర్శించి అందించిన వేదం కనుక దీనికి అధర్వణ వేదమని, అధర్వాంగీరసమని పేర్లు. పరబ్రహ్మం గురించి చెప్తుంది కనుక దీనికి బ్రహ్మవేదమని, ఆనందాన్నిస్తుంది కనుక ఛందోవేదమని దీనికి పేర్లు. నిరుక్తం 11.18 ప్రకారం ఏ వేదం వలన అన్ని రకాల సందేహాలు, లోపాలు తొలగిపోతాయో దాన్నే అధర్వణవేదం అంటారు. ఇందులో చెప్పబడ్డ జ్ఞానం, కర్మాచరణ, సాధన వివిధ రకాల శాస్త్రాలకు పరిపూర్ణతను ఇస్తుంది. అది సామాజిక శాస్త్రమైనా, భౌతిక శాస్త్రమైనా. అధర్వణవేదం విజ్ఞానము (Science), సాంకేతిక పరిజ్ఞానం (technology), ఆచరణాత్మకమైన సామాజిక శాస్త్రం (applied social sciences) మానవప్రవర్తన గురించి వివరిస్తుంది. అందువల్ల ఈ వేదంలో గణిత (mathematics), భౌతిక (physics), రసాయన (chemistry), జ్యోతిష్య (Astrology), విశ్వోద్భవ (Cosmology), వైద్య (Medicine) , వ్యవసాయ (Agriculture), వాస్తు (Engineering), రక్షణ (Military), వైమానికి (Aeronautics), సృష్టి ఆవిర్భావ, రాజకీయ (Politics), సామాజిక (Social sciences), మనస్తత్త్వ (Psychology), ఆర్ధిక (Economics) శాస్త్రాలు ఇందులో చర్చింబడిన ముఖ్యమైన అంశాలు. ఒకరకంగా చెప్పాలంటే అనేక శాస్త్రాల యొక్క ఎన్సైక్లోపీడియా (encyclopedia) అధర్వణవేదం. వైద్య, రసాయనశాస్త్రాలు ఇందులో ముఖ్యాంశాలు.

కానీ అధర్వణవేదమే అత్యధికంగా తప్పుగా అర్దం చేసుకోబడిన వేదం. 

ఈ వేదానికి 9 శాఖలుండేవి. కానీ ఇప్పుడు శౌనక, పిప్పలాద అనే 2 శాఖలు మాత్రమే మిగిలాయి. అందులో పిప్పలాద సంహితకు చెందిన ఒకే ఒక ప్రతి కాశ్మీరంలో దొరికింది. కానీ అది అసమగ్రంగా ఉంది. పిప్పలాదుని ప్రశంస ప్రశ్నోపనిషత్తులో కనిపిస్తుంది. ఈ శాఖకు 21 కాండలు ఉన్నాయని, దీని బ్రాహ్మణం  8 అధ్యాయాల గ్రంధమని తెలుస్తోంది. కానీ అది కూడా అసంపూర్తిగా దొరికింది.

ప్రస్తుతం అధర్వణ వేదానికి సంబంధించి శౌనకశాఖ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర బ్రాహ్మణులు దీని అధ్యయనం చేస్తున్నారు. మొత్తం అధర్వణ వేదానికి సంబంధించి గోపధ బ్రాహ్మణం ఒక్కటే లభిస్తోంది. ఇది పూర్వ, ఉత్తర భాగములుగా లభిస్తోంది. గోపధ బ్రాహ్మణం కూడా శౌనకశాఖకు చెందినదే. మొత్తం ఈ శౌనకశాఖలో 20 కాండలు, 732 సూక్తములు, 5897 మంత్రాలు ఉన్నాయి. ఈ వేదానికి సంబంధించి ఆరణ్యకాలేవీ అందుబాటులో లేవు.

అధర్వణవేదానికి సంబంధించి ప్రస్తుతం కఠోపనిషత్తు, ప్రశ్న, ముండక, మాండూక్య, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు లభ్యమవుతున్నాయి. మాండూక్యోపనిషత్తుకు గౌడపాదాచార్యులవారు కారిక రాశారు. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి ఈ ఉపనిషత్తే మూలమని ప్రసిద్ధి.

అధర్వణవేదంలో నిష్ణాతుడై యజ్ఞంలో పాల్గొనే అధర్వణవేద పండితుడిని బ్రహ్మ అంటారు. యజ్ఞసమయంలో లోపములు తలెత్తకుండా చూసుకోవడం, జరిగిన లోపాలను సవరించడం, యాగం సంపూర్ణంగా, శాస్త్రబద్ధంగా జరిగేలా చూడటం ఇతని కర్తవ్యం.

To be continued .....................

Saturday, 2 May 2015

నృసింహ జయంతి శుభాకాంక్షలు

ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మరణం తర్వాత మరో శరీరం కొరకు జీవుడు ఒంటరి ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన గాఢాంధకారం నెలకొని ఉంటుంది, గమ్యం తెలియదు, దారి తెలియదు, నా అనుకున్నవాళ్ళెవరు ఉండరు, కళ్ళు పొడుచుకుని చూసిన చీకటి తప్ప వెరొకటి కనిపించదు. ఆ సమయంలో జీవుడు భీతిల్లుకుండా, భయపడకురా, నీకు తోడుగా నేను ఉన్నానని, ఆత్మకు తోడుగా యాత్ర చేస్తూ, ధైర్యాన్నిస్తూ అనుగ్రహించే దయాసముద్రా! కారుణ్యధామ! నా తండ్రి! లక్ష్మీ నరసింహ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఆదిశంకరాచార్య కృత లక్ష్మీనరసింహ కరవాలంబస్తోత్రం