Thursday 31 August 2023

శ్రీదత్త పురాణము (244)

 


అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కొని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి, తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడి కూనను సంహరించి తెచ్చి, ఆ మాంసం వండి, పసిబిడ్డ మాంసమని హుండుడుకి వడ్డించారు. అది భక్షించి హుండుడు నిశ్చింతగా నిద్రపోయాడు.


తెల్లవారింది, వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్యలక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమ వాసులంతా మాకు తెలీదంటే మాకు తెలీదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి, ఆయు మహారాజుగారి పుత్రుడిలా ఉన్నాడు. ఈ తేజస్సూ ఈ కాంతీ కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము - అన్నారు. వసిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.

దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిపా ! నీ వంశం బాలభావధూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు, దేవ పూజ్యత దక్కుతుంది- అని నామకరణం చేసి దీవించాడు.


వసిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదవేదాంగాలూ నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలూ నేర్పాడు. నహుషుడు సర్వవిద్యావేత్త సకల కళాపారీణుడూ అయ్యాడు.


అక్కడ రాజంతఃపురంలో ఇందుమతికి మెలుకువ వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది, సఖులను అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధివీధికీ ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలివారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ? ఎలా అపహరించగలిగారు? ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి.


Wednesday 30 August 2023

శ్రీదత్త పురాణము (243)

 


ఇదే సమయంలో - హుండుడు అనే దానవుడి కూతురు ఇష్టసఖులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది. భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడనీ అతడి చేతిలో హుండుడు మరణిస్తాడనీ అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందనీ అందాకా మనకు ఈ ఇడుములు తప్పవనీ చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండ పుత్రిక విన్నది. పరుగుపరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండుడు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతీ గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చెయ్యాలని నిశ్చయించుకొని అదృశ్యరూపంలో ఇందుమతీ శయనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయరూపాలు ఆమెకు కావలి ఉండటం గమనించాడు. ఆమె తేజస్సునీ వారి తేజస్సునీ తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజో రక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు.


ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్యతేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసఖులు వీడు సూనుడు కాడు భానుడు అని తృళ్ళిపడ్డారు. సూతికాగృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభావార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండుడు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయంకోసం వేచివేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహపరచి హుండుడు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు. వీణ్ని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను - అన్నాడు. ఈ పసి గుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ని చంపడమేమిటి, వండటమేమిటి, నువ్వు తినడమేమిటి - ఏమీ నాకు అర్ధం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండుడు. కామోసనుకొని ఆమె సైరంధ్రి మేకలను పిలచి బిడ్డణ్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలయ్యింది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమయ్యింది. ఈ శిశువు అసాధారణుడు. మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండుడు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరి తరమూ కాదు. కర్మ రక్షిస్తూంటే ఎవడు ఎవణ్ని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి. బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళూచేతులూ కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి వస్తాడు.


Tuesday 29 August 2023

శ్రీదత్త పురాణము (242)

 


ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆ కపాలంతో తీసుకురా. మాంసభోజనం కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరత్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చలభక్తికీ గురుశుశ్రూషకూ సంబరపడి ఆయు భూపతీ! ఏం కావాలో వరం కోరుకో ఇస్తానన్నాడు. దత్తయోగీంద్రా! గుణ సంపన్నుడూ సర్వజ్ఞుడు దేవవీర్యుడు దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడూ దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడూ ప్రజాపాలన దక్షుడూ యజ్ఞ నిర్వాహకుడూ దానశీలుడూ శరణాగత తత్పరుడూ మహాత్యాగి వేద శాస్త్ర పారంగతుడూ ధనుర్వేద నిపుణుడూ అనాహతమతిమంతుడూ సుందరాకారుడూ - ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ని వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవాంశతో - పుడతాడనీ సార్వ భౌముడవుతాడనీ ఇంద్రతుల్య పరాక్రముడవుతాడనీ ఆశీర్వదించి, ఒక పండు చేతికందించి ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను. నీ కిచ్చిన వరం ఫలిస్తుంది - అని చెప్పి అదృశ్యమయ్యాడు. 


ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కన్నులకద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కలవచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిధుడు, సముజ్జ్వలత్సర్వాంగుడు, శ్వేతవస్త్ర సుశోభితుడూ, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపిన విరాజితుడు. చతుర్భుజుడు, శంఖ చక్రగదాఖడ్గధారి. హారకంకణకేయూరనూపురాలంకృతుడు. చంద్రబింబంలాంటి ఛత్రచ్ఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబంల్లాంటి మకరకుండలాలు చెక్కిళ్ళుపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్యపురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. ఆటుపైని ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడయ్యాడు. 


ఇందుమతికి మెలకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే శౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవ్వాళ మహారాణికి కలలో దర్శనమిచ్చారని క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడనీ ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందనీ స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ మహార్షి రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుణ్ని ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు.


Monday 28 August 2023

శ్రీదత్త పురాణము (241)

 


దేవదేవా ! జనార్ధనా ! శంఖ చక్ర గదాధరా ! నువ్వు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు. అన్నీ విఖ్యాతిపొందాయి. కానీ దత్తాత్రేయావతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనదీ ప్రత్యేకమైనదీను. ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితులనుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరింపబడిన ఒక రాజు కథ నీ ముఖతః వినాలని నా కోరిక. ఇంతకుమించి నేను వేరే కోరే వరాలు ఏమీలేవు. నన్ను అనుగ్రహించు.


నహుష వృత్తాంతం


తుంగపుత్రా ! వేన తపస్వీ ! ఆయువు అని ఒక సార్వభౌముడున్నాడు. సత్యధర్మ పరాయణుడు. తపో యశో బలాలతో ఇంద్ర సమానుడు. దానధర్మాలతో యజ్ఞయాగాలతో నియమ నిష్ఠలతో పుణ్యకార్యాలతో పవిత్రంగా ఏకచ్ఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికే విభూషణంగా భూలోకంలో కీర్తిప్రతిష్ఠలు గడించాడు. అయితే ఎంతకాలానికీ ఆ దంపతులకు సంతానం కలుగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడి మహిమ విని ఒక మంచిరోజున హుటాహుటిన బయలుదేరాడు. చెంగట దత్తాశ్రమం చేరుకున్నాడు. అల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించాడు. సర్వాలంకార విభూషితుడై మదిరానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృందపరివేష్టితుడై కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలూ ముక్తామాలికలూ ఫరిడవిస్తున్నాయి. తనువంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవీతం తళతళా మెరిసిపోతోంది. ఆయువు నదురూ బెదురూ లేకుండా పరుగుపరుగున వెళ్ళి దత్తాత్రేయుడి పాదాలమీద సాష్టాంగపడ్డాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. ధృడసంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్కచెయ్యలేదు. దత్తదేవుడి పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై నూరేళ్ళు సేవలు చేశాడు. మనసుపెట్టి భక్తితో సకలపరిచర్యలూ చేశాడు. నిత్యము స్తుతించాడు.


అత్రిసంభవా ! మహాభాగా ! గోవింద ! పురుషోత్తమా ! బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజా ! దేవదేవేశ ! పరమేశా ! నమోనమః ! శరణాగతవత్సలా ! నిన్నే శరణువేడాను. హృషీకేశా ! నువ్వు కల్పించిన మాయను నువ్వే ఉద్దరించు. నువ్వు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదనా! నువ్వు జగన్నాధుడవని ఎరుగుదును. గోవిందా ! విశ్వరూపా ! నన్ను కటాక్షించు. నన్ను రక్షించు. నమోనమః


Sunday 27 August 2023

శ్రీదత్త పురాణము (240)

 



దీపకా! నువ్వు ధన్యుడవు కావటమే కాదు నీ తల్లిదండ్రుల్ని సైతం ధన్యుల్ని చేస్తున్నావు. పితృదేవతల్ని తరింపచేస్తున్నావు. నువ్వు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథా శ్రవణఫలం అంతటిది. అంతేకాదు అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ని చేస్తున్నావు. నాయనా ! నీలో ఇంకొక సుగుణం నాకు మరీ నచ్చింది. ప్రతికథనూ నేను చెబుతున్నంత శ్రద్ధగానూ వింటున్నావు. ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడంకోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు. ఇలాంటి శ్రోత దొరకడం చాలా అదృష్టం పైగా కథ కూడా అటువంటిది.


వేన వృత్తాంతము


అనగా అనగా ఒక పక్షిరాజు, అతడి పేరు కుంజులుడు. అతడికి నలుగురు కొడుకులు. శౌర్యవీర్య బలోన్మత్తులు. గరుత్మంతుడితో సమానులు. వీరిలో పెద్దవారి పేరు కపింజలుడు. ఈ నలుగురూ ప్రతిరోజు నాలుగు దిక్కులకి వెడతారు. సంచరిస్తారు. సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవీ విన్నవీ వింతలూ విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తుంటారు. భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా ఆడిగి అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు.


ఒకనాటి సాయంకాలం కపింజలుడు పట్టరాని ఆనందంతో తిరిగివచ్చి తండ్రికి సవినయంగా నమస్కరించి - తండ్రీ ! ఈ రోజు నేనొక వింత చూసాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడై జనార్ధనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్మహావిష్ణువును నేను దర్శించగలిగాను. తండ్రీ! నిజంగా నా జన్మ సఫలమయ్యింది. నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు..


నాయనా ! కపింజలా ! నిజంగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు ? అతడి ప్రభావం ఏమిటి ? జనార్ధనుణ్ని ఎలా ప్రసన్నుణ్ని చేసుకున్నాడు? ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వఱద కట్టించిన వరాలేమిటి? ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడని మాత్రమే కాదు సర్వజ్ఞుడవు, యోగ విద్యావేత్తవు. కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు. నేనెరుగుదును అంచేత ఇవన్నీ చెప్పి నా కుతూహలం తీర్చు.


తండ్రీ ! నాకు తెలిసినంతమట్టుకు తప్పకుండా చెబుతాను. అందరూ వినండి తుంగుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. గురుచరణసేవా పరాయణుడు. మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యుల్బణుడు వేనుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితంగా వేనుడు నిత్యమూ రోగపీడితుడై దుఃఖ పడుతున్నాడు. తండ్రి చూసి- తపస్సు చేసుకో, పాప క్షయమూ, రోగక్షయమూ అవుతుందని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేనుడు ఆరోగ్యకాంక్షతో ఘోరతపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్నీ రాజ్యభోగాలనూ సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేనుడు రాజ్యభోగాలు చాలాకాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు సాగించాడు. గోవిందుడు గరుడవాహనం మీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.

Saturday 26 August 2023

శ్రీదత్త పురాణము (239)

 


యాచకుల్ని ఆదరించేవాడూ, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడూ, ఇతరుల్లో రంధ్రాన్వేషణ చేయనివాడూ ఉత్తముడు. ఇక దుష్టుడెలా ఉంటాడంటే- ఎవ్వరు ఏమంచి పని చెప్పినా వినడు. పరుల్ని శంకించడం తనని తాను శంకించుకోవడం, నిత్య శంకితుడుగా ఉంటాడు. మిత్రుల్ని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు. అంతరాత్మను చంపుకుంటాడు. కోపవివశుడుగా ఉంటాడు. ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మరచిపోతాడు- ఇవీ దుష్టుడి లక్షణాలు, వీణ్ని అధమపురుషుడంటారు.


శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి. కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు. అంతేకాని అధముల్ని చేస్తే సేవించకూడదు.


లోకంలో ఒక్కొక్కసారి అధములుకూడా బాగా ధనం ఆర్జిస్తారు. తెలివితేటలనండి, బలమనండి, పౌరుషమునండి - ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతారు. అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసా పాత్రుడుకాడు. పెద్దల సరసన కూర్చోలేడు.


దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి నాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ నీతుల్ని నీ పెద్దకొడుక్కి బోధించి దారిలో పెట్టుకో అని విదురుడు ధృత రాష్ట్రుణ్ని హెచ్చరించాడు.


దీపకా నిన్నావు గదా. ఇవి ఇహపరసారకాలైన నీతివాక్యాలు. ఇంకా చాలామంది ఇలాగ దత్తుణ్ని ఆశ్రయించి సంశయాలు తొలగించుకొని సన్మార్గాలు అలవరచుకొని జీవన్ముక్తులైనవారు ఉన్నారు. పరమాత్మగా ధ్యానించి అపునర్భవమైన ముక్తిని పొందుతున్నవారూ ఉన్నారు. మరింకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వేదధర్ముడు.


గురూత్తమా ! అత్రిపుత్రుడి మహాత్మ్యాలు ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక. ఎంతకీ తనివి తీరడంలేదు. భరత వంశంలో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుషుడు జన్మించాడనీ ఆ యోగీంద్రుణ్ని ఆరాధించి శత్రువుల్ని జయించి చక్రవర్తి అయ్యాడనీ క్లుప్తంగా విన్నాను. ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాబ్దాన్ని వికసింపజేయండి.


Friday 25 August 2023

శ్రీదత్త పురాణము (238)

 


ఈటెలలాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లుపొడిచే మానవుణ్ని లక్ష్మి సరస్వతులు ఆ క్షణంలోనే పరిత్యజిస్తాయి. దరిద్రదేవత వాడి ముఖంలో స్థిర నివాసమేర్పరుచుకుంటుంది. నిప్పులు కక్కుతున్న వాగ్భాణాలతో ఎవరు ఎంతగా హింసించినా చలించని వాడూ గుండెలు దహించుకుపోనివాడూ నిజమైన యోగి. అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు. అంబికేయా ! వస్త్రాలకు రంగులు అంటుకున్నట్టే మనుషులకు గుణాలూ అంటుకుంటాయి. సజ్జనుణ్ని సేవిస్తే సజ్జనత్వం, దుర్జనుణ్ని సేవిస్తే దుర్జనత్వం, తపస్విని సేవిస్తే తపస్విత్వం, చోరున్ని సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి. ఆరు నెలల సావాసంతో వీరు వారవుతారని లోకోక్తి.


తనను నిందించిన వాణ్ని తాను నిందించకుండా మరొకరితో నిందింపజెయ్యకుండా, తనను కొట్టినవాణ్ని తాను కొట్టకుండా కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చెయ్యకుండా చేయించకుండా జీవించేవాడికి ఏ పాపమూ అంటదు. దేవతలు మెచ్చి స్వయంగా ఎదురువచ్చి అతణ్ని తమ లోకానికి తీసుకువెడతారు.


రాజా ! అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు మాట్లాడటంకన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు.


ఒకవేళ మాట్లాడవలసినస్తే సత్యమే పలకాలి. అది రెండురెట్లు మంచిది. అది ప్రియం కూడా అయ్యేట్టు మాట్లాగడలిగితే మూడురెట్లు మంచిది. సత్యమూ ప్రియమే కాక ధర్మబద్ధంకూడా అయ్యేట్టు పలకగలిగితే అది నాలుగురెట్లు మంచిది. మనిషి ఎవరిని జతచేర్చుకుంటాడో, ఎవరితో జతకడతాడో, తానెటువంటివాడు కాదలుచుకున్నాడో దాన్నిబట్టి మార్పులు వస్తాయి. అటువంటివాడు అవుతాడు. ఏయే విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు. ఇలా క్రమంగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో. ఇదొక నిరంతరసాధన. దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం. నిందా, ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగినవాడు ఒకరిని జయించడు. ఒకరికి తాను ఓడిపోడు. ఒకణ్ని శత్రువనుకోడు, ఒకడికి తాను శత్రువుకాడు. ఇటువంటివాడికి సుఖదుఃఖాలు అంటవు. అందరికీ మంచి జరగాలనీ ఎవ్వరికీ కీడు జరగకూడదనీ కోరుకునేవాడూ, మృదు స్వభావం కలవాడూ, అంతర్భహిరింద్రియాలను నిగ్రహించినవాడూ - అతడూ ఉత్తమ పురుషుడంటే.


Thursday 24 August 2023

శ్రీదత్త పురాణము (237)

 


విదుర నీతి


ధృతరాష్ట్రా ! నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇది కులానికి చేటు తెచ్చిపెడుతుంది. కనక త్వరగా మేల్కొని నీ పెద్దకొడుక్కి తగిన బుద్దులు నేర్పు.


విదురా ! నువ్వు జ్ఞానివి. సకల నీతి శాస్త్రవేత్తవు. దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు. వాటిని వాడికి బోధిస్తాను. ఆపైన ఏది జరగాలో అది జరుగుతుంది.


ధృతరాష్ట్రా! సరే అయితే ఆలకించు, పూర్వకాలంలో దత్తయోగీంద్రుడు సాధ్యజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి. వాటిని నీకు ఉపదేశిస్తాను. శ్రద్ధగా ఆలకించు అని విదురుడు ఆరంభించాడు. -


ముందుగా మనస్సుకి సంశ్రుతం అలవర్చాలి. దానితో శమదమాదులూ సత్యమూ ధృతీ అలవడతాయి. వాటివల్ల హృదయగ్రంథి విడుతుంది. అరిషడ్వర్గం అంతరిస్తుంది. క్రోధాన్ని క్రోధంతో జయించలేం. సహనంతో ఓర్పుతో జయించగలం. క్రోధమనేది అన్ని అనర్థాలకూ మూలకందం, ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. వాడి పూర్వజన్మాశ్రిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అంచేత అందరూ తితిక్ష అలవరుచుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే ఏ మనిషి ఆక్రోశి కాకూడదు, అవమాని కాకూడదు. మిత్రద్రోహి కాకూడదు. నీచోపసేవి కాకూడదు, దురభిమాని కాకూడదు, హీనవృత్తుడు కాకూడదు. రూక్షంగా, పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదుల్చుకోవాలి. ఇది హృదయాలనూ, మర్మాలనూ అస్థికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి వాక్పారుష్యరూప మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలి పెట్టి దానికి ఆమడల దూరం తొలగిపోవాలి.


Wednesday 23 August 2023

శ్రీదత్త పురాణము (236)

 


దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా ఇరవై యొక్కసార్లు గాలించి దుష్టక్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో శమంతపంచకంలో తొమ్మిది మడుగులు నింపి పితృ తర్పణాలు విడిచిపెట్టాడు. ఆ తరువాత పదిబారల పొడుగూ తొమ్మిది బారల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు కశ్యపుడికి దానం చేశాడు. దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యాజ్ఞకులందరూ పంచుకున్నారు. అప్పటి నుంచీ ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులని పేరు ఏర్పడింది.


క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు. సరస్వతీ నదీలో అవభృధస్నానం చేశాడు. కల్మషాలన్నీ తొలగించుకున్నాడు. ఈ మహేంద్రపర్వతం మీద నివాసం ఏర్పరుచుకుని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు. అప్పటికి తెల్లవారింది. చతుర్దశి వచ్చింది. భార్గవరాముడు వచ్చాడు. ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు. భార్గవుడు కూడా వారినందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యమిచ్చి మర్నాడు. వీడ్కోలు పలికాడు. తానూ దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు.


దీపకా ! విన్నావు కదా ! శ్రీమన్నారాయణుడు దత్తరూపంలో వరాలిచ్చి కార్తవీర్యార్జునుణ్ని మహావీరుణ్ని చేసి అతడు కోరుకున్నట్టే అధికవీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతణ్ని సంగ్రామంలోనే సంహరించాడు. నాయనా ! ఇదీ విష్ణోశ్చరితమధ్భుతమ్ ! సంక్షేపంగా చెప్పాను - అని వేదధర్ముడు ముగించాడు.


గురుదేవా ! దత్తాత్రేయుడు సాధ్యజాతిదేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే శమదమాదుల్నీ, నీతుల్నీ ఉపదేశించాడని విన్నాను. వాటిని తమరు నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను.


దీపకా ! జ్ఞానకళా స్వరూపుడూ - స్వయంభువూ అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడుగా అవతరించాడు. అతడు జ్ఞాన ఘనుడు. సాక్షాజ్జగద్గురుడతడు. దేవతలకూ, సిద్ధులకూ, సాధ్యులకూ, మనుష్యులకు అందరికీ అతడే పరమ గురువు. జ్ఞాన - యోగ - తపో - యమ - నియమ - శమాది మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించిన దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు. ఆయనే అందరికీ మార్గమూ గమ్యమూను, సంసార సాగరాన్ని తరించి కృతార్ద్రత పొందాలంటే ఈ సద్గురూ పాసన ఒక్కటే సాధనం. అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుణ్ని ఆశ్రయించి భక్తిజ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నింటినీ అడిగి తెలుసుకొని వెడుతుంటారు. అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రభోదాలను ఒకానొక సందర్భంలో విదురుడు దృతరాష్ట్రుడికి వినిపించాడు. వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించుకో అని వేధర్ముడు ఇలా ప్రవచించాడు.


Tuesday 22 August 2023

శ్రీదత్త పురాణము (235)

 


ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది. ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. రేణుకాదేవి కొంచెంసేపు నిలబడి వాళ్ళని చూసింది. తానూ అలాంటి జలకేళికి ముచ్చటపడింది. వెంటనే మనస్సును నిగ్రహించుకుంది. స్నానం ముగించుకొని త్వరత్వరగా ఆశ్రమం చేరుకుంది. ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉంది. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపారచూశాడు. ముఖంలో బ్రాహ్మ్యకళ లోపించడాన్ని గుర్తించాడు. ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. 


సమత్కుశలకోసం అడవికి వెళ్ళిన నలుగురు కొడుకులూ అదే సమయానికి తిరిగివచ్చారు. వాళ్ళని చూసి, మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికీ పేరుపేరునా ఆజ్ఞాపించాడు జమదగ్ని. అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసొప్పక స్థాణువులై నిలబడిపోయారు. దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపు అయ్యింది. నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురూ ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడజీవితం గడపండి అని శపించాడు. అంతలోకీ పరశురాముడు వచ్చాడు. జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు. అనడమేమిటి అతడు తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సు నరికివేశాడు. జమదగ్ని కోపం చల్లారింది. సంతోషించాడు. భార్గవరామా! వరాలు కోరుకో ఇస్తానన్నాడు.


తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలనీ ఈ శిరఃఖండన వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదనీ సోదరులు నలుగురూ శాపవిముక్తులు కావాలనీ తనకు మాతృహనవదోషం అంటకూడదనీ రణరంగంలో ఆప్రతిహతశక్తి దీర్ఘాయువూ తనకు కావాలనీ రాముడు కోరుకున్నాడు. జమదగ్ని తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్రనుంచి మేల్కొనట్టు కళ్ళు తెరచి చూసింది. అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తానూ విముక్తుడు అయ్యాడు.


అటుపైన కొంతకాలానికి కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు. దీనికి అలిగిన భార్గవ రాముడు కార్తవీర్యుడి సహస్ర బాహులను ఖండించి సంహరించాడు. హోమధేనువుని తోలుకుని తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు.


Monday 21 August 2023

శ్రీదత్త పురాణము (234)

 


ఋచీకుడు వరుణుణ్ని అడిగి అటువంటి వెయ్యి గుర్రాలూ పొందాడు. అవ్వి కాన్యకుబ్జం చెంత గంగ నున్చి పైకి వచ్చాయి. అప్పటి నుంచీ ఆ రేవుకి అశ్వతీర్థమనే పేరు స్థిరపడింది. ఆ గుర్రాలని గాదికి అందించి ఋచీకుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు. కావ్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగితేలుతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున ఋచీకుడి తండ్రి భృగువు వచ్చాడు. కొడుకునీ కోడల్నీ వారి అన్యోన్యదాపంత్యాన్ని చూసి సంతోషించాడు. కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు. భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువులో నేలమీద కూర్చున్నారు.


సత్యవతీ ! నీ గుణగణాలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు భృగువు. తనకూ తన - తల్లికీ పుత్రసంతానం కలిగేట్టు వరమిమ్మంది సత్యవతి. భృగువు తథాస్తు! అన్నాడు. ఋతుస్నాతవై నువ్వు మేడిచెట్టును కౌగిలించుకో. ఇదిగో ఈ హవిస్సును (చదువు) భుజించు. అలాగే నీ తల్లి రావిచెట్టును కౌగిలించుకోవాలి. ఈ చఱువును ఆరగించాలి భద్రంగా పట్టుకు వెళ్ళి దీన్ని మీ తల్లికి అందించు - అని చెప్పి రెండు చరువులూ కోడలికి ఇచ్చాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. తల్లీ కూతుళ్ళు తాము కౌగలించుకోవలసిన తరువులనూ భుజించవలసిన చరువులనూ పొరపాటున తారుమారు చేసుకున్నారు. దీన్ని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు. ఇందువల్ల - నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచారపరుడవుతాడు. నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచారపరుడవుతాడు. ఇంతకన్నా ప్రమాదం ఏమీలేదులే అని కోడల్ని ఓదార్చాడు. అయితే ఇది సత్యవతికి నచ్చలేదు. తన కొడుకు బ్రాహ్మణాచారపరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనుమడికి సంక్రమించేట్టు చెయ్యమనీ అభ్యర్ధించింది. తథాస్తు! అన్నాడు భృగుమహర్షి.


కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. మగబిడ్డను ప్రసవించింది. జమదగ్ని అని నామకరణం చేశారు. అతడు చతుర్వేదాలను అభ్యసించి షట్ శాస్త్రాలను స్వాధీనం చేసుకొని మహాతేజస్వీ అయ్యాడు, మహాతపశ్శాలి అయ్యాడు. ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వసుమంతుడు సుషేణుడు వసువు విశ్వావసువు - - రాముడు - అని అయిదుగురు కుమారులు కలిగారు.


Sunday 20 August 2023

శ్రీదత్త పురాణము (233)

 


ధర్మ సంభవా ! భృగువంశంలో జనుదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జామదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతిపొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు.


హైహయవంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవ రాముని చేతిలో నిహతుడయ్యాడు. అతడికి వెయ్యి చేతులుండేవి. దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్యకాంచన విమానం ఉండేది. అతడి రధమూ అటువంటిదే. దాని గమనానికి అడ్డూ ఆపూ లేదు. ఆ రధం అధిరోహించి సమస్త భూపాలకుల్ని ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు. ఏడు ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అహంకరించి దేవతలను యక్షులనూ ఋషులనూ సమస్త భూతాలను పీడించసాగాడు. భరించలేక దేవతలూ ఋషులూ కలిపి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. కార్తవీర్యుణ్ని సంహరించు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు. శనీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్యవిమానంమీద అటువైపు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడనీ, అతడి ఆగడాలు మితిమీరిపోయాననీ ఇక ఉపేక్షింపరాదనీ విన్నవించాడు. విష్ణుమూర్తి అందరి వేదనలూ విన్నాడు. ఆలోచిస్తాను వెళ్ళిరండి - అని పంపించాడు. తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు.


ఇదేకాలంలో కాన్యకుబ్జాన్ని గాధి అని ఒక మహారాజు పాలిస్తున్నాడు. అతడు మహాబలశాలి. పరాక్రమశాలి. పరిపాలన బాధ్యతల్ని మంత్రులకి అప్పగించి అతడు కొంతకాలం సతీసమేతుడై వనవాసం చేశాడు. ఆ సమయంలో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది. సత్యవతి అని పేరుపెట్టారు. దినదిన ప్రవర్థమాన అయ్యింది. అప్సరసలను తలదన్నే సౌందర్యం. అందానికి తగిన గుణసంపద, భార్గవ వంశంలో పుట్టిన ఋచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు. తనకిచ్చి వివాహం చెయ్యమని గాధిదంపతుల్ని అభ్యర్ధించాడు. సంశిత ప్రతుడైన ఆ బ్రాహ్మణుణ్ని చూసి తన కులాచారం వెల్లడించాడు గాది. శరీరమంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండే వెయ్యి గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని పరిణయమాడమన్నాడు. శుల్కం తీసుకోకుండా కన్యాదానం చెయ్యడం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానికి వెళ్ళిపోయాడు.


Saturday 19 August 2023

శ్రీదత్త పురాణము (232)

 


దీపకా! తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్షిత్వమూ అవతారత్వమూనూ. అంచేత చిలిపి సందేహలన్నీ వదిలేసి బుద్ధిగా దత్తదేవుణ్ని ఆరాధించు- అన్నాడు వేదధర్ముడు.


గురూత్తమా! నిజంగా ఇది నాకు కలిగిన సందేహం కాదు. ఇలాంటి విపరీతబుద్ధులు భావి కాలాల్లో ఆవిర్భవిస్తారనీ పెడసరం ప్రశ్నలు వేస్తారనీ ఊహించి ముందుగానే సర్వజ్ఞులైన మీతో ఇలా సమాధానాలు రాబట్టుకుని లోకానికి తెలుపుడయ్యేట్లు చేశాను. లేకపోతే రేపటి ముందు ముందు కాలాల్లో ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. సరే గురుదేవా! దయానిధీ! నీ ముఖ పద్మం నుండి జాలువారే ఈ కధా మకరందం జన్మ జరావ్యాధి మృత్యునివారకం. ఇంతటి అదృష్టానికి నోచుకున్నందుకు నా జన్మచరితార్ధం. కార్తవీర్యుడి గురించి సమగ్రంగా తెలియజెప్పారు. అంతటివాణ్ని అవలీలగా జయించిన భార్గవరాముని గురించి కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించండి.


నాయనా దీపడా! నేను చెబుదామని అనుకుంటున్నదే నువ్వు అడిగావు, భారతంలో వ్యాసమునీంద్రుడు రచించిన భార్గవ రామచరిత్రను క్లుంప్తంగా చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించాడు.

భార్గవరాముని చరిత్ర


మాయాద్యూతంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు. మరికొందరు హితులూ, సన్నిహితులూ, మునులు వారి వెంట నడిచారు. అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు. కొంతకాలానికి మహేంద్ర పర్వతంమీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు. పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు. రోమశమహర్షి మార్గదర్శకత్వంలో అక్కడి ఆశ్రమాలనూ అక్కడి ఋషులను సందర్శించారు, ఆశీస్సులు పొందారు. భృగు అంగిరస వాసిష్ఠ కాశ్యప అకృతవ్రణాది మహర్షుల్ని దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని - ఆశ్రమమైతే కనిపించింది కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో - అని తన అభిలాషను ఆ మహర్షులముందు ప్రకటించాడు. అది విన్న అకృత వ్రణుడు - ధర్మజా ! మీ రాక భార్గవరామునికి ముందే తెలుసు. మీరంటే చాలా ఇష్టం, కనక దర్శనం ఇస్తాడు. సాధారణంగా ఆష్టమికీ చతుర్దశికీ ఈ ఆశ్రమానికి వస్తాడు. ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్ధశి. కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముణ్ని సందర్శించవచ్చు - అన్నాడు. దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు.

అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరికూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు. ఆకృతివ్రణా ! నువు భార్గవరాముని అనుచరుడివి. ఆ మహాబలపరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నువ్వు ప్రత్యక్ష ఆ సాక్షివి. అంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిదిలేదు. ఆ మహానుభావుడు ముయ్యేడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు ? ఏ కారణంగా జయించాడు ? ఈ వివరాలు యథాతధంగా వాస్తవరూపంలో తెలుసుకోవాలని నా కోరిక. అందుకు నువ్వొక్కడ్కివే సమర్థుడిని దయచేసి నన్ను కృతార్ధుణ్ని చెయ్యి - అని అభ్యర్ధించాడు.



Friday 18 August 2023

శ్రీదత్త పురాణము (231)

 


దత్తుడు విష్ణువే


దీపకా! మంచి ప్రశ్నవేశావు. దీనికి తత్త్యదీపన దీపకంగా నేను చెప్పే సమాధానం అత్యంత శ్రద్ధగా ఆలకించు. దత్తుడు- నిశ్చవనుడు- స్తంభుడు- ప్రాణుడు- కశ్వపుడు- ఔర్యుడు - బృహస్పతి- అనే ఏడుగుర్నీ మత్స్యపురాణం మహర్షులుగా పేర్కొంది. జేర్వుడు- వశిష్టపుత్రుడు- స్తంభుడు- కశ్యపుడు - ప్రాణుడు - బృహస్పతి - దత్తుడు- నిశ్చవనుడు అనే ఏడుగుర్నీ మహర్షులు అంటోంది వాయుపురాణం. స్వారోచిషమన్వంతరంలో వీరి పేర్లు వినిపిస్తే దేవతలు సైతం సంబరపడేవారట. ఇది దత్తాత్రేయుని మహర్షిత్వానికి పౌరాణిక నిదర్శనం.


ఇంక అవతార విషయకంగా ప్రమాణం చూపుతున్నాను. ఆలకించు. మత్స్యపురాణంలో నారద మహర్షికి ప్రమధగణ ప్రధముడైన నందీశ్వరుడు వీభూతిద్వాదశీ వ్రతం గురించి వివరిస్తూ ప్రతిమాసమూర్తి భేధన పూజగా విష్ణుమూర్తికి ద్వాదశ ఆవతారాలను చెప్పాడు. దత్తాత్రేయుణ్నీ ముసల సమన్వితుడైన వ్యాసుణ్ని అదనపు ఆవతారాలుగా పరిగణించి నెలకొక్కరుగా పన్నెండుమందినీ పన్నెండు నెలలూ ఆరాధించాలనీ వీభూతి ద్వాదశీ వ్రతం సారాంశం ఉపదేశించాడు. 


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందంనాల్లో అధ్యాయంలో నిమి చక్రవర్తికి ద్రుమిళుడు విష్ణుమూర్తి మహిమలను చెబుతూ జగత్కల్యాణం కోసం అతడు హంస- దత్త- సవత్కుమార- ఋషభాద్యవతారాలు ధరించాడని పలికాదు. ఇదే భాగవతంలో షష్టస్కందం అష్టమాధ్యాయంలో నారాయణకవచం చెప్పబడింది. ఉగ్రధన్వుడైన నారాయణుడు నన్ను అఖిల ప్రమాదాల నుండి కాపాడుగాక. హాసం నుండి నరుడు రక్షించుగాక, యోగనాధుడైన దత్తాత్రేయుడు అయోగం నుండి బ్రోచుగాక, కపిలుడైన గణేషుడు కర్మబంధం నుండి తప్పించుగాక.... ఇలా సాగుతుంది ఆ కవచం దీన్ని బట్టి నారాయణాంశ సంభవుడు దత్తాత్రేయుడు అని స్పష్టమవుతుంది.


షష్టస్కందం పంచాదశాధ్యాయంలో చిత్రకేతుడు తనకు కనిపించిన ఒక మహామునిని స్వామి! తమరెవరు? లోమశుడు - చ్యవనుడు - దత్తుడు - ఆసురి - పతంజలి మొదలైన మహానుభావుల్లో ఎవరు మీరు? - అని ప్రశ్నిస్తాడు. హరివంశంలో కూడా మరొక దాఖలా ఉంది. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై అవతరించాడనీ వేదాలూ వర్ణాశ్రమధర్మాల యజ్ఞయాగాలూ అడుగంటిపోతే, వాటిని ఉద్దరించాడనీ - కార్తవీర్యుడికి సహస్ర బాహువులూ - అధర్మ నివారణ - పృధివీ విజయం - సంగ్రామంలో అధికుడి చేతిలో మరణం - అనే నాలుగు వరాలూ ఇచ్చి భూగోళాన్ని ధర్మబద్ధంగా ఏలించాడనీ అతడికి అంకితం అయితే రెండు చేతులు వెయ్యి చేతులు అవుతాయనే వైశంపాయనుడు స్వయంగా ప్రశంసించాడు హరివంశంలో.


Thursday 17 August 2023

శ్రీదత్త పురాణము (230)

 


ఏ తిధినాడు ఏ సమయంలో ఎలా ఈ వ్రతం ఆచరించాలో తెలియజెప్పమని ధర్మరాజు అడిగిన మీదట కృష్ణుడు ఇలా చెప్పాడు. మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమి తిధినాడు ఈ వ్రతం చెయ్యాలి. దర్భలతో అనఘుణ్నీ అనఘాదేవినీ వారి అష్టపుత్రుల్ని ప్రతికృతులు చెయ్యాలి. మండపంలో నెలకొల్పాలి. వ్రతకర్త ఉదయమే లేచి స్నానసంధ్యాధికం ముగించుకుని తోరం కట్టుకుని వ్రతదీక్ష స్వీకరించాలి. భక్తిప్రపత్తులతో ఈ దర్భాకృతులకు షోడశోపచారాలు చెయ్యాలి. ఋగ్వేదోక్త మంత్రాలతో అనఘుడైన విష్ణుమూర్తినీ అనఘయైన లక్ష్మీదేవిని ధ్యానించాలి. స్తుతించాలి. హరివంశ సంభవులైన ప్రద్యుమ్నాది పుత్రవర్గంగా అష్టపుత్రుల్నీ భావించాలి.


ఆ ఋతువులో దొరికే కంద మూలఫలాలనూ సుగంధపరిమళభరితమైన పుష్పాలనూ వినియోగించాలి. ధూప దీపనైవేద్యాలు సమర్పించాలి. ఆపైన బంధుమిత్ర పరివారానికీ బ్రాహ్మణులకూ సమారాధన జరపాలి. మరొకడు ఈ వ్రతాన్ని స్వీకరించేటట్టు చేసి అప్పుడు వ్రతసమాస్తి పలకాలి.


అష్టమి నాటి రాత్రి నట, నర్తక, గాయకుల హరికధా సంకీర్తనంతో భజనలతో జాగరణం చెయ్యాలి. నవమి నాటి ఉదయం అనఘస్వామికి పునఃపూజ చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పాలి. ఆపైన ఆదర్భాకుతుల్నీ పత్ర పుష్పాది నిర్మాల్యాన్ని భద్రంగా తీసికెళ్ళి నదిలోగానీ, చెరువులోగానీ, బావిలోగానీ నిమజ్జనం చెయ్యాలి. ఇలా ప్రతి సంవత్సరమూ భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని బ్రతికున్నంతకాలమూ చేస్తే వారికి విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. కుటుంబం అన్నింటా అభివృద్ధి సాధిస్తుంది. ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి. ఏడుతరాలు తరిస్తాయి. పాండవాగ్రణా! నవ్వు కూడా ఈ వ్రతం ఆచరించు. కార్తవీర్యార్జునుడు అంతటివాడివి అవుతావు అని శ్రీకృష్ణుడు శుభాకాంక్ష పలికి ముగించాడు.


దీపకా! ఇదీ దత్తదేవుడి కధాకధనం. జంభ దైత్య పరాజితులైన దేవతల్ని దత్తదేవుడు రక్షించటం, అతడి అనఘత్వం, యోగచర్య, భక్తుడైన కార్తవీర్యయోగికి చేసిన వరదానం, ఈ అనఘతోషణ వ్రతం, ఇలా అన్నీ చెప్పాను. ఇంకా ఏమి వినాలని అనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు చెబుతాను. హాయిగా విందువుగాని అని ముగించాడు వేదధర్ముడు.


గురూత్తమా! నాదొక చిలిపి సందేహం. మీరు బ్రహ్మాండాది బహుపురాణవేత్తలు కనుక కోపగించుకోకుండా చెబుతారని అడుగుతున్నాను. దత్తాత్రేయుణ్ని మహర్షి అంటున్నారు. విష్ణుమూర్తి అవతారం అంటున్నారు. యోగులకు యోగి అంటున్నారు. వీటన్నింటికీ ఏమైనా పురాణకాలంలో ఆధారాలు వున్నాయా? అనేది నా సందేహం. నువ్వు దీనవత్సలుడివి. దయచేసి నా సందేహం తీర్చు.


Wednesday 16 August 2023

శ్రీదత్త పురాణము (229)

 


అతడి ఏలుబడిలో ప్రజలు అపూర్వసుఖాలు అనుభవించారు. ఏ కష్టం వచ్చి ఏ పౌరుడు తనను తలుచుకున్నా కార్తవీర్యార్జునుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేవాడు. ఆదుకునేవాడు. ఒక్కసారిగా ఏడుదీవుల్లోనూ ఎక్కడైనా ఎవరికైనా స్మరిస్తే చాలు ప్రత్యక్షమయ్యేవాడు.


తానే పశువుల్ని కాసేవాడు. పర్జన్యుడై వర్షించేవాడు. ఇటువంటి అద్భుతశక్తులు అనేకం అతడికి అందించాడు. దత్తస్వామి, యోగమార్గంలో కూడా నిష్ణాతుణ్ని చేసాడు. కర్కోటకుణ్ణ్ని తెచ్చి ఈ కార్తవీర్యుడు తన రాజధాని మహిష్మతికి కావలి పెట్టాడు. ఒకనాడు ముచ్చటపడి అంతఃపురకాంతలతో జలకాలాడుతూ తన వెయ్యి బాహువులనూ సాచి నర్మదా నదీ ప్రవాహానికి అడ్డుకట్టవేశాడు. ప్రవాహాన్ని వెనుక దారి పట్టించాడు. సముద్రాన్ని ఒకసారి ఇలాగే అల్లకల్లోలం చేసాడు. ముల్లోకాలను గడగడలాడించిన దశకంఠుడ్ని అవలీలగా బంధించి కారాగారంలో పడేశాడు. ఆ తరువాత పులస్త్యబ్రహ్మ స్వయంగా వచ్చి కార్తవీర్యుణ్ని బ్రతిమాలి రావణున్ని విడిపించుకెళ్ళాడు.


ఒక పర్యాయం ఆకలిగొన్న విప్రునిరూపంలో చిత్రభానుడు అర్ధిస్తే అతడికి యావద్భూగోళాన్ని బిక్షగా సమర్పించాడు ఈ కార్తవీర్యుడు. (మొత్తం భూగోళాన్ని అగ్నిబాణరూపంలో భక్షిస్తూంటే తాను చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు వశిష్ట మహర్షి తన వేల సంవత్సరాల తపోదీక్ష నుండి జలసమాధి నుండి ఇవతలకి వచ్చి పరిస్థితి గమనించి కార్తవీర్యార్జునుణ్ని శపించాడు. బ్రాహ్మణ బాలుడైన భార్గవరాముని చేతిలో సంహరింపబడతావన్నాడు. దత్తాత్రేయుడి నుండి తానువరంగా పొందిన మరణ విధానమూ ఈ శాపమూ సంపాదించటంతో కార్తవీర్యుడు సంబరపడ్డాడే కానీ దిగులు చెందలేదు.)


ఇంతటి మహామహిమాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునుడు దత్తయోగీశ్వరుని దయవల్ల మర్త్య లోకంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం - ఈ అనఘాష్టమీ వ్రతం.


అఘము అంటే పాపం, అది మనోవాక్కాయకర్మలుగా మూడు విధాలు. దాన్ని నాశనం చేస్తుంది కనుక ఇది అనఘవ్రతం. అనఘుడు అంటే దత్తాత్రేయుడు. అనఘా అంటే లక్ష్మీదేవి. అనఘుడు ఉపదేసించింది కాబట్టి అది అనఘవ్రతం. అనఘాదేవిని ఆరాధించేది కాబట్టి అనఘావ్రతం ఇలా దీనికి మూడు విధాలుగా సార్థక్యం వచ్చింది.


Tuesday 15 August 2023

శ్రీదత్త పురాణము (228)

 


అనఘా వ్రతమహిమ


గురుదేవా! దత్తదేవుణ్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఏమిచెప్పాలో నువ్వే నిశ్చయించి ఎరుకపరుచు, ధర్మరాజు శ్రీకృష్ణుణ్ని ఇంక ఏమీ అడగలేదా? అడిగితే శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు? ఆ రహస్యాలు తెలుసుకోవాలని, ఉంది. కటాక్షించండి.


దీపకుడి అభ్యర్ధన వేదధర్ముడికి వచ్చింది. తాను చెబుదామనుకుంటున్నదే శిష్యుడు అడిగాడు. సంబరపడి ఇలా ఆరంభించాడు. నాయనా దీపకా! శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన అవఘావ్రత మహిమను ఆలకించు.


ధర్మరాజా! అనసూయాత్రి దంపతులకు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. అతడి ప్రియురాలి పేరు అనఘాదేవి. లక్ష్మీదేవియే అనఘాదేవి. వీరికి ఎనిమిది మంది సంతానం. అష్టసిద్ధులే కుమారులుగా అవతరించాయి.


ఒకప్పుడు జంభాసురుడి ధాటికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ అమరావతిని వదలి బ్రతుకు జీవుడా అని సలాయనం చిత్తగించారు. సహ్యాద్రి మీద తపస్సు చేసుకుంటున్న దత్తాత్రేయుణ్ని శరణు వేడారు. వారిని తరుముకుంటూ రాక్షసులూ వచ్చారు. దత్తాత్రేయుడు అనఘాదేవి సహితుడై యుక్తిగా ఆ రాక్షసులందర్ని సంహరింపజేసి దేవతలను కాపాడాడు. ఇంద్రుడికి సింహాసనం అప్పగించాడు. 


ఈ దత్తయోగీంద్రుడు యోగమార్గం అవలంబించి వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. కళ్ళు తెరచి భ్రూమధ్యస్థానంలో దృష్టి నిలిపి మూడు వేల దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరమనే దివ్యతపస్సు చేసాడు. కాష్టంలాగా పర్వతశిలలాగా విశ్చలంగా నిలబడి ఊర్ద్వబాహువై తపస్సు సాగించాడు.


యోగదీక్షలో ఉన్న దత్తాత్రేయుణ్ని కార్తవీర్యార్జునుడు భక్తిశ్రద్ధలతో సేవించాడు. దత్తుడి హృదయం గెలుచుకున్నాడు. అనేక దివ్యవరాలు పొందాడు. దివ్యరధం, సహస్ర బాహువులు, సహస్రాయుధాలు ఒకటేమిటి ఇలా అనేక వరాలు పొందాడు, సప్త ద్వీపావృతమైన యావద్వసుంధరకూ ఏకైక చక్రవర్తి అయ్యాడు. ఎనభై అయిదు వేల సంవత్సరాలు పాలించాడు. భూరిదక్షిణలతో మహావైభవంగా అనేక యజ్ఞాలు చేసాడు. అతడి యజ్ఞవేదికలూ యూపస్థంభాలూ అన్నీ బంగారమే.


Monday 14 August 2023

శ్రీదత్త పురాణము (227)

 


అనంతుడికి నమస్కారమని శిరస్సునూ, సర్వాత్ముడికి ననుస్కారమని పాదాలను, శేషుడికి నమస్కారమని జామాయుగళాన్ని, కాముడికి నమస్కారమని కటిని, వాసుదేవుడికి నమస్కారమని పార్శ్వాలనూ, సంకర్షుణుడుకి నమస్కారమని ఊరు యుగళాన్ని, వస్త్రధారికి నమస్కారమని భుజాలను, శ్రీకంఠనాధుడికి నమస్కారమని కంఠాన్ని, విశ్వముఖుడుకి నమస్కారమని ముఖాన్ని ఇలాగే నా నామధేయాలతో (శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతున్న కథ) హల ముసలాలనూ అర్చించాలి. తరువాత నక్షత్ర దేవతా పూజలు చెయ్యాలి. చంద్రుణ్ని పూజించాలి. ఆకాశ జలంతో నింపి బంగారం వేసి పన్నెండు ఘటాలు నింపి మాస - సంత్సరాది దేవతలను ఆవాహన చేసి యధావిధిగా అర్చించాలి. కడపటి వేద పురాణవేత్తయై జితేంద్రియుడై శాంత స్వభావుడైన పురోహితుడికి లేదా మరొక యోగ్యనిపుడికి ఈ సువర్ణానంత ప్రతిమనూ రజత హల ముసలాలనూ అనంతుడు సుప్రీతుండగుగాక అంటూ దానం చేసి దక్షిణ తాంబూలాలు నూతన వస్త్రాలు అందించాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా యధాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనాలతో సంతృప్తిపరచాలి. ధర్మజా! అప్పటికి ఈ వ్రతం సమాప్తమవుతుంది- అని మైత్రేయి శీలధరకు అనంత వ్రత విధానం ఉపదేశించింది. ఇది నిష్టగా చేస్తే సకల మనోరధాలూ నెరవేరతాయి. పుత్రార్థులకు సత్సంతానం కలుగుతుంది. కళ్యాణార్ధులకు కళ్యాణం జయార్థులకు జయం ఆరోగ్యార్థులకు ఆరోగ్యం ధనార్ధులకు ధనం సంపదార్ధులకు సంపదలూ- ఒకటేమిటి ఏదికోరుకుంటే అది లభిస్తుంది. ఈ అనంత వ్రతం పాపనాశకం, పుణ్యప్రదం, సుఖదాయకం. కనుక ఓ శీలధరా! దీన్ని ఆచరించు.


సర్వలోక వరిష్ఠుడైన పుత్రుడు నీకు కలుగుతాడు అని మైత్రేయి నిండు మనస్సుతో ఆశీర్వదించింది. శీల ధర రాజధానికి వెళ్ళి వెంటనే ఈ వ్రతం ఆచరించి సంవత్సరకాలం నిష్టగా జరిపింది. అనంతుడు సంతుష్టుడయ్యాడు. దిగంబర దత్తాత్రేయరూపంతో స్వప్నంలో సాక్షాత్కరించి నీకు సత్పుత్రుడు కలుగుతాడు. విఖ్యాతి పొందుతాడు. మహావీరుడై సప్తద్వీపావృత వసుంధరనంతటినీ పరిపాలిస్తాడు. యోగవిద్యాపారంగతుడు అవుతాడు అని వరమిచ్చి అంతర్ధానం చెందాడు.


శీలధరకు మెలకువ వచ్చింది. అన్నివైపులా చూసింది ఎవ్వరూ కనిపించలేదు. స్వప్నమని గ్రహించింది. ఆనందించింది. భర్తను నిద్రలేపింది. తన స్వప్నం వివరించింది. అతడూ సంబరపడ్డాడు. నీకల నిజమవుతుందని శుభాకాంక్షలు పలికాడు. అటుపైన కొంతకాలానికి ఒక సుముహూర్తాన శీలధరకు మగబిడ్డ జన్మించాడు. అప్పుడు శుభసూచకంగా చల్లని వాయువులు వీచాయి. ఆకాశం విశదమయ్యింది. జగత్తు అంతా మురిసిపోయింది. దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవగంధర్వగీతాలు వినిపించాయి. అప్సరసల నాట్యాలు కనిపించాయి. లోకులందరికి ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడయ్యాడు. ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి దత్తాత్రేయుణ్ని మెప్పించి అనుగ్రహపాత్రుడయ్యాడు. ఆ స్వామి సహస్ర బాహువులూ అనంతశక్తి యుక్తులూ సహప్రాయుధాలు శౌర్యపరాక్రమాలు, సమస్తమూ ఇచ్చి అతణ్ని చక్రవర్తిని చేశాడు. అంతేకాదు కార్తవీర్యనామస్మరణ చేస్తే చాలు సకల భయాలూ తొలగిపోయేటట్లు, నమోస్తు కార్తవీర్యాయ అంటూ తిలపాత్రదానం చేసిన వారికి సకల పుణ్యాలూ కలిగేట్లూ, పోయిన వస్తువులు దొరికేటట్లూ దత్తదిగంబరుడు వరాలు ఇచ్చాడు. ఇలా మహిమాన్వితుడై ఆయుత సంవత్సరాలు భూగోళాన్ని ఏకచ్ఛత్రంగా పరిపాలించాడు. అంచేత ధర్మరాజా! ఈ అనంతవ్రతం మహత్మ్యం అంతటిది- అని శ్రీకృష్ణుడు అలనాడు ధర్మరాజుకి ఉపదేశించాడు. అది అంతా, దీపకా!: నీకు నేను చెప్పాను. కార్తవీర్యుడి తల్లితండ్రుల కధ పుత్రుడి కోసం వారి పాట్లు విన్నావు గదా! ఇంకా ఏమి కావాలి అన్నాడు వేదధర్ముడు.


Sunday 13 August 2023

శ్రీదత్త పురాణము (226)

 


తరువాత పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఇలాగే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం తరువాత పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఇలాగే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అనంతుడి వామ కటిభాగాన్ని అర్చించాలి. అప్పటిలాగానే సర్వవాంఛా ప్రదుడవు కమ్మనీ జన్మ జన్మలకీ భద్రదాయకుడువు కమ్మనీ అనన్త పుణ్యోపచయాన్ని సమకూర్చమనీ అభ్యర్ధించాలి. పురోహితుణ్ని దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపాలి.


ఇదే ప్రకారంగా మాఘమాసంలో మఘా నక్షత్రం ఉన్న రోజున అనంతుడి వ్మ వక్రభాగాన్నీ పొల్గుణంలో ఫల్గుణీ నక్షత్రం ఉన్న రోజున వామస్కందాన్ని యధావిధిగా గంధ పుష్పాదులతో పూజించి విప్రుణ్ని దక్షిణ తాంబూలాదులతో సత్కరించి రాత్రికి తైలవర్జితంగా భుజించాలి. ఈ నాలుగు నెలలూ బ్రాహ్మణులకి యవలు దానమివ్వాలి. ఇలాగే ప్రాతః స్నానం గోమూత్ర ప్రాశనాలతో ప్రారంభించి చైత్రంలో దక్షిణ కటిభాగాన్ని వైశాఖంలో దక్షిణపాదాన్ని జ్యేష్టమాసంలో మొత్తం కటినీ అర్చించాలి. ఆషాడంలో పాదపూజ చెయ్యాలి. శ్రావణంలో పాదద్వయార్చన చెయ్యాలి. పురోహితుడికి ఘృతదానమివ్వాలి. రాత్రికి తైలవర్జితంగా భోజనం. ఈ శ్రావణ భాద్రపదాశ్వయుజ కార్తీక మాసాల్లో ఆయా నక్షత్రాలున్న రోజుల్లో ప్రాతః స్నాన ఘృత ప్రాశన ఘృతదానాలు చెయ్యాలి. భాద్రపదంలో పూర్వాభాద్రా నక్షత్రం ఉన్న రోజున గుహ్యాన్ని ఆశ్వయుజంలో అశ్వనీ నక్షత్రం ఉన్న రోజున హృదయాన్ని, కార్తీకంలో కృత్తికా నక్షత్రం వున్న రోజున శిరస్సునూ అర్చించాలి. స్నాన, ప్రాశన, అర్చన, దానాలు ప్రతినెలా నియమనిష్టలతో జరగాలి. నక్తాలతో హవిష్యాన్నం భుజించాలి. ఇది ప్రశస్తం. నాలుగు నెలలకొకసారి బ్రాహ్మణ సంతర్పణలు జరపాలి. దీన్ని పారణత్రితయం అంటారు. ఈ వ్రత దీక్ష నడుస్తున్నపుడు తుమ్ములు వచ్చినా ప్రస్థలనాదులు జరిగినా అనంతుడి నామాలను జపించాలి. ఇది సంవత్సర కాల వ్రతం దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్యాపన కూడా వుంది.


బంగారంతో అనంతుడి ప్రతిమ చేయించాలి. వెండితో రోకలి నాగలి చేయించాలి. ఈ రెంటిని ఆప్రతిమకు చెరొక వైపునా ఉంచాలి. షోడశోపచార పూజ చెయ్యాలి. అనంత ప్రతిమకు తలపాగా చుట్టాలి. పూలదండలు అలంకరించాలి. గొడుగుపాదుకలూ అమర్చాలి. భక్తితో ఇలా అంగపూజ జరపాలి.


Saturday 12 August 2023

శ్రీదత్త పురాణము (225)

 


ఆశీర్వదించిన గురువుకి ప్రణమిల్లి కపిలగోవును బహూకరించాలి. ఇది యధాశక్తిగా చెయ్యవచ్చు. ఆపైన సూర్యుడికి శివునికి నమస్కరించి ఆ గర్భిణి హుతాశేషమైన చరువును భుజించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్షం సప్తమీ తిథినాడు చేస్తే చాలా మంచిది. దీన్ని శ్రద్ధగా ఆచరించండి అని ఉపదేశించి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు.


ధర్మజా! కృతవీర్య దంపతులు ఈ వ్రతాన్ని చేసినందువల్లనే వీరి కుమారుడు కార్తవీర్యార్జునుడు దీర్ఘాయుష్మంతుడై ఎనభై అయిదువేల సంవత్సరాలు భూగోళాన్ని పరిపాలించగలిగాడు. భాస్కరుణ్ని ఆరోగ్యం కోరాలి. అగ్నిని ధనం కోరాలి. శంకరుణ్ని జ్ఞానం కోరాలి. జనార్ధనుణ్ని పద్ధతి కోరాలి అని పెద్దలు చెబుతున్నారు. ఈ సప్తమీస్నపన వ్రతాన్ని ఏకాగ్రచిత్తంతో పఠించినవారూ, విన్నవారు, సకల శుభాభీష్ట సిద్ధులూ పొందుతారు అని మహర్షుల వాక్కు. ధర్మరాజా కృతవీర్యుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక నోములూ, వ్రతాలూ చేసింది. ఒక రోజు యాజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయిని దర్శించింది. కుశల ప్రశ్నల అనంతరం తన మనోవేదనను చెప్పుకుంది. గుణవంతుడు, వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడు కలిగేందుకు ఎదైనా నోమో, వ్రతమో ఉపదేశించమని అభ్యర్ధించింది. అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది.


అనంత వ్రతం


శీలధరా! కోరికలు తీరాలంటే జనార్ధనుణ్ని ఆరాధించటం ఒక్కటే మార్గం. అనంతవ్రతం అని ఒకటుంది చెబుతాను విను. మార్గశీర్షమాసంలో మృగశిరా నక్షత్రం ఉన్నరోజున ఉదయాన్నే లేచి స్నానాదికం ముగించుకుని గోమూత్రం కాసింత పుచ్చుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చెయ్యాలి. ముందుగా అనంతుడి వామపాదాన్ని పూలతో గంధాక్షతలతో యధాశక్తిగా పూజించాలి. అనంతుడు సర్వవాంఛప్రదుడు. అనంత ఫలదాయకుడు. నాకు ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ భద్రప్రదుడు అగుగాక. నేను చేస్తున్న ఈ అనంతవ్రతంతో సంతుష్టుడై ఈ పూజలకూ ఆర్చనలకూ సంబరపడి అనంతుడు నాకు అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చుగాక- అని సంకల్పించుకొని ఏకాగ్ర చిత్తంతో అనంతుణ్ని ధ్యానించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అలాగే పురోహితుడికి నమస్కరించి దక్షిణ తాంబూలాలు అందించాలి. రాత్రికి తైలవర్జితమైన ఆహారం తీసికోవాలి.


Friday 11 August 2023

శ్రీదత్త పురాణము (224)

 


మృతవత్స అయిన ఇల్లాలు మళ్ళీ గర్భందాల్చాక ఏడోనల రాగానే గ్రహతారాబలాదులు సరిచూసి ఒక శుభముహూర్తం నిశ్చయించుకోవాలి. ఆ పూట దంపతులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పురోహితులచేత పుణ్యాహవచనం చేయించుకోవాలి. పేడతో అలికి ముగ్గులు పెట్టిన మండపంలో అగ్నిహోత్రుణ్ని స్థాపించాలి. బియ్యం రక్తశాలేయాలు ఆవుపాలతో కలిపి చరువులు తయారుచేసుకోవాలి. వాటిని సూర్య - రుద్ర - సప్త మాతృకా గణాలకు ఆహుతి చెయ్యాలి. పౌరసూక్షాలతో సూర్యదేవునికి ప్రత్యేక హోమాలు చేయాలి. జిల్లేడు లేదా మోదుగ సమిధలనే హోమాలకు ఉపయోగించాలి. యవలూ, నల్లనువ్వులతో అష్టోత్తర శతంగా ఈ హోమాలు సాగాలి.


ఏడు కలశాలను గంగాజలంతో నింపాలి. ఆ కలశాలను మండపంలో నాల్గు కోణాల్లో నాల్గు, తూర్పున ఒకటి, పడమట ఒకటి, మధ్యలో ఒకటి ఉంచాలి. మంచి గంధంతో పరిమళ భరిత పూలతో దర్భలతో కలశారాధన చెయ్యాలి. ఏడు కలశాలని ఏడు అద్దాలతో కప్పాలి. సప్తర్షుల్ని వీటిలోకి ఆహ్వానించి ఆవాహన చెయ్యాలి. తూర్పు పడమర కలశాల్లోకి సూర్యచంద్రుల్ని అభిమంత్రించాలి. ఓషధీ సూక్తాలు పఠించాలి. పంచప్రకార జలన్వితాలు చెయ్యాలి. పంచరత్నాలతో పంచపల్లవాలతో అలంకరించాలి. శుద్ధి చేసిన మట్టి తెచ్చి ఏడుకలశాల్లోనూ వెయ్యాలి. రత్నాలు వేసిన అయిదు కలశాల నుండీ మధ్యమ కలశాన్ని పురోహితుడు సూర్యమంత్రాలు ఉచ్ఛరిస్తూ వుండగా పైకి తీయాలి. భోజనాలు చేసి నూతన వస్త్రాలూ ఆభరణాలూ ధరించిన ఏడుగురు దంపతులూ (సంతానం కలవారై వుండాలి) ఆ కలశాన్ని అందుకొని మండలాకారంగా నిలబడిముందుకు ఒకింతవంగి అందులోని నీళ్ళుపంపుతూ మృతవత్స (ఇప్పుడు ఏడోనెల గర్భిణి) అయిన ఆ యజమానురాలిని ఏకధారగా అభిషేకించాలి. గర్భస్థ శిశువుకు దీర్ఘాయుష్యాన్ని గర్భిణీకి జీవర్పుత్రతనూ ఆకాంక్షించి ఆశీర్వదించాలి. నవగ్రహాలు అష్ట దిక్పాలకులూ హరిహర హిరణ్య గర్భులూ శిశువును రక్షించాలని దుష్టగ్రహాలు తల్లి బిడ్డలను పీడించక తొలగిపోవాలని దీవించాలి. అటుపైన యజమానదంపతులు ఈ ఏడుగురు దంపతుల్ని షోడశోపచారములతో అర్చించాలి. గణేశుడ్నీ కుమారస్వామిని అర్చించి బంగారంతో ధర్మరాజు ప్రతిమ చేయించి దాన్ని తిలపాత్రమీద ఉంచి గురువుకి దానం ఇవ్వాలి. విత్తలోభము సుతారమూ పనికిరాదు. భూరిదక్షిణలతో, నూతన వస్త్రాలతో, విందు భోజనాలతో బ్రాహ్మణులనూ. బంధుమిత్రులనూ, సంతృప్తి పరచాలి. అయ్యింతరువాత గురువు ఇలా ఆశీర్వదించాలి- బాలుడు సుఖంగా నూరేళ్ళు జీవించుగాక ! ఇంకా ఏమైనా దురిత శేషముంటే అది బడడబాముఖంలో పడిపోవుగాక.


బ్రహ్మ - రుద్ర - విష్ణు - స్కంద - వాయు - శక్ర వహ్ని ప్రభృతులు అందరూ దుష్టగ్రహాల నుండి మాతాశిశువుల్ని రక్షిస్తూ సకల శుభాలు కలిగింతురుగాక. ఇలాంటి శుభాశీస్సులు అందించాలి.


Thursday 10 August 2023

శ్రీదత్త పురాణము (223)

 


సూర్యుడు చెప్పిన సప్తమీ స్నపనవ్రతం


ధర్మరాజా ! వరాహకల్పంలో వైవస్వతమన్వంతరంలో కృతయుగంలో ప్రధమ పాదాన హైహయవంశం ఉండేది. ఆ వంశంలో కృతవీర్యుడు అనే మహారాజు మహాప్రతాపశాలియై సప్త ద్వీపాకృతమైన మహీమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. డెబ్భైయేడు వేల సంవత్సరాలు పాలించాడు. ఆ మహారాజుకి వందమంది పుత్రులు జన్మించి, చ్యవన మహర్షి శాపాగ్నికి ఆహుతి అయ్యారు. పుత్ర శోకం తట్టుకోలేక రాజదంపతులు వోలు వోలున విలపిస్తూ బృహస్పతిని శరణువేడారు. ఎందుకు ఇలా జరిగింది ? మాకు ఈ జన్మలో పుత్రోత్సాహం ఉన్నదా ? వంశోద్ధారకుడు కలుగుతాడా ? - మేమేమి చెయ్యాలి ? దివ్యదృష్టితో పరిశీలించి అనుగ్రహించండి అని కాళ్ళా వేళ్ళా పడి అభ్యర్ధించారు. బృహస్పతి మహాపండితుడే అయినా హృదయంకలవాడు కనుక స్పందించాడు. దివ్యదృష్టి సారించాడు. కృతవీర్యా ! దుఃఖించకు క్లేశాలుపడతావుగానీ త్వరలోనే నీకు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే ఈలోగా నువ్వు వదిలించుకోవలసిన కల్మషాలు కొన్ని ఉన్నాయి. వాటి ఫలితంగానే మీకిద్దరకూ ఈ పుత్ర శోకం, వాటిని వదిలించుకో. దీనికి ఒక మార్గం వుంది. దత్తాత్రేయుడు తన భక్తులకి ప్రబోధించిన సప్తమీ స్నపనవ్రతాన్ని మీరు ఆచరించండి. కల్మషాలు తొలగిపోతాయి. మీకోరికలు తీరతాయి. ఈ వ్రతవిధానం తెలిసినవాడు కర్మసాక్షి సూర్య భగవానుడు కనుక ముందుగా అతణ్ని అర్చించి ప్రసన్నుణ్ని చేసుకోండి. ఇక క్షణం కూడా వృధాచేయకండి. వెళ్ళిరండి శుభమగు గాక - అని ఆశీర్వదించి పంపించాడు.


కృతవీర్యుడు ఉపవాసదీక్షతో వేదమంత్రాలతో నెలవాళ్ళూ సూర్యుణ్ని అత్యద్భుతంగా ఆరాధించాడు. దానికి సంతుష్టుడై సహస్రకిరణుడు ప్రత్యక్షమయ్యాడు. సప్తమీస్నపనవ్రతాన్ని ఉపదేశించాడు. రాజా! ఈ వ్రతాన్ని ఆచరిస్తే శిశుమరణాలు అంతరిస్తాయి. వ్యాధిపీడలు తొలగుతాయి. అన్ని వయస్సులవారికీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నీ చింతలను తొలగిస్తుంది. వ్రత విధానం చెబుతున్నాను శ్రద్ధగా గ్రహించు.


Wednesday 9 August 2023

శ్రీదత్త పురాణము (222)

 


మునీశ్వరులారా ! బ్రహ్మరూపిణి, సంధ్యారూపిణి రేణుకాదేవిని మూడు కాలాల్లోనూ సందర్శించి వందన మాచరించగలిగినవారే మహానుభావులు. లౌకికమైన ఆటుపోట్లు కర్మానుభవక్లేశాలూ దీనికి అడ్డంకి కాకూడదు. అలాసాగించే సంధ్యావందనం వల్లనే వీరూ వందితులు కాగలుగుతారు. మూడుకాలాలు అంటే చైత్రం - ఆషాడం - కార్తీకం - ఈ మూడు కాలాల్లోనూ ఏ ఒక్కనెలలో రేణుకాదేవిని ఉపాసించినా ఇహపరాల్లో భుక్తి ముక్తులకు లోటు వుండదు. మూడు కాలాల్లో ఉపాసిస్తే ఇక చెప్పేదేమిటి ఇహంలో ఇంద్రభోగాలు అనుభవించి పరమపదం చేరుకుంటారు. అటువంటి సర్వకాలాను వర్తిని - పరబ్రహ్మ స్వరూపిణి - సంధ్యాదేవి అయిన రేణుకా మాతకే నేను వందనం ఆచరించి వచ్చాను. గృహాలలో ఉండేవారు పవిత్రులై కాలత్రయస్వరూపిణి, సంధ్యా స్వరూపిణి అయిన ఈ రేణుకాదేవిని భక్తితో నిత్యమూ ఉపాసిస్తే ఆమె దర్శనం ఆమె అనుగ్రహం వెంటనే పొందుతారు. ఇహంలో భోగాలను అనుభవించి సద్గతి పొందుతారు.


ఇలా రేణుకాదేవియే సంధ్యాదేవి అని చెప్పి దత్తాత్రేయుడు మళ్ళీ అంతర్థానం చెందాడు. ఇది విన్న ఆ దేవజాతులవారూ, ఋషులూ మునులూ సంబరపడి సకల తీర్ధోదకాలతోనూ వరాహరూపి అయిన విష్ణుమూర్తికి అభిషేకం చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో యోగమాత రేణుకాదేవిని అర్చించి విష్ణు స్వరూపం అయిన ఆమలకీ తరువుకి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతర్ధానం చెందిన దత్తాత్రేయ స్వామికి మనస్సుల్లోనే వందనాలర్పించి దత్తస్వామి మహిమలను రేణుకా మహిమలనూ తలచుకొంటూ కొనియాడుతూ ఎవరిస్థానాలకు వారు బయలుదేరారు. దీపకా ! అలనాడు కైలాసం మీద మహర్షులకు స్కందుడు స్వయంగా చెప్పిన రేణుకా మహిమ ఇది. విన్నావు గదా ! మరిక నీ కోరిక ఏమి ? అన్నాడు వేదధర్ముడు.


గురుదేవా! దత్తాత్రేయుడి ప్రభావమే నాకు ఇంకా వినాలనీ తెలుసుకోవాలని ఉంది. కార్తవీర్యార్జునుడ్ని అంతటి మహావీరుణ్ని చేసిన దత్తదేవుడి దయను ఎంతని కొనియాడగలం. అటువంటి పుత్రుణ్ని పొందడానికి కృతవీర్య దంపతులు ఏ పుణ్యాలు చేసారో ? ఏ వ్రతాలు ఆచరించారో ? సాధన సంపత్తి లేకుండా ఫలాలు దక్కవు గదా. ఆ వివరాలు చెప్పండి - అని అభ్యర్ధించడమే తడవుగా వేదధర్ముడు ఆరంభించాడు.


దీపకా ! వెనుకటికి పాండవ మధ్యముడైన అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడు ఈ వృత్తాంతం అంతా అతడికి వివరించి చెప్పాడు. అదే నేను నీకిప్పుడు యధాతధంగా చెబుతాను. ధర్మజకృష్ణ సంవాదంగా నడుస్తుంది విను.


Tuesday 8 August 2023

శ్రీదత్త పురాణము (221)


 

దేవతలారా ! మహర్షులారా ! పరశురాముని యజ్ఞ విధిలో మునిగివుండగా సంధ్యావందన కాలంగడిచిపోతున్న సంగతి గుర్తించాను. కాలాతీతం కాకుండా సంధ్యావందనం చేసి వద్దామని వెళ్ళాను. సంధ్యాదేవికి వందనం చెయ్యడం కన్నా మహాయజ్ఞం లేదని మీకు తెలుసుకదా ! స్వామి ! మాకు తెలిసిన సంధ్యావందనం వేరు. దానికి ఇలా అదృశ్యమై ఎక్కడికో పోనవసరం లేదు. నీవు నమస్కరించిన సంధ్యాదేవి ఎవరు ? నివాస స్థలం ఏమిటి? వెళ్ళివచ్చినవాడివి నీకు తెలియదా? ఆ సంధ్యావందనానికి కాలమేమిటి ? కర్త ఎవరు ? తీర్థమెక్కడ ? ఇవన్నీ మాకు కటాక్షించు.


ఆర్యులారా! యోగీశ్వరుల హృదయాలలో సర్వదా నివసించే యోగిని రేణుకాదేవియే సంధ్యాదేవి. ఆమెకే నేను వందనం ఆచరించి వచ్చాను. ధ్యాన నిర్మలము, అమృతానంద పూర్ణమూ అయిన మనస్సులో సర్వతీర్ధమయి రేణుకాదేవికి వందనమాచరించి వచ్చాను. యోగమార్గరతులు, నిరంతరం ఆ మహామాయనే ధ్యానిస్తుంటారు. రేణుకయే సంధ్యాదేవి సందేహం లేదు. ఆవిడయే ఏకవీర, మీకూ నాకూ, అందరికీ వందనీయ ఆ జగన్మాతయే. ఆమెకే వందనం ఆచరించివచ్చాను.


దత్తగురూత్తమా ! సంధ్యావందన కాలమూ, అదేదో దాటిపోవడం అన్నారు. ఆ వివరాలు కూడా కరుణించి చెప్పండి. మాన్యులారా ! ఆసన - ప్రాశన - శయన - యానాది - సమయాలలో ఎప్పుడైనా ఎక్కడైనా గానీ అందరికీ సర్వదా, సర్వధా వందనీయురాలు ఈ సంధ్యాదేవి. దీనికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ వుండదు. సర్వకాల సర్వావస్థల్లోనూ వందనీయ - మహానుభావులు ఇలావందనం ఆచరిస్తూనే వుంటారు.


స్వామి ! వింతగా వుంది. మహానుభావులు నిరంతరం ఆమెనే ధ్యానిస్తూనే వుంటారని అంటున్నావు అదెలా సాధ్యం ? ప్రాణులన్నాక కర్మఫలానుభవం ఉంటుంది గదా ! దారుణకర్మలకి బాధలను అనుభవిస్తారు గదా ! ఎంతటి మహానుభావులైతే మాత్రం ఆ సమయాల్లో కూడా సంధ్యావందన విధి సాగించగలరా ?


Monday 7 August 2023

శ్రీదత్త పురాణము (220)


 

అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. రేణుకాదేవిని ధ్యానిస్తూ మనకళ్ళ ఎదుటే కళ్ళు మూసుకొని కూర్చున్న దత్తాత్రేయుడు ఏమయ్యాడంటే ఏమయ్యాడు ? ఎటువెళ్ళాడంటే ఎటువెళ్ళాడు ? అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారే తప్ప ఎవరికీ సమాధానం దొరకలేదు.


దత్త దేవుడికి రేణుకా ధ్యానంతప్ప మరొకటి లేదు. ఆయన గారి శయనాసనయాన కధాదులన్నీ రేణుకామయమే. ఎరుగుదుంగదా ! కాబట్టి రేణుకాదేవిలో లీనమయ్యుంటాడు అని దేవతలు భావించారు. ఋషులు మరొకలా అనుకున్నారు. రేణుకా హృదయమూ మనకు తెలీదు. దత్త హృదయమూ మనమెరుగం. ఇద్దరూ దివ్యతేజోమయులే. దేవి తన దివ్య తేజస్సుతో దత్త దేవుణ్ని ఆచ్ఛాదించిందేమో, లేదా దత్తస్వామి వేడుకగా పాతాళానికెళ్ళాడేమో, స్వామివి అన్నీ చిత్ర విచిత్ర లీలలు గదా! అనుకున్నారు. ఇక్కడే అదృశ్యరూపంతో గూఢంగా వుండి వుంటాడు. మన స్వామికి ఇలాంటి కుతూహలాలు ఉన్నవే కదా! అనుకున్నారు సిద్ధులు. కాసేపట్లో కూసేపట్లో ప్రత్యక్షమవుతాడు చూడండి.


ఆ నగ్న సుందరితో మధువును సేవిస్తూ ప్రత్యక్షమవుతాడని విధ్యాధరులు అభిప్రాయపడ్డారు. ఈ అజ్ఞానమనే వలను మన అందరిమీదకు వదలి తమాషాగా ఇక్కడే తనను తానే ఆజ్ఞాపించుకుని మనల్ని గమనిస్తూ ఉండి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు చారణులు.


వీరందరి సంభాషణలు విని సంబరపడ్డ దత్తాత్రేయుడు కొంచెంసేపటికి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. సురగంధర్వ సిద్ధ సాధ్యదేవర్షి గణమంతా స్వామిని దర్శించి హమ్మయ్య అని గుండెలనిండుగా గాలి పీల్చుకున్నారు. స్వామికి ప్రణమిల్లి కౌగలించుకొని తమతమ లోపలి అలజడిని తీర్చుకున్నారు. ఇలా తేరుకున్నాక అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామిని ప్రశ్నించారు. దత్తవిభూ! నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ? దేవతలకీ, మంత్రద్రష్టలకీ, ఋషులకీ కనిపించని చోటుకి వెళ్ళివచ్చావు. దివ్యదృష్టులకు సైతం అందని ఆ చోటు ఏది? ఎక్కడ ? ఇలాంటి తపస్సు కానీ, ధ్యానం కానీ, తత్వంకానీ మరెక్కడా ఏనాడూ కన్నదికాదు, విన్నది కాదు. మొదలూ, తుదీ నువ్వే కనుక నువ్వే తెలియజెప్పాలి.


Sunday 6 August 2023

శ్రీదత్త పురాణము (219)

 


దత్తాత్రేయా ! రేణుకాదేవికి తనయుడన్న మాటేకానీ ఆ తల్లిమూలతత్వం ఏమిటో నాకు ఏ మాత్రమూ తెలీదు. ఏకవీరాదేవి స్థూల సూక్ష్మాత్మక తత్వాలన్నీ తెలిసినవాడవు నువ్వే. కనుక నువ్వే మాకు చెప్పు - అన్నాడు పరశురాముడు.


రామా ! నీకు తెలియదంటే నేనెందుకు నమ్ముతాను. నాతో చెప్పించాలని నీ ప్రయత్నం పోనీలే అలాగే చెబుతాను విను. ముల్లోకాలను తన గర్భకోశంలో సంరక్షించే జగదేకమాత రేణుకాదేవియే ఆమె దివ్యరూపం స్థూల సూక్ష్మా - భేదాలతో రెండు విధాలుగా వుంటుంది. అద్భుతావహమైన అంశం ఇది. అరణ్యాలు, నదులు, సముద్రాలు, పర్వతములు, ప్రాణికోటి ఈ భూగోళం - ఇదంతా తల్లికి స్థూలరూపం, స్వర్గాలు, సర్వతీర్థాలు, దేవతలు, మహర్షులు, సప్తపాతాళ లోకాలు, శేష కూర్మాదులు ఈ దృశ్యమాన జగత్రయమంతా ఆ తల్లి స్థూలరూపమే. పరబ్రహ్మమే ఆమె సూక్ష్మరూపం - అని దత్తాత్రేయుడు చెబుతూంటే విని పరశురాముడు ధ్యాన నిమగ్నుడయ్యాడు. అక్కడే అలాగే అమలకీ తరువు చెంత ఏకవీరాదేవిని ఉపాసిస్తూ ఉండిపోయాడు. 


దీని ఒకప్పుడు కైలాస దర్శనానికి వెళ్ళిన మహర్షులు కుమారస్వామిని ఇదే వృత్తాంతం అడిగారు. ఆ షణ్ముఖుడు చెప్పిన రేణుకా మహత్మ్యం నీకు తెలియపరుస్తాను, శ్రద్ధగా విను.


రేణుకాదేవి - మహిమ


మహర్షులారా ! రేణుకాదేవి అంటే త్రిజగన్మాత. అందుకనే ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్ధం లేదా మాత్రాలయం అంటారు. ఒకప్పుడు దత్తాత్రేయుడు తాను ఆచార్యుడై నిలచి ఆ పవిత్ర స్థలంలో పరశురాముని చేత ఒక మహాయజ్ఞం చేయించాడు. అది రేణుకా యజ్ఞం. దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్విక్కుగా బ్రహ్మస్థానం అలంకరించాడు. తక్కిన మహర్షులందరూ వేదమంత్రాలు పరిస్తూ మిగిలిన భూమికలు నిర్వహించారు. ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు సిద్ధచారణ గంధర్వాధి దేవజాతులవారూ శుభప్రదమైన రేణుకా చరిత్రను భక్తిప్రపత్తులతో గానం చేశారు. దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నృత్యాలు చేశారు. యజ్ఞ పరిసమాప్తిలో - క్షీర సముద్రం నుంచి పాలు, దధ్యుదధి నుండి పెరుగు, ఘృతాబ్ధి నుండి నెయ్యి ఇలా సప్తసముద్రాల నుండీ సప్తద్రవాలను తెచ్చి కృష్ణామలకి నుండి మధుశర్కరలు గ్రహించి గంగాది పుణ్యనదుల నుండి పవిత్రోదకాలు తెచ్చి - వీటన్నింటితో దత్తాత్రేయుడు స్వయంగా ఏకవీరాదేవికి అభిషేకం చేశాడు. సాష్టాంగపడి లేచి చతుర్వేద మంత్రాలతో స్తుతించాడు. పద్మాసనం వేసికూర్చుని మెల్లగా ధ్యానంలోకి జారుకున్నాడు. దేవతలు అందరూ చూస్తూనే వున్నారు. దత్తాత్రేయుడు హఠాత్తుగా అంతర్ధానం చెందాడు. 

Saturday 5 August 2023

శ్రీదత్త పురాణము (218)

 


దేవతలు చెప్పిన ఉపాయాన్ని భానుమతి, తండ్రికి వినిపించింది. అతడు వెంటనే బయలుదేరి పడుతూ లేస్తూ పాకుతూ దేకుతూ దత్తాశ్రమం చేరుకున్నాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుడ్ని ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. రేణుకాదేవిని బహు విధాలుగా మంత్రాలతో శ్లోకాలతో స్తుతించాడు. ఆ తల్లి కరుణించింది. తేజోరాశీ! నీ స్తుతులకు ప్రసన్నురాలినయ్యాను. నీ శరీరం ఆరోగ్యంతో రెట్టింపు అవుతుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఇవ్వేళ వరమిస్తున్నాను. ఇక ఆలసింపకు - స్వస్థానం చేరుకో. ఈ పద్మతీర్ధంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టినవారంతా త్రివిధ ఋణాల నుండీ విముక్తులై దివ్యగతులు పొందుతారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు అని రేణుకాదేవి అంతర్ధానం చెందింది. భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్టురోగం నుండి విముక్తుడయ్యాడు. తన సూర్యలోకం చేరుకున్నాడు. దీపకా ! తెలిసిందికదా ! పద్మ తీర్థ మహిమ ఎంతటిదో. నువ్వు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో, అడుగు చెబుతానంటూ వేదధర్ముడు కమండలూదకంతో కాసింత గొంతు తడుపుకొన్నాడు.


గురుదేవా ! సర్వధర్మజ్ఞా ! సర్వసందేహ భేదకా ! ఈ దత్త దేవుడి చరిత్ర నువ్వు చెబుతూంటే నేను వింటూంటే ఎంతకీ తనివితీరడంలేదు. కన్నమ్మకే వాపు, తిన్నమ్మకే తీపు అన్నట్లు ఇంకాఇంకా వినాలనిపిస్తోంది. నిజమే రసజ్ఞుడెవడు సంతృప్తి చెందకుండా వుంటాడు. ఆధ్యాత్మిక దుఃఖాలన్నింటినీ వశింపజేసే కథలివ్వి, అలనాడెప్పుడో దేవతలు సేవించారని చెబుతున్న అమృతం - ఈ దత్త కథామృతం ముందు అతితుచ్ఛం. దీనికి సాటిరానేరాదు.


దయజేసి అదే అమృతగోళాన్ని మరింతగా అందించు. రేణుకాదేవి స్వరూపం గురించి ప్రసక్తి వశాత్తూ చెప్పావు కానీ క్లుప్తంగా చెప్పావు. దాన్ని ఇంకా విస్తారంగా వినాలని నా తహతహ కరుణానిధీ ! అనుగ్రహించు. ఈ జగత్తుకి ధేనువు, ఖని, ధాత్రి అయిన ఆ మహాదేవి తత్వాన్ని నీ కన్నా బాగా ఎరిగినవారు కానీ ఎరుక పరచగలవారు కానీ మరొకరు ఉన్నారని నేననుకోను.


నాయనా దీపకా ! నీ జిజ్ఞాస నన్ను ఆనందపరుస్తోంది. రేణుకాదేవి మహాత్మ్యాన్ని సమగ్రంగా వివరిస్తాను. తెలుసుకో. ఇది వింటే చాలు సకలప్రాణులకు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. సుర - సిద్ధ - ఋషిమండలితో పరివేష్టితుడై అమలధీవృష్ణ ఛాయలో కూర్చుండి ఒకనాడు దత్తాత్రేయుడు పరశురాముణ్ని ఇలా అడిగాడు. రామా ! నువ్వు సర్వజ్ఞుడవు. త్రిలోకాధిపతిని, రేణుకా సుతుడవు. పైగా నీ మీద ప్రేమతో గణాధిపతి నీకు ఆత్మతత్వ స్వరూపం కూడా బోధించాడు. కాబట్టి నీ తల్లి రేణుకాదేవి స్వరూపాన్ని మహాత్మ్యాన్ని నువ్వు పూర్తిగా గుర్తించి ఉంటావు. దయజేసి ఆ జగన్మాత మూల తత్వాన్ని మాకు తెలియపరుచు.


Friday 4 August 2023

శ్రీదత్త పురాణము (217)

 


పద్మ తీర్ధ మహిమ


దీపకా ! పనిలో పనిగా ప్రణీతానదిలోని పద్మ తీర్థ ప్రభావం కూడా చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు - తన ప్రవచనాన్ని ఇలాకొనసాగించాడు.


పూర్వకాలంలో ఉషా సూర్యదంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. భానుమతి అని పేరు పెట్టుకున్నారు. సర్వశుభలక్షణలక్షిత. రోజుకొక ఏడాదిగా త్వరత్వరగా ఎదిగింది. అందానికి చురుకుదనానికి చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరయ్యింది. పరిపూర్ణ కన్యకామణి అయ్యింది. ఆ విశ్వమోహినిని చూసి భాస్కరుడే దురదృష్టవశాత్తూ మోహితుడయ్యాడు. కోరిక తీర్చమంటూ వెంటపడ్డాడు. అజ్ఞానావృతుడైన తండ్రి నుండి తప్పించుకొని ఆ భానుమతి పాపభీతయై మృగీరూపం ధరించి ఘోరారణ్యంలోకి పారిపోయింది. మోహాంధుడైన సూర్యుడు ఆ రూప ద్రవిణ సంపన్నను వెదుక్కుంటూ ముల్లోకాలూ సంచరించాడు. ఎట్టకేలకు అరణ్యంలో మృగీరూపంలో దాక్కున్న భానుమతిని పట్టుకున్నాడు. బలాత్కారం చెయ్యబోయేలోగా ఇంద్రాది దేవతలూ కశ్యపాది ఋషులూ ప్రత్యక్షమై వారించారు. కానీ కన్న కూతుర్ని కామించిన పాప చింతనకూ బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్టురోగం సంక్రమించింది. అది దినదిన ప్రవర్ధమానమై సూర్యుణ్ణ్ని దారుణంగా పీడించసాగింది. అవయవాలు తిమ్మిరిలెక్కి వికలేంద్రియుడయ్యాడు. తండ్రి పరిస్థితి చూసి భానుమతి దిగులుపడింది. మృగీరూపం విడిచిపెట్టింది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసికొని బ్రహ్మాదిదేవతలను సందర్శించి తండ్రి కుష్టురోగం నయమయ్యేదారి చెప్పమని అభ్యర్ధించింది. స్మరణతో సందర్శనతో అందరికీ ఆరోగ్యం పంచిపెట్టే భాస్కరుడు మండల మధ్యభాగంలో విష్ణుమూర్తిని సకలదేవతలను ధరించే సూర్యభగవానుడు, సురసిద్ధ ఋషిగణపూజితుడు మళ్ళీ సర్వాయవసంపూర్ణుడై అందర్నీ ఆరోగ్యవంతుల్ని చేసేదెప్పుడూ ? దీనికీడైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బతిమాలుకుంది.


అమ్మాయీ ! మీ నాన్నకు కుష్టు రోగం ఎందుకు వచ్చిందో తెలుసుగదా ! నిన్ను కామించిన మహా పాపానికి అది ఫలం. బ్రహ్మహత్యకన్నా గురుభార్యాభిగమనం కన్నా ఘోరమైన పాతకమిది. దీన్ని తొలగించగల శక్తి కేవలం ఒక్క పద్మ తీర్థానికి మాత్రమే వుంది. అమలకీవనంలో దత్తాత్రేయ ఆశ్రమం ఉంది. దాని చెంత ప్రవహిస్తున్నదియే ప్రణీతానది. ఆశ్రమ తీర్థమే పద్మ తీర్థం. మీ తండ్రిని అక్కడకు వెళ్ళమను. అందులో స్నానం చేసి ఏకవీరా దేవిని అర్చించమను. ఆవిడ సకలదేవతాధీశ్వరి, జగన్మాత, భక్తితో ఆరాధిస్తే కరుణిస్తుంది. భుక్తిముక్తి ఫలాలు ప్రసాదిస్తుంది. వెంటనే బయలుదేరమను. రోగం మరీముదిరి కదలలేని దశవస్తే కష్టం.


Thursday 3 August 2023

శ్రీదత్త పురాణము (216)

 


చాంఘిక గాధ


పూర్వం కృతయుగంలో పురందర అనే పట్టణంలో చాంఫ్రికుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడి భార్యపేరు భామ, అన్యోన్య దాంపత్యం ఇద్దరిదీ. చాంద్రీకునికి ఇంద్ర పదవినధిష్టించాలని కోరిక, తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అని ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరి భూగోళం అంతా సంచరించి, పర్వతాలూ, అరణ్యాలూ, నదీతీరాలు, సరోవరాలు గాలించారు. ఎక్కడా వారికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. దిగులుగా కూర్చున్నారు.


అప్పుడు అతడి పితృదేవతలు దుర్ధర్షులు అదృశ్యరూపాలలో ఆకాశాన నిలబడి - నాయనా వృధాగా కాలయాపన చేసుకుంటున్నావు. మూఢుడవై తీర్థాలు తిరుగుతున్నావు. వెంటనే బయలుదేరి మాతృతీర్ధం చేరుకో, అక్కడ పితృణముక్తిపొందు. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు పిండప్రదానం చేస్తే అధికర్తకూ, పితృదేవతలకు సద్గతులు కలిగిస్తుంది. అంచేత మిగతా తీర్థాలన్నీ నిరర్థకాలు, వాటి సంగతి మర్చిపో వెంటనే మాతృతీర్ధం చేరుకో - అని సలహా ఇచ్చారు. అందుమీదట చాంఘ్రకుడు వెంటనే బయలుదేరాడు. సహ్యాద్రిమీద దత్తాత్రేయాశ్రమం చేరుకుని యేరుతటాకంలో స్నానం చేసి మాతృతీర్ధంలో పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టి చెంతనే గట్టుమీద  ఉన్న కృష్ణామలకం క్రింద పిండప్రదాన శ్రాద్ధ విధులు నిర్వహించాడు. ఆ క్షణంలోనే అతని పితృదేవతలు ముక్తులై అక్షయ పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు.


Wednesday 2 August 2023

శ్రీదత్త పురాణము (215)

 


మునిశ్రేష్టా! అడగవలసిందే అడిగావు. ఇందులో నన్ను నొప్పించింది ఏమీ లేదు. నువ్వన్నట్లు ఇంత వరకూ లోకంలో ఉన్నవి నాలుగే ఆశ్రమాలు. కానీ నాది - ఆపైది, అయిదో ఆశ్రమం. ఈ చరాచర జగత్తునంతటినీ ఆత్మాభిన్నమనీ అవికల్పంగా చూడగలిగినవాడు, కామక్రోధాదులనైన అరిషడ్ వర్గాన్ని జయించి సర్వ భూతకోటిపట్లా సమచిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగినవాడు మాత్రమే ఈ అయిదవ ఆశ్రమానికి అర్హుడు. నేను చెప్పిన ఈ తత్వం నువ్వన్న నాలుగు ఆశ్రమాలలోనూ ఎక్కడైనా వున్నట్లా లేనట్లా? బహుశ నీకు తెలీదు. చెప్పలేవు. కేవలం బ్రహ్మవాదులు మాత్రమే గుర్తించగలరు.


మహానుభావా! నువ్వే విశ్వేశ్వరుడవు. నువ్వే పురుషోత్తముడవు. అనసూయ - అత్రిదంపతులకు జన్మించిన నువ్వే కమలాపతివి. అజ్ఞానంతో నేను చేసిన ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు. నన్ను రక్షించు. నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలని నా ఆకాంక్ష. హే శ్రీ రామా! నారాయణా! వాసుదేవా! గోవిందా! వైకుంఠా! ముకుందా! కృష్ణా! శ్రీ కేశవా! అనంతా! నృశింహా! విష్ణు! సంసార సర్ప ద్రష్టుణ్ని. నన్ను కాపాడు - అని పింగళనాగుడు సాగిలపడి మ్రొక్కాడు. పింగళనాగుడి ప్రార్ధనను మన్నించి దత్తాత్రేయుడు శివరూపంతో అతడిని గర్భాన ధరించాడు. 


ఆమలకీ వృత్తాంతం - ఉసిరిక


శివరూపధారియై కృష్ణా మలకం క్రింద కూర్చున్న దత్తాత్రేయుణ్ని గానీ, త్రిమూర్తి స్వరూపమైన ఆ కృష్ణా మలకిని గానీ దర్శించినవారు సద్గతులుపొందుతారు అనడంలో సందేహం లేదు. నరనారీజనం ప్రణీతానదిలోని పద్మ తీరాన స్నానం చేసి దానధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్న ఈ కృష్ణా మలకిని దర్శించి స్పర్శించి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో హరిహర విరించిలకు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలం పొంది, మహాయోగులకు సైతం అందని పరమపదం చేరుకుంటారు. కృత యుగారంభంలో క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు ఫలపుష్ప భరితమై పీయూషామలక వృక్షం ఆవిర్భవించింది. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహూకరించారు. సముద్రుడేమో కౌస్తుభాదిరత్నాలనూ దివ్యాభరణాలను లక్ష్మీదేవినీ స్వయంగా సమర్పించి విష్ణుమూర్తిని సత్కరించాడు. పుణ్యప్రదమైన క్షీరాబ్ధి మందిరంలో ఈ పీయూషామలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయాత్రి మునులకు తాను పుత్రుడుగా అవతరించినవేళ తనతోపాటు ఈ పీయూషామలకిలో అర్ధాంశం తెచ్చుకున్నాడు. అటుపైని దాన్ని తన సహ్యాద్రి ఆశ్రమంలో నాటుకున్నాడు. అదే కృష్ణామలకీ నామంతో ప్రసిద్ధమయ్యింది. దానిక్రిందనే దత్తస్వామి తీవ్రంగా తపస్సు చేసాడు. ఈ తరువు మూడు రూపాలతో నామాలతో త్రిభువనాల్లోనూ విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వ భువనాన క్షీరాబ్ది మందిరంలో ఒకరూపంతో, పీయూషామలక నామంతో సహ్యాద్రి శిఖరం మీద, మరొక్కరూపంతో, కృష్ణామలక నామంతో పాతాళలోకంలో వేరొక రూపంతో, నామంతో విరాజిల్లుతోంది. దత్తాత్రేయాశ్రమంలోని తృతీయాంశ విరాజితానికే సిద్ధామలకమని కూడా పేరు. ఇందువల్లనే సిద్ధామలక గ్రామం ఏర్పడి అటుపైని మాతాపురం అయ్యింది. దీన్ని దర్శించిన నరనారీ జనం పరమపదం చేరుకుంటారు.


Tuesday 1 August 2023

శ్రీదత్త పురాణము (214)

 


నువ్వు దత్తాత్రేయుడు కలిసి ఈ కృష్ణామలకి తరువుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్న ఈ శుభప్రదమైన దత్తాశ్రమంలోనూ దండకలోనూ స్థాపించండి. నాకూ సంతోషం కలిగించండి. నువ్వు కూడా దీని నీడలో విశ్రాంతి తీసుకో. ఈ తరువును దర్శించిన వారుగానీ స్పృశించిన వారు కానీ సద్గతులు పొందుతారు - అంది. అప్పుడు పరశురాముడు ఆ తరువులో ప్రవేశించి తన ఉనికితో దానికి త్రిదేవత్వాన్ని కలిగించాడు. అటుపైని బ్రహ్మ దేవుడు రేణుకా దేవి వద్ద శలవు తీసుకొని తన సత్య లోకం చేరుకున్నాడు. రేణుక అంతర్థానం చెందింది. దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ తరువు క్రింద ధ్యాన నిష్ఠకు ఉపక్రమించాడు. తలపెట్టిన యజ్ఞం పూర్తి అయ్యే వరకూ భార్గవరాముడు సైతం ఆ తరువు చెంతనే విశ్రాంతి తీసుకున్నాడు.


పింగళనాగ వృత్తాంతం


ప్రణీతానది ఒడ్డున కృష్ణామలకీ తరుచ్ఛాయలో ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయుడి దగ్గరకు ఒకనాడు పింగళనాగుడు అనే ముని దర్శనార్ధం వచ్చాడు. సభక్తిగా నమస్కరించి దత్త దేవుడి అనుమతితో చేరువలో కూర్చున్నాడు.


స్వామీ! నాకు తెలీక అడుగుతున్నాను. నా అజ్ఞానాన్ని క్షమించి నా సందేహం తొలగించండి. నాకు తెలిసీ నాలుగు ఆశ్రమాలే ఉన్నాయి. వాటికి వాటి నియమ నిబంధనలున్నాయి. వీటిలో తమరు ఏ ఆశ్రమానికి చెందిన వారుగా కనిపించడం లేదు. మీరిద్దరూ దిగంబరులై ఉంటారు. మదిరా మాంసాలను పుచ్చుకుంటూ కనిపిస్తారు. దిగంబరీ! ఈ అందగత్తెను ఎప్పుడూ అంకపీఠం దింపవు. ఏమిటి స్వామి! ఇదంతా. దీన్ని ఏ ఆశమ్రం అంటారు? ఈ ఆశ్రమదీక్షను మీకు ఇచ్చిన ఆ గురు మహానుభావుడెవరు? ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని. ఇప్పటికి కుదిరింది. కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా దొరికారు. అందుకని అడిగేశాను. నొప్పిస్తే క్షమించండి చెప్పకూడనిది అయితే చెప్పవద్దు. తెలుసుకోవాలని మాత్రం చాలా కుతూహలంగా ఉంది.