Thursday 29 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (69)



చంద్రగర్వ భంగం


మూషిక వాహనం ఎక్కి మహాగణపతి మూడు భువనాలు తిరుగుతున్న సమయంలో ఒకమాటు చంద్రలోకానికి వెళ్ళాడు. శశివర్ణుడు శశి (చంద్రుడు) లోకానికి వెళ్ళావన్నమాట. పిల్లలందరికీ చంద్రుడంటే ఇష్టం కదా!


తానందగాడని చంద్రునకు గర్వం హెచ్చు. భగవంతుని ముఖాన్నే చంద్రునితో పోలుస్తారు కవులు. ఇందువల్ల గర్వం నెత్తికెక్కింది. ఈ స్తుతులకు అలవాటు పడినవానికి మిగతావారందరూ తక్కువగా కనిపిస్తారు. అందమైన పిల్లవాని రూపంలో ఉన్న వినాయకుడు, ఇతని దృష్టిలో ఎందుకూ పనికి రానివాడు.


ప్రేమ, శాంతి, వివేకంగల గజముఖం, విశాలమైన చెవులు, బొజ్జ, చిన్ని కాళ్ళు - వీటిని మరీ మరీ చూడాలనిపిస్తుంది కదా! ఎవరితోనైనా పోల్చగలమా అని భావిస్తాం. మన భావాలకు విరుద్ధంగా ఈ పొట్టేమిటి? ఈ తుండమేమిటి? చేటంత చెవులేమిటి? కడవ వంటి బొజ్జ ఏమిటి? కుఱచ కాళ్ళేమిటి? అని నిరసన భావంతో చూసాడు చంద్రుడు. ఏవి భక్తికి ప్రీతిపాత్రంగా ఉంటాయో అవే ద్వేషించేవారికి  హేయవస్తువులు. చంద్రుడీ రూపాన్ని చూసి పకాలున నవ్వాడు.

Wednesday 28 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (68)

 


ప్రశ్న-సమాధానం; కథలో కథ


ఎవరో ఒకరు ప్రశ్న వేయడం, మరొకరు సమాధానం చెప్పడం అనే పద్ధతి పురాణాలలో ఉంటుంది. సాధారణంగా నైమిశారణ్యంలో సూతుణ్ణి మిగిలిన ఋషులు ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లాగే పరీక్షిత్తుకు శుకమహర్షి చెప్పడం భాగవతంలో ఉంటుంది. ఇక ఇతిహాసాలు చూస్తే మహోత్సవ గుణ సంపన్నుడెవరని వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు ముందుగా రామచరితాన్ని గానం చేసాడు. దానినే వాల్మీకి విస్తారంగా వ్రాసి లవకుశులకు చెప్పగా అశ్వమేధ మహామంటపంలో కూర్చొని యున్న రామునికి ఎదురుగా వారు గానం చేసారు. ఇక నైమిశంలో సూతునిచే మహాభారతం చెప్పబడింది. ఆదికావ్యంగా పరిగణింపబడిన రామాయణానికి, నైమిశం లో ఋషులు సంబంధం లేదు. భారత కథ వైశంపాయునుడు జనమేజయునకు చెప్పబడినట్లు గా ఉంది. జనమేజయుడు పాండవుల మనుమడు. దానిని ఇతిహాసంగా వ్యాసుడు మలచగా విఘ్నేశ్వరుడు వ్రాయసకాడయ్యాడు.


ఆ పెద్ద ఇతిహాసంలో భిన్న భిన్న వ్యక్తులు ప్రశ్నించగా నారదుడు, అగస్త్యుడు, మార్కండేయుడు, మొదలైనవారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలు చెప్పారు. రామాయణంలో ఉత్తరకాండను చూస్తే రావణ వంశానికి చెందిన అన్ని కథలు అగస్త్యుడు రామునకు చెప్పినట్లుంటుంది.


అగస్త్యుని ప్రశ్నకు హయగ్రీవుడిచ్చిన సమాధానమే లలితోపాభ్యాసం. అది బ్రహ్మాండ పురాణంలో ఉంది. భారతంలో చాలా ఉపాఖ్యానాలున్నాయి. పాండవులు వివిధ ఋషులు ప్రశ్నించడం, వారు ఉపాఖ్యానాల రూపంలో సమాధానాలియ్యడం ప్రధానంగా అరణ్యపర్వంలో ఉంటుంది. చవితినాడు చంద్రుని చూస్తే దోషమేమిటని కృష్ణుడు వేసిన ప్రశ్న స్కాందంలో ఉంది. ఈ కృష్ణ నారద సంవాదానికి సమగ్ర సమాధానం నందికేశ్వర సనత్కుమార సంవాదంలో ఉంది.


Tuesday 27 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (67)

అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం నిర్ధారించబడతాయి. కనుక వినాయక చవితి, భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశినాడే. తమిళులకు మాత్రం భాద్రపదంలో గాని లేదా శ్రావణంలో గానీ రావచ్చు. ఒకొక్కసారి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడానికి అమావాస్య తరువాత నాల్గు రోజులు పట్టవచ్చు. అటువంటప్పుడు తమిళులకు వినాయక చవితి శ్రావణమాసంలోనే వస్తుంది. ఎందుకనగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు మాత్రమే వారికి భాద్రపద మాసం మొదలవుతుంది. అదే విధంగా శ్రీరామనవమి కూడా చాంద్రమానాన్ని అనుసరించే వారికి చైత్రమాసంలోనూ తమిళులకు ఫాల్గుణ లేదా చైత్ర మాసాలలోనూ వస్తూ ఉంటుంది. అట్లా గోకులాష్టమి కూడా. 


నారదుడిక్కడ చెపుతున్నది చాంద్రమాన భాద్రపద శుక్ల చతుర్థి గురించి. ఇదే వినాయక చవితి. కృష్ణుడట్టి ఒక్క చవితినాడు చంద్రున్ని చూసాడు. 


ఆనాడు చంద్రుణ్ణి చూసావని నారదుడన్నాడు. ఎప్పుడది? ప్రసేనునితో అడవికి వెళ్ళడం, విడిపోవడం జరిగిననాడే. ప్రొద్దు పోయిందని ఆకాశం వంక చూసాడు కృష్ణుడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇట్లా చూడడం వల్ల విఘ్నేశ్వరుని శాపానికి గురి కావలసి వచ్చిందని అన్నాడు. 


ఆనాడు చూస్తే దురదృష్టం ఎందుకు వెంటాడుతుందని కృష్ణుడు ప్రశ్నించాడు. నారదుడు కథను చెప్పడం మొదలు పెట్టాడు.


Monday 26 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (66)



అక్రూరుడు కనబడడం లేదేమిటి. ఒకవేళ అతనిదగ్గర ఉందా? అతడీ నగరంలో లేకపోవడమూ శుభశకునంగా భావించడం లేదు. తండ్రి పోవడం వల్ల కదా సత్యభామ కుమిలిపోతోంది? నగరం అంతా నన్ను సందేహిస్తోంది. మాటిమాటికీ నిందలేమిటి?" అని కృష్ణుడు చింతిస్తూ ఉండగా ఇంతలో నారద మహర్షి వచ్చాడు. ఎక్కడకు, ఎప్పుడు రావాలో నారదునకు బాగా తెలుసు. ఆయన కథను మలుపు త్రిప్పగల నేర్పున్నవాడు.


కుశల ప్రశ్నలయ్యాయి. నీవు దేవర్షివి, నీకు తెలియనిది ఏమీ లేదు. నాకు వచ్చిన సమస్యను పరిష్కరించు, కారణం చెప్పుమని కృష్ణుడడిగాడు. 


ఏమీలేదయ్యా! నీవు భాద్రపద చవితి నాటి చంద్రుణ్ణి చూసావు కదా, విఘ్నేశ్వరుని శాపం తగిలిందయ్యా అన్నాడు నారదుడు.


భాద్రపదం - పంచాంగంలో భేదాలు


భాద్రపద మన జంట నక్షత్రాలతో ఉన్నాయి. పూర్వా భాద్రమని, ఉత్తర భాద్రమని. ఒక్కొక్కప్పుడు ప్రోష్ఠ పదమని పిలువబడుతాయి. ఈ నక్షత్రాలలో ఏదో ఒకటి పూర్ణచంద్రునితో కలియగా దీనిని భాద్రపద మాసమని అంటారు. నక్షత్రాన్నే పేర్కొంటే అది ప్రోష్ఠపదమనే. ఇట్లా అన్ని నెలలు కూడా నక్షత్రం పేరు మీదుగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇది ఒక మాసం ముందుగా గాని ఆలస్యంగా గాని జరుగవచ్చు. నిజానికి సూర్యుడెప్పుడైతే ఆ నక్షత్రంలో సంక్రమణం చేస్తాడో అప్పుడు ఆ మాసం మొదలౌతుంది. అయితే ఈ సూర్యుని స్థితి, మరియు చంద్రుని స్థితి ఒక నక్షత్రంలో ప్రవేశించినపుడు సంబంధం లేకుండా ఉంటుంది. సూర్యుని ప్రవేశం ద్వారా మాసము లేర్పడడాన్ని సౌర మానం అంటారు. తమిళనాడులో ఈ పద్దతిని పాటిస్తారు. కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర భారత దేశంలో ఎక్కువమంది చాంద్రమానాన్ని పాటిస్తారు. ఈ చాంద్రమానంలో అమావాస్య తరువాత వచ్చే రోజును క్రొత్తమాసానికి మొదటిరోజుగా పరిగణిస్తారు. ఇదంతా చంద్రగమనాన్ని బట్టి యుంటుంది. కనుక పున్నమి నాటి చంద్రుడు ఏ నక్షత్రానికైతే అతి సమీపంలో ఉన్నాడో ఆ నక్షత్రం పేరుతో మాసం మొదలవుతుంది.


కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (65)



అయితే అనవసరమైన భయాందోళనలున్న అక్రూరునకు కృష్ణునిపై అచంచల భక్తి విశ్వాసాలున్నాయి. ద్వారకను విడిచి కాశీయాత్రకు బయలుదేరాడు.


కాశీలో అడుగు పెట్టగానే సద్బుద్ధి కలిగింది. స్వార్థం కోసం మణిని వాడుకోవాలని భావించలేదు. ఎప్పటి మాదిరిగానే ఎనిమిది బారువుల బంగారాన్ని మణి ఇస్తూ ఉండేది. స్వార్ధం కోసం వాడక దానితో ఆలయాలను కట్టించాడు. దైవకైంకర్యమే చేసాడు.


ఇతడు సదాచార సంపన్నుడని మణికి తెలుసు. ఇది బంగారాన్ని ఇయ్యడమే కాదు. చుట్టుపక్కల రోగాలు లేకుండా కూడా చేసింది. క~ఎరు కాటకాలు లేవు. పుష్కలంగా పాడిపంటలు, అంతా సుఖశాంతులలే.


నిందకు కారణం - నేరాలు


ఇట్లా అనేక సంఘటనలచే కృష్ణుని చిత్తం కకావికలమైంది. "ఈ మణివల్ల ఇన్ని కష్టాలా? ఇది ప్రసేనుణ్ణి, సత్రాజిత్తును, శతధన్వుడిని మ్రింగివేసిందే! ఇప్పుడు నా సోదరుడే నన్ను శంకిస్తున్నాడు! దేశంవిడిచి పెట్టి వెళ్ళాడు.

Saturday 24 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (64)



బలరాముని ఆగ్రహం ఒక పట్టాన చల్లారేది కాదు. ఎవరి మాటలునూ వినదు. నిన్ను వెదకడమేమిటి? టక్కుటమార విద్యలన్నీ నీకు తెలుసు, పచ్చి మోసగాడివని నిందించి నీ దగ్గర ఒక్కక్షణం ఉండనని బలరాముడు ద్వారకకు తిరిగి రాక విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు.


ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు. ఇట్లా అవమానాలూ, నిందలూ ఇంకా ఎక్కువయ్యాయి. మణి పట్ల లోభంతో అన్నగారినే తరిమేసాడని లోకులన్నారు. లోకులు పలు కాకులు కదా! 


ఇతరుల గుణాలను శ్లాఘించడానికి బదులు లోపాలనే ఎత్తి చూపిస్తూ ఉంటాం. మనం కూడా పత్రికలను చదువుతూ ఇష్టమైన నాయకుల్ని పొగుడుతూ ప్రతిపక్షాలను నిందిస్తూ ఉంటాం కదా. ఇట్టి మానవ ప్రవృత్తి యొక్క వివరాలు పురాణాలలో పుష్కలంగా ఉన్నాయి.


అక్రూరుడు - మణి


కృష్ణుడి రాక అక్రూరునకు దడ పుట్టింది. ఎప్పుడూ కృష్ణునితో కలిసిమెలిసి ఉండేవాడేమో. ఇప్పుడు దూరదూరంగా ఉంటున్నాడు. తేలు కుట్టిన దొంగలా, ద్వారకనుండి చల్లగా జారుకున్నాడు. శంకరులే మన్నారు? అర్థమనర్థం భావయ నిత్యం అని అనలేదా? డబ్బెంత పని చేస్తోందో చూసారా? ఎన్ని అనర్థాలను తీసుకొని వస్తుందో!


Friday 23 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (63)



భగవానుడు శతధన్వుని జుట్టు పట్టుకున్నాడు. కొంతసేపు ముష్టియుద్ధం జరిగింది. భగవానుని ముందు అతడు నిలబడగలడా? ఇతని చేతిలో చంపబడడం అతను చేసుకున్న అదృష్టం అనాలి. అట్లా పద్ధతి కల్గించాడు కృష్ణుడు.


ఇట్లా జాంబవంతుణ్ణి ఓడించడం, ఇతణ్ణి చంపడం జరిగినా నీలాప నిందలు మళ్ళీ మొదలు. మణికోసం అతని శరీరాన్ని తడిమితే దొరకలేదు. ఎందుకంటే అది అక్రూరుని దగ్గర ఉంచాడు కాబట్టి గీతలో భగవానుడేమన్నాడు? 


వేదాహం సమతీతాని వర్తమానాని దార్జున 

భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన (7-28)


అనగా “ఓ అర్జునా! గతంలో ఏం జరిగిందో, వర్తమానంలో ఏం జరుగుతుందో, భావికాలంలో ఏం జరగబోతుందో అన్నీ నాకు తెలుసు. కాని నన్ను తెలుసుకొన్న వాడెవ్వడూ లేడు". ఇట్లా అన్నవాడే ఏమీ తెలియనట్లు నటించి శతధన్వుని దగ్గర మణి యుందని భావించాడు. మరొక అవతారమైన అన్నగారు దొరకలేదని నివేదించాడు.


ఇట్లా మానవులు వేసే నిందలను భరించాడు. అంతేకాదు అన్నగారి కోపాన్ని భరించాడు. అతని చంపాను, అతని దగ్గర మణి లేదన్న మాటలు అన్నగారు నమ్మారా? కారాలూ, మిరియాలు నూరాడు.


"నేనేదో మణిని అడుగుతాను నా దగ్గర బుకాయిస్తున్నావు ఎక్కడో దాచి వుంటావులే. ఋజుమార్గంలో వెళ్ళేవారు నీతో సఖ్యంగా ఉండలేరని" అన్నాడు.


"ఇట్లా నన్ను సందేహించకు, నువ్వే నన్ను శంకిస్తే ఎలా? నేను చెప్పింది నిజం. నన్ను వెదికి చూడు, నీకే తెలుస్తుంది” అన్నాడు కృష్ణుడు.


Thursday 22 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (62)



మరల విజయం - మరీ నింద


కృష్ణుడు తిరిగి వచ్చి దుఃఖించే భార్యను చూసాడు. మామగారి మరణం కలత పెట్టింది. కక్షను పెంచింది. చిరంజీవియైన జాంబవంతుడు ఓడించిన కృష్ణుడు తనను క్షమిస్తాడా అని శతధన్వుడు పలాయనం చిత్తగించాడు. ద్వారకనుండి వెళ్లిపోయాడు. 


పోతూ పోతూ మణిని అక్రూరుని దగ్గర ఉంచాడు. ఆ మణిని కృష్ణుని పాదాల దగ్గర నుంచితే క్షమించి యుండేవాడు కదా! ఆమలిన మనస్సు అట్లా చేయిస్తుందా? ఈ పరుగెత్తడం కృష్ణుని పరాక్రమానికి దోహదపడింది. తన దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? కష్టాలు వస్తాయని విన్నాడు. చూసాడు కాబట్టి ఈ కష్టాలను అక్రూరునకు బదిలీ చేసాడన్నమాట. మొండి పట్టుదల, శత్రుత్వం, దుష్టబుద్ధి, ఇట్టి పనులు చేయిస్తుంది. అక్రూరుడు మంచివాడు కనుక అతని దగ్గర ఉంటే క్షేమమని భావించాడు. పైగా అతడు కృష్ణుడు భక్తుడు.


పరుగెత్తే శతధన్వుణ్ణి చూసి నిజంగా కోపపడలేదు కృష్ణుడు. అతడు ధర్మ సంస్థాపకుడు కదా! కోప పడినట్లు నటించాడు. బలరామునితో కలిసి ఈ రథంపై వెళ్ళి శతధన్వుడు పట్టుకోబోయాడు.


శతధన్వుని గుట్టం అలిసిపోయి చనిపోయింది. ఇక పిక్కబలం చూపించాడు. బలరాముడు రథంలోనే ఉండిపోయాడు. ఇద్దరూ కలిసి ఒకణ్ణి ఓడించకూడదనే నియమాన్ని పాటించాడు. 


Wednesday 21 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (61)

ఇక వీరిద్దరూ కూడబలుక్కున్నారు. తమ కిష్టమైన సత్యభామ, ఎట్లాగూ దక్కలేదు. ఇక మణిని అపహరించాలని పన్నాగం పన్నారు. దుర్మార్గుడైన శతధన్వునితో చేతులు కలిపారు.


అందరికీ సామాన్య శత్రువు సత్రాజిత్తే. ఇప్పుడు కృష్ణుడు లేడు, మనం వెళ్ళి సత్రాజిత్తును చంపి మణిని దొంగిలిద్దాం అనే నిశ్చయానికి వచ్చారు.


ఎదురుపడి యుద్ధం చేయడం కాదు. దొంగచాటుగా శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసాడు. మణిని దొంగిలించాడు.


ఇక సత్యభామ, తన భర్త హస్తినాపురం నుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు తెన్నులు చూసింది. తండ్రి మరణానికి రోదించింది. ఎప్పుడు శతధన్వుణ్ణి తన భర్త చంపుతాడా అని తహతహలాడింది.


రోగాలను పోగొట్టేది, భాగ్యాన్ని కల్గించే మణి, ఎన్ని కష్టాలను తీసుకొని వచ్చిందో గమనించారా? కష్టం వెంట సుఖం కష్టం తరుముకు వచ్చిందే! మణిని రక్షించాలంటే పరమ పవిత్రంగా ఉండాలి కదా! అందుకే సూర్యుడీ నియమాన్ని పెట్టాడు. దుష్టమైన ఆలోచనలు రాకూడదు. అందునా కృష్ణుని పట్ల అపచారమా? ప్రసేనుడు, శారీరకమైన అశుచివల్ల పోగొట్టుకున్నాడు. మానసికమైన అశుచివల్ల సత్రాజిత్తు పోగొట్టుకున్నాడు. చిరంజీవియైన జాంబవతుని దగ్గరే మణి కలకాలం ఉండలేదు. అతడేమో సింహాన్ని చంపాడు కదా! ఇట్టి చరిత్రను చూపించే మణి శతధన్వుడి దగ్గర కలకాలం ఉంటుందా? అతడు యజమానినే క్రూరంగా చంపి గ్రహించాడు కదా!

Tuesday 20 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (60)

 


స్త్రీల శత్రుత్వం


వివాహానంతరం కుంతితో పాండవులందరూ లక్క గృహంలో బూడిదపాలయ్యారనే వార్తను విన్నాడు కృష్ణుడు. వారు బ్రతికి యున్నారు తెలిసి కూడా లోక మర్యాదను పాటించి ధృతరాష్ట్రుడి పరామర్శ చేయడానికి హస్తినాపురానికి వెళ్ళాడు. అవతార పురుషుడు అట్టి మర్యాదలను పాటించాడు. 


ఇతని నిర్గమనం, సత్యభామకు కష్టాలను తెచ్చిపెట్టింది. 


యాదవులలో శతధన్వుడనే దుర్మార్గుడున్నాడు. యాదవ వంశంలో కృతవర్ముడు, అక్రూరుడనే ముఖ్యులూ ఉన్నారు. వీరిద్దరు కృష్ణునకు దాసోహం అనేవారే. అక్రూరుడు, పరమ భాగవతోత్తముడు. అతడే బలరామకృష్ణులను బృందావనం నుండి మధురకు తీసుకొని వచ్చాడు, ఈ పై ముగ్గురూ సత్యభామనే వివాహమాడాలని ఎవరికి వారే నిశ్చయించుకున్నారు. ఎవరడిగితే వారికే తన అమ్మాయిని ఇస్తానన్నాడు సత్రాజిత్తు. కాస్త సమయం కావాలన్నాడు. కాలం గడుపుతున్నాడు. తర్వాత శ్యమంతక మణి రావడం వల్ల భగవానునికి తన కుమార్తెనిచ్చాడు.


ఈ సంఘటన చిచ్చుపెట్టింది. మానవమనః ప్రవృత్తులు ఎంత మోసపూరితంగా ఉంటాయో వివరించింది పురాణం. ఈ ముగ్గురూ సత్రాజిత్తు పై కక్ష కట్టారు. కృష్ణునిపై నింద వేసినపుడు అక్రూరుడు, కృతవర్మలిద్దరూ కృష్ణుణ్ణి వెనకేసుకొని వచ్చారు. ఇది సత్రాజిత్తు నాకు కోపం తెప్పించింది. ఇప్పుడు కథ తారుమారైంది. వీరిద్దరి మనస్ఫూ మారిపోయింది. కృష్ణుని పట్ల భక్తి దూరమైంది. స్త్రీ పట్ల కామం, శత్రుత్వం ఇవన్నీ అహంకారం యొక్క వికారాలే కదా! ఇక భక్తికి తావెక్కడ? అని ఈ కథ యొక్క సారాంశం.

Monday 19 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (59)



మణి-వివాహము


స్వామీ! నేను నీ ఆధీనంలో ఉన్నాను. నీది నీకీయడం సబబు. ఈ మణితో ఈ కన్యామణిని కూడా స్వీకరించవయ్యా! అనగా జాంబవతిని కూడా స్వీకరించాడు. జాంబవతి కోరిక కూడా నెరవేరింది. రెంటినీ గ్రహించాడు నల్లనయ్య. ద్వారకకు ఆ రెంటితో వచ్చాడు.


మణి తన దగ్గర ఉంచుకోవడానికి తగిన అర్హతలన్నీ అతనికున్నాయి. కారణం! జాంబవంతుణ్ణి జయించి ఆ మణిని తీసుకున్నాడు. ఆ జాంబవంతుడు సింహాన్ని ఓడించాడు. అదేమో ప్రసేనుణ్ణి చంపి మణిని పొందింది. ఆ విధంగా తనకు సంపూర్ణమైన హక్కు ఉంది. అయినా ఈ భౌతిక సంపదకై ఆశ పడతాడా? తనపై వేసిన నింద పోగొట్టుకోవడానికే ఈ తతంగం అంతా జరిగింది. కనుక మణిని సత్రాజిత్తునకిచ్చాడు. తపస్సు చేసి దాన్ని సంపాదించాడు కదా సత్రాజిత్తు.


అతడు సంతోషంతో మణిని స్వీకరించాడు. కాని ఏదో అపరాధం చేసాననే చింత, మనస్సును పీకుతోంది. సత్రాజిత్తునకు ఒక్కగానొక్క కుమార్తె సత్యభామ. ఆమె భూదేవి అవతారం. రుక్మిణి లక్ష్మి యొక్క అవతారం.


జాంబవంతుని మాదిరిగానే సత్యభామను, మణిని కృష్ణునకే అర్పించాడు సత్రాజిత్తు. భగవానుడు గోపాలరత్నం కదా! కనుక సత్యభామను మాత్రమే స్వీకరించాడు. మణిని స్వీకరించలేదు. మణి, నీ ఆధీనంలో ఉంటుంది, నీ కుమార్తె నా ఆధీనంలో ఉంటుందని అన్నాడు. సత్రాజిత్తు ఒక్కతే కుమార్తె కనుక అతని సంపదంతా ఈ దంపతులకే చెందుతుంది.

అయితే కథ ఇంకా ముగియలేదు, ఇంత వరకు మన గణపతి ప్రస్తావన ఏది?

తన జీవితకాలం ఈ మణిని అనుభవిద్దాం. తరువాత వారికే చెందుతుందని భావించాడు సత్రాజిత్తు. ఇది చివరకు ఇతని జీవితాన్నే బలిగొంది. అనేక కష్టాలు. చూద్దాం.

Sunday 18 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (58)



ఈ కృష్ణుడు ఆ రాముడని తెలిసినా కౌగలించుకోడానికి సందేహిస్తాడు. పుష్ప కోమలమైన ఆ శరీరమెక్కడ? తన శరీరమెక్కడ? అని సందేహిస్తాడు. అందుచేత మల్లయుద్ధంలో తన శరీర స్పర్శను అతనికి కల్గించి ఆసందాన్నియ్యాలని భావించాడు కృష్ణుడు. అతని లీలలలో అనేకాంతరార్థాలు దాగి ఉంటాయి.


పరమేశ్వరుడు కూడా తన దివ్య శరీర స్పర్శ యొక్క రుచిని అర్జునునకు యుద్ధం చేసి చూపించాడు. 


రోజులు గడుస్తున్నాయి. ఎవరు గెలుస్తారో తేలడం లేదు. ద్వారం దగ్గరగా నున్న యాదవులెంత కాలం వేచియుంటారు? తమకేమైనా ప్రమాదం ముంచుకు వస్తుందని ద్వారకు తిరిగి వచ్చారు. మానవుల నైజాన్ని గమనించారా? 


ఇట్లా 21 రోజులు యుద్ధం సాగింది. జాంబవంతుడలిసిపోయాడు. నీలమేఘశ్యాముని స్పర్శ వల్ల ఒక అలౌకికానందాన్ని పొందుతున్నాడు జాంబవంతుడు. తనకున్న బలం ఆ రామచంద్రమూర్తి ప్రసాదించిందేనని రామ, రామ అంటూ కీర్తించాడు. ఇంతవరకూ మరొక అవతారాన్ని పిడిగ్రుద్దులతో సత్కరించడమా?


రామనామశక్తి యున్నా ఈ తన్నులు తినడమేమిటి? శత్రు స్పర్శ, సుఖాన్ని కల్గిస్తోందేమిటి? అని ఆలోచించాడు.


ఇక కృష్ణుడు ఈ ఆట చాలించాలనుకున్నాడు. జాంబవంతుని జ్ఞానోదయం కలిగించాడు. 


ఏమిటేమిటి? నా ఉపాసనమూర్తితో ఇంతవరకూ యుద్ధమా? రాముడే కృష్ణుడు కదా అంటూ పాదాభివందనం చేసాడు. కృష్ణుడు కరుణించాడు.

Saturday 17 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (57)


నా తండ్రి స్వభావం నాకు తెలుసు. తనంతట తానియ్యడు. ముసలి తనంలో కలిగిన శిశువు కోసం దీనిని వేలాడదీసాడు. కనుక అడిగి నిరాశ చెందకు, యుద్ధానికే సిద్ధపడమని జాంబవతి హితోపదేశం చేసింది. అతనిపట్ల ప్రేమ చివురించి మ్రొగ్గ తొడిగింది. అతని గౌరవాగౌరవాలకు తానూ పాత్రురాలేనని సూచించింది.


ఇక శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. 


జాంబవంతునికి కృష్ణ స్పర్శ సుఖం 


జాంబవంతుడు మేల్కొన్నాడు. నేనేమో ముసలివాణ్ణని సులభంగా ఓడించవచ్చని భావించావా? అని జబ్బలు చరిచాడు. 


భగవంతునితో కయ్యానికి కాలు దువ్వాడు. జాంబవంతుని పరాక్రమాన్ని లోకానికి చాటాలని కృష్ణుడు, తన శక్తి నంతటినీ వినియోగించలేదు. సరిసమానంగానే యుద్ధం సాగింది.


యుద్ధం చేసేవాడు అనాటి రామచంద్రుడే అని గ్రహించలేకపోయాడు జాంబవంతుడు. భగవత్ శక్తిని ప్రకటించకుండా యుద్ధం కొనసాగిస్తున్నాడు కృష్ణుడు. వినోదంగా భావించాడు.


ముష్టియుద్ధాలు, సిగపట్లు మామూలే. తన దివ్య శరీర స్పర్శ సుఖాన్ని భక్తునకు కలిగించాలనే భావనతో యుద్ధాన్ని కావాలని పొడిగించాడు. రామావతార సమయంలో రాముణ్ణి కౌగిలించుకోవాలని జాంబవంతుడు అనుకున్నాడు. కాని ఆ కోరిక నెరవేరలేదు. పైకి ఆ కోరికను తాను చెప్పలేదు. రాముని శరీరం ఎట్లా ఉంటుంది? పట్టుకుచ్చులా ఉంటుందా? ఆ మెత్తని, ఉదారమైన మనస్సే నీలమేఘశ్యాముడై ఉంది. ఇక జాంబవంతుని శరీరం గరుకు గరుకుగా ఉంటుంది కదా. కనుక కోరికను వెల్లడించలేదు. ఒకవేళ అడిగినా రాముడంగీకరించడు. తన శరీర స్పర్శ సీతమ్మకే దక్కాలి. అతడేక పతివ్రతుడు కదా. అన్నీ విడిచి దండకారణ్య ఋషులే కౌగలింతనడుగగా ఈ అవతారంలో ఈ శరీరం సీతకే అంకితమని, కృష్ణావతరంలో మీ కోరిక తీరుస్తానని అన్నాడు. ఆ ఋషులే గోపికలుగా పుట్టారని ఉంది కదా. 


అట్లా అడగడం ఋషులకు చెల్లింది. జాంబవంతుడు అడగగలడా? ఋషుల మాదిరిగా ఇంకొక జన్మ నెత్తాలని కోరుకోలేదు. అందుకే జాంబవంతుణ్ణి చిరంజీవిని చేసాడు రామయ్య.

Friday 16 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (56)



నిందలపాలైన కృష్ణుడు లోపలకు ప్రవేశించి నిందను పోగొట్టుకోవాలి కదా! అతణ్ణి ఆ అందగత్తె చూడగా ఆమెలో ప్రేమ, భయమూ ఒక్కమాటే కలిగాయి. అతినికేమైనా ఆపద కల్గుతుందేమో అని భయపడింది.


మణి-యువతి

ఆమె ఎవ్వరో కాదు, జాంబవంతుని కూతురు, జాంబవతియే. ఈ గుహలో ఎవ్వరూ ప్రవేశించలేరు. ఈ అందగాడు ప్రవేశించాడు. కోపంతో తన తండ్రి ఇతనికేమైనా హాని తలపెడతాడేమోనని కంగారు పడింది.

జాంబవంతుడు నిద్రపోతున్నాడని, నిమ్మదిగా నీవెవ్వరివని అడిగింది. భగవానుడు జవాబు చెప్పాడు.

ఇది మా నాన్న వింటే కోప్పడతాడు. నీవు మణిని తీసుకొని వెడతానంటే అగ్గిమీద గుగ్గిలం పోతాడు. చడీ చప్పుడు కాకుండా వెంటనే తీసుకొని పో అని తొందర పెట్టింది.

అతడు వెళ్ళిపోవాలని ఆమెకూ లేదు. అట్లాగే కృష్ణునిపై మోజుపడి రుక్మిణి, ఒక బ్రాహ్మణుని దూతగా పంపి వచ్చి నన్ను తీసుకొని పొమ్మని చెప్పింది. కాని ఈ స్త్రీ మణిపట్ల మమకారం చంపుకొని, ప్రేమించిన వానికి ప్రాణహాని జరుగుతుందని వెళ్ళిపొమ్మంది.

Thursday 15 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (55)


ఆ గుహలో వెలుగు కనబడింది. అది మణి ప్రభావమే, మధ్యలో ఒక ఊయెలలో పిల్లవాడు నిద్రిస్తున్నాడు. ఆ మణి, ఊయెలపై వ్రేళ్ళాడుతూ ఉంది. పక్కన ఒక అందమైన స్త్రీ ఉంది. 

పురాణాలలోని జంతువులు మనుష్య భాషలో మాట్లాడుతాయి. స్త్రీలు కూడా అందంగా ఉన్నట్లు వర్ణనలుంటాయి. జంతు దశనుండి మానవాకారపు దళ ఈ స్త్రీలలోనూ చూడవచ్చని డార్విన్ సిద్ధాంతం వారంటే అనవచ్చు. 

ఒక పాట వినబడింది. ఆ పాట ఏదో వట్టి జోలపాట కాదు. ఆ పాటలో భగవానుడు వెదకడానికి వస్తున్నాడని ఉంది. 

సింహః ప్రసేనం అవధీత్ సింహో జాంబవంతా హతః

సుకుమారక! మారోదీ: తవ హ్యేష శ్యమంతకః

ఈ శ్లోకం భాగవతంలో లేదు. ఇది విష్ణుపురాణంలోనూ, స్కాంద పురాణంలోనూ ఉంది. అనగా సింహం, ప్రసేనుట్ణి చంపింది. జాంబవంతునిచే సింహం చంపబడింది. ఓ సుకుమార శిశూ! ఇక ఏడవవద్దు. ఈ మణి నీ కొరకే అని.


భగవానుడేమనుకొన్నాడో ఈమెకెట్లా తెలిసింది?  


Wednesday 14 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (54)



రహస్యాన్ని ఛేదించాడు


సత్రాజిత్తు యొక్క అనుచరులతో మరల అడవికెళ్ళాడు కృష్ణుడు. గుర్రపు గిట్టల గుర్తులను బట్టి కొంత దూరం వెళ్ళగా, ఒకచోట గుర్తులు కనబడలేదు. ఆ చోటంతా రక్తపు మరకలతో ఉంది. ఎముకలు పడి యున్నాయి. ప్రసేనుని చివికిన గుడ్డలు కనబడ్డాయి. అతని ఆభరణాలు గుర్రపు జీను కనబడ్డాయి. భగవంతుడే దండయాత్ర చేస్తే మొత్తం శవం కనబడాలి కదా! పోనీ ఎవరైనా చంపితే ఆ శవాన్ని జంతువులు తిని ఉండవచ్చు. అట్లా భావించారు ఇతనితో వచ్చినవారు. రాజు యొక్క ఆభరణాలు పడి యున్నాయిగాని మణి మాత్రం కనబడడం లేదు. ఇది సందేహానికి తావిచ్చింది.


ఇంతలో సింహపు కాలిగుర్తులు కనబడ్డాయి, కృష్ణునకు. వీటి జాడ తెలిసి కొందాం రండని అన్నాడు. కొంత దూరం వెళ్ళగా సింహం కళేబరం కనబడింది. సింహం పడినచోట ఎలుగుబంటి జాడలు కనిపించాయి. సింహం పాదాల కంటే వీటి పాదాలు పెద్దవిగా ఉంటాయి. అవి రెండు కాళ్ళ మీద నిలబడగలవు కూడా. పాదాల గుర్తులు నేలలో స్పష్టంగా పెద్దవిగా కన్పిస్తున్నాయి. ఇక జాంబవంతుని గుర్తులను వేరే చెప్పాలా? ఆ గుర్తులను పట్టి గుహలో ప్రవేశించాడు. గుహ చీకటి మయం. తోటి ప్రజలు ప్రవేశించడానికి భయపడ్డారు. ఇక కృష్ణుణ్ణి ఎట్లాగూ సందేహిస్తున్నారాయె. మనలను ఇందులో ప్రవేశపెట్టి చంపుతాడేమో అని భావించారు. 


కృష్ణుడు ఆపదలనెదుర్కొంటాడు కదా! కనుక మీరందరూ గుహ దగ్గర ఉండండి, నేనే లోపలకి వెడతానన్నాడు. అతని శరీర కాంతి ఆ గుహలో వెలుగు.

Tuesday 13 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (53)


నీలాపనిందలు కృష్ణునకు


ప్రసేనుడు తిరిగి రాకపోవడం విని సత్రాజిత్తు కంగారు పడ్డాడు. కృష్ణుడే చంపి యుంటాడని సత్రాజిత్తు నిర్ధారణకు వచ్చాడు. భాగవతం ప్రకారం కృష్ణుడు ప్రసేనునితో కలిసి వెళ్ళకపోయినా ఇతడు తన సోదరుణ్ణి చంపించి యుంటాడని సత్రాజిత్తు సందేహించి నట్లుంది. "ఈ కృష్ణునకు మణిపై ఏనాడో కన్ను పడింది. మణిని ధరించి ప్రసేనుడు అడవికి వెళ్ళడం ఇతనికి మంచి అవకాశాన్ని కల్పించింది. అతడు తిరిగి రాకపోతే ఏ క్రూర జంతువు చంపి యుంటుందని ప్రజలు సందేహిస్తారు. కనుక శ్రీకృష్ణుడు తన మనుష్యులను పంపి ప్రసేనుణ్ణి చంపించి యుంటాడు" అని సత్రాజిత్తు నిర్ణయించాడు.


పరమాత్ముడు, మానవ కారం ధరించినపుడు మానవుల పట్ల వేసే నీలాపనిందలు అతనిపట్ల మోపుతారు. వాటిని అనుభవిస్తూ మానవునకు గుణపాఠం నేర్పడమే అవతార ప్రయోజనం.


సత్రాజిత్తు రెండు నేరాలను మోపాడు. కృష్ణుడు ప్రసేనుణ్ణి చంపాడని, మణిని దొంగిలించి ఎక్కడో పెట్టాడని, ఇట్లా నిందా ప్రచారం సాగింది. 


మానవ ప్రవృత్తి చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఒకమాటు తమ నాయకుణ్ణి ఆకాశానికి ఎత్తుతారు. కొంతకాలానికి చెత్తబుట్టలో వేస్తారు. ఇది అన్నికాలాలలోనూ ఉంది. ఏ కృష్ణుడు కంసుని బారినుండి యాదవ కులాన్ని రక్షించాడో, సుఖ సంపదలనిచ్చాడో అట్టివాడే నీలాపనిందలకు లోనైనాడు. ఈ ప్రజలు సత్రాజిత్తునకు వంత పాడారు. మోసం, దగా కృష్ణునకు వెన్నతో బెట్టిన విద్యలని అంటూ లేనిపోని అక్కసును వ్రెళ్ళకక్కారు. కాళీయుని నుండి ప్రజలను కాపాడం, గోవర్ధనాన్ని గొడుగుగా చేసి ప్రజలను రక్షించడం మొదలైనవి ప్రజలకు గుర్తుకు రాలేదు. చూసారా ప్రజల మనఃప్రవృత్తి? 


ఇట్లా ఉన్నారేమిటిని భగవానుడే కలత చెందాడు (కలత చెందినట్లు నటించాడని అందాం). ఇట్లా నిందలు వేస్తారని ఊహించలేదు. ఒక నిజాయితీ గల మనిషి ఇట్టి పరిస్థితులలో ఎట్ల బాధ పడతాడో అట్లా బాధపడ్డాడు. తన పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటించకుండా ప్రసేనుడు కనబడకపోవడం ఏమిటో తెలుసుకోవాలని నిందలను తొలగించుకోవాలని ప్రయత్నించాడు.

Monday 12 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (52)


సరే ఆ నాటివాడు, ద్వాపరయుగంలో ఉండి ఈ మణిని తీసుకొని వెళ్ళే సింహాన్ని చూసాడు. అతనికి సుకుమారుడనే పిల్లాడున్నాడు. ఆ వయసులో అతనికి పిల్లవాడేమిటని ఆశ్చర్యపోతున్నాం. మెరిసే మణి, తన పిల్లవానికి ఆటవస్తువుగా పనికి వస్తుందని భావించాడు. 


సింహాన్ని చంపి మణిని తీసుకొని పిల్లవాడూగే ఉయ్యాల గొలుసులకు కట్టాడు. వాలి కూడా అంగదుడు నిద్రపోయే ఊయలకు రావణుణ్ణి ఆటబొమ్మగా కట్టాడు. రావణుణ్ణి పది తలల పురుగని అన్నాడు కూడా.


కృష్ణుడు చంద్రుని చూచుట


వినాయకునకు శ్యమంతకమణికి గల సంబంధాన్ని స్కాందంలోని కథ చెప్పింది. దీని ప్రకారం ప్రసేనుడు, కృష్ణుడు కలిసి వేటకు వెళ్ళినట్లుందని చెప్పాను కదా. అప్పుడు ప్రసేనుడు విడిపోయి సింహం చేత చంపబడ్డాడని తుదకు జాంబవంతుని దగ్గరకు మణి చేరిందని కథ. 


భగవానుడు, ప్రసేనునికై వెదికాడు. సూర్యాస్తమయం అయిపోయింది. చీకటి పడింది. ఇంతలో చవితి చంద్రుణ్ణి అకాశంలో చూసాడు. 


శుక్లపక్షంలో చవితి నాటి చంద్రుడు స్పష్టంగా కన్పిస్తాడు. తదియనాడు ప్రొద్దున్న ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోపు అస్తమిస్తాడు. సూర్యుని కాంతి ప్రభావం వల్ల సూర్యాస్తమయం అయ్యేవరకు చంద్రుడు కనిపించడు కదా. వెన్నెలలో 6-30 నుండి 7 గంటలవరకూ పడమర దిక్కు దిగువున మసక మసకగా కన్పిస్తాడు. దీనిని జాగరూకతతో గమనించాలి. చవితినాడు ప్రొద్దున్న తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్పష్టంగా కన్పిస్తాడు. అట్టి స్థితిలో అరెరె! చీకటిగా ఉంది. ఇక వెదకటం ఎందుకని ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు.

Sunday 11 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (51)

జాంబవంతుడు


అక్కడొక గుహలో జాంబవంతుడున్నాడు. అతడు ఎవరనుకున్నారు? వానరులతో కలిసి రామునికి సాయంగా ఉన్నవాడే. ఆనాటివాడు ద్వాపరయుగం దాకా ఉన్నాడు.


రాముడు అవతార సమాప్తిలో ఆయోధ్యాపుర వాసులందరూ అతనితో వైకుంఠానికి వెళ్ళారు. హనుమ, జాంబవంతుడు తప్ప. వాళ్ళు ఎందుకాగిపోయారు? ఈ పాప పంకిలమైన భూలోకాన్ని రామనామ సంకీర్తనంతో వైకుంఠంగా మార్చడానికే హనుమ ఉండిపోయాడు. ఇది ప్రపంచానికి తెలియజెప్పడం కోసం చిరంజీవిగా రాముడుంచాడేమో! అట్లాగే లంకలో విభీషణుడు చిరంజీవిగా ఉంచాడు.


మనమేదో మానవజాతి గొప్పదని మురిసిపోతాం. మానవులు నిరంతరం తనను స్మరించలేరని భావించి వీరికి చిరంజీవిత్వం ప్రసాదించలేదు రాముడు. ఒక రాక్షసునకు, ఒక కోతికి, ఒక ఎలుగుబంటి ఇచ్చాడీ వరాన్ని.


అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ: 

కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః 


ఈ శ్లోకంలో జాంబవంతుడు లేడు. అయినా అతను చిరంజీవి. ఏదైనా చిరకాలం ఒక రంగంలో నిష్ణాతుడైతే అతణ్ణి జాంబవంతుడని అంటాం. 


అగస్త్యుడు, నిరంతరము 16 సంవత్సరాల ప్రాయంలో ఉండే మార్కండేయుడూ చిరంజీవులే. అయిన వీరీ శ్లోకంలో లేరు. 

Saturday 10 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (50)


కృష్ణుని సందేహించడమే కాదు, అతనినుండి భయం కల్గుతుందనీ సత్రాజిత్తు భావించాడు. కృష్ణుడు చిన్నతనంలోనే చాణూరుడు, ముష్టికుడనే ప్రధాన మల్లురను, కంసుణ్ణి చంపాడు. 17 సార్లు జరాసంధుణ్ణి తరిమి వేసాడు. ఆపైన జిత్తులమారి కూడా. అతనితో శత్రుత్వం వహిస్తే నేనెట్లా నిలబడగలనని సందేహించాడు సత్రాజిత్తు.


ఒక మూల శ్యమంతకమణిని రాజుకు ఈయలేడు, దానిని ఉంచుకొనే సామర్థ్యమూ లేని పరిస్థితి. భౌతిక సంపదలు మనిషిని ఎన్ని ముప్పుతిప్పలు పెడతాయో గమనించారా? 


ప్రస్తుతానికి ఆ మణిని తన సోదరుడైన ప్రసేనజిత్తు అందజేసి ప్రశాంతంగా ఉన్నాడు. ఇతనికంటే తెలివైనవాడు, బలవంతుడు ప్రసేనజిత్తు.


ఇతడు దీనిని ధరించి వేటకు బయలుదేరాడు. కృష్ణునితో వెళ్ళినట్లు స్కాందం చెప్పింది. నేను చెప్పేది భాగవతాన్ని, విష్ణుపురాణాన్ని అనుసరించేది. 


దీనిని ధరించి ఎట్లా ఉండాలని నియమం చెప్పాడు సూర్యుడు? శారీరకంగా మానసికంగా పవిత్రునిగా ఉండాలి కదా! (కాలకృత్యాలు తీర్చుకున్నాడు కానీ) అతడరణ్యంలో ఉండడం వల్ల కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి నీరు దొరకలేదు. ఆ సమయంలో సింహం వచ్చి ఇతణ్ణి చంపివేసింది. సింహానికి ఈ మణిని చూస్తే ఏదో ఆకర్షణ కలిగింది. దానిని పట్టుకుని పోతూ ఉంటే చీకటితో నున్న అడవి, పట్టపగలులా వెలిగిపోతోంది. అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టింది.

Friday 9 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (49)



నేను కృష్ణుని నిరాసక్తతను చెప్పదలుచుకున్నాను. శంఖం, చక్రం, గరుడుడు ఆయా సందర్భాలలో కృష్ణుని దగ్గరకు వచ్చాయి. మహావిష్ణువు ధరించే కౌస్తుభమణి కృష్ణుని దగ్గరకు వచ్చింది. 


కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభం 

అనే శ్లోకాన్ని విన్నాం. అట్టి కౌస్తుభాన్ని ధరించగా ఈ మణి కావాలా? 


ఈ శ్యమంతక మణిని ఉగ్రసేన మహారాజు ధరిస్తే బాగుంటుందని సూచించాడు. రాజు ధరించడం వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే, అంతేనే కాని తాను ధరించి మురిసి పోవాలని ఉద్దేశ్యం కాదు. సత్రాజిత్తు ఈ భాగ్యమంతా తన కుటుంబానికి చెందాలని భావించే సామాన్య పౌరుడు. ఈ అపార సంపద రాజుకు చెందితే ప్రజలందరికీ సౌభాగ్యము కల్గుతుందనే విశాల భావనతో అట్టి సూచన కృష్ణుడు చేసాడు. 


ఒక సామాన్యుని దగ్గర రాజు కంటే అధిక సంపద ఉంటే అతణ్ణే సామాన్యులు రాజుగా భావిస్తారు. కనుక అట్టి విశేష సంపద సామాన్యుల దగ్గర ఉండకూడదని అర్ధ శాస్త్రం చెప్పింది. విలువైన మణులు రాజునకే చెందుతాయని 'రాజా రత్నహారీ' అనే మాట ఉంది.


ఇట్టి సద్భావనతో కృష్ణుడు సూచించగా నేను రాజును, మంత్రిని లెక్కబెట్టడమేమిటి? ఈ రాజును కృష్ణుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇతని తాతకే ఆ పదవిని కట్టబెట్టేడని, ఈ మిషతో తానే ఉంచుకోవాలని కృష్ణుడు భావించాడనీ ఊహించాడు సత్రాజిత్తు.


ఈ కథ, ఆశ ఎంత పనిచేస్తుందో చూపించడం లేదా? 

Thursday 8 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (48)


కృష్ణుని నిరాసక్తత


కృష్ణుడు పరమ జ్ఞాని కదా! అతనికి అహిక విషయాలపై మక్కువ ఉంటుందా? వెన్న దొంగలించడం మొదలైనవి అతని లీలలు మాత్రమే. అట్లాగే రాసలీల, గృహస్థ జీవనం, 16 వేల స్త్రీలతో కాపురం మొదలైనవన్నీ నాటకంలోని భాగాలు. కంసుని చంపిన తరువాత ఇతడు అభిషేకానికి అర్హుడే కదా! అతడే రాజు కావాలని ప్రజలందరూ ఉవ్విళ్లూరేరు. అతడు ఇష్టపడ్డాడా? ఉగ్రసేనుణ్ణి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఉగ్రసేనుడు అతని తాత. కంసుణ్ణి చంపి మధురను విడిచి కృష్ణుడు ద్వారకలో ఉండిపోయాడు. అప్పటి నుంచి అతడు ద్వారకాధీశుడు. అయినా రాజ్యాన్ని ఏలాలనే ఉబలాటం లేదు. తాను రెండవ స్థానంలో ఉండి బలరామునకు ఉన్నత స్థానమిచ్చాడు. అతడు పూర్ణావతారుడైనా వినయంతో నిస్పృహుడై ధనవాంఛ లేక కాలం గడిపాడు.


భాగవతం కూడా, క్షీరసాగర మథనంలో లక్ష్మి అవతరించినపుడు విష్ణువును పతిగా పొందటం, నిరాడంబరంగానే వర్ణించింది. డబ్బు, బంగారం పట్ల ఎట్లా మోజులేదో స్త్రీల పట్ల కూడా లేదు. లక్ష్మి అవతరించినపుడు దేవతలందరూ దండలు వేయబోతూ ఉంటే ఒకమూల ఏమీ పట్టించు కోకుండా ఉన్నాడు విష్ణువు. ఇట్టి మానసిక బలం ఉన్న విష్ణువునే వివాహమాడాలని భావించింది లక్ష్మి. అతని ప్రేమను చూరగొనాలని అతని మెడలో దండ వేసింది. అంగీకరించి తన వక్షః స్థలంపై ఉంచుకున్నాడు. 

Wednesday 7 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (47)


తపస్సు వల్ల దివ్యమణి


ఒకనాడు సత్రాజిత్తు సముద్ర తీరంలో ఇష్టదైవమైన సూర్యుణ్ణి ఆరాధించాడు. ఏ వరం కావాలని సూర్యుడడిగాడు.  


సూర్యుని మెడలో తళతళలాడే మణి యుంది. అదే శ్యమంతకమణి. ఇది కాంతినే గాక బంగారాన్ని ప్రసాదిస్తుందని ఆ మణిని సత్రాజిత్తు ఇమ్మన్నాడు. దాన్ని సత్రాజిత్తు మెడలో సూర్యుడు వేశాడు. 


నా దివ్య రూపంలా మెరిసే ఈ మణి రోగాదులను కూడా పోగొడుతుందని అన్నాడు. అంతే కాకుండా బంగారాన్ని రోజూ ఇస్తుందన్నాడు. అయితే దీనిని ధరించినవాడు శారీరకంగా, మానసికంగా పరిశుద్ధుడై యుండాలని షరతు పెట్టాడు. ఏ తప్పు చేసినా ఇంతే సంగతులని అదృశ్యమయ్యాడు. 


సత్రాజిత్తు మణిని ధరించి నగరంలో ప్రవేశించాడు. ఆ కాంతి ప్రవాహంలో ఇతణ్ణి ప్రజలు గుర్తు పట్టలేకపోయారు. ఆ కాంతినే చూస్తూ ఉండిపోయారు. సూర్యభగవానుడే శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చాడా అని వారు ఆశ్చర్య చకితులయినప్పుడు మరీ దగ్గరగా చూస్తే ఇతడు కనబడ్డాడు. ఈ సూర్య ప్రసాద మహిమను వేనోళ్ళ కొనియాడారు. 


కృష్ణుడు రసికుడు కనుక ఇందలి సొగసునకు ఆకర్షితుడయ్యాడు. కృష్ణుడు పొగుడుతూ ఉంటే ఇతనికి ఆ మణి కావాలేమోయని ఊహించాడు సత్రాజిత్తు.

Tuesday 6 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (46)

సూర్యుడు - వినాయకుడు


వివాహానంతరం కృష్ణుడు రుక్మిణి లో నున్న కాలమది. యాదవ వంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడని ఇద్దరు ప్రముఖ సోదరులుండేవారు. సత్రాజిత్తు, సూర్యారాధకుడు.


ఈనాటికీ కొందరాచారవంతులు ప్రధాన దేవతయైన సూర్యుని పరివార దేవతగా భావించి సూర్య నమస్కారం చేయుట, ఆదిత్య హృదయాన్ని పఠించుట చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇతణ్ణే ప్రధాన దేవతగా భావించి విశేషార్చనలు చేసేవారు. ఇతణ్ణి పరమాత్మ స్వరూపంగా భావించడాన్ని సౌరమని అంటారు. దేశ విదేశాలనుండి యాత్రికులను ఆకర్షించే కోణార్క్ లోనున్న సూర్య ఆలయం ప్రసిద్ధిని పొందింది. కోణార్కమనగా అర్కుడు యొక్క కోణం. సూర్యునిలో ఒక భాగమని అర్థం. 


అర్క గురించి చెబుతూ ఉంటే వినాయకుడు గుర్తుకు వస్తున్నాడు. ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించా. ఈ కోణార్క్ ప్రస్తావించినపుడు ఇద్దరికీ ఉన్న సంబంధం గుర్తుకు వచ్చింది.


గణపతిని పూజించేటపుడు ఏ పుష్పాన్ని అర్పిస్తాం? దండ కట్టినపుడైనా? జిల్లేడు కదా! సూర్యునకు, జిల్లేడునకు ఒకే నామం అర్కయని. తమిళనాడులోని సూర్యనార్ కోవెలలో స్థల వృక్షం, జిల్లేడే. అన్ని పుష్పాలు సూర్యోదయం అయిన తరువాతనే వికసిస్తాయి. కాని ఇందులో సూర్య సన్నిధి, విశేషంగా ఉంటుంది. వినాయకునకు పువ్వుల నర్పించేటప్పుడు ఈ జిల్లేడు పువ్వును ఆర్పిస్తే సూర్యుడే ఇతని పాదాలు పడ్డట్టే కదా! 


Monday 5 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (45)

 

కృష్ణావతారంలో కృష్ణుడు వినాయకుడిని పూజించడం విస్తారంగా ఉంది.


గణనాథుడు - కృష్ణుని పూజలందుకొనుట శ్యమంతకోపాఖ్యానము


ఈ కథ భాగవతంలో ఉంది. ఆఖ్యానం అంటే కథ. ఉపాఖ్యానం, ప్రక్క కథ సూచిస్తుంది. ఇతిహాసంలోని గాని, పురాణాలలో గాని ప్రధాన కథ సాగుతూ ఉంటే చిన్న చిన్న కథలు ఉపాఖ్యానాలుగా వస్తాయి. ఇందు కొన్ని ప్రధాన కథతో సంబంధం కలిగి యుండవు. భారతంలో నలోపాఖ్యానం అట్టిది. కొన్ని కథలు, ప్రధాన కథతో సంబంధం కలిగి యుంటాయి. వాటిని విడిగా చూపలేం.


భాగవతంలో అట్టి సంబంధం ఉన్న కథ శ్యమంతకోపాఖ్యానం అట్టిది. ఈ కథ అంతా మణిచుట్టూ తిరుగుతూ ఉంటుంది. కృష్ణునిపై వేసిన అభాండాలు, వాటిని అతడెట్లా దాటాడో వివరిస్తుంది.


ఇదే కథ, విష్ణుపురాణంలోనూ ఉంది; కొద్ది తేడాలతో. అట్లాగే స్కాందంలో నందికేశ్వర సనత్కుమార సంవాద రూపంలో ఉంటుంది. స్కాందంలోని ఈ కథకు వినాయకునకు గల సంబంధాన్ని తెలుపుతుంది. నందికేశ్వరుడు, సనత్కుమారునితో చెప్పిన కథనే ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అక్కడక్కడ భాగవతాన్ని, విష్ణుపురాణాన్ని పేర్కొంటాను. 


Sunday 4 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (44)

సంస్కృతంలో డేంఠి రాజా గణపతి లేదా డుంఢి గణపతి పదాన్ని తుండి అంటారు తమిళులు. ఆ గణపతి కాశిలో ప్రసిద్ధుడు. దానికి తగ్గట్టుగానే తోండి గణపతి ఉన్నాడిక్కడ. ఇక్కడా రాముడు, వినాయకుణ్ణి అర్చించాడట. ఇది వేదారణ్యం. ఉప్పూర్ మధ్యలో ఉంటాడు. అనగా వేదారణ్యం నుండి సముద్ర తీరానికి వెళ్ళేదారిలో ఉంటాడు. ఇక్కడినుండే రాముడు, సేతువును కట్టడానికి మొదలు పెట్టాడని అంటారు. కనుక ఇక్కడి వినాయకుడు పూజించాడు. రాముణ్ణి ఆశీర్వదించి శ్రమ తగ్గడం కోసం ఇంకా కాస్త ముందుకు వెళ్ళి కట్టుమన్నాడట. లంకను సులువుగా చేరవచ్చని సలహా ఇచ్చాడట.


తొండి వినాయకుడి గుడికి విమానాదులేమీ వుండవు. అట్టాహాసాలంటే ఇష్టపడలేదట. ఎందుకంటే తన మామయైన రాముడు ఎండనక వానయనక తిరుగుతూ ఉంటే తనకెందుకు పై ఆచ్ఛాదనలని ఆలయ నిర్మాణానికి అనుమతించి ఉండకపోవచ్చు. శంకరుల గణేశ పంచరత్నం, ఈ గణపతిని గురించే యుంటుంది. ఈశ్వర సుతుడైన వినాయకుణ్ణి అర్చించడం వల్లనే విజయాన్ని సాధించి రాముడు, విజయ రాఘవుడయ్యాడు. అంతే కాదు, భార్యతో కలిసి సీతాముడయ్యాడు. తిరిగి వచ్చేటప్పుడు రామలింగం గానున్న ఈశ్వరుణ్ణి పూజించాడు.


లోగడ శంకరుల పాలరాతి విగ్రహాన్ని ఒక వాహనంలో తరలించడాన్ని ప్రస్తావించాను. అచిరుపాక్కంలో 108 కొబ్బరికాయలు కొట్టినట్లు ఉప్పూర్ లోనూ కొట్టాం. మొదటి ప్రాంతంలో ఈశ్వరునికి వచ్చిన కష్టాన్ని తొలగించాడు. రెండవ ప్రదేశంలో రాముని పూజలందుకున్నాడు. జ్యోతిర్లింగమైన రామేశ్వరం, రాముని దయవల్ల అందరికీ పుణ్యక్షేత్రమైంది. రామ, ఈశ్వరులతో ఇతనికి ఉన్న సంబంధాన్ని ఈ విధంగా పాలరాతి విగ్రహ యాత్రలో శంకరులందించారు.

5 అక్టోబరు 2020, సోమవారం, అధిక ఆశ్వీయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.



5 అక్టోబరు 2020, సోమవారం, అధిక ఆశ్వీయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.


ఓం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు వండిన / వేపబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి ఈ సారి గురువారం వచ్చింది. సంకష్టహర చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి సోమవారం వచ్చింది.)


అధికమాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఏ వ్రతమైనా కోటి రెట్ల ఫలం కలిగి ఉంటుందని శాస్త్రవాక్కు. కనుక ఈ సంకటహర చవితికి గణేశునికి చేసే అర్చన అత్యంత ఫలప్రదం. 


5 అక్టోబరు 2020, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.23 నిమి||


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


అధిక ఆశ్వీయుజ మాసంలో వచ్చిన దీనికి విభువన సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణపతయే నమః

Saturday 3 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (43)


రాముడు-వినాయకుడు


మహా విష్ణువు, గణపతి పట్ల ఎట్టి మర్యాదను చూపించాడో చెబుతాను. రావణవధానంతరం, రామేశ్వరంలో రాముడు శివుణ్ణి అర్చించడం రామలింగాన్ని ప్రతిష్టించడం మీకు తెలిసిందే. సేతు నిర్మాణానికి ముందు నవ గ్రహాలని పూజించడం, రామనాథపురం సముద్ర ప్రాంతంలో నవపాషాణంలో అర్చించడం తెలిసిందే. ఈ నవ పాషాణ ప్రాంతం నేడు దేవీ పట్నం. ఈనాటికీ యాత్రికులు ఈ నవ పాషాణాన్ని దర్శిస్తారు. ఇది కాక మరొక ప్రాంతాన్ని కూడా యాత్రికులు చూడాలి. తెలిసినవారు సేతు యాత్రను ఇక్కడ నుండే మొదలు పెడతారు.


అదేమిటంటే రాముడు విఘ్నేశ్వరుణ్ణి పూజించిన చోటు. దీనిని ఉత్తర ప్రాంతం నుండి రాముడు బయలుదేరడం వల్ల ఉప్పూర్ అని అంటారు. ఉప్పూర్, నవపాషాణానికి ముందుగా ఉంటుంది. నవగ్రహాలను పూజించడానికి ముందు గణపతిని నుతిస్తాం.


రాముడు శాస్త్ర మర్యాదలను తు.చ. తప్పక పాటించేవాడే కదా. నవ గ్రహాలను పూజించడానికి ముందు అనగా సేతు బంధానికి ముందు గణపతిని పూజించాలి కనుక ఈ ఉప్పూర్ గణపతిని ముందుగా పూజించాడు. అతడు వరప్రసాది కాబట్టి అక్కడున్న స్వామికి ఎట్టి అచ్చాదన ఉండదు. ఆలయంపై విమానాన్ని కట్టడానికి ఆ గణపతి, అంగీకరించలేదట. నిరాడంబరంగా కూర్చొని ఉంటాడు. శీతాతపాలను భరిస్తూ ఉంటాడు. ఎండ తగిలే వినాయకుడి తమిళులంటారు.


Friday 2 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (42)



కుమార స్వామికి సాయం


తల్లిదండ్రులే ఇతని విజయావకాశానికి దారి చూసినపుడు ఇతని తమ్ముడు ఇతని సాయం కోరకుండా ఉంటాడా? ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికి పండునిస్తామని తల్లిదండ్రులనడం అనే కథ మీకు తెలిసిందే. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యుడు గెలవలేక విరక్తిని చెందాదు. తల్లిదండ్రులు ఓదార్చారు.


సుబ్రహ్మణ్యుని అవతార ఉద్దేశ్యం శూర పద్ముణ్ణి ఓడించడమే. ఇక వల్లిని వివాహం చేసుకునే సందర్భంలో వేటగాని వేషం వేయవలసి వచ్చింది.  

ఇతణ్ణి ఆమె గుర్తుపట్ట లేకపోయింది. తన నిజరూపాన్ని ప్రకటించి ప్రేమను పొందాలనుకుంటాడు. ఈ సందర్భంలో అన్నగారి గొప్పదనాన్ని చాటాలనుకున్నాడు. ఏ పని చేసినా విఘ్న నాయకుణ్ణి కొలవాలనే సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంలో మహాగణపతిని ధ్యానించాడు.


వినాయకుడు పిచ్చి యెత్తిన ఏనుగులా మారి, వల్లిని భయపెట్టాడు. వేటగాని రూపంలో ఉన్న కుమారస్వామిని భయం వల్ల వల్ల కౌగిలించుకొనవలసి వచ్చింది. అతడు కుమారస్వామియనే ఎఱుక లేకుండా జరిగింది. ఇక వేషాన్ని తొలగించుకొని నిజరూపంలో కుమారస్వామి ఆమె ముందు సాక్షాత్కరించారు. వల్లిని ఆశ్చర్యంలో ముంచివేశాడు.


తరువాత వల్లీ వివాహం, కుమారస్వామితో జరిగింది. ఇలా వీరిద్దరి ప్రేమ వివాహానికి కారకుడు గణపతి.


అరుణగిరినాథుడు, విఘ్నేశ్వర స్తుతి సూచించే తిరుప్పుగళలోని త్రిపురాసుర సంహారం - వల్లీ వివాహంలో ఇతని సహాయాన్ని నుతించాడు.

Thursday 1 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (41)

ఈ సందర్భంలో కామేశ్వరుణ్ణి ఒక్కణ్ణే రంగంలోకి దింపడం ఎందుకని తన కొడుకు గణపతి మహత్వాన్ని లోకానికి చాటడం కోసం కొడుకునూ రంగంలోకి దింపింది. తాను లలితాంబగానే ఉంటూ అమ్మవారు, కామేశ్వరుని ప్రీతిపూర్వకమైన చూపుతో చూసింది. ఆయన చిరునవ్వు చిందించాడు. ప్రేమ పూర్వకమైన చిరునవ్వుల కలయికచే మహాగణపతి ఆవిర్భవించాడు. అందమైన ఆనందప్రదమైన ముఖంతో మహాగణపతి సాక్షాత్కరించాడు. 


ఇట్లా వినాయకుడి అవతరణలు చాలా ఉన్నాయి. అందొకటి ఇది. లలితోపాఖ్యానం, బ్రహ్మాండ పురాణం లోనిది.


ఇక్కడ అమ్మవారు, ఈశ్వరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వడం వల్లనే ఇతడవతరించాడని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరః - లలితా సహస్రనామం


ఆవిడ ఏ దేవత శక్తినైనా ఒక్క నిమేషకాలంలో తగ్గించగలదు, విఘ్న యంత్రాన్ని నిర్వీర్యం చేయగలదు. కాని విఘ్నాలను నివారించడానికి విఘ్నేశ్వరుడు నియోగింపబడ్డాడు కనుక అతనికి అవకాశం ఇచ్చింది.


ధర్మానికి ఆమె ఎట్లా కట్టుబడిందో అట్లాగే ఆమెచే సృష్టింపబడిన విఘ్నేశ్వరుడు కూడా అహంకారం లేకుండా ఆమెకు సాష్టాంగ పడ్డాడు. అంతేనే గాని ఆమెకు చేతకాకపోవడం వల్ల తానీ పని చేసానని విర్రవీగలేడు. ఆమె ఆశీస్సులనందుకొని విఘ్న యంత్రాన్ని ఛేదించడానికి పూనుకొన్నాడు. 


అగ్ని ప్రాకారంలో ఒక మూలయంత్రం పూడ్చి పెట్టబడింది. స్వామి దానిని గుర్తించి తన దంతంతో ఛేదించాడు. వెంటనే శక్తి గణాలు మేల్కొన్నాయి. మరల వారి మనస్సులు కుదుటబడ్డాయి. భక్తితో ఆజ్ఞాపాలనతో ఉత్సాహంతో భండాసురుణ్ణి ఎదుర్కొని ఓడించారు.