Showing posts with label దేవి నవరాత్రులు. Show all posts
Showing posts with label దేవి నవరాత్రులు. Show all posts

Thursday, 14 October 2021

యాదేవీ సర్వభూతేషు (4)



'అపరాజిత స్తోత్రానికి అర్ధం తెలుసుకున్నాం గదా. అందులోనే ఋషులు మనకు సులభోపాయాలు ఎన్నో చెప్పారు . ప్రతి విశేషణానికి ముందు 'యాదేవీ సర్వభూతేషు ______ రూపేణా సంస్థితా' అన్నారు. ఇంతకీ ఈ యాదేవీ అంటే ఏమిటి ? ఏ దేవి అయితే సర్వభూతములయందూ ఈ ఈ విభూతులుగా వ్యక్తమవుతుందో ఆ దేవికి ముమ్మారు నమస్కారములు అన్నారు. ఋషి దేన్నీ వదల్లేదు. సర్వభూతములు అన్నారు, అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చిన్న విత్తనం నుంచి బ్రహ్మదేవుని వరకు) అఖిల లోకాల్లో, అనేకరూపాల్లో వ్యక్తమవుతున్న అమ్మవారి విశ్వరూపం చూపెట్టారు. అంటే మనం భగవతి ఉపాసన చేయాలంటే అమ్మవారిని అన్నిటియందు చూడటం నేర్చుకోవాలి.


స్త్రీలోనే అమ్మవారిని చూడాలని కూడా వారు అనలేదు. సర్వభూతాల్లో చూడాలి అన్నారు. అంటే ఎవరిని అల్పంగా చూడరాదు, అవమానించకూడదు. అది జంతువైనా , మొక్కైనా ఏదైనా. ఇక ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పనవసరం లేదు. 


కులమతలింగ బేధాలను మనం దాటి అంతటా భగవతి చూడగలిగితేనే అది నిజమైన శ్రీవిద్యోపాసన. నిజమైన శ్రీవిద్యోపాసకుడు దేన్నీ అల్పంగా భావించడు. ఎందుకంటే అనేక రూపాల్లో అమ్మ అతని వద్దకు నిత్యం వస్తూ ఉంటుందని భావన చేస్తాడు. 


ఇక్కడ కేవలం జీవుల గురించి మాత్రమే చెప్పలేదు. కార్యకలాపాల గురించి కూడా చెప్పారు చూడండి - నిద్ర, ఆకలి, దాహం, మతిమరుపు వంటి వాటిల్లో కూడా అమ్మవారిని చూడమన్నారు. అది కదా నిజమైన ఉపాసన అంటే. మనం యజ్ఞాలు చేయక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. చండీ సప్తశతిలో చెప్పినట్లు అమ్మవారిని సమస్త కార్యకలాపాల్లో, విశ్వమంతటా దర్శించగలిగితే చాలు. అంటే ఇక్కడ చండి హోమాలను, జపాలను తక్కువ చెయ్యట్లేదు. కానీ సాటిజీవుల పట్ల ప్రేమను చూపలేనప్పుడు, తన తోటి మానవులను గౌరవించలేనప్పుడు భగవతి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకించి కర్మలు చేయుట ఎందుకు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవాళ్ళు, తల్లిదండ్రులను, కట్టుకున్న ఇల్లాలిని గౌరవించని వాళ్ళు, స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు భగవతి ఉపాసన చేస్తున్నామని చెప్పుకోవటమంటే అది శుద్ధ అబద్ధమే. నిజమైన దేవి ఉపాసకుడు తాను ఎవరిని దూషించడు, తన వాళ్ళు దూషిస్తే చూస్తూ ఊరుకోడు.    


అదే ఈ స్తోత్రం చెబుతోంది. నిత్యజీవితంలో సర్వావస్థల్లో భగవతిని చూడు. అన్నిటియందు అమ్మవారిని భావన చేసినవాడికి అపజయం ఉండదు. అతడిని భగవతి తనతో సమానంగా చూస్తుంది. కనుక దేవతలు, ప్రకృతి అతనికి అన్ని విజయాలనే ఇస్తాయి (వారి ద్వారా అపరాజిత దేవి అతడిని అపరాజితుడిని చేస్తున్నది). 


ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday, 13 October 2021

యా దేవీ సర్వభూతేషు (3)



యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు విష్ణుమాయ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు చైతన్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు బుద్ధిరూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు నిద్ర రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఆకలి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జీవాత్మ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శక్తి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దాహం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఓర్పు/ సహనం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మూలప్రకృతి తత్త్వంగా (సర్వజీవుల పుట్టుకకు కారణం) ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సిగ్గు రూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శాంతి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శ్రద్ధ (భగవంతుని యందు విశ్వాసము, ధర్మం మరియు శాస్త్రము చెప్పేదే సత్యము అనే భావనను శ్రద్ధ అంటారు) రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ప్రేమ మరియు సౌందర్యంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సద్గుణములు/ అదృష్టము/ ఐశ్వర్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు క్రియాశీలత్వంగా/ చురుకుదనము/ స్వధర్మము రూపంగా వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జ్ఞాపకశక్తిగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దయా గుణంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సంతృప్తి భావనగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మాతృస్వరూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు (మతి)మరపు/ మోహము/ భ్రమ రూపంలో వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!


అఖిల లోకాల యందున్న జీవుల ఇంద్రియాలకు అదిష్ఠాన దేవతయై, సర్వజీవులయందు సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతికి నమస్కారములు.


చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఈ జగత్తంతా వ్యాపించి, చిత్శక్తి (చైతన్యం) రూపంలో అన్నింటియందూ ఉన్నదో, ఆ తల్లికి ముమ్మారు నమస్కారములు.

Tuesday, 12 October 2021

యా దేవీ సర్వభూతేషు (2)

 


మంత్రోపదేశం కావాలని, అమ్మవారిని ఉపాసన అంటే తమకు ఎంతో ఇష్టమని అనేకులు గురువు కోసం అన్వేషిస్తుంటారు. అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతులను ఋషులు దేవీ మహాత్యంలోని చండీ సప్తశక్తిలో చెప్పకనే చెప్పారు. అందులోని 'అపరాజితా స్తోత్రం' లోని రెండు పంక్తులు చూడండి.


యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ ఆకలి రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ దాహం రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


జీవులలో ఆకలి, దాహార్తి రూపంలో వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే అంటున్నారు. ఇదే మనకు భగవద్గీత, శివగీత, గణేశగీతలలో కనిపిస్తుంది. గీతలో భగవానుడు 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశిత్రః' అంటాడు. వైశ్వానరుడు అంటే ఆహారన్ని జీర్ణం చేసే అగ్ని, సైన్స్ పరిభాషలో హైడ్రో క్లోరిక్ యాసిడ్. 


ఆకలితో ఉన్నవాడికి పట్టేడన్నం పెట్టి అతని కడుపు నింపితే అది అమ్మవారి అర్చన. దాహంతో ఉన్నవాడి దాహం తీరిస్తే అది కూడా అమ్మావారికి చేసే అర్చనయే. భగవతికి ఏ పువ్వులంటే ఇష్టం, ఏ నివేదన అంటే ఇష్టం అని అడుగుతారు. ఆకలి మరియు దప్పికతోనున్న జీవులకు ఆహారం మరియు నీరు అందిస్తే దేవి భగవతి సంతసిస్తుందని దేవీ మహాత్యం చెబుతోంది. ఇంతకంటే సులభమైన పని ఏముంది ?


కాకపోతే వాళ్ళు నిస్సహాయులనే భావనతో లేదా నేను ఇస్తున్నాననే భావన ఇక్కడ పనికిరాదు. జీవులయందున్న భగవతిని ఆహారం మరియు నీరు ద్వారా పూజిస్తున్నానే భావన రావాలి. ప్రతిఫలం ఆశించకుండా, నిష్కామంగా, పవిత్రభావనతో చేయాలి. సెల్ఫీలు తీసుకుని పెట్టడమంటే ప్రదర్శనయే అవుతుంది. నువ్వు ఇలా జీవుల ఆకలిదప్పికలు తీర్చుతున్నావనే విషయం నీకు, పరమేశ్వరికి తప్ప ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అలా చేసిందే నిజమైన ఉపాసన. మిగితాదంతా బాహ్యప్రదర్శనయే. 


ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మగారు చేసింది కూడా ఒక రకమైన దేవీ ఉపాసనయే. అమ్మవారి పారాయణలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మ ఆ భక్తుని దగ్గఱకు వస్తూ ఉంటుందని, అందుకే దేవీ ఉపాసకులు నిత్యం అన్నదానం వంటివి చేస్తూ ఉండాలని శ్రీ విద్యలో చెబుతారు. మంత్రం జపిస్తేనే ఉపాసన కాదు, సర్వజీవులలో వ్యక్తమవుతున్న శక్తిని తగిన విధంగా అర్చించడం కూడా ఉపాసనయే.


ఓం శ్రీ మాత్రే నమః     

Sunday, 10 October 2021

యాదేవి సర్వభూతేషు (1)



దేవి ఉపాసనను నిత్యజీవితంలో ఎలా ఉపాసించవచ్చో తెలుసుకుందాము.


యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ, సర్వత్రా శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు. ఈ విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంది. అది అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది.


యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ బుద్ధి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు.


మనం చాలా సందర్భాల్లో బేరాలు చేస్తాము. ఒక పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగిన మూల్యము చెల్లించము. ఎవరైనా ఏదైనా చిన్న వడ్రంగి పని చేసినా, కూలి పని చేసినా, దానికి కొందరు తగినంత డబ్బు ఇవ్వరు. అంతెందుకు ఇంతే తీసుకోవచ్చు గదా అనేవారు ఎందరో ఉన్నారు. పని చేయించుకున్న తర్వాత కూడా జీతం ఇవ్వని యజమానులు ఎందరినో నేను చూసాను. రెండు నెలలు, మూడు నెలల జీతం తమ దగ్గరే అట్టి పెట్టుకునే యజమానులు/ సంస్థలు సైతం ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడంటే అతనిలో శక్తి రూపంలో ఆ అమ్మవారు వ్యక్తమైంది. అతను చేసిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వడమే శక్తిని ఉపాసించడం. ప్రతిఫలం ఇవ్వకుండా జాప్యం చేయడం, లేదా తగినంత ప్రతిఫలం ఇవ్వకపోవడం అమ్మవారిని అవమానిచడం.


ఒక వస్తువు కొన్నప్పుడు కూడా బేరం చేస్తారు. ఏ వస్తువును తయారు చేయాలన్నా, దానికి బుద్ధి బలం అవసరం. బుద్ధి అంటే కూడా అమ్మవారే. కనుక ఒక వస్తువుకు తక్కువ విలువ కట్టడం (బేరమాడటం) అమ్మవారిని అవమానించడం.


ఓం శ్రీ మాత్రే నమః

Tuesday, 24 March 2020

వసంత నవరాత్రులు చేద్దామా ?

25 మార్చి 2020, బుధవారం నుంచి 03 ఆప్రిల్ 2020, శుక్రవారం వరకు చైత్ర నవరాత్రుల సందర్భంగా...


దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి...

వసంత నవరాత్రులు చేద్దామా ?

ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజులు అమ్మవారిని, శ్రీ రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. మన సంప్రదాయంలో ఒక ఏడాదిలో మనకు 4 రకాల నవరాత్రులు ఉంటాయి. ఇప్పుడు చేసే వసంత నవరాత్రులను శారదా నవరాత్రులు అంటారు. ఇప్పుడు కూడా దుర్గా మాతను 9 రోజుల పాటు నవదుర్గల రూపంలో పూజిస్తారు. ఇప్పుడు చేసే పూజ జ్ఞానాన్ని ఇవ్వడమే గాక, ఈ కాలంలో ప్రబలే విషరోగాల నుంచి రక్షణ ఇస్తుందని శాస్త్రవాక్కు.

ఈ వసంత నవరాత్రులు ఎలా చేయాలి ?
• చండీ, బాలా, పంచదశీ మొదలైన మంత్రాలు ఉపదేశం ఉన్నవారు తమ తమ గురువులు చెప్పిన రీతిలో నవరాత్రులను తప్పక చేస్తారు.
• మరి మనలాంటి సామాన్య హిందువుల సంగతి?
• ఉగాది వస్తోంది గనక ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుంటాము, ఇంట్లో ఉన్న చెత్త వస్తువులు తీసివేస్తాము, బూజు దులిపేస్తాము, ఇల్లంతా కడిగి, ఆవుపేడతో అలికి, ముగ్గులు వేస్తాము.
• ఇంటిని నీటితో కడిగి, అలికి, ముగ్గులు వేసే వెసులుబాటు నగరాల్లో లేకపోయినా, కనీసం తుడుచుకోవాలి.
• ఉగాది నాటి ఉదయమే నిద్రలేచి, అభ్యంగన స్నానం (తలకి నువ్వుల నూనె పట్టించుకుని స్నానం) చేసి, కొత్తబట్టలు ధరించి, దేవుని ముందు కూర్చుని, లోకక్షేమం కోసం, ఆయురారోగ్యాల కోసం అమ్మవారి నవరాత్రులు చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం సంస్కృతంలోనే చెప్పుకోనక్కర్లేదు, మనకు వచ్చిన భాషలో మనస్సులో గట్టిగా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది.
• ఆ తర్వాత దుర్గా అష్టోత్తరం చదివి, 'శ్రీ రామ' అనే నామాన్ని 108 సార్లు జపం చేసి (1008 సార్లు జపం చేయడానికి మీకు పట్టేది 13 నిమిషాలు, 108 1-2 నిమిషాల్లోనే అయిపోతుంది), మనకు తోచిన నివేదన చేయాలి. మొదటి రోజు ఆ అన్నం వండాలి, రెండవ రోజు ఈ అన్నం వండాలని లేదు.
• మనం రోజూ వండుకునే అన్నమే సరిపోతుంది. కాకపోతే స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకుని, బియ్యం కడిగిన తర్వాత, అందులోనే కొంచం పెసరపప్పు, పసుపు వేసి, వండితే చాలు.
• అది కూడా కుదరదు అంటే, వండిన అన్నం మీద చిన్న బెల్లం ముక్క (చిటికెడు పెట్టినా చాలు) వేసి నివేదన చేసినా, అదే మహానివేదన.
• మరి అన్నం కూడా వండుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటీ అంటారా ? తాడేపల్లీ రాఘవనారాయణ శాస్త్రిగారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కేవలం మంచినీటినే మహనివేదన చేశారు. కనుక ఆందోళన అవసరంలేదు.
• ఉండగలిగిన వాళ్ళు నక్తం చేస్తారు. అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం పూజ తర్వాత భోజనం చేస్తారు.
• లేదనుకుంటే, నివేదన చేసినది ప్రసాదమే అవుతుంది కనుక ఏ దోషం ఉండదు, హాయిగా తిని, సాయంకాలం స్నానం చేసి, మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే కాలం బాలేదు. ఒంట్లో శక్తిలేనివాళ్ళు నక్తాలు చేసి బలహీనపడేకంటే తిని చేయడమే మంచిది.
• సాయంకాలం చేసే పూజ ప్రధానం. అది కూడా సంధ్యాకాలంలో అంటే సూర్యాస్తమయ కాలంలో చేస్తే ఇంకా విశేషం. అంటే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో.
• మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు : ఈ తొమ్మిది రోజులు మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటూ, బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత దుర్గా మరియు శ్రీ రామ నామస్మరణ చేయాలి. రోజూ శ్రీ రామరక్ష స్తోత్రం పారాయణ చేయాలి. అనవసర సంభాషణ పనికిరాదు. శుచిగా ఉండాలి. శుచిగా, స్నానం చేసి వండిన పదార్ధమే తినాలి. ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. అంతే, అంతకుమించి ఇంకేమీ లేవు.
• అలా తొమ్మిది రోజులు చేసి, పదవ రోజు ఉదయం పూజ చేసి, అమ్మవారిని, ఆ శ్రీరామచంద్ర మూర్తిని పూజించి, వ్రతం ముగించవచ్చు. ఇది కష్టం కూడా కాదు. మీకున్న దాంట్లో మీకు తోచిన విధంగా చేసుకునేది. మీకు ఇంకా ఆసక్తి ఉంటే చైత్రపూర్ణిమ వరకు పక్షం మొత్తం అనగా 15 రోజుల పాటు చేయవచ్చు.
• రోజూ ఆలయానికి వెళ్ళాలనే నియమం లేనేలేదు. ఇంట్లో ఉంటూనే చేసుకునే అద్భుతమైన వ్రతం ఇది. దీని వలన మానసిక శాంతి, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారలాభము, సంతానము, కుటుమసభ్యుల మధ్య సఖ్యత, సౌభాగ్యము కలుగుతాయి.
అయితే ఈ ఏడాది తప్పకుండా ఎందుకు చేయాలి?
• ఇప్పుడు రాహువు ఆరుద్రలో ఉన్నాడు. అందుకే విషక్రిమి ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. రాహువు మృగశిరలోకి రాగానే అంతా చక్కబడుతుంది.
• రాహువుకు అదిష్ఠాన దైవం దుర్గాదేవి. కనుక దుర్గాదేవి పూజతో రాహువు శాంతిస్తాడు. మన జోలికి రాడు.
• ఏ గృహంలో పూజ చేస్తారో ఆ గృహం వైపు చూడడు. గ్రామంలో ఎక్కువమంది చేస్తే ఆ గ్రామం వైపు చూడడు. దేశమంతా వసంత నవరాత్రులు చేసే ఆచారం ఉంది కనుక దేశం ఈ కష్టం నుంచి బయటపడుతుంది.
• మనం హిందువులము, లోకక్షేమం కోరతాము, సమస్తలోకాలు సుఖంగా ఉండాలని తలుస్తాము. అందువలన లోకసుకృతి కోసం చేస్తున్నామని సంకల్పం చెప్పుకుని చేస్తే, సమస్త లోకానికి మేలు జరుగుతుంది.
• ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వాలు మనల్ని ఇల్లు కదలవద్దు అంటున్నాయి.
• అమ్మవారి పూజలో శుచి ఉండాలి. ఇప్పుడు మనం అందరితోనూ సామాజిక దూరం పాటిస్తున్నాము, ఎవరి ఇంటికి వెళ్ళడంలేదు, అసలు బయట తిరిగే పరిస్థితులు కూడా లేవు. కనుక మన శుచికి ఆటంకం కలగదు.
• పూజ పేరుతో రోజూ ఇల్లు శుభ్రం చేసి, ఉతికిన బట్టలే కట్టుకుంటాము గనక కొత్త రోగాలు దరిచేరవు. అదేగాక మనకు వసంత నవరాత్రులకు ఎప్పూడూ సెలవులు వచ్చింది లేదు.
• ఇప్పుడు అందరికీ ప్రభుత్వమే పేయిడ్ లీవ్ ఇస్తోంది. ఇంట్లో కూర్చున్న రోజులకు సైతం జీతం ఇస్తున్నారు.
• ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి ?
• ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు.
• మీరు నామజపం ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్ప అనుభూతులను పొందుతారు.
• శ్రీ రామ నామంలో శివకేశవులు, లక్ష్మీదేవి ఉన్నారు. శ్రీకారం సంపదను ఇస్తే, ర కారం అగ్నితత్త్వం కనుక పాపాన్ని దహిస్తుంది, మకారం అమృతతత్త్వాన్ని ఇచ్చి, రోగరహితం చేస్తుంది.
• మీకు గనక సంకల్ప బలం ఉంటే ఈ తొమ్మిది రోజుల్లోనే శ్రీ రామనామాన్ని అక్షర లక్షలు అనగా 3 లక్షలు జపం చేయగలరు.
• అప్పుడు మీకు కలిగే ఆ దివ్యానుభూతి కొన్ని కోట్లు పోసినా కొనలేనిది.
• మళ్ళీ సంవత్సరంలో ఇవన్నీ చేయడానికి సమయం ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు !?
• ఈ కర్ఫ్యూ ఖచ్చితంగా ఇంకో 15 రోజులైనా ఉంటుంది.
• ఇంట్లో ఊరికే ఉండి, తిని కూర్చునే కంటే, ఈ సమయాన్ని దైవికంగా వినియోగించుకుని, మనకు, ప్రపంచానికి మేలు చేస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.
జయ దుర్గే ! జయ వనదుర్గే ! శ్రీ సీతా రామచంద్రమూర్తికి జై ! జై శ్రీ రామ !
లోకాసమస్తా సుఖినోభవంతు!

దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి.

Wednesday, 5 October 2016

దేవీ ఆరాధన తత్వం - స్వామి చిదానంద



Sarasvati is cosmic Intelligence, cosmic consciousness, cosmic knowledge. Worship of Sarasvati is necessary for Buddhi-Shuddi, Viveka-Udaya, Vichara-Shakti for Jnana for Self-illumination. Lakshmi does not mean mere material wealth like gold, cattle, etc. All kinds of prosperity, glory, magnificence, joy, exaltation or greatness come under the grace of Goddess Lakshmi. Sri Appayya Dikshitar calls even final Liberation as “Moksha Samrajya Lakshmi.” Hence worship of Lakshmi means the worship of Divinity, the power that dissolves multiplicity in unity. The worship of Devi is therefore the explanation of the entire process of spiritual Sadhana in all its aspect.

- Swami Chidananda

Monday, 3 October 2016

చంద్రఘంటా దేవి అమ్మవారి వైశిష్ట్యం

దేవీ చంద్రఘంటేతి

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||



దుర్గామాత యొక్క తృతీయ శక్తి చంద్రఘంటా దేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రి ఉపాసనలో మూడవ నాడు ఈమెను ఆరాధిస్తారు. ఈమె రూపం పరశాంతిదాయకమై కల్యాణపర్వమైనది. ఈమె మస్తకంపై ఘటాకారంలో అర్థచంద్రుడున్నాడు. ఈ కారణం వల్లనే ఆమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. స్వర్ణసమంగా ఆమె శరీరం భాసిల్లుతూ ఉంటుంది. ఈమెకు గల దశ హస్తాలలో ఖడ్గాది శస్త్రాలు, బాణాది అస్త్రాలు రాజిల్లుతూ ఉంటాయి.

సింహవాహిని అయిన ఈమె ముద్ర సర్వదా యుద్ధోన్ముఖమై ఉంటుంది. ఘంటా సదృశ్యమైన ఆమె చండ ధ్వనులకు అత్యాచారులైన దైత్వ దానవులు కంపించిపోతుంటారు. నవరాత్రులలో దుర్గాదేవి ఉపాసనలతో మూడర నాడు జరిగే పూజ అత్యంత మహత్వపూర్ణంగా ఉంటుంది. నాడు సాధకునికి మనస్సు మణిపూర్వ చక్రంలో ప్రతిష్టితమై ఉంటుంది. చంద్రఘంటా దేవి కరుణ వల్ల సాధకునకు అలౌకిక వస్తువుల దర్శనమవుతుంది. దివ్య సుగంధానుభవం కలుగుతుంది. వివిధ ప్రకార ధ్వనులు వినిపిస్తాయి. సాధకుడు అత్యంత సావధానంగా ఉండవలసిన క్షణాలవి. చంద్రఘంటా దేవి కృప వల్ల సాధకుడి పాపతాపాలన్నీ నశించిపోతాయి. ఆమె ఆరాధాన సర్వ ఫలదాయకమైనది. సర్వదా ఈమె యుద్ధోన్ముఖ ముద్రతో ఉంటుంది కనుక భక్తుల కష్టాలను అత్యంత శ్రీఘ్రంగా నివారిస్తుంది.

వాహనం సింహం కావడం వల్ల ఈమెను ఉపాసించే వారు కూడా సింహం కావడం వల్ల ఉపాసించే వారు పరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. భక్తులను ప్రేతబాధాదుల నుంచి సంరక్షిస్తూ ఉంటుంది. దుష్టదమన వినాశనాంతరం కూడా సర్వదా ఆమె స్వరూపం దర్శకులకు, ఆరాధకులకు అత్యంత సౌమ్యంగా, శాంతంగా ఉంటుంది. ఆరాధన మంత్రంచే సాధకునకు లభించే వీరత్వ నిర్భయత్వాలతో బాటు సౌమ్యత్వ వినమ్రత్వాలు కూడా లభించడం విశేష సద్గుణమే కదా.

సాధకుని ముఖనేత్రాది శరీరాంగాలన్నీ చంద్రఘంటా దేవి కరుణ వల్ల తేజరిల్లుతుంటాయి. వారి స్వరంలో దివ్య అలౌకిక మాధుర్యం గోచరమవుతుంటుంది. దేవి భక్తులు కానీ, ఉపసాకులు కానీ ఎక్కడకు వెళ్ళినా వారిని చూసిన ప్రజలు సుఖశాంతులను పొందుతుంటారు. అట్టి సాధకుల శరీరాల నుండి దివ్యప్రకాశయుక్త పరమాణువుల అదృశ్య వికరణం జరుగుతుంటుంది. అది చర్మచక్షువులకు మాత్రం గోచరించదు. సాధకులు, వారి సాంగత్యంలో ఉండేవారు మాత్రం ఆ విషయాలను చక్కగా అనుభవించగలుగుతారు. మనం మన మనోవాక్కర్మ శరీరాలను విహితవిధి విధానుసారం పరిపూర్ణంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని దేవిని శరణు వేడి తమ ఉపాసనలో లగ్నమవ్వాలి.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

Sunday, 2 October 2016

బ్రహ్మచారిణి అమ్మవారి వైశిష్ట్యం

బ్రహ్మచారిణి అమ్మవారి వైశిష్ట్యం

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


దుర్గాదేవి యొక్క నవశక్తులలో ద్వితీయ స్వరూపం బ్రహ్మచారిణిది. ఇక్కడ బ్రహ్మశబ్దార్థం తపస్సుగా వస్తుంది. బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి. తపస్సుగా ఆచరించునది అని అర్థం. వేదసైత్యం తపో బ్రహ్మ. వేదం తత్వం తపస్సు బ్రహ్మ శబ్దార్థాలే బ్రహ్మచారిణి స్వరూపం. పూర్వ జ్యోతిర్మయమై అత్యంత భవ్యమైనది. ఆమె దక్షిణ హస్తంలో జపమాల, వామహస్తంలో కమలం ఉంటాయి. తన పూర్వజన్మలో ఈమె హిమవంతుని సదనంలో పుత్రిక రూపంలో ప్రభవించిన వేళలో నారద దేవర్షి ఉపదేశానుసారం శంకర భగవానుడిని భర్తగా పొందేందుకు అత్యంత కఠిన తపస్సు చేసింది. ఈ కఠిన తపస్సు కారణంగానే ఈమెను తపశ్చారిని అంటే బ్రహ్మచారిణి నామంతో జనులు వ్యవహరించే వారు. వేయి సంవత్సరాల కాలం ఈమె కేవలం ఫలమూలాలు మాత్రం గ్రహించి గడిపివేసింది.

శత సంవత్సర కాల పర్యంతం కేవలం శాకంపై జీవించింది. కొంతకాలం కఠినోపవాసం చేసి ఆకాశం కింద ఎండావానలను లెక్కచేయకుండా భయంకర కష్టాలను సహించింది. ఆ కఠిన తపస్సు తరువాత మూడు వేల సంవత్సరాలు రాలిన ఆకులను మాత్రం తిని అహర్నిశలూ శంకర భగవానుడి ఆరాధన చేసింది. ఆ తరువాత ఆమె ఎండుటాకులను కూడా తినడం మానివేసింది. పర్ణాలను కూడా విడనాడడం వల్ల అపర్ణ నామంతో ఆమె ఖ్యాతి గడించింది. వేల సంవత్సరాల కఠిన తపస్సు కారణంగా బ్రహ్మచారిణి దేవి శరీరం క్షీణించిపోయింది. తీవ్రతరంగా ఆమె కాయం కృశించింది. అట్టి ఆమె దశను తిలకించిన ఆమె తల్లి మీనాదేవి తీవ్రంగా వేదన చెందసాగింది. ఆమె తన పుత్రికను ఆ తపస్సు నుంచి విరమింపజేయాలని ఉమా, అరే వద్దు, వద్దు అని పిలిచింది.

నాటి నుంచి బ్రహ్మచారిణి దేవి యొక్క పూర్వజన్మ నామంగా ఉమ ఏర్పడింది. ఆమె తపస్సుకు జనత్రయంలో హాహాకారాలు చెలరేగాయి. దేవతలు, రుషులు, సిద్ధులు, మునులు అందరికందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క ఆ తపశ్చర్యను పుణ్యకృత్యంగా వర్ణిస్తూ ప్రశంసించసాగారు. చిట్ట చివరకు బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఆమెను సంబోధిస్తూ ప్రసన్న స్వరంతో ‘ ఓ దేవీ! ఇంతవరకూ ఎవరూ ఇట్టి కఠోర తపస్సు చేయలేదు. ఇట్టి తపస్సు నీకు మాత్రమే తగినది. ఈ లౌకిక కృత్యాన్ని సర్వులూ దశదిశలా కొనియాడుతున్నారు.

నీ కోరిక పరిపూర్ణమగుగాక. చంద్రమౌళీశ్వరుడు పతి రూపంలో నీకు లభించును గాక. తపస్సు మాని స్వగృహానికి వెళ్ళు. నీ తండ్రి నిన్ను పిలవ శీఘ్రంగా వస్తున్నాడు’ అని పలికాడు. దుర్గామాత యొక్క ఈ ద్వితీయ స్వరూపం భక్తులకూ సిద్ధులకూ అనంత ఫలాలను ప్రసాదించునట్టినది, ఈమె ఉపాసన వల్ల మానవులతో తపస్త్యాగవైరాగ్య సదాచారాలు వర్ధిల్లుతాయి. జీవితంలోని కఠిన సంఘర్షణ వేళల్లో సాధకుడి మనస్సు విచలితం కాదు. బ్రహ్మచారిణి దేవి కృప వల్ల సాధనకు సర్వే సర్వత్రా సిద్ధి విజయాలు లభిస్తాయి. దుర్గా పూజలో రెండవనాడు ఈమె ఉపాసనయే చేయబడుతుంది. ఈ రోజున సాధకుడి మనస్సు స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఆ చక్రంలో స్థిరంగా ఉండునట్టి మనస్సు కల యోగి ఆ తల్లి భక్తిని పొంది కృపకు విశేషపాత్రుడవుతాడు.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

శైలపుత్రీ అమ్మవారు వైశిష్ట్యం

శైలపుత్రీ అమ్మవారు వైశిష్ట్యం

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


దుర్గాదేవి ప్రథమ స్వరూపంలో ‘శైలపుత్రీ’ నామంతో ప్రసిద్ధి చెందింది. పర్వత రాజైన హిమవంతుని సదనంలో పుత్రిక రూపంలో ప్రభవించడం వల్ల ఈమెను శైలపుత్రికగా వ్యవహరించారు. వృషభారూఢురాలైన ఈమె దక్షిణ హస్తంలో త్రిశూలం, వామహస్తంలో పద్మమూ శోభిల్లుతున్నాయి. నవదుర్గలలో ప్రథమ దుర్గ ఈమెయే. పూర్వజన్మలో ఈమె దక్షప్రజాపతి పుత్రికగా అవతరించింది. ఆ కాలంలో సతి నామంతో పిలువబడింది. శంకర భగవానుడితో ఆమెకు వివాహమైంది. ఒకానొక సమయంలో దక్షప్రజాపతి ఓ మహాయాగం చేశఋడు. తమ తమ యాగాదులను స్వీకరించవలసిందిగా అతడు దేవతలందరినీ ఆ మహాయాగానికి ఆహ్వానించాడు.

కానీ శంకరుడిని మాత్రం ఆ యాగానికి ఆహ్వానించలేదు. తన తండ్రి ఓ మహాయాగాన్ని నిర్వహిస్తున్నాడన్న వార్తను ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్ళాలని మథనపడసాగింది. తన అభీష్టాన్ని ఆమె మహాదేవుడికి విన్నవించుకుంది. సర్వవిషయములు తెలిసిన శంకరభగవానుడు సతీ నీ తండ్రి ఏ కారణం వల్లనో మనయందు కృద్ధుడై ఉన్నాడు. తన యాగానికి దేవతలందరినీ ఆహ్వానించి వారి యాగభాగాలను వారికి సమర్పించాడు. తెలిసియే మనలను పిలువలేదు. కనీసం ఎట్టి సూచన కూడా చేయలేదు. ఇట్టి దశలో ఎంతమాత్రం నువ్వు అక్కడకు వెళ్ళడం భావ్యం కాదు అని అన్నాడు. శంకరుడి పలుకులు సతీదేవికి నచ్చలేదు.

తండ్రి యాగాన్ని చూడాలనీ, సోదరీమణులను చూసి సంభాషించాలని ఆమె తొందరపడసాగింది. ఆమె స్థితిని గమనించిన మహాదేవ భగవానుడు పుట్టింటికి వెళ్ళేందుకు ఆమెకు అనుమతి ప్రసాదించాడు. పితృగృహం చేరిన సతీదేవితో బంధుబాంధవులెవరూ మాట్లాడలేదు. కేవలం ఆమె తల్లి మాత్రం ప్రేమగా కౌగిలించుకుంది. అందరికందరూ ఎడమొగంగా పెడమొగంగా ఉండిపోయారు. అక్కచెళ్ళెళ్ళ ముఖంలో వ్యంగ్యం, పరిహాసం కనిపించాయి. పరిజనుల ఆ వ్యవహారానికి సతీదేవి మనస్సు తీవ్రంగా గాయపడింది. అంతే కాదు, అక్కడ సర్వేసర్వత్రా శంకర భగవానుడి పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు కృద్ధుడై ఆమె పట్ల అవమానజనకంగా ప్రవర్తించి అదోరకంగా భాషించాడు.

అదంతా చూసిన సతీదేవి హృదయం క్షోభతో, గ్లానితో క్రోధసంతప్తమై పోయింది. పతిదేవుని పలుకులను వినక తాను అక్కడకు రావడం పొరపాటేనని గ్రహించింది. మహాదేవునకు అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూసి ఆమె సహించలేకపోయింది. తన దేహాన్ని యాగాగ్నిలో భస్మం చేసేసుకుంది. పిడుగు వంటి ఆ విషాద వార్తను వింటూనే కృద్ధుడైన శంకర భగవానుడు తన గణాలను పంపి దక్షుడి యాగాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయించాడు. యాగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రికగా ప్రభవించింది.

ఆమెనే శైలపుత్రిక నామంతో ప్రఖ్యాతి చెందింది. పార్వతి, హైమావతి కూడా ఆమె నామాలే. ఉపనిషత్‌ కథానుసారం ఆమెయే హైమవతీ స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి వివాహం పరమేశ్వరుడితో జరిగింది. పూర్వజన్మలో వలెనే ఆమె ఈ జన్మలో కూడా శంకర అర్ధాంగి గానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గలలో ప్రథమురాలైన శైలపుత్రి దుర్గ యొక్క మహత్వశక్తులు అనంతాలు. నవరాత్రి పూజలలో మొదటి రోజు ఈ శైలపుత్రీ పూజోపాసనలు కొనసాగుతుంటాయి. ఈ ప్రథమ దివసోపాసనలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండియే అదని యోగసాధన ప్రారంభమవుతుంది.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

Thursday, 22 October 2015

దసరా తీర్మానం - స్వామి శివానంద

దసరా అనే పదం దశ-హర అనే పదం నుంచి వచ్చింది. పదితలల రావణుడిని వధించడమే దశహరా. కాబట్టి ఈ రోజు మనం రాక్షసుడి పదితలలైన
అభిరుచి (passion),
అహంకారం (pride),
క్రోధం (anger),
దురాశ (greed),
వాంఛ (infatuation),
కామం (lust),
ద్వేషం (hatred),
అసూయ (jealousy),
స్వార్ధం (selfishness),
వంకరబుద్ధి (crookedness—of the demon),
మదం (Ego) లను ఖండించాలని తీర్మానం చేసుకుని, దసరా పండుగను జరుపుకుందాం.

- స్వామి శివానంద

Wednesday, 21 October 2015

సిద్ధిదాత్రి

దుర్గా మాతా యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అణిమా, మహిమా, గరిమ, లఘిమ, ప్యాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ. ఇవి అష్టసిద్ధులు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మ ఖండంలో ఈ విధంగా చెప్పబడింది.

1.అణిమా 2.సర్వకాయావసాయిత్వ 3.గరిమ 4. లఘిమ 5.ప్యాప్తి 6. ప్రాకామ్య 7.ఈశిత్వ 8.వశిత్వ 9.సర్వజ్ఞత్వ 10.దూర శ్రవణ 11.పరాకాయ ప్రవేశం 12.వాక్‌ సిద్ధి 13.కల్ప వృక్షత్వం 14.సృష్టి 15.సంహార కరణ సామర్థ్యం 16. అమరత్వం 17. సర్వనామ కత్వం 18. భావన 19. సిద్ధి .

సిద్ధిదాత్రీదేవి భక్తులకు సాధకులకు సర్వసిద్ధులను దేవి ఆరాధన పరిపూర్ణం చేసి చేసిన తరువాత భక్తు సాధకుల లౌకిక కామనలెన్నో సిద్ధిస్తాయి. సర్వాభీష్టాలకూ ఆవశ్యకతలకూ అతీతంగా భగవతీదివ్యలోకాలలో మానసికంగా విహారిస్తే దేవి కృపారసామృతాన్ని పానం చేస్తూ విషయభోగ శూన్యుడై ఉంటాడు. మాత సాన్నిధ్యమే సర్వపుణ్యాలను అందిస్తుంది.

http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=50734

విజయదశమి పూజా మూహుర్తం

విజయదశమి రోజు అమ్మవారిని అపరాజితా దేవిగా పూజించాలి. అపరాజితా అంటే అపజయం లేనిది, ఓటమి లేనిదని అని అర్దం. అమ్మవారికి ఎందులోను అపజయంలేదు. ఆమె సర్వజ్ఞ, సరవ్యాపి, సర్వశక్తిమంతురాలు. ఆమెను ఓడించగలవారు ఎవరూ లేరు.

కలశ స్థాపన చేసి నవరాత్రులు పూజించినవారైనా, లేక 5, 3 రాత్రులు చేసినవారు విజయదశమి రోజు ఉదయం వ్యర్జ్యం లేని సమయంలో ఉద్వాసన చెప్పాలి. కలశస్థాపన చేయని మామూలు ప్రజలు కూడా విజయదశమి రోజు తప్పకుండా అమ్మవారిని అపరాజితాదేవిగా ఆరాధించాలి. ఈ రోజున అమ్మవారికి శమీపత్రలాతో పూజించి అర్చించినవారికి అనుకున్న పనుల యందు విజయం సిద్ధిస్తుంది.

ఓం అపరాజితాయై నమః అని, లేక ఓం చండికాయై నమః అనే నామాన్ని కానీ జపం చేయాలి.

రేపు ఉదయం 11.58 వరకు నవమి తిధి ఉంది. ఆ తర్వాతే దశమి వస్తుంది. కనుక అపరాజితాదేవి ఆరాధన 11.58 తర్వాతే చేయాలి. ధృక్పంచాంగం ప్రకారం 2015 విజయదశమి విజయ మూహుర్తం - మధ్యాహ్నం 1:55-2:41 వరకు.
మధ్యాహ్న పూజా సమయం - 1:09 నుంచి 15:28 వరకు. (ముహూర్తసమయాలు రెండు హైద్రాబాదు అక్షాంశ, రేఖాంశలను అనుసరించి).

మీ ప్రాంతంలో ముహూర్తం ఈ లింక్ లో తెలుసుకోవచ్చు.
http://www.drikpanchang.com/festivals/vijayadashami/aparajita-puja-date-time.html

ఆధ్యాత్మిక విజయానిచ్చే అమరిక

సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఈ నవరాత్రుల ఆరాధనా అమరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది ప్రతి సాధకుడు అవశ్యకంగా దాటవలసిన పరిణామ దశలను సూచిస్తోంది. ఒక దశ సహజంగానే తర్వాతి దశకు తీసుకువెళుతుంది, కానీ తద్విరుద్ధంగా వెళితే, అది పతనానికి కారణమవుతుంది. ఈ కాలంలో అనేకమంది సాధకులు అజ్ఞానంతో తమలో మాలిన్యాలను తొలగించుకుని, శుద్ధి చేసుకుని, దైవీసంపత్తిని పొందే ప్రయత్నం చేయకుండా నేరుగా జ్ఞాన సముపార్జన చేయాలని ప్రయత్నించి, ఆ మార్గంలో విఫలమై ఫిర్యాదు చేస్తున్నారు. వారు ఎలా ముందుకెళ్ళగలరు? మాలిన్యాలు తొలగిపోయేవరకు, శుద్ధ గుణాలు పెంపొందేవరకు జ్ఞానం లభించదు. సాత్త్వికమనే మొక్క మాలిన్యమైన మట్టి యందు పెరగదు.

ఈ అమరికను అనుసరిస్తూ మీ ప్రయత్నం సాగిస్తే, మీరు తప్పక విజయం సాధిస్తారు. ఇదే మీ మార్గం. మోక్షానికి వేరొక మార్గం లేదు. దుర్గుణాలన్నిటిని నశింపజేసుకుని, వాటి విరుద్ధమైన సద్గుణాలను పెంపొందించుకోండి. ఈ ప్రక్రియ ద్వారా మీరు త్వరగా పరిపూర్ణతను సాధించి, మీ గమ్యమైన పరబ్రహ్మంతో ఏకమవుతారు. అప్పుడు మీకు పూర్ణ జ్ఞానం లభిస్తుంది, మీరు సర్వజ్ఞులు, సర్వశక్తివంతులై, సర్వత్రా వ్యాపించిన ఆత్మతత్త్వాన్ని అనుభూతి చెందగలుగుతారు. అందరిలో మిమ్మల్నే చూసుకోగలుగుతారు. జీవన్ముక్తులవుతారు. జననమరణ చక్రం మీద, సంసారనమనే అసురుడి  మీద శాశ్వతమైన విజయం పొందుతారు. ఇక మీకు ఏ మాత్రం బాధ ఉండదు, లేమి ఉండదు, పుట్టుక ఉండదు, చావు ఉండదు, విజయం మీదే అవుతుంది.

జగజ్జననికి విజయమగుగాకా! ఆమె మిమ్మల్ని ఆధ్యాత్మిక నిచ్చెనలో ఒక్కో మెట్టు ఎక్కించి, అత్యున్నత శిఖరమందున్న పరమాత్మ యందు లీనం చేయుగాకా !

- స్వామి శివానంద

Tuesday, 20 October 2015

చందోలు శాస్త్రి గారు - బాలా అమ్మవారు

ఒక 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపురసుందరి ఉపసాకులు గుంటూర్ జిల్లా చందోలులో నివసించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన మాట. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. ఇది చూసి అమ్మ పొంగిపోయింది. ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు అనువభిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపురసుందరి దేవి పై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రీగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్న పిల్లా రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. ఆఖరికి వారి మరణం తర్వాత దేహం చితిలో కాలుతున్న సమయంలో, ఆ చితి మంటలపై అమ్మవారు కనిపించింది. ఇది ఫోటో తీసి పత్రికలలో కూడా వచ్చింది.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది?

ఓం శ్రీ మాత్రే నమః 

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

చివరి మూడు రోజులు : సరస్వతీ ఆరాధన

తనలో ఉండే అసురగుణాలను నిర్మూలించి, సత్వ, స్వచ్ఛ, దివ్య గుణాలను అలవరచుకున్న సాధకుడు దివ్యజ్ఞాన ప్రభాతాన్ని దర్శించడానికి, దివ్యజ్ఞాన సముపార్జనకు అర్హత సాధించిన అధికారి అవుతాడు. ఈ దశలో బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపమైన, మూర్తీభవించిన దివ్యజ్ఞానమైన సరస్వతీదేవిని ఆరాధిస్తాడు. ఆమె ధరించిన దివ్య మాణిక్యవీణ అత్యున్నతమైన మహావాక్యాలను, ఆదిశబ్దమైన ప్రణవ నాదాన్ని జాగృతం చేస్తుంది. సరస్వతీమాత బ్రహ్మానంద జ్ఞానాన్ని, తాను ధరించిన ధవళఛాయ గలిగిన వస్త్రంలాంటి స్వచ్ఛమైన సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని భక్తుడికి ప్రసాదిస్తుంది. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ మాతను పూజించడమే సాధకుని ఆరాధనా కార్యక్రమంలో మూడవ దశ.

పదవ రోజు విజయదశమి. సరస్వతీ దేవి అనుగ్రహంవల్ల దివ్యజ్ఞానం సంపాదించిన జీవుడు. జీవన్ముక్తి పొందిన రోజు. విజయోత్సాహం జరుపుకునే రోజు. పరమ సచ్ఛిదానంద స్వరూపంలో జీవుడు విశ్రాంతి పొందుతాడు. విజయసాధనకు, జీవిత ధ్యేయసాధనకు ప్రతీకగా ఈ విజయదశమి పండుగ జరుపుకుంటారు. విజయ పతాకం వినువీధుల్లో రెపరెపలాడుతుంది.

'నేను', 'అదే'! 'నేను', 'అదే'!
చిదానంద రూపః శివోహం, శివోహం,
చిదానంద రూపః శివోహం, శివోహం!

- స్వామి #శివానంద సరస్వతీ (1887-1963)
(మూలం: ఆల్‌ ఎబౌట్‌ హిందూయిజం)

సేకరణ: http://goo.gl/P24x59

మహాగౌరి

మహాగౌరి...
దుర్గామాత యొక్క అష్టమ శక్తి నామం మహాగౌరి. ఈమె పరిపూర్ణంగా గౌరి వర్ణంలో ఉంటుంది. శంఖ, చంద్ర, కుంద, పుప్పాలతో ఈ గౌర వర్ణం ఉపమించబడింది. ఈమె వయస్సు అష్టవర్షాలు మాత్రమే! ‘అష్టవర్ణాభవేతో’ సర్వవస్త్య ఆభరణాదులన్నీ కూడా శ్వేతంగానే ఉంటాయి. చతుర్బుజాలు గల ఈ తల్లి వాహనం వృషభం. కుడి భుజంలో అభయ ముద్రనూ, కుడి కింది భుజంలో త్రిశూ లాన్నీ ధరించి ఉంటుంది. ఎడమ పై చేతిలో డమరుకాన్నీ, ఎడమ పై చేతిలో వరదముద్రనూ ధరించి ఉంటుంది. అత్యంత శాంతంగా ఉంటుంది. తన పార్వతీ రూనంలో శివదేవుని భర్తగా పొందాలని మహా తపస్సు చేసింది. శివదేవుని వినా నేను అన్య దేవునెవరినీ భర్తగా వరించను అని సంకల్పంచుకుంది, కఠోరమైన తపస్సుకు శరీరమంతా శుష్కించిపోయింది. తపస్సుకు ప్రసన్నుడై సంతుష్టుడై శివదేవుడు శరీరాన్ని గంగా జలం లో పరిశుద్ధం చేయడంతో దేహం విద్యుత్‌ ప్రభాసమంగా అత్యంత కాంతామంతంగా గౌరవర్ణంతో అలరారసాగింది.

నాటీ నుండి ఈ దేవికి మహాగౌరి నామం ఏర్పడింది. దుర్గా పూజలో ఎనిమిదివ నాడు మహాగౌరి దేవిని ఉపాసించడం విధి అయింది. శక్తి అమోఘమైన సత్‌ఫలదాయిని అయి నది. ఆరాధన వల్ల భక్తుల కల్మషాలన్నీ క్షాళితమై పోతా యి. వారి పూర్వ సంచిత పాపాలు కూడా క్షాళిత మైపోతాయి. భవిష్యత్తులో పాప సంతాప దైన్య దుఃఖా దులు వారిని దరిచేరవు. మహాగౌరి సర్వవిధ శుభాలు ప్రసాధిస్తుంది.

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=50734

Monday, 19 October 2015

లక్ష్మి పూజ - సద్గుణ సముపార్జన

లక్ష్మి పూజ సద్గుణ సముపార్జన

మలి మూడు రోజులు : లక్ష్మి పూజ

దుర్గాదేవి ఆరాధనతో మలినమైన వాసనలు, చెడుస్వభావాలు, పాత అలవాట్లు లాంటి వ్యతిరేక గుణాలను నిర్మూలించే ప్రయత్నంలో సఫలీకృతుడవు కాగానే... నాశనం అయిన ఆ అసురగుణాల స్థానంలో సకారాత్మక గుణాలను, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నీ తక్షణ కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టీకరించిన దైవీ సంపదలను ఆర్జించుకోవాలి. జ్ఞానరత్నమనే అపూర్వమైన మణిని, ఆధ్యాత్మిక సంపదను సముపార్జన చేయాలి. శ్రద్ధాసక్తులతో ప్రతిపక్ష భావనను అలవరచుకునే ప్రయత్నం చేయని పక్షంలో పూర్వపు అసురీ గుణాలు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. అందుకే సాధకుడి అభ్యాసదశలో పూర్వ దశ ఎంత విలువైనదో, ఈ దశకూడా అంతే విలక్షణమైంది. తొలిదశ మలిదశల మధ్య ముఖ్యమైన తేడా వుంది. తొలిదశలో మలినమైన, అహంకార పూరిత హీనస్వభావాలను నిరంకుశంగా, నిశ్చయాత్మక బుద్దితో నిర్మూలన చేస్తే, మలిదశలో క్రమబద్ధంగా, కృత నిశ్చయంతో, దృఢంగా, ప్రశాంతంగా, పవిత్రమైన నిర్మలత్వాన్ని వృద్ధి చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన ద్వారా సాధకుడి, సాధనలో వుండే ఆనందమయ దశ వ్యక్తీకరణ జరుగుతుంది. మహాలక్ష్మి తన భక్తులకు అనంతమైన దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. సంపదలను ప్రసాదించే బ్రహ్మస్వరూపమే మహాలక్ష్మి. ఆమె అత్యంత నిర్మలం. రెండవ దశలో మూడు రోజులపాటు #మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది.

- స్వామి శివానంద సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/WqQGqB

కాళరాత్రీ దేవి


దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రీ నామంతో ప్రఖ్యాతి చెందింది. శరీరం గాఢాంధకార సమంగా పూర్తి కాలవర్ణంలో ఉంటుంది. శిరోజాలు చెల్లాచెదురై ఉంటాయి. గళసీమలో విద్యుత్‌సమంగా భాసిల్లే హారం ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలూ బ్రహ్మాండసమంగా గోళాకారంలో ఉంటాయి. ఈమె నుంచి విద్యుత్‌ సమంగా భాసిల్లే కిరణాలు బహిర్గతమవుతుంటాయి. నాసిక నుంచి ఉఛ్చ్వాసనిశ్వాసల ద్వారా భయంకర ప్రజ్వలితాగ్ని జ్వాలలు బహిర్గతమవుతుంటాయి. గార్ధభం వాహనం. పైకి లేచి ఉన్న దక్షిణ హస్తం వరద హస్తం ద్వారా సర్వులకూ వరాలను ప్రసాదిస్తుంటుంది. దక్షిణంగా క్రిందిభాగంలో ఉండే హస్తం అభయముద్రలో ఉంది.

వామభాగంలో పైకి లేచిన హస్తంలో లోహకంటము, క్రింది చేతిలో ఖడ్గమూ ఉన్నాయి. కాళరాత్రీదేవి స్వరూపం చూడ అత్యంత భయంకరంగా ఉన్నా ఈ తల్లి సర్వదా శుభఫలాలనే ప్రసాదిస్తుంది. ఈ కారణం వల్లనే ఈమెకు ‘శుభంకరీ’ అన్న నామం కూడా ఏర్పడి ఉంది. కనుక భక్తులు ఎంతమాత్రం ఈమెకు భయపడడం కానీ, ఆమె వల్ల విపత్తులు ఉంటాయని భావించడం కానీ చేయకూడదు. దుర్గాపూజలో ఏడవనాడు కాళరాత్రీదేవిని ఆరాధించే విధానం ఉంది. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమై ఉంటుంది. సాధకునకై బ్రహ్మాండంలో ఉన్న సిద్ధిద్వారాలన్నీ తెరచుకొని ఉంటాయి. ఈ చక్రస్థితుడై ఉన్న సాధకుని మనస్సు పరిపూర్ణంగా కాళరాత్రీ దేవి స్వరూపంలో లయమై ఉంటుంది. జనని సాక్షాత్కారం వల్ల ప్రాప్తమగునట్టి పుణ్యసర్వస్వాన్ని పొందగలుగుతాడు.

భక్తుడి పాపవిఘ్న సర్వస్వం నశిస్తుంది. అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. కాళరాత్రీదేవి దుష్టులను నాశనం చేస్తుంది. దానవ, రాక్షస భూత ప్రేతాదులు ఈ జనని స్మరణ మాత్రం చేతనే భయపడిపోతాయి. జంతుభయం, శత్రుభయం, రాత్రిభయం అనేవి ఉండవు. కాళరాత్రీదేవి కృప వల్ల ఆ తల్లి భక్తుడు సర్వభయాలకూ దూరమవుతాడు. కాళరాత్రీదేవి స్వరూప విగ్రహాన్ని తన హృదయంలో ఉంచుకొని సాధకుడు ఏకగ్రతాభావంతో ఆమెను ఉపాసించాలి. యమనియమ సంయమాలను పరిపూర్ణంగా పాటించాలి. మనోవాక్కార్మభి పవిత్రుడై భక్తుడు వ్యవహరించాలి. శుభకరీదేవిని ఉపాసించడం వల్ల లభించే శుభాలను వర్ణించలేం.

సేకరణ: సూర్య దినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

Sunday, 18 October 2015

కాత్యాయిని మాత

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

దుర్గామాత యొక్క ఆరవ రూపం కాత్యాయినీ దేవి. ఆమెకు ఆ పేరు రావడానికి కారణమిలా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు. ఆ మహర్షి పుత్రుడి పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఉద్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రికగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష.

పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. కొంత కాలం తరువాత మహిషాసురుడి అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని త్రిమూర్తులు తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయ మహర్షి ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయిని అని పిలువబడింది. మరో కథ కూడా వినిపిస్తుంది. ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రికగా అవతరిస్తుంది. ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్యంతం మూడు ఆ దేవి కాత్యాయన రుషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుడిని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందేందుకు గోపికలు యమునాతీరంలో ఈ దేవినే ఆరాధించారు. పూజ మండలంలో అధిషాత్రీదేవిరూపంలో ప్రతిష్టించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది. ఆమె వర్ణం స్వర్ణసమంగా భాసిల్లుతూ ఉంటుంది. దేవి చతుర్భుజాలలో అలరారుతుంటుంది. దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోనూ. క్రింది చేయి వరద ముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గమూ, క్రింది హస్తంలో పద్మమూ విరాజిల్లుతుంటాయి. ఆమె వాహనం సింహం. భక్తులు దుర్గాపూజలో ఆరవ నాడు ఈ దేవి స్వరూపాన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగసాధనలో దీనికి అత్యంత మహత్వపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయనీదేవి చరణ కమలాలలో అర్పించి పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేస్తాడు. దేవీ కటాక్షంతో చతుర్విధ పురుషార్థ ఫలాలు లభిస్తాయి. తేజోసంపన్నులై భాసిల్లుతుంటారు.

సేకరణ : సూర్య దినపత్రిక 2011

‪దుర్గాదేవి ఆరాధన దుర్గుణాల నిర్మూలన‬

‪దుర్గాదేవి ఆరాధన దుర్గుణాల నిర్మూలన‬
మొదటి మూడు రోజులు : దుర్గాదేవి ఆరాధన

దుర్గాపూజ సాధనలో దృఢ సంకల్పం, నిశ్చయాత్మకమైన ప్రయత్నం, కఠినమైన శ్రమ అంతర్లీనమై ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే బలం, అనంతమైన శక్తి అతి ప్రధానమైన ఆవశ్యకతలు. పరబ్రహ్మం, మహాశక్తిఅయిన దివ్యమాత ఆ సాధకుడిద్వారా పనిచేయాలి. మొదటి మూడు రోజులు ఈ 'అమ్మ'ను శక్తి, బలానికి ప్రతిరూపమైన దుర్గాదేవిగా పూజిస్తారు. తమలోని మాలిన్యాలు, దుష్టగుణాలు, లోపాలను నిర్మూలించమని దుర్గామాతను ప్రార్థిస్తారు. సాధకుడిలోని హీనగుణాలతో, అసురగుణాలతో మాత పోరాడవలసి వస్తుంది. నీ సాధనను ప్రమాదాల నుంచి, అవరోధాలనుంచి మాత రక్షిస్తుంది. మొదటి మూడు రోజులు నీలోని మాలిన్యాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సులోని చెడువాసనలను నిర్మూలించడానికి శక్తి స్వరూపిణి అయిన ‪దుర్గా‬ మాత ఆరాధన జరుగుతుంది.
- స్వామి ‪శివానంద‬ సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/3GjnCK