Showing posts with label సంప్రదాయం - శాస్త్రీయం. Show all posts
Showing posts with label సంప్రదాయం - శాస్త్రీయం. Show all posts

Wednesday, 24 November 2021

ఆచారాలను తర్వాతి తరాలకు నేర్పాల్సింది పెద్దలే



మన సంస్కృతి, సంప్రదాయలు, మన ఇంటి ఆచారవ్యవహారలు మన తర్వాతి తరాలు కూడా పాటించాలంటే అన్నిటికంటే ముందు కుటుంబాల్లో ఉన్న పెద్దలు శ్రద్ధగా సంప్రదాయలను పాటించాలి. ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. పిల్లలు ఏది పాటిస్తారని చూడగా, పెద్దలు చెప్పింది చూసి పిల్లలు నేర్చుకోరట, పెద్దల నడవడిని మాత్రమే పిల్లలు చూసి నేర్చుకుంటారని తేలింది.


బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం రానివారిని కూడా నేను చూసాను. దళిత కుటుంబాల్లో పుట్టినా, తమ పెద్దలు శ్రద్ధగా పాటిస్తున్న ఆచరాన్ని చూసి నేర్చుకుని పాటించే వాళ్ళానీ చూశాను. అంటే బ్రాహ్మణులంతా అలా ఉంటారని కాదు. కాని అదొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంట్లో ఎవ్వరూ పాటించకున్నా నేర్చుకునేవారు కూడా లేకపోలేదు. అది మినహాయింపు అనుకోండి. దానికి కారనం పూర్వజన్మ వాసన.


మా చిన్నప్పుడు మా బామ్మ, అమ్మ, అమ్మమ్మ మన సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పారు. కార్తిక మాసం మొదలైనవి వచ్చినప్పుడు సాయంకాలం చీకటి పడే సమయానికి బడి నుంచి వచ్చిన మేము కాళ్ళు చేతులు కడ్డుక్కుని శుభ్రంగా ఉంటే ఆవిడ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోమనేవారు. మాతోనూ పెట్టించేవారు. అలా మాకు చిన్నప్పుడే కార్తికమాసం అంటే దీపాలు పెట్టాలని తెలిసింది. మూడవ తరగతి నాటికే మిత్రబృందం (అందరం చిన్నపిల్లలమే) అంతా గుడికి వెళ్ళి, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళము. కార్తిక సోమవారమని ఇంట్లో ఉపవాసాలు చేస్తుంటే మేమూ చేసేవాళ్ళము. మాతోటి స్నేహితులు కూడా అంతే. అదీగాక సహవాసదోషం కూడా ఉంటుంది గదా. మమ్మల్ని చూసి మా స్నేహితులు కూడా నేర్చుకున్నారు. అప్పట్లో మా పెద్దలు ఆచరించారు కాబట్టే ఇప్పుడు ఎవరూ చెప్పకున్నా పాటిస్తున్నాము.


మనమేమీ పాటించకుండా, కేవలం వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం సమూహాల్లో వచ్చే సందేశాలను చదివి, 'ఫార్వార్డ్' చేస్తూ, అంతరాజలంలో దొరికిన దీపాల చిత్రాలను 'స్టేటస్సులు'గా పెట్టుకుని కూర్చుంటే; మైకులు లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినా లేక షార్ట్-ఫిలంలు తీసినా సరే,  ఈ తరానికి లేదా రాబోయే తరానికి మన సంస్కృతి అందదు. కనుక పెద్దలైనవారు శ్రద్ధగా మన ఆచారాలను పాటించాలి. ఆ పండుగ వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. దీని గురించి ధూర్జటి చెప్పిన ఒక పద్యం చూడండి. 



మ. మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు

ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కతముల్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పాత కాలం వారు ఆచరించిన ధర్మాలను పాటిపెట్టి, అవి పనికిరానివని చెప్పి, తాము ఆచరించేదే ధర్మమని, ఈ తరం వారు అధర్మాలను ఆచరిస్తుంటే దైవం నవ్వకుండా ఉంటుందా? ఎందుకంటావా! రాబోయే తరలావారు కూడా ఈ దుర్మార్గాల పాలై పతనమవ్వరా! పిల్లలకు ఆస్తులు కూడా బెట్టి వారు సుఖంగా ఉండాలని తలచే ఈ మూఢజనులు ఈ విషయంలో ఎందుకు ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నారు?

Sunday, 26 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (10) - ఎంగిలి దోషం



మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో మరొకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నీటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. 

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.

* కరోనా సందర్భంలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.

** ఎంగిలి దోషం అంటని మూడుపదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

అవి 1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె. 
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

ఇందులో కొంత భాగం యాదగిరి రావ్ గారి నుంచి సేకరించడం జరిగింది.

Saturday, 10 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 6



ఇంతకముందు చెప్పుకున్నాం కదా, మట్టిలో 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయని. అలాగే ఈ శరీరాన్ని తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టి మాత్రమే. మళ్ళీ అందులో కూడా అవే 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. అది శరీరానికి, మట్టికి ఉన్న సంబంధం. రాజీవ్ దీక్షిత్ గారంటారు, మట్టి పాత్రలలో వండిన ఆహారం తినడం వలన మాన పూర్వీకులకు జీవితాంతం కళ్ళజోడు రాలేదు, పళ్ళు ఊడిపోలేదు, మోకాళ్ళ నొప్పులు, డయాబిటిస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన పోషకలు సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన పనులన్నీ ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకుంటూ జీవించగలం. అది ఒక్క మట్టి పత్రలలో వండిన ఆహారం భుజించడం వల్లనే సాధ్యమవుతుంది. మట్టిపాత్రలో వండిన ఆహారంలో పోషకాలు ఒక్కటి నాశనమవ్వవు, 100% శాతం అందులో రక్షించబడతాయి. ఆ తర్వాత ఉపయోగపడేది కాంస్యం లేదా కంచు. అందులో 97% పోషకాలు ఉంటాయి, 3 % నశిస్తాయి. ఆ తర్వాత ఇత్తడి పాత్ర. అందులో 93% వరకు పోషకాలు రక్షించబడతాయి. ఇదంతా మేము 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి, వాటిని సి.డి.ఆర్.ఐ. (Central Drug Research Institute) శాస్త్రవేత్తల ద్వారా పరిశోధన చేయించాము. అందులో వారు అంగీకరిచిన మరో సత్యం ఏమిటంటే ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం దీర్ఘకాలంగా విషంగా పని చేస్తుందని. ఇది కూడా వాగ్భటులు చెప్పిన సూత్రల్లో ఉంది. ఇంకోటి, ఈ అల్యూమినియం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాత్రలో ఆహరం వండుకుని, మళ్ళీ మళ్ళీ తింటూ ఉండేవారికి మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి పాత్రలలో వండిన ఆహారంలో కేవలం 7% నుంచి 13% వరకు మాత్రమే పోషకాలు ఉంటాయి. ఇది ఆ కేంద్రప్రభుత్వ పరిశోధనా సంస్థ వారు అంగీకరించారు. కానీ వారే విషయం బయట పెడితే, ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు వారిని ఉండనివ్వవని చెప్పారు. అందుకే మనం ఇప్పుడు ఇండియా పద్ధతి నుంచి భారతీయ పద్ధతికి, మన అసలుసిసలైన సంప్రదాయంలోకి అడుగుపెట్టాలి. మట్టి పాత్రలలో విశిష్టత మీకు ఇంకా తెలియాలంటే డయాబిటీస్ ఉన్నవారికి ఈ పద్ధతిలో మట్టి పాత్రలో వండిన భోజనాన్ని మహర్షి వాగ్భటాచార్యుని సూత్రాల ప్రకారంగా పెట్టి చూడండి. కొన్ని నెలల్లోనే వారు మధుమేహం నుంచి విముక్తులవుతారు. అందుకే మనం మట్టికి దగ్గరగా జరగాలి.

ఈ మట్టికి మానవశరీరానికి ఉన్న సంబంధం శాస్త్రాల్లో ఇలా అనేక విధాలుగా చెప్పబడింది. నిత్యం భగవంతుని ఆరాధనలో 'లం పృధ్వీ తత్వాత్మికై గంధం సమర్పయామి' అని అమ్మవారికి లేదా భగవానునికి అర్పిస్తాము. అందులో మనం చెప్పేది పృధ్వీ తత్త్వానికి గంధం ప్రతీక. పంచభూతాల్లో భూమికి, పంచతన్మాత్రల్లో  వాసనకు సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం భూమి, మట్టికి దూరంగా అసహజమైన జీవనం గడుపుతామో, అప్పుడు ముక్కుకి తన సహజ లక్షణమైన వాసనలను పసిగట్టే లక్షణం తగ్గిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది. కాలుష్యం వలన, సారవంతమైన మట్టికి దూరంగా జీవించడం వలన మానవుడి వాసనలు పసిగట్టే లక్షణం దారుణంగా పడిపోతున్నదని, కనీసం అప్పుడప్పుడైనా పల్లుటూళ్ళకు వెళ్ళి అక్కడ ప్రకృతికి దగ్గరగా జీవించాలని అందులో పేర్కొన్నారు. ఇది 3-4 క్రితం పత్రికల్లో ప్రచురితమైంది. ఇలా చూసుకుంటే మనం మట్టికి దూరంగా జరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము.

విచిత్రమేమిటంటే మట్టిలో క్రిములున్నాయని పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వరు తల్లిదండ్రులు. వాళ్ళు ఏడవకుండా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలు ఇస్తారు. ఒకసారి పరిశోధనలు చూడండి. మీ సెల్ ఫోన్ తెర మీద ఎన్ని క్రిములుంటాయో తెలుసా? టాయిలెట్ డోర్ హ్యాండిల్ మీద ఉన్నన్ని క్రిములు. కంప్యూటర్ కీ బోర్డు ఏమీ తక్కువకాదు. బాత్రూం దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికి వేసే డోర్ మ్యాట్ మీద ఉన్నన్ని క్రిమిలు కీబోర్డు మీదుంటాయి. టివి రిమోట్ మీద కూడా దగ్గర దగ్గరగా అన్నే ఉంటాయి. అసలు మనం వాటిని వదిలి ఉండేదెప్పుడు? వాటిని ముట్టుకుని, ఆ తర్వాత ఎన్ని పనులు చేస్తామో, తినడం కూడా. చక్కగా బయట ఆడుకోకుండా వారిని అదుపు చేసి, ఇంట్లో అసహజమైన వస్తువులతో వారికి మనేమి ఇస్తున్నాం? మనమేమి పొందుతున్నాం? ఆరోగ్యమా? అనారోగ్యమా?

To be continued .................

Wednesday, 7 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 3



మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం |
తన్మే నిర్ణుదా మృత్తికా తయా హతెనా పాపేన గచ్ఛామి పరమాంగతిం ||

ఓ మృత్తికా! నాకు పుష్టినివ్వు. సర్వంలో నీలోని దాగి ఉంది, అన్ని సంపదలకు మూలం నీవు. నాకు మార్గదర్శనం చేసి, నా పాపాలను తొలగించు. నువ్వలా నా పాపాలను నశింపజేయగానే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలను, నీ దయతో పరమగతి అయిన మోక్షాన్ని సైతం పొందగలను.

ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారు పూరీ జగన్నాధస్వామి రధోత్సవం చూడాటానికి వెళ్ళగా, అప్పుడు వారికి అక్కడ పప్పన్నం ప్రసాదం పెట్టారట. అది ఎంతో రుచిగా ఉండడంతో, ఇది ఎలా వండారు, దీని ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే, అక్కడ మట్టిపాత్రలలో వండి నివేదన చేస్తారని తెలుసుకున్నారు. అక్కడున్న శంకరాచార్య పీఠాధిపతితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మట్టిపాత్రలలో ప్రసాదం వండడానికి గల కారణం ఏమిటి? అని అడగ్గా, మట్టి పవిత్రమైనది, భగవంతునికి నివేదన చేసేది పవిత్రంగానే ఉండాలి, అందుకే మట్టి పాత్రలలో వండుతామని స్వామి వారు సమాధానమిచ్చారు. అయితే దీన్ని పరీక్ష చేయించాలనుకున్న రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని భువనేశ్వర్ లో ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. (CISR) కు తీసుకెళ్ళి పరిశోధించమంటే, దానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని, అయినా తమ వద్ద అన్ని పరికరాలు లేవని, అందుకని ఆ ప్రసాదాన్ని దిల్లీ వెళ్ళి పరీక్ష చేయించమని చెప్పారు. అది అప్పటికి వండి కొన్ని గంటలు గడించి, దిల్లీ వెళ్ళాలంటే సుమారు 36 గంటలు పడుతుంది. అప్పటికి ఇది పాడవుతుంది కదా అని రాజీవ్ గారు అనగా, అది పూరీ ప్రసాదమని, మట్టి పాత్రలో వండబడుతుంది కనుక పాడవ్వదు అని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆయన దాన్ని దిల్లీ తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే పప్పులో 18 రకాల సూక్ష్మపోషకాలుంటాయి (Micro Nutrients), అవే దానిలో ఉన్న బలం, ఆ 18 లో ఒక్కటి కూడా ఈ ప్రసాదంలో తగ్గలేదట. పూర్తిగా 100% ఉన్నాయట. వంటనే ఆయన ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని పరీక్ష చేయిస్తే, అందులో కేవలం 13 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగితా 87 % పోషకాలు లోపించాయని (నశించాయని) తేలింది. ఆ విషయం చెప్పి రాజీవ్ దీక్షిత్ గారంటారు పూరీలో పూజారులు సైన్సు చదవలేదు, అందుకని వాళ్ళు శాస్త్రీయంగా చెప్పలేకపోయారు, అయినా మట్టి పవిత్రమైనదని చెప్పారు. నేను సైన్సు చదివి కూడా పరీక్ష చేయిస్తే గాని తెలుసుకోలేకపోయాను. అందుకే మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మట్టి పాత్రలలో వంట వండడమే సంప్రదాయంగా వస్తోంది. అల్యూమీనియం ముడిపదార్ధం మన భూమిలో పుష్కలంగా ఉన్నా, మన పూర్వీకులు ఏనాడు దాన్ని ఉపయోగించలేదు. అదేకక మట్టి పాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మట్టికి ఆ శక్తి ఉంది.

ఇంకా వారంటారు వైజ్ఞానికంగా మన శరీరం అంతటా ఉండేది మట్టియే. ఈ శరీరానికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఆ పోషకాలనే మొక్క గ్రహించి పప్పుధాన్యాల్లో నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ 18 పోషకాలు పప్పులో ఉంటాయి. మళ్ళీ ఇవే 18 పోషకాలు గోమూత్రంలో కూడా ఉంటాయి.

అందుకే ఇప్పటికీ లలితా సహస్రనామ పారయణ చేసేవారు అమ్మవారికి, ఆ నామావళిలో చెప్పబడిన నివేదనలు సిద్ధం చేయడానికి ఇప్పటికీ మట్టిపాత్రలనే వాడతారు, ఆవు పిడకలను వంటచెరుకుగా వాడుతూ కుంపటి మీద వండుతారు. పవిత్రత కోసమని. అదే శ్రద్ధకు నిదర్శనమని లలితాసహస్రనామ బాష్యం ప్రవచనం చెప్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అన్నారు.

అందుకే సారవంతమైన మట్టిని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పుష్టికరమైన ఆహారం అందుతుంది. ఇప్పుడు అఘమర్షణ సూక్తంలో చెప్పిన 'మృత్తికే దేహిమే పుష్టిం' అనే మాట ఎంత సత్యమో అర్దమయ్యిందా? ఈ పొషకాలే కాకుండా ఇంకా ఏమేమి పోషకాలున్నాయో పరిశీలిద్దాం.

To be continued ...........

Tuesday, 6 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 2



మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||

ఓ మృత్తికా! నేను చేసిన పాపాలను, దుష్కృతాలను నశింపజేయి. నీవు బ్రహ్మ చేత సృష్టించబడ్డ దానవు, మరియు కశ్యప ప్రజాపతి చేత మంత్రపూతమై పవిత్రం చేయబడ్డావు. ఆయన పవిత్రం చేసిన మృత్తికను తిరిగి ఈ భూమంతా చల్లాడట.

ఈ మంత్రాల్లో ఎంతో అర్దం దాగి ఉంది. మట్టి పవిత్రత ఎంత గొప్పదంటే ఒకసారి పార్వతీ దేవి శివుడితో 'మీరు బంగారు, వెండి, ఇత్తడి మొదలైన అనేక లింగాల్లో అర్చించబడతారు కదా. మీకు ఏ లింగార్చన అంటే ఇష్టం?' అని అడిగింది. అప్పుడు శివుడు 'నాకు అన్నిటికంటే పార్ధివ లింగార్చన అంటే ఇష్టం' అని సమాధానం ఇస్తాడు. పార్ధివ లింగం అంటే మట్టితో చేసిన లింగం, దానికి మిగితా లోహాలతో చేసినవేవీ సాటి రావంటాడు. పార్ధివ లింగాన్ని అర్చిస్తే, కోరికలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఈ లింగాన్ని ఎప్పటికప్పుడు చేసి, పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి, నిమజ్జనం చేయాలి. శివుడలా చెప్పడానికి మట్టి అందరికీ అందుబాటులో ఉండడం ఒక కారణమైతే, మట్టికున్న పవిత్రత రెండవ కారణం. అలా పరమశివుడే మట్టి పవిత్రతను చాటాడు.

ఒకసారి లింగ పురాణానికి వెళదాం - గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అని సూతుడు సమాధానం చెప్తూ ఇంకా అనేక విషయాలను చెప్తాడు. (మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)

ముద్గల పురాణంలో గణేశ చతుర్థీ రోజున కేవలం మట్టి గణపతిని మాత్రమే పూజించాలని చెప్పబడింది. ఇతర లోహాలతో చేసిన గణపతులను అర్చించాలని అందులోలేదు. ఎందుకంటే ఆ తిధి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక్క మట్టికే ఉంది. భగవంతుని దేనిలోకి ఆవహన చేస్తామో, అది పవిత్రమై ఉండాలని శాస్త్రము చెప్తున్నది. ఆ పవిత్రత మట్టికి ఉంది కనుక ఆ పర్వంలో మృత్తికా గణపతి పూజ. ఎన్నో విషయాలను చెప్పినా మన పురాణాలు, అరటి తొక్కలతో, చింతపిక్కలతో గణపతిని తయారు చేయమని చెప్పలేదు, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా. ఏమి? వారికి తెలియదా? చింతపిక్కలతో, పూలరెక్కలతో, గాజుముక్కలతో విగ్రహాలు చేయచ్చని? అదికాదు సంగతి. అలా చేసినవి పవిత్రతను నిలుపుకోలేవు. ఆ దైవీ శక్తిని ఆకర్షించలేవు.

మనం ఏ పూజ చేసినా, నూతన కార్యం ప్రారంభించినా, ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి, ఆ తర్వాత పని మొదలుపెడతాము. ఒకవేళ పసుపు గణపతిని కొలిచే వీలు లేని పరిస్థితి వస్తేనో? అప్పుడు మట్టిబెడ్డను తెచ్చి, అందులోకి గణపతి ఆవహన చేసి పూజించినా, అంతే సమానమైన ఫలితం వస్తుందని చెప్పారు.

గతభాగంలో మనం చెప్పుకున్న మంత్రం నిత్యం పఠించకపోయినా, యజ్ఞయాగాది క్రతువుల సమయంలో నదీస్నానం చేస్తారు. అప్పుడు కూడా నదిలోంచి మట్టిని తీసి, ఒంటికి రాసుకుని, శిరస్సును ధరించి, ఆ సూక్తాలు చదివి స్నానం చేస్తారు. పవిత్రత కోసం. అంటే ఇక్కడ మనకు ఏమి అర్దమవుతున్నది, మట్టి పవిత్రతకు చిహ్నం. మరి మనం మట్టిని పవిత్రంగా ఉంచుతున్నామా?

To be continued .........

Monday, 5 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 1



మట్టే మన ఆహారం. అవును, మట్టే మన ఆహారం. మీరు విన్నది నిజమే. అదేమిటని అడుగుతారేమో! మట్టి నాణ్యతను బట్టే మొక్కలో పోషకాలు తయారువుతాయి. మొక్క తనకు కావల్సిన పోషకాలన్నీ మట్టి నుంచి తీసుకుంటుంది. 45% మినరల్స్, 25% గాలి, 25% నీరు, 5 % ఆర్గానిక్ తో తయారవుతుంది మట్టి. మీకో విషయం తెలుసా? ఉపరితల భాగంలో ఉందే ఒక అంగుళం మట్టి (Top soil) ఏర్పడటానికి 100 ఏళ్ళు పడుతుంది. అదే మట్టి కలుషితమైతే? సారం కోల్పోతే? మానవుడి చర్యల వలన వికృతమైతే? మానవులు తీసుకునే ఆహారం కలుషితమవుతుంది, సారహీనమవుతుంది. ఆరోగ్యం, బలం ఇవ్వాల్సిన ఆహారం, అనారోగ్యాన్ని ఇచ్చి బలహీనులను చేస్తుంది. బలహీనమైన జాతి నశిస్తుంది. మానవసమాజం కుప్పకూలుతుంది. మానవ అకృత్యాల వలన సారం, జీవం కోల్పోతున్న మట్టిని సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబరు 5 ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. ఒకసారి మట్టికి మన హిందూ సంస్కృతిలో ఉన్న వైశిష్ట్యం తెలుసుకుందాం.

రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ ............. కృష్ణ యజుర్వేదంలో శ్రీ రుద్రంలో ఉన్న మంత్రమిది.  ధర్మమార్గంలో నడించేవారిని రక్షించువాడు, మా పొలాలను/ మట్టిని/ భూమిని రక్షించువాడు, అందరిని నడిపించువాడు, శత్రువుల చేత హతం చేయబడనివాడు, అడవుల రూపంలో ఉన్నవాడు/ వనాలను రక్షించువాడు, వాక్కును ప్రసాదించినవాడు, విశ్వాన్ని నిర్మించి పోషిస్తున్నవాడు, వృక్షరూపంలో ఉన్నవాడు/ వృక్షాలకు అధిపతి అయిన రుద్రునకు మా నమస్కారాలు అని పదేపదే నమస్కరించడం కనిపిస్తుంది. అందులో ఎంతో చక్కగా చెప్పారు, దీన్ని ఎన్నో కోణాల్లో దర్శించవచ్చు. ఇప్పటికి ఈ అంశానికే పరిమితమవుదాము. క్షేత్రానికి ఒక అర్దంలో మట్టి కూడా వస్తుంది. మట్టిరూపంలో ఉన్న శివునకు నమస్కారాలు అని, ఇంకో అర్దంలో మృత్తికకు అధిపతి, రక్షకుడైన శివునకు నమస్కారాలు అని అర్దం. దీనిబట్టి మనమేం అర్దం చేసుకోవాలి, మట్టిని కలుషితం చేయడం, భూసారం క్షీణించే చర్యలకు దిగడం రుద్రునకు చేసే అపచారం.

చమకంలోనికి వెళితే, అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే - అనే మంత్రంలో ఋషి, మాకు మంచి సారవంతమైన మృత్తికను ఇవ్వు అని అడుగుతున్నాడు.

అఘమర్షణ సూక్తం అనే సూక్తం వేదంలో ఉంది. అది స్నానం సమయంలో పఠిస్తారు. అది మట్టి విలువను ఎంతో గొప్పగా ప్రతిపాదిస్తోంది.

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదేపదే

అంటూ ఉండే మంత్రం మట్టి శిరస్సుపై ధరించి స్నానం చేయడం వలన రక్షణ కలుగుతుందని చెప్తోంది. ఒకప్పుడు మట్టినే స్నానానికి వాడేవారు, బట్టల మురికి వదిలించడానికి కూడా మట్టినే వాడేవారని రాజీవ్ దీక్షిత్ గారు పలు ఉపన్యాసాల్లో చెప్పారు. దానికి కారణం మట్టిని ఉపయోగించడం వలన భూమి, నీరు కలుషితం కావు, రెండవది, అది సహజసిద్ధంగా తయారైనది. శరీరానికి హాని చేయనిది, పైగా పోషకాలను అందించేది. ఇప్పుడు మనం వాడే సబ్బులు చర్మానికి మంచివికావు, బట్టలకు మంచివికావు, పర్యావరణానికీ మంచివి కావు. అంతేనా? ఆ స్నానానికి వాడే సబ్బులను తయారు చేశాక, పరీక్షల కోసమని వాటిని జంతువుల మీద రకరకాలుగా ప్రయోగిస్తారు. కొన్నిటిని వాటి కంట్లోకి చొప్పించి, కళ్ళు పోతాయా లేదా అని పరీక్షిస్తారు. షాంపూల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. అంత హింసతో కూడుకున్నవి వాడటం అవసరమా? అలాంటి హింసకు పరోక్షంగా కారణమవుతున్న వాటి వినియోగదారులు మోక్షాన్ని పొందగలరా? కనీసం అలా ఆలోచించడానికి పాత్రులా?

To be continued ..............
http://techfactslive.com/world-soil-day-theme-quotes-history/15869/

Wednesday, 13 January 2016

ధనుర్మాస వ్రతం - ఆరోగ్యం - ఆయుర్వేదం

ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది, పులగం, కట్టెపొంగలి, చక్రపొంగలి, పరమాన్నం, పులిహోర ఇలా అన్నమాట. వాటిలో ఏఏ పదార్ధాలు వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో కూడా ముందే నిర్ణయించారు పెద్దలు.

ఇందులో ఆయుర్వేద శాస్త్రం ఇమిడి ఉంది. మిరియాలు, శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి ఔషధగుణం కలిగినవి. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టే శక్తి వీటికి ఉంది. ఇవే కాక దద్దోజనం కూడా వండుతారు. అసలు సూర్యోదయానికి ముందే నివేదన పూర్తి చేయాలన్న నియమం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇది చలికాలం, పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. సూర్యాస్తమాయం తర్వాత 1-2 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైన రాత్రి భోజనం ముగించాలి, అప్పుడే ఆహారం అరిగి, ఆరోగ్యంగా ఉండగలం. హేమంత ఋతువులు సూర్యాస్తమయం సాయంత్రం 5:30లో అవుతుంది. అంటే 7:30 లోపు రాత్రి భోజనం ముగించాలి. ఆ తర్వాత ఏమి తిన్నా అరగడం కష్టం. రాత్రి సమయం ఎక్కువ కావడం చేత ఉదయం సూర్యోదయం 6:30 కు అటుఇటుగా అవుతుంది. ఉదయం 8:30 కు ఉదయం భోజనం చేస్తామనుకున్నా, మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణవ్యవస్థ ఖాళిగా ఉంటుంది. ఇంతసేపు ఖాళీగా ఉంటే, కడుపులో గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు వస్తాయి. కనుక ఇది ఆలోచించిన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించి సూర్యోదయానికల్లా పూజ ముగించమన్నారు. సూర్యోదయం అవ్వగానే ఆహారం స్వీకరించవచ్చు కనుక ఈ ప్రసాదంగా చేసిన ఔషధవంటకాలను భుజిస్తారు. దద్దోజనం వంటివి గ్యాస్ ఏర్పడకుండా హరిస్తాయి. ఉదయం పరగడుపున ఏది స్వీకరిస్తమో, దాన్ని శరీరం పూర్తిగా స్వీకరిస్తుంది. ఔషధ తత్వాల ఆహారం స్వీకరిస్తే, రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ఆండాళ్ అమ్మవారి కధ కోసం ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_13.html

Sunday, 23 August 2015

బొడ్డుతాడును భద్రపరచడం - హిందూ సంప్రదాయం

గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. బొడ్డుతాడులో స్టెంసెల్స్ ఉంటాయని, దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ, స్టెం సెల్ బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన ఈనాటిది కాదు. అనాదికాలం నుంచి ఉంది. దీనికి సనాతనహిందూ ధర్మమే మూలమైంది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, మంత్రించి, రాగి  తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఈ బొడ్డుతాడును భద్రపరిచే ప్రక్రియను హిందువులు కోల్పోయి ఉండవచ్చు. తద్ఫలితంగా ఇప్పుడు దాన్ని వెండిలో చుట్టించి భద్రపరచడం వరకు మాత్రమే మిగిలింది.ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఆంగ్లేయులు దేశం మీదకు దండెత్తేనాటికే మన దేశంలో అన్ని శాస్త్రాల్లో విశేషమైన పరిశోధన జరిగింది. దీనికి చిన్న ఉదాహరణ, రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసంలో చెప్పినది.

1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలో అమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు.
1. భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.
2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది.
మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి.

అయితే ఇప్పుడు మనం బొడ్డుతాడును వెండి తాయత్తులో చుట్టించి, మొలకు కట్టడం వెనుక కూడా విజ్ఞానం ఉంది. మొలతాడు వెండిది కట్టేవారు. ఇప్పుడు అది అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయమిది. లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించినవారు పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. దీనికి పెద్ద వివరణ ఇవ్వచ్చు. విషయంలోకి వస్తే, స్త్రీపురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి.  వాటి ఉష్ణోగ్రత సాధరణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. ఈ వృషణాలు, ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద, వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం, వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది.

బొడ్డుతాడులో ఉన్న స్టెం సెల్స్ ను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపరమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం స్టెం సెల్ బ్యాంకులు తెరవడం నిజంగా బాధాకరం. ధర్మం మీద, ఆయుర్వేదం మీద నమ్మకముండి, దేశభక్తి కలిగిన వారు ఎవరైనా ముందుకు వచ్చి, ఆయుర్వేదశాస్త్రంలో సనాతనధర్మం కోల్పోయిన ఈ స్టెం సెల్స్ వైద్యాన్ని తిరిగి పునరుద్ధిరించాలి.

Friday, 7 August 2015

బొడ్డు తాయత్తు

తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు.దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే.  ఈ బొడ్డుతాడు ను పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపాత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.

ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది. అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమనప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం" ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం".

సేకరణ: Via కొండూరు వాసుదేవరావు గారు, గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు 

Friday, 27 March 2015

శ్రీ రామ నవమి

* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

సేకరణ: Sahana Meenakshi​ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిస్రఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 

Sunday, 15 February 2015

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.


1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన

అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. కనుక శివరాత్రి రోజున పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. శివుడి మీద పాక్యెట్ పాలు పోయనవసరంలేదు, నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడు. కాసిన్ని పాలు శివుడికి సమర్పించి, మిగితావి జీవుల యందున్న శివునికి సమర్పించండి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. వెన్ను నిటారుగా ఉండడమంటే చాలామంది వెన్నుపూస మీద భారం వేసి కూర్చుంటారు, అలా చేస్తే నడుమునొప్పి వస్తుంది. మీ శరీర బరువు చాతి భాగంలో పడేలా కూర్చోవాలంటారు స్వామి వివేకానంద. ఇది మాత్రమే నిటారుగా కూర్చోవడం అనే విషయంగా పరిగణైంచబడుతుంది, శ్రద్ధను పెంచుతుంది. ఒక్కరోజులో నిటారుగా కూర్చోవడం కష్టమవ్వచు. అసలు ఇలాంటి  అలవటు నిత్య జీవితంలో చాలా మంది లేకపోవచ్చు. మరి ఏం చేయాలి? శివరాత్రికి కనీసం ఒక రెండు రోజుల ముందు నుంచి నేల మీద నిద్రించడం చేత వెన్ను రోజంతా సహకరిస్తుంది. నేల మీద అనగానే అచ్చంగా నేల మీద నిద్రించమని కాదు, చాప, లేక దుప్పటి, బొంత ...... పరుపు కాకుండా, ఏదో ఒకటి వేసుకుని శయనించడం వలన రోజంతా నిటారుగా కూర్చోవడానికి వెన్ను సహకరిస్తుంది.

3. మౌనవ్రతం

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. చాలామంది మౌనవ్రతమని చెప్పి, మాట్లాడకుండా రకరకాల సైగలు చేస్తారు, కొందరు మౌనంగా కూర్చుని టి.వి. చూస్తారు, ఇంకొందరు టైపు చేయడమే కదా, మాటలతో పనేంటీ అని చాటింగ్ చేస్తారు.ఇవేమీ మౌన వ్రతం అనిపించుకోవని అర్దం చేసుకోండి. మీరు మాట్లడటం ఆపేసినంత మాత్రం చేత, మనసుతో మట్లాడటం లేదా? సైగలతో మాట్లాడటం లేదా? వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.  

4.అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.జాగరణ

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 

6.మంత్ర జపం

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలి. దేవాలయానికి వెళ్తే, అక్కడ రుద్రం చదువుతుంటారు. ఆ రుద్ర నమక-చమకాలు వింటూనో, ఇతర ప్రవచనాలు వింటూనో చేసే జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

Sunday, 25 January 2015

రథసప్తమి - విశేషాలు

ఓం ఆదిత్యాయ నమః
మాఘశుద్ధ సప్తమి- రథసప్తమి

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.

ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||

అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.

ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.

సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.

రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.

రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

ఈ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుపందిరి క్రింద చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యభగవానుడిని పూజించి, సూర్యకిరణాల ప్రసరిస్తూ ఉండగా, ఆ చిక్కుడు పందిరిలో పాలు పొంగించి పరమాన్నం వండి, నివేదన చేయాలి.

Sunday, 11 January 2015

ముగ్గులు - భూతయజ్ఞం

ప్రతి హిందువు రోజు తప్పకుండా 5 యజ్ఞాలు చేయాలి. అందులో ఆఖరిది భూతయజ్ఞం, భూతములు అంటే జీవులు, ప్రాణులని అర్ధం. ప్రకృతిలో మనతో కలిసి జీవనం సాగిస్తూ, మనకు ఎంతగానో సహాయపడుతున్న జీవరాశికి ఆహారం వేయడం మన ధర్మమని భగవతాజ్ఞ. సద్గురువు శ్రీ సాయినాధుడు కూడా అన్ని జీవుల ఆకలిని తీర్చమన్నాడు.

అంతేకాదు మనిషి జీవితంలో కలగలిసిపోయిన అనేక జీవరాశులను మన నుంచి పూర్తిగా వేరు చేయలేము. ఈ జీవవైవిధ్య సూత్రం మనం ఇష్టపడే పిల్లి, కుక్క, మేక, ఆవు కే కాదు .. మనం విసుక్కునే చీమ, బల్లి, ఎలుక, బొద్దింకలకూ వర్తిస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వాటిని మనం నియంత్రించాలిగాని .. నాశనం చేయకూడదు. ఎంతోకొంత జీవకారుణ్యం చూపితే ఇంకా మేలు! మనం సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనుకా జీవకారుణ్య కోణం ఉంది. ఒకప్పుడు బియ్యంపొడినే ముగ్గుపిండిగా వాడేవారు. ఇది ........ ఇంటి ముంగిలికి అందాన్నే కాదు చీమలకు ఆహారంగా కూడా ఉండేది. చీమలు ఆహారం కోసం ఇంట్లోకి బారులు తీరకుండా ఒకే చోట వాటికి ఆహారం అందించే ఉపాయం ఇది. అంత ఆహారం దొరికితే ఇక చీమలు వంటగదులపై ఎందుకు దాడి చేస్తాయి? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ ఎందుకు గారాలు పోతాయ్? అంతేకాదు, పొయ్యి దగ్గర కూడా ఆవుపేడతో అలికి ముగులు పెట్టే సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. చీమలే కాదు...... పిచ్చుకలకూ ఈ ముగ్గుపిండి (బియ్యపు పిండి) ఆహారంగా ఉండేది. మన నగరాల్లో సింధటిక్ ముగ్గులు, సున్నం ముగ్గులు పెరగడం కూడా పిచ్చుకల సంఖ్య తగ్గడానికి ఓ కారణం.

Friday, 9 January 2015

ముగ్గులు - ఆరోగ్య కారణం

మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి  ఆరోగ్య కారణాలున్నాయి.


శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి
తీస్తుంది.  రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం.

ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు. అట్లాగే వంగినప్పుడల్లా శ్వాసను నిదానంగా పీలుస్తూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అవుతుంది.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు  కూడా ఉపాసకులే వేస్తారు.

స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ. వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు. 

Thursday, 8 January 2015

కళ్ళాపి, ఇల్లు అలకడం వెనుకున్న వైజ్ఞానిక అంశం

చిన్నప్పుడు అమ్మమలు, బామ్మలు ఉదయం లేవగానే ఆవుపేడ కలిపిన నీటితో కళ్ళాపి చల్లేవారు. పండుగలు, పూజలకు ముందు ఇంటిని ఆవుపేడతో అలికేవారు. కొందరైతే గోడలను కూడా గోమయంతో అలికేవారు. అసలు అలా ఆవుపేడను ఉపయోగించడం వెనుకున్న కారణం ఏమిటి?  ఆవు పేడ నీటినే చల్లడం ఎందుకు ?

కళ్ళాపి చల్లడం వలన గాలికి దుమ్ము లేచి, ఇంట్లోకి రాకుండ ఉంటుందని సాధారణంగా చెప్తారు. కానీ దానిలో వైజ్ఞానిక అంశాలున్నాయి.

"దేశవాళీ/నాటు ఆవుపేడ" (భారతీయ గోవు పేడ ని మాత్రమే) కలిపిన నీటినే కళ్ళాపిగా చల్లుతారు. నిజానికి భారతీయ గోవుకు (ఆవుకు) చాలా విశిష్టత ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని గోజాతులలోకి భారతీయ గోవుకున్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమిసంహారిణి. క్రిములను దరిచేరనీయదు, హాని కలిగించే కీటకాలను దూరంగా పంపేస్తుంది.

అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి, కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.

ఈ కాలంలో మనం రెడియేషన్ లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. ఆవుపేడ రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి, ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు.

ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు. ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాలు పగుళ్ళకు కూడా ఇవే ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఒక్క పేడలోనే ఇన్ని విశిష్టతలుంటే ఇక ఆవుపాలలో ఎన్ని విశేషాలు ఉంటాయి. అందుకే భారతీయులు ఆవును అమ్మగా, గోమాతగా పూజిస్తారు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది . ఇదండీ మనం కళ్ళాపి చల్లడం వెనుక ఉన్న కారణం. కాని మనం పాశ్చత్య మోజులో పడి మనవన్ని మూఢాచారాలంటున్నాం. అమెరికా వాడు మాత్రం భారతీయ గోవు మీద పెటెంట్ హక్కులు పొందే ప్రయత్నంలో ఉన్నాడు.

Tuesday, 4 November 2014

కార్తీక పౌర్ణమి - సముద్ర స్నానం

కార్తీకపూర్ణిమ, సముద్ర స్నానం.

శాస్త్రంలో సముద్రస్నానానికి ప్రత్యేకత ఉంది. ఆషాడ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలకు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయాలి.

కార్తీక మాసంలో చంద్రకిరణాల నుండి అమృతబిందువులు వర్షిస్తాయి, అవి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు, చంద్ర కిరణాలతో మధుమేహానికి ఔషధం తయారుచేసే పద్ధతి మనం దేశంలో ఉంది. ఈ చంద్రకిరణాలు, చంద్రుడి ప్రభావం నీటిపై అధికంగా ఉంటుంది, పూర్ణిమ రోజున మరింత విశేషంగా ఉంటుంది. చంద్ర కిరణ ప్రభావిత నీటిలో చేసే స్నానం అనేక రోగాలను నయం చేస్తుంది. అందుకోసమే కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి పూర్వమే సముద్రస్నానం చేయాలి.

ఇక ఆయుర్వేద పరంగా చెప్పుకుంటే, ఈ రోజు చేసే సముద్రస్నానం చలికారణంగా మన చర్మం మీద ఏర్పడిన పగుళ్ళను, గాయాలను నయం చేస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయి బద్దకాన్ని కలిగించే విద్యుత్ అయస్కాంత శక్తిని తొలగిస్తుంది. ఉదర, కాలేయ సంబంధిత రోగాల బారినపడకుండా రక్షిస్తుంది.  

కనుక సముద్ర స్నానం చేయాలనుకునేవారు తగిన ఏర్పాట్లు చేసుకోండి.     

Wednesday, 27 August 2014

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

గణేశ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది ఆయుర్వేదం. అంటే కేవలం నెయ్యితోనే ఆహారపదార్ధాలు తయారుచేయాలి. ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్ధాలు పెరిగిపోతే, అది ఆమం (విషం /Toxin) గా మారి రోగాలకు కారణమవుతుంది. ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వలన, నెయ్యి మలద్వారానికి వెళ్ళే పేగుల గోడలకు ఒక పొరగా/పూతగా ఏర్పడి, మల విసర్జన సాఫిగా జరగడానికి కారణమవుతుంది. పుష్టికరమైన శుచికరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను, అక్కర్లేని చెత్తను బయటకు పంపించడం అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నవారి మనసు చురజక్గా పని చేస్తుంది. అటువనటి మనసే మంచి ఆలోచనలు చేయగలదు. మంచి ఆలోచనలే, సత్ సంకల్పాలై, సత్కర్మలకు దారి తీస్తాయి. సత్కర్మలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. శుద్ధిపొందిన చిత్తము ఆత్మాజ్ఞానానికి పాత్రతను పొందుతుంది. అటువంటి వారి తపస్సే ఫలిస్తుంది. కనుక ఆహారం తీసుకోవడం అంత ప్రధానామో, శరీరంలో ఉన్న చెత్తను వివిధ రకాలుగా తొలగించుకోవడం కూడా అంతే ప్రధానం. అందుకే గణేశ చతుర్థీ రోజున ప్రత్యేకించి నెయ్యితో చేసిన పదార్ధాలనే భుజించమన్నారు. ఒక్క వినాయక చవితికే కాదు, నిత్యం కూడా నెయ్యి కలిపిన ఆహారాన్నే స్వీకరించాలి. నెయ్యి లేని తిండి నీతిమాలిన తిండి అన్నారు మన శతకకర్తలు.

గణపతి ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు. గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

అందుకే మన వినాయక చవితి రోజు స్వామికి నేతితో చేసిన వంటకాలు, కుడుములు సమర్పిస్తాం. గణపతి 21 సంఖ్య ఇష్టం కనుక వీలైతే 21 సంఖ్యలో కుడుములు / ఉండ్రాళ్ళు సమర్పించండి.

ఓం గం గణపతయే నమః 

Thursday, 9 January 2014

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ఇది చలికాలం. దక్షిణాయనం. సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగిపొవడం, చలిమంచు వలన భూమి వచ్చే సూర్యకిరణాల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల దేశంలో రోగాలు త్వరగా వ్యాపిస్తాయి. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో 7 రకాలరంగులు మన శరీరంలోని 7 చక్రాల (నాడీ కేంద్రాలు) మీద ప్రభావం చూపిస్తాయి.

రంగులు మానవ మనసుపై ప్రభావం చూపిస్తాయని, వివిధ రకాలా మానసిక, శారీరిక రోగాలున్నవారిని కొన్ని రంగులకు ప్రభావితం చేయడం వలన, వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చని ఆధునిక వైద్యశాస్త్రం గుర్తిస్తోంది. ఈదే అంశాన్ని మనవాళ్ళూ ఎన్నో యుగాలకు ముందే తెలుసుకుని, ఆచరణలో పెట్టారు. రంగులును ముగ్గులలో వేయడం వలన వాటి మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది మనిషి శరీరం మీద పడతాయి. ఆ కిరణాలను శరీరం గ్రహించడం ద్వారా రోగనిరోధకశక్తి కోల్పోకుండా ఉంటారు. అందుకే ధనుర్మాసంలో నెల రోజులు తప్పకుండా రంగవల్లులు వేస్తారు.

 ఆట్లాగే చలికారణంగా జనంలో బద్ధకం పెరుగుతుంది. జనంలో ప్రకృతి మార్పులవల్ల కలిగే ఈ బద్దకాన్ని తొలగించడానికి మనం ప్రాచీనులు కనిపెట్టిన కలర్ థెరపీ ఈ రంగవల్లులు. మన సంప్రదాయాలేమీ ఊరికినే రాలేదు. వాటి వెనుక బోలెడు ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయకారణాలు ఉన్నాయి.

ధనుర్మాసంలోనే రంగవల్లులు నెలంతా ఎందుకు వేస్తారనే విషయానికి వస్తే చెట్లు ఆకులు రాలి, లోకమంతా చాలా అందవీహినంగా కనిపించే కాలం ఈ ఋతువు ఇది మనసుపై దుష్ప్రభావాన్ని చూపి, డిప్రెషన్‌కు దారితీస్తుందని ఆధునిక మానసిక వైద్యులు చెప్తారు. అందుకే విదేశాల్లో హేమంతఋతువులో కలైడోస్కోప్ (అనేక చిత్రదర్శినీ) చూస్తూ సమయం గడపని అక్కడి వైద్యులు గట్టిగా చెప్తారు.

కానీ మనకు ఆ బాధలేదు, ఋషులు గొప్పవారు. వారిది దూరదృష్టి, కొన్ని వేళ ఏళ్ళ క్రితమే అనేక విషయాలను దర్శించారు. ఒక వ్యక్తికి కాదు, సమస్త లోకానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తారు కనుక అందరిని ఈ కాలంలో రంగవల్లులు వేయమన్నారు ఋషులు. ఆ చిన్న కలైడోస్కోప్ గోట్టంలో కనిపించే రంగులు, భారతదేశంలో ప్రతి చోట నెలంతా కనిపిస్తాయి. అన్ని రంగులను ఒకేసారి చూడటం చేత మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్తేజం కలిగుతుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఒక రకమైన Colour Theraphy.ఇలా చెప్పుకుంటూ పోతే, ధనుర్మాసం గురించి అనేకానేక విషయాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవచ్చు.            

Thursday, 14 November 2013

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు?  తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు.

Saturday, 12 October 2013

బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగలో ఉన్న శాస్త్రీయ అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తంగేడు పువ్వులు గొంతు సమస్యలకు,మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు.

~ గునక పువ్వు యాంటి-డైహెరియా,యంటి-డైయాబేటిక్ లక్షణాలు కలది.
~ క్రిమి-సంహారిణి,దోమలను నివరించేది బంతిపువ్వు.
~ చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, అరుగుదల సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇది యాంటి-బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది, కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువలను పీల్చుకొని, గాలిని శుద్ధిచేస్తుంది.

ఈ విధంగా బతుకమ్మ పేరున వాడే ప్రతి పువ్వుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ పూలన్ని గోపురంలా పేర్చాక పైన గుమ్మడిపువు గొడుగుపెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభానికి సూచన, క్రిమి-సంహారిణి. దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది.

సాయంత్రం ఇంటిముందుకాని, వీధిలోకాని, దేవాలయంలో, చెరువు, వాగు ................ ప్రతి చోట అందరు చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడతారు.

చీకటి పడుతుండగా చెరువుల్లో నిమ్మజ్జనం చేస్తారు. ఆ పూలుకున్న ఔషధ గుణాలు నీటిని శుద్ధిచేసి, నీటిద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఇంట్లో 9 రోజులపాటు ఆ పూలను పేర్చడం, ఆ వాసన ఇల్లంత వ్యాపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న క్రిములు హరింపబడతాయి, అందరు ఆ వాసన పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తారు.