Tuesday, 18 July 2017

మనం తక్షణమే చేయాల్సిన రెండు పనులు

ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది, భారతదేశ జనాభా 130 కోట్లకు చేరుకుందని అంచనా. భవిష్యత్తులో ఇంకా పెరగుతుంది. అయితే ఇప్పుడు మనం అతిముఖ్యంగా ఆలోచించాల్సింది అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం కాదు, ముందు తరాలకు సరిపడా వనరులను మనం మిగల్చడం, రెండవది చక్కని పర్యావరణాన్ని అందించడం.

వనరుల కొరత ఏర్పడితే అది తీవ్ర వైషమ్యాలకు కారణమవుతుంది. కొన్ని దేశాల్లో వనరుల కొరత సంఘర్షణకు దారితీసి రెండు దేశాల మధ్య శత్రుత్వానికి, తీవ్రవాదానికి కారణమైందని ఇంతకముందు వందనా శివా గారు చెప్పింది మీరంతా చదివారు. మన దేశంలో ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగునకు చేరాయి. కొన్ని సంవత్సరాలు గడిస్తే, పరిస్థితి తీవ్రమవుతుంది. అది ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విబేధాలకు, వైషమ్యాలకు దారితీసి దేశవిభజనకు దారి తీయవచ్చు, అలా కాకూడదని దైవాన్ని వేడుకుందాం. అయితే మనం చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్రభుత్వాలుగానే కాదు, పౌరులుగా కూడా.

ఒక ఏడాది వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు, 3 సంవత్సరాల అవసరాలకు సరిపోతుందని అంచనా. ఇప్పుడు వర్షం ద్వారా భూమిని చేరే ప్రతి నీటి చుక్కను మనం భూమిలోకి ఇంకించాలి. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగం విజయవంతమైంది, భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు రైతులు, ఇతరులు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రెండవది, నీరు ఎక్కడిక్కడ ఇంకితే, సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

అలాగే #మొక్కలు నాటాలి. భవిష్యత్తు తరాలకు పుష్కలంగా ప్రాణవాయువు ఉండాలి, భూమి చల్లబడాలి, జీవవైవిధ్యం రక్షించబడాలంటే మొక్కలను నాటి, అవి వృక్షాలుగా పెరిగే వరకు సంరక్షించాలి. మొక్కలు నేలకోతకు గురికాకుండా ఆపుతాయి. లోతున ఉన్న భూగర్భ జలాలను పైకి తీసుకువస్తాయి, మేఘాలను ఆహ్వానించి, చక్కని వర్షాలకు కారణమవుతాయి. పచ్చదనం లేకపోతే మెదడు చురకగా పనిచేయదు, కళ్ళ జబ్బులు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ముందు మనం మర్చిపోతున్నది, వేసవికాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు మనం పడే వేదన. అది తర్వాతి తరాలకు ఉండకూడదంటే, తప్పకుండా మొక్కలు నాటాలి. మీకో విషయం తెలుసా? మనదేశంలో చింత, సీమచింత, సీతాఫలం, రేగి, నేరేడు, నాటు ఉసిరి వంటి మనం నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో ఉత్పత్తుల పంటసాగులేదు. అవి ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పంటలు. అడవుల నుంచి నేరుగా కోసుకచ్చి మనకు అమ్ముతారు. కానీ మనకా అవగాహన, ఆలోచన ఎక్కడుంది. చింతపండు తింటాము, రేగికాయలు తింటాము, మే, జూన్, జూలై నెలల్లో నేరేడు పళ్ళు తింటాము, కానీ ఆ విత్తనాలు మాత్రం ఖాళీ ప్రదేశాల్లో చల్లము. ఆయా రకాల మొక్కలు పెంచము. ఈ రోజు సరే! మరి భవిష్యత్తు మాటేమిటి? మన జనాభా భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, వినియోగం కూడా ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ ఉతపత్తులను ఎక్కడి నుంచి తీసుకువస్తాము? ఈలోపు ఉన్న ఆ కాస్త వృక్షాలు నరికితే, అడవులను నాశానం చేస్తే, రాబోయే తరాలకు అసలీ జాతులు పుస్తకాల్లో కూడా చదివే అవకాశం దక్కదు. కాబట్టి మనమే ఆలోచించి ముందుకు కదలాలి.

ఏవైతే మనకు నిత్యావసరమో ఆయా మొక్కలను ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. వాటి పక్కనే ఇంకుడు గుంతలు నాటాలి. ఈ రెండు జరగాలి. ఎందుకంటే మనం వనరులను వాడుకుంటున్నదుకు ప్రతిఫలంగా, లేదా కనీస కృతజ్ఞతగానైనా భూమాతకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి. కృతఘ్నో నాస్తి నిష్కృతిః అని రామాయాణ వాక్కు. కృతఘ్నులకు నిష్కృతి లేదు. దేశసమగ్రతకు భంగం కలగకూడంటే కూడా వనరుల కొరత ఉండకూడదు. అందుకోసమైనా ప్రతి పౌరుడు ఇవి తక్షణమే చేపట్టాలి. ఎందుకంటే Earth is a Temple. Not a dust bin. - ఈ పృధ్వీ దేవాలయం, చెత్తకుండీ కాదు. ఈ భూమి మీదనున్న సమస్తమూ భగవంతుని ప్రతిరూపాలే. ఇది నా మాట కాదు, ఈశావాస్యోపనిషత్తులో ఋషుల వాక్కు. వేదం యొక్క ఆదేశం, ఉపదేశం.

No comments:

Post a Comment