30, ఏప్రిల్ 2016, శనివారం

స్వామి శివానంద సూక్తినాస్తికుడు ఆస్తికుడయ్యాడు

సనాతన ధర్మానికి చెందిన గురువులను నిందించడం, చిన్నచూపు చూడడం, విమర్శించడం చాలా గొప్పగా భావిస్తారు కొందరు. ఇందులో ప్రధానంగా హేతువాదులమని చెప్పుకునే నాస్తికులు ముందుంటారు. ఈ మధ్యే జరిగిన ఓ సంఘటన చెప్తాను. నా మిత్రుడు ఒకతను నాస్తికుడు, భగవంతుని విశ్వసించడు, కానీ సానుకూలాంశం ఏమిటంటే అతనికి భారతీయ సంస్కృతి మీద, గురువుల మీద కాస్త గౌరవం ఉంది. నిజానికి అతను నాతో ఎప్పుడు మాట్లాడే అవకాశం రాకపోయినా, అతన్ని గమనించేవాణ్ణి. నేనే కాదు, నాతో పాటు పని చేస్తున్న వ్యక్తులంతా అతడిని గమనించేవారు. మోక్షం కోరి ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు అనేకులు కనిపిస్తారు, కానీ ఈ వ్యక్తి కొన్ని లౌకిక విషయాల కోసం శక్తిని సంపాదించడానికి ఆధ్యాత్మిక సాధన చేసేవాడు. ఈశ్వరుని యందు నమ్మకం ఉంచి, గురువుల వ్యాక్యాల యందు శ్రద్ధతో సాధన చేస్తే అది త్వరగా ఫలిస్తుంది, అది లేని కారణంగా సాధారణంగా సాధన ఫలించే సమయానికంటే అధికసమయమే ఈ వ్యక్తికి పట్టింది. దానికి తోడు ఇతడు పూర్తిగా గురువులు చెప్పినట్టుగా కాక, తనకు తోచినవి చెప్పి, సమర్ధించుకునేవాడు. తరచు గురువులను విమర్శించేవాడు, వాళ్ళు ఏవేవో చెప్తారని, అతిశయోక్తులు వాడతారని, భయపెడతారని ఆత్మజ్ఞానులను సైతం విమర్శించేవాడు. ఈ విమర్శలు తట్టుకోలేకే అతణ్ణి చాలామంది విడిచి వెళ్ళిపోయారు. నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాళుతుంది. అట్లాగే చేసిన ప్రతి కర్మకు ఫలితం వచ్చే తీరుతుంది. అదే విధంగా ఇతనికి కూడా ఆలస్యంగా కలిగినా, ఒక దివ్యానుభూతి కలిగింది. దట్టంగా, కారు చీకట్ల వలే వ్యాపించిన నాస్తికం ఈశ్వరానుగ్రహం అనే సూర్యుని ముందు అంతరించింది. అతను ఇప్పుడు పూర్తి ఆశ్తికుడయ్యాడు. ఇంతకముందు అతను ఏ గురువులనైతే విమర్శించాడో, ఇప్పుడు అదే గురువులను ఆకాశానికి ఎత్తుతున్నాడు. వారు ఆనాడు చెప్పింది సత్యమని, తానే పొరబడ్డానని అంటున్నాడు. వాళ్ళను విమర్శిస్తూ రాసిన వ్యాక్యాలను ఉపసంహరించుకున్నాడు. ఈ మార్పేదో అప్పుడే వచ్చుంటే, ఇంతకాలం వృధా అయ్యేది కాదు. పైగా అతని చెత్తమాటలు విని కొందరు పక్కదారి కూడా పట్టారు.

చెప్పొచ్చేదేమిటంటే గురువులు (ముఖ్యంగా యోగులు, ఆత్మజ్ఞానులు) ఏం చెప్పినా, అది సత్యమే. మలినమైన మన బుద్ధులకు అందని విషయాలను వారు చెప్పినప్పుడు, దాన్ని అందుకోలేని మన అజ్ఞానాన్ని అంగీకరించాలేకాని, వారిని నిందించకూడదు. ఆధ్యాత్మిక సాధన ఎంతో కష్టతరమైనది. మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు ఎన్ని సార్లు కిందపడ్డా పర్వాలేదు, కానీ పైమెట్టు దాకా వెళ్ళి క్రిందపడితే, లేవడం కష్టం. కాలం వృధా అయిపోతుంది. అందుకే గురువులు అనేక హెచ్చరికలు చేస్తారు. తల్లి వలె ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అవి అర్దం చేసుకోలేక, వాటిని అతిశయోక్తులని వారిని విమర్శిస్తే, నష్టపోయేది మనమే కానీ వాళ్ళు కాదు. ఇంకో విషయం ఏమిటంటే దేవుడు లేడు, ఉంటే కనిపించమను అని అనడం సులభం. భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని చెప్పినా, నేను నమ్మను, శాస్త్రవేత్తలు అబద్దం చెప్తున్నారు అంటే నిన్ను ఎవడు ఉద్ధరిస్తాడు? నువ్వే అంతరిక్షంలోకి వెళ్ళి చూడాలి. అలా వెళ్ళాలంటే దానికి తగిన విధంగా నువ్వు సిద్ధం అవ్వాలి. అది కుదరదు, ఉన్న పళంగా ఎగిరిపోవాలంటే నిన్ను మూర్ఖుడు అంటారు. ఇది కూడా అంతే. భగవంతుడు లేడు అని అనడం కంటే ఇంతకముందు కాళీదాసు, చైతన్య మహాప్రభు, తెనాలి రామకృష్ణ, రామకృష్ణ పరమహంస మొదలైన అనేకులు ఈశ్వర దర్శనం పొందినవారు ఉన్నారు. ఆయన ఎలా ఉంటాడో వర్ణించాడు. వారు మార్గాలు కూడా చూపారు. అసలు ఈశ్వర సాక్షాత్కారానికి ధర్మమే రాజమార్గం. ఈ సౌలభ్యం వేరే మతాల్లో లేదు. అక్కడ భగవంతుడు ఒట్టి నమ్మకం మాత్రమే. అక్కడ భగవదనుభూతి పొందినవారు కానీ, పొందేమార్గాలు కానీ ఉండవు. అందుకే ఆ మతాల్లో వారు నాస్తికులయ్యారంటే అర్దం ఉంది. కానీ సనాతన ధర్మంలో ఈశ్వరసాక్షాత్కారానికి మార్గాలున్నాయి. గురువును ఆశ్రయించి, ఆ మార్గంలో వెళితే, తప్పకుండా ఈశ్వర సాక్షాత్కారంతో పాటు ముక్తి కూడా లభిస్తుంది.

ప్రశ్నించడం పేరుతో మూర్ఖంగా వాదించే జడుల మాటలు నమ్మకండి. మీరంతా హిందువులు. హిందువుల రక్తంలో నాస్తికత్వానికి చోటు లేదు అన్న స్వామి వివేకానందుని మాటలు మరువకండి. సద్గురువును ఆశ్రయించి సాధనతో భగవద్సాక్షాత్కారం పొందండి. గురువులను, శాస్త్రాలను విమర్శించడం ఆపండి.

గురువు అనుగ్రహం సదా మీపై ఉన్నది.

25, ఏప్రిల్ 2016, సోమవారం

హిందూ ధర్మం - 206 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 2)

వక్రీకరణ - అశ్వమేధయాగంలో గుర్రాన్ని చంపి యజమాని (యాగం చేసేవారు) భార్య చచ్చిన గుర్రంతో ఒక రాత్రి నిద్రిస్తుంది. ఆ తర్వాత, ఆ మృత గుర్రం నుంచి తీసిన వప అనే ఒక ప్రత్యేక రసాయనాన్ని యజ్ఞంలో అర్పిస్తారు.
వాస్తవం - అశ్వమేధయాగంలో యజమాని భార్య జ్వలిస్తున్న అగ్ని వద్ద ఒక రాత్రి శయనిస్తుంది. మరునాడు ఆ అగ్నిలో ప్రత్యేక ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణములు కలిగి రసాన్ని (వప) యజ్ఞంలో అర్పిస్తారని స్వామి దయానంద సరస్వతీ సత్యార్ధ ప్రకాశంలో వివరించారు. అశ్వన్ని బలి ఇస్తారన్న వాదనను తీవ్రంగా ఖండించారు.


వివరణ - అశ్వమేధయాగ విషయంలో ఆంగ్లేయులు, కమ్యూనిష్టులు చేసిన వక్రీకరణ క్షమించదగ్గది ఎంతమాత్రము కాదు. శతపధ బ్రాహ్మణంలోనే దీనికి సమాధనం ఉంది.
అగ్నిర్వా అశ్వం అని శతపధబ్రాహ్మణం 13.16.3 స్పష్టం చేసింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న అగ్నియే అశ్వం. యాగవివరణ మంత్రాల్లో అగ్ని, అశ్వం అనే రెండు అర్దాలు వచ్చే పదాన్ని ఉపయోగించారు. అయితే ధర్మద్వేషులు చేసిందేమిటంటే అగ్ని అనే అర్దానికి బదులు గుర్రం అనే అర్దాన్ని స్వీకరించారు. వైదిక శబ్దాలకు ఎప్పుడు ఏ అర్దం ఉపయోగించాలో నిర్ధారించేది నిరుక్తం. అలా అర్దాన్ని స్వీకరిస్తేనే అది సప్రమాణికం. అదీగాక ఇక్కడ శతపధబ్రాహ్మణమే చెప్తున్నది అక్కడ అగ్నియే అశ్వమని. కానీ వారు దీన్ని విస్మరించారు. ఈ విషయంలో సాయనాచార్యుడు, మహీధరుడు మొదలైన భారతీయ భాష్యకారులు కూడా పొరబడ్డారని దయానందులు అన్నారు.  అశ్వమేధం ముగిసే ముందు రాణి ఆ రాత్రంతా జ్వలిస్తున్న అగ్ని వద్ద ఏ భయం లేకుండా, తన భర్త తన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా నిద్రిస్తుందో, అంత ధైర్యంగా నిద్రిస్తుంది. ఆ అగ్ని చల్లారకుండా, ఆ రాత్రంత్రా ఋత్విక్కులు వేదమంత్రాలతో ఆ యజ్ఞాగ్నిలో ఆహుతులిస్తూ, అగ్ని ప్రజ్వరిల్లేలా చేస్తూనే ఉంటారు.

దేశం అశ్వం వంటిది అయినప్పుడు, ఆ చిన్న, చితకా రాజపరివారం, మంత్రులు, చిన్న చిన్న జంతువుల వంటి వారు. ఆ యాగానికి అనేక పెద్ద, చిన్న సామంత రాజులు, మంత్రులు హాజరవుతారు. రాజు నుంచి మంత్రులు, సామంతరాజులు మొదలైనవారికి ఆ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, దేశభద్రత, సరిహద్దులు పటిష్టకు సంబంధించిన అంశాల పట్ల చర్చ జరుగుతుంది. యాగసమాప్తిలో ప్రత్యేక మూలికల నుంచి తీసిన పసరును యాగంలో సమర్పిస్తారు. అది అందరి దేహాలను శుద్ధి చేస్తుంది.

అయితే దీనికి నికృష్టులైన కమ్యూనిస్టులు, అంగ్లేయులు చేసిన అతి నీచమైన వక్రీకరణ చూసినవారు ఎవరైనా వారు కమ్యూనిష్టులు కారని, కమీనేలు, నికృష్టులని ఒప్పుకుని తీరుతారు. వారి మీద ఆవేశంతో రగిలిపోతారు. పైన చెప్పిన వక్రీకరణ కాక, వీరు దీనికి వీరుకున్న జాడ్యాలన్నీ అంటించి, వారి మనసులో అణుచుకున్న కోరికలను ఆ యాగంలో జరిగే ప్రక్రియలుగా వర్ణించారు. సాయనాచార్యుడు మొదలైన భాష్యకారులు చెప్పిందే చెప్తున్నామంటూ, మకు అర్దమైనట్లుగా సాయనుడికి వేదహృదయం అర్దం కాలేదు, అందుకని మేము చెప్పిందే స్వీకరించండి అని చెప్పేశారు. ఆ వక్రీకరణకారులు ఏమంటారంటే ఆ యగంలో చిన్న చిన్న పశువులను, పక్షులను బలి ఇస్తారు. అటు తర్వాత రాణి ఆ అశ్వానికి కత్తితో 3 గాట్లు పెడుతుంది. తర్వాత అశ్వాన్ని చంపుతారు. ఆ చచ్చిన అశ్వంతో యజమాని భార్య ఒక రాత్రి శయనిస్తుంది. తన భర్తతో శయనించిన విధంగా. ఆమె దానితో సంభోగిస్తుంది. దీనివలన ఆమెకు గర్భశుద్ధి అవుతుంది. ఇదంతా వేదపండితుల సమక్షంలోనే జరుగుతుంది. వారు అది చూస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ, చపట్లు కొడుతూ, ఆ రాత్రంతా అక్కడే ఉంటారు. మరునాడు ఉదయం ఆ అశ్వాన్ని చంపి, దాని శరీరభాగం నుంచి వపను తీసి, యజ్ఞంలో వేస్తారు. చూడండి,  విషయాన్ని ఎంత దారుణంగా పక్కదోవ పట్టించారో!.

ఇంతకంటే నికృష్టమైన, నీచాతినీచమైన వక్రీకరణ ఉంటుందా? దీన్ని మనం అంగీకరించాలా? కానీ విదేశీయుల కుట్ర ఎటువంటిదంటే ఇప్పుడు ఈ దేశంలో అనేకమంది పండితులు కూడా వక్రీకరించిన విషయమే కొన్ని సవరణలతో సత్యమని భావిస్తున్నారు. పాపం! వారికి కూడా నిజం తెలియదు. ఈ విషయంలో ఆర్యసమాజం వారు నిరుక్తం ఆధారంగా పరిశోధన చేసి, సనాతనధర్మానికి చేసిన సేవ మరువజాలనిది.

To be continued ....................

24, ఏప్రిల్ 2016, ఆదివారం

హిందూ ధర్మం - 205 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 1)

వక్రీకరణ - అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలి ఇస్తారు.

వాస్తవం -  అశ్వమేధయాగంలో గుఱ్ఱాన్ని ఉపయోగించే మాట నిజం కానీ బలి మాత్రం ఇవ్వరు. అసలు అశ్వమేధ యొక్క ఉద్దేశ్యం జంతుబలి కాదు, దేశ సంరక్షణ, సరిహద్దుల పటిష్టత అని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానందులు వేదోక్తంగా నిరూపించారు.

రాష్ట్రంవా అశ్వమేధః (దేశమే అశ్వమేధం. (దేశసంరక్షణ కొరకు చేసేది)) అని శతపధ బ్రాహ్మణం 13.16.3 చెప్తున్నది.
ఇప్పుడు మనం అనుకుంటున్న సమాఖ్య వ్యవస్థ (Federalism) వేదంలో ఉంది. భారతదేశం ఒక దేశంగా ఏర్పడింది 1947 తర్వాత 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ద్వారా కాదు. ఈ దేశానికి ఎన్నో యుగాలు చరిత్ర ఉంది. అనేక మన్వతరాల నుంచి, కల్పాల నుంచి భారతదేశం ఏకఖడంగా ఉంది. ఎందరో రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేకులు చక్రవర్తులై, సామ్రాట్టులై ప్రపంచాన్ని భారతదేశం పాదల చెంతకు తీసుకువచ్చారు. ఇప్పుడున్న వ్యవస్థలో దేశానికి ఒక ప్రధాని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగానే పూర్వం కూడా అఖండ భారతానికి ఒక చక్రవర్తి, ఆయన క్రింద అనేక సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ ఉండేవారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజ్యంగం ఉన్నది. అప్పట్లో అది ధర్మంగా ఆధారంగా, శృతిని, స్మృతులను అనుసరించి ఉండేది. నిజానికి ధర్మమే దైవం ఏర్పరిచిన రాజ్యాంగం. అప్పుడు దాన్నే అనుసరించేవారు. దానికి ఎవరూ అతీతులు కారు, మార్పు చేసే అవకాశం(యుగధర్మం తప్పించి తరచు మార్పు చేసే అవకాశం) కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా సామంత రాజులు గర్విష్టులై, చక్రవర్తికి కప్పం కట్టకుండా, తన రాజ్యాన్ని ఈ దేశం నుంచి వేరు చేయాలనే చర్యలకు పాల్పడినప్పుడు చక్రవర్తి అశ్వమేధ యాగం చేసేవారు. అందులో యాగ అశ్వానికి ఇది అశ్వమేధ యాగ పశువు అని కనిపించే విధంగా ఒక పతాకం (జెండా) కట్టి, దాని వెనుక సైన్యాన్ని కాపలాగా పంపించేవారు. ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోరు. అడ్డుకుని, బంధించినవారు ప్రభువుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డుకోవడమంటే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే. ఓడితే కప్పంతో బాటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేసి, తిరిగి యాగస్థలికి రావడంతో యాగం ముగుస్తుంది. అందులో అశ్వాన్ని బలి ఇవ్వడమేమీ ఉండదు. ఇందులో అశ్వమే ప్రధానం కానుక, ఆ గుర్రాన్ని యాగపశువు అన్నారు కానీ, దాన్ని బలి ఇస్తారని కాదు. కొన్ని యగాల్లో యజమానే యాగపశువు అని శాస్త్రం చెప్తోంది. అంటే యజమానిని బలి ఇస్తున్నారా? లేదు కదా. దేశంలో ఏర్పడ్డ చీలికను తొలగించి, సామంత రాజులందరూ ధర్మం ఆధారంగా ఏర్పడిన విశాల రాజ్యానికి కట్టుబడి ఉంటామని చెప్పడమే అశ్వమేధం యొక్క ప్రధాన ప్రయోజనం. ఇది దేశంలో అసంతృప్తులను నశింపజేసి, సరిహద్దులను పటిష్టం చేస్తుంది. అంతర్గత ఐక్యతను కాపాడుతుంది.

ఈ అశ్వమేధ యాగం ఈ అఖండభారతంలో ఎన్నో సార్లు జరిగింది. ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రభువుగా కృష్ణుని సంకల్పంతో అఖండభారతం 18 రాష్ట్రాలతో, ఒకే రాజ్యాంగంతో, సమాఖ్య వ్యవస్థగా అవతరించింది. అప్పటి నుంచి అధర్మాన్ని అనుసరించారని ఈ పవిత్ర భూమి నుంచి వెలివేయబడ్డవారు తిరిగి ఈ దేశం మీద దండెత్తినప్పుడు, తమ మతాన్ని ఈ భూమిలో వ్యాపింపజేసి, అంతర్గతంగా విబేధాలను సృష్టించి, దేశాన్ని బలహీనం చేయాలని చూసిన ప్రతిసారి ఈ దేశపు రాజులు అశ్వమేధం నిర్వహించారు. కలియుగంలో కూడా క్రీ.శ. 7 వ శతాబ్దం వరకు, భారతదేశం కేంద్రీకృతవ్యవస్థ పతనమయ్యేవరకు ఈ దేశంలో అశ్వమేధాలు నిర్వహించారట. భౌద్ధం ప్రబలి, కొన్ని రాజ్యాలను అఖండభారతవని నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు, హిందూ ప్రభువులు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్వహించి, దేశ సరిహద్దులను పటిష్టం చేశారు.

ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ భారతభూమిలో భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు. అటు తర్వాత బౌద్ధులు. అంతర్గతంగా, ఈ దేశంలో ఉంటూనే, ఈ ధర్మం మీద ద్వేష భావనతో, కొన్ని రాజ్యాలను అఖండభారతం నుంచి వేరు చేశారు. (ఆ కారణంగానే అఖండభారతం అనేక ముక్కలైంది. అటు తర్వాతా ఆయా ప్రాంతాల మీద ఇతర మతాలు దండెత్తడం వలన, బౌద్ధం లాంటివి కూడా అక్కడ నశించాయి.) వీరు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే ఇటువంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు. అయినప్పటికి ధర్మజ్వాల నశించలేదు. క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాలు ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. అందుచేత విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.

To be continued ............

20, ఏప్రిల్ 2016, బుధవారం

16, ఏప్రిల్ 2016, శనివారం

స్వామి శివానంద సూక్తి


హిందూ ధర్మం - 204 (యజ్ఞంలో బలి ఖండన - 1)

వక్రీకరణ - అశ్వమేధం, గోమేధం మొదలైన యజ్ఞాల్లో జంతుబలి ఉంటుంది. గోమేధంలో ఆవును బలి ఇస్తారు.
వాస్తవం - అశ్వమేధం, గోమేధం అన్న పేర్లలో పదాలకు మీకు తెలిసిన ఒకటి, రెండు అర్దాలను పట్టుకుని చేస్తున్నా నిరాధార ఆరోపణలివి. ముందు గోమేధం గురించి చూద్దాం. గోవును వధించి చేసే యజ్ఞం కనుక దానికి గోమేధమని పేరని కుహనా చరిత్రకారులు, కిటుల బుద్ధి కలిగిన అంగ్లేయులు, కమ్యూనిష్టులు అర్దం చెప్పారు.

శతపధ బ్రాహ్మణం 13.3.6.2 ప్రకారం మేధ అంటే ఆజ్యం (ఆవునెయ్యి). ఏ యజ్ఞంలోనైతే విశేషంగా ఆవునెయ్యిని వాడుతారో, అందులో మేధ అనే పదం చేర్చారు. పతంజలి మహర్షి గారి ఉనది కోశం 2-67 ప్రకారం గో అనే పదం ఇంద్రియాలను, వాతవరణాన్ని, కిరణాలను (సూర్యుడు, ఇత్యాదుల), భూమిని సూచిస్తుంది. అలాగే భూమిపై జరిగే క్రతువులను సూత్రప్రాయంగా స్వీకరిస్తుంది. పైన చెప్పుకున్న వాటిని కాలుష్య రహితంగా, పవిత్రంగా ఉంచడమే గోమేధ యజ్ఞం.

అదేకాక
అన్నం హి గావః
ఆజ్యం మేధః అని కూడా శతపధ బ్రాహ్మణం చెప్తున్నది.

సస్యవృద్ధి కొరకు చేసే యజ్ఞమే గోమేధమని అర్దం. చలికాలంలో అలుముకునే పొగమంచు కారణంగా భూమిపై సూర్యకిరణ ప్రభావం తగ్గుతుంది. దాంతో జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న జీవరాశికి పుష్టినివ్వడం కోసం గోమేధ యజ్ఞం చేస్తారు. ఇక్కడ గోవు అంటే భూమి, వాతావరణం. అలాగే సూర్యకిరణాలకు అడ్డుపడే పొగమంచును చేధించడం. అయితే వక్రీకరణ కారులు ఏం చేశారంటే గోమేధంలో పదం ఒకటి పట్టుకున్నారు. అలాగే చలికాలంలో సూర్యకిరణాల ప్రభావం తగ్గిపోతుందనే అర్దం వచ్చే మంత్రాలను యజ్ఞంలో గోవును బలిస్తారు అన్నట్టుగా వక్రీకరించారు. కానీ ఆ తర్వాత వచ్చే మంత్రంలో వసంత ఋతువులో గోవు (భూమి, సూర్యకిరణాలు) తిరిగి పుష్టి పొందుతుందని చెప్పబడింది. కానీ వీరు ఆ మంత్రాన్ని విస్మరించారు. ఒకవేళ అక్కడ చెప్పబడింది ఆవు అయితే బలివ్వబడిన ఆవు తిరిగి ఎలా పుష్టిపొందుతుంది? ఇది నికృష్ఠులైన వక్రీకరణకారులకు తట్టలేదు. అందుకే అలా గోమేధం అంటే గోవును బలిచ్చే యాగం అని వక్రీకరించి, ప్రచారం చేశారు. గోమేధం పాడిపంటల వృద్ధి కోసం, అడవులు, పచ్చదనం వృద్ధి కోసం, వాతావరణాన్ని కాలుష్యరహితం చేయడం కోసం చేస్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానందులు సత్యార్ధప్రకాశంలో వివరించారు.

యజ్ఞం కేవలం బాహ్యమే కాదు, ఆంతరంగికం కూడా. బయట చేసే యజ్ఞం పాప ప్రక్షాళనకైతే, ఆంతరములో చేసే యజ్ఞం జ్ఞానవృద్ధికి, మోక్షానికి. రెండూ ముక్యమే. ప్రతి యజ్ఞంలో ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం ఎల్లవేళలా కలిగి ఉండడమే గోమేధ యజ్ఞం.

To be continued ...............

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు

ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.

ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.

నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.

ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||

భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు శ్రీ రాముడు.

నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.

ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 101 సర్గలో ఉంది.

తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలాకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.

శ్రీ నామ రామాయణం


శ్రీ నామ రామాయణంగా ప్రసిద్ధమైన ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంది.

బాల కాండము:

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్
శేషతల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
చండకిరణకుల మండన రామ్
శ్రీ మద్దశరథ నందన రామ్
కౌసల్యా సుఖవర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియ ధన రామ్
ఘోర తాటకా ఘాతక రామ్
మారీచాది నిపాతక రామ్
కౌశిక మఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యోద్ధారక రామ్
గౌతమముని సంపూజిత రామ్
సుర మునివర గణ సంస్తుత రామ్
నావిక ధావిత మృదు పద రామ్
మిథిలా పురజన మోహక రామ్
విదేహ మానస రంజక రామ్
త్ర్యమ్బక కార్ముక భంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
కృత వైవాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతారామ్

అయోధ్య కాండము:

అగణిత గుణగణ భాషిత రామ్
అవనీ తనయా కామిత రామ్
రాకా చంద్ర సమానన రామ్
పితృ వాక్యాశ్రిత కానన రామ్
ప్రియ గుహ వినివేదిత పద రామ్
తత్ క్షాలిత నిజ మృదుపద రామ్
భరద్వాజ ముఖానందక రామ్
చిత్ర కూటాద్రి నికేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయార్థిత రామ్
విరచిత నిజ పితృ కర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

అరణ్య కాండము

దండకావనజన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్
శరభంగ సుతీక్షార్చిత రామ్
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
గృధ్రాధిప సంసేవిత రామ్
పంచవటీ తట సుస్థిత రామ్
శూర్పణఖార్తి విధాయక రామ్
ఖర దూషణ ముఖ సూదక రామ్
సీతా ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధిప గతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహుచ్ఛేదన రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

కిష్కింధా కాండము

హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవాభీష్టద రామ్
గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
సుందరా కాండము

కపివర సంతత సంస్మృత రామ్
తద్గతి విధ్వ ధ్వంసక రామ్
సీతా ప్రాణాధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్
శిష్ట హనూమద్భూషిత రామ్
సీతా వేదిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండము:

రావణ నిధన ప్రస్థిత రామ్
వానరసైన్య సమావృత రామ్
శోషిత సరిదీశార్థిత రామ్
విభీషణాభయ దాయక రామ్
పర్వతసేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
రాక్షససంఘ విమర్దక రామ్
అహి మహి రావణ చారణ రామ్
సంహృత దశముఖ రావణ రామ్
విధి భవ ముఖ సుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీతాదర్శన మోదిత రామ్
అభిషిక్త విభీషణ నత రామ్
పుష్పక యానారోహణ రామ్
భరద్వాజాభినిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్
సాకేత పురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్
రత్నలసత్పీఠాస్థిత రామ్
పట్టాభిషేకాలంకృత రామ్
పార్థివకుల సమ్మానిత రామ్
విభీషణార్పిత రంగక రామ్
కీశకులానుగ్రహకర రామ్
సకలజీవ సంరక్షక రామ్
సమస్త లోకాధారక రామ్
ఉత్తరా కాండము:

ఆగత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్
సీతాలింగన నిర్వృత రామ్
నీతి సురక్షిత జనపద రామ్
విపిన త్యాజిత జనకజ రామ్
కారిత లవణాసురవద రామ్
స్వర్గత శంభుక సంస్తుత రామ్
స్వతనయ కుశలవ నందిత రామ్
అశ్వమేధ క్రతు దీక్షిత రామ్
కాలావేదిత సురపద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విభుధానందక రామ్
తేజోమయ నిజరూపక రామ్
సంసృతి బంధ విమోచక రామ్
ధర్మస్థాపన తత్పర రామ్
భక్తిపరాయణ ముక్తిద రామ్
సర్వచరాచర పాలక రామ్
సర్వభయామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

Telugu wikisource (https://goo.gl/iblBCf) సౌజన్యంతో

12, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీధర్ గురూజీ సూక్తి


మమ్మల్ని స్వదేశీయులుగా గుర్తించండి అంటున్న ఈశాన్యభారతీయులువీళ్ళను చూడగానే వీళ్ళు ఏ నేపాల్ వాళ్ళో, చైనా వాళ్ళో అనుకుంటారు. కానీ కాదు. వీళ్ళు కూడా భారతీయులే. ఇదే భూభాగంలో అనాదికాలం నుంచి ఉంటున్న స్వజాతీయులే. వీళ్ళు ఈశాన్య భారతానికి చెందిన వాళ్ళు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. స్వదేశంలో కూడా విదేశీయులలాగా బ్రతకీడుస్తున్న దుస్థితి వీళ్ళది. వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి తక్కువ. అందువల్ల వీళ్ళు చదువుల కోసం ధిల్లీ మొదలైన అనేక ప్రాంతాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎదురుకునే వివక్ష అంతాఇంతా కాదు.

వీళ్ళు రోడ్ల మీద నడుస్తుంటే ఆకతాయిలు వీళ్ళను చీనీలను, నేపాలీలని ఆటపట్టిస్తారు. స్వదేశంలో కూడా విదేశీయులుగా గుర్తించబడి మనోవ్యధకు లోనవుతున్నారు మన ఈశాన్య భారతీయ సోదరులు.
ఈశాన్య భారతానికి చెందిన అమ్మాయిలు విద్య కోసం ఉత్తరభారతానికి వచ్చినప్పుడు, వాళ్ళకు హాస్టల్స్‌లో రూములు ఇవ్వరట. అదేమిటంటే మీరంత మంచి వాళ్ళు కాదు, మీకు అక్కర్లేని అలవాట్లు ఉంటాయంటూ ముఖం మీదే చెప్పి పంపించేస్తారు. ఈ అమ్మాయిలను కేవలం కామభావంతోనే చూస్తూ, వీళ్ళను వేశ్యలుగా ముద్రవేస్తూ ఆనందాన్ని పొందుతారు కొందరు. ఇది ఈశాన్య భారతీయుల ఆత్మగౌరవానికి ఎంత భంగకరం చెప్పండి. అటవీ ప్రాంతం ఎక్కువన్నంత మాత్రాన, గిరిజనులైనంత మాత్రాన, వస్త్ర ధారణ ఆధునికంగా ఉండడం చేత వీళ్ళను అలా అపహాస్యం చేయవచ్చా? కానీ చదువుకున్న మూర్ఖులే ఈ విధంగా వీరిని అవమానిస్తున్నారు.
వీళ్ళు కుక్కలను తింటారని, మనుష్యులను ఎత్తుకుపోతారని అనేక ప్రచారాలను కల్పిస్తున్నారు కొందరు వెధవలు.
వీళ్ళకు ఒక సంస్కృతీ సంప్రదాయం లేదని, ఎలా పడితే అలా బ్రతుకుతారని నిందారోపణలు చేస్తారు ఇంకొందరు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, వీళ్ళు ఎంతగానో వివక్ష ఎదురుకుంటున్నారు. ఇది ఎంతో బాధాకరం. అయితే వీళ్ళు ఎదురుకుంటున్న వివక్షను తమ రాజకీయ వికృత క్రీడకు వాడుకోవాలనుకుంటున్న కమ్యూనిష్టులు, ఈశాన్య భారతం మీద కన్నేసిన చైనా, క్రైస్తవ మిషనరీలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. దీనికి తోడు దేశంలో విచ్చినకర సాహిత్యాన్ని ప్రోత్సహించే మేధావులు ఉండనే ఉన్నారు.

స్వదేశంలో చైనీయులుగా ఆత్మ గౌరవం లేకుండా బ్రతికేకంటే చైనాలో కలిసిపోయి, ఆత్మ గౌరవంతో బ్రతకమని చైనా తన ఏంజంట్ల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ మొదలైన ఈశాన్య రాష్ట్రాల్లో బాగా ప్రచారం చేయిస్తోంది. అదేమీ వీళ్ళ మీద ప్రేమతో చేస్తున్న ప్రచారం కాదు. ఇక్కడున్న సహజ సంపదను దోచుకునే కుట్ర అది. చైనా కుట్రను పారించడంలో కమ్యూనిష్టులు చాలా ముందుంటున్నారు. రాబోయే 15 ఏళ్ళలో #చైనా ఈశాన్య భారతాన్ని కబళించాలని పన్నాగం పన్ని, దానికి అనుగుణంగా ముందుకు వెళుతోంది. మేలుకో భారతీయుడా!

ఇక్కడున్నది అంతా గిరిజనులే, అమాయకులే. వీరిని మతమార్పిడి చేసి, ఆసియాలో ఈశాన్య భారతాన్ని మరో వాటికన్ చేసి, ప్రత్యేక దేశం చేసి, తద్వారా ఆసియాలో క్రైస్తవాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాయి మిషనరీలు. నాగాల్యాండ్‌లో 100 ఏళ్ళ క్రితం మిషనరీలు అడుగుపెట్టగా, ఇప్పుడు ఆ రాష్ట్రలో 95% క్రైస్తవులే ఉన్నారంటే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. ఈ మతమార్పిడులకు తోడు, పరలోక క్రీస్తు రాజ్యం రావాలంటే పాపపు భారతదేశం నుంచి వైదొలగాలని వీరికి భోధనలు చేస్తున్నారు. మేలుకో భారతీయుడా!

వాక్ స్వాతంత్రం, హక్కులు, ఉద్యమాలు, వివక్షలు, అసలు భారతదేశమే లేదు, రాజ్యాంగం పేరుతో విభిన్న వర్గాల వారిని బలవంతంగా కలిపి ఉంచారంటూ గోల చేసేవారు, తీవ్రవాదులకు మద్ధతు పలికేవారు, వారికి సంఘీభావంగా ర్యాలీలు తీసేవారు, దొంగ రచయితలు, కుహనా మానవతావాదులు, దేశద్రోహులు ఈశాన్య భారతంలో రెచ్చగొట్టే ప్రసంగాలను చేస్తూ వీరిని భారతదేశం నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. వీరి మీద కొందరు చేసిన దాడులను భూతద్దంలో చూపించి, వీరిని #భారతమాత నుంచి వేరు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మేలుకో #భారతీయుడా!

60 ఏళ్ళుగా వీళ్ళను కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, కేంద్రంలో కొత్తగా మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. అయినప్పటికి సగటు ఈశాన్య భారతీయుడు తమ గురించి మిగితా భారతీయులు తెలుసుకోవాలని, తమను కూడా భారతీయులుగానే గుర్తించాలని కోరుకుంటున్నారు. వారిక్కూడా దేశం మీద ప్రేమ ఉంది. సైన్యంలో కూడా ఈశాన్య రాష్ట్రాల వారున్నారు.

మీకెప్పుడైనా ఇటువంటి ముఖ కవళికలున్నవారు కనిపిస్తే, వారిని ప్రత్యేకంగా చూడకండి. వారిలో ప్రత్యేక అస్థిత్వవాదాన్ని సృష్టించకండి. వారిని కూడా ప్రేమతో కలుపుకోండి. వారిని మన నుంచి వేరు చేసే అవకాశం ఎవరికి కల్పించకండి,

జై హింద్ 

11, ఏప్రిల్ 2016, సోమవారం

పవిత్ర ప్రదేశాల్లో ఉపద్రవాలెందుకు వస్తున్నాయి? - పరమాచార్య స్వామి వారి బోధ

వ్యక్తిగత కల్మషాల దుష్ప్రభవాలు, మడి (మానసిక, శారీరిక, వస్త్రాదుల విషయంలో) యొక్క సానుకూల ప్రయోజనాలు కళ్ళకు కనిపించవు కనుక, జనం వాటిని మూఢనమ్మకాలంటున్నారు. కానీ అశౌచం ఉన్న వ్యక్తులను కలిపేసుకుని తిరగడం వలన వచ్చే పరిణామాలను ఇప్పుడు మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. మడికి విరుద్ధమైన ఆచారాల పెరుగుదల వలన రోగాలు, పవిత్ర ప్రదేశాల్లో సైతం ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు, ప్రకృతి ప్రకోపం, కరువు, భూకంపాలు పెరుగుతున్నాయి. ఇదే అన్ని ఉపద్రవాలకు కారణమని ఒప్పుకోకపోవడమే పెద్ద మూఢనమ్మకమని నాకు అనిపిస్తోంది.

కంచి పరమాచార్య స్వామి


వీరేదో అంటరానితనాన్ని ప్రోతహిస్తున్నారని పెడార్దాలు తీయవద్దు. మడికి అంటరానితనానికి సంబంధంలేదు. రెండు వేర్వేరు అంశాలు. ఆధునికత పేరుతో భోజన విషయంలో అంటును కలిపేసుకోవడం, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ తినడం, స్త్రీలకు నెలసరి సమయంలో శాస్త్రం పూర్తి విశ్రాంతి ఇమ్మని చెప్పినా, అది పాటించక, వారితోనే పనులను చేయించడం, ఆ సమయంలో వారిని ఇంట్లో కలుపుకోవడం, పురుటిమైలను, బంధువులు మరణించినప్పుడు వచ్చిన సూతకాన్ని పట్టించుకోనక ఇష్టం వచ్చినట్లు జీవించడం, అటువంటి వారితో కలిసిన తర్వాత కనీస శౌచ నియమాలను పాటించకపోవడం వంటి అనేక అంశాల కారణంగా, మరలా ఇదే వ్యక్తులు సమాజంలో అన్ని ప్రదేశాల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశించడం వలన అక్కడి పవిత్రత, సమాజంలో పవిత్రత దెబ్బతిని ఇలా ఉపద్రవాలు జరుగుతున్నాయని స్వామి వారి ఉద్దేశ్యం.

10, ఏప్రిల్ 2016, ఆదివారం

హిందూ ధర్మం - 203 (వేదంలో గోవధ ఖండన - 3)వక్రీకరణ - ఇంద్రుడు ఆవు, దూడ, ఎద్దు, గుర్రం, దున్నపోతుల మాంసం తింటాడు - 6-17-1
వాస్తవం - ఆ మంత్రం ఏం చెప్తోందంటే యజ్ఞంలో అగ్నికి కలప పుష్టినిచ్చిన విధంగా గొప్ప పండితులు ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో కాంతిమయం చేస్తారు. ఈ మంత్రాన్ని అనువాదం చేసిన అవతార్ గిల్ల్ సమూహానికి ఇందులో ఇంద్రుడు, ఆవు, ఎద్దు, గుర్రం ఎలా కనిపించాయో!? వారు చెప్పిన మంత్రంలో 'గవ్యం' అనే పదం ఉంది. పంచగవ్యం ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలకు సంకేతం. కానీ వారు దానికి మాంసం అనే అర్దం కల్పించారు. రాజు గోఘృతం వంటి సాత్విక భోజనం ద్వారా పుష్టిగా తయారై దేశాన్ని శతృవులు, రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆ మంత్రం చెప్తోంది.

వక్రీకరణ - అగ్ని 100 దున్నపోతులను వండాడు. ఓ ఇంద్రా! ఇది మరుత్తులను శక్తివంతం చేస్తుంది. అతడు, పూషన్, విష్ణువు, అందులోకి మూడ పెద్దపాత్రలతో వృత్తాసుర్రున్ని చంపే రసాయనం పోశాడు - ఋగ్వేదం 6-17-11
వాస్తవం - ఓ ఇంద్రా! లోక పరిపాలకుడా! మానవాళి మరియు ప్రకృతి యందున్న సమస్త బలనమైన, సృజనాత్మకమైన శక్తులన్నీ ఏకమై నీ తేజమును, సేవను స్తుతించాలి. సర్వవ్యాపకుడు, విశ్వాన్ని పోషించువాడు, సర్వకాలాల్లో శక్తిమంతుడు, మూడూ లోకాల యందు ఉంటూ పరమానందానిచ్చు విష్ణువు దుష్టులను నశింపజేయు ఇంద్రునకు ఆనందాన్ని, శక్తిని ఇచ్చుగాకా. (ఇది ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దాయనందుల వారి అనువాద సరళిలో డా. తులసి రాం శర్మ గారి అనువాదం)

వక్రీకరణ - మనుస్మృతి జంతువధను సమర్ధిస్తుంది. 'జంతువులను తినడం పాపం కాదు, ఎందుకంటే భగవంతుడు తినేవారిని, తిను పదార్ధాలను, రెండింటిని సృష్టించాడు - 5-30
వాస్తవం - హిందూ ధార్మిక గ్రంధాల్లో అత్యత ఎక్కువగా ప్రక్షిప్తాలకు గురైంది మనుస్మృతేనని అనేకమంది తేల్చారు. క్రీ.శ. 7 వ శతాబ్దం తర్వాత మొదలైన ఈ ప్రక్షిప్తాలు ఎంతవరకు వెళ్ళాయంటే ఇప్పుడు లభించే మనుస్మృతిలో 50% ప్రక్షిప్తాలే ఉన్నాయి. ఆర్యసమాజం వారు మనుస్మృతిలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి యదార్ధమైన మనుస్మృతిని విశుద్ధ మనుస్మృతి పేరిట ప్రచురించారు.

అసలు మనుస్మృతిలో జంతువధ గురించి ఏం చెప్పారో చూద్దాం.

अनुमन्‍ता विशसिता निहन्‍ता क्रयविक्रयी ।
संस्‍कर्ता चोपहर्ता च खादकश्‍चेति घातका: ।। – మనుస్మృతి 5 వ అధ్యాయం 51 వ శ్లోకం.

మాంసభక్షణ ప్రోత్సహించేవాళ్ళు, జంతువులను వధించువాడు, మాంసం అమ్మువాడు, వండువాడు, దాన్ని వడ్డించువాడు, తినువాడు, అందరూ ఘాతకులే. వారందరికి పాపం సమానంగా వస్తుంది.

ఏ జీవిని చంపకపోవటం చేతనే వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు - మనుస్మృతి 6.60

నిస్సహాయ, అహింసాప్రవృత్తి కల జంతువులను తన సంతోషం కోసం వధించువాడు ఇహలోకంలోను, పరలోకంలోనూ ఎన్నటికి సంతోషాన్ని పొందడు - మనుస్మృతి 5-54.

ఎవరికైతే జంతువులను బాధించాలని, వధించాలని కోరిక ఉండదో, అతడు సవ్రజీవులకు హితుడై (సరభూతహితుడై), పరమానందాన్ని పొందుతాడు - మనుస్మృతి 5-46

ఏ జీవికి హానీ చేయనివాడు, ఏ ప్రయత్నం లేకుండానే అతడు అనుకున్నది ఏది అనుకుంటే అది పొందుతాడు, మనసు దేని మీద లగ్నం చేస్తే అది సిద్ధిస్తుంది, అతడు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది - మ.స్మృ.5-47

జీవులను హింసించకుండా మాంసం రాదు. జీవహింస ఆత్మానందానికి అడ్డంకి. కనుక మాంసభక్షణ విడిచిపెట్టండి - మ.స్మృ.5-48

దేవతలను, పితృదేవతలను పూజించకపోయినా ఫర్వాలేదు కానీ, అన్యజీవుల మాంసాన్ని భుజించి తన శరీర సౌష్టవాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తికి మించిన మహాపాపాత్ముడు వేరొకడు ఉండడు - మ.స్మృ.5-52

మనుస్మృతి ఇంత విపులంగా జీవహింస తప్పని చెప్తే, అందులో గోమాంసం భక్షణ ఉందని, వేదంలో ఎద్దులను తినమని చెప్పిందని వక్రీకరించి 'మొద్దులను' ఏమనాలి?

To be continued ................

Sources:
https://ancientindians.in/purusharthas/dharma/vegetarianism-as-per-manusmruti-a-dharma-sastra/
http://www.iskcondesiretree.com/forum/topics/about-being-vegetarian-and-not
http://www.vedicgranth.org/misconceptions-on-vedas/misconception-3---violence-against-animals-meet-eating-etc

9, ఏప్రిల్ 2016, శనివారం

7, ఏప్రిల్ 2016, గురువారం

మధర్ సూక్తి


వికట, ధూమ్రవర్ణ - గణపతి నామాలకు అర్దం

ఓం గం గణపతయే నమః

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం ||

ఇది సంకటనాశన గణేశ స్తోత్రంలోని ఒక పంక్తి. అందులో వికట, ధూమ్రవర్ణ అనే నామాలకు అర్దం చెప్పమని ఒక మిత్రుడు అడిగారు.

వికట అనేది గణపతి 8 అవతారాల్లో మొదటిది. దీని గురించి గణేశ పురాణంలో ఉంది. కామాసుర సంహారం కోసం వినాయకుడు మయూరాన్ని (నెమలిని) వాహానంగా చేసుకుని, వికట గణపతి రూపంలో అవతరించి, కామాసురుని అణిచివేశాడు. వికట అనే నామంతో గణపతిని పూజించడం వలన ధర్మబద్దం కానీ కామం నశిస్తుంది. ధర్మం పట్ల అనురక్తి పెరుగుతుంది. పురాణం ప్రకారం ఇది అతి సుందరమైన రూపం.

కానీ వికట అనే నామానికి భయంకరమైన, ఉగ్రమైన రూపం కలవాడనే అర్దం కూడా ఉంది. ఇది ఎలాగంటే మోక్షం పొందాలంటే దేహాత్మ భావనను దాటిపోవాలి. నేను దేహం అనుకున్నప్పుడే, స్త్రీ, పురుష మొదలైన వ్యత్యాసాలు, కాకామ, క్రోధాదులు, అందం, వికృతం ఇత్యాది భావాలు వస్తాయి. భక్తులను ఉద్ధరించడం కోసం, వారిలో హద్దులు మీరిన కామభావాలను, అధర్మ నడవడిని తొలగించుటకు, దేహాత్మభావనను దూరం చేయడానికి అత్యంత భీకర రూపంతో కనిపిస్తాడు గణపతి. అందుకని ఆయనకు వికట అనే నామం ఉంది.

ఈ జగత్తు అనేది నాటకం. అందులో అందరిది ఒక్కో పాత్ర. అది అర్దం కాక ఇందులో లీనమై సుఖదుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తాడు మానవుడు. అలా జరగకుండా, కేవలం సాక్షిగా, ఈ జన్నాటకంలో తన వంతు పాత్ర నిర్వర్తిస్తూనే ప్రేక్షకుడిగా ఈ జగత్తును దర్శింపజేసే శక్తిని అనుగ్రహించగలవాడు కనుక గణపతికి వికట అనే నామం ఉందని సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి గారు చెప్పారు.

ధూమ్రవర్ణుడు అంటే పొగ వంటి వర్ణం కలిగినవాడు. దీనికి కూడా గణేశపురాణంలో కధ ఉంది. పూర్వం అహంకారాసురుడనే రాక్షసుడు తన అహంకార ధూమ (పొగ) చేత సర్వలోకాలను ఉక్కిరివిక్కిరి చేసినప్పుడు, దేవ, ఋషి, మానవ గణాలన్నీ గణపతిని వేడుకొనగా, వారి రక్షణ కొరకు అహంకారాసురిని చేత వదలబడిన ధూమాన్ని తన తొండంతో పీలుచుకుని, పొగ వర్ణంలోకి మారిపోయాడు గణపతి. అటు తరువాత వాడిని అణిచి తన అదుపులో పెట్టుకున్నాడు. ఆ లీలను సూచిస్తుందీ నామం. ఈ నామంతో వినాయకుడిని అర్చిస్తే, అహంకారం నశిస్తుంది.

నిజానికి #గణేశారాధన ప్రధమంగా అహంకారాన్ని నశిమపజేస్తుంది. గణపతికి నచ్చని గుణాల్లో మొదటిది అహంకారం. అహంకారంతో గణపతిని పూజిస్తే ఆయన అసలు మెచ్చుకోడు. గణపతి చేతిలోని అంకుశం కూడా ఈ అహంకారాన్ని అణిచివేయడానికే ఉంది. అహం నశిస్తేనే ఆధ్యాత్మికతలో పురోగతి ఉంటుంది. లేదంటే ఎంత సాధన చేసినా వృధానే. అటువంటి అహంకారాన్ని నశింపజేయుడువాడు మన గణపతి.

ఓం గం గణపతయే నమః 

3, ఏప్రిల్ 2016, ఆదివారం

హిందూ ధర్మం - 202 (వేదంలో గోవధ ఖండన - 2)

మాంసం అంటే మనకు తెలిసిందే. కానీ మాంసం అంటే గుజ్జు అనే అర్దం కూడా వస్తుంది. సమయాన్ని, ప్రకరణాన్ని అనుసరించి అర్దం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వక్రీకరణకారులు మాంసం అనే సామాన్యమైన, వాడుకలో ఉన్న అర్దం తీసుకుని యాజ్ఞవల్క్య మహర్షి మాంసం తింటా అన్నారని ప్రచారం చేశారు.

ఇంకొన్ని ఆరోపణలను పరిశీలిద్దాం.

వక్రీకరణ - అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో గోవును వధించాలి - ఆపస్థంభ గృహసూత్రం 1/3/10
వక్రీకరణ - శ్రాద్ధ సమయంలో భోజనంలో పెట్టిన మాంసాన్ని తినను అన్న బ్రాహ్మణుడు నరకానికి వెళతాడు - వశిష్ట ధర్మసూత్రం 11/34

వాస్తవం - అక్కడ గోవు గురించి చెప్పనేలేదు. శ్రద్ధయా కురుతే ఇతి శ్రాద్ధం అని సూత్రం. శ్రాద్ధకార్మకు శ్రద్ధ ముఖ్యం. దైవకార్యాలకు మడి లేకపోయినా సర్దుకోవచ్చు కానీ శ్రాద్ధ కర్మలకు మాత్రం మడి తప్పనిసరి అని పెద్దల నిర్ణయం. మడికి అర్దం బాహ్యంలో ఉన్న వస్తువులను ముట్టుకోకపోవడం అని కాదు. మనసును, ఇంద్రియాలను అన్యమైన విషయాల మీద వెళ్ళనివ్వక, తదేక దృష్టి కలిగి ఉండడం. మడి వస్త్రం ధరించినా, మనసు అన్య విషయాల మీదకు వెళితే, ఇక ఆ మడికి అర్దంలేదు. పై సూత్రాల్లో కూడా అదే చెప్పబడింది. అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో ఇంద్రియాలను నియత్రించాలి, అదుపులో పెట్టుకోవాలి. అక్కడ గోవుకు ఇంద్రియాలనే అర్దం స్వీకరించాలి. దాన్ని వక్రీకరించి గోమాంసం తినాలని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు నికృష్టులు.

అతిధి విషయంలో కూడా అంతే. అతిధి సాక్షాత్తు భగవత్స్వరూపం. అతిధికి భోజనం సిద్ధం చేయడం దగ్గరి నుంచి చాలా శుచిగా ఉండాలి. ఆహారం వండే సమయంలో వంట చేసేవారి మనసులోని భావాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయని, అవి తిన్న వారిని ప్రభావితం చేస్తాయని ధర్మశాస్త్రం (ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలు ఇత్యాదులు) చెప్తోంది. ఆహారం సిద్ధం చేసే సమయంలో మనసు అనవసరమైన, అధార్మికమైన విషయాల మీద వెళితే అది తిన్నవారి దేహంలోకి వెళ్ళి అదే భావాలను కలిగిస్తుంది. అందుకే సాధకులకు అనేక నియమాలున్నాయి. అతిధికి భోజనం పెట్టకపోతే వచ్చే పాపం కంటే అతడి ఉపాసనకు, నిష్ఠకు, దీక్షకు భంగం కలిగిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ. అందువల్ల అతిధి విషయంలో ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ధర్మశాస్త్ర సూత్రాలు తెలియజేస్తున్నాయి.

వక్రీకరణ - కూతురి వివాహ సమయంలో ఆవులను, ఎడ్లను వధించాలి - ఋగ్వేదం 10.85.13
వాస్తవం - అసలు ఈ మంత్రం వివాహానికి సంబంధించినదే కాదు. గో హన్యతే అన్న ఒక్క పదాన్ని తీసుకుని ఇంత పెద్ద కష అల్లారు. శిశిర ఋతువు (చలికాలం) యందు సూర్యకిరణాలు బలహీనపడి మరల వసంత ఋతువులో శక్తిని పొందుతాయి అని ఆ మంత్రం చెప్తున్నది. ఇక్కడ గో అనే శబ్దానికి సూర్యకిరణాలనే అర్దం స్వీకరించాల్సి ఉండగా, నికృష్టులు ఆవును అనే అర్దాన్ని స్వీకరించారు. హన్యతే అనగా ఇక్కడ బలహీనపడుట అనే అర్దం స్వీకరించాలి. అదీగాక, వీళ్ళు పూర్తి మంత్రాన్ని అనువదించకుండా కేవలం గోహన్యతే అనే ఒక్క పదాన్నే అనువదించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ వాదనే నిజం అనుకున్నా, ఆ తర్వాతి మంత్రంలో గోవు తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్తుంది? అక్కడ గోవుకు అర్దం ఆవు అయితే వధించబడిన ఆవు తిరిగి ఎలా బ్రతికి వస్తుంది? వీటికి వక్రీకరణకారుల వద్ద సమాధానం ఉండదు.

ఇంకో విషయం ఏమిటంటే అసలు వివాహాది శుభకార్యాల్లో మాంసం పెట్టడం నిషిద్ధం. వివాహమంత్రాల్లో వేదికకు దేవతలను, ఋషులను, అనేక శక్తులను ఆహ్వానిస్తారు. అటువంటి సమయంలో శుచి ప్రధానం. అప్పుడు కేవలం శాఖాహారమే వండాలి తప్పించి, మాంసాహారం వండకూడదు. అది కొత్తగా వివాహం చేసుకున్న జంట వైవాహిక జీవితానికి కూడా మంచిది కాదు.

To be continued ..................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో