Sunday 31 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (159)



గణపతి - చంద్రుడు


చంద్రుడితణ్ణి చూసి వేళాకోళం చేసినట్లు చదువుకున్నాం. ఆ కథలో చంద్రుణ్ణి నెత్తిపై పెట్టుకున్నాడని విన్నాం. అందువల్ల అతడు ఫాలచంద్రుడయ్యడు.


ఫ కు బదులు భ కూడా వాడవచ్చు కనుక భాలచంద్రుడని వ్యవహారం. నుదిటి పై భాగాన్ని భాలం అంటారు. ఫాలమనగా సీమంత భాగము. అక్కడ చంద్రుడుంటాడు.


చంద్రుని పట్ల దయను, తప్పు క్షమించడాన్ని ఆ పదం సూచిస్తోంది. ఒకడు తప్పు చేసినా అతడు గణపతి యొక్క క్షమా గుణానికి నోచుకున్నాడు. అది భాలచంద్ర పదం యొక్క సార్ధక్యం.


గజాననుడు


ఏనుగు యొక్క గొప్ప లక్షణాలు


దీన్ని గురించి లోగడ చదువుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు చేయి యుండేచోట తుండం గల ఏకైక జంతువు ఏనుగే. ఏ జంతువైనా భగవంతునకు వీచగలదా? ఇది చేయగలదు. తుండం ఎత్తి దేవునకు నమస్కరిస్తుంది.


మిగిలిన జంతువులు మనుష్యులను తన్నగలవు. అంతేనే కాని అవి మనలను మోసుకొని వాటిపై పెట్టుకోలేవు. కాని ఏనుగు అట్టి పనులను ప్రేమతో చేస్తుంది. తన శరీరం పై పెట్టుకొని అవతలివానికి ఉన్నత స్థితిని తీసుకొని వస్తుంది కూడా. పెద్ద శరీరం, దానికి తగ్గట్లు బలం రెండూ సరిసమానంగా ఉండడం ఏనుగులో చూస్తాం. తన మార్గంలో ఎవరైనా నిలబడినా అతణ్ణి తన్నదు. తుండంతో ఎత్తి ప్రక్కన పెడుతుంది. తప్పనిసరి పరిస్థితులలో ముద్దముద్దగా చేయగలదు.

Saturday 30 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (158)

ఇటీవల క్రొత్త క్రొత్త పేర్లను పెట్టుకొంటున్నారు. చంద్రన్ అనే పదం దక్షిణ దేశంలో విరివిగా ఉండేది కాదు. రామచంద్రుణ్ణి ఆర్. చంద్రన్ అని వ్రాయడం ఉంది కొంతవరకు, రామచంద్ర, చంద్రమౌళి అనే పదాలున్నాయి చందు, చందర్ మొదలైనవి ముద్దు పేర్లు.



దక్షిణ దేశంలో ఇక సూర్యుని నామం తప్ప మిగిలిన గ్రహాలలో ఎవరి పేరు పెట్టుకోరు. అంగారకుడని, బుధుడని పెట్టుకోరు. ఎవరైనా బృహస్ృతియని పిలిస్తే తెలివి తక్కువ వాడనే అర్థంలోనే వాడతారు. శుక్రుని పేరు వినబడదు. ఇక శని మాటేమిటి? (ఇది చెప్పినప్పుడు స్వామివారు మందహాసం చేసారు). ఈ పదాన్ని ఇతరులను నిందించేటపుడు వాడతాం. ఇక రాహుకేతువులసలే ఉండరు. రాహు కేతువుల్లా పట్టుకొన్నాడని నిందార్ధంలో వాడతాం. ఒక్క సూర్యుణ్ణి పేరు పెట్టుకుంటారు. దానికి విష్ణు పదం చేరుస్తారు సూర్యనారాయణ, ఉత్తర దేశంలో రవి, ప్రభాకర, దివాకర, ఆదిత్య, మార్తాండ పదాలుంటాయి. దక్షిణ దేశంలో అట్టివాడుక ఇటీవల వచ్చింది పంచాయతనంలో సూర్యుడొకడు. శంకరులు స్థాపించిన షణ్మతాలలో సూర్యమతం ఒకటి. అదే సౌరం, సూర్యుడంటే పరమ దైవమని నమ్మే మతం కనుక అతని పేరు పెట్టుకోవడంలో ఔచిత్యం కన్పిస్తుంది. అయితే చంద్రునకా అవకాశం లేదు. కనుక బాల చంద్రన్ అనే మాట పూర్వులు వాడేవారు కాదు. ఇటీవల తెలియక వాడుతున్నారు. ఇది చంద్రున్థి ఉద్దేశించి కాదు బాలచంద్రుడంటే బాలుడైన చంద్రుడని కాదు.


ఫాలచంద్రుడంటే ఫాల భాగంపైన చంద్రుడున్నవాడు. అతడు చంద్రమౌళి చంద్రశేఖరుడే.


చంద్రుణ్ణి నెత్తిపైన ధరించినవాడంటే చటుక్కున శివుడు గుర్తుకు వస్తాడు ఇట్టి ప్రత్యేకత మరో ఇద్దరికీ ఉంది. అమ్మవారిని శ్యామలా దండకంలో కాలిదాసు, చంద్రకళావతంసే అని కీర్తించాడు. శంకరులు దానికి కొంత హాస్యాన్ని జోడించారు. ఆమె శంకరుని ఎడమ వైపు అర్ధభాగాన్ని గ్రహించడమే కాదు, మొత్తం పతినే కైవసం చేసుకుందని, చంద్రకళ ఆమె కిరీటంపై అర్ధంలో శశిచూడాలమకుటం (సౌందర్యలహరిలో 23 శ్లోకం)అన్నారు. లలితా సహస్రనామాలలో చారుచంద్రకళాధరా అని ఒక నామంలో ఈ అర్ధం ఉంది. అమ్మవారికే కాదు, ఆమె కొడుకునకూ ఈ గౌరవం దక్కింది.

Friday 29 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (158)

 

\

(గణేశ తంత్రాలు, ప్రతియుగంలోనూ విఘ్నేశ్వరునకు ఒక ప్రత్యేక నామం రూపం ఉంటాయని వర్ణించాయి. కలియుగంలో ఉన్న మూర్తికి ధూమకేతువని నిర్దేశించాయి. దానికి అనుగుణంగా బూడిద రంగుతో ఉంటాడు. రెండు చేతులతో, గుఱ్ఱపువాహనం; ఇక కృతయుగంలో రంగుజ్యోతి స్వరూపం - దశభుజాలు - వాహనం సింహం; ఇక త్రేతాయుగంలో మయూరేశ్వరుడు తెలుపు రంగు; ఆరు చేతులు - వాహనం నెమలి, ఇక ద్వాపర యుగంలో గజాననుడు - రంగు - ఎరుపు - నాల్లు చేతులు- వాహనం ఎలుక - ఆంగ్లానువాదకుడు)


భాలచంద్రుడు


ఈ పదం ఫాలచంద్రుడే. 'ఫ'కాని, 'భకాదు. ఈ రోజులలో చాలామంది బాలచంద్రుని పేరు పెట్టుకుంటారు. కాని, అర్ధం తెలియదనుకుంటాను. చిన్న చంద్రుడని అర్థంగా భావిస్తారేమో! బాలకృష్ణుడు, బాల సుబ్రహ్మణ్యుని మాదిరిగా వీరికీ పేరు, చిన్నతనంలో అనేక లీలలను ప్రదర్శించారు కనుక వచ్చింది. వాల్మీకి రామాయణంలో రాముని బాలలీలలు లేవు. దశరథుడు తన పిల్లల వివాహం గురించి భావించింది, విశ్వామిత్రుని రాక సందర్భంలోనని గుర్తించండి. అందువల్ల బాలకృష్ణుడున్నట్లు బాలరాముడు లేదు. ఇక చంద్రునకు బాలలీలలే లేవు. తదియనాడు మాత్రం సమగ్రంగా కనబడకపోవడం వల్ల బాలచంద్రుడే. కనుక అట్టి పేరును పెట్టుకొనడం శుభావహం కాదు.

Thursday 28 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (157)



గణాధ్యక్షుడు


అధ్యక్షుడనగా ముఖ్యుడనే. పర్యవేక్షించే వాడని అర్థం. Head of the Government. Head Priest అనే పదాలున్నాయి కదా ఆంగ్లంలో.


గణాధ్యక్షుడన్నా, గణపతి యన్నా గణేశుడన్నా, గణాధిపతియన్నా గణనాథుడన్నా ఒకటే.


భూత గణాలకు అధ్యక్షునిగా గణపతిని, దేవగణాలకు అధ్యక్షునిగా కుమారస్వామిని నియమించాడు శంకరుడు. అందుకే వినాయకుని గజాననం భూతగణాది సేవితం అని కీర్తిస్తాం. చిన్నవాడైన కుమారస్వామిని దేవసేనాధి పతియని పిలుస్తాం. ఈ మాటకు రెండర్ధాలున్నాయి. దేవగణాలకు అధిపతియని, దేవేంద్రుని కూతురైన దేవసేనకు పతియని. అసలు దేవగణాలను అదుపులో పెట్టడం కంటే భూతగణాలను అదుపులో పెట్టడమే కష్టం. అయితే గణపతి మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా, హాయిగా వారిని నియమించగలడు.


అందుకే దేవగణాలు, మనుష్య గణాలు, గణపతి శక్తిని, దయను బాగా గుర్తించి పూజిస్తాయి. అందువల్ల గణాధ్యక్షుడంటే అన్ని గణాలకూ అధ్యక్షుడని భావించాలి.


Wednesday 27 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (156)

వీరెక్కడో అరణ్యంలో దాగియున్నారని ధూమాసురుడు విన్నాడు. వెంటనే శస్త్రాలతో వెళ్ళాడు. అతని చేతిలోని శస్త్రం పొగయే. అతని పేరే ధూమాసురుడు కదా! అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అందుండి బాగా పొగ వస్తుందన్నమాట.



నేడు కూడా బాప్ప వాయువులను ప్రయోగిస్తూ ఉంటారు. మనుష్యులను చంపే రసాయనిక వాయువులను విదిలుతూ ఉంటారు. ఇట్టివే ఆనాడు మంత్రశక్తితో ప్రయోగించేవారు. గర్భిణిని చంపాలని వెడితే ఆమె ఒడిలో పిల్లవాడు కన్పించాడు. అతడు విష్ణ్వంశతో బుట్టిన వినాయకుడే. అనగా సమస్త దేవతా స్వరూపుడు వినాయకుడని తెలియడం లేదా? శివుని తనయుడైన వినాయకుడు, విష్ణయంశతో పుట్టాడంటే శైవ వైష్ణవాల సంగమమే. శుక్లాంబరధరం విష్ణుం అని చదువుతాం కదా.


అతడస్త్రాన్ని ప్రయోగించగా పొగ కమ్మింది. ఆ పొగనంతటిని పిల్లవాడు ఒడిసి పట్టాడు. తన అస్త్రం పనిచేయడం లేదని అసురుడు తెల్లమొహం వేసాడు. ఒక కొత్త అస్త్రం ప్రయోగించే ఓపిక లేదు. ఆ సమయంలో మన స్వామి అతణ్ణి చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రత్యేకంగా ఒక అస్త్రం వేయకుండా అతడు ప్రయోగించిన విషవాయుపువే విడుదల చేసాడు స్వామి. అట్లా అతని సంహారమైంది.


అందువల్ల ధూమకేతువయ్యాడు. ధూమమే ధూమ్రము, ధూమ్రకేతువు కూడా.


Tuesday 26 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (155)

వినాయక పురాణాన్ని చూసాను. వినాయకునకు సంబంధించిన రెండు పురాణాలున్నాయి. ఒకటి భృగుమహర్షి చెప్పినది. కనుక భార్గవ పురాణమైంది. ముద్గలుడు చెప్పనది ముద్గలపురాణం. నేనిపుడు చెప్పేది భార్గవ పురాణం నుండే.



ఈ పురాణంలో ఉపాసన కాండం, లీలా కాండమని రెండు కాండలున్నాయి. లీలా కాండంలో వినాయకుని 12 అవతారాలు వర్ణింపబడ్డాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయం. ఇందు గణేశుడొకడు, గణపతి యొకడు. ఇందు షోడశనామాలలో పేర్కొన్న వక్రతుండుడు, భాలచంద్రుడూ, గజాననుడూ విడివిడిగా అవతారాలుగా ఉన్నారు. అందులో ధూమ కేతు అవతారం గురించిన కథ ఉంది. ఎప్పుడో చదివాను. గుర్తున్నది చెబుతాను.


ధూమాసురుడనే అసురుడు ఉండేవాడు. వృత్రాసురుడు, మహాబలివంటి వారు భాగవతంలో పేర్కొన్నట్లుగా, అసురులలో భక్తి అనే లక్షణమూ ఉంది. అయితే వారిలో అసురత్వం ప్రధానంగా ఉంటుంది. ధూమాసురుడట్టివాడు. ఒక రాజు, అతనికొక భార్య ఉన్నారు. ఆ రాణి గర్భంలో విష్ణువు జన్మిస్తాడని తన మరణానికి కారకుడౌతాడని విన్నాడీ అసురుడు. అందువల్ల సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి రాత్రి వెళ్ళి ఆ రాణిని చంపుమని అన్నాడు. ఇతడు వెళ్ళి గర్భిణియైన స్త్రీని, అందునా శుభలక్షణాలు కలిగిన స్త్రీని చంపడం తప్పని గ్రహించాడు. ఆ జంటను విడదీయకూడదని భావించాడు. కనుక మంచంపై నిద్రించే వారినిద్దరిని మంచంతో బాటు మోసుకొని ఒక అరణ్యంలో విడిచి పెట్టాడు. ఇదేమి కష్టంరా బాబూ అంటూ వారిద్దరూ వినాయకుని ప్రార్ధించారు, సుఖప్రసవం జరగాలని, తిరిగి రాజ్యానికి వచ్చేటట్లు చేయమని ప్రార్థించారు.


Monday 25 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (154)

 

ధూమ్రకేతువు


ధూమమనగా పొగ. ఇది మామూలు కట్టెలను మండిస్తే వచ్చేది కదా. అయితే పొగ, సువాసనతో ఉంటే దానిని ధూపం అంటున్నాం. అనగా సాంబ్రాణి పొగ, పంచోపచారాలలో ధూపం ఒకటి. పొగను జెండాగా కలిగినవాడు ధూమకేతువు. నిప్పునుండి బైటకు వచ్చిన పొగ జెండాగా ఉంటుంది కదా. అగ్నికి ధూమ కేతువని పేరు కూడా. ధూమకేతు పదం శుభాన్ని తెలియ పర్చడానికి బదులు కీడును సూచిస్తుంది. సాధారణంగా అది తోకచుక్క కూడా కాబట్టి అది కనబడడాన్ని అశుభంగా భావిస్తారు.


(అన్ని తోకచుక్కలూ అట్లా కావని, కొన్ని మాత్రమే అని వరాహమిహిరుడు తన బృహత్సంహితలో అన్నాడు - అనువక్త)


ఈ అశుభ సూచకమైన పదం వినాయకునకు ఉందేమిటి? ఆయన మంగలమూర్తి కదా.

Sunday 24 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (153)



అమర నిఘంటువులో ఇతని నామాలు


జైనుడైన అమరసింహుడు తన నిఘంటువులో ఎనిమిది నామాలను పేర్కొన్నాడు


వినాయకో, విఘ్నరాజ, ద్వైమాతుర, గణాధిపా

అప్యేక దంత, హేరంబ, లంబోదర, గజాననాః


దీనిలోని ఆరు నామాలు, ప్రసిద్ధ షోడశనామాలలోనూ ఉన్నాయి. ఇందలి గణాధిపదం, గణాధ్యక్ష అని షోడశ నామాలలో ఉన్నదానిని తలపిస్తోంది. షోడశనామాలలో లేనిది, అమరంలో ఉన్నది, ద్వైమాతుర పదం. అనగా ఇద్దరు తల్లులు కలవాడు. పార్వతి గంగా తనయుడని.


గంగలో నున్న శరవణ సరస్సులో శివుని కంటి నుండి వెలువడిన తేజస్సునుంచగా సుబ్రమణ్య జననం. అందుచేత గంగ తిన్నగా సుబ్రహ్మణ్యుని తల్లియే. అందువల్ల అతడు గాంగేయుడే. అయితే గణపతికి గంగకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఇతని తండ్రి నెత్తిపై నుండడం వల్ల, తన తండ్రికి భార్య అవడం వల్ల వినాయకుని తల్లిగా పరిగణిస్తారు. అమరంలో మొదటి నామం వినాయకుడే అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. నిఘంటువులో ఆ మొదటి పదం ప్రాముఖ్యాన్ని సూచిస్తుందని చెప్పడానికే.


Saturday 23 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (152)

 


వి-అనే ఉపసర్గ


'వి' ఏమని చెబుతోంది? ఒక పదానికి ముందు వి అనే ఉపసర్గను చేరిస్తే పదం యొక్క అర్థం మారుతుంది. మలం అంటే 'అశుద్ధం', విమలం అంటే 'స్వచ్ఛమని', ఆ 'వి'ని శుద్ధపదం ముందుంచితే ఇంకా స్వచ్ఛమని అర్థం. పరీతం అనగా ఒక పద్ధతిలో వెళ్ళడం. విపరీతం అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడం. జయానికి, వి చేరిస్తే ప్రత్యేకమైన జయం.


శేషం అంటే మిగిలినది. మిగిలిన వాటితో కలవకుండా విడిగా ఉంటూ గొప్పదనాన్ని సూచించేదనే అర్థంలో విశేషం అంటాం. శిష్ట అనే పదం ఈ శేషనుండి వచ్చింది. వారు విశేష గుణ సంపన్నులని, శిష్టులని వాడతారు. శిష్టాచార మనే మాటను విన్నాం కదా.


రెండర్థాలలో వినాయకుడు


ఇందులో రెండు పరస్పర విరుద్ధార్థాలు వస్తాయి. చిత్రంగా లేదూ! ధవుడనగా పతి, మాధవుడనగా లక్ష్మికి పతి, విధవయనగా భర్తలేనిది. అట్లా వినాయకుడుని తన విశిష్ట నాయకుడు, విగత నాయకుడు. అనగా తనకెవ్వరూ నాయకులు లేరని, తానే అందరి కంటే గొప్ప నాయకుడని అర్థాలు వస్తాయి.


ఒక భక్తుడు, భగవంతుని దగ్గరకు వెళ్ళి నేను 'అనాథను' అన్నాడట 'నీవూ అనాథుడవే' అన్నాడట వెంటనే. 'నన్ను అనాథనంటావా' అని భగవంతుడు అన్నాడట: 'అవునయ్యా, నాకు నాథుడు లేకపోవడం వల్ల నేను అనాథ నయ్యాను, ఇక నీవు నీ కంటె పైన నాథుడు లేకపోవడం వల్ల నీవు అనాథవయ్యా'వని అన్నాడట. అట్లా వినాయకుడు కూడా.


Friday 22 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (151)



ప్రసిద్ధ నామం


ఇతని ప్రసిద్ధ నామం వినాయకుడే. ఉత్తర దేశంలో కంటే దక్షిణ దేశంలో ఈ నామం బాగా ప్రచారంలో ఉంది. ఇతని జయంతిని వినాయక చతుర్థి అంటున్నాం. ఉత్తర దేశంలో దీనిని గణేశ చతుర్థి అంటారు. దక్షిణ దేశంలో ఈ వినాయకునకు సిద్ధి వినాయకుడని, వరసిద్ధి వినాయకుడని, శ్వేత వినాయకుడనే నామాలున్నాయి.


వినాయక పదం ఉచ్చరిస్తే అతడు ప్రముఖుడని, అతని క్రింద కొందరుంటారని, వారిని నియమిస్తాడని అర్ధం వస్తుంది.


దక్షిణ దేశంలో నాయకర్ అంటే ఒక జాతి వాచకం. అందు పుట్టినవారిని అందర్నీ నాయక లని అంటారు. మహారాష్ట్రలో నాయక్ అంటే బ్రాహ్మణుడు, తంజావూర్ లో మధురలో నాయకరాజ్యం ఉండేది. వారు రాజవంశానికి చెందినవారు. కన్నడ ప్రాంతం నుండి తమిళనాడునకు ఈ నాయకర్లు. వీరినే నాయుడులని, తెలుగు దేశంలో అంటారు. వీరు శూద్రులే. నాయకుడే నాయుడు, నాయుడయింది. తమిళనాడులో ప్రసిద్ధ శివభక్తులను నాయనార్ అంటారు. ఇందు భిన్న భిన్న వర్గాలవారున్నారు. వైశ్యులను తమిళనాడులో చెట్టియార్ అంటారు. శ్రేష్టిపదం, చెట్టి అయింది. కన్నడంలో షెట్టి అయింది. పైన పేర్కొన్న వారందరూ భిన్న భిన్న వృత్తులను చేస్తూ పరస్పరం ఈర్ష్యాద్వేషాలు లేకుండా మసులుతూ ఫలానా జాతిలో పుట్టామని ఎవరికి వారే గర్విస్తూ ఉంటారు.

Thursday 21 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (150)



అట్టి పరిస్థితి రాకుండా ఉండడం కోసం విఘ్నరాజు మనకు అప్పుడపుడు విఘ్నాలను కల్గిస్తాడు. అతడు సృష్టిస్తాడంటే మనలను అన్యాయంగా బాధిస్తాడని కాదు. పూర్వ కర్మల వల్ల మనం విజయం పొందలేకపోతాం. అందువల్ల అతడు కల్పించే విఘ్నాలు మన పూర్వ కర్మల వల్ల వచ్చిన ఫలాలే. అవే నిజంగా అడ్డుకొంటున్నాయి. అవి తమంతట తామే చేస్తే మనకింకా చిక్కు లేర్పడతాయి. ఇక అట్టి ఆటంకం వల్ల మనం చేసే ప్రయత్నం అంతా వ్యర్ధమై, మనం అన్ని విధాలా ఓటమి పాలవడం గాని, లేదా అప్పుడప్పుడు విజయం సాధించడం గాని జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఓటమి పాలవుతాం. అట్టి విఘ్నాలను కలిగించే బాధ్యత, స్వామితనంతట తానే గ్రహిస్తాడు. ఎట్లా అంటే వరద వచ్చినపుడు ఒక ఆనకట్ట కట్టగా కొంతవరకూ దాని ఉద్ధృతి తగ్గి ఒక పద్ధతిలో నీటిని విడుదల చేయడం మాదిరిగా ఉంటుంది. అంటే ఆటంకాలను ఒక పద్ధతిలో నడిపిస్తాడన్నమాట. అట్లా క్రమమార్గంలో పెట్టడమే కాకుండా కొన్నిచోట్ల ఆ ప్రవాహాన్ని ఆవిరియై పోయేటట్లు చేస్తాడు కూడా. అనగా ఒక పెద్ద ఆటంకం వచ్చి మనపై విరుచుకుని పడవచ్చు. అట్టి దానిని కొద్దికొద్దిగా అనుభవించేటట్లు చేస్తాడన్నమట. అనగా పాప ఫలాలను కొద్దికొద్దిగా అందిస్తాడన్నమాట అంటే వాటిని మనం భరించగలిగేటట్లు చూస్తాడు. మొత్తం పాపకర్మ అంతా సాధ్యమైనంత త్వరలో పోవడం మంచిది కదా. నిజమే. అతడాలస్యం చేసినకొద్దీ మనం ఇంకా పాపకర్మల భారాన్ని జోడించడం లేదా? అట్టిదానిని అడ్డుకోవడం కోసం ఒక విఘ్నాన్ని కలిగిస్తాడు. అది ముందు చెడ్డదిగా కనబడవచ్చు కాని నిజం ఆలోచిస్తే అది మనకే మంచిది.  


అతని అష్టోత్తర పూజలో విఘ్నకర్త, అనగా విఘ్నాలు కలిగించేవాడని, మరొక నామం విఘ్నహర్త అనగా విఘ్నాలను పోగొట్టేవాడనీ ఉంది. ఇందులో విఘ్నరాజు ముందు వస్తాడు. తరువాత వినాయకుడు వస్తాడని అర్థం. ఇతనిలో నాయకత్వం గొప్పది. అందరు దేవతలూ నాయకులే. ఒక అసురుణ్ణి చంపి వారు నాయకులౌతారు. అయితే మిగిలిన వారికి లేని నాయకపదం ఇతనికెందుకుంది? అసుర బాధలను పోగొట్టడమే కాదు, ఆటంకాలను తొలగిస్తాడు, ఆపైన విఘ్నాలకు విఘ్నరాజై కల్గిస్తాడు కూడా. కనుక అన్నివిధాల ఇతడు నాయకుడే. వినాయకుడయ్యాడు. కనుక విఘ్న వినాయక పాదనమస్తే అంటాం.


Wednesday 20 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (149)



అయితే రెండూ ఒకే మూర్తులు ఒక్కచోటుంటే ఏమని అర్థం? విఘ్నాలు కల్గించడంలో ఒక మూర్తి అధికుడని, అప్పుడతడు విఘ్నరాజని, దానిని తొలగించినపుడు వినాయకుడని పిలువబడతాడు.


ఆటంకాలను తొలగిస్తున్నాడంటే ఆ స్వామి క్రూరుడని లెక్కబెడతామా? కాదు. అందువల్ల విఘ్నాలను కలిగించినా, తొలగించినా రెండూ పరస్పరం విరుద్ధం కావని, విరుద్ధంగా ఉన్నట్లే కన్పిస్తాయని, ఇద్దరి కృత్యాల పరమార్ధం ఒకటేనని, ఒక్కడే రెండు రూపాలను ధరించాడని గట్టిగా మనం నమ్మాలి.


అయితే విఘ్నాలను కలిగించడం అనుగ్రహం అవుతుందా? మనం దుష్టకర్మలనే మూటలను ఎన్నో జన్మలనుండి మోస్తున్నాం. స్వామియొక్క అనుగ్రహం వల్ల అతనిపట్ల కొంత భక్తిని చూపించి ఏ పని చేసినా అందేమీ ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం.


ఇట్లా ఫ్రార్థించినంత మాత్రంచే మన గత జన్మ కర్మలనంతటినీ పట్టించుకోకుండా ఇప్పుడు మనం చేసే పనులలో విజయం సాధించేటట్లు చేస్తాడా? మనపట్ల సంపూర్ణ దయను చూపి గతజన్మ కర్మలనన్నిటినీ తుడిచి వేస్తాడా? ఇట్లా చేయగలిగితే ప్రజలలో పాపం పట్ల భయపడతారా? అట్లా ఉంటే ఇక ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం ఉంటుంది. ఇక ప్రజలలో మనమే చెడ్డపనైనా చేయవచ్చు, ఒక మాటు స్వామికి పూజ చేస్తే సరిపోతుందిలే అనే భావం రాదా? మనం తప్పులు, నిరంతరం చేస్తూ ఉండడానికి బాగా అలవాటు పడిపోతాం కదా!

Monday 18 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (148)



ఇద్దరు వినాయకులు


విఘ్నరాజో వినాయకః అని కదా. విఘ్నరాజ పదం తరువాత వినాయకుడు వస్తాడు.


ఇద్దరు వినాయకులను ప్రక్కప్రక్కనే స్థాపించడమూ ఉంది. చాలాచోట్ల ఇద్దరు వినాయకులున్న వీధి అని ఉంటుంది. అందు ప్రక్కప్రక్కనే కూర్చొని యుంటారు. శివాలయాలోలనూ ఇట్లా ఉంటుంది.


ఇట్లా ప్రతిష్టించిన తరువాత మిగతా దేవతా మూర్తులుండరు. ఇట్టి గౌరవం ఒక్క మన స్వామికే. 


ఎందుకిట్లా చేస్తారు? రెండు విరుద్ధ కార్యాలు చేస్తాడు కనుక. ఒక మూర్తి విఘ్నాలను కల్గిస్తాడు. మరొక మూర్తి విఘ్నాలను పోగొడతాడు. ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కన్పిస్తారు. విఘ్నాలను కలిగించే ఈశ్వరుడని, రాజని ఆ పదాన్ని అర్ధం చేసుకోకూడదని లోగడ అన్నాను. గుర్తుందా? ఈశ్వరుడైనా, రాజైనా ఆటంకాలను తొలగిస్తాడని, అందువల్ల అట్లా అర్థం చేసుకోవాలని అన్నాను. మనం విఘ్నేశ్వరుని పూజించేటపుడు ఈ భావనతోనే ఉండాలి.

Sunday 17 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (147)



ఆటంకం వచ్చినపుడు ప్రతి క్రియ చేసి దానిని తొలగించుకొనే సమయంలో ఇంకా అనందాన్ని పొందుతాం. బాగా ఎండ మండిపోతూ ఉంటే నీడయొక్క రుచి తెలుస్తుంది. ఒక నల్లని బట్టపై తెల్లని వెండి జరీ ఉన్నపుడు చూడడానికి బాగుంటుంది. అట్లాగే ఏదైనా పని చేసినపుడు విఘ్నం వస్తే దానిని తొలగించుకోవడం వల్ల ఎక్కువ తృప్తి కల్గుతుంది.


ఇట్టి ఆనందం, భక్తి వల్ల వచ్చింది. అపుడు మనమేమనుకొంటాం స్వామిని మరిచిపోయినా, అతనికేది ఆక్కఱ లేకపోయినా మన కోరికలను తీరుస్తున్నాడని, మన చిన్నపాటి భక్తికి సంతోషిస్తున్నాడని అతని అనుగ్రహం లేకపోతే మనమొక అడుగు ముందుకు వేయలేమని, ఇది గుర్తు చేయడానికి చిన్న చిన్న ఆటంకాలు కల్గిస్తూ ఉంటాడని భావిస్తాం. కనుక అప్పుడప్పుడు మనకు బుద్ధి రావడానికి ఆటంకాలు కల్పిస్తాడు.


Saturday 16 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (146)



అప్పుడు శేనప్పాకం దగ్గర వినాయకుడికి 108 కొబ్బరి కాయలు కొడతామని మ్రొక్కుకున్నాం, ఎప్పుడో. దానిని మరిచామని గుర్తుకు వచ్చింది.


మరిచిపోయామని చెప్పడంలో అర్థం లేదనుకుంటాను. అది నిర్లక్ష్యమే. మీరిచ్చే దండలను సత్కారాలను, పూర్ణ కుంభాలను స్వీకరిస్తున్నాం కదా! ఇవేమీ మరిచిపోని వాళ్ళం. అది మరిచిపోవడమేమిటి? ఇట్లా మరిచిపోవడం తప్పని గుర్తు చేసాడు స్వామి. నాకేదైనా అయితే నాకేమీ బాధలేదు, ఏనుగుపై స్వామికి ఏదైనా జరిగితే ఎలా? ఆయనా బాధపడలేదు. ఈ పాఠం నాకే. నేనే కదా లోగడ మ్రొక్కినది.


వెంటనే కొబ్బరికాయలను కొట్టడం, ఏనుగు శాంతించడం, యాత్ర సాగడం చకచకా సాగిపోయాయి. ఇది నిజంగానే జరిగింది. ప్రత్యేక పూజలు తరువాత చేసాం. 


ఇట్లా చేయడం వల్ల స్వామికి ఉపకారం చేసినట్లా? ఆయనకేదైనా లాభం ఉందా? ఆయనెప్పుడూ ఆనంద స్వరూపుడే కదా! ఇట్టి వాటిని మన చేత చేయించి మనకు ఆనందాన్ని, పుణ్యాన్ని కల్గిస్తూ ఉంటాడు.


Friday 15 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (145)

 


స్వీయానుభవాలు


రెండు స్వీయానుభవాలను వివరిస్తాను.


మేము వెల్లూర్ వెళ్ళాం. వెల్లూర్ దగ్గర మహిమాన్వితమైన గణపతి విగ్రహాలున్నాయి. శేజ్ పాక్కం దగ్గర, పదకొండు విగ్రహాలు అలాంటివి ఉన్నాయి. వాటిని ఎవ్వరూ చెక్కలేదు. అవి స్వయంభువములు. ఏకాదశ రుద్రులని విన్నాం. కానీ ఇక్కడ ఏకాదశగణపతులున్నాయి.


పూర్వం అన్ని వినాయకుడి విగ్రహాలూ భూమిలో కప్పబడి ఉండేవి. అంటే తాను పృథ్వీతత్వానికి చెందిన వాణ్ణని తెలియజెప్పడం కోసమేమో! అట్టి క్రీడ కూడా ఆయన చేస్తాడు. మరాఠా రాజ్యానికి మంత్రియైన తుకోజీ అలాంటి మార్గం గుండా ఒక గుఱ్ఱం బండిలో వెడుతున్నాడు. ఒకచోట వచ్చేటప్పటికి బండి ఇరుసు విరిగింది. బండి ఆగిపోయింది. దిగి చూడగా అక్కడ రక్తపు మరకలు కన్పడ్డాయి. మనిషి ఎవ్వడూ కనబడడం లేదు. మర్నాడు ప్రొద్దున్న వరకూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఏమిట్రా భగవంతుడా, ఈ ఆటంకమేమిటని వినాయకుణ్ణి ప్రార్ధించి పడుకున్నాడు. స్వామి, కలలో కనబడి, ఇక్కడే నా ఏకాదశ మూర్తులు కప్పబడ్డాయి, నీ బండి చక్రాలు వాటికి తగలడం వల్ల రక్తం వచ్చింది. ఇంతవరకూ భూమిలో కప్పబడి ఉండాలని అనుకున్నాను. ఇక ప్రజల క్షేమం కోసం బయట పదాలనుకున్నా. కనుక ఒక మందిరాన్ని కట్టు, కుంభాభిషేకం చేయవలసిందని ఆజ్ఞాపించాడు. తుకోజీ ఆలయాన్ని కట్టాడు.


ఆ ప్రాంతం గుండా మేమూ వెడుతున్నాం. ఏం జరిగిందో తెలుసా చిన్నస్వామి, జయేంద్ర సరస్వతి ఏనుగు మీద కూర్చొని యున్నారు. ఏనుగు ఇక్కడకు వచ్చేటప్పటికి కదలలేదు. ఏమిటో చుట్టూ తిరుగుతోంది. దానిని శాంత పరచడానికి మావటీడు, శతవిధాల ప్రయత్నించాడు. స్వామియేమో దానిపై కూర్చున్నారు. ఏమిటా అని కంగారు పడ్డాం.

Thursday 14 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (144)



ఆటంకాలను కలిగించినా ఒక పరమ లక్ష్యంతోనే


అప్పుడప్పుడు ఆటంకాలనూ కల్గిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహారానికి శంకరుడు బయలుదేరేటపుడు ఇతణ్ణి స్మరించలేదు. అందువల్ల అతని రథపు ఇరుసు ఊడిపోయింది. దేనికోసం చేసాడు? ఎవ్వరైనా ఒక నియమాన్ని ఉల్లంఘించకూడదనే లక్ష్యంతోనే. అందరికీ ఈ నియమాన్ని నేర్పడానికే అట్లా ముందు ఆటంకాలేర్పడినా దానికి ప్రాయశ్చిత్తం చేసుకొనేవారు చివర సుఖాంతంగానే ఉంటారు. అంతా మనమే చేయగలమని విఱ్ఱవీగడం పనికిరాదనే పాఠం నేర్పడానికే. ఆటంకాలు రావడం, వెంటనే స్వామిని స్మరించడం, వాటిని తొలగించడమూ జరుగుతుంది.

Wednesday 13 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (143)

 


వికటచక్రవినాయకుడు


కాంచీపురంలో వికట చక్ర వినాయకుడున్నాడు. స్వామి, సుబ్రహ్మణ్యాలయంలో అనగా కుమార కొట్టంలో ఉంటాడు. ఈ పేరు ఎట్లా వచ్చింది? లోగడ విష్ణుని చక్రం మ్రింగివేయడం, విష్టువు గుంజీళ్ళు తీసి ఇతణ్ణి నవ్వించడం, చక్రం ఊడి పడడం మొదలైన కథను చెప్పాను కదా! అతడే ఈ వికటచక్ర వినాయకుడు.


విఘ్నరాజు


విఘ్నరాజే విఘ్నేశ్వరుడు. రాజుకంటే ఈశ్వరుడేక్కువని తలుస్తాం. ఈశ్వర శబ్దాన్ని పరికిస్తే దాని ధాతువును బట్టి రాజేమి చేస్తాడో, ఈశ్వరుడూ అదే చేస్తాడు. ఈశ్ అనగా పాలించుట. భగవంతుని నామాల చివర ఈశ్వర, రాజ, నాథ అనే పదాలుంటాయి. అన్నీ ఒకే అర్థాన్నిస్తాయి. నటరాజును నటేశుడంటాం. నటేశ్వరుడంటాం. రంగరాజుని రంగనాథుడు, రంగేశుడని పిలుస్తాం. అట్లాగే విఘ్నరాజన్నా, విఘ్నేశ్వరుడన్నా ఒక్కటే.


ఒక ప్రత్యేకాధికారం ఇతడు కలిగియున్నాడని ఈ పదం వెల్లడిస్తోంది. సృష్టికి బ్రహ్మ, రక్షణకు విష్ణువు, సంపదకు లక్ష్మి, విద్యకు సరస్వతి; ఆరోగ్యానికి ధన్వంతరి; ఇట్లా ఒక్కొక్కరికి ఒక్క శక్తి నిచ్చాడు పరమేశ్వరుడు. ఇతని పని ఏమిటి? ఆటంకాలను తొలగించే పనే. పరమేశ్వరుడే ఈ కారణం వల్ల విఘ్నరాజయ్యాడు.


అంటే ఆటంకాలను కలిగించేవాదని అర్థం చేసుకోకూడదు సుమా! ఆటంకలను మటుమాయం చేస్తాడనే అర్ధం చెప్పాలి.


Tuesday 12 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (143)



నిండైన బొజ్జతో, గజముఖంతో ఉన్న మూర్తిని చూస్తే మనకూ సంతోషం కల్గుతుంది. అతని ప్రతిమను చూచినప్పుడు అందవికారంగా, భయంకరంగా కన్పిస్తాడా? పరిశోధకుల మాట అట్లా ఉంచండి. నవ్వును పుట్టించే ఇతణ్ణి వికటరూపునిగానే భావిద్దాం.


ఇతడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు ఎడముఖం పెడముఖంగా ఉంటే ఏదో చిన్న పనిచేసి వారికి వినోదాన్ని కల్పిస్తూ ఉంటాడని లోగడ చదువుకున్నాం. కాకి రూపం ఎత్తి అగస్త్యుని కమండులువును ఒరుగునట్లు చేయడం వల్ల కావేరి నది మనకు లభించింది. బ్రహ్మచారిగా వెళ్ళి విభీషణుణ్ణి మోసగించి శ్రీరంగనాథస్వామిని కావేరీ తీరంలో ప్రతిష్ఠించునట్లు చేసాడు కదా. అతని అన్నగారైన రావణున్ని మోసగించి శివలింగాన్ని గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠించునట్లు చేసాడు కదా. ఇవి అందరికీ ఉపయోగించే చమత్కారాలు. లోక క్షేమంకోసం అట్టి వికట కృత్యాలు చేసాడు. ప్రజల పట్ల ప్రేమతోనే అట్టి చిల్లర పనులు చేసాడు. అంతా ఒక అతని లీల.


పవిత్ర ప్రదేశాలలో వికట వినాయకులు


తంజావూరులో ఒక వినాయకుడున్నాడు. అతనిని చేదు పుచ్చగింజ వినాయకుండంటారు. ఒక వర్తకుడు అక్కడికి జాజికాయల బస్తాను తెచ్చాడు. దీనికి ప్రభుత్వానికి తగిన పన్నును కట్టాలి. ఆ కేంద్రం దగ్గర దీనిలో చేదు గింజలున్నాయని బుకాయించాడు. ముందుగా చేదు గింజల బస్తాలను చూపించాడు. అయితే విఘ్నేశ్వరడూరుకుంటాడా? రాత్రికి రాత్రే జాజికాయ బస్తాలను చేదు పుచ్చ గింజల బస్తాలుగా మార్చేశాడు. కుయ్యో మొర్రో అన్నాడు వర్తకుడు. స్వామీ! వీటిని మళ్ళీ జాజికాయల బస్తాలుగా మారిస్తే ప్రభుత్వానికి పన్ను కడతానని, అపరాధపు రుసుము చెల్లిస్తానని ప్రార్థించాడు. వినాయకుడు మార్చి వేసాడు. మోదక వినాయకుడప్పటినుండి చేదు పుచ్చ గింజలు వినాయకుడయ్యాడు.

ఇట్లా వందల కొద్దీ కథలున్నాయి. తుండంతో ఎత్తి అవ్వైయార్ కైలాసాన్ని చూపించాడని ఇంతకుముందు చెప్పాను కదా

Monday 11 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (141)

వికటుడు


వికటం అంటే నవ్వు, హాస్యోక్తి, ఇతరులను నవ్వించేది. ఆ హాస్యోక్తులలో తెలివి తేటలు మిళితమై ఉంటే వానిని వికటకవియని అంటాం. ఈ పదంలోనూ ఒక మాటల గారడీ ఉంది. దీనిని చివరనుండి చదివినా వికటకవే అవుతుంది.


అయితే నిఘంటు ప్రకారం, ఆ అర్థం రాదు. హాస్యోక్తి అని లేదు. ఆపైన భయంకరమని అర్థం కూడా. అయితే వాడుకలో హాస్యోక్తి అనే అర్థంలో వాడతారు. అట్టి హాస్యానికి పూర్వపు నాటకాలలో విదూషకుడుంటే వాడు. నాటకంలో ప్రతి నాయకుడు భయంకరంగా, క్రూర కృత్యాలు చేస్తున్నట్లుగా ఉంటాడు.


పరిశోధకులేమంటారంటే ముందుగా వినాయకుడు ఉగ్రదేవతయని, భయంకర రూపుడని అతడు సౌమ్య రూపునిగా క్రమక్రమంగా తీర్చి దిద్దబడ్డాడని, అంటారు. మనకు జీవితంలో పూర్ణత్వం రావాలంటే సంతోషం . కలగాలంటే అది భక్తివల్లనే కదా. మనకు ఊగిసలాడే మనస్సు కలిగించే బాధలు పోవాలంటే భక్తివల్లనే సాధ్యం. 

Sunday 10 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (140)



ఎవరికైనా వ్రేలాడుతూ ఉన్న బొజ్జ కనిపిస్తే ఏదో తృప్తిగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు అట్లా ఉంటే ఇంక చూడముచ్చటగా ఉంటుంది. బక్కచిక్కిన పిల్లవాణ్ణి చూస్తే అట్టి తృప్తి కల్గుతుందా? శరీరానికి గుణాలకు సాధారణంగా లంకె పెడుతూ ఉంటాం. ప్రేలాడే బొజ్జ గలవాణ్ణి చూస్తే ఋజు ప్రవర్తన ఉన్నట్లు భావిస్తాం. అంతేకాదు, అతణ్ణి చూసి నవ్వుతాం కూడా. వినాయకుడట్లా సుముఖుడై మనలనూ నవ్విస్తూ ఆనందాన్ని కల్గిస్తున్నాడు. లంబోదరునిగా ఎందుకున్నాడు? మనుష్యులు నానా సమస్యలతో ఉక్కిరి బిక్కిరౌతున్నారు. ఎవరికీ వేదాంత బోధ అంటే వారి మనస్సు లగ్నం కాదు, కాసేపు నన్ను చూసుకుని బాధలను మరిచిపోతారని భావిస్తాడట.


పిల్లలకు ఈ రూపం అంటే చాలా ఇష్టం. పురందరదాసనే వాగ్గేయకారుడు సంగీత పాఠాలను పిల్లలు నేర్చుకోడానికి 'లంబోదర లకుమికర' అనే పాటను రచించాడు, లకుమికర అంటే లక్ష్మీకరుడు. అనగా సౌభాగ్యదాత.

Saturday 9 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (139)



ఇక్కడ స్వామిని గణగ్రామణి అని అన్నాడు. గ్రామణి అంటే ఒక గుంపునకు పెద్ద, గ్రామానికి అధిపతి గ్రామణి. శివగణాలకు పెద్ద అగుటచే గణపతి గణేశ - గణాధిప - గణనాయక - అనే పదాలను తలపింపచేస్తోంది. ఇక్కడ ఉన్న గ్రామణి శబ్దం.


అతడు గణ గ్రామణియైనా, గణాలతో చుట్టబడియున్న అతనికెవ్వరూ విసరనవసరం లేదు. తన చెవులను తానే ఆడిస్తున్నాడు. అందువల్ల చామర కర్ణుడయ్యాడు.


మూషిక వాహన మోదక హస్త చామరకర్ణః 


అతడు గజకర్ణకుడవడం వల్ల అతడు విసురు కొనగలడు. అతడే కారణం సాధనం, కర్త కూడా.


లంబోదర: ప్రేలాడే ఉదరం కలవాడు లంబోదరుడు. పెద్ద కడుపున్నవాడు విదేశీయులితనిని Pot-bellied God అని పిలుస్తారు. చేతిలో మోదకం, అందు పూర్ణం ఉంటాయి. ఆ పూర్ణం అతని పూర్ణత్వాన్ని సూచిస్తుంది. విశ్వంలోని గ్రహాలు గుండ్రంగానే ఉంటాయి కదా.


మోదకం, అందులో తీపి పదార్థం దానిపై పిండి తొడుగూ ఉంటుంది. మోదకమంటే సంతోషమని, సంతోషాన్నిచ్చేదని. అతడు సంతోషంతో ఉంటాడు. సంతోషాన్ని కల్గిస్తాడు కూడా. ఆ తీపియే అతని ప్రేమను సూచిస్తుంది. గుండ్రని బొజ్జతో ఉండి తనలో ప్రేమ అనే తీపి పదార్థం ఉన్నట్లు కన్పిస్తాడు. పూర్ణమని ఎప్పుడైతే అన్నామో దానికి మొదట, తుద - అంటూ ప్రస్తావించం. అందుకే బ్రహ్మమును పూర్ణుడని అంటాం. ఇతడూ పూర్ణుడే.


Friday 8 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (138)



రాఘవ చైతన్యుడనే ఒకాయన, మహా గణపతి స్తోత్రం వ్రాసేరు. అందు మంత్ర శాస్త్ర రహస్యాలే కాదు, కవిత్వపు సొగసులూ ఉన్నాయి. అతడు చెవులనాడించడం, తుమ్మెదలను గెంటివేస్తూన్నట్లు ఆటలాడుకోవడాన్ని వర్ణించాడు.


తానా మోదవినోదలుబ్ధ మధుపప్రోత్పారణావిర్భావతః  

కర్ణాందోళనభేలనో విజయతే దేవోగణ గ్రామణీ


చెక్కిళ్ళపై మదం కారేటపుడు వచ్చే సుగంధాన్ని తానామోదం అంటారు. ఆ సువాసనకు తుమ్మెదలు మూగాయి. ఆ మదాన్ని త్రాగాలని అనుకున్నాయి. లోభంతో ఉన్నాయి. 'లుబ్ధమధుప'. లేదా ఆ సుగంధాన్ని ఆస్వాదించడంలో తమను తామే మరిచిపోయాయి. 


స్వామి వాటిని తరమాలని అనుకున్నాడు. అనగా ప్రోత్సారణం. అందుండి ఒక ఆట పుట్టింది. అనగా ఖేలనం. ఏమిటా క్రీడ? కర్నాందోళన ఖేలనం, అంటే చెవులను అటూ ఇటూ కదపడం. ఆ ఊపు ఆందోళన స్వామిని ఊయెలలో పెట్టి అటూ ఇటూ ఊపుతూ ఉంటారు. అదే డోలోత్సవం.


తుమ్మెదలను తరిమే స్వామి ఇంకా అందంగా ఉన్నాడట. బాగా ప్రకాశిస్తున్నాడట. 'విజయతే' గెలిచిన వాని మాదిరిగా నాయకునిగా ఉన్నాడట. మూగే తుమ్మెదలను గెంటివేసి గెలిచాడు కదా.

Thursday 7 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (137)



ఏనుగు చెవులను అట్లా త్రిప్పడం ఊరకే కాదు. దానికి ఒక లక్ష్యం ఉంది. దీనినుంచి ఒక్కొక్కప్పుడు మదం కారుతూ ఉంటుంది. ఆ సమయంలో చీమలు, పురుగులు మూగుతాయి. వాటిని తరమడం కోసం భగవంతుడే వీటికి చేటలంత చెవులనిచ్చాడు.


గణేశ పంచరత్నంలో శంకరులు, మదం కారుతున్న వినాయకుని కపోలాలను 'కపోల దాన వారణం' అని వర్ణించారు. 


అతని చెక్కిలినుండి కారే మద జలం సంతోషం వల్ల, దయవల్ల కూడా. అది మధురంగా ఉంటుంది. దీని రుచి కోసం తుమ్మెదలు మూగుతాయి. ఈ మాటను శంకరులు ఇలా అన్నారు. గలత్ దానగండం మిలత్ భృంగషండం 


ఆ తుమ్మెదను కోపంతో తరుముతున్నాడా? ఆ పిల్ల దేవతకు ఇది కూడా ఆటయే. తుమ్మెదలు వచ్చి ఆటలాడుకుంటున్నాయి. అసలితణ్ణి చూడడంతోనే అవి నృత్యం చేస్తాయి. అవి అట్టి మకరందాన్ని పానం చేయాలా? పిల్లల చెవులలో కూతలు కూసి మనం ఆడుకోమా? అవి ఝుంకారం చేస్తూ ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో స్వామికి తెలుసు. వాళ్ళను తరుముతున్నట్లుగా సరదాగా చెవులనాడిస్తాడు. ఆ గాలికి వెళ్ళి పోతూ ఉంటాయి. తిరిగి వస్తూ ఉంటాయి. దీని మదంపై ఆ గాలి చల్లదనాన్ని ఇతనికి కలిగిస్తుంది.

Wednesday 6 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (136)



గజ కర్ణకుడు


తరువాతి నామం ఏనుగు చెవులున్న గజకర్ణకుడు. అతణ్ణి గజముఖు డనినపుడు ఏనుగుల చెవులతో ఉంటాడు కదా! మరల చెప్పాలా?


మిగతా విగ్రహాలలో చెవులకు చుట్టూ ఉన్న నాల్గవ భాగం భుజాలవరకూ ప్రేళ్ళాదుతూ ఉంటుది. సాధారణంగా చెవులు కనబడవు. వాటికి వ్రేళ్ళాడే కుండలాలే కన్పిస్తాయి. వినాయకుడు భిన్నంగా ఉంటాడు. చెవులు విప్పుకొన్నట్లుగా, వింజామరల మాదిరిగా అతని పెద్ద తలకు అతకబడి నట్లుంటాయి.


అట్లా ఎందుకున్నట్లు? మన ప్రార్థనలను బాగా ఆలకిస్తాడని, ఆ చెవులు కనబడకపోతే ఏం ప్రయోజనం! విస్తరింపబడిన చెవుల వల్లనే నేను మీ ప్రార్థనలను వింటున్నానని చెప్పకనే చెబుతున్నాడన్నమాట.


జంతువులకు చెవులు ఒక గిన్నె మాదిరిగా ఉంటాయి. ఏనుగునకే విసన కర్రల మాదిరిగా ఉంటాయి. మిగతా జంతువులకు శబ్దం చెల్లాచెదురు గాకుండా లోపలికి పంపునట్లుగా గిన్నె మాదిరిగా ఉంటాయి. అయితే ఏనుగులకు ఆ ఇబ్బంది లేదు. అవి సూక్ష్మమైన శక్తి కలవి.


అది చెవులని అటూ ఇటూ ఆడిస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. జంతు ప్రపంచంలో ఇట్లా ఆడించగల శక్తి ఒక్క ఏనుగునకే ఉంది. పశువులు కూడా అప్పుడప్పుడు చెవులును కదిలిస్తూ ఉంటాయి. పురుగులను తోలుతూ ఉంటాయి. కాని ఏనుగు మాదిరిగా చేయలేవు. అట్లా పురుగులను తోలడానికి అవి కష్టపడవు కూడా. కాని ఏనుగు సహజంగానే త్రిప్పగలుగుతుంది. అందుకే గజాస్ఫాలన మన్నారు. గజ తాళమనీ ఉంది. తాళం అంటే తాటాకు. విసనకర్రగా ఉంటుంది. సంగీతంలో తాళం ఉంటుంది కదా! ఎవరైనా మనుషులు అట్లా చెవుల నాడించగలిగితే అది ఒక అద్భుతకృత్యమే. ఏదైనా ఎవ్వరూ చేయలేని దానిని గజకర్ణం ఉన్నా చేయలేదని అంటారు. అంటే చెవులు త్రిప్పలేడని. మనం చేయలేనిదానిని అతడు చేస్తాడు. కనుక అతనికి గజకర్ణకుడని పేరు.  

Tuesday 5 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (135)



అగస్త్యుడు, కావేరీ నదిని కమండులువులో బంధించాడు. విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి దానిని తన్ని కావేరిని ప్రవహించునట్లు చేసాడు. అగస్త్యునకు కోపం వచ్చింది. కాని తన్నినవాడు వినాయకుడని తెలిసి అతనికి భక్తుడయ్యాడు. ఇప్పుడు వాతాపి కథ చెప్పుకొందాం. వాతాపి, ఇల్వలులనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారు నరమాంసానికి అలవాటు పడ్డారు. ఇక మంత్ర పూతమైన శరీరాలు గల మహర్షుల మాంసం అంటే వారికి మరీ ఇష్టం. మోసం చేసి వారిని చంపుతూ ఉండేవారు. అందులో పెద్దవాడు, బ్రాహ్మణ వేషం వేసుకొని మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మనేవాడు. ఋషి నమ్మేవాడు. తప్పని సరియైతేనేగాని ఋషులు అతీంద్రియ శక్తిని వాడరు. వాతాపి తినే ఆహారమయ్యేవాడు. ఇక తమ్ముడు "వాతాపి బయటకు రా" అని అంటే మేకరూపం ధరించి అవతలి వాని పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆ ఋషిని తినేవారు. అగస్త్యుని దగ్గర కూడా ఆ మోసం చేద్దామనుకున్నారు. అతడు నిరంతరం వినాయకుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. అందువల్ల వారి పన్నాగాన్ని పసిగట్టేడు. వెంటనే 'వాతాపి! జీరోభవ' అన్నాడు అందువల్ల వాతాపి తిరిగి రాలేదు.


ఇతడు వినాయకుని పూజించడం వల్ల లోకానికి ఉపకారం చేసినవాడయ్యాడు. ఆ సందర్భంలో అవిర్భవించినవాడే వాతాపి గణపతి అగస్త్యుడు తిరువారూర్ వెళ్ళి అక్కడ ఈ గణపతిని ప్రతిష్టించాడు. ముత్తుస్వామి దీక్షితులు, ఈ గణపతి మీదనే వాతాపి గణపతిం భజే అనే కీర్తనను వ్రాసేరు. అంతేనే కాని తిరుచెంగట్టాన్ కుడిలో నున్న గణపతి మీద కాదని గుర్తించండి. పాటలో మూలాధార క్షేత్రం అని వస్తుంది. తిరువారూర్, పృథ్వీక్షేత్రం కనుక మూలాధారక్షేత్రమే.


Monday 4 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (134)




గజానతత్వం - అగస్త్యుడు


అగస్త్యునకు గణపతికి గట్టి సంబంధం ఉంది. ఇద్దరికీ పెద్ద బొజ్జలే, బొటన వేలంత పొట్టివాడు అగస్త్యుడు. ఇక మన స్వామి వామన రూపుడే కదా.


వామనరూప మహేశ్వర పుత్ర


విఘ్నవినాయక పాద నమస్తే


వామనరూపం అంటే గుజ్జు రూపమే కదా. ఇక అతడు వక్రతుండ మహాకాయుడు కూడా. అంటే ఒకమూల గొప్ప శరీరం కలవాడు, మరొక విధంగా అతడు వామనరూపుడు కూడా. అంటే చిన్నవాడూ ఆయనే, పెద్దవాడూ ఆయనే. అణువు ఆయనే.. మహత్తూ ఆయనే.


హంపిలో రెండు పెద్ద విఘ్నేశ్వరమూర్తులున్నాయి. ఒకటి పది అడుగులు, మరొకటి ఇరవై అడుగుల ఎత్తుతో ఉంటాయి. అయితే ఆ మూర్తుల పేర్లు ఆవగింజంత వినాయకుడు, కంది బద్దంత వినాయకుడు అని ఉంటాయి. అతడు విశ్వరూపుదని, అట్టి మూర్తిని చూపించలేమని కనుక ఈ చిన్నిమూర్తినే చూపించామని అంటారు. ఆ మాటలను (ఆవగింజ, కందిబద్ధ అని) వినయంతో అంటారు.

Sunday 3 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (133)



క్షత్రియుల పేర్ల చివర వర్మ అని ఉంటుంది. అనగా అసలర్థం కవచమని. కవచం ధరిస్తారు కనుక వర్మలయ్యారు. అంతేకాదు, దేశాన్ని; జీవితాన్ని పోగొట్టుకొనైనా రక్షిస్తారు కనుక వర్మలయ్యారు. పై వర్మలో అట్టి లక్షణం కంటె శత్రుత్వమే ప్రధానమై కన్పించింది. చాళుక్యులూ ఈ విషయంలో పల్లవులకు తక్కువ వారేమీ కాదు. పగబట్టి కాంచీపురాన్ని ధ్వంసం చేసారు. వంద సంవత్సరాల తరువాత రెండవ విక్రమాదిత్యుడు కంచిపై దండెత్తాడు. కంచిలో కైలాస నాథాలయ నిర్మాణం జరిగిన కాలమది. విక్రమాదిత్యుడు తలుచుకుంటే కంచిని, అందలి ఆలయాన్ని ధ్వంసం చేసి యుండేవాడు. కాని ఆ పని చేయలేదు. శివమంత్ర దీక్షాపరుడు. శివభక్తి వల్లనో, పోషకుడవడం వల్లనో గాని అట్టి పాడు పని చేయలేదు. అంతేకాదు, దండెత్తి తిరిగి వచ్చిన తరువాత కైలాసనాథ ఆలయ ప్రతిబింబమా అన్నట్లుగా విరూపాక్షాలయాన్ని నిర్మించాడు. తమిళ దేశం నుండి శిల్పులను ఆహ్వానించి వారిని గౌరవాదరాలతో చూసాడు.


వాతాపిని జయించిన నరసింహవర్మ దగ్గరకు వెడదాం. అతని సైన్యాధిపతి పరంజ్యోతి, మహామాత్ర అనే బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. వీళ్ళు వైదిక మార్గాన్ని విడిచిపెట్టి మిగిలిన లౌకిక వ్యవహారాలలో ఆరితేరియుండేవారు. పరంజ్యోతి, శివాలయం ఉన్న తిరుచెంగట్టాన్ కుడికి చెందినవాడు. అతనికి వినాయకుని పట్ల భక్తియుండేది. వాతాపిని జయించి తిరిగి వచ్చేటపుడు అనేక వస్తు వాహనాలతో అక్కడి గణపతిని కూడా వెంట తీసుకొని వచ్చాడు. కళింగ యుద్ధం తరువాత అశోకునిలో ఎట్టి మార్పు వచ్చిందో ఇతనిలోనూ అట్టి మార్పు కనబడింది. ఇక సైన్యాధిపత్యానికి స్వస్తి చెప్పి స్వగ్రామంలో శివభక్తితో కాలం గడిపేవాడు. వాతాపినుండి తెచ్చిన గణపతి విగ్రహాన్ని తిరుచెంగట్టాన్ కుడిలో ప్రతిష్ఠించి సిరు తొండనాయనార్ గా ప్రసిద్ధుడయ్యాడు. ఇట్లా తీసుకొని రాలేదనే అభిప్రాయమూ ఉంది. విగ్రహం యొక్క లక్షణాలను బట్టి వాతాపినుండి వచ్చిందని నిర్ధారణ చేసారు. వాతాపిలోనున్న విఘ్నేశ్వరుని పట్ల అచంచల భక్తి యుండడం వల్లనే వాతాపిని జయించగలిగాడని తిరిగి ప్రతిష్టించాడని కొందరన్నారు. అతడు కారణ మగుటచే ఇది వాతాపి గణపతి అయిందని అన్నారు. మరొక అభిప్రాయం ప్రకారం వాతాపి నుండి మూర్తిని తీసుకొని వచ్చినా మూలాధార క్షేత్రమైన తిరువారూర్ లో ప్రతిష్ఠించాడని కొందరన్నారు.


Saturday 2 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (132)



చెప్పబోవు కథలో మహేంద్రవర్మ పల్లవుడనే గొప్ప రాజుకు బద్ధ విరోధి రెండవ పులకేశి. ఈ పల్లవ రాజుకంటె ఉత్తర దేశంలోని హర్షవర్ధనుడు ఇంకా గొప్పవాడు. హర్ష శబ్దం, పులకేశి పదాన్ని తలపింపచేస్తోంది. పులకేశి హర్షుణ్ణి తరమివేసాడు. పులకేశికి కన్నడంలో అసలు నామం, ఎరాయమ్మ. రాజైనపుడు తాత పేరును గ్రహించి హర్షవర్ధనునకు బద్ద శత్రువైనాడు.


వెంట్రుకకు అలకమని సంస్కృతంలో అంటారు. యక్షరాజైన కుబేరుడు అలకేశ్వరుడు. అతని రాజధాని అలకాపురి. హృషీకేశ, పులకేశి, అలకేశన్ అనే పదాలు రోమాంచిత లక్షణాన్ని, గొప్పదనాన్ని సూచిస్తాయి.


రెండవ పులకేశి, దగ్గర బంధువుచే మోసగింపబడి రాజ్యాన్ని కోల్పోయాడు. తరువాత అమిత శక్తితో అతణ్ణి జయించి గద్దెనెక్కాడు. చాళుక్య రాజులందరిలో ప్రసిద్ధిని పొందాడు. సత్యాశ్రయుడనగా సత్యానికి ఆశ్రయుడనే బిరుదు వహించి పరిపాలించాడు. దండెత్తిన హర్షవర్ధనుని తరమివేసాడు. నర్మదకు ఉత్తరపు వైపున అతడు పరిపాలించ వలసి వచ్చింది.


ఆనాటి కాలంలో దక్షిణ దేశంలో ఒక పల్లవ రాజుండేవాడు. అతడు మహేంద్ర వర్మన్. అతడు వ్రాసిన మత్తవిలాస ప్రహసనంలో తాను మహేంద్ర విక్రమ వర్మనని వ్రాసుకున్నాడు. గొప్ప రసజ్ఞుడు. సంగీత శిల్ప పోషకుడు. అట్టివానిపై పులకేశి దండెత్తి, కోటకే అతడ్డి పరిమితమగునట్లుగా చేసాడు. అట్లా విజయం సాధించాడు.

పులకేశి చేతిలో ఓడింపబడడం అతనికి అవమానకరమైంది. పగ తీర్చుకోకుండానే కన్ను మూసాడు. అతని కొడుకు నరసింహవర్మ. అతనికే మామల్లన్ అనే బిరుదుండేది. అతడు వాతాపిపై దండెత్తి చాళుక్యుల నోడించాడు. ఆ నగరాన్నే ధ్వంసం చేసాడు.

క్షత్రియులలో మంచి లక్షణాలున్నా వారిలోని క్షాత్రగుణం, శత్రుత్వంగా మారి వారి మనస్సులను చెడగొడుతుంది.

Friday 1 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (131)



వాతాపి గణపతి - చారిత్రక వివరాలు


వాతాపి గణపతిని అగస్త్యుడు అర్చించాడు. వాతాపీయనే రాక్షసుడు మోసపూరితంగా అగస్త్యుని ఉదరంలో ప్రవేశించుట, అతడు జీర్ణం చేసుకొనుట మనకు తెలిసిందే. వాతాపి నివసించిన చోటు, చంపబడినచోటు, వాతాపి అని పిలువబడుతుంది. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో బాదామి అనే ప్రాంతమే ఇది. ఇది చాళుక్యుల రాజధాని. 


చాళుక్య సామ్రాజ్యంలో పులకేశి అనే పేరు కలవారిద్దరున్నారు. చాళుక్యుల తామర శాసనాలు సంస్కృతంలో; ఱాతి శాసనాలు కన్నడంలో ఉంటాయి. కన్నడంలో పులకేశిని పోలేకేసి అన్నారు. ఇట్లా చాలా పదాలు ప్రాంతీయ భాషలలో ఉన్నా వారు రాజులైన తరువాత వారి పేర్లు సంస్కృతీ కరింపబడతాయి. కనుక సంస్కృతంలో ఇతడు పులకేశి, చరిత్ర కారులు పుళకేశిన్ అన్నారు. పులకేశి అని సంస్కృతంలో ఉందని అట్లా ఆంగ్లంలోనూ వ్రాసేరు.


పులకేశి యనగా సంతోషంతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలు కలవాడని అర్థం. పులకాంకితుడని విన్నాం కదా. అట్లా సాహస కృత్యాలు చేసి రాజులు పులకాంకితులయ్యేవారు. ఇతరులకు గగుర్పాటును కలిగించి అనగా పులకాంకితులగునట్లుగా చేసేవారు.