Showing posts with label ఉత్తరాఖండ్ వరదలు. Show all posts
Showing posts with label ఉత్తరాఖండ్ వరదలు. Show all posts

Thursday, 4 July 2013

మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

కేధార్‌నాధ్‌లో వరదలకు ధారిదేవి ఆగ్రహమే కారణమన్న వాదనను ధారీదేవి ఆలయ పూజారి కొట్టిపారేస్తున్నారు. మనం ప్రకృతిని విధ్వంసం చేసిన ఫలితానికి ప్రకృతి వేసిన శిక్ష ఈ వరదలు, మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

అది 100 శాతం నిజం. అమ్మవారు సర్వాంతర్యామి, అంతటా ఉంది. అమ్మ లేని ప్రదేశమే లేదు. ఆది శక్తి ప్రకృతి రూపంలో చెట్లను, జంతువులను, పశువులను, పక్షులను, క్రిమికీటకాలను, మనుష్యులను నిత్యం రక్షిస్తూ, పోషిస్తూ ఉంది. ఆ ప్రకృతిలో భాగమే శిల(రాయి). అంతటా ఉన్న ఆ పరమేశ్వరిని ఆరాధించడం అందరికి సాధ్యమవ్వదు కనుక తనలోనే భాగమైన రాయిలో తననే(అమ్మవారినే) చూసి పూజించారు మన పూర్వీకులు. కానీ మనకు ఈ దృష్టి ఎప్పుడో పోయింది. ఈ రోజు మనకు తెలిసినంత వరకు అక్కడున్నది ఒక రాయి మాత్రమే. ఆ రాయి మన కోరికలు తీరుస్తుంది. అంతే! మనకు కష్టం వచ్చినప్పుడు, లేక మనకు ఏదైనా అవసరం కలిగినప్పుడు మాత్రమే మనకు అందులో శక్తి కనిపిస్తుంది.

భగవంతుడి మీద భక్తి ఉన్నది అనడానికి సంకేతం ఆయన యొక్క సృష్టిని గౌరవించడం. అంటే ప్రకృతిని రక్షించడం. కానీ ఈరోజు మన ఈ పని మాత్రం చస్తే చేయం. ఉత్తరాఖండ్‌లో కూడా అదే జరిగింది. ఉత్తారఖండ్ గ్రామదేవత ధారీ దేవి. ఉత్తరాఖండ్ మొత్తం ఆమె ఆధీనంలో ఉంటుంది. మరి అక్కడ జరిగిందేమిటి? అమ్మ 'ఇలాకాలో'అక్రమ నిర్మాణాలు చేశారు. తన బిడ్డలైన చెట్లను, అడవులను నరికేశారు. పక్షులు, జంతువుల ఆవాసాలను నాశనం చేశారు. అక్కడ యాత్రకు వెళ్ళిన భక్తులేమి తక్కువ కాదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు పడేశారు. నదుల్లో మలమూత్ర విసర్జనలు చేసి, సబ్బులు వాడి, ఉమ్మి అపవిత్రం చేశారు. ఇదంతా ధారి దేవికి జరిగిన అవమానమే కదా. అప్పటివరకు అంతటా వ్యాపించి ఉన్న ఆ దివ్యశక్తికి అపచారం చేస్తూనే ఉన్నాం. అంతిమంగా అమ్మకు ప్రతిరూపమైన విగ్రహాన్ని ప్రక్కకు తొలగించాం. తొలగించామా లేక అమ్మే పక్కకు తప్పకుందా అనేది మనం ఆలోచించాలి.

ఒకవేళ ధారిదేవి విగ్రహాన్ని తొలగించడం వల్లనే వరదలు వచ్చాయనుకుంటే మరి దేవభూమి(ఉత్తరాఖండ్)ను మనం నాశనం చేసినప్పుడు ఇంకేంత కోపం వచ్చి ఉండాలి. అక్కడ పాపభారం పెరిగింది, పర్యావరణ విధ్వంసం తారాస్థాయికి చేరింది. అందుకే వరదలు వచ్చాయి. ఇదంతా మన స్వయంకృతమే.                   

Wednesday, 3 July 2013

అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు

~ ఉత్తరాఖండ్‌లో అలకానంద నదిపైపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ, 330 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ధారీదేవి ఆలయం నీట మునుగుతుందని అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బీజేపీ నేతలు, సాధువులు, స్థానికులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి హాని జరుగుతుందన్న భయంతో పర్యావరణవేత్తలు కూడా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే పర్యావరణ విధంవసం విషయమై పర్యావరణ శాఖ సుప్రీం కోర్టులో అపిడవిట్ దాఖలు చేసింది.  

ప్రాజెక్టు నిర్మాణానికి గట్టిగా పూనుకున్న కంపెనీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని భావించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా, నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి ధారిదేవి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ తిది నిర్ణయాన్ని వాయిదా వేసింది.  

విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, గత నెల(జూన్ 16), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. విగ్రాహాన్ని ప్రవైటు సిబ్బంది సాయంతో మార్చారు.

ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బ్రస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది. ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు. వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదర్్నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచడం),
అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు.

1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు, సైన్యంతో కలిసి ప్రయత్నించారు. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరదలు కూడా ధారీదేవి ఆగ్రహం వల్లే వచ్చాయని అంటున్నారు.           

Tuesday, 2 July 2013

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్‌లో గార్హ్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు అక్కడివారు చెప్తారు.  

అలకానంద నది మధ్యలో ఒక ఉంటూ, నది యొక్క ధారను(ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు.

ధారీదేవి కాళీమాత ప్రతిరూపం, శక్తి స్వరూపిణి. చార్‌ధాం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి.  

ధారీ దేవి కేధార్‌నాధ్‌లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఉదయం బాలిక స్వరూపంలో, మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో, రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో దర్శనమిస్తూ, కేధార్‌నాధ్ క్షేత్రంలో  తిరుగుతూ ఉంటుంది.

బధ్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ధారిదేవి ఆలయం.

ఈ తల్లి యొక్క సగభాగం ఇక్కడ ధారిదేవి రూపంలో పూజింపబడుతుంటే, మిగితా సగభాగం కాళీమట్ ప్రాంతంలో కాళీ దేవి రూపంలో పూలందుకొంటున్నది.

శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన శక్తి యొక్క 108 దివ్య క్షేత్రాల్లో ఈ ధారీ దేవి కూడా ఉండడం విశేషం.

Sunday, 30 June 2013

2011లో అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

2011లో అమర్‌నాధ్ హిమ లింగం 15 రోజులు ముందుగానే కరిగిపోయింది. దాని మీద రకరకాల వాదనలు వచ్చాయి. మనం కాస్త ఆలోచిస్తే, అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

తన వద్దకు వచ్చే భక్తులు కష్టమైన కాలి బాటలోనే రావాలని అమర్‌నాధుడు చెప్పాడట. అలా వచ్చే సమయంలో పడే శారీరిక కష్టం అమరత్వం పొందడంలో ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఆధునిక మానవుడికి శరీరం మీద మమకారమో, దైవం మాట వినేదేంటన్న అహంకారమో, తీర్ధయాత్రను విహారయాత్ర చేసుకున్నాడు ఆధునిక మానవుడు. అమర్‌నాధ్ యాత్రకు హెలికాఫ్టర్లలో వెళ్ళడం ప్రారంభించాడు. ఇది శివ ఆజ్ఞకు పూర్తి వ్యతిరేకం.  

హెలికాఫ్టర్లు వాడడం వలన అవి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. శివలింగం కనిపించే ఒక నెల రోజుల్లో కొన్ని లక్షలమంది దర్శించుకుంటారు. రోజుకు కొన్ని వేలమంది ఆ గుహకు వెళ్తారు. ఇది ఆ గుహలో ఉన్న ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. వీటితోపాటు ఆధునిక మానవుడు గత 200 సంవత్సరాల నుంచి చేస్తున్న విధ్వంసకర అభివృద్ధి భూతాపానికి(గ్లోబల్ వార్మింగ్)కు కారణమై, భూతాపాన్ని విపరీతంగా పెంచేసింది. ఇవన్నీ ఆ మంచులింగం త్వరగా అంతర్ధానమయ్యేందుకు కారణంవుతున్నాయి. వీటికి కారణం మనమే కదా.

అమర్‌నాధ్‌కు తీర్ధయాత్రకు వెళ్తున్నాం అనే భావనతోనే వెళ్ళండి. అమర్‌నాధ్‌ను విహారయాత్ర చేయకండి. సంప్రదాయపద్దతిలో కాలినడక ద్వారా పహల్‌గాం నుంచే యాత్రను ప్రారంభించండి. పర్యావరాణాన్ని రక్షించండి. శివానుగ్రహాన్ని పొందండి.

ఓం నమః శివాయ  

Saturday, 29 June 2013

అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి మీద మనిషి చేసిన దాడి చిన్నదేం కాదు. కొండల మీద హోటళ్ళు, రిసార్టులు నిర్మించారు. అత్యాశకు పోయి కొండల పైకి నిర్మాణాలను పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో కొండరాళ్ళను బద్దలు చేశారు. ఫలితంగా కొండలు బీటలు బారాయి. కొండలను తొలగించగా మిగిలేది మట్టే. మట్టి కొట్టుకుపోకుండా చెట్లు ఆపుతాయి. వాటిని కూడా ఇష్టానుసారం నరికేశారు. ఫలితంగా అక్కడ కురిసిన భారీవర్షాలకు అటు కొండచరియలు విరిగిపడ్డాయి. మట్టి కొట్టుకుపోయి నది ప్రవాహంలో కలిసింది.

జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టే సమయంలోనూ, గనుల తవ్వకాల్లో సమయంలో వచ్చిన మట్టిని తరలించడం కష్టమని నదీ గర్భంలో పడేశారు. నదీగర్భంలో ఉన్న ఇసుకను ఇసుకను ఇసుక మాఫియా దోచుకుంది. పర్యావరణానికి ప్రమాదం అని తెలిసినా నదీగర్భంలో ఉన్న ఇసుకను మొత్తం అక్రమంగా తరలించారు. ఆఖరికి నదీగర్భంలో సహజంగా ఉండే రాళ్ళను కూడా స్టోన్ క్రషర్‌లతో విరగ్గొట్టి తరలిచారు. ఒక్క ఉత్తారఖండ్‌లోనే భగీరథి నది వెంట నదిగర్భంలో అక్రమంగా 141 స్టోన్ క్రషర్‌లు ఉన్నాయి.

ఇసుక పొరలన్నీ తీసివేయగ మిగిలేది మట్టే. ఇసుక నీటి ప్రవహాన్ని తట్టుకుని నిలబడుతుంది. కానీ మట్టికి ఆ బలం లేదు. బురదగా మారి నీటి ప్రవహాంలో కొట్టుకుపోతుంది. అక్కడ అదే జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో నదీగర్భంలో పడవేసిన రాళ్ళు, మట్టి, నదీగర్భంలో ఉన్న మట్టి ఇవన్నీ ఒక్కసారిగా వచ్చిన వరద ఉదృతికి కొట్టుకువచ్చాయి. భయంకరమైన ఉత్పాతాన్ని సృష్టించాయి. ఎన్నో ఇళ్ళు, గ్రామాలు, హోటళ్ళు బురదతో నిండిపోయాయి. వరదలో కొట్టుకువచ్చిన బండరాళ్ళు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి.

ఇవన్నీ మానవుడు ఆ ప్రాంతంలో చేసిన చర్యలకు ప్రతిఫలాలు. ఉత్తారఖండ్‌లో నదుల మీద జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా స్వామి నిగమానంద 19 ఫిబ్రవరి 2011 నుంచి 14 జూన్ వరకు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?
          

Friday, 28 June 2013

ఉత్తరాఖండ్ వరదలు అనేక కొత్త విషయాలను బట్టబయలు చేస్తున్నాయి, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ వరదలు అనేక కొత్త విషయాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కోకపొతే మరో మహా విపత్తు సంభవించి తీరుతుందంటూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

కేధార్‌నాధ్, భధ్రీనాధ్, గంగోత్రి, యమునోత్రి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నాయి.  సుమారు 250 మిల్లియన్ సంవత్సరాల క్రితం,  భూపొరల్లో కలిగిన మార్పుల కారణంగా  Indo-Australian Plate,  Eurasian Plateను బలంగా ఢీకోట్టింది. అప్పుడు హిమాలయాల ప్రాంతంలో ఒక సముద్రం ఉండేది. కాలక్రమంలో ఇక్కడి  Tectonic Platesలో మార్పులు సంభవించి, భూభాగం పైకి జరగడం మొదలై హిమాలయాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో అతి చిన్న వయసున్న పర్వతాలు హిమాలయలే. ఇప్పటికి హిమాలయపర్వతాల కింద నిత్యం  మధ్య పెద్దసంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. రెండు పెద్ద మదమెక్కిన పొట్టేల్ల మధ్య జరిగే సంఘర్షణను పోలిన సంఘర్షణ వాటి కింది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే ప్రపంచంలో ఎత్తైన హిమాలయ పర్వతాలు ప్రతి ఏటా 2 సెంటిమీటర్లు పైకి జరిగి మరింత ఎత్తు ఎదుగుతున్నాయి.

ఈ హిమాలయ పర్వత ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇవి మొదటి స్థానంలో ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి.

ఇక్కడ భూగర్భంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అక్కడ ఎటువంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. అక్కడ భూమి మీద అధిక భారం వేయకూడదు అంటున్నారు Geologists. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్నదేంటి?...................... కేధార్‌నధ్‌లో ఎటువంటు అనుమతులు లేకుండా 4-7 అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారు. అతి సున్నితమైన ప్రాంతంలో జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం, గనుల తవ్వకాలు చేస్తున్నారు. కొండలు తొలిచేస్తున్నారు. బాంబులు పెట్టి పేల్చివేస్తున్నారు. ఏవైతే అక్కడ జరగకూడదో అవన్నీ అక్కడ విపరితంగా చేస్తున్నారు. ఇవన్నీ ఆ ప్రాంతపు భూపొరల మీద అత్యధిక ఒత్తిడి సృష్టిస్తున్నాయి.

ఈరోజు వరదల వల్లనే కొన్ని వేలమంది మరణించారు. ఒకవేళ ఇప్పటికి ఆ ప్రాంతంలో నిర్మాణాలను నిషేదించకపోతే భవష్యత్తులో సంభవించే భూకంపం ఎంత మందిని పొట్టనబెట్టుకుంటుంది? ఎంత మంది సజీవసమాధి అయిపోతారు. పవిత్రమైన చార్‌ధాం కూడా భూగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు? అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడే మనలో మార్పు రావాలి. మనమే ఒకసారి ఆలోచించాలి.                

Thursday, 27 June 2013

భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

బాగా వర్షాలు పడినప్పుడు, వానాకాలంలో ప్రతి నదికి సహజంగానే వరదలు వస్తాయి. ఈ ఏడాది కూడా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

భగీరథీ జన్మస్థానమైన గోముఖ్ నుంచి ఉత్తరకాశి వరకు గల 135 కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతం(eco-sensitive zone)
గా గుర్తిస్తూ గత ఏడాది 18 డిసెంబరు 2012 న కేంద్ర అటవి, పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 కింద ఉత్తర్వులు జారి చేసింది. దీని ప్రకారం ఆ ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించింది.  

ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న 1,734 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులు, హోటళ్ళు, రిసార్టులు మొదలైన నిర్మాణాలను, మూసివేయాల్సి ఉంటుంది(నిజానికి ఇవన్నీ పర్యావరణానికి వ్యతిరేకంగా నిర్మించినవే). ఇది ఆ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాదించింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్షాలు కలిసి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఉత్తర్వులను రద్దు చేయాలంటూ గత నెలలో ఈ తీర్మానం తీసుకుని ఉత్తారఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగణ ప్రధానిని కలవడం జరిగింది.

ఇది ఒక్కటే కాదు, అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నదీ గర్భంలో కూడా నిర్మాణాలు చేపట్టారు. ఓట్ల కోసం తాపత్రయపడే ప్రభుత్వాలు, పార్టీలు ఆ అక్రమ నిర్మాణాలను సక్రమం చేశారు. విచ్చిలవిడిగా నదిలో నిర్మాణాలను చేశారు. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు.

ఎంత వర్షం పడాలో, వరదలు వస్తే అ వరదనీరు ఏ దారిగుండా పోవాలో, ఆ వరదను ఎన్ని దారుల గుండా బయటకు పంపాలో ఇవన్నీ ప్రకృతికి తెలుసు. కానీ మనవాళ్ళే ప్రాజెక్టులు మొదలైన వాటి పేర్లు చెప్పి ప్రకృతికి ఉన్న అన్ని దారులను మూసివేశారు. పైగా నదీగర్భాన్ని కూడా ఆక్రమించారు. ఏ నదైనా తన మార్గంలో అడ్డువచ్చిన వాటిని తనలో కలిపేసుకుని ముందుకుపోతుంది.....ఇక్కడ కూడా నది తన ప్రవాహ మార్గంలో అడ్డువచ్చిన అన్నిటిని తనలో కలుపుకుంటూ ముందుకుసాగిపోయింది. అక్రమంగా నిర్మించిన హోటళ్ళూ, ఊళ్ళూ, భవనాలు, వంతెనలు అన్ని నదీ ప్రవహాంలో కొట్టుకుపోయాయి. భారి నష్టం సంభవించింది. దీనికి కారకులు ఎవరు?............మనుష్యులే.                

Wednesday, 26 June 2013

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

1) హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఒక 50ఏళ్ళ క్రితంవరకు అక్కడి జనం ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా రాగులను పండించేవారు. మార్కెట్‌లో వరికి పెరిగిన డిమాండు రీత్యా కానీ గత 40-30 సంవత్సరాల నుంచి వరి పండించడం మొదలుపెట్టారు. రాగులతో పోలిస్తే వరి వ్యవసాయానికి అధిక నీరు కావాలి. అది కూడా అందించారు. ఈ మారిన వ్యవసాయ పద్దతుల వల్ల అక్కడి భూమి పలుచబడింది. తన సహజ శక్తిని కోల్పోయింది.

2) ఒక 50 సంవత్సరాల క్రితం వరకు కేధార్‌నాధ్, బధ్రీనాధ్ వెళ్ళే యాత్రికులు అతి తక్కువగా ఉండేవారు. కానీ, ఈ మధ్య కాలంలో టూరిస్ట్ సంస్థల ప్రచారం వలన ప్రతి ఏడాది లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. ఇంత మంది జనం వెళ్ళడానికి కొండల వెంబడి రోడ్లు వేశారు. అది అసహజ రీతిలో, పర్వతాలను పేల్చివేసి, ప్రకృతికి విరుద్ధంగా. కొన్ని వందల ఏళ్ళ నుంచి మానవ సంచారం లేని ప్రాంతంలోకి కేవలం ఒక 6 నెలల వ్యవధిలో లక్షలమంది వెళ్ళడం, వారి ప్రయాణం కోసం రోడ్లు వేయడం, వాహన శబ్దాలు, వాటి తరంగాలు ఇవన్నీ ఆ ప్రాంతపు భూభాగంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడి భూమిని పలుచుబరిచాయి.

3) వీటికి తోడు అక్కడ జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కొండలను పేల్చివేశారు. అడవులను, చెట్లను నరికేశారు. చెట్లు మట్టి కొట్టుకుపోకుండా ఆపి భూసారాన్ని కాపాడుతాయి. చెట్లు, అడవుల నరికివేత వలన భూమి కోతకు గురైంది. మట్టి కోట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో భూమి తన శక్తిని కోల్పోయింది. ఇక ఆ ప్రాంతంలో కొండలను పేల్చడం వలన, అవి అక్కడి పర్వతాల్లో అసహజమైన కదలికలను, మార్పులను తీసుకువచ్చాయి.  

ఇవన్నీ ఆ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడానికి దోహదం చేశాయి. అపార నష్టాన్ని కలిగించాయి. ఎలా చూసిన ఇవన్నీ పిచ్చిమానవుడి వెర్రి చేష్టలకు పలితాలే తప్ప ప్రకృతికి మనిషి మీద ఉన్న పగ కాదు. అసలు ప్రకృతికి మనిషి మీద పగ ఎందుకుంటుంది. మనమంతా ప్రకృతి మాత ముద్దుబిడ్డలం. మనమే ఈ విషయం మర్చిపోయి మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం.  

Tuesday, 25 June 2013

మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.

మనిషికి దురాశ పెరిగిపొయింది. ప్రకృతిని నిలువు దోపిడి చేసి సంపద పోగేయాలని చూస్తున్నాడు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని తన అదుపులో పెట్టుకునే శక్తి తనకు ఉందని చూసి పిచ్చి కలలు కంటున్నాడు. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఎత్తులువేసిన పిచ్చి మనిషి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ఉత్తరాఖండ్‌లో జరిగింది కూడా అదే.

హిమాలయ పర్వతాల్లో అనేక నదులు ఉద్భవిస్తాయి. హిమనీనదులకు వేగం ఎక్కువ. పైగా అవి ఎత్తైన పర్వతప్రాంతాల మీది నుంచి లోయలగుండా ప్రవహించడం వల్ల సహజంగానే అవి మరింత వేగంగా ప్రవహిస్తాయి. ఇది జలవిద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుందని, పైగా చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్టులతో పర్యావరణానికి మేలు చేస్తాయని అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తన ఇంధన విధానంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించింది. కానీ అందులో కొంతమాత్రం కూడా నిజం లేదు. ఇక సంపాదనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ అధిక లాభాల కోసం దేవభూమి ఉత్తరాఖండ్‌పైకి దండేత్తాయి. పుట్టగొడుగుల్లా జలవిద్యుత్ ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.  

ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో  14 నదీలోయల వెంట చిన్న, పెద్ద కలుపుకుని 220కి పైగా జలవిద్యుత్, గనుల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా కేంద్రం మరో 37 జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మరో 70 ప్రాజెక్టులు ప్రాధమిక దశలో ఉన్నాయి.

ఒక అంచనా ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా, యమున వంటీ ప్రధాన నదులతో పాటు వాటి ఉప్నదులన్నీ కలుపుకుంటే.....ప్రతి 5,6 కిలోమీటర్లకు ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని నిపుణులు అంటున్నారు.    

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అడవులు నరికేయడం, రహదారులు, పవర్‌హౌజులు, పంపిణీ లైన నిర్మాణం తదిర చర్యల వల్ల భూమి కోతకు గురైంది. ఉత్తరాఖండ్‌లో అలకానంద, భగీరథీ నదుల పొడవులో 70% వరకు ప్రాజెక్టులే ఉన్నాయి. అందువల్ల నదీ ప్రవాహం 70% మేర సొరంగాలు గుండా సాగడం లేదా రిజర్వాయర్ల రూపంలో మారిపోవడం జరిగింది. ఇవి అక్కడి ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాయి. పర్యావరణనికి, జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. అక్కడికి వాతావరణాన్ని మార్చేస్తున్నాయి.    

ఈ తరహాలో మనమూ, మన ప్రభుత్వాలు ప్రకృతి మీద చేస్తున్న దాడికి పడిన శిక్ష ఈ వరదలు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.