Friday 30 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (07)


ఆంజనేయుని ఆజ్ఞననుసరించి సముద్రం అణగియుంది. మనమేమో సంసార సాగరంలో చిక్కుకొన్నాం. సముద్రంలోని అలలు మాదిరిగా మనభావాలు అల్లకల్లోలంగా ఉంటాయి. కాని ఆంజనేయుడు మనోనిగ్రహం. కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు.


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం


అట్టి అభయాంజనేయ మూర్తిని దర్శిస్తే, ధ్యానిస్తే మన భయాలను తరుమడమే కాకుండా శాంతి సౌభాగ్యాలను అందిస్తాడు. సంసార సాగరాన్ని అల్లకల్లోలం లేకుండా చేయగలడు.


బలప్రదాత


బలహీనులకు బలాన్నిచ్చేవాడు, రామచంద్రమూర్తి, నిర్బల్ కే బల్ రామ్ అని హిందీలోని మాట. ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు రక్షించేవాడు రాముని కంటే మరెవ్వరు? ఆపదామ్ అపహర్తారం అని కీర్తిస్తాం. మనకు ముందు, వెనుక, ప్రక్కల, అన్ని వైపుల రక్షించేవాడు రాముడని కీర్తిస్తాం.


అగ్రతఃపురతశ్చైవ పార్శ్వ ఏవ మహాబలౌ.


మనలను రక్షించడానికి ధనుర్బాణాలతో రాముడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ రాముని విడువని లక్ష్మణుడున్నాడు.

ఆ కర్ణపూర్ణ తన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ

అంతటి విజయరాఘవుడు, వీర రాఘవుడు తాను సాధించినది హనుమ వల్లనే అని లోకానికి చూపిస్తాడు.

రాముడు మానవునిలా ప్రవర్తించాడు. రావణుడు, సీతనెక్కడ దాచాడో తెలియనట్లే ప్రవర్తించాడు. మానవునిగా నుండి దుఃఖంలో మునిగియుండగా హనుమ, సీతను వెదికి, రామునకు ఉత్సాహాన్ని, బలాన్ని కల్గించాడు.

సీతనుండి కేవలం వియోగం కంటే వియోగబాధ, కొన్నివేల రెట్లు ఎక్కువగా అనుభవించాడు. తన ప్రక్క లేకుండా ఆమె ఎట్టి కష్టాలను అనుభవిస్తోందో అని బాధపడ్డాడు. ఆమెకు అదనంగా మరొక బాధ ఉంది. అది రావణుని చెరలో ఉండుటయే. స్త్రీని అబలయని అంటారు. మహాలక్ష్మి సీతగా అవతరించి అశోకవనంలో బాధపడింది. మామూలు స్త్రీ కంటే ఎక్కువగా బాధపడి, ఉరిపోసికొందామని భావించింది కూడా. ఆంజనేయుడు ఆమెకు ధైర్యాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని కల్గించాడు.

అతడు చేసిన ఆశ్చర్యకర సంఘటనలు ఒకటా, రెండా? అగణనీయం. అన్నిటికంటే జీవితాన్ని త్యజించాలనే సీత యొక్క శోకాన్ని పోగొట్టడం గొప్పది.

Thursday 29 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (06)



సరస్వతి, నిన్ను అనుసరిస్తానని అంది కాబట్టి ఆమె విగ్రహము, శంకరుల విగ్రహానికి వెనుక ఉండడం కూడా సబబే.


శంకరులు, నా ముందు సాక్షాత్కరించుమని ప్రార్థించడం వల్ల హనుమ ముందున్నాడు. శంకరులు హనుమత్ పంచరత్నం వ్రాసేరు. అనగా ఐదు శ్లోకాలు, రుద్రాంశ సంభూతుడు ఇక్కడ ప్రార్ధింపబడ్డాడు. ప్రశంసించిన వ్యక్తి అయిన శంకరులు, శంకరుని అవతారం. ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ వినయ మూర్తులే. ఇద్దరూ బుద్ధిమంతులైనా వినయవంతులే. శంకరులెంత వినయంతో ప్రార్థిస్తారో గమనించండి:


పురతో మమపాతు హనుమతో మూర్తి:


నాముందు ఆంజనేయస్వామి ప్రకాశించుగాక. రక్షించుగాక. కనుక శంకరులు ముందు ఈ స్వామి మూర్తి ఉండడం సబబే. అట్లా ఉంటేనే శంకరులకిష్టం.


ఆది, అంతమూ రెండూ ఒక్కటే. అద్వైత సత్యం. నేనుతో ఆరంభమై నేనుతో అంతమౌతుంది. (జీవాహంకారం నుండి మొదలై పూర్ణాహంకారంతో ముగుస్తుంది. చివర రావలసిన ఆంజనేయుడు. గురువు కంటే ముందే రావడం అద్వైతాన్ని వివరిస్తోంది. దాసోహం అని తనను తాను రామచంద్రునికి అర్పించుకొనగా సోహం స్థితికి చేరుకొన్నాడు. అనగా వాడే నేను అనే స్థితి. నేను, పరమాత్మనే అనేస్థితి. అదే అద్వైతభావం. కనుక ఆది, అంతమూ అతడే.


Wednesday 28 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (05)



ఆంజనేయుణ్ణి చివర స్మరిస్తారు కదా! కాని ఆయన విగ్రహం, శంకరుల విగ్రహం ముందు ప్రవేశంలోనే ఉందేమిటి? ఎట్లా సబబు?


ఈ ఆంజనేయస్వామి, ఏనాడో తనంతట తాను వచ్చాడు. అతని విగ్రహం క్రొత్తగా ప్రతిష్ఠింపబడలేదు. స్వామి, తరువాతనే శంకరులు అడుగుపెట్టారు.


రుద్రనమక మంత్రాన్ని ఘనలో వల్లిస్తున్నపుడు అందులో ఉన్న శంకర పదం 13 సార్లు వస్తుంది. సాధారణంగా ఈ 13 అంకెలు శ్రేష్ఠం కాదంటారు. అందరికీ సుఖాన్ని కల్గిస్తుందని అర్థం ఇచ్చే శంకర పదం 13 సార్లు వస్తుంది.


ఆంజనేయుడు రుద్రాంశతో పుట్టినవాడు. అతడెప్పుడూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని కీర్తిస్తూ ఉంటాడు. ఈ మంత్రంలోనూ 13 అక్షరాలున్నాయి. 13 అంకెను ఉత్తర ప్రాంతంలో ప్రత్యేకంగా భావించి "తేరాక్షర్" అంటారు. ఆ హనుమ, సమర్థ రామదాస స్వామిగా అవతరించినపుడు ఈ త్రయోదశాక్షరీ మంత్రాన్నే జపిస్తూ ఉండేవాడు. ఆ మంత్రబలం వల్లనే శివాజీకి మార్గదర్శకుడయ్యాడు. హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించగలిగాడు.


ఘనలో శంకరపదం 13 సార్లు వస్తుందని చెప్పాను. శంకరుల విగ్రహం ముందున్న అంజనేయస్వామి 13 అక్షరాల మంత్రాన్నే జపిస్తాడు. సబబుగా లేదా?


అట్టి ఆంజనేయప్రతిమ వెనుక ఉండకూడదు. కనుక ముందే ఉంటుంది.


ఎట్లా కనిపిస్తున్నాడు? ఒక చేతిని పైకెత్తి చేయి చాచి యుంటుంది. అది అభయహస్తం. భయపడకండని సూచిస్తుంది. అంతేకాదు. ఆగండని మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటుంది కూడా. ఒక పెద్ద సముద్రం ముందుంది కదా! రామేశ్వరంలో సముద్రం పెద్ద అలలు లేకుండా ఉంటుంది. ఆగు, ముందుకు రాకు అని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు హనుమ. వేల సంవత్సరాల నుండి అతని ఆజ్ఞను సముద్రం పాటిస్తూనే ఉంది.


కనుక అతడు సముద్రానికి అభిముఖంగా ఉంటాడు. అతనికి, సముద్రానికి మధ్యలో ఏ విగ్రహమూ ఉండదు. శంకరుల కంటే ముందు వచ్చిన వానికి అట్టి గౌరవ స్థానం ఉండడం సబబే కదా!


Tuesday 27 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (04)



సరస్వతి, ఒక షరతు పెట్టి అంగీకరించింది. నీవు వెడుతూ ఉండగా నన్ను చూడడానికి వెనుదిరిగి చూడకూడదు సుమా! ఒకవేళ చూస్తే అక్కడే ఉండిపోతానని శంకరులతో చెప్పింది.


శంకరులు ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె కూడా అనుసరించింది. ఆమె అందెల రవళి వింటూ ఉండడం వల్ల అనుసరిస్తోందని భావిస్తూ ఉండేవారు. వెనుదిరిగి చూడలేదు.


శంకరులు జ్ఞాన దృష్టిచే అన్నిటిని గ్రహించగలరు కదా! అవతార పురుషులైనా మానవ ధర్మాన్ని అనుసరించి మానవునిగానే ఒక్కొక్కప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు.


వస్తూ ఉండగా తుంగభద్రా నదీ తీరంలో శృంగేరిలో ఒక వింత జరిగింది. " కప్ప ప్రసవిస్తూ ఉండగా ఎండపడకుండా తన పడగను పాము కప్పే దృశ్యాన్ని చూసారు. పాము, కప్పను మ్రింగడం లోక సహజం. కాని ఇక్కడ సహజ శత్రుత్వం లేదు, సరికదా మిత్రత్వమూ కన్పించింది. ఇట్టి పవిత్ర ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిదని భావించారు. అందెల చప్పుడు వినబడడం లేదు. తుంగభద్రానదీ తీరం వెంట వస్తున్నారు. ఆ ఇసుక తిన్నెలలో ఆమె పాదాలు కూరుకొనిపోయి యుండవచ్చని భావించి వెను దిరిగి చూసారు. అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


నీ వెనుక వస్తానని సరస్వతి, లోగడ చెప్పింది కదా! తదనుగుణంగా ఈ రామేశ్వరంలో శంకరమంటపంలో సరస్వతీ విగ్రహం, శంకరుల విగ్రహం వెనుకనే ఉండడం పై కథను గుర్తుకుతెస్తుంది.


ఎవరైనా ఏదైనా పుస్తకం వ్రాసేటపుడు గురువందనం, తరువాత గణపతిని స్తుతి చేస్తారు. తరువాత సరస్వతీ స్తుతి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం కూడా శంకరుల వెనుక సరస్వతి యుండడానికి కారణం కావచ్చు.


Monday 26 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (03)



నిజంగా అతణ్ణి కొలిచిన వానికి, కోరదగిందంటూ ఏదీ ఉండదు. అతని వల్లనే రావణ సంహారం జరగడం, రామరాజ్య స్థాపనం జరిగింది. అతడు అర్జునుని జెండాపై ఉండడం వల్లనే యుద్ధానంతరం ధర్మరాజ్యం స్థాపింపబడింది. కొంతకాలం వెనుక మనధర్మానికి విఘాతం కలుగగా సమర్థ రామదాస స్వామి అవతరించి శివాజీ ద్వారా ధర్మస్థాపన చేయించాడు. రామదాస స్వామి ఆంజనేయుని అవతారమే. ఈనాడు, అట్టి సంకట పరిస్థితులు లేకుండా ఉండాలంటే, ధర్మ, భక్తులు వర్ధిల్లాలంటే ఆంజనేయ అనుగ్రహం కావాలి. శుద్ధమైన మనస్సుతో అతణ్ణి సేవిస్తే అన్నిటినీ ఇస్తాడు. 


సరస్వతి శంకర హనుమ విగ్రహాలు


రామేశ్వరంలోని, అగ్ని తీర్థకరై ప్రాంతంలో శంకరమంటపం ముఖ్య స్తంభం మధ్యలో ఆదిశంకరుల విగ్రహముంది. దాని వెనుక సరస్వతీ మహల్ ఉంది. అందు సరస్వతీ విగ్రహముంది.


శంకరుల వెనుక భాగంలో సరస్వతీ విగ్రహ ముండవచ్చా అని ఎవరైనా సందేహిస్తారు. దీనికి సంబంధించిన కథ ఉంది. మండన మిశ్రులతో వాదంలో శంకరులు జయించారు. బ్రహ్మ యొక్క అవతారమే మండనమిశ్రులు. అతని భార్యను కూడా ఓడించారు శంకరులు. ఆమె పేరు సరసవాణి. ఆమె సరస్వతి అవతారమే. మండనులు వెంటనే సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే ఆశ్రమ నామం స్వీకరించారు. సరసవాణి, సరస్వతిగా మారి బ్రహ్మలోకానికి వెళ్లాలనుకొంది. ఆమెను ఈ లోకంలోనే ఉంచాలని ఆమె దయవల్ల భూలోకవాసులకు విద్యాప్రకాశం కల్గుతుందని శంకరులు భావించారు. వనదుర్గా మంత్రంచే ఆమెను కదలకుండా చేసారు.


అమ్మా! నేను దేశ పర్యాటనను చేద్దామనుకుంటున్నాను, నాతో నీవు కూడా రా అని ఆమెతో అన్నారు. నిన్ను సరియైన స్థలంలో శారదాపీఠంలో స్థాపిస్తాను. తద్వారా ప్రజలను అనుగ్రహింపుమని వేడుకొన్నారు.


Sunday 25 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (02)



భక్తియుంది కదాయని ప్రపంచ వ్యవహారాలను పట్టించుకోలేదని భావించకండి. ఆర్తులను, బలహీనులను కాపాడుటలో ఇతణ్ణి మించిన వారెవ్వరూ లేరు. లోకసేవా ధురంధరుడు.


జ్ఞానం యొక్క పరకాష్ఠను, బలపరాక్రమాల అవధిని, భక్తి సామ్రాజ్య విస్తరణను, కీర్తి పతాకాలను, అపరిమిత సేవను, అగణనీయ వినయ సంపదను అన్నిటిని ఒక్కచోట చూడదలచుకొంటే స్వామినే స్మరించాలి.


అంతకంటే తన బ్రహ్మచర్యాన్ని ముందుగా పరిగణించవలసి వస్తుంది. కామవాసన అణుమాత్రం లేని అస్ఖలిత బ్రహ్మచారి. తన కోసం తానేమీ ప్రయత్నం చేయలేదు. కామరాహిత్యం, రామసేవ వల్లనే పరిపూర్ణత్వం.


హనుమాన్ అని తమిళులంటే కర్ణాకటలో హనుమంతప్పయని, ఆంధ్రప్రదేశంలో ఆంజనేయుడని, మహారాష్ట్రలో మారుతియని, ఉత్తరదేశంలో మహావీరుడని పిలుస్తారు.


ఆయనను స్మరిస్తేనే మనలో ధైర్యం పొటమరిస్తుంది. జ్ఞానోదయం, కోరికలు తీరుట, జరుగుతుంది. అతని మాదిరిగా వినయంతో భగవత్ కైంకర్యం చేద్దాం.


ఎక్కడ రామనామం వినబడినా, ఎక్కడ రామాయణ ప్రవచనమున్నా, మనకంటికి కనబడకపోయినా అక్కడ సాక్షాత్కరిస్తాడు. కథలో, నామంలో మునిగి ఆనందాశ్రువులను రాలుస్తాడు.


మిగతా లక్షణాల కంటే ఈ కాలంలో వినయం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఇంకా ఏవో కావాలని ఆరాటపడుతూ ఉంటాం. అంతం కనబడడం లేదు. మనకు వినయ సంపద ఉన్నపుడు మాత్రమే ఈశ్వరానుగ్రహం పొందగలం. అదే తృప్తిని, సంపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ సంపూర్ణ తృప్తిని ఆంజనేయుడు అనుగ్రహించుగాక.

Saturday 24 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (01)



హనుమ

ముందుమాట


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్


ఈ శ్లోకాన్ని బట్టి హనుమానుణ్ణి స్మరించే భక్తులపై అతడెట్టి అనుగ్రహం చూపిస్తాడో తెలుస్తుంది. బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, ఆరోగ్యాన్ని, జడత్వం లేకపోవడాన్ని, వాక్పటుత్వాన్ని ప్రసాదిస్తాడని అర్థం.


ఇట్లా అన్ని గుణాలూ ఒక్కనిలో ఉండవు. ఎంత బుద్ధిమంతునకైనా ఏదో లోటుంటుంది. బలవంతుడు, మూర్ఖుడు కావచ్చు. పై రెండు ఉన్నా పిరికివాడు కావచ్చు, భయపడవచ్చు. ఎంత సామర్ధ్యమున్నా చురుకుగా ఉండకపోవచ్చు. సోమరి పోతుగా ఉండవచ్చు. పండితుడైనా కొందరికి వక్తృత్వం ఉండకపోవచ్చు. కాని అన్ని సలక్షణాలను ప్రసాదించేది ఆంజనేయ స్వామియే.


సాధారణంగా మనుష్యులలో అన్నీ ఉండకపోయినా విరుద్ధ భావాలుంటాయి కూడా. బలవంతునకు బుద్ధి సంపదలేక పోయినా, బుద్ధిమంతునకు అహంకారంలేని భక్తి లేకపోయినా రాణించదు. కాని ఆంజనేయునిలో అన్ని లక్షణాలున్నాయి. అతడెన్ని విధాల బలవంతుడైనా తనకున్న శక్తి, రాముడనుగ్రహించినదే అని వినయం చూపిస్తూ ఎల్లపుడూ రామదాసుగానే ఉండాలని భావిస్తాడు. సేవకునిగా ఉంటే అతనిలో సంపూర్ణత్వం ఉంది. ఎవరికైనా భక్తియున్నా అది ఎందుకో స్పష్టంగా లేకుండా అనగా జ్ఞానసహితమైనది కాకుండా మూఢభక్తితో ఉంటారు. ఇక అట్టివారు భక్తి జ్ఞానాలు ఒకదానితో ఒకటి పడవనీ భావిస్తారు. రామునకెంత భక్తుడో అంతటి సుజ్ఞాని. వైదేహీ సహితం.... సనకాది ఋషులకు దక్షిణామూర్తి ఉపదేశించినట్లు ఆంజనేయునకు రాముడు తత్త్వోపదేశం చేసాడు. అర్జునుని కేతనం మీద ఉంటూ కృష్ణుడు చెప్పిన గీతను అర్జునునితో బాటు విన్నాడు. పైశాచీ భాషలో ఒక గీతా వ్యాఖ్యానం ఉందని, తత్వంతో నిండియుంటుందని దానిని ఆంజనేయుడే వ్రాసాడని అంటారు. రాముడే మొట్టమొదట సమావేశంలో ఇతణ్ణి నవవ్యాకరణ వేత్తయని కొనియాడాడు. అతడెంత బుద్ధిమంతుడైనా, పండితుడైనా, వినయభరితుడై భక్తి ఇచ్చే ఆనందంలో మునిగియుండేవాడు. 


Friday 23 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (241)



తమ తమ మనఃప్రవృత్తులకు, ప్రీతికి అనుగుణంగా ఒక్కొక్క దేవతా మూర్తిని ఇష్టపడుతూ ఉంటారు. ఒక పిల్లవాడు, తల్లిని సమీపించినట్లుగా ఒక భక్తుడు అమ్మవారిగా చింతిస్తాడు. పరమశాంతి కావాలని కోరుకొనేవాడు దక్షిణామూర్తిని ధ్యానిస్తాడు. నృత్యగీతాలతో దేవుడిని సంతృప్తి పరచాలని ఒకడు భావిస్తే అతడిని కృష్ణునిగా కొలుస్తాడు. కనుక తమ ఇష్టాన్ని అనుసరించి ఒక మహాశక్తిని ఒక్కొక్కమూర్తిలో భావిస్తాడు. ఆ మూర్తి జీవంతో, దయతో తొడికిసలాడుతున్నట్లుగా భావిస్తాం. శుష్కమైన రూపంతో ఉన్నాడని భావించం. ఇట్లా మన మనఃప్రీతిని బట్టి ఆరాధన సాగుతోంది. అందరినీ ఒక దేవతనే పూజించండని మన మతం చెప్పదు. అందొక స్వేచ్ఛ దాగియుంది. మొదట మన ఇష్టదేవతను భజించినా మనకీ ప్రత్యేక మనఃప్రవృత్తి ఉందేమిటని ప్రశ్నించుకొని అన్నిటిని పరమాత్మగా భావించే మనఃప్రవృత్తిని ఆ మూర్తియే మనలో కల్గిస్తాడు.


మనమొక దేవతను ఇష్టపడి ఎట్లా ఆరాధిస్తున్నామో, ఇతరులు కూడా వారి వారి ఇష్టాలననుసరించి పూజిస్తున్నారు. కనుక ఇతర దేవతలు తక్కువ వారని, మన దేవతయే ఎక్కువని భావించకూడదు. మనకెట్లా మన మూర్తి కోరికలను తీరుస్తున్నాడో వారికీ వారి మూర్తులు అనుగ్రహం చూపిస్తున్నారని భావించాలి. అయితే ఒక సందేహాన్ని కొందరు వెలిబుచ్చుతూ ఉంటారు. ఏమిటనగా పురాణాలలో ఫలానా దేవత ముఖ్యుడని, ఇతర దేవతలు తక్కువ వారనీ ఉంది. ఈ దేవత చేతిలో మిగతా దేవతలు ఓడింపబడినట్లుంది కదా అని ప్రశ్నిస్తారు. దీని నెట్లా అర్థం చేసికోవాలి? సంస్కృతంలో నహినిందా న్యాయమని ఒకటుంది. 


పురాణకర్తల తాత్పర్యం, ఇతర దేవతలను నిందించడం కాదు, తానిష్టపడిన దేవతను ప్రశంసించడమే. ఎందుకిట్లా ఉంది? తానిష్టపడే మూర్తీ పట్ల అచంచల విశ్వాసం కలగడం కోసం, ఏకాగ్రత సిద్ధింప చేయడం కోసం, నిందా వాక్యాలున్నట్లు కన్పిస్తాయి. అభీష్టపడే మూర్తి శక్తిమంతుడని, అట్టి శక్తి ఇతరదేవతలకు లేదని చెప్పడం అందుకే.


పూర్వకాలంలో ప్రసిద్ధులైన వ్యక్తులు సమస్త దేవతలను ఒకే విధంగా భావించారు! కాళిదాసు, బాణుడు వంటి కవులు ఒకే మూర్తి భిన్న భిన్నంగా అవతరించిందనే వ్రాసారు.

భక్తుల మనఃప్రవృత్తులను అనుగుణంగా భిన్న భిన్న ఆకారాలలో కనపడడమే కాదు, ఆ దేవతలు చేసే పనులూ ఒక్కొక్క గుణాన్ని ఆధారంగా చేసికొని యుంటాయి. సృష్టించేటపుడు బ్రహ్మ రజోగుణాన్ని ఆధారంగా చేసికొన్నాడు. సత్త్వ గుణంతో ఉన్నపుడు విష్ణువుగా కన్పిస్తాడు. సంహరించే సమయంలో తమో గుణాన్ని శివుడు స్వీకరిస్తాడు. లేదా ఆశ్రయిస్తాడు. ఒకే ఒక శక్తి, త్రిమూర్తులుగా కన్పిస్తోందని కాళిదాస కవి అన్నాడు. ఈ ముగ్గురికీ ఏది నప్పుతుందో మిగతా దేవతామూర్తులకూ ఇదే అనువర్తిస్తుంది.


కనుక ఒక దేవత గొప్ప, ఒక దేవత తక్కువ అని కీచులాడడం తగదు. అయినా మానవ మనఃప్రవృత్తుల వికారాల వల్ల వీరశైవులూ, వీరవైష్ణవులు గత కాలంలో పోట్లాడుకొన్నారు. ఆ మహావిష్ణువు, ఆ మహాదేవుడైన శివుడు ఒక్కరే కదా.

Thursday 22 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (240)



ఇష్టదేవత


ప్రజలు భిన్నభిన్న మనః ప్రవృత్తులు కలిగియుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత, ఇష్టంగా ఉంటుంది. అందరిలోను భక్తిని, చిత్తశుద్ధిని కల్గించడం కోసం, ఏకాగ్రతను సిద్ధింపచేయడం కోసం, పరమాత్మయే భిన్న దేవతా మూర్తులను ధరించి అవతరించాడు.


ఈ హిందువులకు కోట్ల మంది దేవతలున్నారేమిటని పాశ్చాత్యులు వేళాకోళం చేస్తారు. కాని ఉన్నది ఒక్క స్వామియే అని సగటు హిందువు భావిస్తాడు. పెక్కు మంది దేవతలున్నారని భావించడు. ఉన్నది ఒక్క దేవతయే యని వైదిక మతం చెప్పడమే కాదు, జీవుడే పరమాత్మయని చెబుతుంది. ఇట్టి సిద్ధాంతాన్ని ఇతర మతాలు చెప్పవు. ఒక స్వామి, సర్వ నియామకుడని భావించని హిందువంటూ లేదు. ఆ ఒక్కడే అనేక రూపాలను ధరిస్తాడని, అతడు దయామూర్తియేయని భావిస్తాడు.


ఆ స్వామియే ఈ భరత భూమిలో భిన్న ఆకారాలలో మహాత్ములకు కన్పిస్తాడు. వారే మంత్రాలనందించారు. ప్రతి దేవతామూర్తికి ప్రత్యేక పూజా విధానాన్ని అందించారు. వారు నిర్దేశించిన మార్గంలో పయనిస్తే తమ ఇష్టదేవత యొక్క కృపకు భక్తులు నోచుకుంటారు. ఏ దేవత, ఏ ఆకారంలో ఉన్నా అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకోవడమే. అందువల్ల సందేహం లేకుండా భక్తిని అంకిత భావంతో అభ్యసిస్తూ ఉంటాం. అతడే సంసారవిముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతాం. బంధవిముక్తికి అర్హత సంపాదించేటంత వరకు మన కోరికలను స్వామి తీరుస్తాడు.


Wednesday 21 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (239)



ఊడుగు చెట్టని ఒక చెట్టుంది. పక్వంకాని పండు నేల మీద పడితే అది బ్రద్దలౌతుంది. వెంటనే అందలి గింజలు ఏదో శక్తి తీసికొని, వెళ్లినట్లుగా చెట్టు మొదట్లో చేరుతాయి. చెట్టును పట్టుకొని గింజ మాయమవుతుందట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకు చేరుతుందట. అంటే చెట్టులోనే ప్రవేశిస్తుంది. అట్లాగే భగవానుని నుండి వచ్చిన మనము అతని వైపు పయనించి అతట్టి పట్టుకొని అతనిలో ప్రవేశించాలి, ఏకం కావాలి. రెండవ ఉదాహరణ - సూది, సూదంటు ఱాయికి ఆకర్షింపబడడమే కాకుండా, చివరకు అట్టి సూదికీ ఆకర్షించే లక్షణం వస్తుంది. ఆ సూది కూడా ఇతర ఇనుప పదార్థాలను ఆకర్షించగలదు. అనగా భక్తునకు భగవల్లక్షణాలు సంక్రమిస్తాయి. శక్తి వస్తుంది. మూడవది, పతివ్రత - భర్త గురించి, పతివ్రత యొక్క సంభాషణ, పనులు, తలపులు అన్నీ భర్తను గురించే. అట్లాగే భక్తుడు తన మనస్సును, వాక్కును క్రియను భగవంతుని గురించే యుండాలని సూచిస్తున్నాడు. మూల శ్లోకంలో పతి' అని లేదు. విభుడని ఉంది. అనగా భగవంతుణ్ణి ఒక్కచోటనే ఉన్నాడని భావించకుండా అన్ని చోట్ల ఉన్నాడని (విభువని) భావించాలని సూచించారు. తరువాత లతలు. చెట్టు నుండి విడదీసినా కొంత సేపటికి లత, ఆ చెట్టును చుట్టుకొంటుంది. అట్లాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సు భావాలూ అతనివైపే ప్రసరించాలని సూచించారు. ఈశ్వరుడే లక్ష్యమన్న మాట. చివరగా నదులు - సముద్రము. ఇదే అద్వైత భావన, సముద్రం నుండే వర్షం వస్తోంది. (సూర్య కిరణాలు - ఆవిరి - మేఘంగా మారుట - వర్షం) అది నది అవుతోంది. కనుక సముద్రానికి, నదికి భేదం లేదు. నది కొండకొమ్ముపై పుట్టి సంతత గమనంతో చివరకు సముద్రాన్ని చేరుతోంది. తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. అనగా దాని ఊరు, పేరు పోగొట్టుకుంటోంది. సముద్రం ఎదురేగి స్వాగతం పల్కుతోంది. అందువల్లనే నదులు, సముద్రంలో కలిసే చోటునకు ముందుగా నది నీరు కూడా ఉప్పగా ఉంటోంది. అట్లాగే నిజమైన భక్తిని చూపిస్తే భగవానుడు దయతో చేతులు చాస్తాడు. కౌగలించుకొంటాడని సూచన.


మొట్టమొదట భక్తి, వ్యాపారధోరణిలో సాగినా, డబ్బు కీర్తి రావాలని భక్తుడు తహతహలాడినా, భగవానుని కల్యాణ గుణాలను చింతించిన కొలదీ ఏ కోరిక లేక అతణ్ణి కోరుతాం. చివరకు నిర్గుణ బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది. అతనిలో లీనమైపోతాము. అతడేయైపోతాం.


ప్రపంచ జీవితాన్ని సరిగా నడపాలన్నా, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతానుభవం రావాలన్నా భక్తి, తప్పనిసరి. మోక్ష సాధన సామగ్రిలో భక్తి శ్రేష్టమైనదని శంకరులన్నారు. అట్లా అంటూ తనను తానగుట (స్వ స్వరూపానుసంధానం) భక్తియని సెలవిచ్చారు కూడా.


మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ 

స్వ స్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే


Tuesday 20 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (238)



శంకరుల అభిప్రాయం - భక్తి లక్షణాలు


ఈశ్వరుణ్ణి భక్తితో సేవించి, ఇద్దరూ ఒక్కటే అని చింతిస్తూ, అభిన్నులని గాఢంగా భావిస్తూ ఉండే అద్వైత జ్ఞానులెందరో ఉన్నారు. మధుసూదన సరస్వతి, అప్పయ్య దీక్షితులు, సదాశివ బ్రహ్మేంద్రులు, భగవన్నామ బోధేంద్రులు మొదలైనవారు జ్ఞానులై యుండి భక్తి సామ్రాజ్యంలో ఓలలాడేవారు. నిర్గుణ బ్రహ్మమునకు, కల్యాణ గుణాలతో ఉన్న సగుణ బ్రహ్మకు భేదాన్ని చూడలేదు. మధుసూదన సరస్వతి ఇట్లా అంటారు: ఏది నిర్గుణము, ఏది నిష్కలమో దోషరహితమో దానిని యోగులు ధ్యానించనీయండి కాని నేను నీలమేఘశ్యాముడైన, యమునా నదీ సైకతాలలో విహరించే గోపాలకృష్ణుని ధ్యానిస్తాను. అన్ని రూపాలూ పరమేశ్వరుని రూపాలే, అంతా ఒక్కటే అని జ్ఞానులు భావిస్తారు. వారు జ్ఞాన నిష్ఠులైనా ఏదో ఒక మూర్తిపై మక్కువ కలిగియుంటారు. అనగా భక్తి తాత్పర్యంతో కూడి యుంటారు. చిన్నతనంలోనే వారి కట్టి ప్రీతి ఉదయించి యుండవచ్చు.


శంకరులే దేవతను నుతించినా అందరినీ బ్రహ్మముగానే భావించి స్తోత్రాలు చేసారు. శివానందలహరిలో చాలా అందంగా భక్తిని నిర్వచించారు.


అంకోలం నిజబీజసంతతి రయస్కాతోపలం సూచికా


సాధ్వీనైజవిభుం లతాక్షితిరుహం సింధుస్సంద్వల్లభం


ప్రాప్నోతీహ యథాతథా పశుపతేః పాదారవిందద్వయం


చేతో వృత్తి రు పేత్య తిష్ఠతి సదా సాభక్తి రిత్యుచ్యతే


అనగా ఊడుగు గింజలు, వాని యంతట అవే ఆ చెట్టు మొదలునెట్లు పట్టుకొంటాయో, సూదంటు ఱాయిని సూది ఎంత గట్టిగా పట్టుకొనియుంటుందో, పతివ్రత తన విభుణ్ణి ఎడబాయకుండా అనుసరిస్తూ ఉంటుందో, తీగ తనంతట తానే చెట్టును పెనవేసికొని యుంటుందో, నదులు తమంతట తామే సముద్రంలో ఎట్లా కలుస్తున్నాయో అట్లాగే మనస్సు అన్నివేళలా పరమేశ్వరుని పాదారవిందాలను పట్టుకొని అక్కడినుండి తొలగకుండా ఉండదమే భక్తియని పెద్దలంటారు.


Monday 19 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (237)



మనమేం చేస్తున్నాం? నిజరూపాన్ని విస్మరించాం. ముసుగుతో కూడియున్నాం. మనకు దగ్గరవారిని విడిచినపుడు ఎంతో బాధపడతాం. కాని స్వరూపాన్నే మనం విస్మరించడం వల్ల ఎంత బాధపడాలో ఆలోచించండి. మన నిజమైన ఆనందంలో ఎప్పుడు లీనమౌతామని తహతహలాడగలగాలి. పరమాత్మతో కూడాలనే ఆందోళన ఉన్నపుడే నిజమైన ప్రేమ పెల్లుబుకుతుంది. అట్టి ప్రేమనే భక్తియని యంటారు. 


దీనికై పూజ, ఆలయాల సందర్శనం మొదలు మొట్టమొదట సాగాలి. ప్రపంచ వ్యవహారాలలో మునిగి తేలేవారికి పరమాత్మను చింతించడానికై తప్పక ఉపకరిస్తాయి. ఇట్టి స్థితిలో స్వామి ఆలయంలోనే ఉండడు, అంతటా ఉంటాడనే భావన గాని యుండకపోవచ్చు. అతడు మూల విగ్రహంలో ఉన్నాడని ఇట్టి దశలో భావించినా తప్పులేదు. ప్రసాదం తినివేసి ఏ స్తంభాలకో చేతులను పులుముతూ ఉంటారు. అరెరె! స్వామి లోపల ఉన్నాడు, మనమీ పనిని చేస్తున్నామేమిటని భయం పుడుతుంది. కనుక దేవుడు లేదని అనడం కంటే ఆ మాత్రం భయమున్నా చాలు. అట్టి భయభక్తులే మనలను క్రమక్రమంగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. రానురాను అంతటా స్వామి ఉన్నాడనే భావన కల్గుతుంది. రానురాను అనుభవం పాకాన పడిన కొద్దీ నాది నాకిమ్ము అని అడుగుతాం. అనగా స్వస్వరూపాన్ని గుర్తించేటట్లు అనుగ్రహించుమని ప్రార్థిస్తాం. జ్ఞానాంబిక అట్టి అనుగ్రహాన్ని భక్తులపై ప్రసరించుగాక!


Sunday 18 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (236)



నాది నాకిమ్ము


ఒక భక్తుడు పూజ చేద్దామని కూర్చున్నాడు. అతనికొక సందేహం వచ్చింది. ఈశ్వరుణ్ణి ఇట్లా అడగడం మొదలు పెట్టాడు. స్వామీ! నేనేమో పూజ చేద్దామని కూర్చున్నా. అయినా ఏదో తప్పు చేస్తున్నట్లనిపించిందయ్యా! నేను నీకు ఉద్ధరణి నీళ్లతో అర్హమియ్యడమా? ముల్లోకాలను ఆక్రమించిన పాదాలకా? నేనీ వస్త్రాన్ని అర్పించడమా? దిగంబరునకు, అనగా అన్ని దిక్కులా వ్యాపించిన నిన్ను వస్త్రంతో కప్పడమా? పోనీ, నీకు సాష్టాంగ నమస్కారం చేద్దామంటే అక్కడా లోపం కన్పిస్తోందయ్యా. ఒక వైపు తిరిగి నమస్కరిస్తే మరొక వైపున కాళ్లను చూపించినట్లోతుంది. ఏ దిక్కున నీవు లేవు? ఏవో పువ్వులతో పూజ చేద్దామంటే సర్వాంతర్యామినెట్లా పూజించేది? ఎక్కడో ఒక్క చోటే ఉండవు. ఏదైనా ఫలానాది అడుగుదామంటే నేను అడుగబోయేది ఇంతకు ముందు నీకు తెలియదని అనడం వంటిదే. నా ప్రార్ధన, నీ అనంత శక్తిని శంకించినట్లే. నీవే నేనయ్యానని తెలియక, పొగడడం వల్ల నిన్ను తక్కువ చేసినటౌతుంది కదా! అంతటా ఉన్నవానిని, అన్నీ తెలిసినవానిని ఏమని, ఎంతని అడగడం ఏమిటి? నీవు సచ్చిదానందరూపుడవు. నీకంటే వేరైనది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. అయినా ఏవో లోపాలతో ఉంటున్నా. నీవూ, నేనూ ఒకటని వేదాలు చెప్పినా ఏవో లోపాలు తరుముతున్నాయి నన్ను. నేను నీవంటే భిన్నుడనే భావననను తొలగించు. తొలగించగలిగితే నీవు అన్నీయని, నీవే నేననే భావన కల్గుతుంది నాలో. అనగా అన్నీ నేననే భావన రానీ! ఏవో అవి కావాలని, ఇవి కావాలని నిన్ను అడగడం లేదు. నాది నాకిమ్ము, (స్వ స్వరూపాన్ని ప్రసాదించు) అని ప్రార్థించాలి. అందుకే సదాశివ బ్రహ్మేంద్రులు శివమానసిక పూజా స్తోత్రంలో


మహ్యందేహిచ భగవాన్


మదీయమేవ స్వరూపమానందం


అనగా సహజ రూపమైన ఆనందాన్ని ప్రసాదించుమని అన్నారు.


Saturday 17 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (235)



"సంధ్యావందన భద్రమస్తు భవతే..." అని కీర్తించాడు.


లీలాశుకుణ్ణి కృష్ణ భక్తి ఆవరించి సంధ్యావందనం, పితృతర్పణం వంటి చేయవలసిన కర్మల నుండి దూరం చేసింది. వాటికి మంగలం పలుకుతున్నాడు.


ముందుగా వైదిక కర్మలను చేసేటప్పుడు వీటికి ఫలం ఉంటుందా? ఉండదా? అనే భావం లేకుండా చేసి తీరాలి. ఇట్లా చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మురికి ఎప్పుడైతే పోయిందో భగవానుని వైపు మనస్సు మళ్లుతుంది. ఇట్టి భక్తి రెండవ మెట్టు, భక్తి పరిపక్వమైతే జ్ఞానం లభిస్తుంది. ఇది చివరి మెట్టు.


కాని మనంతటమనం కర్మ, భక్తులను విడిచి పెట్టకూడదు. పండిన పండు తొడిమ నుండి రాలేటంత వరకూ అనగా జ్ఞానోదయ పర్యంతమూ వీటిని మానరాదు. ఆ భక్తి, కర్మలు వాటంతట అవే మనలను విడిచిపెట్టేయాలి.


భక్తిని విడిచి ముక్తికై సాధన చేయకూడదు కూడా. భక్తిని అనుసరిస్తే అదే మార్గాన్ని చూపిస్తుంది. ముక్తికి బాటలు వేస్తుంది. కనుక ముక్తికి ఆరాటపడడానికి ముందు భక్తినే ఆశ్రయించాలి. భక్తినిమ్మని ప్రార్ధించాలి కూడా, భక్తి మార్గంలో పయనిస్తున్న కొద్దీ ముక్తి అదే వస్తుందనే పై గోపాలకృష్ణ భాగవతార్ గారి మాటలు శిరోధార్యం.


Friday 16 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (234)



ముక్తికై అన్వేషించే వానిని ముముక్షువని అంటాం. ఈ స్థితి భక్తివల్లనే అతనికి కొద్దికాలంలో ముక్త స్థితి రాబోతుంది. అట్టి పరిస్థితిలో ఒక ధర్మసంకటానికి లోనౌతాడు. అది కన్యాదానం చేసే తండ్రి స్టితి వంటిది. తండ్రి వివాహ ప్రయత్నాలు చేసినట్లుగా ముక్తికై ధర్మకృత్యాలను లోగడ చేసాడు. భక్తి మార్గాన్ని అనుసరించాడు. దానివల్ల చిత్త శుద్ధి ఏర్పడింది. ఇక పరమాత్మలో లీనమయ్యే స్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అతని మనస్సు లీనమైందో ఇక భగవంతుడూ లేదు, భక్తి లేదు. కన్యాదానం చేసేటపుడు తండ్రి కన్నీళ్లు పెట్టుకొన్నట్లుగా ముముక్షువు కూడా తన మనస్సును అర్పించేటపుడు దుఃఖపడతాడు. ఈ బాధనొక కవి అందంగా వివరించాడు.

భస్మో ద్దూళన భద్రమస్తు భవతే


అనగా పరమేశ్వరుడు నా భక్తికి సంతోషించి అతనిలో కలుపుకొన బోతున్నాడు. ఇక నుండి విభూతిని పూసుకోనవసరం లేదుకదా! రుద్రాక్షలు ధరించడం ఉండదు కదా! మీరు వెళ్లిరండి, మీకు మంగలమగుగాక! ఓ భక్తి మార్గమా? నీకూ వీడ్కోలు చెబుతున్నా, నేను మోక్షమనే మహామోహంలో కూరుకొని పోయాను. ఆమోహం మిమ్ములనన్నిటినీ దూరంగా ఉంచేది. ఇంత వరకూ భక్తినాకానందాన్నిచ్చింది చాలు.


మోక్షం, మోహాన్ని పోగొట్టేది. కానీ ఇట్టి వానికి మోక్షమే మోహంలా కనబడింది. భక్తి మొదలగు వాటిని విసర్జిస్తున్నాడు. అట్లాగే కృష్ణ కర్ణామృతంలోనూ ఉంది. భక్తి పరిపక్వమైతే కర్మమార్గం నుండి దూరమై పోతాడు.


Thursday 15 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (233)



ఆత్మసాక్షాత్కారమనేది శరీరం పోయినపుడు లభించేది కాదు. ఆత్మ ఎప్పుడూ ఉందేదే. అది లేకపోతే మన జీవితయాత్ర సాగుతుందా? కనుక అట్టి ముక్త స్థితిని శరీరం ఉండగానే సాధించాలి. ఇట్లా సాక్షాత్కరించుకొని మన మధ్యలో తిరిగే వానిని జీవన్ముక్తుడని అంటాం.


అట్టి బ్రహ్మజ్ఞానులలో కూడా ఎందరో భక్తులున్నారు. అంటేవారు ఒక దేవత రూపంలో ఉన్న బ్రహ్మమును అధికంగా ప్రేమిస్తారు. అట్టి వారి భక్తికి హేతువంటూ కనబడడు. అట్టి భక్తిని అభ్యసించడం వల్ల వారు పొందేది ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ఎందుకంటే వారేనాడో ముక్త స్థితిలో ఉన్నారు అతీతమైన దానిని అందుకొన్న తర్వాత, ఇంకా అందుకోవలసిందే ముంటుంది? అయినా బ్రహ్మ యొక్క లీలలను పరికిస్తూ ఉంటారు. ఆనందిస్తారు. ఏదీ కోరకుండా ప్రేమను చూపిస్తారు. జీవన్ముక్తుడు, ప్రత్యేకంగా ముక్తి కావాలని కోరడు. ఇదే అహైతుకీభక్తి, శుకుడట్టి బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్టుడు. హేతువంటే కారణం, కారణం లేనిది అహేతుకం, అదే ముక్తికి సోపానం.

ముక్తికి ముందు భక్తి ఎట్లా ఉంటుంది?

ఒక తండ్రియున్నాడు. అతనికొక ఆడపిల్ల, ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టాలి. వరుడు దొరికాడు. వివాహం నిశ్చయమైంది. వివాహమైన తరువాత అల్లుడు ఈమెను తన ఇంటికి తీసికొని వెళ్లబోతున్నాడు. కన్యాదానం చేసే సమయంలో తండ్రి మనస్సు ఎట్లా ఉంటుంది? మంచి సంబంధం దొరికిందని ఒక మూల సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని అణచుకొని ఆమె అత్తింటికి వెడుతున్నపుడు బావురుమంటాడు. సంబంధం వెదికినవాడు, పెళ్లి చేసినవాడూ ఇతడే. అప్పులు చేసైనా వివాహం చేసాడు. అయినా వెళ్లిపోతోందని బాధ.

Wednesday 14 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (232)



భక్తిని అభ్యసించిన కొలదీ, ముక్తికి చేరువౌతావని, ముక్తి లభిస్తుందని గోపాలకృష్ణ భారతి కీర్తించాడు. అంటే ఇతరులన్నట్లు ఏ కైలాసానికో, ఏ వైకుంఠానికి వెడతావని అనలేదు, మనమే మనుకొంటాం? ఏ దేవతను ఉపాసిస్తే అతడుండే కైలాస్తానికో, వైకుంఠానికి వెడతామని భావిస్తాం. దీనినే ద్వైత విశిష్టాద్వైతులు నొక్కి చెప్పారు. అయినా ఆ లోకాలలో కూడా భక్తుడు వేరు, భగవానుడు వేరనే భావన ఉండనే ఉంటుంది. ఈశ్వరానుభవమని, తనను భావిస్తున్నానని, తన కంటే మరొకడున్నాడనే భావనలు అక్కడా ఉంటాయి.


కాని అద్వైతముక్తి పై దానికి భిన్నం. గోపాలకృష్ణ భారతి, అద్వైతి శంకరులు కూడా జ్ఞానమే ముక్తినొసగేదని అన్నారు. అట్లా చెప్పినా ఆ శంకరులే అనేక స్తోత్రాలను వ్రాసేరు. అనేక క్షేత్రాలను దర్శించారు. అనేక తీర్థాలలో మునిగారు. షణ్ముత స్థాపన చేశారు. ఈ మఠంలోనూ గంటల కొద్దీ పూజ జరుగుతూ ఉంటుంది.


ఆత్మ స్వరూపం మనస్సునకు అవగతం కాదు. అసలు మనస్సే ఆత్మ నుండి వచ్చింది. అట్టిది ఆత్మను కొలవడమేమిటి? మనస్సు పోయినప్పుడే కదా ఆత్మ ప్రకాశం. అయితే మనస్సు నానా తిరుగుళ్లు తిరుగుతోంది. దీనిని తిరగకుండా చేయాలి. అందువల్ల భక్తిని ఒక సాధనంగా ఇక్కడ చెప్పారు. ఈశ్వరునిపై ఎప్పుడు లగ్నమైందో మనస్సు అతనితో కలుస్తుంది. ఆ లగ్నం కావడం ఎప్పుడు? ఒక కుండలో నూనెపోసి దానికొక చిల్లుపెడితే నిరంతరం ప్రవహించునట్లుగా సంతత ధార ఉండాలి. (తైలధారవత్ అవిచ్ఛిన్న ధారా ప్రవాహమని విద్యారణ్యులు, పంచదశిలో అన్నారు) ఎప్పుడట్టి ఏకాగ్రత సిద్ధించిందో మనస్సు తెరమరుగౌతుంది. ఇట్లా భక్తి, జ్ఞానానికి దోహదం చేస్తుంది. కనుక భక్తిని ఒక మెట్టుగా శంకరులు భావించారు.


Tuesday 13 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (231)



భక్తివల్ల ప్రపంచ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. మన బుద్ధి వికసించి, ఏ సమస్యలను పట్టించుకోని స్థితి ఏర్పడుతుంది. అటూ ఇటూ తిరిగే మనస్సును కట్టగలం. ఏకాగ్రత లభిస్తుంది. తద్ద్వారా సుఖశాంతులు వర్ధిల్లుతాయి, ఇట్లా శాశ్వతమైన అఖండమైన ప్రేమను పరమేశ్వరుని పట్ల చూపించగలిగితే మన కర్మలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. జనన మరణ భ్రమణం నుండి స్వామి, మనలను తప్పిస్తాడు. అతడే నేనయ్యాననే పరిపక్వమైన బుద్ధి మనకు కలిగినపుడు అట్టి మానసిక స్థితిని గమనిస్తాడు. అప్పుడు అనుగ్రహవర్షాన్ని కురిపిస్తాడు. ఇట్లా అనేక కారణాల వల్ల భక్తిని అభ్యసించాలి.


ఏ కారణమూ లేని భక్తిని గురించి ఆలోచించండి.


కారణం లేకుండా భక్తిని అభ్యసించుట


అనేక కారణాల వల్ల భక్తినభ్యసించినా ముక్తి కోసం భక్తియనుట ఉత్తమమైనది. ఆదిశంకరుల అభిప్రాయం ప్రకారం జ్ఞానం వల్లనే తిన్నగా మోక్షం లభిస్తుంది. కేవలం ఈశ్వరారాధన వల్ల కాదని సిద్ధాంతం. ముక్తి అంటే ఏమిటి? విడుదల కావడం, దీనినే తమిళంలో వీడు అంటారు. దేని నుండి విడుదల? ప్రపంచ జీవితం నుండి విముక్తి. అనగా పుట్టుకలు, చావుల నుండి, సహజ రూపాన్ని గుర్తించడం ముక్తి. మనస్సున్నంత వరకూ సంసార బంధంలో చిక్కుకోవడం తప్పదు. మనస్సు అణగినపుడు మాత్రమే ఇది సిద్ధిస్తుంది. ఎంతవరకూ నామ రూపాలున్నాయో అంతవరకూ మనస్సు ఆకర్షింపబడుతూ ఉంటుంది. మనం భక్తిని అభ్యసిస్తే ఈశ్వరుని రూపం, ఈశ్వర గుణాలే కన్పిస్తాయి. అట్టి భక్తిలో కూడా సంయోగం, వియోగాలుంటాయి. ఎప్పుడు మనస్సు పూర్తిగా లీనమై పోయిందో అప్పుడట్టివి అనుభవంలోకి రావు. అనగా మార్పులేని ఆనంద స్థితి రావాలన్న మాట. అఖండ శాంత స్థితి, ఏది ఆత్మ, ఏది మనస్సునకు ఆధారమని అన్వేషించేది జ్ఞాన మార్గంలోనే. ఇట్లా అన్వేషణలో మనస్సు లీనమైనప్పుడు చివరగా ఈశ్వరకృప వల్ల మనస్సు మటుమాయమైపోతుంది. ఆత్వస్వరూపం అవగతమౌతుంది. దానినే ముక్తియని అంటారు.

Monday 12 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (230)

అయితే అట్లా విన్నవించుకోవడం వల్ల మన బాధలను కొంత ఉపశమనం కలిగి, కొంత బరువు తీరినట్లుగా కనిపిస్తోంది కదా! ఏదో కొద్దిపాటి శాంతి లభిస్తోంది. కొంత వినయం కల్గుతోంది. అదైనా కొంతవరకు చాలు, మనం అతణ్ణి తక్కువగా అంచనా వేయడాన్ని క్షమిస్తాడు. మన కర్మల భారాన్ని తొలగించగలడు. కాని, ఈ మానవ జీవితంలో ఒక సమస్య తీరినా అంతటితో ఆగిపోతోందా? మరొకటి పొంచి యుంటుంది. దీనికి అంతం అంటూ ఉందా ?


కనుక భక్తి అంటే శరణాగతియే. జరిగేవి జరుగుతాయనే దృఢసంకల్పం ఉండాలి. తనకోసం తానేమీ కోరకుండా ఉండగలిగితే దుమ్ములేని అద్దంలా అతని మనస్సు ప్రకాశిస్తుంది. అప్పుడే శాంతి, నా కోసం నేనేమి అడగనంటూ ఒకరికి ఒకరు శరణాగతిని పొందినా బాధలుండవు. అది భార్య, భర్తకైనా, శిష్యుడు గురువుకైనా సరే అట్టి అంకిత భావం, సర్వార్పణ భావం మోక్షానికి దారి చూపిస్తుంది. పురాణాలలో భార్య, భర్తకు, శిష్యుడు గురువునకు అంకితమైన ఘట్టాలున్నా, నిత్య జీవితంలో లోపాలున్న వారిపట్ల శరణాగతి కుదురుతుందా? మనలోపాలూ వారిలో కన్పిస్తున్నాయి కదా! సరియైన సద్గురువు లభిస్తే అట్టిపై శరణాగతి చూపించగలిగితే, అన్నీ నీవే, అంతా నీవే, ఏదీ నాది కాదు అని త్రికరణ శుద్ధిగా భావించగలిగితే శాంతి లభిస్తుంది.


భక్తినెందుకు చూపించాలో మరొక మాట చెబుతాను, జీవితంలో ప్రేమ లేకుండా ఉంటే మనకు శాంతి ఎక్కడ? అయితే ఈ ప్రేమ ఫలం కనబడడం లేదు. మనం ఎవరిని ప్రేమించినా ఏదో ఒకనాడు వియోగం కల్గుతోంది. ఏ ప్రేమ సంతోషాన్ని ఇంతకు ముందు ఇచ్చిందో అదే దుఃఖాన్నిస్తోంది. ఈశ్వరుడు ఒక్కడే శాశ్వతుడు. కనుక మన ప్రేమను అతని వైపు మళ్లించ గలిగితే అతడు శాశ్వత సుఖాన్నిస్తాడు. నిష్కలంకమైన ప్రేమను చూపగలిగితే అంతా అతనిగానే కన్పిస్తుంది. అట్లా కాకుండా ఒకని పట్ల ప్రేమ చూపించితే, అది ద్వేషంగా కాలాంతరంలో మారవచ్చు. కనుక అంతటా నిండిన వానిపట్ల ప్రేమ చూపించగలగాలి. అంతటా నిండిన వాడని ఎప్పుడైతే భావించామో ఇక ఎక్కువ తక్కువలు కనబడవు. కనుక ప్రేమలేని జీవితం నిష్ఫలం.


Sunday 11 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (229)

 


భక్తి, దేని కోసం ?


ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, నేటి భౌతిక శాస్త్రమూ దీనినంగీకరిస్తుంది. ప్రపంచం అంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తోంది. ఇట్లా నడవడానికి ఒక సమష్టి మనస్సు (Cosmic Mind) కారణం. అతని చేతిలో నియమాలున్నాయి. మనమూ మామూలు జీవితంలో కార్యకారణ సంబంధాన్ని అడుగడుగునా చూస్తున్నాం. ఏ పని చేసినా తగిన ఫలం వస్తోంది. మంచి పనులు చేస్తే మంచి ఫలం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాలూ సిద్ధిస్తున్నాయి. భావానుగుణంగా ఫలప్రాప్తి, ఈ మంచి చెడ్డ ఫలాల నిచ్చేవాడొకడుండాలి, అనగా ఫలదాత. అతడే తన మహాశక్తి ద్వారా జగన్నిర్వహణను కొనసాగిస్తున్నాడు. అతణ్ణి ఏ పేరుతో పిలిచినా సరే.

మనలో మనస్సెంత వరకూ ఉందో అంతవరకూ ఆందోళనలు తప్పవు. మంచిచెడులు రెండూ ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్యపాపాలను రెంటినీ చేస్తున్నాం. పాపాలవల్ల బాధలు కల్గిస్తాడు. సాధారణంగా ఈ బాధల నుండి విముక్తికై ప్రార్ధిస్తూ ఉంటాం. ఇట్లా భావించడమే భక్తియని సాధారణంగా భావిస్తూ ఉంటారు. భగవానుడు కోరితే బాధలు మనకుండవనే మాట వాస్తవం. కాని అతడట్లా కోరడానికి మనకున్న అర్హత ఏమిటి? అందువల్లనే మంచి చెడులకు తగిన ఫలాలనందిస్తాడు. అంటే మన కర్మలను బట్టే. కనుక మనకెట్టి మానసిక స్థితి ఉండాలి? కష్టాలు వచ్చినా తట్టుకొనే స్థితినిమ్మని ప్రార్థించాలి. అయినా ఇట్టి వేడికోలూ సరియైన భక్తియని అనిపించుకోదు.

మనం, మన బాధలను అతని ముందు ఏకరవు పెడుతున్నామంటే అతనికి ఇవి తెలియవని అనుకొంటాం. కాని అవి అతనికి తెలియవా? ఈ కష్టాలను తొలగించు, నా మానసిక స్థితిని మార్చు, అని అడిగినా అవి అతనికి తెలియవనే గట్టి నమ్మకంతో ఉంటాం. అంటే అతని దయను తక్కువ చేసి చూపిస్తున్నాం. ఇది భక్తి అవుతుందా?

Saturday 10 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (228)



ప్రపంచంలో మంచి-చెడు; అందం-అందవికారం; సంతోషం-దుఃఖం అన్నీ బ్రహ్మము నుండి వచ్చినవే. ఎప్పుడైతే జీవాత్మ, పరమాత్మతో ఐక్యమయ్యిందో పై ద్వంద్వాలలో తేడా ఏమీ కనబడదు.


మనమున్న పరిస్థితులలో అట్టి స్థితి పట్టుబడడం కష్టమే. ఈ దశలో ఈశ్వరుని బహు సుందరమూర్తిగా, ఆనంద స్వరూపునిగా భావించి ప్రేమించ గలగాలి. ఈ దశలో నిర్గుణుడైన పరమాత్మను ధ్యానించలేం. కాని అన్ని గుణాలూ గుణరహితుడైన బ్రహ్మమునుండే వచ్చాయి. రంగులేని సూర్యకాంతి ఒక ఫలకం గుండా అనగా చదునైన ప్రక్కలు గల కడ్డీ (ఫ్రిస్మ్) గుండా ప్రసరించినపుడు ప్రతిబింబం ద్వారా భిన్నమైన రంగులను చూడడం లేదా అట్లాగే మాయ అనే అద్దం గుండా నిర్గుణ బ్రహ్మం ఈశ్వరుడవుచున్నాడు. గుణాలు కలిగిన వానిగా కన్పిస్తున్నాడు. గుణ రహితమైనది ప్రాథమిక దశలో పట్టుబడదని చెప్పాను. కానీ గుణాలు కలిగినవానిని చింతించగలము. చెడ్డ గుణాలను భావిస్తే అధోగతే. ప్రపంచంలో మునిగిపోతాం. కనుక మంచి గుణాలనే భావించగలగాలి. కనుక పరమేశ్వరునకు ఒక రూపం ఉందని, జీవం ఉందని, కల్యాణ గుణాలతో ఉంటాడని భావించాలి. అట్లా భావిస్తే అతనికున్న కల్యాణ గుణాలూ మనకు సంక్రమిస్తాయి. అంతా భావనయే.


మనం నిరంతరంగా, తీవ్రంగా దేనిని భావించినా అదే మనమౌతాం దీనిని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించారు. కనుక దోషాలు లేని, దయా సముద్రుని నిరంతరం చింతించగలిగితే మనమూ ప్రేమమూర్తులం కాగలం. అంతా ప్రేమమయమై చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఉండదు. పాపకృత్యాలు పాపచింతనలు లేకుండా ఉండాలంటే భక్తికి మించిన్ది లేదు. ఇందువల్ల భక్తి సామ్రాజ్యంలోనే అడుగుపెట్టమనీ అనడం లేదు. ఇట్టి భావన మన సహజస్థితికి తీసికొని వస్తుంది. అదే మన లక్ష్యం. మనస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో ఆత్మకాంతి ప్రస్ఫుటమై మనస్సులోని సమస్త కర్మవాసనలూ మటుమాయమై పోతాయి. కనుక పాపాన్ని సమూలంగా పెకలించడానికి భక్తి యొక్క అవసరం ఎంతైనా ఉంది.


కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (227)



ఇట్లా గుర్తించకుండా ఈ విశ్వం అంతా ఈ జీవులందరూ నిజమని భ్రమిస్తూ ఉంటాం. ఇట్లా భావించడాన్ని మాయయని అంటారు. ఈ మాయా ప్రపంచం రకరకాల చమత్కారాలను చేస్తూ ఉంటుంది. ఇది నడవడానికి కొన్ని నియమాలున్నాయి. వాటి ప్రకారం ఇది నడుస్తూ ఉంటుంది. నిష్క్రియమైన బ్రహ్మము మాయవల్ల విశ్వంగా కనబడి సృష్టి స్థితి సంహారాలను చేస్తున్నట్లుగా ఉంటుంది. ఏ పని లేనపుడు బ్రహ్మమని, పనులున్నపుడు ఈశ్వరుడని అంటాం. నిష్క్రియ నిర్గుణ స్థితినే బ్రహ్మమని, క్రియా సహితమైనపుడు ఈశ్వరుడని, భగవానుడని, స్వామియని ఎవరిని అంటామో అది అంతా సగుణ బ్రహ్మనుద్దేశించినదే. 


మనం నిరంతరం ఏవో పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేయకపోయినా మనస్సుతోనైనా ఆలోచించకుండా ఉండలేం. ఈ ఆలోచన కూడా ఒక పనే. మనస్సులో భావాలెప్పుడుదయించవో అనగా భావాతీత స్థితియే బ్రహ్మము. కాని క్షణకాలం భావాలు లేకుండా చేయలేం. ఎట్లా ఈ మనస్సును ఆపడం?


ఈ అభ్యాసం భక్తివల్లనే సాధ్యం. క్రియా రహితమైన స్థితిలోనే బ్రహ్మానుభవం కల్గుతుంది. ఆ బ్రహ్మమే ఈశ్వరుడై అన్ని పనులూ చక్కబెదుతున్నాడు కదా! కనుక అన్ని పనులను ఆ ఈశ్వరునివైపు మళ్లించగలగాలి


నమస్కరించుట, పూజ మొదలైనవి శరీరంతో, స్తోత్ర పఠనం నాల్మతో, ధ్యానం మనస్సుతో ఇట్లా అన్ని పనులను అతనివైపే మళ్లించగలగాలి. వీటిని అట్లా మళ్లించితే, ఈశ్వరుడంగీకరిస్తాడు. బ్రహ్మ జ్ఞానం మనలో కల్గిస్తాడు. ఇట్లా ఏ పని చేసినా వానికి చెందిందే అని, వానికై చేయడాన్ని భక్తియని అంటారు. ఇది అవిచ్చిన్నంగా సాగాలి. అనగా నిరంతరంగా ప్రేమతో ఇట్లా పసులు చేయడమే భక్తి.  


Friday 9 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (226)



నేను చేస్తున్నాననే అహంకారం పోయినపుడు అదే సరియైన నమస్కారం. అది అన్నివేళల చేయవలసిన నమస్కారం. ఆ అనుభవం చటుక్కున రాదు అయినా ఆలయంలోనైనా వినయంతో నమస్కారం చేయగలగాలి. అది దేనిని సూచిస్తుంది. నేను నా బాధ్యతనంతా నీ మీద నుంచాననే. కొంత బాధ్యత మనకుందని ఎప్పుడైతే భావించామో అపుడు భగవానుడు తన బాధ్యతను తగ్గించుకొంటాడు. ఇక్కడ అసంపూర్ణత్వం కన్పిస్తోంది కదా! కనుక అంతా నీ బాధ్యతే అనగలగాలి. మంచి జరిగినా, చెడు జరిగినా అంతా నీ సంకల్పాన్ని అనుసరించే జరుగుతుందని భావించగలిగితే సర్వార్పణ భావంతో ఉండగలిగితే అపుడతడు మనపై దయ చూపిస్తాడు. మన భారాన్నంతలటినీ తానే స్వీకరిస్తాడు. ఇక మన నెత్తిమీద బరువుండదు.


భక్తి


ఒకానొక మహాశక్తి యొక్క తెలివే (మహత్తు) ఈ విశ్వం, సమస్త జీవులుగా కన్పిస్తోంది. ఈ కన్పించడం ఎప్పుడైతే పోయిందో మిగిలేది మహత్తే , ఆసమష్టి బుద్ధియే. ఆ స్థితిలో ఏ క్రియలేదు. విశ్వంగా కనబడడం వల్లనే, ప్రాణులుగా కన్పించడం వల్లనే క్రియలన్నీ ఉన్నాయి. వీటిని దాట గలిగితే ఆ మహత్తుతో ఐక్యం కావచ్చు. అదే బ్రహ్మ సాక్షాత్కారం. అదే అపరోక్ష సాక్షాత్కారం. అదే జీవాత్మ యొక్క సహజమైన, మార్పులేని స్థితి.


Wednesday 7 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (225)



నమస్కారం


పరమేశ్వరుని ఉద్దేశించి ఒక చక్కని శ్లోకం ఉంది. దానిని వ్రాసినవాడు గొప్ప భక్తుడు, గొప్ప విద్వాంసుడైన అప్పయ్య దీక్షితులు.


ఓ త్రిపుర సంహార! నేను రెండు తప్పులు చేసినందులకు క్షమించుమయ్యా. ఏమిటో తప్పులంటావా? గత జన్మలో నీకు నమస్కారం పెట్టియుండను. వచ్చే జన్మలో పెట్టే అవకాశమూ లేదు. నేను గత జన్మలో నమస్కారం పెట్టలేదని నాకెట్లా తెలిసిందంటావా? నమస్కారం పెట్టకపోవడం వల్లనే నాకీ జన్మ వచ్చింది కదయ్యా! గత జన్మలో పెట్టియుంటే ఏనాదో ముక్తి లభించియుండేది. ఈ జన్మే వచ్చి యుండేది కాదు. వచ్చే జన్మలో చేయలేనని అన్నాను. ఎందుకంటావా? ఈ జన్మలో నీకు నమస్కరించేను కదయ్యా కనుక ఇక జన్మ ఉండదు. ఇక జన్మే లేనపుడు నమస్కారం పెట్టడం కుదరదు కదా! కనుక గత జన్మలో పెట్టనందులకు, రాబోవు జన్మలో ఆ అవకాశం. లేనందులకు ఈ రెండు తప్పులను క్షమించు తండ్రీ! అని వేడుకొన్నారు.


ఏ సందేశమిచ్చింది ఈ శ్లోకం? భగవానునకు హృదయపూర్వకంగా నమస్కారం పెట్టాలనే. అపుడే జననమరణ ప్రవాహం నుండి అతడు తప్పిస్తాడు. ఇదేదో కవితా చమత్కారం కోసం వ్రాసేడని భావించకండి. భక్తిలో మునిగి వ్రాసిన శ్లోకమిది. కనుక శరణాగతిని పొంది హృదయపూర్వకంగా నమస్కరించాలి. సద్గతి తప్పక కల్గుతుంది. సందేహించనవసరం లేదు.


(ఈ దిగువ విషయం 'నమోనమః'లో స్వామివారు చర్చించారు. చూడండి అమృతవాణి-2)

నమస్కారం ఎట్లా చేయాలి? దండ నమస్కారం చేయాలి. చేతి నుండి జారిన దండం, చేతిని విడిచి నేలమీద పడిపోతుంది. అట్లాగే ఈ శరీరం నాది కాదు, ఇది భగవానునిదే అనే భావనతో నేల మీద పడడమే దండ నమస్కారం. మన శరీరం కర్ర వంటిడే. దీనిని ఎత్తడం, నిటారుగా నిలబడడం చేసేది లోనున్న శక్తియే. నేను దీనిని నిలుపుతున్నానని, దీనితో పనులు నిర్వహిస్తున్నాననే ఆహంకారాన్ని విడిచి దండం మాదిరిగా నేల మీద పడాలన్న మాట. అదే దండ నమస్కారం. జ్వరంలో మన శరీరం నిలబడలేదు నడవలేదు. అసలు పుట్టుకే ఒక పెద్ద జ్వరం. ఇట్టి జ్వరం ఎందుకు వచ్చిందో తెలిసికొని, ఇది మరల రాకుండా ఉండడం కోసం దండం మాదిరిగా భగవానుని ముందు మోకరిల్లాలి.

Tuesday 6 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (224)



ఇట్టి ఆచారాలు లోపించకుండా కొనసాగించడం మంచిది. నామ సంకీర్తన లేకుండా భజన మందిరాలు బోసిపోకూడదు. ఇటీవల కాలంలో దినదినాభివృద్ధి పొందడం చూస్తూ ఉంటే శుభసూచకంగా కన్పిస్తోంది. వేద ఆగమ, అచారాలు క్రమక్రమంగా లోపించే సమయంలో కనీసం ఇట్టి సంప్రదాయమైనా బ్రతికి ఉండడం హర్షింపదగిందే. అట్లాగే సత్సంగాలు బాగా పనిచేస్తున్నాయి. అట్లా భజనలూ సాగడం మంచిది.


నామసంకీర్తన భక్తి పోషకమైనది. దీనిని వ్యాప్తిలోనికి తెచ్చిన ఘనత సద్గురు బోధేంద్ర స్వామి వారికి చెందుతుంది. ఆయన పరమాత్మ సచ్చిదానందరూపుడైనా జగత్కల్యాణం కోసం అవకార రూపంలో వచ్చాడని, ఈ మూర్తులే సరిపోవని, హరి, శివ నామాలను ధరించి వచ్చాడని అట్టి మంగళ రూపునకు జయమగుగాక యని కీర్తించారు. అనగా భగవన్నామాలు వట్టి నామాలు కావు. మూర్తితో బాటు అవీ భగవత్ స్వరూపములే అని అర్థం వస్తోంది కదా! భగవానునకు ఎట్టి శక్తి ఉందో నామానికీ అంత శక్తి ఉన్నట్లే కదా మహాత్ములు గానం చేసి పుణ్యం సంపాదించిన పాటలను, పద్యాలను మనం పాడితే వారు భగవద్దర్శన్నాన్ని పొందినట్లుగానే మనకూ అట్టి భాగ్యం కల్గుతుంది. జయదేవుడు, నారాయణ తీర్థులు, రామదాసు, పురందరదాసు త్యాగరాజు వ్రాసిన పాటలు, అట్లే తమిళ భక్తుల పాటలు, హిందీలోని భక్తి గీతాలు, మరాఠీలోని అభంగాలు - వీటినన్నిటినీ సంప్రదాయంగా వచ్చే భజన సంగీతంలో అమర్చినవాడు, మరుదానల్లూర్ సద్గురుస్వామి. డోలోత్సవం, వసంత కేళి మొదలగు ఉత్సవాలలో పాడేవీ ఉన్నాయి. ఎట్టి శ్రమలేకుండా సంగీత శాస్రాభ్యాసం లేకుండా ఆనందంగా అందరూ పాడేవి. కలియుగంలో తీవ్రసాధనలు చేయడం కష్టమని, నామసంకీర్తన వలనే ముక్తిని పొందవచ్చని భాగవత గ్రంథమే చెప్పింది: కలౌ సంకీర్త్య కేశవం:


సామూహికంగా పాడే భజన పద్ధతిని అట్లా ఉంచండి. ప్రతి గృహంలో ఇంట్లో ఉన్నవారందరూ కలిసి భజనలు చేయవచ్చు కదా! దానికి ఎక్కడకో వెళ్లాలనే కష్టమూ ఉండదు కదా! పూజా మందిరంలోగాని, విడిగా గాని అందరూ కలిసి ఒక దీపం వెలిగించి చూట్టూ చేరి కొంతసేపు, భజన చేయవచ్చు కదా! నామ సంకీర్తనం చేయడమేమిటని సిగ్గుపడకండి. సంగీత జ్ఞానం లేకపోయినా, గాత్ర మాధుర్యం లేకపోయినా భక్తి కలిగియుండడమే ప్రధానం. ఆడుకొనే పాపాయి అమ్మ అంటూ తల్లి దగ్గరకు వెళ్లడం లేదా? రాగయుక్తంగా ఆ మాటను పలుకుతున్నానా, అని ఆ పిల్ల ఆలోచిస్తోందా? అట్లాగే మనమూ లోకమాతను పిలవాలి. ఎన్ని పనులు చేస్తున్నా రామాది నామాలను కీర్తించాలి. అదే మన అసలైన సంపద. అందువల్ల సుఖశాంతులు కల్గుతాయి.

Monday 5 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (223)



భగవన్నామ మాహాత్యం


ధ్యానం, జపం, పూజ, యజ్ఞం, తీర్థయాత్రలున్నట్లుగానే సామూహికంగా భజన చేయడమూ అనాదిగా ఉంది. పరమాత్మలో జీవాత్మను అనుసంధానం చేయడం కోసమే అనేక ప్రక్రియలున్నాయి. భజన పద్ధతి కూడా అందొక భాగం. గ్రామాలలో భజనలకై కొన్ని స్టలాలుండడం వల్ల చాలా కాలం నుండి ఈ సంప్రదాయం అవిచ్చిన్నంగా సాగుతోంది. శనివారాలలోగాని, ఏకాదశి వంటి పర్వదినాలలోగాని చాలా మంది భజన చేస్తూ ఉంటారు.


ఆలయాలలో పూజ, ధ్యానాదులున్నా భజనలలో ఉచ్చ స్వరంతో గానం చేస్తారు. స్వామి గుణాలను, నామాలను కీర్తిస్తారు. అందరూ కలసి పాడుతారు. సంఘ దృష్టితో సామూహికంగా జరిగేదిది. ఎవరి ముక్తికై వారు ప్రయత్నం చేయడమే కాకుండా ఆలయాల ద్వారా, భజనల ద్వారా, ఉత్సవాల ద్వారా సామూహికంగా కూడా ఉంటుంది. భజనలలో తాళమృదంగాది వాద్య సహకారంతో వినసొంపుగా ఉంటుంది. మనస్సు ఏకాగ్ర మవడానికి దోహదం చేస్తుంది. రఘుపతి రాఘవ రాజారాం, హరేరామ హరేరామ రామరామ హరేహారే అనే నామ స్మరణ ద్వారా భగవానుణ్ణి తలుచుకోవడం అప్రయత్నంగా సాగుతుంది.


ఒక చోట కూర్చొని చేయడమే కాకుండా నగర సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు. పర్వదినంనాడు అందరూ కలసి అన్ని వీథులు తిరిగి సంకీర్తనం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మార్గశిర మాసంలో సంకీర్తనాలు ఉంటాయి.

Sunday 4 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (222)



పంచ భూతాలున్నాయి. అవే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవి విశ్వశక్తులు. ఇవి జ్ఞానేంద్రియాలకు ఆధారం. నాదమే ఆకాశంలో ఉంటుంది. చాలా మంది ఒక చోట గుమిగూడినపుడు రకరకాల ధ్వనులున్నా 'ఓ' అనేది సామూహికంగా వినిపిస్తుంది. సముద్ర ఘోషలోనూ 'ఓ' ఉంది. శంఖాన్ని చెవిదగ్గర పెట్టినప్పుడూ ఇట్టినాదం వినిపిస్తుంది. 'ఓ' కి చుక్కబెడితే దేవ నాగరలిపిలో ఓం. ఇట్లా ఈ నాదం వినబడుతూనే ఉంటుంది. గాలిలో ఈ నాదం వినబడడమే కాకుండా గాలికి స్పర్శ గుణం ఉంటుంది కూడా. గాలి మన మీద ప్రసరింప బడినపుడు అది ఉండని తెలిసికొంటాం కదా. దానికి తోడు అగ్నికి రూపం కూడా ఉంది. కళ్లతో చూస్తున్నాం, నీటికి పై వాటికి తోడు రుచి యుంది. నాల్కపై వేసికొని రుచి చూస్తున్నాం కదా! పై వాటికి తోడు భూమికి వాసన కూడా ఉంది. ఇందన్నీ మొలకెత్తుతాయనీ తెలుసు. ఇట్లా చూడడం, వినడం, రుచి చూడడం, స్పృశించడం, వాసన చూడడం జరుగుతోంది. 

ఇట్లా ఐదు ఇంద్రియాలూ మనం అన్నిటినీ అనుభవించడానికి కారణమౌతున్నాయి. మంచి ఆహారం, మధుర సంగీతం, సువాసన, చల్లని గాలి, అందమైన చంద్రోదయ దృశ్యం. అన్ని ఈ ఇంద్రియాల వల్లనే అనుభవిస్తున్నాం. వీటికి ఆధారాలైన పంచభూతాలను భగవానుడందించాడు. అతని దయవల్ల మనం భోగాలను అనుభవిస్తున్నాం. మనంతట మనం ఒక్క బియ్యపు గింజను సృష్టించలేం. అతని దృష్టిని తిలకించి పులకించండని ఐదు ఇంద్రియాలను ప్రసాదించాడు. వీటిని అనుభవించేటప్పుడు వీటి కారకుణ్ణి స్మరించడం మన కర్తవ్యం కదా!


ఈ విషయాలను ముందుగా భగవానునకు నివేదించి మరల స్వీకరించడం, దానిని ప్రసాదంగా భావించడం మన విధి. ఇట్టి భావనతో ఉంటే మన మనస్సునకు పరిపక్వత లభిస్తుంది. ఏదీ అర్పించకుండా స్వీకరించకూడదనే భావన మనలో నాటుకోవాలి.


అంటే పంచేంద్రియాల ద్వారా స్వామికి పంచోపచారాలు చేసి స్వీకరించాలన్న మాట. చాలా ఉపచారాలున్నా ఇంట్లోగాని, ఆలయంలోగాని కనీసం ఈ ఐదు ఉపచారాలను చేయాలి. అనగా స్వామికి గంధం అర్పించుట పువ్వులతో పూజించుట, ధూపం చూపించుట, దీపారాధన, నైవేద్యాలు అర్పించాలి. ఇందు గంధం సమర్పించడాన్ని భూమికి; పువ్వు - ఆకాశానికి; ధూపం - వాయువునకు; దీపం - ఆగ్నికి; నైవేద్యం - నీటికి (అమృతానికి) గుర్తులు. ఇట్లా పంచభూతాలు, పంచోపచారాలలో దాగియున్నాయి. పంచ భూతాలనుండి అన్ని వస్తున్నాయి. పంచేంద్రియాలు అనుభవిస్తున్నాయి. దీని వల్ల జీవుడు, దేవుడు, ప్రపంచం అన్నీ ఒక్క చోట కలుస్తున్నాయి.

Saturday 3 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (221)



మంచిగా ఉండడానికి భక్తి అవసరం లేదని కొందరంటారు. నిజమాలోచిస్తే అనేక స్వార్థాలతో కూడిన జీవునికి శుద్ధి, భక్తి వల్లనే సాధ్యమౌతుంది. యుగయుగాల నుండి, పై వాడొకడున్నాడని, అతడన్నింటిని గమనిస్తున్నాడని, మనం చేసే మంచి చెడ్డలకు ఫలాన్నిస్తాడనీ నమ్మకంతో బ్రతికాం. అట్టి భావన ప్రజలకు ఆలంబనంగా, ఊరట నిచ్చేదిగా ఉంటుంది. ధర్మమార్గంలో నడవడానికి దోహదం చేసింది.


భక్తి యొక్క లక్ష్యం మనిషిని మంచిగా తీర్చిదిద్దడానికే. ఇక పరమార్ధ జ్ఞానం పట్టుబడితే పై వాడికి తనకూ అభేదాన్ని గుర్తిస్తాడు. ఇక జనన మరణ ప్రవాహమూ ఉండదు. బాధా విముక్తి కల్గుతుంది. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే తనకూ, సంఘానికి సేవ చేసినట్లే. గుళ్లు, గోపురాలు కట్టడం ఎందుకంటారు, అవి ఎంతో ఎత్తుగా ఉంటాయి. మనలనూ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవి ఉన్నాయి. ఉన్నతంగా మనమున్న రంగాలలోనూ ఎదగాలని సూచిస్తున్నాయి. 


ఐదు ఇంద్రియాలు - ఐదు ఉపచారాలు


మనిషిలో విషయాలననుభవించడానికి బదు ఇంద్రియాలున్నాయి. కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. వీటిని పంచేంద్రియాలంటారు. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలను అనుభవిస్తున్నాయి. కన్ను రూపం చూస్తోంది. నాల్క రుచిని ఆస్వాదిస్తోంది. చర్మం వల్ల స్పర్శ జ్ఞానం కల్గుతోంది. ఈ ఇంద్రియాలు క్రొత్తగా వేటినీ సృష్టించడం లేదు. అవి ఉన్న వాటిని అనుభవిస్తున్నాయి. రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను గ్రహిస్తున్నట్లుగా ఉన్న వాటినే మెదడునకు చేరుస్తున్నాయి. క్రొత్త వాటిని సృష్టించి ఈయవు. సృష్టిలో ఉన్నవాటిని చూసి, స్పృశించి బుద్ధికి విషయాన్ని చేరవేస్తాయి. వీటినే జ్ఞానేంద్రియాలంటారు. చేతులు, కాళ్లు మొదలైనవి పనులను చేస్తాయి, కనుక వాటిని కర్మేంద్రియాలంటారు. నాల్క రుచి చూడడంతో బాటు అనగా జ్ఞానేంద్రియమే కాకుండా మాట్లాడునపుడు నాదాన్ని పుట్టించి కర్మేంద్రియంగానూ ఉంటుంది.


Friday 2 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (220)



వైద్యాలయాలు కేవలం శారీరక అనారోగ్యాన్ని తొలగించగలవు. అంతకంటే మనుష్యులలో దుష్టభావాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని కోసం పాఠశాలలను పెట్టి చదువు నేర్పిస్తున్నాం. వాళ్లు బాగా చదివి లోకంలో అడుగుపెట్టి నిజాయితీతో ఉండకపోతే ఆ చదువువల్ల ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది? ఆ విద్యార్థిలో క్రమశిక్షణ, త్యాగబుద్ధి, దేశభక్తి, దైవభక్తి లేకపోతే వాడు బుద్ధిమంతుడైన కొద్దీ ఎట్లా మోసం చేయవచ్చో, నేరాన్నుండి ఎట్లా తప్పించుకోవచ్చో మొదలగువాటికి ఆ విద్య ఉపకరిస్తోంది కూడా. కనుక మానవ జీవితం వైద్య, విద్యాలయాలతోనే అంతం కాదు. వాటికి తోడు దేవాలయ వ్యవస్థ ఉండి తీరాలి. మనిషిని మహోత్తమ మానవునిగా తీర్చి దిద్దాలంటే వానిలో ధ్యానం, పూజ, ప్రశాంత చిత్తత, వివేచన వినయ సంపద, క్రమశిక్షణ మొదలయిన సల్లక్షణాలుండవలసిందే. వీటికై ఉపయోగిస్తుంది దేవాలయం.


ఆరోగ్యం విద్య అందించడం కంటే భగవత్ సాన్నిధ్యాన్ని చేర్చే పద్ధతి ఉండాలి. విద్య వల్ల బుద్ధి మంతుడౌతాడు. ఆ బుద్ధి తనకు, సంఘానికి ఉపయోగపడినపుడే ఆ విద్యకు పరమార్ధం. అంతకంటే జ్ఞానికావాలి. విచక్షణా జ్ఞానం ఉండాలి. (Knowledge వేరు wisdom వేరు). ఈ జ్ఞానం పూజ ధ్యానాదుల వల్ల వస్తుంది. మంచి వ్యక్తులుగా మారినపుడు పై విద్యలు రాణిస్తాయి.


ఈ మంచిగా మారడానికి దేవాలయ సంరక్షణ జరగాలి. ముందుగా భక్తి భావం పొటమరించాలి. తనను తానేమిటో తెలిసికొనే వాతావరణాన్ని సృష్టించగలగాలి.


Thursday 1 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (219)




ఆలయం - వైద్యాలయం


మానవ సేవయే మాధవసేవ కనుక ప్రత్యేకంగా మాధవుణ్ణి సేవించనవసరం లేదని కొందరంటారు. అంతేకాదు, ఆలయాలను వైద్యాలయాలుగా, విద్యాలయాలుగా మార్చండని కేకలు వేసేవారూ ఉన్నారు. రోగాలను కుదర్చడం, విద్యాబుద్ధులు నేర్పడం ప్రశంసింపదగినవే. అట్టి సాంఘిక కార్యక్రమాలు భగవత్ కృపకు నోచుకొంటాయనడంలో సందేహం లేదు. మానవ సేవయే మాధవ సేవ అనడంలోనూ తప్పులేదు. మాధవుణ్ణి సేవించినా మానవులందరినీ సేవించినట్లే అంటున్నా. ఇది సంఘ సేవకంటే శాశ్వతమైన మంచిని ప్రసాదిస్తుందని అంటున్నా. ఎట్లా?


వైద్యాలయంలో రోగాలు కుదిర్చి ఇంటికి పంపుతున్నారు. తరువాత అతడు సక్రమ జీవితం గడుపుతాడని నమ్మకం ఉండా? రోగాలు కుదర్చబడిన వారు ఘోరకృత్యాలు చేస్తే మనం రోగం కుదర్చడం వల్ల ఫలమేమైనా వస్తుందా? ఎవరైనా మతిస్తిమితం లేని వాళ్లను దగ్గరకు తీసికొని వచ్చి రోగం కుదుర్చండని ప్రాథేయపడుతూ ఉంటారు. పై విధంగా భావిస్తూ ఉంటాను. కుదిరినా సరిగా నడుచుకొంటాడా లేదా అని నేను వారిని ప్రశ్నిస్తే వారు బాధపడుతారు కదా! కనుక అట్లా పైకి అనను. ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఇదంతా చెప్పాను. ఏదైనా తప్పు పని చేస్తే తగిన దుష్ఫలితం వస్తుందని భావించి చేసినా పాపమే వస్తుంది. అయితే మతిస్తిమితం లేనివాడు తప్పు పని చేసినా వాడికి పాపం అంటదు. గత జన్మ పాపాలవల్ల ఇప్పుడీ రోగం వచ్చింది. ప్రస్తుతం అట్టి వానికి పాపం లేదు. అట్లా ఉండడానికి ఏది మూలకారణం? ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉండాలన్నా, గత జన్మలోని పాపాల నివృత్తికి మార్గమేమిటి?