Showing posts with label దైవం. Show all posts
Showing posts with label దైవం. Show all posts

Sunday, 2 July 2017

వారాహీ అమ్మవారి వైభవం గురించి కొంత.......



ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత.......

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.  

Thursday, 7 April 2016

వికట, ధూమ్రవర్ణ - గణపతి నామాలకు అర్దం

ఓం గం గణపతయే నమః

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం ||

ఇది సంకటనాశన గణేశ స్తోత్రంలోని ఒక పంక్తి. అందులో వికట, ధూమ్రవర్ణ అనే నామాలకు అర్దం చెప్పమని ఒక మిత్రుడు అడిగారు.

వికట అనేది గణపతి 8 అవతారాల్లో మొదటిది. దీని గురించి గణేశ పురాణంలో ఉంది. కామాసుర సంహారం కోసం వినాయకుడు మయూరాన్ని (నెమలిని) వాహానంగా చేసుకుని, వికట గణపతి రూపంలో అవతరించి, కామాసురుని అణిచివేశాడు. వికట అనే నామంతో గణపతిని పూజించడం వలన ధర్మబద్దం కానీ కామం నశిస్తుంది. ధర్మం పట్ల అనురక్తి పెరుగుతుంది. పురాణం ప్రకారం ఇది అతి సుందరమైన రూపం.

కానీ వికట అనే నామానికి భయంకరమైన, ఉగ్రమైన రూపం కలవాడనే అర్దం కూడా ఉంది. ఇది ఎలాగంటే మోక్షం పొందాలంటే దేహాత్మ భావనను దాటిపోవాలి. నేను దేహం అనుకున్నప్పుడే, స్త్రీ, పురుష మొదలైన వ్యత్యాసాలు, కాకామ, క్రోధాదులు, అందం, వికృతం ఇత్యాది భావాలు వస్తాయి. భక్తులను ఉద్ధరించడం కోసం, వారిలో హద్దులు మీరిన కామభావాలను, అధర్మ నడవడిని తొలగించుటకు, దేహాత్మభావనను దూరం చేయడానికి అత్యంత భీకర రూపంతో కనిపిస్తాడు గణపతి. అందుకని ఆయనకు వికట అనే నామం ఉంది.

ఈ జగత్తు అనేది నాటకం. అందులో అందరిది ఒక్కో పాత్ర. అది అర్దం కాక ఇందులో లీనమై సుఖదుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తాడు మానవుడు. అలా జరగకుండా, కేవలం సాక్షిగా, ఈ జన్నాటకంలో తన వంతు పాత్ర నిర్వర్తిస్తూనే ప్రేక్షకుడిగా ఈ జగత్తును దర్శింపజేసే శక్తిని అనుగ్రహించగలవాడు కనుక గణపతికి వికట అనే నామం ఉందని సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి గారు చెప్పారు.

ధూమ్రవర్ణుడు అంటే పొగ వంటి వర్ణం కలిగినవాడు. దీనికి కూడా గణేశపురాణంలో కధ ఉంది. పూర్వం అహంకారాసురుడనే రాక్షసుడు తన అహంకార ధూమ (పొగ) చేత సర్వలోకాలను ఉక్కిరివిక్కిరి చేసినప్పుడు, దేవ, ఋషి, మానవ గణాలన్నీ గణపతిని వేడుకొనగా, వారి రక్షణ కొరకు అహంకారాసురిని చేత వదలబడిన ధూమాన్ని తన తొండంతో పీలుచుకుని, పొగ వర్ణంలోకి మారిపోయాడు గణపతి. అటు తరువాత వాడిని అణిచి తన అదుపులో పెట్టుకున్నాడు. ఆ లీలను సూచిస్తుందీ నామం. ఈ నామంతో వినాయకుడిని అర్చిస్తే, అహంకారం నశిస్తుంది.

నిజానికి #గణేశారాధన ప్రధమంగా అహంకారాన్ని నశిమపజేస్తుంది. గణపతికి నచ్చని గుణాల్లో మొదటిది అహంకారం. అహంకారంతో గణపతిని పూజిస్తే ఆయన అసలు మెచ్చుకోడు. గణపతి చేతిలోని అంకుశం కూడా ఈ అహంకారాన్ని అణిచివేయడానికే ఉంది. అహం నశిస్తేనే ఆధ్యాత్మికతలో పురోగతి ఉంటుంది. లేదంటే ఎంత సాధన చేసినా వృధానే. అటువంటి అహంకారాన్ని నశింపజేయుడువాడు మన గణపతి.

ఓం గం గణపతయే నమః 

Sunday, 18 October 2015

కాత్యాయిని మాత

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

దుర్గామాత యొక్క ఆరవ రూపం కాత్యాయినీ దేవి. ఆమెకు ఆ పేరు రావడానికి కారణమిలా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు. ఆ మహర్షి పుత్రుడి పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఉద్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రికగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష.

పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. కొంత కాలం తరువాత మహిషాసురుడి అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని త్రిమూర్తులు తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయ మహర్షి ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయిని అని పిలువబడింది. మరో కథ కూడా వినిపిస్తుంది. ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రికగా అవతరిస్తుంది. ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్యంతం మూడు ఆ దేవి కాత్యాయన రుషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుడిని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందేందుకు గోపికలు యమునాతీరంలో ఈ దేవినే ఆరాధించారు. పూజ మండలంలో అధిషాత్రీదేవిరూపంలో ప్రతిష్టించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది. ఆమె వర్ణం స్వర్ణసమంగా భాసిల్లుతూ ఉంటుంది. దేవి చతుర్భుజాలలో అలరారుతుంటుంది. దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోనూ. క్రింది చేయి వరద ముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గమూ, క్రింది హస్తంలో పద్మమూ విరాజిల్లుతుంటాయి. ఆమె వాహనం సింహం. భక్తులు దుర్గాపూజలో ఆరవ నాడు ఈ దేవి స్వరూపాన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగసాధనలో దీనికి అత్యంత మహత్వపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయనీదేవి చరణ కమలాలలో అర్పించి పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేస్తాడు. దేవీ కటాక్షంతో చతుర్విధ పురుషార్థ ఫలాలు లభిస్తాయి. తేజోసంపన్నులై భాసిల్లుతుంటారు.

సేకరణ : సూర్య దినపత్రిక 2011

Thursday, 1 October 2015

క్షిప్ర ప్రసాద గణపతి

ఓం గం గణపతయే నమః

భక్తులపాలిటి కల్పవృక్షం క్షిప్రప్రసాద గణపతి. 32 గణపతులలో వినాయకుడి 20 వ రూపం క్షిప్ర ప్రసాద గణపతి. క్షిప్రప్రసాది అంటే కోరిన కోరికలు వెంటనే సులభంగా తీర్చేవాడని అర్దం. ఎర్రని మందార పువ్వు వంటి వర్ణం గల శరీరంతో, 6 చేతులతో దర్శనమిస్తాడు క్షిప్ర గణపతి. శివుడి వలే 3 వ నేత్రం కలిగి, తలపై చంద్రవంకను ధరించి ఉంటాడు. కుశములు (ధర్భలు) ఆసనంగా చేసుకుని కూర్చుని ఉంటాడు. ఈయన పెద్ద బొజ్జ బ్రహ్మాండానికి ప్రతి రూపం. ప్రధానమైన కుడి చేతిలో విరిగిన తన దంతం, ఎడమ చేతిలో కల్పవృక్షపు తీగ ధరించి ఉంటాడు. మిగితా చేతులలో పాశం, అంకుశం, దానిమ్మ, తెల్ల కవుల ధరించి ఉంటాడు. ఈ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించడం వలన కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రూపంలో వినాయకుడు త్వరగా కోరికలు తీర్చడమే కాదు, దుష్టులను వెంటనే శిక్షిస్తాడు, తప్పు చేస్తే, ఆలస్యం చేయకుండా శిక్ష విధిస్తాడు. ఈ గణపతిని రోజు ధ్యానించడం వలన ఆధాత్మిక మార్గంలో అడ్డంకులు తొలగి, త్వరగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.


స్వాతి నక్షత్ర జాతకులు ఈ గణపతిని పూజించడం వలన శుభపలితాలు కలుగుతాయి. ఈయన భక్తుల పాలిట కల్పతరువు. పిళ్ళయార్‌పట్టి కర్పగ వినాయకర్ దేవాలయం, కరైకుడి, తమిళనాడులో క్షిప్రగణపతి కొలువై ఉన్నాడు. అట్లాగే కర్ణాటకలోని చమరాజనగర్ మరియు మైసూర్ జిల్లాలోని నంజన్‌గుడ్ దేవాలయాల్లో 32 మంది గణపతుల విగ్రహాలున్నాయి.

క్షిప్రప్రసాద గణపతి ధ్యాన శ్లోకం

ఘృతపాశాంకుశ కల్పలతా స్వదంతశ్చ బీజపూరయుతా
శశికళ కళితమౌళీ త్రిలోచనో అరుణశ్చ గజవదనః
భాసుర భూషణ దీప్తః బృహదురః పద్మవిశిష్టోరల్లసితః
విఘ్నపయోధర పవనః కరధృత కమలః సాధాస్తుమే భూత్యై  


Kshipra Prasada Ganapati

Kshipra Prasada Ganapati is the 20th of Lord Ganesha’s 32 forms. In this form Lord Ganesh is considered quick rewarder of the wishes and instant punisher of the wrong. Kshipraprasada Ganapati appears in crimson red hue complexion with six hands. Also in this form he appears with third eye and with crescent moon on his crown like Lord Shiva. The lord is seated in Kusha grass throne, a sacred grass for Hindus. His big belly represents the manifestation of the universe. On his main right hand holds his broken tusk and on main left hand holds the twig of Kalpavriksha (Wish Fulfilling Tree). On the other hands Lord Ganapathi holds a noose, an elephant goad, pomegranate and a white lotus.

Picture of Kshipra Prasada Ganapati Form of Ganesha

Chothi (Swati) Nakshatra is related to Kshipra Prasada Ganapati. Worshipping this form is believed to bestow devotees with peace and prosperity. Meditating every day removes the obstacles   in the path of self realisation. Kshipra Prasada Ganesha can be worshipped at Pillayarpatti Karpaga Vinayagar Temple in Karaikudi, Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district in Karnataka has 32 forms of Ganapati sculptures.

Kshipra Prasada Ganapati Mantra

Ghrita pashankusha Kalpalata Svadatascha Beejapoorayutah!
Shashikala Kalita Moulihi Trilochana Arunascha Gajvadanaha!!
Bhasurabhooshana Deeptah Brihaduaraha Padmavishatrollasitah!
Vighnapayodharapavanah Karadhrita Kamalah Sadaastu Me Bhootayai!!

Translation of Kshipra Prasada Ganapati Mantra

Ganapati bestowing quickly his mercy. He has six arms. He is red in colour. His hands hold the single tusk, the elephant goad, the lotus, the creeper of the votive tree (kalpalata), the noose and the lemon.

Source: http://www.hindudevotionalblog.com/search/label/ganapathi32forms

Tuesday, 22 September 2015

అవ్వయ్యార్ పై గణపతి అనుగ్రహం

గణపతి అనుగ్రహం వర్షించాలే కానీ అసాధ్యమంటూ ఏదీ లేదు. పూర్వం తమిళనాట అవ్వయ్యార్ అనే అవ్వ ఉండేది. ఆవిడ గొప్ప గణపతి భక్తురాలు. ఒకసారి ఆవిడ వినాయకుడిని పూజిస్తున్న సమయంలో కొందరు యోగులు కలిసానికి వెళుతూ, అవ్వా! నువ్వు కూడా మాతో పాటు కైలాసానికి వస్తావా? అని అడిగారు. నేను ఇప్పుడు గణపతిని పూజిస్తున్నాను, కాబట్టి రాలేను, మీరు వెళ్ళండి అని అవ్వ చెప్పింది. కైలాసానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. అలా వెళ్ళడం కూడా ఊరికే వచ్చే అవకాశం కూడా కాదు. అయినా తనకు గణనాధుడే చాలనుకుంది అప్పయ్యర్. అవసరమైతే నన్ను గణపతే తీసుకువెళతాడని, తన పూజలో తాను నిమగ్నమైంది. ఈ యోగులు కైలాసానికి వెళ్ళేసరికల్లా అవ్వ కైలాసంలో ఉంది. అదేంటి అవ్వా! ఇందాక అడిగితే రానన్నావు, ఇంతలోనే కైలాసానికి ఎలా వచ్చావు అని ఆ యోగులు అడగ్గా, నా పూజ ముగియగానే వినాయకుడే తన తొండంతో నన్ను ఎత్తుకుని, కైలాసంలో కూర్చోబెట్టాడు అని చెప్పింది. ఇది గణపతి అనుగ్రహం అంటే. ఇది భక్తుల పట్ల గణపతికున్న ప్రేమ.

గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే అని ఆడిశంకరులు గణేశభుజంగంలో అంటారు. అంతటా వ్యాపించిన గణపతి ప్రసన్నుడైనచో పొందలేందంటూ ఏముంటుందని దాని అర్దం. దానికి ఇదే ప్రయక్ష ఉదాహరణ. అటువంటి సులభప్రసన్నుడు, క్షిప్రప్రసాది అయిన గణపతిని త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం.

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం గం గణపతయే నమః

Saturday, 5 September 2015

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

ఓం నమో భగవతే వాసుదేవాయ

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

కృష్ణుడిని దొంగా అంటున్నారు. శ్రీ కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలో, బృందావనంలో గడిచింది. యశోదానందుల ప్రేమానురాగల మధ్య ఆప్యాయంగా పెరిగాడు కృష్ణుడు. నందుడి ఇంట్లో 1000 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవుల నుంచి ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు వస్తుంది, ఎంత వెన్న ఇంట్లో ఉండాలి. ఇంత వెన్న ఇంట్లో ఉంటే ఇక బయటకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం కృష్ణుడికేంటి? ఒకవేళ అలా చేశాడే అనుకుందాం, నందుడు బృందావనానికి రాజు. మరి తన కుమారుడు మిగితా ప్రజల ఇళ్ళలో దొంగతనం చేస్తుంటే నందుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? చిన్నప్పుడు మనం అల్లరి చేసినట్టుగానే కృష్ణుడూ చేశాడు. కాలక్రమంలో కృష్ణ భక్తుల ఆయన చేసిన ఒకటి రెండు చిలిపి పనులను భక్తితో బాగా వర్ణించడం మొదలుపెట్టారు. భక్తితో చూసినప్పుడు అది భగవానుడి ఆడిన దివ్యలీల. అంతకుమించి ఆయన దొంగా కాదు, ఆయనకు దొంగతనం చేయవలసిన అవరసము లేదు.

కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఆయన్ను చంపడానికి వచ్చి, కృష్ణుడెవరో తెలియక ఆయన వయసున్న మగపిల్లలందరిని చంపేసింది. ఇక ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి బృందావనంలో ఆయన తప్ప ఆయన వయసు మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే మగపిల్లవాడు, పైగా వాళ్ళ రాజైన నందుడి కొడుకు, మహా సౌందర్యవంతుడు, చిలిపివాడు, చలాకీవాడు. అందువల్ల అందరిచే ప్రేమించబడ్డాడు. అందరు ఆయన్ను ముద్దు చేశారు, గారాభంగా చూశారు. అదే చనువుతో కృష్ణుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి పాలు, పెరుగు తిన్నాడు. బృందావనంలో తన వయసు మగపిల్లలు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడపిల్లలతోనే ఆడుకోవలసిన పరిస్థితి. అందుకే ఆయన గోపికలతో ఆడుకున్నాడు (రాసలీల కాదు). వాళ్ళతోనే కలిసి తిరిగాడు. స్నానం చేస్తున్న గోపికల చీరలను ఎత్తుకోపోయాడు, ఇదేనా మీ దేవుడి వ్యక్తిత్వం అంటూ విమర్శించే వారున్నారు. 7 ఏళ్ళు కూడా లేని పసిపిల్లవాడిని పట్టుకుని, అతనిలో అశ్లీలభావాలున్నాయని చెప్పడం ఎంతవరకు తార్కికంగా, సమంజసంగా  ఉంటుంది. అది ఆలోచించకుండా కృష్ణుడిని విమర్శించేవారు మూర్ఖులు మాత్రమే. రాసలీల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన అంశం. అక్కడ శరీరాలు ఉండవు. జీవాత్మ, పరమాత్మ మాత్రమే ఉంటారు. జీవాత్మతో పరమాత్మ ఆడే దివ్యలీలనే రాసలీల. ఆ స్థాయిలో జీవుడిని స్త్రీగా, పరంధాముడిని పురుషుడిగా సంబోధిస్తారు.  ఇదంతా భౌతికస్థాయిలో బ్రతికేవారికి ఎప్పటికి అర్దం కాదు.

ఇదంతా కృష్ణుడికి 7 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే జరిగింది. ఆయన 7 ఏళ్ళ వయసు రాగానే సాందీపాని మహర్షి వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో విద్యాభ్యాసం కనీసం 12 సంవత్సరాలు. విద్యాభ్యాసం ముగియగానే మళ్ళీ బృందావనానికి రాకుండా నేరుగా మధురకు వెళ్ళిపోయాడు. తర్వాత రుక్మిణీ దేవితో వివాహం జరిగింది. వివాహం తర్వాత రుక్మిణి దేవితో కలిసి బధ్రీనాధ్ వెళ్ళి ఒక ఋషి దగ్గర 8 ఏళ్ళ పాటు ఆశ్రమవాసం చేశారు. కఠోరబ్రహంచర్య నియమాలతో, భూశయనం చేస్తూ గడిపారు. ఎలా చూసిన కృష్ణుడు గోపికలతో కలిసి ఆడుకున్నది ఆయనకు 8 ఏళ్ళు రాకముందు, పసిపిల్లవాడిగా. 8 ఏళ్ళ పిల్లవాడు ఆడిన ఆటను రాసలీల అని భక్తులు పవిత్రభావనతో అంటే, కొందరు ఇదే విషయాన్ని పెట్టుకుని ఆయనకు గోపికలతో శారీరిక సంబంధం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. హవ్వ!................. 8 ఏళ్ళ పిల్లవాడి మీద ఇన్ని అపనిందలా? పరమపురుషుడైన శ్రీ కృష్ణుడి శీలాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి విషయాలు. ఆఖరికి హిందువులు కూడా ఎవరైనా రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకును నాశనం చేస్తే, ఈయన కలియుగ కృష్ణుడంటారు.కృష్ణుడు పరమధర్మాత్ముడు, కృష్ణుడిని విమర్శించే స్థాయి మనకు లేదు. కృష్ణుడుని విమర్శించే ముందు ఇవి కాస్త గుర్తుంచుకోండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ  

Originally Published: 27-Aug 2013
1st Edit: 5-sep 2015

Friday, 4 September 2015

శ్రీ కృష్ణాష్టమి

5-9-2015, శనివారం, శ్రావణ బహుళ అష్టమి, శ్రీ కృష్ణాష్టమి.

5242 ఏళ్ళ క్రితం, కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం.

నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్దం చేసుకుంటే మధుర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్దం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.

ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున, వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవహాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లోబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. భగవంతుని నమ్మకుని ముందుకు నడిచేవారి జీవితం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది చెప్తుందీ ఘటన. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ

Originally Published: Sri Krishnasthami
1st Edit: 16-08-2014
2nd Edit: 05-09-2015

Saturday, 28 March 2015

రామాయణం మన రక్తంలో ఉంది.

రామాయణం మన రక్తంలో ఉంది.

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?! అని అడిగారు అక్కడున్న వారు. నేను ఆడినమాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామరావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు. రావణుడు సమస్తప్రపంచాన్ని హడలుగొట్టిన వీరుడు. అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన. రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు. అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి. ధర్మార్ధకామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహసమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు. అది మాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు. ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు. ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు. లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు. భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.

ఒక్కసరి చరిత్ర గమనిస్తే మన దేశం మీద ఎందరో దాడి చేశారు, సంపదను దోపిడి చేశారు, సంస్కృతిని నాశనం చేశారు, చరిత్ర మొత్తం క్రైస్తవ, మహమ్మదీయ అకృత్యాలే కనిపిస్తాయి. కానీ చరిత్రలో ఎప్పుడైనా హిందుస్థాన్(భారత్) ఏ దేశం మీదనైనా దందయాత్ర చేసిందా? ఏ దేశసంపదనైనా దోచుకుందా? రాముడి డి.ఎన్.ఏ మనది. అందుకే దోచుకోవడం, దోపిడి చేయడం, దండయాత్ర చేయడం మన హిందూ చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో వారి ధర్మస్థాపన కోసం కలగజేసుకోవాలి. వారి దేశసంస్కృతిని మనం కాపాడాలి, అది నేపాల్ అయినా, టిబెట్ అయినా, లేక మరే ఇతరదేశమైనా. అంతవరకే మన కర్తవ్యం. అదే మనకు రాముడు నేర్పాడు. రాముడు, రామాయణం మన రక్తంలో ఉన్నాయి.

Originally posted: 0-April-2014
1st Edit: 28-March-2015

Friday, 13 February 2015

మహాశివరాత్రి - ఉపవాసం

ఓం నమః శివాయ

17, ఫిబ్రవరి, 2015, మంగళవారం, మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి సంధర్భంగా శివరాత్రి ఉపవాసం గురించి ఒక కధ చెప్పుకుందాం.

శివుడు కరుణ చూపాలి, అనుగ్రహించాలి అనుకుంటే ఎన్నో విచిత్రాలు చేస్తాడు. పూర్వం ఏమి తెలియని ఒక బోయవాడు ఉండేవాడు. పక్షులు, జంతువులు వేటాడి బ్రతికేవాడు. ఒకసారి వేట కోసం జంతువులను వెతుకుతూ అడవికి వెళ్ళాడు కానీ ఒక్క జంతువు కనపడలేదు. జంతువులను చంపకపోతే అతనికి, అతని భార్యకు ఆహారం ఉండదు. అందువల్ల ఆ రోజు వేటాడిన తరువాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. చాలాసేపు వెతికిన తరువాత ఓపిక నశించి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కుదామని క్రింద ఉన్న రాయి మీద కాలు వేసి, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఒక శివలింగం, కానీ ఆ బోయవానికి అది శివలింగం అనే సంగతి తెలియదు. అతడు ఎక్కింది మారేడు చెట్టు. చాలాసేపు ఎదురు చుశాడు. అతనికి దాహం వేయడంతో తనతో పాటు తెచ్చుకున్న నీటిని త్రాగుదామనుకున్నాడు, కాని భార్య గుర్తుకురావడంతో నోటిలో పోసుకున్న నీటిని ఉమ్మేశాడు. అవి క్రింద ఉన్న రాయి (శివలింగం) మీద పడ్డాయి. అది ఆ శివలింగానికి జరిగిన అభిషేకంగా శివుడు భావించాడు. శబ్దం చేస్తే జంతువులు రావని నిశ్శబ్దంగా దాహంతోనూ, ఆకలితోను, మౌనంగా రాత్రంతా అలాగే కూర్చున్నాడు.


రాత్రవుతోంది కాని తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా అతని భార్య అతని కోసం వెతకడానికి బయలుదేరింది. ఆమె కూడా ఏమి తినలేదు. తన భర్త కోసం గాలిస్తూ ఆమె దగ్గరలో ఉన్న ఒక శివాలయం వద్దకు చేరుకుంది. ఆ రోజు శివరాత్రి. భక్తులు తన్మయత్వంతో భజనలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆమె ఆ భజనలు విని, వాటికి ఆకర్షితురాలయై, భజన తరువాత ఏమైనా పడతారేమో అని, ఆ భజనలు వింటూ అక్కడే కూర్చుంది. కానీ భజనలో మమేకమై ఆకలిని మరిచిపోయింది.

`ఈ బోయవాడికి బాగా ఆకలి వేయడం వలన అతనికి నిద్రరాలేదు. అతనికి కూర్చొవడం ఇబ్బందిగా ఉండడంతో, అప్పుడప్పుడు కదిలాడు. అతను కదిలిన ప్రతిసారి మారేడు చెట్టుకున్న మారేడు దళాలు రాలి, క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అలా ప్రతి జాములోను (అంటే ప్రతి మూడు గంటలకు) పడుతూనే ఉన్నాయి. అది శివుడు అతని వలన జరిగిన అర్చనగా భావించాడు. ఈ విధంగా అడవిలో బోయవాడు, గుడిలో అతని భార్య రాత్రంతా జాగరణ చేశారు.


ఉదయం సూర్యోదయం జరగగానే అతను తన భార్యను వెతుకుతూ గుడికి చేరుకుని, ఒకరినిఒకరు చూసుకుని సంతోషపడసాగారు. ఇంతలో ఆ గుడి పూజారి వచ్చి వీళ్ళకు ప్రసాదం పెట్టాడు. ఏమి దొరకక ఆకలితో ఉన్న వాళ్ళీద్దరు, ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడితో వాళ్ళ ఉపవాసవ్రతం పూర్తయ్యింది అని శివుడు భావించాడు. ఈ వ్రతం చేయడంతో వారిలో మార్పు వచ్చింది. వేటాడడం మానేసి మంచివృత్తిని ఎంచుకుని ధర్మంగా జీవించారు.

ఇద్దరు మరణించగానే వారి ఆత్మలను తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. అప్పుడే శివభటులు కూడా వచ్చి వారిని కైలాసానికి తీసుకువెళతామనగా, వీళ్ళు ఎన్నో పాపాలు చేశారు, అనేక జంతువులను చంపారు. వీరు నరకానికే వెళ్ళాలన్నారు యమభటులు. అప్పుడు శివభటులు "వీరు ఆ మహాశివరాత్రి నాడు చేసిన ప్రతి పనిని కూడా పరమశివుడు తన పూజగా భావించి, వీరికి అనంతమైన పుణ్యాన్నిప్రసాదించాడు. వీరు చెసిన వ్రతానికి వీరి పాపం మొత్తం భస్మమైపోయింది. అందువల్ల వీరికి కైలాసంలో ఉండే అవకాశం ఏర్పడింది" అని పలికి వారిని కైలాసానికి తీసుకుపోయారు. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు.

మహాశివరాత్రి నాడు ఉపవాసం, శివనామంతో జాగరణ చేయడం, శివలింగాన్ని పూజించడం వలన అనంతమైన పుణ్యం, శివును ఆశీర్వాదం కలుగుతాయి. శివుడు ఆసుతోషుడు అంటే చిన్న చిన్న పూజలకే పొంగిపోయి వరాలిచ్చేవాడు. అటువంటి శివయ్య ఆశీర్వాదంతో జీవితాన్ని సంతోషదాయకం చేసుకోండి.


ఓం నమః శివాయ

Wednesday, 12 November 2014

స్థావర, జంగమ లింగాలు

శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం. 

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.

కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవస
రమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది.        

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది.  

మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.

ఓం నమః శివాయ

Thursday, 6 November 2014

అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
     
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

Tuesday, 28 October 2014

శివారాధన

ఓం నమః శివాయ

కార్తీకమాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివం అంటే శుభం, శోభనం, మంగళం అనే అర్దాలున్నాయి. దేవాదిదెవుడు, మహాదేవుడు, లయకారుడైన శివుడు భోళాశంకరుడు (అంటే అడిగిన వెంటనే వరాలు కురిపిస్తాడు, కొద్దిగా పూజ చేసిన, బోలెడు ఫలితాన్ని ఇస్తాడు, చిన్న సేవకే మురుసిపోతాడు). యోగ సంప్రదాయంలో శివుడు యోగులు యోగి, సృష్టిలో ఆదియోగి. శివుడి ద్వారానే లోకానికి యోగా, ధ్యానం మొదలైన విద్యలు పరిచయమయ్యాయి. కనుక యోగ సాధన చేసేవారు, పురోగతి కోసం తప్పకుండా శివారాధన చేయాలి.

శివారాధన చాలా సులువు. పెద్దగా పూజా సంభారాలు అవసరంలేదు, ఆడంబరాలు అసలే అవసరంలేదు. కాసిన్ని నీరు అభిషేకిస్తే చాలు, పొంగిపోతాడు. మంత్రాలు రావన్న బాధ అవసరంలేదు, ఓం నమః శివాయ అన్న మంత్రం చాలు. శివుడు యోగి అయినా, ఐశ్వర్యానికి అధిపతి. పూజించినవారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి రూపంలో విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. శివుడు విద్యను ప్రసాదిస్తాడు కనుకే అక్షరాభ్యాసంలో ముందుగా "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని రాయిస్తారు.

అటువంటి శివుడికి కార్తీకం అత్యంత ప్రీతికరం. ఈ కార్తీకంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. పెద్దగా ఆర్భాటం అవసరంలేదు. చిన్న శివలింగానికి, ఒక గ్లాసుడు మంచినీరు పోస్తూ, ఓం అని కానీ, లేక ఓం నమః శివాయ అని కానీ, మనసులో స్మరించుకుంటే చాలు, పెద్ద అభిషేకం చేసినట్టు పొంగిపోతాడు. అభిషేకం చేసే అవకాశం లేకపోతే, కనీసం మానసికంగా పూజించినా చాలు. మీ మనసులోనే ఒక శివలింగాన్ని ఊహించుకుని, మీరు మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం చేస్తునట్టు భావించి, మనసులో పూజించినా, ఫలితం వేసేస్తాడు పరమశివుడు.

శివపూజకు స్త్రీపురుష భేధం లేదు, వర్ణాశ్రమ బేధం అంతకంటే లేదు, ఎవరైనా, పరమశివుడిని అర్చించవచ్చు. ఉదయమే అరించాలన్న నియమం లేదు. శివుడికి ప్రదోష పూజ చాలా విశిష్టవంతమైంది. ప్రదోషం అంటే సాయంకాల సమయం. ఉదయమంతా ఆఫీసులో గడిపినా, సాయంకాలం ఇంటికి వచ్చాకా, ఆరాధన చేయవచ్చు. ఈ కార్తీకం నుండి శివారాధన ప్రారంభించండి.  

Wednesday, 1 October 2014

సరస్వతీ తత్వం

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః           

Tuesday, 30 September 2014

గాయత్రి మంత్రం

ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం,పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి చంధసాం మాత - అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి అని అర్దం.

తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది. 24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు. ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివు
డు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు. అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని, గాయత్రీ మంత్రమే పరమమంత్రమని అర్దం. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది గాయత్రి మంత్రం.

ప్రపంచంలో గాయత్రి మంత్రం మీద జరుగినవి, జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని, ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగలేదంటే అతిశయొక్తి కాదు. ఇప్పటివరకు గాయత్రి మంత్రం మీద జరిపిన ఏ అధునిక పరిశోధన విఫలమవకపోవడం ఆశ్చర్యం.

అనాదికాలం నుంచి భారతీయ ధర్మంలో గాయత్రిమంత్రాన్ని వర్ణబేధం లేకుండా స్త్రీపురుషులందరూ ఉపాసించారు.

'ఓ సచ్చిదానందా! అనంతస్వరూప! ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ! ఓ నిరాకారా! సర్వశక్తివంతుడగు న్యాయకారీ! ఓ కరుణామృత వారధీ! నీ దివ్యము, వరేణ్యమూ అగు విజ్ఞానరూపమునుమేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణశక్తి గల బుద్ధినిత్తువు గాక! మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్‌వ్రతాలను ఆచరితుము గాక! విద్యా జ్ఞానము మొదలైన పరమసుఖములను పొందెదము గాక!' అంటూ గాయత్రి మంత్రానికి ఒక అర్దం ఉంది.   

Monday, 29 September 2014

అన్నపూర్ణదేవి

అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇది తరచూ పెద్దలు చెప్పే మాట. శాస్త్రమూ చెప్పిన మాట. అన్నం నుండే సమస్త జీవరాసి పుడుతోంది. ఆహారం తీసుకోవడం చేత, అది సప్తధాతువులుగా మారి, శరీరపోషణకు కారణమవుతోంది. సప్తధాతువుల్లో చివరివైన వీర్యం/అండంగా మారి, జీవరాశి ఉద్భవించడానికి కారణమవుతోంది. ఆహారం చేతనే సకల జీవరాశి జీవనం సాగిస్తోంది. 

అన్నం అనగానే మన తెలుగిళ్ళలో బియ్యం ఉడకబెట్టగా తయారయ్యే పదార్ధం అని కాకుండా, సంస్కృత భాషలో అన్నం అంటే ఆహారం అన్న అర్దం ఉంది. ఈ లోకంలో ఆయా వాతావరణపరిస్థితులు, ప్రాంతాలను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సంస్కృతభాషలో ఏ రకమైన పదార్ధానైనా అన్నం అనే అన్నారు. అందువల్ల ఏ విధమైన ఆహారపదార్ధానైనా పారేయడం దోషం అంటుంది శాస్త్రం. అంతే కాదు అహారం తినే సమయంలో కింద పడ్డ ఒక్కొక్క అన్నం మెతుక్కి 10,000 సంవత్సరాల నరకం అనుభవించవలసివస్తుంది. ఎన్నో జన్మలు ఆహారంలేక బాధపడవలసిన అగత్యం పడుతుందని శాస్త్రం చెప్పిన మాట.

ఎప్పుడు కూడా అన్నం మీద కోపం చూపించకూడదదు. పరబ్రహ్మస్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకుండా తినడమే మనం అన్నపూర్ణదేవికి ఇచ్చే గౌరవం. ఆకలితో మానవులకు, ఇతర జీవరాశులకు ఆహారాన్ని అందించి క్షుద్(ఆకలి) బాధ తీర్చడమే మనం అన్నపూర్ణాదేవికి చేసే నిజమైన అర్చన.

ఆదిభిక్షువైన 
ఆ సదాశివునికి భోజనవేళ నిత్యం బంగారుపాత్రలో ఉన్న ఆహారన్ని, బంగారు గరిటెతో వడ్డించే ఆ అన్నపూర్ణదేవి ఈ లోకంలో అందరికి యొక్క ఆకలిని తీర్చుగాకా. అందరికి జ్ఞానాన్ని, వివేకవైరాగ్యాన్ని ప్రసాదించుగాకా. 

Monday, 8 September 2014

గణపతి చేతిలో మోదకం

గణపతి చేతిలో మోదకం.............

'పూర్ణమోదక ధారిణం' అంటూ గణపతిని స్తుతిస్తాం. గణపతి పూర్ణ మోదకాన్ని పట్టుకుని ఉంటాడు. మోదకం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అంటే ఇహలోకానికి(మనకు కళ్ళకు కనిపించే ఈ లోకం) సంబంధించిన జ్ఞానం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఈ జగత్తంతా, ఏదో ఒకనాడు నశించిపోతుంది. అప్పుడు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం కూడా నశించిపోక తప్పదు. కానీ, ఎప్పటికి నశించని పరలోకం, పరతత్వం, పరబ్రహ్మం ఒకటున్నది. అది ఎప్పటికి నశించదు, దానికి సంబంధించిన జ్ఞానం కూడా శాశ్వతమైనది. అది ఆత్మకు సంబంధించిన జ్ఞానం. అది మహోత్కృష్టమైనది. అటువంటి జ్ఞానమే మనకు పూర్ణత్వాన్ని తిరిగి ప్రసాదిస్తుంది, భగవంతుడిని చూడగల శక్తినిస్తుంది, ఆఖరున పరమాత్మలో ఐక్యం చేస్తుంది, చిదానందాన్ని ఇస్తుంది. అటువంటి జ్ఞానమే జ్ఞాన ప్రదాత అయిన గణపతి చేతిలో మోదకమైంది. మోదాన్ని ఇవ్వడం గణేశ తత్వం. మోదం అంటే ఆనందం. ఎవరికి ఇతరులకు, ఆర్తులకు, కష్టాల్లో ఉన్నవారికి మాటలచేత, ఆర్ధికంగా, ఇతరత్రా విధానాల ద్వారా బాధను తగ్గిస్తారో, ఆనందాన్ని చేకూరుస్తారో, ధైర్యాన్ని ఇస్తారో వారికి తన చేతిలో మోదకాన్ని ఇస్తాడు గణపతి.

ఓం గం గణపతయే నమః           

Friday, 5 September 2014

కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి

ఓం గం గణపతయే నమః  

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. (శివుడు ఇల్లు లేకపొవడం ఏమిటి? లోకమంతా శివుడి నివాసమే. శివుడు లేని ప్రదేశమే లేదు. శివుడు యోగి కనుక నిరాడంబరంగా, హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తుంటాడు.)

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి  పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా,
'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు' అన్నాడు పరమశివుడు.


హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం, వండగానే గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. సమస్త లోకాల ఆకలి తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం. ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది. భగవంతుడు భక్తికి లొంగుతాడు, సంపదలకు, నైవేధ్యాలకు, దర్పాలకు కాదు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు, అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

ఓం గం గణపతయే నమః         

Wednesday, 3 September 2014

గణపతి - గుంజీళ్ళు

ఓం గం గణపతయే నమః

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు.

మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 'ఏం వెతుకుతున్నావు మావయ్యా!' అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అసలే ముద్దుల మేనల్లుడు. అందువల్ల 'బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా' అని బ్రతిమాలాడు. కానీ వినాయకుడు పట్టువదల్లేదు.

ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాక, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పిచేంతగా నవ్వాడు. ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు.

అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు మొట్టమొదట
గుంజీళ్ళు తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక.

గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఈ రోజు గుంజీళ్ళను 'సూపర్ బ్రెయిన్ యోగా'గా చెప్తున్నారు. కావాలంటే ఈ వీడియోను చూడండి.  http://www.youtube.com/watch?v=p876UDB8EN4



ఈ కధలో యోగ రహస్యం కూడా ఉంది. గణపతి మూలాధారంలో ఉంటాడు. విష్ణువు విశుద్ధచక్రానికి అధిష్టానదైవం. సుదర్శనం అనగా ఆజ్ఞాచక్రం. ములాధారంలో ఉన్న గణపతి సుదర్శన చక్రాన్ని మ్రింగడం అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని చేరడమన్నమాట. కుండలిని ఆజ్ఞాచక్రాన్ని చేరితే, ఇక మిగిలేది ఒక్క మెట్టు మాత్రమే. అప్పుడు ఆనందంతో జీవుడు నాట్యం చేస్తాడు. మానవ తత్వానికి, దైవత్వానికి మధ్య నిలిచి ఉంటాడు. కొన్ని సార్లు దైవానుభవాన్ని పొందుతూ, మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వస్తుంటాడు. దాన్ని సూచించేదే సర్వవ్యాపుకుడైన విష్ణువు గుంజీళ్ళు తీయడం. గణపతి ముందు రోజు గుంజీళ్ళూ తీస్తూ ఉంటే, ములాధారంలో ఉన్న కుండలినిశక్తి క్రమంగా జాగృతమవుతుంది.

ఓం గం గణపతయే నమః

Tuesday, 2 September 2014

గణపతి - సందేశం

ఓం గం గణపతయే నమః

గణపతి అనే శబ్దంలో 'గ' జ్ఞానానికి, 'ణ' నిర్వాణానికి సంకేతాలు కాగా, రెండింటికి అధిపతి, రెండిటిని ఏక కాలంలో ప్రసాదించగలిగినవాడు కనుక ఆయన్ను గణపతి అన్నారు అని బ్రహ్మవైవర్త్త పురాణ వచనం. జ్ఞానమే గణపతి యొక్క రూపం. గణపతికి పెద్దతల ఉంటుంది. ఇది బాగా ఆలోచించమని సూచిస్తుంది, పెద్దతల జ్ఞానానికి, మేధాశక్తికి సంకేతం. ఏనుగు కళ్ళు చిన్నగా ఉన్నా, చిన్న సూదిని కూడా చూడగలదు. చిన్నకళ్ళు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించమని, ప్రతి చిన్న విషయాన్నిపరిశీలించమని చెప్తాయి. చేట చెరుగుతుంది. అలాగే గణపతికున్న పెద్ద చెవులు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించమని, శ్రద్ధగా వినమని తెలియజేస్తాయి. జ్ఞానమును, విద్యను ఆర్జించడంలో శ్రద్ధయే కీలకం. గురువు అందరికి ఒకేలా చెప్తాడు. కానీ అది విన్నవారిలో ఒకడు మాహామేధావి, ప్రజ్ఞావంతుడవుతుంటే, ఒకడు వక్రమార్గం పడుతున్నాదు, విద్యను అర్దం చేసుకోలేకపోతున్నాడు. దానికి కారణం శ్రద్ధ.

గణపతి ఏకదంతుడు. ఒకే దంతం ఉన్నవాడు, చెడును వదిలి, మంచిని మాత్రమే నిలుపుకోమని తన ఏకదంతం ద్వారా లోకానికి సెలవిస్తున్నాడు. గణపతి వక్రతుండం ఆత్మకు, పరిపూర్ణమైన చైతన్యానికి సంకేతం. చిన్న నోరు తక్కువగా మాట్లాడమని సూచిస్తుంది.

గణపతికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో పాశం ధరించి ఉంటాడు. అంకుశం అహకారాన్ని, క్రోధాన్ని నాశింప చేసుకోవాలని చెప్పగా, పాశం మోహాన్ని వశం చేసుకోవాలని తెలుపుతుంది. గణపతి చేతిలో ఉండే మోదకం(లడ్డు), ఆ స్వామి మన సాధనకు మెచ్చి, ఇచ్చే పురస్కారం, అదే ఆత్మజ్ఞానం. మరొకచేతితో అభయముద్రలొ స్వామి సాక్షాత్కరిస్తాడు. భగవంతుడి మార్గంలో నడిచేవారికి సర్వేశ్వరుడు అభయాన్ని, రక్షణను ఇస్తాడని చెప్తుందీ అభయహస్తం.

గణపతికి పెద్ద బోజ్జ ఉంటుంది. అందుకే ఆయనకు లంబోదరుడని పేరు. సర్వలోకాలు, సమస్త బ్రహ్మాండాలు తన ఉదరమందు ఉండడం చేత ఆయన లంబోదరుడయ్యాడు. జీవితం అంటే కష్టసుఖాలు, మంచి చెడుల సంగమం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను, మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలని సూచన చేస్తుంది లంబోదరం. అట్లాగే ఎవరు ఏది చెప్పినా విను, ఇతరులు బాధలో పంచుకున్న రహస్యాలను నీలోనే దాచుకో అని చెప్తుంది లంబోదరం.

గణపతి వాహనం ఎలుక. ఎలుక మనసుకు, కోరికలకు ప్రతీక. మనసు ఒక విషయం మీద ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనలని మన మనసు నియంత్రిచడం కాదు, మనమే మన మనసును నియంత్రించుకోగలిగిన సత్తా కలిగి ఉండాలని సూచిస్తుంది ఎలుక వాహన. అంతేకాదు, మనం మన కోరికల మీద స్వారీ చేయాలి కానీ, కోరికలు మన మీద స్వారీ చేసి, మనకు బాధను మిగల్చకూడదని చెప్పడానికి గణపతి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు.

గణపతి పాదాలచేత ఉంటుంది ప్రసాదం. మనం కోరాలేకాని ప్రపంచం మొత్తాన్ని మన కాళ్ళ దగ్గర ఉంచగలడు గణపతి. అంతేకాదు, పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్నవాడి పాదాలకు ప్రపంచం దాసొహం అంటుందని అర్ధం.

గణపతి గురించి చెప్పుకుంటే సమస్త బ్రహ్మాండం గురించి చెప్పుకున్నట్టు. అటువంటి గణపతి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండుగాకా.

ఓం గం గణపతయే నమః            

Sunday, 31 August 2014

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది.

గణపతి దేవతలకు ఆదిదేవుడు. గణాలకు మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదేవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద.

అటువంటి గణపతిని పరమభక్తితో గణపతిని పూజించడం వలన నాకు అది ప్రాప్తిస్తుంది, ఈ ఫలాన పని జరుగుతుందన్న ఫలాపేక్ష లేకుండా, నిత్యం ఆరాధించడం వలన త్వరితంగా జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన 'ఏకసంధాగ్రహణ' శక్తి లభిస్తుంది.  గణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెప్తారు. కనుక ఇంజనీరింగ్, అకౌంట్స్, గణితం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇది విశేష ఫలితం లభిస్తుంది. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు వినాయకుడు.

గణపతి సర్వజనులను వశం చేసుకోగలిగిన వశీకరణ విద్యను ప్రసాదిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావల్సినది ప్రజల అభిమానం, అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోవడం. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది.

గణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది సృజనాత్మకత (క్రియేటివిటి). గణపతి నిత్యం భక్తితో కలిచేవారికి సృజనాత్మకత సహజంగానే సిద్ధిస్తుంది.      

గణపతి ఆనందస్వరూపుడు. వినాయకుడి గురించి చెప్పుకోవడమే ఆనందం. గణపతిని ఉపాసించేవారు నిత్యం ఆనందంతో జీవిస్తారు. గణపతి క్షిప్రప్రసాది. భారీ పూజలు చేయవలసిన పని లేదు, చిన్న పూజలకే చాలా సులభంగా కోరికలను తీరుస్తాడు.

జ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు. గణపతి యోగశాస్త్రంలో కాపలాదారుడు. వక్రమార్గంలో శక్తులను సాధించకుండా గణపతి మూలాధారంలో కాపాలకాస్తాడు. వాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు. గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తు దోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు వినాయకుడు.

గణపతి లీలావైభవం ఎంతని చెప్పుకోగలం.

ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఏకదంతుడు, వక్రతుండుడైన గణపతిని మన మనసును ప్రభావితం చేయుగాకా. మనలని మంచి మార్గంలో నడిపించిగాకా.

ఓం గం గణపతయే నమః