Friday, 31 July 2015

గురు పూర్ణిమ సందేశం

అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు.

ఈశ్వరుడు ఒక్కో యుగంలో ఒక్కో మహాగురువుగా అవతరించాడు కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా.......... కానీ రాబోయే కలియుగాన్ని, అందులో మానవుల కష్టనష్టాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భగవానుడే ద్వాపరయుగాంతంలో వేదవ్యాస మహర్షిగా అవతరించారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. వేదాలను గ్రంధస్థం చేయుటయే కాక, అనేక మన్వంతరాలు, కల్పాలు, ఇతర సృష్టిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్న ధర్మసూక్ష్మాలను మానవాళికి అందించి, వారి ఉద్ధతి కోసం 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించారు. బ్రహ్మసూత్రాలను అందించారు. తాను బ్రహ్మనిష్ఠుడై ఉండీ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పటికి, మానవాళి మీద ప్రేమతో క్రిందకు దిగి వచ్చి ఈ రచనలు చేశారు. అంతమేలు చేసిన వ్యాసునికి కృతజ్ఞత ఆవిషకరించడం కోసమే వ్యాసజయంతిని వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటాం.

గురుపూర్ణిమ రోజున చేసే పూజ చేతనే వ్యాసుడు సంతృప్తి చెందుతాడా అంటే కాదనే చెప్పాలి. ఆయన అంత శ్రమపడి ఇచ్చిన వాటిని పాటించకుండా ఉంటే ఆయనకు ఎంత బాధ కలుగుతుంది? వ్యాసుడు ఇచ్చిన పురాణలను ఆకళింపు చేసుకుని నిత్య జీవితంలో అనుష్ఠించాలి. ధర్మాన్నే పాటించాలి. వేదాలను, పురాణేతిహాసాలను రక్షించుకోవాలి. అదే వ్యాసుడికి చేసే నిజమైన గురుపూజ. గురువు చెప్పినదాన్ని పాటించడం చేతనే గురువు సంతోషిస్తాడు. గురుపూర్ణిమ మనలో అలాంటి మార్పును తీసుకురావాలి. నేను ధర్మాన్నే పాటిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సంకల్పించుకుని దాన్ని అమలుపరచాలి. అప్పుడే మనపై వేదవ్యాసమహర్షి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.  

సద్గురు శివానందమూర్తి గారు మొదలగు అనేకమంది సిద్ధపుర్షులు, యోగుల యొక్క అమృతవాక్కుల సమాహారం ఇది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ శుభాకాంక్షలు 

గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరంలాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.

మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే, ఆయన తాండవ నృత్యం చేసారు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయనను చూచినవారందరూ అర్ధం చేసుకున్నారు. జనాలు వచ్చి, ఆయన వారితో సంభాషిస్తాడేమో అని ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేకపోవడం వలన వచ్చినవారందరూ కొంతకాలం ఎదురు చూసి వెళ్ళిపోయారు.

ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోలేదు. “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు.

అందుకని వారు తయారవటం ప్రారంభించారు- దిన దినం, ప్రతిరోజూ అలా నెలలు, సంవత్సరాలు తరబడి వారు సంసిద్ధమవుతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకో కూడదనుకున్నాడు. 84 సంవత్సరాల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో –ఆదియోగి ఈ ఏడుగురిని చూసారు. వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్నిఅందుకోవటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.

ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. ఆయన వారిని ఇక పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వారు ఆయన దృష్టిని ఆకట్టుకున్నారు. తరువాతి 28 రోజులు ఆయన వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి దక్షిణ దిశవైపుకి తిరిగి, 'యోగ శాస్త్ర' ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.

మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది. మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది.

గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అసలు మీరు గురువుని కోరరు. మీ మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు – అప్పుడు మీకు గురువు లభిస్తారు. మీరు ఉత్తమమైన గురువుని ఎంచుకుంటూ, వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మీలో తీవ్రమైన తపన పెంచుకోండి మీకు గురువు సంభవిస్తాడు, గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అది కేవలం మీకు సంభవించగలదు. అదేదో మీరు కలిసేది కాదు. అదేదో మీరు కరాచలనం చేసేది కాదు. మీరు వంగి నమస్కరించ గలిగేది కాదు. మీరు దగ్గరకు వెళ్లి ఇది కావాలి అది కావాలి అని యాచించ గలిగేది కాదు. మీరు గురువు అనుకునే ఆ స్థితి, ఆ శక్తి మీకు ప్రాప్తిస్తుంది. అది మిమ్ముల్ని ముంచివేస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని నాశనం చేసి, మీరు ఏ బంధనాలు లేకుండా, సృష్టికర్త మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండేలా చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు జగ్గీ వాసుదేవ్

సేకరణ: http://blog.ishafoundation.org/te/2014/07/08/guru-pournami-aadi-guruvu-udayinchina-roju/

గురుతత్వం పై శ్రీ ఆదిశంకరచార్యులుఈశ్వరుడే అందరికి ఆదిగురువు. మన అందరిపై ఆ గురుకటాక్షం ఉన్నది. గురువు అనుగ్రహంతో, సాధన ద్వారా ప్రతి ఒక్కరు మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ అందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

గురువు పరుసవేది కంటే గొప్పవాడు. పరుసవేది తన దగ్గరకు తెచ్చిన ఇనుప ముక్కను బంగారం ముక్కగా మార్చగలుగుతుందే కానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు. కానీ గురువు ఎంతటి కరుణాసిధువు, కారుణ్యమూర్తి అంటే తనను ఆశ్రయించిన శిష్యుని తనంతటి వాడిని చేస్తాడు.  

పంచపాదికలో శ్రీ ఆదిశంకరచార్యులు 

Thursday, 30 July 2015

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

31 జూలై 2015, శుక్రవారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకి నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తారు.  

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణినికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు. నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని మహాత్మాతమను ఏయే రోజుల్లో ఏ విధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ గురించి మరిన్ని విశేషాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి ' గురుపూర్ణిమ ' అనే లెబుల్ క్రింద చూడగలరు.

Originally published -11-July-2014
1st Edit: 30-July-2015

Wednesday, 29 July 2015

నీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు.

'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.

నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.

నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.

ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.

నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటి తరగని వనరని మాకు భావన ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.

పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.

రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?

గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.

ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.

ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.

జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.

చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.

గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.

కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.

నేనుడే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శత్బాదంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.

నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.

అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.

కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం.

మీ అబ్దుల్ కలాం
ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం. 

Tuesday, 28 July 2015

అబ్దుల్ కలాం గారికి ప్రేరణ శివానంద సరస్వతీఅబ్దుల్ కలాం గారికి ప్రేరణ ఇచ్చిన స్వామి శివానంద సరస్వతీ

కలాంగారు యుక్తవయసులో ఉన్నప్పుడు వారికి పైలట్ ఆశ ఉండేది. అందుకని ఆయన భారతీయ వాయుసేనలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. కాని అందులో రాకపోవడంతో బాధపడిన కలాం గారు రిషికేష్‌కు వెళ్ళారు. అక్కడే వారు జీవన్ముక్తులు, కొన్ని కోట్లమంది జీవితాల్లో వెలుగులు నింపిన సాధుపురుషులు, స్వామి చిన్మయానందకు సన్యాసం ఇచ్చిన గురువులైన స్వామి శివానంద సరస్వతీ గారిని కలిసారు. ఆ ఘటన వారి జీవితాన్ని మలుపు తిప్పింది. వారి 'వింగ్స్ ఆఫ్ ఫైర్' 19 పేజీ లో వారు ఇలా చెప్పారు.

'గంగానదిలో స్నానం చేసి, ఆ పవిత్రజలాల వల్ల మంచి అనుభూతిని పొందాను. అప్పుడు అక్కడే చిన్న కొండ మీదనున్న స్వామి శివానంద ఆశ్రమానికి నడక సాగించాను. అక్కడికి ప్రవేశించడంతోనే చాలా బలమైన భావ తరంగాల ప్రభావానికి లోనయ్యాను. తమను తాము మైమరిచిన స్థితిలో అనేకమంది సాధువులు అక్కడ కూర్చుని ఉండడం చూశాను. సాధువులకు వ్యక్తులు మానసిక స్థితిని తెలుసుకోగల శక్తి ఉంటుందని చదివాను. అందువలన వారినుంచి నా పరిస్థితికి, నన్ను ఇబ్బంది పెడుతున్న సందేహాలకు సమాధానాలు ఆశించాను.

మంచి వంటి తెల్లటి వస్త్రాలు, చెక్క పాదుకలు ధరించి, బుద్ధుడుని పోలి ఉన్న స్వామి శివానందగారిని కలిసాను. నల్లటి కన్నులతో తీక్షణమైన చూపులతో మంచి శరీరఛ్ఛాయతో ఉన్నారు. వారి యొక్క కరుణను, పసిపిల్లలవంటి చిరునవ్వును చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాను. నన్ను నేను స్వామిజికి పరిచయం చేసుకున్నాను. నా ముస్లిం పేరు వారిలో కాసింత వ్యతిరేక ప్రతిస్పందన కూడా కలగలేదు. నేను మరింత మాట్లాడేబోటుంటే, స్వామి నా దుఃఖానికి గల కారణమడిగారు. నేను దుఃఖంతో ఉన్నానని వారికి ఎలా తెలుసో, వారు చెప్పలేదు, నేను కూడా అడగలేదు.

భారతీయ వాయుసేనలో చేరటానికి చేసిన విఫలయత్నం గురించి చెప్పి, పైలట్ కావలనే నా చిరకాల వాంఛ గురించి చెప్పాను. అప్పుడు వారు నవ్విన చిరునవ్వు నాలోని ఆందోళనను తుడిచివేసింది.

కోరిక, బలమైనది, తీవ్రమైనది అయినప్పుడు, అది ఆత్మ మరియు హృదయం నుంచి ఉద్భవించినప్పుడు గొప్ప విద్యుత్ అయస్కాంతశక్తి కలిగి ఉంటుంది. ప్రతి రాత్రి నిద్రాస్థితిలో ఈ శక్తి మనసు నుంచి ఆకాశంలోకి విడుదలవుతుంది. ప్రతి ఉదయం చేతనలోకి రాగానే విశ్వప్రవాహల చేత మరింత బలం పుంజుకుని తిరిగి ప్రవేశిస్తుంది. అది ఖఛ్ఛితంగా నెరవేరుతుంది. ప్రతి ఉదయం సూర్యోదయమవ్వడం ఎంత నిజమో, కాలతీతమైన ఈ వాగ్దానం కూడా అంతే నిజమని నువ్వు విశ్వసించు.

శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. ఎంత సత్యమైన మాట ఇది. దారితప్పిన విద్యర్ధికి దిశానిర్దేశం చేసే గురువు ఇక్కడే ఉన్నాడు. 'నీ విధిని అంగీకరిచి జీవితంలో ముందు సాగిపో. వాయుసేన పైలట్ అవ్వడం నీ గమ్యం కాదు. నీవు ఏమవుతావనేది ఇప్పుడు వెల్లడి కాలేదు, కానీ అది ముందుగానే నిర్ణయించబడింది. ఈ వైఫల్యం మర్చిపో, ఇది నీ గమ్యస్థానానికి చేర్చే మార్గం అయ్యింది. దానికి బదులుగా, నీ అస్థిత్వం/ఉనికి యొక్క నిజమైన ప్రయోజనం కోసం శోధించు. నీ ఆత్మతో ఏకమవ్వు. నా తండ్రి! భగవంతుని ఇఛ్ఛకు శరాణగతుడవు అవ్వు' అన్నారు స్వామిజీ.

ఈ సంఘటన కలాం గారి జీవితాన్ని మార్చేసింది. సాధూనాం దర్శనే పుణ్యం, సమాగమే సర్వం లభతి అన్నారు సుభాషితకారులు. సాధువుల దర్శనమే పుణ్యమని, వారితో కలిసి మాట్లాడటం వలన పొందలేనిది లేదని అర్దం. దానికి ఇదే కదా ప్రత్యక్ష ఉదాహరణ.  స్వామి శివానందగారి దర్శనం, ఉపదేశం, భారతదేశం గర్వించదగ్గ ఓ పురుషుడిని  ఇచ్చింది. వారి ద్వారా భరతమాత అణురంగంలో స్వాలంబన సాధించగలిగింది. 

పుష్కరాలు - నా అనుభవాలు - 2

పుష్కరాలు - నా అనుభవాలు - 2

హైద్రాబాదులోనే రైలు నాలుగు గంటల లేటుగా మొదలైంది. అక్కడకు చేరుకునే సరికి, మధ్యలో సిగ్నల్ లేకపోవడం, అంతా కలిపి కొవ్వూర్ చేరడం కొద్దిగా ఆలస్యమైనా రైలు ప్రయాణం మిగ్లిచిన అనుభూతులు ఆనందాన్నే ఇచ్చాయి. కొవ్వూర్‌లో మాకు చుట్టాలు లేరు, కానీ మాకు కుటుంబ సభ్యుల స్నేహితులకు అక్కడ ఇల్లుందని వాళ్ళింటికి ఆహ్వానించారు. నిజానికి అది వాళ్ళ ఇల్లు కూడా కాదట. వాళ్ళ బంధువులదట. ఆ ఇల్లు పాడుబడి పిచ్చిమొక్కలతో ఉండేదట. పుష్కరాలు వస్తున్నాయి, పుణ్యస్నానానికి వచ్చే పదిమందికి ఆశ్రయం ఇస్తే మంచిదని తలచి, మమ్మల్ని ఆహ్వానించినవారు ఆ ఇల్లు తీసుకుని, దాన్ని బాగు చేయించి, పిచ్చి మొక్కలన్నీ తీయించి, పుణ్యకార్యం కోసం అతిధులు వస్తున్నప్పుడు పవిత్రంగా ఉండాలని గోమయంతో శుద్ధి కొని చేయించారు. వాళ్ళే లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. పనివాళ్ళను కూడా నియమించారు. అందరికి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఇదంతా ఎంత ఖర్చు. పోనీ ఇల్లేమైనా ఉచితంగా ఇచ్చారా అంటే అదీ లేదు. కేవలం 12 రోజుల వాడుకోవటానికి ఒక నెల అద్దె కట్టమన్నారు. అది ఏ 5 వేలో, పది వేలో కాదు. చాలా ఎక్కువే. 30 పదులు దాటింది. అంత ఖర్చు పెట్టి, చేయడం ఎందుకంటే పుణ్యం కోసం అన్నారు. అదేకాక వాళ్ళ అమ్మమ్మగారి సొంతూరు కొవ్వూరట. అప్పట్లో పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకించి డబ్బు దాచుకుని మరీ ఏర్పాట్లు చేసేవారట. వాళ్ళమ్మగారు కూడా ఆవిడకున్న దాంట్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారట. ఇప్పుడు వాళ్ళంతా లేకపోవచ్చు, ఈయన పెరిగి పెద్దవారయ్యారు, తాతయ్య కూడా అయ్యారు. కానీ పెద్దలు చేసినదేదైనా పిల్లలు తప్పక ఆచరిస్తారు. వాళ్ళ పూర్వీకులు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని ఆపడం ఇష్టం లేక, మాకు ఆతిధ్యం ఇచ్చిన కుటుంబం వారు హైద్రాబాదు నుంచి కొవ్వూరు వచ్చి, ఏర్పాట్లు చేశారు. వారు, వారి భార్య వస్తే ఫర్వాలేదు. వాళ్ళ పిల్లలు ఆపీసులకు సెలవు పెట్టి మరీ వచ్చారు. ఈయనే పెద్ద అనుకుంటే, ఈయన 90 ఏళ్ళ వయసున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా తమతో తీసుకువచ్చారు. ఇంతమందికి ఆతిధ్యం ఇచ్చి, అందరూ సంతోషంతో వెళ్తుంటే చూసి మురిసిపోవాలాని ఆ పెద్దల కోరికట.

ఏదైనా ఒక ఊరికి వెళితే, ఎంతో డబ్బు ఖర్చని భావిస్తున్నారు. అలాంటిది ఊరు కాని ఊరులో అక్కడకు వచ్చే యాత్రికుల కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇది ఈ ఒక్క కుటుంబమే చేసిన పని కాదు. దాదాపు జనవరి నుంచి రాజమండ్రి, గోదావారి పరివాహాక ప్రాంతంలో ఉన్న ఖాళీ ఇళ్ళ అద్దె ధరలకు రెక్కలు వచ్చాయి. ఎంతోమంది విదేశాల నుంచి కూడా ఈ 12 రోజుల పుష్కరంలో తమ బంధువులకు ఆతిధ్యం ఇవ్వడం కోసం ఇళ్ళు బుక్ చేసుకున్నారని జర్నలిస్ట్‌ల ద్వారా తెలిసింది.

ఇక గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉంటున్నవారి సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది? సంవత్సరం ముందు నుంచే ఆహ్వానాలు వెళ్ళిపోయాయి. 'మీరు మాత్రం మా ఇంటికే రావాలి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇంకేక్కడికి వెళ్ళకండి, నేరుగా ఇటే వచ్చేయండి. వస్తామని మాకు మాట ఇవ్వండి' అంటూ ఎవరికి వారు తమ బంధువులను బ్రతిమాలారు. ఆహ్వానం పంపడం వేరు, బ్రతిమాలడం వేరు. ఎందుకంటే పుష్కర సమయంలో చేసిన ఏ కొద్ది పుణ్యమైనా గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం వచనం. విచిత్రం ఏమిటంటే ఒకసారి చెప్పి వదిలేయడం వేరు, సంవత్సరం ముందు చెప్పినా, జనవరి నుంచి ప్రతి నెలా ఫోన్లే. 'టికేట్లు బుక్ చేసుకోండి, రైలుకు దొరక్కపోతే, బస్‌లో రండి, అది కాకపోతే ట్యాక్సీ కట్టుకుని రండి, కానీ మా ఇంటికే రండి, ఇంకెక్కడికి వెళ్ళకండి' అంటు బ్రతిమాలారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, బాసర నుంచి అంతర్వేది వరకు, గోదావరి తీరం వెంట, గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న ఊర్లల్లో నివసిస్తున్న వారి బంధువులు చాలామందికి విదితమే అనుకుంటాను.

ఆయా ప్రాంతంలో నివసిస్తున్నవారికి పుణ్యం చేసుకోవటానికి ఇదో మంచి అవకాశం. దైవకార్యం మీద వెళుతున్న పదిమందికి ఆశ్రయం కల్పించటం కూడా పుణ్యమే కదా. పైగా ఇలాంటి సమయాల్లోనే బంధువులంతా కలుస్తారు. ప్రేమలు, ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. పుష్కరసమయం అనగానే అదొక పుణ్యసమయమని మనసులో పాతుకుపోవడంతో, అప్పుడు కలిగే అనుభూతులే వేరు. సాయంకాలం అయ్యేసరికి ఇంతమంది బంధువులు, మిత్రులందరూ కూర్చుని, సామూహిక లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలు చేయటం, భక్తి గీతాలు ఆలపించటం నిజంగా మరువలేని ఓ అనుభూతి. మీడియా చానెల్లు పుష్కర ఘాట్లకే పరిమితమవుతాయి, అవి గుమ్మం దాటి ఇంట్లోకి రాలేవు కదా! పుష్కరప్రయాణం ఇలాంటి ఎన్నో మరువలేని అనుభూతులను ఎందరికో మిగిల్చింది.

To be continued ......................................

Monday, 27 July 2015

పుష్కరాలు - నా అనుభవాలు - 1

పుష్కరాల్లో నా అనుభవాలు - 1

పుష్కరాల గురించి మీడియా రెండుగా విడిపోయింది. ఒకదానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని పొగిడడమే పని, ఇంకోవైపు ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని తెగడడమే పని. అదేదొ పుష్కరాలు ప్రభుత్వ కార్యక్రమం అయినట్టు దాని మీద నానా రభస చేసింది మీడియా. పుష్కరాలకు హిందువులకు సంబంధించిన ఒక సంప్రదాయవేడుక. అది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. పుష్కరాల్లో ప్రభుత్వాలే కాక, ప్రజలు కూడా చాలా విశేష సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారే కార్యకర్తలై, తమ ధర్మానికి చెందిన ఒక క్రతువును విజయవంతం చేయటానికి తమ వంతు కృషి చేశారు.

ఈ పుష్కరాల్లో ప్రజలు చేసిన కృషిని, వారి సేవను దాదాపు చాలా శాతం మీడీయా చూపించలేదనే చెప్పాలి. ఈ విషయాన్నే మిత్రులతో పంచుకున్నప్పుడు, పుష్కరాల్లో ప్రజల భాగస్వామ్యం గురించి, తమ ధర్మం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, నిబద్ధత గురించి అందరికి తెలియజెప్తే బాగుంటుందని అన్నారు. హిందువుల దౌర్భాగ్యం ఏమంటే హిందువులు చేసిన ఏ మంచి పనిని పొగడటానికి మీడియాకు నోరు రాదు, కానీ ఏదో విధంగా ఎప్పుడూ ఎలా దాడి చెద్దామా అని కళ్ళలో వత్తులు వేసుకుని కూర్చుంటారు. మరి మన గురించి ఎవరూ చెప్పరా? చెప్పకపోతేనేం? మనమే చెప్పుకుందాం. అందుకే ఈ చిన్న ప్రయత్నం.


మొన్నే మేము కూడా పుష్కరాలకు వెళ్ళి పుష్కరస్నానం చేసి వచ్చాం. ఈ పుష్కరాలు చాలా మంచి అనుభూతులను పంచాయి. ప్రయణంలో జరిగిన ప్రతి సంఘటనా, ధర్మం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. హైద్రాబాదు నుంచి కొవ్వూరుకు రైల్‌లో ప్రయాణం చేశాం. విజయవాడ వరకు ప్రయాణం బానే సాగింది. సికింద్రాబాదులోనే రైలు సగం నిండిపోయింది. అర్ధరాత్రి సమయంలో విజయవాడ చేరింది. ఉదయం లేచు చూద్దును కదా, కాళ్ళ దగ్గర బ్యాగులు పెట్టుకుని జనం కూర్చుకున్నారు, మధ్య బెర్త్ నుంచి దిగి కింద కాళ్ళు పెడదాం అనుకుంటే అక్కడ కూడా ఎవరో దుప్పటి పర్చుకుని నిద్రపోతున్నారు. రైలు మొత్తం కిక్కిరిసిపోయింది. జనరల్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో రిజర్వేషన్ బోగీల్లోకి జనం వచ్చేశారు. బాత్రూంకి వెళ్ళే అవకాశం కూడా లేదు. కొందరు నిల్చునే నిద్రపోతున్నారు, కొందరు దారిలో కూర్చున్నారు. పసిపిల్లలని వెంటబెట్టుకుని వచ్చేశారు కొందరు. బాత్రూం దగ్గర కూడా కూర్చున్నారు చాలామంది.

బయట జోరున వాన. అందరూ ఎక్కిదిగటంతో కంపార్ట్‌మెంట్ అంతా చిత్తడి చిత్తడిగానే తయారయ్యింది. ఎక్కడపడితే అక్కడ సామనులు, బ్యాగులు పెట్టేశారు. రోజు ప్రయాణం చేసే సిటీబస్సు కిక్కిరిసి ఉండి, తెలియకుండా ఎవరి బ్యాగైన మీద పడితే నానా రభస చేసే జనం, అక్కడ అంత కిక్కిరిసి ఉన్నా, సామాన్లు ఎలా పడితే అలా పడేసి ఉన్నా, ఒకరి మీద ఒకరి పడిపోతున్నా, సహనం కోల్పోలేదు. ముగ్గురు కూర్చునే సీట్లో 5-6 మంది కూర్చున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నవారు 'మేము మీకు సీటు ఎందుకివ్వాలి?' అని మిగితావారని ప్రశ్నించలేదు. రండి, కలిసి కూర్చుందాం అంటూ సీటు పంచుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. బయట వర్షం కురుస్తూ, లోపల తడిగా మారినప్పుడు సాధారణంగా చికాకు కలుగుతుంది. కానీ పుష్కరస్నానం కోసం వెళ్ళే యాత్రికుల్లో అసలు అసహనం కనిపించలేదు. అందరిలో ఏదో శాంత భావం, తెలియని ఆనందం మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రయాణం మొత్తం చాలా సరదాగా సాగింది. ధనిక పేద, కుల, ప్రాంత బేధాలు కూడా మరచి జనం ప్రయాణం చేశారు.

మామూలు రోజుల్లో రైలు గమ్యస్థానం చేరుకున్న తర్వాత జనం ఒకరిని ఒకరు తోసుకుని, సామాన్లు కిందపడేసుకుని నానా గొడవ చేసుకుంటారు, కానీ పుష్కర ప్రయాణంలో అలా ఎక్కడా జరగలేదు, ఎవరు తోసుకోలేదు. ఒకరి తర్వత ఒకరు నెమ్మదిగా దిగారు. పక్కవారి సామాన్లు దింపడంలో సాయం చేసుకున్నారు. పెద్దవయసు వారిని దగ్గరి ఉండి మరీ దింపారు. పోని ఇదంతా ఎవరైనా పోలీసులు చెప్పడం చేతనో, లేక ఎవరైనా ఉండి క్రమశిక్షణ నేర్పడం చేతనో వచ్చిన మార్పు కాదు. మొత్తం ప్రయాణం చేస్తున్నవారందరిలోనూ ఒకటే భావం, మేము పుణ్యస్నానానికి వెళుతున్నాం, మా ధర్మానికి సంబంధించిన ఒక ఉత్సవానికి వెళుతున్నాం, ఇది మాకు సంబంధించిన పండుగ.

ఇదంతా చూసి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, అంతకంటే ఎక్కువ ఆనందం కూడా కలిగింది. ఇంతమంది ఇంత వ్యతిరేకపరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ కూడా ఎక్కడ సహనం కోల్పోకుండా, సోదరభావంతో మెలిగారంటే ఇది మాత్రం ఖచ్చితంగా ధర్మ వైభవమే. ఎవరైనా ధర్మం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఇదే చెప్పాలనిపిస్తోంది. ప్రజల మధ్య ఐక్యతకు ధర్మమే కారణమన్న ఋషుల మాటకు ఇదియే నిదర్శనంగా కనిపించింది. ఇన్ని కోట్ల మంది ఒక చోటుకు చేరినా, ఏ విధమైన ఘర్షణ లేకపోవడం, వారి మధ్య సఖ్యతను పెంచేందుకు, గోడవలు కాకుండా నియత్రించేందుకు ఏ వ్యవస్థ లేకపోయినా, అందరు కలిసి సరదాగా ప్రయాణం చేయడం ధర్మం యొక్క గొప్పతనమే.

మిత్రుల సహకారంతో ఫొటో తీయడం జరిగింది.

To be continued ....................

Sunday, 26 July 2015

27-7-2015, సోమవారం, తొలి ఏకాదశి

ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని  మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు.

అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు.

దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి. అందువల్ల శరీరంలో ఉన్న జీవక్రియలు మందగిస్తాయి, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అదే మన అందరిలో ఉన్న విష్ణువు యొక్క నిద్ర, ఆఖిల జగత్తును ఏలే విష్ణువు యొక్క యోగ నిద్ర.        

ఇదే కాదు, దక్షిణాయనం ఉపాసనా కాలం. ఈ 6 నెలలు భగవదుపాసన చేయాలి. ఎవరైతే ఈ సమయంలో శాస్త్రనియమాలను పాటిస్తూ, ఉపాసన చేస్తారో వారిని యెడల అపారమైన అనుగ్రహాన్ని వర్షించడం కోసం విష్ణుమూర్తి బాహ్యనేత్రాలను మూసి, అంతఃనేత్రాల ద్వారా చూస్తుంటాడు. ధర్మాన్ని అనుషిటించేవారికి సకల శుభాలు చేకూరుస్తాడు.

దక్షిణాయనం గురించి ఈ లింక్ లో చూడండి.
http://ecoganesha.blogspot.in/2013/07/blog-post_17.html

ఈ ఏకాదశి నుంచి అనేక పండుగుల, పర్వటి రోజులు ఉంటాయి. ఇది అన్నిటికంటే ముందు వస్తుంది కనుక తొలి ఏకాదశి అని పేరు. ఈ తొలి ఏకాదశి రోజున అందరు తప్పకుండా పేలాల పిండిని విష్ణువుకు సమర్పించి నైవేధ్యంగా తినాలి. ఈరోజున చేసే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం, శ్రీ విష్ణుసహస్రనామ పారయణం, ఏకాదశి వ్రతం విశిష్టఫలాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి.

నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే, సహస్రపాదాక్షి శిరోరుబాహవే,
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి యుగధారిణే నమః

అంతటా వ్యాపించినవాడు, అంతము లేనివాడు, అనంతుడు, అనేక రూపాలలో దర్శనమిచ్చేవాడు, అనంతమైన బాహువులు, కన్నులు, పాదాలు కలిగిన విరాట్ పురుషుడు, లెక్కలేనన్ని పేర్లతో పిలువబడేవాడు, శాశ్వతమైనవాడు, సహస్రకోటి బ్రహ్మాండాలను ధరించి, రక్షించి, పోషిస్తున్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను.

ఈ రోజున తప్పక దగ్గరలో ఉన్న శ్రీ మహా విష్ణువు ఆలాయన్ని, శ్రీ మహా విష్ణు అవతారం కొలువై ఉన్న ఆలయాన్ని సందర్శించండి.

ఓం నమో నారాయణాయ        

Originally Posted: Deva Sayana Ekadasi 2013
1st Edit: 07-July-2014
2nd Edit: 26-July-2015

హిందూ ధర్మం - 168 (శిక్షా - 2)

అసలు శబ్దం కోసం, ఉఛ్ఛారణ కోసం ఒక శాస్త్రం అవసరమా? అని అడుగుతారు. భాష గురించి ఆధునిక చరిత్రకారులు వివరిస్తూ, మొదట ఆదిమానవుడు ఉన్న సమయంలో అసలు లిపి అనేదే లేదని, మొదట సైగలతో బ్రతికేశారని, తరువాత బొమ్మలు వేయడం మొదలుపెట్టారని, ఆ తర్వాతి క్రమంలో భాష మొదలైందని చెప్తారు. కానీ ధర్మం అలా చెప్పదు. సృష్ట్యాదిలో భగవంతుడు మానవులను సృష్టిచడంతోనే వేదాలను వ్యక్తపరిచాడని శాస్త్రగ్రంధాలు అంటాయి. అక్కడే భాష కూడా మొదలైంది. సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మన భాషలకు ఉన్నది వర్ణమాల. వర్ణమంటే ప్రత్యేక ఉచ్చారణ గల శబ్దాలను సూచించే సంజ్ఞలు. సంస్కృతం వ్యాకరణములలో కంఠ్యములు, తాలవ్యములు, మూర్థన్యములు, దంత్యములు, ఓష్ట్యములు అని ఉన్నాయి. అంటే కొన్ని గొంతుతో పలికేవి, కొన్ని ముక్కుతో పలికేవి, కొన్ని నాలుకతో పలికేవి, కొన్ని పన్నులతో పలికేవీ...... ఇలా అన్నమాట. ప్రపంచంలో దాదాపు 98% భాషలకు సంస్కృతమే తల్లి అని ఫోర్బ్స్ మొదలైన పత్రికలే కాక, అనేక పరిశోధనలు కూడా ఋజువు చేశాయి. అయినా ఇతర దేశాల భాషలకంటే భారతీయ భాషలకు సంస్కృతంతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. తెలుగు, కన్నడ మొదలైన భాషలు సంపూర్ణమైనవి కావు. వాటిలో అనేక పదాలకు ఇప్పటికి సంస్కృతానికి చెందినవే. ఆ మాటకు వస్తే, ఒక్క సంస్కృతం తప్ప మరే ఇతర భాష సంపూర్ణం కాదు.ఇంగ్లీష్ విషయం తిసుకున్నా, 'ఇంగ్లీష్ లో ఒక్క a తప్ప మిగిలినవి అన్ని ఒక్క నాలుకను మాత్రమే  ఉపయోగించే పలికే శబ్దాలే. నాలుకను ఉపయోగించకుండా మిగితావి పలకలేము. అందుకే ఆంగ్లేయులు నాలుకను భుజాన వేసుకుని ప్రపంచాన్ని పరిపాలించారు. తెలుగు, సంస్కృతం మాట్లాడటంలో మన శరీరం, నోరు, గొంతు భాగంలోని ప్రతి అవయవం పనిచేస్తుంది, అందులో చలనం వస్తుంది. 72,000 నాడులను సంస్కృతం ఉత్తేజపరుస్తుంది. అందుకే భారతీయ బాషలను, ముఖ్యంగా సంస్కృతాన్ని మాట్లాడేవారు ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు' అని స్వర్గీయులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారు అనేవారు. ఇది వారు ఏదో సరదాకి చెప్పిన విషయం కాదు. సంస్కృతం మాట్లాడటం వలన నోరు, గొంతు క్యాన్సర్లను నివారించవచ్చని విదేశీయుల పరిశోధనలో తేలింది. ఆ కారణం చేతనే బ్రిటన్, జెర్మనీ వంటి దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నారు.

అయితే భారతీయ ఋషుల దృష్టి కోణంలో వర్ణమాల అంటే కేవలం ఏదో భావాలను వ్యక్త పరచటానికి ఉపయోగించే ఒక వ్యవస్థ కాదు. ఓం అనేది ఏ విధంగానైతే పరబ్రహ్మం యొక్క ప్రతిరూపమో, అట్లాగే సంస్కృత వాఙ్గయంలో ప్రతి ప్రతి అక్షరానికి ఒక అధిదేవత ఉంది. ఆ అధిదేవతను ఋషులు దర్శించారు. మొత్తం వర్ణమాలలోని 52 అక్షరాలకు 52 మంది అధిదేవతలు ఉన్నారు. వారికి ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, వారికీ శక్తి ఉంది, వారు కూడా శుభాలను చేకూరుస్తారు. ఈ 52 అక్షరాలకు మానవ శరీరంలోని 6 చక్రాలకు సంబంధం ఉంది, 72,000 నాడులను చైతన్యం చేసే శక్తి ఉంది. ఒక్కో అక్షరం ఒక్కో చక్రం మీద పని చేస్తుంది, మనిషికి ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ఆయా అక్షరాలను కలిపి చదవడం వలన ఒక్కో రకమైన శక్తి పుడుతుంది. అక్షరాలను ఒక పద్ధతిలో ఏర్పరిచి భగవంతుడు మంత్రాలను, సూక్తములను ఇచ్చాడు. అక్కడ వేర్వేరు అక్షరముల కలియిక (Combination) ఉంది. అది ఇంకా శక్తివంతం. ఎంత అంటే సూక్తంలో చదివినది అర్దంకాకపోయినా, అది వినడం చేతనే, విన్నవాడు శుభాలను పొందుతున్నాడు. వాడిలో దైవీశక్తి జాగ్రతం అవుతోంది.

ఆ రకంగా చూసినప్పుడు మొత్తం సంస్కృతం, దానితో సంబంధం కలిగి ఉన్న భారతీయ భాషలన్నీ ప్రపంచంలో పెద్ద అద్భుతాలు. కేవలం సంస్కృత భాషణం(మాట్లడటం) చేత ఇంతమంది అధిదేవతల అనుగ్రహం లభిస్తుంది. అది మన సంస్కృత భాష యొక్క గొప్పతనం. సంస్కృతం దైవభాష అని చెప్పుటకు ఇది కూడా ఒక కారణం. అందుకే ఋషులు అక్షరాభ్యాసం అనే ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అక్షరం అనగా నాశనం లేనిది అని అర్దం. అక్షరమే భగవంతుడు. పసిపిల్లవాడు ఏదో విద్య నేర్చుకుంటున్నాడు అని ఋషులు అనలేదు, వాడు అక్షరాన్ని అభ్యసిస్తున్నాడు, పరబ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అన్నారు. అందుకే పూర్వం విద్యాభ్యాసంలో పాఠశాలకు వెళ్ళిన విద్యార్ధులు చెప్పులు బయట విడిచిపెట్టి, పద్మాసనంలో కూర్చుకుని పవిత్రంగా విద్య నేర్చుకునేవారు. ఎందుకంటే వారు కేవలం విద్య నేర్చుకోవటంలేదు, నేర్చుకోవటం అనే నెపంతో దైవాన్ని ఉపాసిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంస్కృత శబ్దాలు, వాటి శక్తులు గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇంత మహత్తు ఉన్న శబ్దముల కోసం వచ్చిన శాస్త్రమే శిక్షా.

To be continued .......................

ఈ రచనకు సాయం చేసిన రచనలు.
 Vvs Sarma గారి సంస్కృతంతో నా చెలిమి
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి ఉపన్యాసం
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం

Sunday, 19 July 2015

హిందూ ధర్మం - 167 (శిక్షా - 1)శిక్షా: ఇది వేదాంగాల్లో మొదటిది. ఇది అక్షరాలకు, వాటిని ఉఛ్ఛరించే విధానం, వేదాన్ని నేర్పే పద్ధతిని వివరించే శాస్త్రం. శబ్దానికి సంబంధిచిన శాస్త్రం. దీన్ని వేదానికి నాసిక (ముక్కు)గా చెప్తారు. ముక్కు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటుంది జీవరాశి. ఊపిరే జివులకు ప్రాణాధారం. వేదం మంత్రసూక్తముల సమాహారం. సరైన రీతిలో మంత్రోఛ్ఛారణయే వేదానికి ఆయువు.

సృష్టి ప్రారంభంలో తొలుత శబ్దమే ఉద్భవించింది. తొలిశబ్దం ఓంకారం. అదే ఇన్నిటిగా విస్తరించింది. అన్నీ దాన్నుంచే వచ్చాయి. దృశ్యాదృశ్య ప్రపంచం తర్వాత వచ్చింది. అందుకే ఋషులు శబ్దబ్రహ్మం అని శబ్దాన్ని బ్రహ్మంగా చెప్పారు. వేదాలు కూడా ఋషులకు స్వరబద్ధంగా లభించాయి. ఏదో పుస్తకంలో చూసి చదవడం కాదు, వేదంలో ప్రతి భాగానికి ఒక స్వరం ఉంది. దాని ప్రకారమే చదవాలి. 'నాకు ఒకటే శక్తి గురించి తెలుసు. అదే భగవన్నామం. నేను నీ దగ్గరకు వచ్చి తేలు అనగానే మీవు భయంతో గెంతుతావు. నేను లడ్డూ అనగానే నీ నోరు ఊరుతుంది. అదే నేను నిన్ను గాడిద అనృఏ నీకు కోపం వస్తుంది. కోపం ఎందుకు? నీకేమైనా నాలుగు కాళ్ళు వచ్చాయా? మామూలు పదలాకే అంత శక్తి ఉంటే ఇక భగవన్నామానికి ఎంత శక్తి ఉంటుంది' అంటారు స్వామి శివానంద సరస్వతీ. నామం భగవంతుని ఒకానొక లక్షణం గురించి చెప్తుంది. అటువంటి నామానికే అంత శక్తి ఉంటే ఇక వేదమంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి . వేదంలోని శబ్దాలకు చాలా శక్తి ఉంది. యస్య నిశ్వసితం వేదాః - భగవంతుని ఊపిరియే వేదం అని శాస్త్రమే చెప్పింది. నా ఊపిరి నుంచి నేను వేరుకానట్టే భగవంతుని ఊపిరి నుంచి ఆయన వేరు కాదు. మరి అంత గొప్ప శక్తి గల వేదాలను పరిరక్షించడం ఎలా? వాటి శక్తిని అట్లాగే కాపాడటం ఏలా? తప్పులు దొర్లకుండా రక్షించండం ఏట్లాగా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఋషులు అందించినదే శిక్షా శాస్త్రం. వేదం ఇవ్వబడిన సమయం నుంచి ద్వాపరయుగం వరకు అది ఎక్కడా రాయబడలేదు. గురువు నుంచి శిష్యునికి వారసత్వంగా ఒక గురుశిష్య పరంపరలో వచ్చింది. వస్తూనే ఉంది. మస్తకం నుంచి మస్తకానికి, పుస్తకం నుంచి పుస్తకానికి కాకుండా హృదయం నుంచి హృదయానికి అందుతూ వచ్చింది. విని నేర్చుకునే విద్య కనుకనే వేదానికి శృతి అని పేరు.

శబ్దానికి చాలా శక్తి ఉంది. వేదమంత్రాల విషయంలో అది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ శబ్దంతో మనిషికి ఉన్నతమైన అనుభూతులను కలిగించడం, వారి స్థితిని మెరుగుపరచడం, ప్రకృతిలోకి ఆ శబ్దతరంగాలను పంపి కావలసిన ప్రతిఫలాన్ని పొందడం, మనోభావాలను మార్చడం, దుష్టభావాలను నశింపజేయడం కూడా జరుగుతుంది. ఇంతకముందు మంత్రం గురించి, దానికి ఉండే ప్రీక్వెన్సీ గురించి చెప్పుకున్నాం. http://ecoganesha.blogspot.in/2014/12/118.html

ఇక్కడ ప్రీక్వెన్సీతో పాటు రెసోనెన్స్ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది.

To be continued ...................

Wednesday, 15 July 2015

గీతా సూక్తి


పుష్కరాల నెపంతో హిందూసంస్కృతిపై పై తెదేపా దాడి

పుష్కరాల ముందు నుంచి కొందరి వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులను పనిగట్టుకుని ఇన్ని మాటలు ఎందుకంటున్నారా అని బాధేస్తుంది. ఒకడేమో పుష్కరాలు మతాతీతం అంటాడు. ఇంకొకడు అసలు పుష్కరాలు జరపడమే తప్పు, అదంతా మూఢనమ్మకం అంటాడు. ఇంకొకడు హిందువులకు వెర్రి, ఆ వెర్రి వాళ్ళ ఓట్ల కోసమే మా నాయకుడు పుష్కరాలకు పూనుకున్నాడు, ముహూర్తం చూసుకుని మునకేశాడు అంటున్నాడు. నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యత హిందూత్వ వాదులు, ఆధ్యాత్మిక జీవులు, ప్రజలు కూడా వహించాలని ఇంకో కుహనా మేధావి విమర్శ. వీళ్ళంతా ఏవరో అనామాకులు కాదు, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆయన భజన బృందం.
మళ్ళీ ఈ స్నానాలు చేయడం పిచ్చి అంటున్నారు ఆ పార్టీ వాళ్ళే. అసలు వాళ్ళు తప్ప మనకు ఇంకెవరు దిక్కులేరని అనుకుంటున్నారేమో? మరి మాకు పిచ్చి పడితే అది బహిరంగంగా చెప్పచ్చు కదా, అలా దాచుకుని మీరు పిచ్చి నటించడం ఎందుకు?

పుష్కరాలు, లేక హైందవ ధర్మానికి చెందిన ఉత్సవాలు, పండుగలు చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఊరుకోండి. ఏమీ చేయకండి. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారు. దేవాలయాలని మీ గుప్పిట పెట్టుకుని, ఆలయ హుండీల్లో సొమ్మును ప్రభుత్వం తీసుకుంటూ, పండుగలు, ఉత్సవాలు, పుష్కరాల సమయంలో టూరిజం ప్రమోట్ చేసుకుని డబ్బు సంపాదిస్తూ, తిరిగి హిందువుల మీద పడి ఏడ్చే మిమ్మల్ని ప్రజలు ఏమనాలి?

అసలు పుష్కరాలు మతాతీతం అని వాళ్ళు ఎలా చెప్తారు? పుష్కరుడు, బృహస్పతి, పితృదేవతలు, నదులకు పూజ, ప్రకృతి పూజ, నదీస్నానం .......... ఇవన్నీ ఏ మతగ్రంధం అంగీకరిస్తుంది? ఒక్క హిందూ ధర్మం తప్పించి మరే మతగ్రంధమూ వీటిని అంగీకరించదు. పుష్కరాల్లో ఎవరైనా స్నానం చేయవచ్చు. అంతమాత్రానా పుష్కరాలు మతాతీతం కావు. పుష్కరలు హిందూ ఐక్యతకు నిదర్శనం.

ఈ దేశంలో పుష్కరాలు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. వాటికి ఏ ప్రచారమూ లేదు, అవసరంలేదు. పంచాంగంలో చెప్పిన ఒక చిన్న తిధిని గుర్తుపెట్టుకుని వేలాదిమంది స్వచ్చందంగా హాజరవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు, పుష్కరాల పేరుతో తమను తాము మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు పుష్కరాల్లో రకరకాల వస్తువులు అమ్మెవారు, ఇప్పుడు ఏకంగా పుష్కరాలనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పడకముందు కూడా పుష్కరాలు జరిగాయని మర్చిపోకండి. పుష్కరాలు విజయవంతమైతే, అది మీ పార్టి ఖాతాలో వేసుకుంటారా? అందులో అపశృతి జరిగితే దానికి హిందువులు బాధ్యులా?  ఆధ్యాత్మిక గురువులు బాధ్యులా? ఆధ్యాత్మికతయే భారతదేశానికి ఊపిరి. ప్రవచనాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందులో వారు చెప్పే విలువలతో కూడిన మాటలే ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి. అసలు పుష్కరాలకు ముందు మీరెంత మంది సాధుసంతులతో సమావేశం జరిపారు? అసలు అలాంటి ఆలోచన వచ్చిందా? ఇందులో స్వయం సేవకులు, విహెచ్‌పిని భాగాస్వామ్యం చేశారా? అనేక ఇతర హిందూ ధార్మిక సంస్థలను పిలిచారా? కేవలం మీ పార్టీ కార్యక్రమంలా జరిపారు. మిత్రకూటమిలోని మంత్రిని కూడా పక్కన పడేశారు. అలాంటీ మీరా హిందూసమాజాన్ని విమర్సించేది. ఎక్కడైనా తొలిస్నానం పుణ్యమూర్తులు, సాధువులు, సన్యాసులు చేస్తారు. మరి మీ దగ్గరో? అందరిని పక్కన పెట్టారు. ఘోరం జరిగాకా హిందువుల మీద నింద వేస్తారా? ఎన్ని చేసినా మేము భరించాలని మీరు భావిస్తున్నారా?

ఎప్పుడూ ఏదో ఒక రకంగా హిందువుల మీద దాడి చేస్తూనే ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇకనైన ఇలాంటి అర్దంపర్దం లేని వ్యాఖ్యలకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలకు స్వస్తి చెప్పాలి.  
(ఈ వ్యాఖ్యలు ఎవరో కార్యకర్తలు చేయలేదు, తెదేపాలో మంచి స్థానంలో ఉన్నవారు చేసినవి.)

Sunday, 12 July 2015

హిందూ ధర్మం - 166 (వేదాంగ పరిచయం - 2)చాలామందికి సమాధి స్థితి ఎంతో సాధన తర్వాత కలిగినా, అది కొంత సేపు మాత్రమే ఉంటుంది. కానీ భగవాన్ రమణ మహర్షి మాత్రం వారికి తొలిసారి సమాధి స్థితి అనుభూతి కలిగిన క్షణం నుంచి, వారు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆధునిక కాలంలో భూమిపై తిరిగిన మహర్షి రమణులు. వారి భోధనలు కూడా చాలా పైస్థాయి లో ఉంటాయి. రమణమహర్షి శరీరంతో ఉన్న రోజులలో జరిగిన ఒక సంఘటన మనకు ఒక సందేశాన్నిస్తుంది. సాధారణంగా రమణాశ్రమంలో రోజు కాసేపు మహర్షి భోధనల మీద చర్చ జరిగేది. అందులో ఒకసారి పదిమంది భక్తులు, ఒకానొక రచనలో విషయం మీద వాదులాడుకోవటం ప్రారంభించారు. ఎంతకూ వాదనకు పరిషాకారం దొరకటంలేదు. మహర్షి అక్కడే మౌనంగా అన్నీ గమనిస్తున్నారు. తమ వాదనలో ఏది సరైనదని వారందరూ వెళ్ళి మహర్షిని అడిగారు. దానికి బదులుగా మహర్షి అన్ని సరైనవే అన్నారు. అదెలా అవుతుంది అన్నారు భక్తులు. ఎవరి స్థాయిలో వారికి అది సత్యమే. వారి స్థాయి పెరిగితే కానీ వారికి గురువే చెప్పినా అసలు విషయం అర్దమవ్వదు. ప్రాప్యతను, సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది అన్నారు ................ ఇది నిజమే. ఆధ్యాత్మికతలో ఇలాగే ఉంటుంది. కానీ మనకూ స్థాయి పెరగలాంటే స్వధర్మాచరణయే గతి. అంటే కేవలం పుస్తకాల్లో ధర్మాన్ని చదివి తెలుసుకునుట కాదు, ధర్మాన్ని ఆచరించుట. దానికి మించి వ్యక్తి సంస్కారాన్ని, స్థాయిని పెంచే వెరొక మార్గం లేదు. ఒకే ప్రవచనాన్ని వందలమంది విన్నా, అందరికి తలొకరీతిలో అర్దమవుతుంది. ఋషులకు ఈ విషయం తెలుసు. ఆధ్యాత్మికత పక్కన పెట్టినా, అసలు అన్నిటికి ధర్మమే మూలం. ధర్మం అర్దమవ్వాలంటే వేదం అర్దమవ్వాలి. వేదంలో ఒకే పదం అనేక చోట్ల కనిపించినా, దానికి ఒకే అర్దం ఉండదు. ప్రతి సందర్భంలోనూ అర్దం మారుతుంది. ఇది ఆలోచించిన ఋషులు వేదాలను అర్దం చేసుకుని వ్యాఖ్యానించడం కోసం ఒక ప్రమాణాన్ని ఏర్పరచాలనుకున్నారు.

వేదాలను ఋషులు స్వరబద్ధంగా దర్శించారు. వేదానికి స్వరమే ప్రాణం.అన్ని వేదాలకు ఒకటే స్వరం ఉండదు. అందులో మళ్ళీ అన్ని పదాలు చదవటంలో ఒకే వేగం కూడా ఉండదు. అన్నిటికి ఒక విధమైన శబ్దం ఉండదు. కనుక వేదంలో ఉఛ్ఛారణ దోషం రాకుండా ఉండుటకు, తాము ఎలా దర్శించామో, అలాగే ఈ వేదం ముందు తరాలకు అందటం కోసం ఒక వ్యవస్థ కావాలి.

ఏదో చెప్పారని అది గుడ్డిగా ఆచరిస్తూ వెళ్ళడమేనా? అసలు ఒక వస్తువును వర్ణించినటానికి ఒక ప్రత్యేక పదాన్నే ఎందుకు వాడారు? పదాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక వస్తువును ఒక విధంగా సంబోధించడం ఎందుకు? ఇత్యాది విషయాలు కూడా జనులకు అర్దమవ్వాలి. అందుకుగానూ ఒక శాస్త్రం ఉండాలి.

వేదం కర్మను, జ్ఞానాన్ని రెండిటిని చెప్పింది. జ్ఞానం ఎంత ప్రధానమో, కర్మ కూడా అంతే ప్రధానం. కర్మ కారణంగానే జ్ఞానం సిద్ధిస్తుంది. కానీ వదిక కర్మలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి నిర్ధారిత సమయం ఉంది. అదేదో ఒక్క రోజుకే పరిమితమైన కాలనిర్ణయం కాదు, ఋతువులను అనుసరించి కూడా ఉంటుంది. వేదంలో చెప్పబడ్డ అన్ని యజ్ఞాలు ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ చేయరు, చేయకూడదు. కాబట్టి కాలాన్ని నిర్ణయించటానికి ఒక ప్రమాణం ఉండాలి. అదికూడా కాలాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కవేసుకోవడం కాదు, విశ్వం ఉంది, అందులో గ్రహాలు, నక్ష్త్రాలు ఉన్నాయి, వాటికి భ్రమణం ఉంది, విశ్వానికి ఒక భ్రమణం ఉంది, అన్నిటికి కాలం ఉంది, ఆ కాలనికి లోబడే మానవులు కాలాన్ని లెక్కగట్టాలి, అది విశ్వగతికి అనుకూలంగా ఉండాలి. అది జరగాలంటే కాలాన్ని లెక్కవేసే ఒక నిర్ధుష్టమైన, ఖఛ్ఛితమైన పద్ధతి ఉండాలి. అదేకాక వైదిక కర్మ చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం చేసినప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది. అదేగాక అందులో ఆహుతి ఇబ్బడే ద్రవ్యాలు కూడా సరైనవే అవ్వాలి. అందుకు మార్గదర్శనం కావాలి.  ఇలాంటి అనేక కారణాలను, అంశాలను దృష్టిలో ఉంచుకుని ఋషులు వేదాంగాలను అందించారు. మొత్తం 6 వేదాంగాలు ఉన్నాయి.

శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అనే ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు.

అంగాలు అంటే అవయవాలు. కళ్ళు, ముక్కు మొదలైనవి. ఇవన్నీ వేదానికి అంగాలు కనుక వేదాంగాలు అయ్యాయి.
1. శిక్ష - ముక్కు - ఉఛ్ఛారణా శాస్త్రం
2. వ్యాకరణం - నోరు
3. ఛందస్సు - కాలు
4. నిరుక్తం - చెవి
5. జ్యోతిష్యం - కళ్ళు - కాలప్రమాణాలు, ముహూర్తాలు
6. కల్పం - చేతులు

To be continued...................

Saturday, 11 July 2015

పుష్కరాల వైశిష్ట్యం

పోషయతి ఆపః జీవయతీతి పుష్కరః అని సంస్కృత నిర్వచనం. నదీజలాలను పోషించేవాడు, వాటికి శక్తినిచ్చి రక్షిస్తున్నవాడు పుష్కరుడు.

పూర్వం తుందిలుడనే ఒకరు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. అతడి తపస్సుకు శివుడు మెచ్చి తన అష్టమూర్తి తత్వంలో ఒకటైన జలతత్వానికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నీటికి పవిత్రతను ఇవ్వగలవాడిగా పుష్కరుడయ్యాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే ముందు తనకు ఈ పుష్కరుడు కావాలని శివున్ని కోరగా, శివుడు అనుమతిచ్చాడు. పుష్కరుడు బ్రహ్మగారి కమండలంలోకి చేరాడు. ఈ పుష్కరుడు ఎంత గొప్పవాడంటే అహల్యను చెరబట్టి గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడికి చర్మవ్యాధి వచ్చింది. అది ఎన్ని చేసినా పోలేదు, కానీ బ్రహ్మదేవుడి కమండలంలో నీటి బిందువులు పడిన కారణంగా ఆ అవస్థ తీరిపోయింది.

ఈ విషయం దేవగురువైన బృహస్పతికి తెలిసింది. తమలో మునిగిన జనుల పాపాలను నదులు ప్రక్షాళన చేస్తాయి. అలా నిత్యం అనేకమంది స్నానాలు చేయటంతో నదులన్నీ పాపాలతో నిండిపోయాయి. వాటిని పాపముక్తం చేయాలన్న ఆలోచన బృహస్పతికి వచ్చి, బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తనకు పుష్కరుడు కావాలని, నదులన్నీ పాపలతో కలుషితమయ్యాయని, ఆ నదుల్లో ఈ పుష్కరుడిని ప్రవేశపెట్టి వాటి పవిత్రతను తిరిగి పునరుద్ధరిస్తానని అంటారు. రాకరాక బ్రహ్మదేవుని వద్ద ఉండే అవకాశం వచ్చిందని, దాన్ని వదులుకోవడం ఇష్టం లేని పుష్కరుడు తాను వెళ్ళనంటాడు. అంతా విన్న బ్రహ్మగారు బాగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వస్తారు. బృహస్పతి రాశి మారిన ప్రతీసారి ఒక్కో నదికి పుష్కరం వచ్చేలా, ఏర్పాటు చేస్తాడు. ఆ పుష్కర కాలంలో బృహస్పతి, పుష్కరుడే కాక, బ్రహ్మాది ముక్కోటి దేవతలు, పితృదేవతలు, అన్ని లోకాల్లో ఉన్న 3 కోట్ల 60 తీర్ధాలు ఆ నదిని తొలి 12 రోజులు ఆశ్రయిస్తారని, తర్వాత ఏడాది మొత్తం మద్యాహ్న సమయంలో 2 ముహుర్తాల కాలం ఉంటారని శాసనం చేస్తారు. అలా ప్రతి ఏడాది గురువు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు, రాశిని అనుసరించి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. మొత్తం మీద మన దేశంలో ముఖ్యమైన 12 ప్రధాన పుణ్యనదులకే ఈ పుష్కరాలు ఉన్నాయి.

ఇప్పుడు గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. మళ్ళీ ఇందులో కూడా అన్ని నదులకు, గోదావరికి ఒక తేడా ఉంది. ప్రతి నదికి ఆదిపుష్కరాలు మాత్రమే ఉంటాయి, కానీ దక్షిణగంగ అయిన గోదావారికి మాత్రం ఆదిపుష్కరాలు, అంత్యపుష్కరాలు అని రెండు ఉంటాయి. గురువు సింహరాశిలోకి ప్రవేశించిన తొలి 12 రోజులు ఆదిపుష్కరాలు, సింహరాశి నుంచి వెళ్ళిపోయే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు వస్తాయి.

ఈ పుష్కరసమయంలో ఒకసారి స్నానం చేస్తే 60,000 సార్లు గంగాస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో చేసే జప, దాన, స్నాన, యజ్ఞ ఫలాలు కోటి రెట్లు అధికంగా ఉంటాయి. అన్ని కోట్ల మంది దేవతలు, పితృదేవతలు, 3,60,00,000 తీర్ధాలు నదిలో ఉన్నప్పుడు స్నానం చేయడం ఎంతో విశేషం. ఎంత తపస్సు చేసినా ఒక జన్మలో కలగని అదృష్టం పుష్కరసమయంలో మానవులకు కలిగించాడు భగవంతుడు. దేవతలు వస్తే ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళరు, కనుక పుష్కరసమయంలో నదిలో శాస్త్రం చెప్పిన రీతిలో పుణ్యస్నానం చేసినవారికి సకల శుభాలు కలగజేస్తారు.

ఈ ఏడాది మన గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. జూలై 14 న మొదలై 25 వరకు కొనసాగుతాయి.    

Thursday, 9 July 2015

గోదావరి ప్రాశస్త్యం

గోదావరి ప్రాశస్త్యం

పూర్వం ఒకసారి దక్షిణ భారతదేశంలో 12 సంవత్సరాల తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. గౌతమ మహర్షి మహాతపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన తపస్సుతో సూర్యుడిని, గాయత్రిమాతను మెప్పించి చెల్లిన వెంటనే మొలకెత్తి పంటనిచ్చే విత్తనాలు వరంగా పొందాడు. ఆ విత్తనాలతో తన ఆశ్రమాన్ని ఆస్రయించిన వారందరికి భోజానాదులు ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలు, ఋషులు, మునులు కూడా ఆశ్రయం పొందారు. ఇంతగొప్ప పని చేస్తున్న గౌతమున్ని చూసి కొందరు ఋషులకు అసూయ కలిగింది. ఇదిలా ఉండగా, దక్షిణభారతదేశపు క్షామం తీరలంటే అది గౌతముని వల్లనే సాధ్యమవుతుందని, గౌతముడు శివుడిని మెప్పించి గంగను తీసుకురాగలడని గ్రహించాడు.

అప్పుడు గణపతి తన శక్తి అయిన జయను వెంటబెట్టుకుని, తాను బ్రాహ్మణరూపాన్ని ధరించి, జయను మాయాగోవుగా మార్చి, గౌతమమహర్షి ఆశ్రమంలో పంటలపై వదిలాడు. ఆ గోవు మొత్తం పంటను మేయసాగింది. ఇది గమనించిన గౌతముడు గోవును కొట్టడం తప్పని, చిన్న ధర్భపుల్లను తీసుకుని దాన్ని అదిలించాడు. అది మాయాగోవు కనుక ఆ ధర్భపుల్ల తగలగానే మరణించింది. బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి వెంటనే 'గో హత్య! గో హత్య!' అని అరిచాడు. సమీపంలో ఉన్న వారందరూ పరుగుపరుగున వచ్చి, గోహత్యాపాతకం చుట్టుకున్న గౌతమునితో తాము ఉండలేమని, ఆయన పెట్టే భోజనం తినలేమని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నామని చెప్తారు. అప్పటికే గౌతముని మీద అసూయతో ఉన్న ఋషులు గౌతముని తలోమాట అంటారు. కొందరు రాళ్ళతో కొడతారు. అయినా గౌతముడు వారిని బ్రతిమిలాడి, చేసిన పాతకం నుంచి బయటపడే మార్గం చూపించమని వేడుకుంటాడు.

అదే అవకాశమని భావించి బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి శివుని జటాజూటంలో ఉన్న గంగను తచ్చి, చచ్చిపడిన ఈ గోవు శరీరంపై నుంచి ప్రవహింపజేస్తే పాతకం నశిస్తుందని చెప్తాడు. అప్పుడు గౌతమ మహర్షి బ్రహ్మగిరి వెళ్ళి పరమశివుని గూర్చి తపస్సు చేస్తాడు. శివుడు కరుణించి ఒకనాడు తన జటాజూటంలో బంధించిన గంగలో నుంచి ఒక ధారను విడుస్తాడు. అదేకాక అక్కడ తాను త్ర్యంబకేశ్వరుడిగా వెలుస్తాడు. అక్కడ తీర్ధంలో ఉద్భవించిన గంగ గౌతమమహర్షితో కలిసి ప్రయాణం చేసి, పాపికొండలను చీల్చుకుని, గోమృత కళేబరం మీది నుంచి పారుతుంది. ఆ కారణంగా ఆ ప్రదేశానికి గోష్పాద క్షేత్రం అనే పెరు వచ్చింది. కాలక్రమంలో అది గోవూరుగా మారి ఇప్పుడు కొవ్వూరు అయింది. ఇప్పటికి ఆ ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి, కొవ్వూరుకు మధ్యనే గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి కూడా గంగతో సమానమైంది. అందువల్ల దీనికి దక్షిణగంగా అని పేరు. గౌతముడు కారణంగా వచ్చింది కనుక గౌతమీ అని, గోవు కోసం వచ్చింది కనుక గోదావరి అని పేరు. అటువంటి పవిత్రగోదావరిని భువికి తీసుకువచ్చిన గౌతమమహర్షి విగ్రహాలు గోదావరీ తీరమంతటా ఉండాలి.

Tuesday, 7 July 2015

నదీస్నానం ఎలా చేయాలి?నదీస్నానం ఎలా చేయాలి? త్వరలో పుష్కరాలు జరుపుకుంటున్నాము. అదికాక ఎప్పుడూ ఏదో ఒక తీర్ధయాత్ర చేస్తుంటారు. అసలు నదిలో ఏట్లా స్నానం చేస్తే ఫలితం ఉంటుంది?

నీటికున్న అమోఘమైన శక్తి గురించి మొదట గుర్తించింది ఋషులే. ఋషులు ద్రష్టలు. మాములు వ్యక్తులకు ఇంద్రియగోచరం కానీ విషయాలు కూడా ఋషులకు కనిపిస్తాయి. అటువంటి ఋషుల కారణంగా మనకు ఈ సనాతనసంస్కృతి అందింది. ఈ విశ్వంలో మానవులు, జంతువులు, చెట్లు, పక్షి, క్రిమికీటకలే కాక, అనేకమంది ఇతరులు జీవిస్తున్నారు. వారి కర్మఫలాన్ని అనుసరించి వారి జన్మ ఉంటుంది, మన కంటికి కనపడేది ఈ ఒక్క లోకం మాత్రమే. కానీ ఇది కాక ఇంకా అనేకలోకాలు ఉన్నాయి. వాటిలో దివ్యశరీరాలతో అనేకమంది దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు, సిద్ధులు నివసిస్తూ ఉంటారు. వారూ మానవులు పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వారిని ఉద్దేశించే మానవులు వివిధరకాల వైదిక కర్మలు ఆచరిస్తారు. అట్లాగే ప్రతినదికి ఒక అధిష్టానదేవత ఉంటుంది. ఆమె అందరికి త్రాగడానికి, పంటలు పండిచుకోవుటకు నీరు ఇస్తోంది. నేలను సస్యశ్యామలం చేస్తోంది, వనాలను రక్షిస్తోంది. అక్కడితో ఆగిపోకుండా ఒక్క మునకతోనే మునిగినవానికి అనుగ్రహం ప్రసరిస్తోంది, పుణ్యం ఇస్తోంది, రోగక్షయం చేస్తోంది. అందుకే నదీమతల్లిగా, అమ్మగా ఋషులు నదులను కీర్తించారు. కానీ ఆమె అనుగ్రహం పొందాలంటే నదిలో స్నానం చేయటానికి ఒక విధానం ఉంది.

నదిలో స్నానం చేసే ముందు నదీమతల్లికి మనస్పూర్తిగా నమస్కారం చేయాలి. పాపాలను, దోషాలను, రోగాలను తొలగించి శుభములను ఇస్తున్న అమ్మకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

నదీస్నానం ఎప్పుడు చేసినా ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే పుణ్యస్నాన ఫలితం ఉండదు. అది ఇంట్లో చేసిన స్నానంతో సమానమే. నదీస్నానమే కాదు, తటాక, సముద్రస్నానమైన అంతే.

నదీస్నానం చేసేముందు ఒడ్డున ఉన్న కొంత మట్టి తీసుకుని నదిలో వేయాలి. చిటికెడైనా వేయాలి. అదే పుష్కరిణి, తటాకం, చెరువులో స్నానం చేస్తున్నట్లైతే చెరువులో ఉన్న మట్టి కొంచం తీసి ఒడ్డున వేయాలి. సముద్రస్నాన సమయంలో సముద్రంలోకి ఒక చిన్న రాయి విసరాలి. ఇది తప్పక చేయవలసిన విధి. (అయితే పుష్కరాలు మొదలైన సమయంలో ఎంతోమంది జనం ఉంటారు, ఘాట్లు సిమెంటుతో కట్టి ఉంటాయి కనుక అప్పుడు కుదరదు. ఇతర సమయాల్లో మాత్రం చిటికెడుమెట్టిని నదిలో చేసి, శ్లోకం చదివి అప్పుడు చేయాలి.)

ఇది చేసే సమయంలో ఈ క్రింది శ్లోకం చెప్పాలి.
పిప్ప్లాదాత్ సముత్పన్నే కృత్యేలోకే భయంకరి |
పాషాణం తే మయాదత్తం అహారార్ధం ప్రకల్పయ ||

నదిలో స్నానం చేసేముందు ఇంట్లో తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, అప్పుడు నదీతీరానికి వెళ్ళాలి. ముందు స్నానం చేయకుండా నేరుగా వెళ్ళి నదిలో మునగకూడదు. నదిలో ఒళ్ళు రుద్దుకోవటం, ఉమ్మివేయటం, మలమూత్ర విసర్జనలు చేయటం నిషిద్ధం. నదీస్నానం అంటే నదిలో కేవలం 3 సార్లు మునకవేయటం మాత్రమే. అంతకుమించి అక్కడ సబ్బు రుద్ధుకోవటం, షాంపూలు వాడటం చేయకూడదు. అలా చేయడం నదీమతల్లికి చేసే అపచారం, పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది.

నదిలో స్నానం చేయటానికి కూడా ఉతికిన వస్త్రాలే ధరించాలి. స్నానం కోసం ధరించే వస్త్రాలకు తప్పినిసరిగా అంచు ఉండాలి. మగవారైతే పంచకట్టుకుని చేయాలి. ప్యాంటు, షర్టు వేసుకుని చేయకూడదు. వస్త్రాన్ని అనేకమార్లు కత్తిరించి కుట్టగా ప్యాంటు, షర్టు తయారైతాయి. శాస్త్రం ప్రకారం అవి చినిగిన వస్త్రాలతో సమానం. చినిగిన వస్త్రాలు ధరిస్తే దరిద్రం పడుతుంది. శాస్త్రం ప్రకారం చినిగిన వస్త్రాలు ధరించి పూజచేయటం అపచారం, అది కూడదు. ఎప్పుడూ పంచెకట్టుకునే అవకాశం లేకపోయినా కనీసం శుభకార్యాలు, దేవలయసందర్శన, పుణ్యస్నానం, పూజ సమయంలోనైన సంప్రదాయ దుస్తులు ధరించాలి. స్త్రీలు కూడా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. అలా ధరించేందుకు డబ్బు సరిపోని పేదవారైతే, వారికి ఉన్నదాంట్లో మంచి వస్త్రాలు కట్టుకుని స్నానం చేయాలి.

పురుషులు నదిప్రవాహానికి ఎదురుగాను, స్త్రీలు నదిప్రవాహం వెళుతున్న దిశగా నిల్చుని స్నానం చేయాలి. తల కూడా మునిగేట్లుగా 3 సార్లు మునకవేయాలి. ముందు ఊపిరి తీసుకుని, బొటను వేలుతో ముక్కురంధ్రాలను, మధ్యవేలుతో చెవి రంధ్రాలను మూసి, కన్నులు, నోరు మూసుకుని స్నానం చేయాలి. లేదంటే ముక్కు, చెవి రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది.

నది ఆభిర్భావప్రదేశం నుంచి సాగరసంగమం వరకు ప్రతి చోటా దేవలయాలు, దివ్యధామాలు, ఆశ్రమాలు నెలకొని ఉంటాయి. వాటి నుంచి వచ్చే వేదమంత్రఘోషను నదీజలాలు గ్రహిస్తాయి. నదిలో పూర్తిగా మునిగి స్నానం చేస్తే, ఆ దివ్యమంత్రశక్తి శరీరానికి, మనసుకు పట్టుకుని, రక్షణకవచం వలె పనిచేస్తుంది.  సూర్యుడికి అర్ఘ్యప్రధానం చేయాలి. నదిలో నిల్చుని ఏదైనా మంత్రజపం కూడా చేయవచ్చు, కానీ పుష్కరసమయంలో, రద్దీ ఉన్న సమయంలో కాకుండా నదీతీరం ఖాళీగా ఉన్న సమయంలో ఇలా చేయడం ఉత్తమం. లేకపోతే అందరిని ఆపి ఇబ్బంది పెట్టినందుకు పాపం వస్తుంది. సాధ్యమైనత త్వరగా పుష్కరస్నానం ముగించుకుని బయటకు రావడం ఉత్తమం.

స్నానం ముగించిన తర్వాత ఒడ్డుకు వచ్చి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పుణ్యస్నానం చేశాక తడి బట్టలను నదిలో పిండకూడదు. అది కేవలం అశుభం జరిగినప్పుడు మాత్రమే చేస్తారు. అట్లాగే నదిలో బట్టలు ఉతకడం, జాడించడం లాంటి పనులు అసలే చేయరాదు. నది పవిత్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్తపడాలి. వీలుంటే స్నానానంతరం గట్టు మీద, లేక ఒడ్డున కూర్చుని స్తోత్ర పారాయణ చేయడం, జపం చేయడం చేయాలి. నదీతీరాలు ఋషులు నడిచిన దివ్యప్రదేశాలు.

చాలామంది నదీతీరంలో దీపాలు వెలిగిస్తుంటారు, పూజలు చేస్తారు, దానాలు చేస్తారు. (నదిలో దీపాలు కార్తీకమాసంలోనే వదులుతారు.) అంతవరకు బాగానే ఉన్నా, వీటి కోసం తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తంతా నదిలోకానీ, నదితీరంలో కానీ పడేస్తారు. అరరే! ఇప్పుడే స్నానం చేశాను కదా, ఈవిడ నదీమతల్లి కదా, నాకు ఆశీర్వాదం ఇచ్చింది కదా అనే ఆలోచన అస్సలు ఉండదు. అలా నదిలో చెత్త విసిరేస్తే స్నానఫలితం వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? నదీతీరం పవిత్ర ప్రదేశం. అక్కడ చెత్త వేయరాదు. దగ్గరలో చెత్తబుట్ట ఉంటే, అందులో వేయండి, లేదా చెత్త మొత్తం ఒక కవర్లో పెట్టి, మీ దగ్గరే పెట్టుకోండి. ఇంటికి వచ్చాకో, లేదా ఇంకెక్కడైనా చెత్తబుట్ట కనిపిస్తే, అక్కడ పడేయండి. ఇష్టంవచ్చినట్లు నదిలో చెత్త వేస్తే, పుణ్యం రాదు, అసలు స్నానం ఫలితం కూడా రాదు, పాపం వస్తుందని గ్రహించండి.

అవకాశం ఉంటే పూలు, గాజులు, పసుపుకుంకుమలతో నదీమతల్లలకు తాబులం సమర్పించడం చాలా మంచిది, కానీ చీరలు, జాకెట్ పీసులు నదిలో వదలకుండా, అక్కడే స్నానం కోసం వచ్చిన సువాసినికి ఇస్తే (నది అధిష్టాన దేవతను వారిలో భావించి), నదీమతల్లి ఆనందిస్తుంది. అలా చేస్తే జలగండాల నుంచి నదీమతల్లి రక్షిస్తుంది. అంటురోగాలు రాకుండా ఉంటాయి.

నదీస్నానం శ్రద్ధను, మేధస్సును, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, పుణ్యాన్ని, శుభాలను, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కేవలం మునక చేతనే చర్మరోగాలు, ధీరకాలిక వ్యాధులు నయమైన వారు ఎందరో ఉన్నారు. నదులకు శక్తి ఉంది, అధిదేవతలూ ఉన్నారు. శాస్త్రం చెప్పిన రీతిలో నదీస్నానం చేసే ఫలితాలు అనుభవంలో తెలుస్తాయి. నదీమతల్లుల పవిత్రతను కాపాడండి. నదులను కలుషితం కానివ్వకండి. అన్నిటికంటే ముందు నదుల్లో కూడా ప్రాణం ఉందని గుర్తించండి.     

Sunday, 5 July 2015

హిందూ ధర్మం - 165 (వేదాంగ పరిచయం)

వేదాంగాలు

వేదాలను అర్దం చేసుకోవటానికి, సరైన విధంగా వ్యాఖ్యానం (interpretation) చేయటానికి ఋషులు ఏర్పరిచినవే వేదాంగాలు. వేదాంగం, వేదాంత రెండు పర్యాయపదాలు కావు, అవి భిన్నపదాలు. వేదాంతం అంటే వేదం యొక్క అంత్యభాగం, అవే ఉపనిషత్తులు. ఇవి అనుభూతికి ప్రాధాన్యతనిస్తాయి. వేదాంగాలు వేదాన్ని అర్దం చేసుకోవటానికి ఉపయోగపడే భాగాలు. అయితే ముందు అసలు వీటి అవసరమేంటో తెలుసుకుందాం. వీటి అవసరం తెలిస్తే, వాటి గురించి చాలావరకు స్పష్టత వస్తుంది.

సమాధి స్థితిలో ఉన్న ఋషులు వేదాలను దర్శించారు. వారు మంత్రద్రష్టలు. సమాధి అంటే? ఇది యోగశాస్త్రం ఆధారంగా చెప్పవలసిన విషయం. భగవంతుడు/పరబ్రహ్మం సముద్రం వంటివాడు. ఆత్మ ఆ సముద్రం నుంచి ఆవిరై వచ్చిన చిన్న బింధువు. బింధువు సముద్రం నుంచి వేరుగా ఉన్నప్పుడు దానికి ప్రత్యేక అస్థిత్వం ఉంటుంది. కానీ ఆ బింధువు సముద్రంలో కలిసిపోతే, అది కూడా సముద్రంలో భాగం అయిపోతుంది. తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. అట్లాగే సమాధి అనగా ఆత్మ, పరమాత్మలో ఐక్యం అయిన స్థితి, బింధువు సింధువులో కలిసిన స్థితి అది. అక్కడ వేరుగా నేను అనే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అది మాటలకు, మనసుకు అందే స్థితి అసలే కాదు. అక్కడ కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. ఆ అనుభూతి భాషకు, భావానికి అతీతమైనది. అటువంటి సమాధి స్థితిలో ఋషులు వేదాలను దర్శించారు. వాటికి వారే వ్యాఖ్యానాలు కూడా రాశారు, వాటిని బ్రాహ్మణాలు అంటారు.

అంతవరకు బాగానే ఉంది. వారి స్థాయి వేరు, మన స్థాయి వేరు. వారికి భగవంతుడు తప్ప వేరొకటి కనబడదు, తాము జడమైన శరీరం కాదు, శరీరం జీవించడానికి కారణమైన చైతన్యమే తామని నిశ్చయంగా అనుభవంలో తెలుసు. మరి మనకో? మాములు స్థాయిలో నేను ఈ శరీరం అనుకుంటున్నాం, లేక నేనీ దేహం కాదు, ఆత్మ అన్న భావన కలిగి ఉన్న, అది అనుభవంలో లేదు. ఋషుల మాటల మీద మనకు విశ్వాసం ఉన్నా, అనుభవంలో నిశ్చయంగా తెలియదు. కాబట్టి దేహంతో తాదాత్మ్యత కలుగుతూనే ఉంటుంది. అది కలిగినన్ని రోజులు వ్యక్తికి కొన్ని బంధాలు ఉంటాయి. కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. వాటికి లోబడే అతను జీవనం సాగించాల్సి ఉంటుంది.

మన స్థాయికి, ఋషులు స్థాయికి అంత భేధం ఉన్నప్పుడు మనకు ఆ సర్వోత్కృష్ట జ్ఞానం ఎలా అర్దమవుతుంది? ఒకవేళ అర్ధం కాకపోతే ఎవరికి తగిన అర్దాలు వారు వెతుక్కుంటారు. వేదమే ధర్మానికి మూలం. దాన్ని తప్పుగా అర్దం చేసుకుంటే ధర్మాచరణంలో అయోమయం ఏర్పడుతుంది. ఫలితంగా లోకంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది పెద్ద ప్రమాదం.

To be continued..............

Friday, 3 July 2015

సద్గురు శివానందమూర్తి సూక్తి


సద్గురు శివానంద మూర్తి చూపిన మార్గం సదా అనుసరణీయం

సద్గురు శివానంద మూర్తి చూపిన మార్గం సదా అనుసరణీయం
సంస్మరణ సభలో సుపథ ఫౌండే షన్ ఎండి డాక్టర్ హనుమంతరావు'పూర్వ పురాణంలో విషయాలను యోగ దర్శనం చేసి , ఖచ్చితత్వం తెల్సుకుని , లోటు పాట్లు సవరించి ,ప్రస్తుత శతాబ్దానికి అనుగుణంగా ఆధునిక భాషలో చెప్పగలిగే మహనీయులు కావాలి . అటువంటి వన్నీ తెల్సిన సద్గువురులు శ్రీ శివానంద మూర్తి . ఆ మహనీయులు చూపిన మార్గం సదా అనుసరణీయం ' అని సుపథ ఫౌండే షన్ ఎండి డాక్టర్ వి హనుమంతరావు అన్నారు . శివానంద మూర్తి జూన్ 10న శివ సాయుజ్యం పొందిన నేపధ్యంలో రాజమండ్రి దానవాయిపేట వాడ్రేవు బిల్డింగ్స్ లో సోమవారం రాత్రి శివానంద సత్సంగం ఆధ్వర్యాన శివానందమూర్తి సంస్మరణ సభ నిర్వహించారు. శ్రీ వాడ్రేవు మల్లపరాజు స్వాగతం పలికారు. డాక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా సద్గురు శివానంద మూర్తి తో ఉన్న అనుబంధాన్ని , ఆయన చెప్పిన విషయాలను , చూపిన మార్గం గురించి విపులంగా వివరించారు.

భారతీయతలోనే భక్తి ఉందని, అందుచేత భక్తి ప్రచారం కాకుండా ధర్మ ప్రచారం చేయాలని, ఎందుకంటే భీష్ముడు కూడా ధర్మం తప్పాడని సద్గురు శివానంద మూర్తి సవివరంగా చెప్పేవారని డాక్టర్ హనుమంతరావు అన్నారు.' గురువు అంటే ఆధాత్మిక విషయాలు తెలిసిన వాడే కాదని , భారతీయ చరిత్ర జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెల్సి వుండాలని, చరిత్ర జ్ఞానం లేకుంటే ప్రమాదమని కూడా సద్గురు శివానంద మూర్తి అనేవారు అందుకే భారతీయ చరిత్ర కు సంభందించిన ఎన్నో చారిత్రిక ప్రదేశాలను చూపించి , వాటి గొప్పతనాన్ని సద్గురు శివానంద వివరించేవారు. వృద్ధ జాగేశ్వర్ దగ్గరకు తీసుకెళ్ళి శివ పరివారం గా దర్శన మిచ్చే పర్వత శ్రేణిని చూపించారు. ఆయన దర్శించినట్లు భారతీయ చరిత్రను ఎవరూ చూడలేరు. ఆనాటి వైశాలి ప్రాంతాన్ని, అభిషేక పుష్కరిణి అనే వందల ఎకరాల చెర్వు ని ఆయన చూపించారు . వాటి విశిష్టత వివరించారు . అవి ఇప్పటికీ వున్నాయి . కానీ మన చరిత్ర పుస్తకాల్లో వుండవు. అగస్యుడు ఇంకా జీవించి ఉన్నాడని , 5వేల సంవత్సరాల నాటి మహా భారత గ్రంధాన్ని పదిలంగా కాపాడిన వాడు అగస్యుడే నని వివరించేవారు. ఇలాంటి ఎన్నో అపురూప విషయాలు వివరిస్తూ , ప్రాచీన గుర్తులు దర్శింప చేసారు సద్గురు శివానంద మూర్తి. భారతీయ పూర్వ చరిత్ర , 18పురాణాలు చదివితే ఉత్తర జన్మలో ముక్తి వస్తుందనేవారు' అని డాక్టర్ హనుమంతరావు వివరించారు.

సద్గురు శివానంద మూర్తి రాజమండ్రిలోనే పుట్టడం వలన కాకపోయినా ఆయనకు రాజమండ్రి అంటే ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా గోదావరి అంటే మరీ ఇష్టమని డాక్టర్ హనుమంతరావు చెప్పారు . 'ఇక్కడ ఇవ్వండి ఎక్కడా రాదు అంతటి గొప్పది గోదావరి.. గోదావరి నీళ్ళు తాగేతే వారిలో జీవ ధాతువులు వుంటాయి గోదావరి వేద పురుషులకు నిలయం 'అనేవారని గుర్తుచేసుకున్నారు.' భగవద్గీతలో కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు చెప్పాడని అయితే ధర్మం తెల్సుకుని కర్మలు ఆచరించాలని దాని అర్ధం. గమ్యం కన్నా మార్గం ఆనందం. , సాధన ముఖ్యం. దానం వలన పుణ్యం వస్తే , త్యాగం వలన ముక్తి వస్తుంది. మన కోసం కాకుండా మనది కాని దానికోసం పనిచేసే తత్త్వం అలవరచుకోవాలి. అలాంటి భక్తే దేశభక్తి. దానివలన దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముక్తిని పొందడానికి చేసే పనులవలన కేవలం ఆ వ్యక్త్రికే ప్రయోజనం అదే ముక్తిని పొందే స్థాయికి వెళ్లి వెనక్కి వస్తే , దానివలన ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది' ఇలా ఎన్నో అపురూప విషయాలు సద్గురు శివానంద విశ్లేషించే వారని డాక్టర్ హనుమంతరావు వివరించారు. సద్గురు శివానంద మూర్తి రాసిన ఎన్నో కీలక విషయాలను సుపద పుస్తకంలో ప్రచురిస్తూ ఉంటామని ఆయన చెప్పారు.

సద్గురు శివానంద మూర్తి చూపిన మార్గాన్ని అనునిత్యం మననం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ టివి నారాయణ రావు అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈనాటి సమాజం ఏది కోరుతోందో, ఎలా వుండాలని అనుకుంటోందో బాగా తెల్సిన సద్గురువు శివానంద మూర్తి అని ఆయన విశ్లేషించారు . ఆయన చూపిన ప్రేమ ఆప్యాయత మరెవరికి సాధ్యం కాదన్నారు. ' ధర్మంగా సంపాదంచిన దానితో ఆనందంగా జీవించాలి. అది వైరాగ్యానికి దారితీసి , ముక్తిని ప్రసాదిస్తుంది. అదే అధర్మంగా సంపాదిస్తి , పాపం వస్తుంది. అది పతనానికి దారి తీస్తుంది 'అని సద్గురు శివానంద మూర్తి చెప్పేవారని డాక్టర్ నారాయణ రావు చెప్పారు. శ్రీ కొత్తపల్లి అప్పాజీ మాట్లాడుతూ శివానంద మూర్తి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. 'నీ వలన ఏ ఇద్దరూ విడిపోకూడదు . నీ వలన ఏ కార్యక్రమం ఆగిపోకూడదు . ప్రోత్సహించ గలిగితే ప్రోత్సహించు , లేకుంటే పక్కకు తప్పుకో ' అని సద్గురు శివానంద మూర్తి చెప్పిన విషయాలు సత్యమని ఆయన పేర్కొన్నారు. శ్రీ వాడ్రేవు వేణుగోపాల రావు దంపతులు , శ్రీ ఫణి నాగేశ్వరరావు దంపతులు , శ్రీ దినవహి వెంకట హనుమంతరావు దంపతులు , ప్రసాద్ కామర్సు , శ్రీమతి వాడ్రేవు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పలువురు శ్రీ సద్గురు శివానంద మూర్తి చిత్ర పటానికి అంజలి ఘటించారు .Source: Raghavarao Rajahmundry