Sunday, 27 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వకుళమాత, పద్మావతీదేవి

ఓం నమో వేంకటేశాయ

వకుళ ఎవరో కాదు యశోద. ద్వారయుగంలో ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించి, కృష్ణపరమాత్మను పెంచింది యశోద. అంత చేసిన కృష్ణుడి వివాహాం చూసే భాగ్యం లేకపోయిందని బాధపడింది. కృష్ణయ్య , నువ్వు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూడలేకపోయాన్రా, నీ వివాహం చూడాలనుంది రా! అంటుంది. అప్పుడు కృష్ణుడు అమ్మా! నా వివాహం చూడడం ఇప్పుడు కుదరదు, రాబోయే 28 వ కలియుగంలో నీ చేతుల మీదుగానే వివాహం చేసుకుంటాను, నువ్వే జరిపిద్దుగానివి అంటూ ఓదారుస్తాడు.

ఆ యశోదయే ఈ వకుళమాత. ఈ యుగంలో శ్రీనివాసుడికి మాతృస్థానంలో ఆయన వివాహం జరిపిస్తుంది. వరాహస్వామి ద్వారా శ్రీనివాసుడికి చెంతకు చేరింది. శ్రీనివాసుడి తల గాయానికి మందు రాసింది. గోరుముద్దలు తినిపించింది. సపర్యలు చేసింది. తన ముందు నిల్చున్నది మాములు వ్యక్తి కాదు, తన చిన్ని కృష్ణుడేనని గుర్తుపట్టింది.

ఇది ఇలా ఉండగా, ఒకనాడు వేటకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. తన మనోసంకల్పంతో వాయుదేవునకు సందేశం పంపాడు శ్రీనివాసుడు. అశ్వరూపంలో (గుర్రం) వాయుదేవుడు వచ్చి సిద్ధంగా నిలుచున్నారు.

ఎక్కడున్నా లక్ష్మీదేవి మనస్సంతా స్వామి చెంతనే ఉంటుంది. అందుకే అమ్మవారు వాయువైన అశ్వానికి పగ్గాలుగా నిలిచింది. గోపిచదనంతో ఊర్ధ్వపుండ్రం ధరించి, కెంపురంగు తిలకధారణ చేసి, చక్కగా తయారయ్యి అశ్వం మీద వేటకు బయలుదేరాడు.

భగవంతుడు వేటాడడం ఏమిటి? ..... అంటే పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రతిజీవికి మృత్యువు ముందే నిర్ణయించబడి ఉంటుంది. కొందరికి మోక్షం లభించాలి, ఎంతో సాధన చేసినా, చేసిన పాపం అనుభవించక తప్పదు. అందులో భాగంగానే జంతు, పక్షి, ఇతర క్రిమికీటకాదులు మొదలైనవాటి జన్మ వస్తుంది. మరి ఆ పాపం తీరాకా జీవుడిని ఆ దేహం నుంచి విడిపించాలి కదా. అందులో భాగంగానే భగవంతుడు వేట ప్రారంభించాడు. సరదా కోసం కాదు, జీవుడిని తనలో ఐక్యం చెసుకోవడం కోసం, జనమరణ చక్రం నుంచి తప్పించడం కోసం.      

ఇంతలో శ్రీనివాసుడికి ఒక మదమెక్కిన ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగును శ్రీనివాసుడు వెంబడించగా, అది చాలా దూరం పరిగెత్తి, ఇక అలిసిపోయి శ్రీనివాసుడికి తొండంతో నమస్కరించి శరణాగతి వేడగా, స్వామి దాన్ని విడిచిపెట్టెస్తాడు. నమస్కరించిన వెళ్ళిపోతున్న ఏనుగు దిశగా చూసిన శ్రీనివాసుడికి ఒక మహాసౌందర్యవతియైన కన్య తన చెలికత్తెలతో కలిసి విహారం చేయడం కనిపించింది.

భగవంతుని దృష్టికి ప్రత్యేకంగా కనిపించిన ఆ కన్య ఎవరు? ఆమె వృత్తాంతమేమిటి? అని కధ వింటున్న శౌనకాది మహామునులు సూతమహర్షిని ప్రశ్నిస్తారు. అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్తున్నారు.

సువీర అనే రాజు కొడుకు సుధర్మ. సుధర్మ పుత్రుడు ఆకాశరాజు. ధార్మికుడు, సుపరిపాలకుడైన ఆకాశరాజుకు అన్నీ ఉన్నా సంతానం లేరు. ఈ లోటు ఆయన్ను బాధించసాగింది. ఇంత రాజ్యం ఉండి ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించే కొడుకు లేడు? నా తరువాత పితృతార్యాలు ఏవరు చేస్తారు? ఎన్నో దానాలు చేసిన నాకు కన్యాదానం చేసే భాగ్యం కలగదా? నాకీ దుస్థితి ఏంటి? అని దుఃఖించసాగాడు.

గురువులనుం, పెద్దలను, జ్ఞానులను సంప్రదించి సంతానం కోసం ఒక మహాయాగం చేయాలని నిశ్చయించుకుంటాడు. యజ్ఞస్థలం తిర్పతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు (అలిమేలుమగాపురం / మంగాపురం) ప్రదేశం. యజ్ఞం చేసే ముందు భూమిని శుద్ధి చేయడానికి భూమిని దున్నాలి. అలా భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశరాజు నాగలికి ఒక స్వర్ణపద్మం తగులుతుంది. ఆ స్వర్ణపద్మంలో ఒక మహా తేజోమూర్తి, లక్ష్మీకళ ఉట్టిపడుతున్న ఒక పసిపాప ఉంటుంది. ఇది చూసిన రాజు ఆశ్చర్యంతో ఏమి పాలుపోక నిల్చుని ఉంటాడు.

ఇంతలో అశరీరవాణి "మీ కోసమే ఈ బాలిక జన్మించింది. నీ కూతురుగా స్వీకరించి పెద్దదాన్ని చెయ్యి. మహాలక్ష్మీ అంశకలిగిన ఈ అమ్మాయిన విష్ణువు పెళ్ళి చేసుకుంటాడు" అని వినిపిస్తుంది. ఈ పసిపాపే మన కూతురు, ఈమెను ప్రేమతో పెంచు అని తన భార్యకు అప్పగిస్తాడు. యజ్ఞం పూర్తి చేస్తాడు. తర్వాత వసుద అనే కొడుకు పుడతాడు. పద్మంలో పుట్టింది కనుక పద్మావతి అని నామకరణం చేస్తారు ఆ పాపయికి. ఈ అమ్మాయే ఇప్పుడు శ్రీనివాసుడికి కనిపించిందని చెప్తారు సూతులవారు.

శ్రీనివాసుడు వేటకు భయలుదేరకముందే నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పద్మావతీదేవి చెలికత్తెలతో కలిసి విహరిస్తున్న ఉద్యానవనానికి వెళతాడు. శ్రీనివాసుడు యందు మొహం కలిగించడానికి చేసే ప్రయత్నం ఇది. నారదుడిని చూసి పద్మావతీ దేవి భయపడగా, ఏం ఫర్వాలేదునని, తాను ఆనె శుభం కోరేవాడినని, ఆమెకు భవిష్యత్తు చెప్తానని పద్మావతీదేవి చేయి చూపించమంటాడు.

హస్త రేఖలు పరీక్షించి శ్రీ మన్నారాయణుడే ఆమెకు భర్తగా వస్తాడని జోస్యం చెప్పి, వచ్చే భర్త ఏలా ఉంటాడు, అతడి అవయవలక్షణాలన్నీ వర్ణించి, ఆమెలో కాబోయే భర్త పట్ల ఆలోచనలు రేకెత్తిస్తాడు.

ఏనుగు వెళ్ళిపోయిన తరువాత పద్మావతీదేవిని చూసిన శ్రీనివాసుడు, ఆమెను పరిచయం చేసుకోవడం కోసమని ఆమె దగ్గరకు వెళతాడు. తాను శ్రీకృష్ణుడననీ, తన తల్లిదండ్రులు దేవకీవసుదేవులనీ, తాను ఇప్పుడు వేంకటాచలంలో నివాసముంటున్నానని, తన వివరాలు చెప్తాడు. పద్మావతీదేవి కూడా తానది అత్రిగోత్రం అని, తన ప్రవర చెప్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగిరిస్తుంది. తన శ్రీనివాసుడితో వివాహం ఇష్టమేనని చెప్తుంది. కానీ అంతఃపురం స్త్రీలతో ఉద్యానవనంలో శ్రీనివాసుడు మాట్లాడిన విషయం ఆకాశరాజుకు తెలిస్తే, దండిస్తాడని, అందువల్ల త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వారిస్తుంది. కానీ శ్రీనివాసుడు వినడే! అక్కడే నిలిచున్నాడు.

ఎవరైనా చూస్తారని భయం పట్టుకుంది పద్మావతీదేవికి. అసలే మహాసౌందర్యవంతుడు, తాను ఇష్టపడినవాడు, తనను ఇష్టపడేవాడు, దండనకు గురైతే చూడలేదు, ఇతడేమొ కదలట్లేదు , ఇక చేసేది లేక తన చెల్లికత్తెలతో రాళ్ళు విసిరేలా ప్రేరేపిస్తుంది.  

రాళ్ళదాడిలో శ్రీనివాసుడు గుఱ్ఱం ప్రాణం విడిస్తుంది (వాయుదేవుడు ఆ ఆశ్వం యొక్క దేహాన్ని విడిచిపెడతాడు). స్వామికి దెబ్బ తగలదుకానీ, పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ హడవుడిలో ముడివేసిన స్వామి జుట్టు ఊడి, వస్త్రాలు చిందరమందరగా తయారవుతాయి. ఎలాగో అలాగ తప్పించికుని ఇంటికి చేరతాడు శ్రీనివాసుడు.

ఇంటికి చేరాక దిగులుతో అన్నం మానేసి, మంచం మీద పడుకుని ఏదో పోయినట్లు ఏడుస్తాడు (ఏడుపు నటిస్తున్నాడని అర్దం చేసుకోవాలి). ఇంతలో వకుళమాత చేతిలో భోజనపళ్ళెంతో శ్రీనివాసుడు వద్దకు వచ్చి "ఏం నాయనా! భోజనం చేయలేదేమి? ఆరోగ్యం బాగోలేదా? లేక భూతప్రేతపిశాచాలు బాధిస్తున్నాయా? అసలు నీ దుఃఖానికి కారణం ఏమిటి? చెప్పు " అంటూ ప్రశ్నిస్తుంది. కానీ ఈయన ఏమి చెప్పడు. మళ్ళీమళ్ళీ ప్రశ్నించడంతో కాసేపటికి శ్రీనివాశుడు వకుళమాతలో " పిశాచభూతాలు నన్నేం చేస్తాయమ్మ, నేనే మహద్భూతాన్ని (సర్వోత్తముడిని). నా పేరు చెబితినే ఇతరులకు పట్టిన పిశాచాలు తొలగిపోతాయి. నాకేం బాధలేదులే " అంటాడు.

కానీ వకుళమాత ఊరుకోదు. బిడ్డలు ఏడుస్తుంటే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అందుకే మరల మరల ప్రశ్నిస్తుంది. చాలాసేపటికి శ్రీనివాసుడు తాను పద్మావతీదేవిని చూసిన విషయం చెప్పి, ఆమె లేని జీవితం అసలు జీవితమే కాదని, ఆమెనే పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు.

ఒకసారి నువ్వు నా బిడ్డవైనప్పుడు, మోక్షం అడగవల్సిందిపోయి నీ వివాహం చూడాలని ఉంది అని వరం అడిగాను. అప్పుడు ఏదో మాయలో పడ్డాను కానీ, ఇప్పుడు పడను. నువ్వెంత మాయలో పడవేయాలనుకున్న, నేను ఆ ఆవకాశం నీకు ఇవ్వను. నీకూ పద్మావతీదేవికి వివాహం చేసి, నా వరం తీర్చుకుంటాను అంటుంది వకుళమాత.

Saturday, 19 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - శ్రీనివాసుడు వేంకటాచక ఆగమనం

ఓం నమో వేంకటేశాయ

భృగుమహర్షి వైకుంఠంలో ఉన్నంతవరకు లక్ష్మీదేవుకి మహర్షికి సపర్యలు చేసింది, విష్ణుమూర్తికి సహకరించింది. పాదపూజకు గోరువెచ్చటి నీరు తెచ్చింది, పాదపూజ చేస్తున్న సమయంలో విష్ణువుకు సహకరించింది, మహర్షి పాదోదకం తలపై చల్లుకుంది.

ఎంతగొడవలుంటే మాత్రం అందరి ముందు బయట పెట్టుకుంటామా? మన పరువుకే ఎసరు తెచ్చుకుంటామా? అందువల్ల అంతసేపు మౌనం వహించింది. కానీ మహర్షి వెళ్ళిపోగానే విష్ణువుపై కోపంతో విరుచుకుపడింది (కోపం నటించింది).విష్ణు వక్షస్థలం తన నివాస స్థానమనీ, అటువంటి చోట కాలితో తన్ని, ఒక మానవుడు తనకు అవమానం చేస్తే, విష్ణువు అతడిని శిక్షించకపోగా, సత్కరించాడని, అతనికి చేసే పాదపూజలో తానూ భాగం పంచుకోవలసి వచ్చిందని, ఇంత అవమానం జరిగాకా తాను వైకుంఠంలో ఉండే ప్రసక్తే లేదని, అందువల్ల తానూ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోతున్నాని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది.

అసలు అమ్మవారికి కోపం రావడమేమిటి? విష్ణువును విడిచివెళ్ళడమేమిటి? అంటే, ఇదంతా ఒక లీల. లక్ష్మీదేవికి మనమంతా బిడ్డలం. కలియుగంలో శ్రినివాసుడిగా శ్రీ మహావిష్ణువు వేంకటాచలం మీదకు రావాలి. తన బిడ్డలను కలిపురుషుడు ప్రభావం నుంచి రక్షించాలి, లోకకల్యాణం జరగాలి. వైకుంఠం మొత్తం తిరుమలకు తరలిరావాలి.. అందుకోసం లక్ష్మీదేవి ఈ నాటకమాడింది.

కృష్ణావతారంలో స్వామి యశోదకు వరమిచ్చాడు - శ్రీ కృష్ణుడిని చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచింది యశోద. కృష్ణుడు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్క వివాహం కూడా చూడలేకపోయింది. ఈ బాధ యశోదమ్మను బాగా వేదించింది.  పరమాత్ముడే తన బిడ్డగా పెరిగినా, సంసారమాయలో పడి, మోక్షం అడగాల్సిందిపోయి, కృష్ణుడి వివాహం చూసే భాగ్యం కలిగించమని వరం కోరింది. ఈ ద్వాపరయుగంలో, కుదరదని రాబోయే 28 వ కలియుగంలో తన కోరిక నేరవేరుతుందని యశోదకు కృష్ణుడు వరమిస్తాడు. మరి ఆ కోరికను నేరవేర్చాలంటే, విష్ణువే కృష్ణుడిగా, వేంకటేశ్వరునిగా భూలోకానికి రావాలి. అందుకోసం జరిగే మహానాటకంలో భాగంగా లక్ష్మీదేవి విష్ణువుపై అలిగింది.      
లక్ష్మీదేవి కరివీరపురం వెళ్ళి, అక్కడ తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ఉండలేక దుఃఖిస్తూ భూలోకానికి బయదేరాడు. శేషుడు, మేరుపర్వతాలకు ఇచ్చిన వరాల దృష్ట్యా విష్ణువు వేంకటాచలం మీదకు వచ్చాడు. రాముడు, కృష్ణుడు, వామనుడు లాగా ఇది విష్ణువు యొక్క వేరొక అవాతారం కాదు, సాక్షాత్తు విషువే కృష్ణుడి రూపంలో, వేంకటేశ్వరునిగా రావడం విశేషం. లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోయిందన్న బాధతో ఒక వల్మీకం (పుట్ట)లో చేరి ఈయన తపస్సు చేయసాగాడు.

చిన్నచిన్న నాయకులే ఒక ప్రదేశానికి వస్తుంటే, మందీమార్బలం తరలివస్తుంది. అదే పెద్ద నాయకుడైతే, బోలెడు రక్షణ, ఎంతో మంది పోలిసులు, మిలటరీవాళ్ళు, అభిమానులు......... పెద్ద సంఖ్యలో వస్తారు. మరి వేంకటాచలం మీదకు వచ్చిందేమైనా సామాన్య మానవుడా? కాదు......... అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వదేవతలకు అధిదేవుడు. మరి ఈయన వేంకటాచలానికి వస్తుంటే, ఈయన వెంట దేవతలు రాకుండా ఉంటారా?

మొత్తం వైకుంఠం తిరుమలకు తరలి వచ్చింది. ఆదిశేషుడే తిరుమల కొండ, శంఖుచక్రాలు మొదలైనవి వేంకటాచలం మీద తీర్ధాలుగా మారాయి. త్రేతాయుగంలో హనుమంతుడు వేంకటాచలం మీదే జన్మించారు. దేవతలందరు వృషాలుగా మారిపోయారు, ఋషులు, మునులు మృగాలుగా మారారు, పితృదేవతలు పక్షులుగా, యక్షకిన్నెరులు రాళ్ళుగా వేంకటాచలం మీద స్థిరపడ్దారు, వారు కూడా వారివారి సాధనలో మునిగిపోయారు. సమస్త బ్రహ్మాండమంతా వేంకటాచలం మీదకు వేంచేసింది.

అందుకే తిరుమల పరమపవిత్రం. తిరుమలలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం, చెత్త, ప్లాస్టిక్‌కవర్లు పారేయడం, సిగిరెట్లు కాల్చడం, మద్యపానం చేయడం, మాంసాహారం తినడం, ఇంకా నేను చెప్పడం ఎందుకు. తిరుమల పవిత్రతకు బంగం కలిగించే పనులు చేయడం పెద్దతప్పు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వామికి ఆకలి తీర్చేవారేరి? పాలసముద్రంలో శయనించే శ్రీనివాసుడు ఒక మానవుడిగా వేంకటాచలం మీద తపస్సు చేస్తున్నా, ఆయనకు గుక్కెడు పాలు ఇచ్చేవారేరి? శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు (కాదు, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆకలి నటిస్తున్నాడు. అదేంటో తరువాత తెలుస్తుంది).

ఎంత కోపగించుకున్నా, ప్రేమలు ఎక్కడికిపోతాయి? లక్ష్మీదేవి కరివీరపురంలో ఉంది కానీ, ఆవిడ మనసంతా శ్రీనివాసుడి మీదే ఉన్నది. భార్యాభర్తలంటే అంతేమరి.

లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఆకలి బాధ తీర్చడం కోసం తన కొడుకైన బ్రహ్మను, సోదరుడైన శివుడిని పిలిచి, బ్రహ్మ ఆవుగా రూపం స్వీకరిస్తారని, శివుడుని దూడగా స్వీకరించమని, తాను గొల్లదాని వేషం దరిస్తానని చెప్తుంది. శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న ప్రాంత రాజు యొక్క ఆవుల మంద వేంకటాచలం మీద గడ్డి మేతకు వెళ్తుందని అమ్మవారికి తెలుసు. శ్రీనివాసుడు క్షీరాభిమాని. ఆయనకు పాలు అంటే మహాప్రితి. ఈనాటికి తిరుమలలో ఉదయం ఆవుపాలు నైవేధ్యం పెడతారు, భోగశ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తారు, శుక్రవారం మూలవిరాట్టుకు కూడా క్షీరాభిషేకం తప్పక చేస్తారు). పుట్టలో ఉన్న తన స్వామికి కైంకర్యం ఏర్పాటు చేయాలనుకొంది.

చెప్పిన విధంగానే వేషం ధరించి ఆ ప్రాంతపు రాజ మందిరానికి, ఆవును, దూడను వెంట పెట్టుకుని వెళ్ళింది. అది చోళదేశం, ఆ రాజు పేరు చక్రవర్తి. తన దగ్గర ఉన్నది మేలుజాతి గోవని, అది మధురమైన పాలు ఇస్తుందని చెప్తుంది. మేలుజాతి ఆవు అంటోంది కనుక, ఆ ఆవుపాలు తన కొడుకు కోసం వాడితే బాగుంటుందని భావించిన మహారాణి, గోవును, దాని దూడను కొనాలని నిశ్చయించుకుని, దాన్ని కొంటుంది.

ఆ ఆవు ప్రతిరోజు మిగితా మందతో కలిసి వేంకటాచలానికి వెళ్ళేది. కానీ, మేతమేయకుండా శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్ట వద్దకు వెళ్ళగానే భక్తి పారవశ్యంతో ఎవరూ పిండకుండానే తన పొదుగునుంచి పాలు ధారులుగా కార్చేది. రోజూ ఇదే పరిస్థితి. ఆవు (బ్రహ్మదేవుడు) వేంకటాచలానికి రావడం, శ్రీనివాసుడి ఆకలి తీర్చడం.

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తిరిగి రాజమహలు చేరాక, పాలు ఇచ్చేది కాదు. రాణిగారికి పరిస్థితి అర్దమవలేదు. ఎంతో ఖరీదు పోసి కొన్న మేలుజాతు ఆవు ఉద్దరిణెకు సరిపడా పాలు కూడా ఇవ్వడంలేదు. కారణం తెలియదు. గోపాలకుడు పితుకుతున్నాడనుకుని అతడిని పిలిచి అడుగగా, తనకేమి తెలియదని, తాను పాలుపితకడం లేదని ప్రమాణం, చేసి మరీ చెప్తున్నాడు. ఏం చేయాలి?..... అని ఆలోచించి గోపాలకుడిని దండించింది, కొరడాలతో కొట్టించింది, హెచ్చరించింది, పరిస్థితి మారకపోతే కఠినశిక్ష తప్పదని హెచ్చరించింది.

హడలిపోయిన గోపాలకుడు ఆ ఆవు వెనుకాలే వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న వింత కళ్ళారా చూశాడు. ఆవు పొదుగునుండి పాలు ధార్లుగా పుట్టలోకి కారిపోతున్నాయి. తనను అంతగా కొట్టించి, మాటలు పడడానికి కారనమైన ఆవు మీద అతనికి పట్టరాని కోపం వచ్చింది. వేంటనే ఆవేశంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టబోయాడు.

భక్తవత్సలుడు, కరుణాసముద్రుడు, ఆశ్రితరక్షకుడు, జీవితకాలం దూషించి, జీవితం ఆఖరున పరమాత్మ అని ప్రేమతో పిలవగానే 'నేనున్నా రా' అంటూ పలికే పరంధాముడు, తన బిడ్డపై దెబ్బ పడుతుంటే చూస్తూ ఉరుకుంటాడా? కృష్ణావతరంలో బాల్యం మొత్త గోవులతో గడిపి గోవు విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గోకులనందనుడు గో హత్య జరుగుతుంటే మౌనం వహిస్తాడా? 

అందుకే పుట్టలో ఉన్న పరమాత్మ ఆవును పక్కకు నెట్టుకుంటూ ఒక్కసారిగా పైకి లేచాడు. గొడ్డలి దబ్బను స్వామి స్వీకరించాడు. ఆ దెబ్బకు స్వమి తల చిట్లి, ఏడు తాటి చెట్ల ప్రమాణం ఎత్తు ఎగిరిందని భవిష్యోత్తర పురాణం అంటుంది. అంతే, ఆ సంఘటనతో ఆ గోపాలకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిజానికి ఆయనది మనలా ప్రాకృతిక దేహం కాదు, అది సప్తధాతువులతో నిర్మితమై ఉండదు. కాని, ఒక లీల చూపడానికి, గో మహత్యం లోకానికి చెప్పడానికి, గోవును కొట్టాలన్నా ఆలోచనే తనకు గాయం చేస్తుందన్న విషయాన్ని లోకానికి తెలియజెప్పాలనుకున్నాడు.

ఆ గోపాలకుడు మరణించగానే, ఆ ఆవు కొండదిగి రాజమందిరానికి వెళ్ళి, రాజుసభలో రోదిస్తుంది. ఏదో జరిగిందని అర్దం చేసుకున్న రాజు, ఆ ఆవు వెంబడి సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ప్రవహిస్తున్న రక్తాన్ని, గాయపడిన దివ్యపురుషుడిని చూస్తాడు. ఆ రుజును చూస్తూనే శ్రీనివాసుడు ఆవేశంతో ఊగిపోతాడు.

చక్రవర్తితో స్వామి చాలా నిష్ఠురంగా మాట్లాడుతారు. 'ఓయి రాజా! నీ రాజ్యంలో ఇంత అరాచకమా? జరిగిన తప్పుకు శిక్ష అనుభవించు. పిశాచిగా మారిపో' అంటూ శపించారు.

నేనెం తప్పు చేశాను? గోపాలకుడు చేసిన తప్పకు నన్ను శిక్షించడం ఎందుకు? అయినా ఇంత పెద్ద శిక్ష వేస్తావా? చేయనై తప్పుకు శిక్ష అనుభవించాలా? అంటూ చక్రవర్తి స్వామివారితో పలుకుతాడు.

ఇంట్లో భార్య, పిల్లలు, పనివారు / సేవకులు చేసిన తప్పకు బాధ్యత యజమానిది. శిష్యుడి తప్పు చేస్తే బాధ్యత గురువుది. రాజ్యంలో తప్పులు జరిగితే బాధ్యత రాజుది. కనుక యజమానిగా, రాజుగా, నీ గోపాలకుడు చేసిన తప్పకు శిక్ష నీవే అనుభవించాలంటాడు శ్రీనివాసుడు.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కేవలం ఆవును దాడి చేయాలన్న ప్రయత్నం జరిగితేనే స్వామి ఆవేశం కట్టలు తెంచుకుంది. మరి గోవధ జరిగితేనో? ఈ ప్రపంచంలో పుట్టింది మొదలు మరణం వరకు, ఆఖరికి మరణీంచిన తరువాత కూడా సంపూర్తిగా లోకోపకారానికి ఉపయోగపడేది భారతీయ గోవు ఒక్కటే. గావో వీశ్వస్యమాతరం అంటుంది వేదం. ఆవు సమస్త విశ్వానికి మాతృస్థానంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధ జరగరాదని వేదం గట్టిగా చెప్పింది. గోవు సర్వదేవాతస్వరూపం.

ప్రతిరోజు ఉదయం, మన దేశంలో లేగదూడలను, ఆవులను వేలల్లో వధించి విదేశాలకు తరలిస్తున్నారు. ఆవు మీద దబ్బపడినందుకు అంత ఎత్తున లేచిన స్వామి మన దేశంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ పాపం ఎవరిది? మన నాయకులది............ కాదు, కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలది. మనం గోవధ మీద నోరెత్తకపోతే, మనకూ, మన పిల్లలకు కూడా ఇదే శాపం వర్తిస్తుందని మర్చిపోకూడదు.

పరమాత్ముడి మాటలతో రాజు దుఃఖిస్తాడు. రాజుకు ఊరట కలిగిస్తూ, త్వరలో తనకు పద్మావతీ దేవితో వివాహం జరుగుతుందని, అప్పుడు పద్మావతీదేబి తండ్రి ఆకాశరాజు ఒక కిరీటం బహుకరిస్తాడనీ, ఆ కిరీటాన్ని తాను ధరించిన ప్రతి శుక్రవారం ధరిస్తాననీ, అప్పుడు ఒక 6 ఘడియల కాలం ఆనందబాష్పాలు వస్తాయానీ చెప్పిన శ్రీనివాసుడు, అప్పుడు నీకు పిశాచపీడ ఉండదు, ఆ సమయంలో నీవు సుఖం అనుభవిస్తావు అంటూ రాజుతో పలుకుతాడు.

వల్మీకంలో ఉంటున్న స్వామి, ఒకానొక రోజు పుట్టనుంచి బయటకు వచ్చి, అక్కడ విహారం చేస్తుండగా, వరహాస్వామి తన పరివారంతో కలిసి దూరం నుంచి అటువైపు వస్తుండడం గమనించి, భయపడి గబగబా మళ్ళీ వల్మీకంలోకి వెళ్ళి దాక్కున్నాడు.

హిరణ్యాక్షుని వధించి, భూదేవిని కాపాడిన తరువాత ఆదివరహాస్వామి ఈ వేంకటాచల క్షేత్రంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు. శమీకధాన్యం పంటల్ని పరివారం చేత పండిస్తూ ఈ క్షేత్రంలో నివాసముంటున్నారు. తమ శమీక ధాన్యాన్ని దొంగిలించడానికి వచ్చిన దైత్యులను సంహరించి వస్తున్నారు.

శ్రీనివాసుడు వల్మీకంలోకి వెళ్ళడం చూసిన వరాహమూర్తి, పుట్ట దగ్గరకు వెళ్ళి బయటకు రమ్మని శ్రీనివాసుడిని పిలుస్తారు. ఇది ఒక మహాద్భుత ఘట్టం. ఒకే విష్ణువు యొక్క వేర్వేరు రూపాలు ఒకే దగ్గర కలుసుకోవడం, ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం, తమ వివరాలు చెప్పుకోవడం మాట్లాడుకోవడం మహావిశేషమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని దేవలోకం నుంచి తిలకిస్తున్న దేవతలు భక్తిభావంతో పుష్పవర్షం కురిపించారు.

అసలు భగవంతుడు ఒక్కడే. కానీ అనేకరూపాల్లో దర్శనమిస్తాడు. మాయ ప్రభావం చేత శివుడు, విష్ణువు, దుర్గ, లక్ష్మీ, గణపతి, సరస్వతీ........... ఇలా ఎంతో మంది దేవతలు ఉన్నారనుకుంటాము. ఎవరిని పూజించినా, ఆఖరున అన్ని దైవరూపాలు ఒకే సచ్చిదానందరూపంలొ ఐక్యమవుతాయి. ఇక్కడ విష్ణువు ఒక్క వివిధ అవతారాలు కలుసుకోవడం కూడా మాయలో పడవేయడానికే. అర్దమైనవారు దైవలీలగా అనందిస్తే, అర్దం కానీ వారు, దైవాలు వేరనుకోని కొత్తవాదన తిసుకువచ్చి, ఉపాసన నుంచి పక్కకు జరుగుతారు.

ఈ ఆదివరాహస్వామిని దర్శించి ఆయన స్తోత్రం పఠిస్తే, ఇల్లు కట్టుకోవాలన్న కల నేరవేరుతుంది. ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించడానికి భూమి దొరుకుతుంది.  

నాకు మీ వరహాచలం మీద నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలని శ్రీనివాసుడు వరహాస్వామిని అడుగుతారు. కలికాలంలో జరగబోయే పరిస్థితులు చూపించడానికన్నట్లు ఉంటుంది. అడగకుండానే, ఎన్నో రోజులుగా అక్కడ పుట్టలో అక్రమంగా ఉంటున్నారు. ఇవాళ వరహాస్వామికి కనపడ్డాడు కాబట్టి స్థలం కావాలని ఆడుగుతున్నాడు, ఇవ్వమని అనుమతి కోరుతున్నాడు.

ఈరోజు ప్రభుత్వం స్థలాల గతి కూడా ఇంతే కదా. ముందు అక్రమంగా, గుట్టూ చప్పుడు కాకుండా ఆక్రమణ చేయడం, తరువాత దాన్ని సక్రమం చేయమని వివిధరకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం , ప్రభుత్వం కూడా 'అక్రమం - సక్రమం' చేసే పధతులు ప్రవేశపెట్టి అక్రమ ఆక్రమణలను, నిర్మాణాలను సక్రమం చేయడం కనిపిస్తూనే ఉంది. పాతబడ్డ కొద్ది కొత్తగా అనిపించేది పూరాణం అంటుంది శాస్త్రం.

'ఊరికే స్థలం ఇవ్వడం కుదరదయ్యా! డబ్బు చెల్లించాలి అంటారు" వరాహస్వామి. "ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? కానీ భవిష్యత్తులో కోట్లాదిమంది భక్తజనం నా దర్శనానికి వస్తారు. వారు కొండకు వచ్చినప్పుడు, ప్రధమ దర్శనం నీది. తరువాత దర్శనం నాది. ముందు అభిషేకం నీకు, ఆ తర్వాతే నాకు, నైవేద్యం కూడా ముందు నీకే, తర్వాతే నాకు" అన్నాడు శ్రీనివాసుడు.

అందుకే తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామిని దర్శించుకున్నాకే వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి. లేకుంటే మనకు స్వామిని దర్శించిన ఫలితం దక్కదు.

సరేనన్న వరహాస్వామి శ్రీనివాసుడికి కొంత స్థలం ఇస్తాడు.  

ఈ భూమి / స్థలం నాది, ఈ ఆస్తి నాది, నాకు 10 ఇళ్ళు ఉన్నాయి అంటూ తరచూ విర్రవీగీపోతుంటాం. కానీ నిజానికి ఈ భూమి వరహాస్వామిది. రాక్షసుల బారి నుంచి భుమాతను తప్పించారు వరహాస్వామి. భూమియే కాదు, మనకు ఉన్నవన్ని దైవప్రసాదాలే. ఈ మనుష్యజన్మ, మనం తినే అన్నం ముద్ద, మన చదువు, సంస్కారం, ఈ భారతదేశంలో పుట్టడం, ఇవన్నీ దైవానుగ్రహం లేకుండా రావు.

అది మర్చిపోయి, ఇది నాది, అది నాది అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్నాం, నాది అనుకోవడమే బంధానికి హేతువు. బంధం మమకారానికి, అహంకారానికి కారణమై పునర్జన్మకు దారితీస్తుంది. ఇది నాది కాదు, నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందనుకోవడం వల్ల బంధం తెగిపోతుంది. శ్రినివాసుడు కూడా తన చేష్టల ద్వారా తన భక్తులకు అదే సందేశం ఇచ్చాడు. ముందు అభిషేకం వరహాస్వామికి అంటే తనకు అన్ని ఇచ్చినవాడికి, తరువాత తనకు. ముందు నైవేద్యం వరాహమూర్తికి, తరువాత స్వామికి. అంటే మనకు ఈ లోకంలో లభ్యమయ్యేవన్నీ కూడా ముందు పరమాత్మకు (ఇష్టదైవానికి) సమర్పించి, తరువాత స్వీకరించమన్నాడు. అన్నం తినే ముందు, ఇది నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందన్న భావనతో తినమన్నాడు, ఇది నాది, నేను సంపాదించానన్న అహం వీడి, ఇది భగవంతుని దయ వల్ల నాకు సిద్ధించిందని భావించమన్నాడు. సర్వకర్మలను భగవంతునకు అర్పించమని తన ఈ దివ్య చేష్ట ద్వారా లోకానికి చెప్పాడు.

స్థలం ఇచ్చాక ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. మనం ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఏ విధంగానైతే విచారణ (ఎంక్వైరి) చేస్తామో, అలాగే వరహాస్వామికి కూడా నీతో ఎంత మంది ఉంటున్నారని అడుగుతారు. నాకెవరు లేరు అంటాడు స్వామి. అయితే నీకు వంట చేయడానికి, ఇతర సేవలు చేయడానికి వకుళ అనే దాసిని పంపుతాను అని, వకుళను పంపుతారు వరహాస్వామి.

కధ వింటున్న శౌనకాదులు, సూతు మహామునితో "అసలీ వకుళ ఎవరు? ఆమె జన్మ వృతాంతమేమి?" అని అడుగుతారు.

To be continued..............

Tuesday, 15 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - విశ్వశాంతి యాగం - భృగు మహర్షి శాపం

ఓం నమో వేంకటేశాయ 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు. కలౌ వేంకటనాయకః అన్నారు, ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పూజలందుకున్న స్వామి, కలియుగంలో శ్రి నివాసుడిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ నివాసుడి దివ్యలీలా విశేషాల గురించి, వేంకటాచల మహాత్యం గురించి 12 పురాణాల్లో ప్రస్తావించబడింది.

'వైకుంఠానికి సమానంగా ఈ వేంకటాచలంలో పరమాత్ముడు ఎందుకు ఉన్నాడు?' అని సనకాది మహామునులు సూతమహర్షిని ఒకసారి అడుగుతారు.

అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి, మహర్షులను ఉద్ద్యేశించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. "ఎవరి గురించి మీరు ఈ కర్మను చేస్తున్నారు? ఈ యజ్ఞ కర్మ యొక్క ఫలాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞానికి భోక్త ఎవరు? సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి? ఇవన్నీ స్వీకరించే సర్వోత్తముడు ఎవరు?"

యజ్ఞభోక్త అంటే యజ్ఞంలో వేసిన హవిస్సును స్వీకరించేవాడని అర్ధం. మనం ఎవరిని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తామో, అది ఆ దేవతకు చేరవేస్తాడు అగ్నిహోత్రుడు, ఆ హవిస్సుతో తృప్తి పొందిన దేవత మన కోరికలను తీరుస్తుంది. అందరూ, అన్ని యజ్ఞాలు కోరికల కోసం చేయరు. విశ్వశాంతి కోసం కొన్ని చేస్తారు, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొన్ని చేస్తారు. మరి ఇవన్నీ ఎవరు స్వీకరిస్తారన్నది నారదమునీంద్రుల ప్రశ్న.

యజ్ఞం అంటే నిష్కామ కర్మ, స్వార్ధరహిత కర్మ. ఇక్కడ యజ్ఞం అంటే అగ్నిహోత్రం పెట్టి చేసేది మాత్రమేనని అనుకోకూడదు. మనం ఎవరికో రక్తదానం చేస్తాం, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తాం, గోమాతలు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకుంటాం. ఎన్నో దానాలు చేస్తాం, సేవకార్యక్రమాలు నిర్వహిస్తాం, పేదలకు అహారం పంచిపెడతాం. ఇవన్నీ కూడా యజ్ఞాలే. యజ్ఞం అంటేనే నిస్వార్ధంగా చేసేది. మరి మనం నిత్యం చేసే ఈ కర్మలు ఎవరిని చేరుతాయి? వీటిని ఎవరు స్వీకరిస్తారు? ఇది నారద మహర్షి అడిగిన ప్రశ్నల సారం.

నారదుడి ప్రశ్నతో మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు? ఎవరికి సర్వకర్మఫల సమర్పణ చేయాలి? యజ్ఞభోక్త ఎవరు? అన్న చర్చ మొదలైంది. అందరూ తీవ్రంగా చర్చించి, ఆ మహర్షుల్లో ప్రముఖుడైన భృగు మహర్షికి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. పరిష్కారం చూపవలసిందిగా ప్రార్ధించారు.

వీటికి సమాధానం తెలుసుకోవడం కోసం భృగుమహర్షి బ్రహ్మదేవుడు, సరస్వతీ దేవి ఉండే సత్యలోకానికి వెళ్ళారు. ఆ సమయానికి బ్రహ్మాసరస్వతులు ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి వారికి నమస్కారం చేస్తారు, కానీ బ్రహ్మదేవుడు ఏమి గమనించనట్లుగా ఉంటారు.

బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహాజ్ఞాని. ఆయనకు తెలియందేముంటుంది?  కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి జనులను ఉద్ధరించడానికి విష్ణువు వేంకటాచలం మీద అవతరించవలసి ఉంది. ఆ అవతారం స్వీకరించే దశలో సాగుతున్న జగన్నాటకం ఇది. ఈ ఋషి ద్వారానే విష్ణువు భులోకానికి వెళ్తాడన్నది బ్రహ్మదేవుడికి తెలుసు. కనుక ఏమి ఎరగనట్లు మౌనం వహించాడు.

మనకన్నా యోగ్యులైనవారి వద్దకు, పెద్దవారి వద్దకు వెళ్ళినప్పుడు నమస్కరించడం (సాష్టాంగా నమస్కారం, ప్రణామం మొదలైనవి చేయడం) మన కర్తవ్యం. నమస్కారం స్వీకరించినవారు దాన్ని భగవంతునకు అర్పించి, ఆశీర్వదించడం, నమస్కారం స్వీకరించిన పెద్దల కర్తవ్యం. ఇది ధర్మం. ఈ మాత్రం కూడా బ్రహ్మదేవునికి తెలియదని భావించాడు భృగుమహర్షి.

'ఈ లోకంలో నీకు ఆలయం లేకుండు గాకా' అంటూ బ్రహ్మను శపించాడు భృగుమహర్షి. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం కట్టి పూజించరు.

బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్‌లో ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దానికి గుర్తుగా ఒక చిన్నసరస్సు కూడా ఉంది. అటు తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి నదీతీరంలో, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కలిసి యజ్ఞం చేసిన ప్రదేశంలో, ముక్కామల క్షేత్రంలో ఈ మధ్యకాలంలో ఆలయం నిర్మించారు ముక్కామల పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామి.

బ్రహ్మను శపించిన భృగువు కోపంతో కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉంటాడు. శివుడి ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదని శాస్త్రం. అటువంటి శివుడు భృగువు వచ్చాడాన్న విషయాన్ని గమనించనట్లు నటిస్తాడు. దాంతో కోపం వచ్చి, 'మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంధుడవై ఉన్న నీవు సర్వోత్తమ్ముడు కానేరవు. లోకంలో నీకు మూర్తి పూజ లేకుండు గాకా' అంటూ శపించాడు భృగు మహర్షి. అందుకే మనం శివుడిని విగ్రహరూపంలో పూజించమని పెద్దల మాట. కానీ, భృగు మహర్షి శపించకముందు నుంచి లోకంలో లింగారాధనే ఉన్నది. శివుడి విగ్రహాన్ని పూజించేవారికంటే శివ లింగాన్ని పూజించేవారు శక్తిమంతులని, వారిని ఎవరు ఓడించలేరని మహాభారతంలో కృష్ణపరమాత్మ చెప్తారు. పరమాత్మ మాటకు కొనసాగింపుగా మహర్షి శాపం ఇచ్చాడు (ఇప్పించాడు పరమాత్ముడు). ఇదో దైవలీల.

మనకు దగ్గరలో శివుడిని విగ్రహరూపంలో కొలిచే ఒక క్షేత్రం చిత్తురు జిల్లా, సురుటపల్లిలో ఉంది. ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తునట్లుగా ఒక పెద్ద శిలాముర్తి ఉంటుంది.

ఆవేశంతో ఉన్న భృగుమహర్షి వైకుంఠం చేరుకుంటాడు. వైకుంఠంలోనూ అదే పరిస్థితి. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి ఆగమనాన్ని పట్టించుకోనట్ట్లు ఉంటారు. తెలియక కాది, లోక కల్యాణం కోసమని.......................... ముందు రెండులోకాల్లో పరిస్థితే ఇక్కడా అనుభమయ్యేసరికి భృగుమహర్షి ఆవేశం కట్టలుతెంచుకుంటుంది. అంతే, కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై (లక్ష్మీదేవి నివాసముండే ప్రస్దేశంలో) కాలితో తంతాడు........

అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి భృగుమహర్షి వైపు చూసి ఆయనకు ఉపచారాలు చేస్తాడు...... అతి కాఠిన్యమైన నా దేహ్న్ని తగిలి మీ పాదానికి నొప్పి కలిగి ఉంటుందంటూ ఆ కాలి వత్తి ఉపశమనం కలిగిస్తాడు. శ్రీమహాలక్ష్మీని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు. మహర్షి పాదోదకం తన పై చల్లుకుని, లక్ష్మీదేవీపై చల్లి, తన మందిరమంతా, వైకుంఠమంతా చల్లిస్తాడని పురాణవచనం.

భృగుమహర్షికి అరికాలిలో మూడవకన్ను ఉంటుంది. ఆ కన్ను కారణంగానే అతనిలో అవేశం ఎక్కువ ఉంటుంది. ఎంతటి గొప్ప సాధకుడైనా, క్రోధం ఉంటే, అతని సాధన వ్యర్ధమవుతుంది. భృగుమహర్షి గొప్పవాడు, తపోశక్తితో మూడులోకాలకు కాలినడకన వెళ్ళగలిగాడు. కానీ, అతనిలో కోపం కారణంగా బ్రహ్మను, శివుడిని శపించి, తను ఎన్నో ఏళ్ళ తరబడి తపస్సు చేసి పొందిన తపశ్శక్తిని మొత్తం వృధా చేసుకున్నాడు.

తన భక్తులు ఎప్పటికి నాశనం పొందరని పరమాత్మ గీతలో చెప్తారు. తన భక్తుడు ఎంతటి దుర్మార్గుడైనా, అతన్ని నిందించరాదని, భగవంతుని నమ్మాడు కనుక ఎప్పటికైన బాగుపడతాడని చెప్తాడు. తన భక్తులను ఉద్ధరించడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు పరంధాముడు. మనం ఏ రూపంలో పీజిస్తే, ఆ రూపంలోనే మనలని ఉద్ధరిస్తాడు. అలాగే భృగుమహర్షిని కూడా ఉద్ధరించాలి, క్రోధం నుంచి విముక్తి కలిగించాలని భావించాడు శ్రీ మహావిష్ణువు.

భృగుమహర్షికి పాదపూజ చేస్తూ, అతని అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిపేస్తాడు. క్రోధం నశించగానే, భృగు మహర్షికి తాను చేసిన తప్పు అర్ధమవుతుంది. విష్ణువును క్షమించమని వేడుకుంటాడు. తాను చేసినపనికి పశ్చత్తాప పడతాడు. విష్ణువు సర్వోత్తముడని, భూలోకానికి తిరిగి వచ్చి మహర్షులకు చెప్తాడు.

To be continued....

Monday, 14 October 2013

పాలపిట్ట కనిపించకపోతే

విజయదశమికి పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని శకున శాస్త్రం అంటుంది. మరి పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? అరిష్టమా?...... అపశకునమా?......... తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి.

ఒక 5 ఏళ్ళ క్రితం మాట. ఒకసారి విజయదశమికి దేవాలయ దర్శనానికి వెళ్ళి వస్తుంటే, రోడ్డు మీద జనం మూగు ఉన్నారు. ఏమని ఆరా తీస్తే, ఎవరో పాలపిట్టను తీసుకువచ్చారని, దాన్ని ఈ రోజు చుడడం వలన మంచి జౌరుగుతుందని చెప్పాడు. మేము చూడలనుకున్నాం, పది రూపాయల తీసుకున్నాడు. ఒక చిన్న పంజరం, ఆ పంజరం చుట్టు నల్లని గుడ్డ కప్పేశాడు, అందుఓ ఒక పిట్ట/పక్షి ఉన్నది. అది కాకో, పావురమో, పాలపిట్టో, చిలకో, అసలదెంటో కూడా తెలియడం లేదు. చుశామా అంటే చూశామని చెప్పుకోవాలి, కానీ ఏం చూశామో ఇంతవరకు తెలియదు.

అసలు పాలపిట్ట అనేది ఉనందన్న సంగతి కూడా మనకు వాళ్ళకు తెలియదు. పాలపిట్ట అంటే పాలుతాగే పిట్ట అన్నాడు ఒక గడుగ్గాయి. పాలపిట్టను మన రాష్ట్రానికి, కర్ణటక, బీహార్, మరికొన్ని రాష్ట్రాలాకు ఇది రాష్ట్ర పక్షి. అది ఎక్కువగా పంటపొలాల్లో కనిపిస్తుంది (కనిపించేది). పంటలకు వచ్చే చీడలను, పురుగును తిని రైతుకు సహాయంచేస్తుంది.అలాగే కీటకాలను, సీతకోకచిలుకలను, వానపాములను, చిన్న చిన్న పాములు వంటివి దీని ఆహారం. ఒకప్పుడు ఇవి 1 చదరపు కిలోమీటరుకు సగటున 50 కనిపించేవి. ఇప్పుడివి అంతరించిపొయే పక్షుల జాతుల జాబితలో చేరిపోయాయి, ప్రమాదపుటంచున ఉన్నాయి.

మనిషికి అత్యాశ పెరిగిపోయింది. ఒక ఎకరం పొలంలో 10 బస్తాల పంట రావల్సి ఉంటే, 50 బస్తాలు ఆశిస్తున్నాడు, అదే కొవలో ప్రభుత్వాలు ఉన్నాయి. మంచి దిగుబడి కోసం రసాయన (కెమికల్) ఎరువుల్లు, పురుగుల మందులు వాడతారు. ఈ రోజు మనం తినే ఆహారం మొత్తం రసాయనాలే, మన శరీరం మొత్తం కలుషితమైపోయింది. చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? అందరికి మధుమేహం ఎందుకు వస్తోంది? రకరకాల రోగాలు ఎందుకు పుడుతున్నాయి? మనం అభివృద్ధి చెందిన కొద్ది కొత్త రోగాలు కూడా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎందుకంటే మనకు పౌషకాహారం అవసరం లేదు. ఎంత తిన్నామన్నది చూస్తున్నాం కనీ, తిన దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి చూడడం లేదు. మనకు కేవలం దిగుబడి మాత్రమే కావాలి, కానీ అది మనకు శక్తినివ్వాలని మనం మర్చిపోయాం. మనం తింటున్నాం, కేవలం తింటున్నాం, ఎందుకంటే తినాలి కాబట్టి. అంతే. మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు.

బియ్యం అనేకమార్లు పోలిష్ పట్టి తెల్లగా కనిపించాలి. తెల్లటి బియ్యం మాత్రమే తినాలని మనం కోరిక. అందుకే చిన్నవయసులో జుట్టు తెల్లబడుతోంది. రసాయన ఎరువుల చేత పెంచబడిన ఆహారం వలన మనకు మధుమేహం (షుగర్) మొదలు అనేక వ్యాధులు వస్తున్నాయి. దంపుడు బియ్యం తింటే ఏమవుతుంది? అది పర్వౌతక్కువ పనిగా భావిస్తాం, మనం పిల్లలకు మనం రోగాలు అంటగడుతున్నాం.

ఇప్పుడు ఇది చెప్పవలసి వచ్చిందంటే పాలపిట్ట కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఈ రసాయన, కెమికల్ ఎరువులు, పుర్గుల మందులే. పాలపిట్ట కనిపించకపోతే ఏమవుతుంది? పాలపిట్ట అంతరించిపోతే ఏమవుతుంది? .......... ఏమవ్వదు, త్వరలో మానవజాతి కూడా రోగాలతో సర్వనాశనమవుతుంది, అంతే. ఆరోగ్యం భారతావని కాస్తా రోగాల భారతవనిగా మారుతుంది. అదే మనకు ఈ దసరా గుర్తుచేస్తోంది.  

మనం ఇప్పుడే మేల్కోవాలి. మనం పంధాను, మన వ్య్వసాయ పద్ధతులను, జివన విధానాన్ని, ప్రక్టిపట్ల మన దృష్టిని మార్చుకోవాలి. దీనికి సమాధానం సేంద్రియ వ్యవసాయం కానే కాదు ఎందుకంటే సేంద్రియ ఎరువుల ఒక ఉష్ణోగ్రత వరకే పనిచేస్తాయి. మరి మనకు మార్గం లేదా?

ఉన్నది ఒక్కటే మార్గం. అదే ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధపద్ధతులలో సాగే వ్యవసాయం. వేదంలో చెప్పబడ్డ వ్యవసాయ పద్ధతి. పాలేకర్ రైతు ఆశ్రయించి, ఫిలితాలు చూపిన వ్యవసాయపద్ధతి. గోమాత మీద సంపూర్ణంగా ఉపయోగపడ్డ వ్యవసాయం ఇది. మన కోసం, మన బిడ్డలకోసం, భావితరాలకోసం, బంగారు భారతభూమి ఆరోగ్యంగా ఉంచడం కోసం మన ప్రభుత్వాలు ప్రోత్సహించవల్సిన వ్యవసాయపద్ధతి. భూసారన్ని పెంచే వ్యవసాయ పద్ధతి.

ఈ విజయదశమి మనకు గుర్తుచేస్తున్నది ఇదే. మనం మారితే, భవిష్యత్తులో మనకన్ని విజయలే, లేకుంటే మానవజాతికి అపజయాలే.
               

Saturday, 12 October 2013

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.

దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,
'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.

అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.

పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.

ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్తబ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుస్కునే పని ఉండడో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.

ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఓం దుర్గాయై నమః 

బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగలో ఉన్న శాస్త్రీయ అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తంగేడు పువ్వులు గొంతు సమస్యలకు,మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు.

~ గునక పువ్వు యాంటి-డైహెరియా,యంటి-డైయాబేటిక్ లక్షణాలు కలది.
~ క్రిమి-సంహారిణి,దోమలను నివరించేది బంతిపువ్వు.
~ చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, అరుగుదల సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇది యాంటి-బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది, కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువలను పీల్చుకొని, గాలిని శుద్ధిచేస్తుంది.

ఈ విధంగా బతుకమ్మ పేరున వాడే ప్రతి పువ్వుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ పూలన్ని గోపురంలా పేర్చాక పైన గుమ్మడిపువు గొడుగుపెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభానికి సూచన, క్రిమి-సంహారిణి. దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది.

సాయంత్రం ఇంటిముందుకాని, వీధిలోకాని, దేవాలయంలో, చెరువు, వాగు ................ ప్రతి చోట అందరు చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడతారు.

చీకటి పడుతుండగా చెరువుల్లో నిమ్మజ్జనం చేస్తారు. ఆ పూలుకున్న ఔషధ గుణాలు నీటిని శుద్ధిచేసి, నీటిద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఇంట్లో 9 రోజులపాటు ఆ పూలను పేర్చడం, ఆ వాసన ఇల్లంత వ్యాపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న క్రిములు హరింపబడతాయి, అందరు ఆ వాసన పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తారు.

Thursday, 10 October 2013

శ్రీ మహాలక్ష్మీ

శ్రీ మహాలక్ష్మీ సిరులతల్లి, విష్ణుపట్టపురాణి. ఈ లోకంలో అందరూ లక్ష్మీకటాక్షం కోసం చేయని పూజ ఉండదు.

లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణనించాకా ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్ప్కించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కునే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.

లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా లక్ష్మీకటాక్షమే. ఆత్మ తత్వం తెలుసుకోవాలంటే ఈ మానవదేహం చాలా అవసరం. అటువంటి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యలక్ష్మీకి చేసే ఆరాధనవుతుంది.

యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

సర్వజీవులయందూ జీవసక్తిగా, ప్రాణశక్తిగా లక్ష్మీదేవి కొలువై ఉంది. సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడం, ఇతర జీవల ఆకలి తీర్చడం, వాటి జీవనానికి సహాయపడడం భూతలక్ష్మీకి (భూతములంటే జీవజాలం అని అర్దం) చేసే పూజ. అందరికి కొద్దొగొప్పొ డబ్బు ఉంటుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వెచ్చించడం మనం ధనలక్ష్మికిచ్చే గౌరవం అవుతుంది. సంతానం లక్ష్మీదెవి అనుగ్రహం వల్లనే కలుగుతుంది, పిల్లల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో తిరుగుతుంటుంది. అటువంటి పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించడం, మంచి విద్యావంతుల్ని చేయడం ద్వారా సంతానలక్ష్మీని పూజించినవారమవుతాం.

లక్ష్మీదేవికి నిత్యానపాయిని, విష్ణువును విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. విష్ణువంటే వ్యాపకత్వం కలిగినవడు. ఈ సృష్టిలో వ్యాపకత్వం కలిగినది ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప ఈ జగత్తులో మరకొటి లేదు. మనకు కనిపించేవన్నీ ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఇవి ఏదో ఒకరోజు లయం అయిపోతాయి. కానీ ఆత్మ సనాతనమైనది, ఆత్మ ఆనందస్వరూపం. విష్ణువు ఆత్మ అయితే, ఆత్మానందం లక్ష్మీదేవి. ఆత్మానూభూతిని పొందడం వలన, ఆత్మ స్థితిలో ఉండడం వలన కలిగే చిదానందమే లక్ష్మీకాటాక్షం.

ఓం నమో లక్ష్మీనారాయణాయ                       

Wednesday, 9 October 2013

శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి

ఓం శ్రీ మాత్రే నమః 

మహామహిమాన్వితమైనది శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి. 

భాస్కరరాయులవారు (1690-1785) బ్రహ్మాండపురాణంలో ఉన్న శ్రీ లలితా సహస్రనామాలకు భాష్యం రాసారు. వారు ఈ సహస్రనామాలకు భాష్యాన్ని (కామెంటరి) రాస్తున్న స
మయంలో ఒక సంఘటన జరిగింది. కాశీలో, అక్కడి పండితులు అహంకారంతో భాస్కర రాయులవారిని విమర్శిస్తూ నీవు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంత పండితుడివా? నువ్వు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంతటి గొప్పవాడివైతే లలితా సహస్రనామంలో 'మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా' అనే ఒక నామం ఉంటుంది. అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం. ఆ 64 కోట్లమంది యోగినీ గణాల పేర్లు చెప్పు అంటూ సవాల్ చేశారు.

ఆయన మరుసటి రోజు చెప్తా అని ఇంటికి చేరారు. అమ్మవారిని ప్రార్ధించారు. వారి పేర్లు నాకేమి తెలుసు, నీవే రాయిస్తున్నావు, దీనికి కూడా నువ్వే సమాధానం చెప్పాలి అని వేడుకున్నారు. అమ్మవారు నీ వెంట నేను ఉన్నాను. నేను చూసుకుంటా అన్నది. మరునాడు గంగా నదిగట్టున కూర్చున్న ఆ పండితుల దగ్గరికి వెళ్ళారు భాస్కర రాయులు. చెప్పగలవా అంటూ భాస్కరరాయులవారిని ఎగతాళి చేశారు పండితులు.

అంతే అమ్మవారి మహిమ వల్ల ఆ గంగా నది ఒడ్డున ఆకాశంలో 64 కోట్లమంది యోగీని దేవతలు ఒక్కసారిగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వరుసగా అందరి పేర్లు చెప్పడమే కాదు, వారిని ప్రత్యక్షంగా చూపించారు భాస్కరరాయులవారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యపడింది.

భక్తులపాలిట కల్పవృక్షం లలితాపరమేశ్వరీ దేవి.

ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday, 2 October 2013

దేవి శరన్నవరాత్రి విశేషాలు

దేవి శరన్నవరాత్రి విశేషాలు తెలుసుకుందాం.

పౌర్ణమితిధి  రోజున అశ్విని నక్షత్రం ఉన్న నెలను ఆశ్వీయుజ మాసం అంటారు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి(అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి) నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

ఈ నవరాత్రులలో దేవిని ఆరాధిస్తాం కనుక వీటిని దేవి నవరాత్రులు అని, ఇవి శరత్ ఋతువులో వస్తాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అని అంటారు.

ఒక ఏడాదిలో ఆషాఢ నవరాత్రులు, శారదా నవరాత్రులు, మహానవరాత్రులు, వసంత నవరాత్రులు అనే నాలుగు నవరాత్రులు ఉంటాయని అగ్నిపురాణం చెప్తోంది. వీటిలో ఆశ్వీయుజమాసంలో వచ్చే దేవి నవరాత్రులు(శరన్నవతారులు), వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రులు ముఖ్యమైన., ఈ రెండు కాలాలను యమద్రంస్టలు అంటారు. ఈ సమయంలో యముడి నోటి నుంచి కోర్లు బయటకు వస్తాయి కనుక ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే ఈ సమయంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించాలని పురాణవచనం.

శరత్కాలం నిర్మలత్వానికీ,శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు. నిర్మలమైన ప్రేమ, కరుణ కురిపించే చల్లని మనస్సు మాతృ మూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల,ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి.

ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించడం, పగలు ఉపవసించి రాత్రి పూజించాలని, దుర్గా సప్తశతి, దేవి భాగవతం పారాయణ చేయాలని శ్రీ దేవీ భాగవతం చెప్తోంది.