Wednesday, 27 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (156)

వీరెక్కడో అరణ్యంలో దాగియున్నారని ధూమాసురుడు విన్నాడు. వెంటనే శస్త్రాలతో వెళ్ళాడు. అతని చేతిలోని శస్త్రం పొగయే. అతని పేరే ధూమాసురుడు కదా! అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే అందుండి బాగా పొగ వస్తుందన్నమాట.నేడు కూడా బాప్ప వాయువులను ప్రయోగిస్తూ ఉంటారు. మనుష్యులను చంపే రసాయనిక వాయువులను విదిలుతూ ఉంటారు. ఇట్టివే ఆనాడు మంత్రశక్తితో ప్రయోగించేవారు. గర్భిణిని చంపాలని వెడితే ఆమె ఒడిలో పిల్లవాడు కన్పించాడు. అతడు విష్ణ్వంశతో బుట్టిన వినాయకుడే. అనగా సమస్త దేవతా స్వరూపుడు వినాయకుడని తెలియడం లేదా? శివుని తనయుడైన వినాయకుడు, విష్ణయంశతో పుట్టాడంటే శైవ వైష్ణవాల సంగమమే. శుక్లాంబరధరం విష్ణుం అని చదువుతాం కదా.


అతడస్త్రాన్ని ప్రయోగించగా పొగ కమ్మింది. ఆ పొగనంతటిని పిల్లవాడు ఒడిసి పట్టాడు. తన అస్త్రం పనిచేయడం లేదని అసురుడు తెల్లమొహం వేసాడు. ఒక కొత్త అస్త్రం ప్రయోగించే ఓపిక లేదు. ఆ సమయంలో మన స్వామి అతణ్ణి చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రత్యేకంగా ఒక అస్త్రం వేయకుండా అతడు ప్రయోగించిన విషవాయుపువే విడుదల చేసాడు స్వామి. అట్లా అతని సంహారమైంది.


అందువల్ల ధూమకేతువయ్యాడు. ధూమమే ధూమ్రము, ధూమ్రకేతువు కూడా.


Tuesday, 26 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (155)

వినాయక పురాణాన్ని చూసాను. వినాయకునకు సంబంధించిన రెండు పురాణాలున్నాయి. ఒకటి భృగుమహర్షి చెప్పినది. కనుక భార్గవ పురాణమైంది. ముద్గలుడు చెప్పనది ముద్గలపురాణం. నేనిపుడు చెప్పేది భార్గవ పురాణం నుండే.ఈ పురాణంలో ఉపాసన కాండం, లీలా కాండమని రెండు కాండలున్నాయి. లీలా కాండంలో వినాయకుని 12 అవతారాలు వర్ణింపబడ్డాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయం. ఇందు గణేశుడొకడు, గణపతి యొకడు. ఇందు షోడశనామాలలో పేర్కొన్న వక్రతుండుడు, భాలచంద్రుడూ, గజాననుడూ విడివిడిగా అవతారాలుగా ఉన్నారు. అందులో ధూమ కేతు అవతారం గురించిన కథ ఉంది. ఎప్పుడో చదివాను. గుర్తున్నది చెబుతాను.


ధూమాసురుడనే అసురుడు ఉండేవాడు. వృత్రాసురుడు, మహాబలివంటి వారు భాగవతంలో పేర్కొన్నట్లుగా, అసురులలో భక్తి అనే లక్షణమూ ఉంది. అయితే వారిలో అసురత్వం ప్రధానంగా ఉంటుంది. ధూమాసురుడట్టివాడు. ఒక రాజు, అతనికొక భార్య ఉన్నారు. ఆ రాణి గర్భంలో విష్ణువు జన్మిస్తాడని తన మరణానికి కారకుడౌతాడని విన్నాడీ అసురుడు. అందువల్ల సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి రాత్రి వెళ్ళి ఆ రాణిని చంపుమని అన్నాడు. ఇతడు వెళ్ళి గర్భిణియైన స్త్రీని, అందునా శుభలక్షణాలు కలిగిన స్త్రీని చంపడం తప్పని గ్రహించాడు. ఆ జంటను విడదీయకూడదని భావించాడు. కనుక మంచంపై నిద్రించే వారినిద్దరిని మంచంతో బాటు మోసుకొని ఒక అరణ్యంలో విడిచి పెట్టాడు. ఇదేమి కష్టంరా బాబూ అంటూ వారిద్దరూ వినాయకుని ప్రార్ధించారు, సుఖప్రసవం జరగాలని, తిరిగి రాజ్యానికి వచ్చేటట్లు చేయమని ప్రార్థించారు.


Monday, 25 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (154)

 

ధూమ్రకేతువు


ధూమమనగా పొగ. ఇది మామూలు కట్టెలను మండిస్తే వచ్చేది కదా. అయితే పొగ, సువాసనతో ఉంటే దానిని ధూపం అంటున్నాం. అనగా సాంబ్రాణి పొగ, పంచోపచారాలలో ధూపం ఒకటి. పొగను జెండాగా కలిగినవాడు ధూమకేతువు. నిప్పునుండి బైటకు వచ్చిన పొగ జెండాగా ఉంటుంది కదా. అగ్నికి ధూమ కేతువని పేరు కూడా. ధూమకేతు పదం శుభాన్ని తెలియ పర్చడానికి బదులు కీడును సూచిస్తుంది. సాధారణంగా అది తోకచుక్క కూడా కాబట్టి అది కనబడడాన్ని అశుభంగా భావిస్తారు.


(అన్ని తోకచుక్కలూ అట్లా కావని, కొన్ని మాత్రమే అని వరాహమిహిరుడు తన బృహత్సంహితలో అన్నాడు - అనువక్త)


ఈ అశుభ సూచకమైన పదం వినాయకునకు ఉందేమిటి? ఆయన మంగలమూర్తి కదా.

Sunday, 24 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (153)అమర నిఘంటువులో ఇతని నామాలు


జైనుడైన అమరసింహుడు తన నిఘంటువులో ఎనిమిది నామాలను పేర్కొన్నాడు


వినాయకో, విఘ్నరాజ, ద్వైమాతుర, గణాధిపా

అప్యేక దంత, హేరంబ, లంబోదర, గజాననాః


దీనిలోని ఆరు నామాలు, ప్రసిద్ధ షోడశనామాలలోనూ ఉన్నాయి. ఇందలి గణాధిపదం, గణాధ్యక్ష అని షోడశ నామాలలో ఉన్నదానిని తలపిస్తోంది. షోడశనామాలలో లేనిది, అమరంలో ఉన్నది, ద్వైమాతుర పదం. అనగా ఇద్దరు తల్లులు కలవాడు. పార్వతి గంగా తనయుడని.


గంగలో నున్న శరవణ సరస్సులో శివుని కంటి నుండి వెలువడిన తేజస్సునుంచగా సుబ్రమణ్య జననం. అందుచేత గంగ తిన్నగా సుబ్రహ్మణ్యుని తల్లియే. అందువల్ల అతడు గాంగేయుడే. అయితే గణపతికి గంగకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఇతని తండ్రి నెత్తిపై నుండడం వల్ల, తన తండ్రికి భార్య అవడం వల్ల వినాయకుని తల్లిగా పరిగణిస్తారు. అమరంలో మొదటి నామం వినాయకుడే అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. నిఘంటువులో ఆ మొదటి పదం ప్రాముఖ్యాన్ని సూచిస్తుందని చెప్పడానికే.


Saturday, 23 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (152)

 


వి-అనే ఉపసర్గ


'వి' ఏమని చెబుతోంది? ఒక పదానికి ముందు వి అనే ఉపసర్గను చేరిస్తే పదం యొక్క అర్థం మారుతుంది. మలం అంటే 'అశుద్ధం', విమలం అంటే 'స్వచ్ఛమని', ఆ 'వి'ని శుద్ధపదం ముందుంచితే ఇంకా స్వచ్ఛమని అర్థం. పరీతం అనగా ఒక పద్ధతిలో వెళ్ళడం. విపరీతం అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడం. జయానికి, వి చేరిస్తే ప్రత్యేకమైన జయం.


శేషం అంటే మిగిలినది. మిగిలిన వాటితో కలవకుండా విడిగా ఉంటూ గొప్పదనాన్ని సూచించేదనే అర్థంలో విశేషం అంటాం. శిష్ట అనే పదం ఈ శేషనుండి వచ్చింది. వారు విశేష గుణ సంపన్నులని, శిష్టులని వాడతారు. శిష్టాచార మనే మాటను విన్నాం కదా.


రెండర్థాలలో వినాయకుడు


ఇందులో రెండు పరస్పర విరుద్ధార్థాలు వస్తాయి. చిత్రంగా లేదూ! ధవుడనగా పతి, మాధవుడనగా లక్ష్మికి పతి, విధవయనగా భర్తలేనిది. అట్లా వినాయకుడుని తన విశిష్ట నాయకుడు, విగత నాయకుడు. అనగా తనకెవ్వరూ నాయకులు లేరని, తానే అందరి కంటే గొప్ప నాయకుడని అర్థాలు వస్తాయి.


ఒక భక్తుడు, భగవంతుని దగ్గరకు వెళ్ళి నేను 'అనాథను' అన్నాడట 'నీవూ అనాథుడవే' అన్నాడట వెంటనే. 'నన్ను అనాథనంటావా' అని భగవంతుడు అన్నాడట: 'అవునయ్యా, నాకు నాథుడు లేకపోవడం వల్ల నేను అనాథ నయ్యాను, ఇక నీవు నీ కంటె పైన నాథుడు లేకపోవడం వల్ల నీవు అనాథవయ్యా'వని అన్నాడట. అట్లా వినాయకుడు కూడా.


Friday, 22 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (151)ప్రసిద్ధ నామం


ఇతని ప్రసిద్ధ నామం వినాయకుడే. ఉత్తర దేశంలో కంటే దక్షిణ దేశంలో ఈ నామం బాగా ప్రచారంలో ఉంది. ఇతని జయంతిని వినాయక చతుర్థి అంటున్నాం. ఉత్తర దేశంలో దీనిని గణేశ చతుర్థి అంటారు. దక్షిణ దేశంలో ఈ వినాయకునకు సిద్ధి వినాయకుడని, వరసిద్ధి వినాయకుడని, శ్వేత వినాయకుడనే నామాలున్నాయి.


వినాయక పదం ఉచ్చరిస్తే అతడు ప్రముఖుడని, అతని క్రింద కొందరుంటారని, వారిని నియమిస్తాడని అర్ధం వస్తుంది.


దక్షిణ దేశంలో నాయకర్ అంటే ఒక జాతి వాచకం. అందు పుట్టినవారిని అందర్నీ నాయక లని అంటారు. మహారాష్ట్రలో నాయక్ అంటే బ్రాహ్మణుడు, తంజావూర్ లో మధురలో నాయకరాజ్యం ఉండేది. వారు రాజవంశానికి చెందినవారు. కన్నడ ప్రాంతం నుండి తమిళనాడునకు ఈ నాయకర్లు. వీరినే నాయుడులని, తెలుగు దేశంలో అంటారు. వీరు శూద్రులే. నాయకుడే నాయుడు, నాయుడయింది. తమిళనాడులో ప్రసిద్ధ శివభక్తులను నాయనార్ అంటారు. ఇందు భిన్న భిన్న వర్గాలవారున్నారు. వైశ్యులను తమిళనాడులో చెట్టియార్ అంటారు. శ్రేష్టిపదం, చెట్టి అయింది. కన్నడంలో షెట్టి అయింది. పైన పేర్కొన్న వారందరూ భిన్న భిన్న వృత్తులను చేస్తూ పరస్పరం ఈర్ష్యాద్వేషాలు లేకుండా మసులుతూ ఫలానా జాతిలో పుట్టామని ఎవరికి వారే గర్విస్తూ ఉంటారు.

Thursday, 21 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (150)అట్టి పరిస్థితి రాకుండా ఉండడం కోసం విఘ్నరాజు మనకు అప్పుడపుడు విఘ్నాలను కల్గిస్తాడు. అతడు సృష్టిస్తాడంటే మనలను అన్యాయంగా బాధిస్తాడని కాదు. పూర్వ కర్మల వల్ల మనం విజయం పొందలేకపోతాం. అందువల్ల అతడు కల్పించే విఘ్నాలు మన పూర్వ కర్మల వల్ల వచ్చిన ఫలాలే. అవే నిజంగా అడ్డుకొంటున్నాయి. అవి తమంతట తామే చేస్తే మనకింకా చిక్కు లేర్పడతాయి. ఇక అట్టి ఆటంకం వల్ల మనం చేసే ప్రయత్నం అంతా వ్యర్ధమై, మనం అన్ని విధాలా ఓటమి పాలవడం గాని, లేదా అప్పుడప్పుడు విజయం సాధించడం గాని జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఓటమి పాలవుతాం. అట్టి విఘ్నాలను కలిగించే బాధ్యత, స్వామితనంతట తానే గ్రహిస్తాడు. ఎట్లా అంటే వరద వచ్చినపుడు ఒక ఆనకట్ట కట్టగా కొంతవరకూ దాని ఉద్ధృతి తగ్గి ఒక పద్ధతిలో నీటిని విడుదల చేయడం మాదిరిగా ఉంటుంది. అంటే ఆటంకాలను ఒక పద్ధతిలో నడిపిస్తాడన్నమాట. అట్లా క్రమమార్గంలో పెట్టడమే కాకుండా కొన్నిచోట్ల ఆ ప్రవాహాన్ని ఆవిరియై పోయేటట్లు చేస్తాడు కూడా. అనగా ఒక పెద్ద ఆటంకం వచ్చి మనపై విరుచుకుని పడవచ్చు. అట్టి దానిని కొద్దికొద్దిగా అనుభవించేటట్లు చేస్తాడన్నమట. అనగా పాప ఫలాలను కొద్దికొద్దిగా అందిస్తాడన్నమాట అంటే వాటిని మనం భరించగలిగేటట్లు చూస్తాడు. మొత్తం పాపకర్మ అంతా సాధ్యమైనంత త్వరలో పోవడం మంచిది కదా. నిజమే. అతడాలస్యం చేసినకొద్దీ మనం ఇంకా పాపకర్మల భారాన్ని జోడించడం లేదా? అట్టిదానిని అడ్డుకోవడం కోసం ఒక విఘ్నాన్ని కలిగిస్తాడు. అది ముందు చెడ్డదిగా కనబడవచ్చు కాని నిజం ఆలోచిస్తే అది మనకే మంచిది.  


అతని అష్టోత్తర పూజలో విఘ్నకర్త, అనగా విఘ్నాలు కలిగించేవాడని, మరొక నామం విఘ్నహర్త అనగా విఘ్నాలను పోగొట్టేవాడనీ ఉంది. ఇందులో విఘ్నరాజు ముందు వస్తాడు. తరువాత వినాయకుడు వస్తాడని అర్థం. ఇతనిలో నాయకత్వం గొప్పది. అందరు దేవతలూ నాయకులే. ఒక అసురుణ్ణి చంపి వారు నాయకులౌతారు. అయితే మిగిలిన వారికి లేని నాయకపదం ఇతనికెందుకుంది? అసుర బాధలను పోగొట్టడమే కాదు, ఆటంకాలను తొలగిస్తాడు, ఆపైన విఘ్నాలకు విఘ్నరాజై కల్గిస్తాడు కూడా. కనుక అన్నివిధాల ఇతడు నాయకుడే. వినాయకుడయ్యాడు. కనుక విఘ్న వినాయక పాదనమస్తే అంటాం.